2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

Table of Contents

25 - సావిత్రి యముని ప్రశ్నించుట

శ్రీనారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను-

యముని మాటలు విని పతివ్రతయగు సావిత్రి యమధర్మరాజును అధికమైన భక్తిచే స్తుతించి ఇట్లనెను.

సావిత్ర్యువాచ- సావిత్రి ఇట్లు అనెను-

యమధర్మరాజా! కర్మయనునదెట్లుండును? శుభాశుభకర్మలే విధముగానుండును. సాధుపురుషులు ఏవిధముగా కర్మను నిర్మూలించుచున్నారు. కర్మలకు బీజరూపమైనది ఏది? కర్మఫలితమునిచ్చువాడెవడు? కర్మ ఫలమనుభవించువాడెవడు? నిర్లిపుడుగా ఎవరుంధరు? కర్మఫలమనుభవించువాడెవడు? నిర్లిప్తుడుగా ఎవరుందురు? దేహము, దేహి, కర్మచేయువాడు ఎవరు? విజ్ఞానము, మనస్సు, బుద్ది ప్రాణములు ఇంద్రియములు, దేవతలు భోక్త, భోజయిత, భోగము, నీష్కృతి అనగా ఏవిధముగా నుండును. జీవుడు పరమాత్మ ఎట్లుందురు? ఈ విషయములనన్నిటిని నాకు వివరించి తెల్పుమని సావిత్రి ఆడిగెను.

యమ ఉవాచ- యమ ధర్మరాజు ఇట్లనెను-

వేదములందు విధించబడిన కర్మ మంగళ ప్రదమైనది. అట్లే వేదవిరుద్ధమైన. కర్మ అమంగళకరము. సజ్జనులు సంకల్పరహితము, కారణము లేక చేయు విష్ణు సేవను కోరుకొందురు. అట్టి శ్రీహరిసేవ కర్మఫలితములను సంపూర్ణముగా నిర్మూలించును. అందువలన శ్రీహరీ భక్తి కలుగును, హరి భక్తుడైన మానవుడే ముక్తుడని వేదములందు తెలుపబడినది. అతనికి పుట్టుక, చావు, ముసలితనము, రోగములవలన కలుగు దు:ఖము మొదలగునవి కలుగవు.

వేదములలో ముక్తి రెండు విధములుగా పేర్కొనబడినది. ఒకటి నిర్వాణ మార్గమును చూపించగా రెండవది శ్రీహరి భక్తిని కలిగించును. వైష్ణవులు శ్రీహరి భక్తి స్వరూపమైన ముక్తిని మాత్రమే కోరెదరు. ఇతర సజ్జనులు నిర్వాణరూపమైన ముక్తిని ఆభిలషింతురు.


 

కర్మల కన్నిటికి మూలభూతుడు, కర్మ స్వరూపి, కర్మ ఫలితములనిచ్చువాడు ప్రకృతి కంటే భిన్నడైనవాడు శ్రీకృష్ణుడు. అతడే కర్మకారకుడు. కర్మ ఫలితమును జీపుడు అనుభవించుచున్నాడు. ఆత్మ విగ్రీష్టమైనది. దాని ప్రతిబింబమే- దేహి లేక జీవుడు. శరీరము, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశమను పంచ భూతములచే నిండినది. ఇది ఆశాశ్వతమైనది. శ్రీహరి లోకముల సృష్టింపదలచినప్పుడు ఈ పంచభూతములు సృష్టికి కారణమైనవిదేహి రూపి యగు జీవుడు కర్త మరియు  కర్మఫలములనమభవించుచున్నాడు. ఆ ఆత్మయే భోజయిత (కర్మఫలములననుభవపజేయునదిసుఖ దుఃఖప్పరూపమైన వీభవమునకు మారుపేరే భోగము, విష్కృతి యనగా ముక్తియే.

మంచి చెడుల యొక్క విచక్షణకు కారణమైన జ్ఞానము అనేక ప్రకారములుగా -మన్నది. ఘటము, పటము ఇత్యాది విషయములయొక్క జ్ఞానమే జ్ఞాన భేదముగా పేర్కొనబడుచున్నది. వివేకమును కలిగించు బుద్ధియే జ్ఞానసందీపివి యని వేదములలో పేర్కొనబడినది. జీవుల శరీరములలో ఉండే ప్రాణములు ప్రాణాపాన వ్యావోదాన సమానమను పేర్లుగల పాయువులే. ఇవి బలరూపమైనవి.

జీవులు చేయు కర్మలను ప్రేరేపించునది, నివారింపలేనిది, ఇంద్రియములలో మైనది మనస్సు. ఇది ఇదమిత్థముగా విరసించుటకు వీలుకానిది. కంటికి కనిపించనిది. అట్లే కళ్ళు, చెవులు, ముక్కు, త్వగింద్రియము నాలుక మొదలగు జ్ఞాన కర్మేంద్రియములు కలవు. ఇవి జీవులకు ఆవయవరూపముగానుండి సమస్త కర్మలు చేయుటకు ప్రేరణనిచ్చుచున్నవి. ఇవి జీవునకు స్నేహితునివలె మఖమువీచ్చును. శత్రువువలె దుఃఖమును కూడ కలిగించును.

సూర్యుడు, వాయువు, పృథివి, సరస్వతి మొదలగువారు దేవతలు. ప్రాణములను దేహమును కలిగినవాడే దేహి లేక జీవుడు. పరమాత్మ, పరబ్రహ్మ, విర్గుణుడు, ప్రకృతి కంటే భిన్నమైనవాడు, సృష్టికర్తలను సృష్టించువాడు శ్రీకృష్ణభగవామడు మాత్రమే..

ఓ సావిత్రీ! నీవు అడిగిన సందేహములకన్నిటికి సమాధానమును శాస్త్రబద్దముగా తెల్పినాను. అందువలన నీవు సుఖముగా నీ ఇంటికి తరలిపొమ్మని యమధర్మరాజు పలికెను.

సావిత్ర్యువాచ- సావిత్రి ఇట్లు పలికెను-

ఓ యమధర్మరాజా ! నా భర్తను వదలి జ్ఞానసాగరుడవైన నిన్ను వదలిపెట్టి నేను ఎక్కడికి పోదును. అందువలన నేనడిగిన ప్రశ్నలకన్నిటికి సరియైన సమాధానములను మీరు చెప్పవలెను.

ఏయే కర్మలు చేసి ఏయే జన్మలు జీవుడిత్తును. ఓతండ్రి ఎట్టి కర్మ చేసిన స్వర్గమును లేక నరకమును జీవుడు పొందును. ఎట్టి కర్మలు చేసిన ముక్తి లేక శ్రీహరి వదపంకజములపై భక్తి కలుగును. ఎట్టి కర్మలాచరించిన జీవి రోగిగనో ఆరోగ్యవంతుడుగనో జీవించుచున్నాడు. ఏ కర్మలవలన జీవి దీర్ఘజీవిగనో అల్పాయుష్కుడుగనో దుఃఖవంతుడుగనో, సుఖవంతుడుగానో చెవిటి, గుడి మొదలగు అవయవహీనుడుగనో, మిక్కిలి పిసినారిగనో, హంతకుడుగనో అగుచున్నాడు. అట్లే ఏ కర్మలవలన మానవుడు సాలోక్యాది చతుర్విధముక్తులను స్వర్గలోక భోగములను, జరావ్యాధిరహితమైన వైకుంఠమును పొందుచున్నాడు.

నరకములు ఎన్ని విధములుగా నున్నవి. వాటి పేర్లేమి? ఎవరు ఎట్టి నరకమును పొందుదురు? అచ్చట ఎంతకాలముందురు? ఎట్టి పాపకర్మవలన ఎట్టి వ్యాధులు పుట్టుచున్నవి? మొదలగు విషయములనన్నిటిని నాకు వివరించి చెప్పుడు.

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున రెండవదైవ ప్రకృతి ఖండమున నారద నారాయణ సంవాద సమయమున తెల్పబడిన కర్మ విపాకమున యముని మాటల తరువాత సావిత్రి వేసిన ప్రశ్నలనే ఇరువది యైదవ అధ్యాయము సమాప్తము.