శ్రీ గణేశాయనమః॥
శ్రీవేంకటేశ్వరాయనమః॥
శ్రీ లక్ష్మీ నరసింహాభ్యాం నమః।
అథ ప్రకృతి ఖండప్రారంభః- ప్రకృతి ఖండము ప్రారంభింపబడుచున్నది.
నారద ఉవాచ - నారద మహర్షి ఇట్లనెను -
గణేశజననీ దుర్గా రాధా లక్ష్మీ: సరస్వతీ ।
సావిత్రి వై సృష్టివిధౌ ప్రకృతి: పంచదా స్మృతా ॥
ఆవిర్బభూవ సా కేన కావా సా జ్ఞానినాం వరా ।
కిం వా తల్లక్షణం బ్రూహి సాఽభవత్పంచధా కథం ॥
సర్వాసాo చరితం పూజావిధానం కథమీప్పితం ।
అవతారం కుత్ర కస్యా: తన్మాం వ్యాఖ్యాతు మర్హసి ॥
సృష్టికి కారణమైన ప్రకృతి, గణేశుని తల్లియైన దుర్గగా. రాధగా, లక్ష్మీదేవతగా, సరస్వతీదేవిగా సావిత్రీమాతగా ఐదు మూర్తులతో ఉన్నది కదా. ఆ ప్రకృతి ఎవరి వలన ఉద్భవించినది. ఆమె స్వరూపమేమి. ఐదు విధములుగా ఎందువలన మారినది. ప్రకృతి స్వరూపాలైన దుర్గాదిదేవతల కథను, వారి పూజ విధానమును, దాని వలన కలుగు ఫలితమును, ఆయా. దేవతలు ఎక్కడ ఏవిధముగా అవతరించినారో వాటినన్నిటిని విస్తరించి నాకు తెలుపగలరు.
నారాయణ ఉవాచ- నారాయణు డిట్లనెను.
ప్రకృతేర్లక్షణం వత్స కోవా వక్తుం క్షమో భవేత్ ।
కించిత్తధాఽపి వక్ష్యామీ యత్ శ్రుతం ధర్మ వక్త్రతః ॥
ప్రకృష్టవాచకః ప్రశ్చ కృతిశ్చ సృష్టివాచకః ।
సృష్టౌ ప్రకృష్టా యాదేవీ ప్రకృతి: సా ప్రకీర్తితా ॥
గుణే ప్రకృష్ట సత్వేచ ప్రశబ్ధో వర్తతే శ్రుతౌ ।
మధ్యమే కృచ్చ రజసి తీశబ్దస్తమసి స్మృతః ॥
త్రిగుణాత్మస్వరూపా యా సర్వశక్తి సమన్వితా ।
ప్రధానా సృష్టికరణే ప్రకృతిస్తేన కథ్యతే ॥
ప్రథమే వర్తతే ప్రశ్చ కృతి: స్యాత్ సృష్టివాచకః ।
సృష్టేరాద్యా చ యా దేవీ ప్రకృతి: సా ప్రకీర్తితా ॥
యోగేనాత్మా సృష్టివిదౌ ద్విధారూపో బభూవ సః ।
పుమాంశ్చ దక్షిణార్ధాంగో వామాంగ: ప్రకృతి: స్మృతః ॥
సా చ బ్రహ్మ స్వరూపా స్యాన్మాయా నీత్యా సనాతనీ ।
యథాఽత్మా చ యథాశక్తి: యథాఽగ్నౌ దాహికా స్మృతః ॥
అత ఏవహి యోగీంద్రః స్త్రీ పుం భేదం నమన్యతే ।
సర్వం బ్రహ్మామయం బ్రహ్మన్ శశ్వత్పశ్యతి నారద ॥
స్వేచ్ఛామయ స్వేచ్ఛయా చ శ్రీకృష్ణస్య సిపృక్షయా ।
సాఽ విర్బభూవ సహసా మూల ప్రకృతిరీశ్వరీ॥
నారదా! ప్రకృతి యొక్క స్వరూపమును చక్కగా ఎవరు కూడ చెప్పలేరు. ఐనప్పటికినీ ధర్ముని వలన విన్న విషయమును కొంత నీకు చెప్పెదను. “ప్ర" అనునది శ్రేష్ఠము అను నర్థము నిచ్చును. “కృతి" అనగా సృష్టి, సృష్టిలో శ్రేష్ఠురాలైన దేవతను ప్రకృతీ యని అందురు. అట్లే 'ప్ర' అనునది ఉత్కృష్టమైన సత్వగుణమును సూచించును. 'క' అనునది రజోగుణమును, 'తి' అనునది తమోగుణమును తెలుపును. ఈ విధముగా సత్యరజస్తమోగుణ స్వరూపిణి. సర్వశక్తి సమన్వితమైన ప్రకృతి, సృష్టి ఏషయమున ప్రధాన స్థానము వహించుచున్నందువలన ప్రకృతియని పేర్కొనబడినది. అదే విధముగా అనునది ప్రథమము అను అర్థమున ఉన్నందువలన సృష్టి అను అర్థము కృతి అను పదమునకు ఉన్నందువలన సృష్టిలో తొలుత ఉద్భవించిన దేవిని ‘ప్రకృతి’ అని అందురు.
పరమాత్మ తన యోగశక్తివలన రెండు రూపములను ధరించెను. ఆ పరమాత్మయొక్క కుడి భాగము పురుషుడుగా, ఎడమ భాగము ప్రకృతిగా మారినవి.
ఆ ప్రకృతి పరబ్రహ్మ స్వరూప, మాయా స్వరూపిణి, సనాతని. అగ్నికి మండేగుణమువలె ఆ ప్రకృతి పరబ్రహ్మయొక్క శక్తి స్వరూపిణి.
అందువలననే యోగీంద్రులు సమస్తము బ్రహ్మమయమైనదను భావనవల్ల స్త్రీ పురుష భేదమును పరిగణింపరు.
స్వేచ్ఛామయుడైన శ్రీకృష్ణుడు చరాచర జగత్తును సృష్టింపవలెనని కోరుకొన్నప్పుడు పరమేశ్వరియైన "మూలప్రకృతి” పుట్టినది.
తదాజ్ఞి యా పంచవిధా సృష్టికర్మణి భేదతః ।
అథ భక్తానురోధాద్వా భక్తానుగ్రహ విగ్రహా ॥
గణేశమాతా దుర్గా యా శివరూపా శివప్రియా ।
నారాయణీ విష్ణుమాయా పూర్ణబ్రహ్మస్వరూపిణీ ॥
బ్రహ్మాది దేవైర్మునీభిః మనుభిః పూజితా సదా ।
సర్వాధిష్ఠాతృదేవీ సా బ్రహ్మరూపా సనాతనీ ॥
యశోమంగళ ధర్మశ్రీ సత్య పుణ్య ప్రదాయినీ ।
మోక్ష హర్ష ప్రదాత్రీయం శోక దు:ఖార్తినాశినీ ॥
శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణా ।
తేజుఃస్వరూపా పరమా తదధిష్ఠాతృదేవతా ॥
సర్వశక్తి స్వరూపా చ శక్తిరీశస్య సంతతం ।
సిద్దేశ్వరీ సిద్దరూపా సిద్ధిదా సిద్దిహేశ్వరీ ॥
బుద్ధిర్నిద్రా క్షుత్పిపాసా ఛాయా తంద్రా దయాస్మృతి: ।
జాతీ: క్షాంతిశ్చ శాంతిశ్చ కాంతిర్ర్భాంతిశ్చ చేతనా ॥
తుష్టి, పుష్టిస్తథా లక్ష్మీర్వృత్తిర్మాతా తథైవ చ ।
సర్వశక్తి స్వరూపా సా కృష్ణస్య పరమాత్మనః ॥
ఉక్తః శ్రుతౌ గుణశ్చాతిస్వల్పో యథాగమం ।
గుణోఽస్త్యనంతోఽనంతాయాః ఆపరాం చ నిశామయ॥
శ్రీ కృష్ణుని యొక్క ఆజ్ఞవలన సృష్టికర్మకి మూలప్రకృతి ఐదు రూపములను ధరించినది. లేక భక్తులయొక్క ప్రార్థన ననుసరించి కానిచో భక్తులననుగ్రహించుటకు ఐదురూపములనామె ధరించినది.
గణాధీపతియైన గణేశుని తల్లియైన దుర్గాదేవి ప్రకృతియొక్క మొదటిరూపము. ఆ దుర్గ మంగళ స్వరూప, శివునకు ప్రియమైన భార్య. ఆమెను నారాయణి యని, విష్ణుమాయ ' యని, పూర్ణ బ్రహ్మస్వరూపిణి యని పిలుతురు. సనాతనీ పరబ్రహ్మస్వరూపియగు ఆ దుర్గాదేవి బ్రహ్మాది దేవతలచే, మునులచే, మనువులచే ఎల్లప్పుడు పూజలనందుకొనును. ఆమె కీర్తిని, శుభములను, ధర్మమును, సంపదను, సత్యవాక్కును, పుణ్యమును, సంతోషమును మోక్షమును ఇచ్చును. దు:ఖశోకములను పోగొట్టును. శరణుపొందిన వారిని దీనులను, ఆర్తులను రక్షించు స్వభావము కలది. తేజఃస్వరూప. సర్వశక్తి స్వరూప, బుద్ధి, నిద్ర, ఆకలి, దప్పి, నీడ, తంద్ర, దయ, స్మృతి, జాతి, క్షాంతి, శాంతి, కాంతి, భారతి, చేతన, తుష్టి పుష్టి లక్ష్మి, వృత్తి, మాత ఇవన్నియు ఆమె పేర్లే, ఆమె శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సర్వశక్తి స్వరూపిణి. వేదములలో ఈమే గొప్పతనము చెప్పబడినను సంపూర్ణముగా మాత్రము అని వివరించలేక పోయినవి. అనంత యగునామె గుణములనంతములు.
ఇక ప్రకృతి యొక్క ద్వీతీయ రూపమును తెలుపుదును.
శుద్ధ సత్వస్వరూపా యా పద్మా చ పరమాత్మనః ।
సర్వసంవత్స్వరూపా యా తదధిష్ఠాతృ దేవతా ॥
కాంతా దాoSతాతీశాంతా చ సుశీలా సర్వమంగళా । లోభాన్మోహాత్కామరోషాన్మదాహంకారతస్తథా ॥
త్యక్త్వాSనురక్త్వా పత్యుశ్చ సర్వాద్యా యా పతివ్రతా ।
ప్రాణతుల్యా భగవతః ప్రేమపాత్రీ ప్రియం వదా ॥
సర్వసస్యాత్మికా సర్వజీవనోపాయరూపిణీ ।
మహాలక్ష్మీశ్చ వైకుంఠే పతిసేవాపరాయణా ॥
స్వర్గే చ స్వర్గలక్ష్మీశ్చ రాజలక్ష్మీశ్చ రాజసు ।
గృహే చ గృహలక్ష్మీశ్చ మర్త్యానాం గృహిణాం తథా ॥
స్వర్గేషు ప్రాణి ద్రవ్యేషు శోభారూపా మనోహరా ।
ప్రీతిరూపా పుణ్యవతార ప్రభారూపా నృపేషు చ ॥
వాణిజ్యరూపా వణిజాం పాపినాం కలహంకరీ ।
దయామయీ భక్తమాతా భక్తానుగ్రహకారికా ॥
చపలే చపలా భక్తసంపదో రక్షణాయ చ ।
జగజ్జీవన్మృతం సర్వం యయా దేవ్యా వినా మునే ॥
శక్తిర్ద్వితీయా కథితా వేదోక్తా, సర్వసమ్మతా ।
సర్వపూజ్యా సర్వవంద్యా చాన్యాం మత్తో నిశామయ॥
పద్మయగు లక్ష్మీదేవి శ్రీ కృష్ణ పరమాత్మయొక్క శుద్ధ సత్వగుణ స్వరూప. సమస్త సంపదలకు ఆమె అధిష్టాన దేవత. ఆమె చాలా అందమైనది. పరమసంయమస్వరూప. మిక్కిలి శాంతస్వభావము కలది. సర్వమంగళ స్వరూపిణి.
లోభ, మోహ, కామ, రోష మదాహంకారములనే అరిషడ్వర్గమును జయించినది. అందరికంటే ముందు తన భర్తయైన నారాయణుని యొక్క అనురాగమును పొందినది. పతివ్రత. ఆమెను భగవంతుడైన శ్రీమన్నారాయణుడు తన ప్రాణములతో సమానముగా ప్రేమించును. ఆమె ఎల్లప్పుడు ప్రియమైన మాటలనే మాట్లాడును. సర్వసస్యాత్మిక యగు ఆ దేవి ఆన్ని ప్రాణులు సుఖముగా జీవించుటకు కారణమైనది.
ఆమె వైకుంఠములో తన భర్తయైన శ్రీమన్నొరాయణుని సేవించుచు మహాలక్ష్మిగా పిలువబడుచున్నది. స్వర్గలోకములో ఉన్న ఆ లక్ష్మిని స్వర్గలక్ష్మియని పిలుతురు, రాజులయందున్న ఆ లక్ష్మిని. రాజలక్ష్మిగా, గృహములందున్నందువలన ఆమెను గృహలక్ష్మిగా పిలుతురు. సమస్త ప్రాణులయందు, సమస్తద్రవ్యములయందు ఆమె అందమైన శోభగా కన్నీంచును. పుణ్యము చేసికొన్న వారికి ఆనందరూపముతో, రాజులకు కాంతిరూపములో, వర్తకులకు వాణిజ్యరూపముతో ఆమె కన్పించును. పాపములు చేయువారికి ఆమె కలహముల పెట్టుచు కన్పడును.
ఆమె దయకలది. భక్తులకు తల్లివంటిది. భక్తులయొక్క సంపదలను రక్షించునది. ఆ లక్ష్మీదేవి లేనిచో ప్రపంచమంతయు బ్రతికియున్నను చచ్చిన దానితో సమానముగా నుండును, ఆమె గుణగణములను వేదములు అనేకవిధములుగా స్తుతించినవి. ఆమె అందరకు నమస్కరించతగినది, పూజించతగినది,
ఇక ప్రకృతి యొక్క మూడవ స్వరూపమును తెలిపెదను.
వాగ్బుద్ధి విద్యాజ్ఞానాధిదేవతా పరమాత్మనః ।
సర్వ విద్యాస్వరూపా యా సా చ దేవీ సరస్వతీ ॥
సుబుద్ధి; కవితా మేధా ప్రతిభా స్మృతిదా సతాం ।
నానాప్రకార సిద్ధాంత భేదార్థ కల్పనాప్రదా ॥
వ్యాఖ్యాబోధస్వరూపా చ సర్వసందేహభంజినీ ।
విచారకారిణీ గ్రంథకారిణీ శక్తిరూపిణీ ॥
సర్వసంగీత సంధాన తాలకారణరూపిణీ ॥
విషయజ్ఞాన వాగ్రూపా ప్రతివిశ్వం చ జీవినాం ।
యయా వినా చ విశ్వాఘౌ మూకోమృతసమ: సదా ॥
వ్యాఖ్యాముద్రాకరా శాంతా వీణా పుస్తక ధారిణీ ।
శుద్ధసత్వస్వరూపా యా సుశీలా శ్రీహరిప్రియా ॥
హిమచందన కుందేందు కుముదాంభోజ సన్నిభా ।
జపంతీ పరమాత్మానం శ్రీకృష్ణం రత్నమాలయా ॥
తపస్స్వరూపా తపసాం ఫలదాత్రీ తపస్వినీ ।
సిద్ధివిద్యా స్వరూపా చ సర్వసిద్ధి ప్రదా సదా ॥
సరస్వతీదేవి వాక్కునకు, బుద్ధికి, జ్ఞానమునకు, ఆధిదేవత, సర్వవిద్యాస్వరూపిణి. ఆదేవి మంచి బుద్ధిని, కవిత్వ రచనా శక్తిని, మేధను, ప్రతిభను స్మతి జ్ఞానమును భక్తులకు కలిగించును. అట్లే అనేక విధములైన సిద్దాంత భేదములయొక్క అర్థజ్ఞానము నొసగునది. సమస్త సంశయములను తొలగించునది. ఆలోచనా శక్తిని, గ్రంథరచనాశక్తిని కలిగించునది. సమస్త సంగీతమున ప్రధానాంశమైన శ్రుతి లయల స్వరూపము గలది.
విషయము, జ్ఞానము, వాక్కు ఆమెయొక్క రూపములు, ఆ దేవి లేనిచో ప్రపంచమంతయు మూగదై. జీవరహితముగా ఉండును.
ఆ దేవీ పరిశుద్ధమైన సత్వగుణరూపిణి, అందువలననే శ్రీహరీ ఆమెను మన్నించును. ఆమె మంచువలె, చందనమువలె, మల్లెపూవువలె, తెల్లనిపద్మమువలె, కలువవలె తెల్లనీది. ఆమె ఎల్లప్పుడు తన చేతిలోని రత్నమాలతో శ్రీ కృష్ణనామమును జపీంచుచుండును. ఆమె తపస్వరూప, తపఃఫలితముల నొసగునది. సిద్ధి విద్యా స్వరూప. సమస్త సిద్ధులనొసగునది. యథాగమం యథాకించి దపరాం సంనిబోధమే.
మూల ప్రకృతి యొక్క నాలుగవ స్వరూపమును నాకు తెలుపుమని నారదుడడిగెను.
మాతా చతుర్ణాం వేదానాం వేదాంగానాం చ ఛందసాం ॥
సంధ్యావందన మంత్రాణాం తంత్రాణాం చ విచక్షణా ।
ద్విజాతి జాతి రూపా చ జపరూపా తపస్వినీ ॥
బ్రాహ్మణ్య తేజోరూపా చ సర్వ సంస్కార కారిణీ ।
పవిత్రరూపా సావిత్రీ గాయత్రీ బ్రహ్మణః ప్రియా ॥
తీర్థాని యస్యా సంస్పర్శం దర్శం వాంఛంతి శుద్ధయే ।
శుద్ధ స్ఫటిక సంకాశా శుద్ధ సత్వ స్వరూపిణీ ॥
పరమానందరూపా చ పరమా చ సనాతవి ।
పరబ్రహ్మ స్వరూపా చ నీర్వాణపద దాయినీ ॥
బ్రహ్మతేజోమయీ శక్తిస్తదధీష్టాతృ దేవతా ।
యత్పాదరజసా పూతం జగత్సర్వం చ నారద ॥
నారదా! పవిత్రమైన స్వరూపముగల సావిత్రి లేక గాయత్రి సమస్త వేదములకు, వేదాంగములకు ఛందస్సులకు, సంధ్యావందన మంత్రములకు, తంత్రములకు మాతృస్వరూప. ఆ సావిత్రిదేవి జవరూపిణి. బ్రహ్మతేజోవిరాజిత. సమస్త సంస్కారములను కలిగించునది. బ్రహ్మదేవునకు ఇష్టమైన భార్య. సమస్త పవిత్ర తీర్థములు ఆ దేవియొక్క దర్శనమును, ప్పర్శనుపొంది తాము పవిత్రము కావలెనని కోరుకొనుచున్నవి.
ఆ దేవి శుద్ద సత్వగుణ స్వరూపిణి, శుద్ధ స్పటికమువలె తెల్లనిది. ఆనందస్వరూపిణి, పరబ్రహ్మ స్వరూపిణి. ఆమె తన భక్తులకు మోక్షమునిచ్చును. బ్రహ్మతేజస్సునకు ఆమె ఆధిదేవత. ఆ దేవియొక్క కాలి ధూళిచేతనే ఈ జగమంతయు పవిత్రమగుచున్నది.
దేవి చతుర్థి కథితా పంచమీం వర్ణయామి తే ।
ప్రేమా ప్రాణాధిదేవీ యా పంచప్రాణస్వరూపిణీ ॥
ప్రాణాధికప్రియతమా సర్వాద్యా సుందరీ పరా ।
సర్వ సౌభాగ్య యుక్తా చ మానినీ గౌరవాన్వితా ॥
వామార్ధాంగ స్వరూపా చ సుగుణైస్తేజసా సమా ।
పరా వరా సర్వమాతా పరమాద్యా సనాతనీ ॥
పరమానందరూపా చ ధన్యా మాన్యా చ పూజితా ।
రాసక్రీడాధిదేవీ చ కృష్ణస్య పరమాత్మనః ॥
రాస మండల సంభూతా రాసమండల మండితా ।
రాసేశ్వరీ సురసికా రాసావాసనీవాసినీ ॥
గోలోకవాసినీ దేవీ గోపీవేష విధాయికా ।
పరమాహ్లాదరూపా చ సంతోషాఽమర్షరూపిణీ ॥
నిర్గుణా చ నీరాకారా నిర్లిప్తాఽత్మస్వరూపిణీ ।
నిరీహా విరహంకారా భక్తానుగ్రహవిగ్రహా॥
వేదామసార ధ్యానేన విజ్జీయా సా విచక్షణైః ।
దృష్టిద్దృష్టా సహసేషు మునీంద్రైర్ముని పుంగవై: ॥
వహ్ని శుద్ధాంశుకాధానారత్నలంకార భూషితా ।
కోటి చంద్రప్రభాజుష్ట శ్రీయుక్తా భక్త విగ్రహా॥
శ్రీకృష్ణ భక్తదాస్యైకదాయినీ సర్వసంపదాం ।
ఆవతారే చ వారాహీ వృషభానుసుతా చ యా ॥
యత్పాదపద్మ సంస్పర్శపవిత్రా చ వసుంధరా ।
బ్రహ్మాదిభిరదృష్ణా యా సర్వదృష్టా చ భారతే ॥
స్త్రీరత్నసారసంభూతా కృష్ణవక్షః స్థలస్థితా ।
తథా ఘనే నవఘనే లోలా సౌదామినీ మునే ॥
షష్టివర్ష సహస్రాణి ప్రతప్తం బ్రహ్మణా పురా ।
యత్పాదపద్మనఖరదృష్టయే చాత్మశుద్ధయే ॥
స్వప్నేఽపినైవ దృష్టి స్యాత్ ప్రత్యక్షేఽపి చ కా కథా ।
తేనైవ తపసా దృష్టా భూరి బృందావనే వనే ॥
నారదా! ఇంతవరకు మూలప్రకృతి యొక్క నాల్గవ రూపమైన సావిత్రీ దేవి గురించి తెలిపితివి. ఇక ప్రకృతి యొక్క ఐదవ స్వరూపమైన రాధాదేవి విషయము వినుము.
ఆ రాధాదేవి ప్రేమకు, ప్రాణమునకు అధిదేవత. పంచప్రాణ స్వరూపిణి. పరబ్రహ్మయగు శ్రీకృష్ణునకు ప్రాణములకంటే మిన్నయైన ప్రియురాలు. మిక్కిలి ఆందమైనది. సమస్త సౌభాగ్యములు కలది. గొప్ప గౌరవము కలది. ఆమె శ్రీ కృష్ణ పరబ్రహ్మ యొక్క వామార్థ భాగస్వరూపిణి. ఆమె యొక్క సుగుణములతో, తేజస్సుతో శ్రీకృష్ణునకు సమానమైనది. ఆమె పర్వశ్రేష్ఠురాలు. అందరికి తల్లివంటిది. సనాతని. పరమానందరూపిణి, మామ్యరాలు. అందరిచే పూజింపబడినది. శ్రీ కృష్ణపరమాత్మ యొక్క రాసక్రీడకు అధిదేవత. గోలోకముననున్న ఆ దేవి గోపికావేషముననుండి పరమానందమున తేలియాడుచుండుమ. ఆమె సంతోషామర్షరూపిణి, నిర్గుణ, నిరాకార, నిర్లిప్త, నిరీహ, నిరహంకార, భక్తులననుగ్రహించుటకై అవతరించినది. వేదోక్త ప్రకారముగా ధ్యానించు మహనీయులు మాత్రము ఆమెను తెలిసికొందురు.
రాధాదేవి బంగారు వన్నె గల వస్త్రములను, రత్నాభరణములను ధరించుచుండును. ఆమె శరీర కాంతి కోటి చంద్రుల కాంతి కంటే మిన్నయైనది. ఆమె తన భక్తులకు సమస్త సంపదలను శ్రీకృష్ణునిపై దాస్య భక్తినీ ఇచ్చును.
వరాహావతారసమయమున ఈమె వృషభానుడను రాజునకు పుత్రికగా అవతరించినది. ఈ భూమి రాధాదేవి పాదపద్మ స్పర్శవలన పవిత్రమైనది. బ్రహ్మాది దేవతలు ఈ దేవిని కఠిన తపస్సు చేసినా చూడలేకపోయిరి. కాని భారత వర్ష వాసుల కీమె ఎల్లప్పుడు కనిపించును. చక్కని నల్లని మబ్బులోనున్న మెరుపుతీగవలె ఈమె శ్రీకృష్ణునివక్షస్థలముపై నుండును.
బ్రహ్మదేవుడు రాధాదేవియొక్క పదపద్మములోని గోటిని దర్శించుటకై ఆరువై వేల సంవత్సరములు కష్టపడి తపస్సు చేసినను చూడలేకపోయినాడు. ఆమె దర్శనము కలలో సైతము కన్పించ లేదన్నచో ప్రత్యక్షముగా కనిపించునను ప్రసక్తి లేదు.
కాని బ్రహ్మ దేవుడు చాలా కష్టపడి తపస్సు చేసి బృందావనములో మాత్రము రాధాదేవి యొక్క పాదపద్మములను దర్శించుకొనగలి గెను.
కథితా పంచమీ దేవీ సా రాధా పరికీర్తితా ।
ఆంశరూపా: కళారూపాః కళారశాంశసముద్భవాః ॥
ప్రకృతే: ప్రతివిశ్వం చ రూపం స్యాత్పర్వ యోషితః ।
పరిపూర్ణతమాః పంచవిధా దేవః ప్రకీర్తితాః ॥
యా యా: ప్రధానాంశరూపా వర్ణయామి నీశామయ ।
ప్రధానాంశ స్వరూపా చ గంగా భువన పావనీ ॥
విష్ణుపాదాబ్జసంభూతా ద్రవరూపా సనాతనీ ।
పాపిపాపేభ్మ దాహాయ జ్వలదింధన రూపిణీ ॥
దర్శన స్పర్శన స్నానపానైర్నిర్వాణ దాయినీ ।
గోలోక స్థాన గమన సుసోపాన స్వరూపిణీ ॥
పవిత్రరూపా తీర్థానాం సరితాం చ పరావరా ।
శంభుమౌళి బటామేరు ముక్తాపంక్తి స్వరూపిణీ ॥
తపస్సంపాదినీ సద్యో భారతే చ తపస్వినాం ।
శంఖ పద్మక్షీరనిభా శుద్ధ సత్వ స్వరూపిణీ ॥
ఈ విధముగా మూలప్రకృతి యొక్క ఐదవ రూపముగా రాధాదేవిని పేర్కొందురు.
అన్ని లోకములలో నున్న స్త్రీలు ప్రకృతి యొక్క ఆంశ స్వరూపాలుగా, కళారూపాలుగా, కళయొక్క ఆంశాంశ స్వరూపాలుగా పేర్కొనవచ్చును. ఇంతకు పూర్వము పేర్కొనబడిన దుర్గాది దేవతలు ప్రకృతియొక్క పరిపూర్ణస్వరూపము కలవారు.
ఇక ప్రకృతి యొక్క ప్రధానాంశ స్వరూపాలైన దేవతల గురించి తెలుపుదును.
సమస్తలోకమములను పవిత్రము చేయు గంగాదేవి ప్రకృతి యొక్క ప్రధానాంశ స్వరూపిణి. ఆ గంగ శ్రీవిష్ణువు యొక్క పాదముల వద్ద పుట్టి పాపములు చేసిన వారియొక్క పాపములను సమూలముగా పోగొట్టుచున్నది. ఆ గంగను చూచినను. తగిలినను, స్నానము చేసినను నీటిని తాగినను మోక్షము సిద్ధించును. నదిగా నున్న ఆ గంగా దేవి గోలోకమునకు వెళ్ళుటకు మంచిమెట్లవంటిది. అన్ని పుణ్యతీర్థములలో, అన్ని నదులలో ఆ గంగానది మిక్కిలి గొప్పది. శంకరుని శిరస్సుపై నున్న ఆ గంగానది ముత్యాల వరుసవలె కన్పించును. శంఖమువలె తెల్లని పద్మమువలె, పాలవలె తెల్లనైన ఆ గంగానది భారత వర్షమున నున్న మహర్షులకు తపఃఫలితముమ వెంటనే కల్గించును.
నిర్మలా నిరహంకారా సాధ్వీ నారాయణప్రియా ।
ప్రధానాంశస్వరూపా చ తులసీ విష్ణుకామినీ ॥
విష్ణుభూషణరూపా చ విష్ణుపాదస్థితా సతీ ।
తపస్సంకల్ప పూజాది సద్యస్సంపాదికి మునే ॥
సారభూతా చ పుష్పాణాం పవిత్ర పుణ్యదా సదా ।
దర్శన స్పర్శనాభ్యాం చ సద్యో నిర్వాణ దాయినీ ॥
కలో కలుషుష్కేద్మ దాహనాయాగ్ని రూపిణీ ।
యత్పాద పద్మ సంస్పర్శాత్ సద్యః పూతా వసుంధరా॥
యత్స్పర్శ దర్శనం వాంఛంతి తీర్థానామాత్మ శుద్ధయే ।
యయా వినా చ విశ్వేషు సర్వం కర్మాస్తి నిష్ఫలం॥
మోక్షదా యా ముముక్షూణాం కామినాం పర్వకామదా ।
కల్పవృక్ష స్వరూపా చ భారతే వృక్షరూపిణీ ॥
ప్రకృతి యొక్క ప్రధానంశమైన తులసీ దేవి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది. ఆమె నిర్మలమైనది. అహంకారములేనిది. విష్ణుమూర్తికి హారముగా, ఆర్చనా సమయములో పాదములపై ఉండును. తుప్పంకల్ప సమయమున పూజాది సందర్భములలో తులసి యొక్క ఆవశ్యమెంతేని కలదు. ఆ తులసి పుష్పములన్నిటిలో సారమైనది. పవిత్రమైనది, సదా పుణ్యము కల్గించునది.
ఆ తులసి మొక్క దర్శన, స్పర్శనలవలన మోక్షము లభించును. కలియుగమున మావపులు చేయు పాపములనే కట్టేలను ఆగ్నివలె క్షణములో భస్మము చేయును. భూమి ఆ తులసి యొక్క పాద స్పర్శవలన (వేళ్ళస్పర్శ) పవిత్రమగుచున్నది. సమస్త పుణ్య తీర్థములు తాము పరిశుద్ధి నొందుటకు తులసి మొక్క స్పర్శ దర్శనములను కోరుకొనుచున్నవి. ఆ తులసి లేనిచో సమస్త కర్మలు నిష్పలమై పోవును. మోక్షము కోరుకొనువారికి 'మోక్షమును, కోరినవారికి అన్ని కోరికలను కల్పవృక్షమువలె తీర్చును. భారత వర్షమున ఈ తులసి వృక్షరూపమున కన్పించుచున్నది.
త్రాణాయ భారతానాం చ పూజానాం పరదేవతా ।
ప్రధానాంశ స్వరూపా చ మనసా కశ్యపాత్మజా ॥
శంకర ప్రియశిష్యా చ మహాజ్ఞానవిశారదా ।
నాగేశ్వరస్యానంతస్య భగినీ నాగపూజితా ॥
నాగేశ్వరీ నాగమాతా సుందరీ నాగవాహినీ ।
వాగేంద్రగణ యుక్తా సా సాగభూషణ భూషితా ॥
నాగేంద్రవందితా సిద్ధయోగినీ నాగశాయినీ ।
విష్ణుభక్తి విష్ణురూపా విష్ణుపూజా పరాయణా ॥
తపస్స్వరూపా తపసాం ఫలదాత్రీ తపస్వినీ ।
దివ్యం శ్రీలక్షవర్షం చ తపస్తప్తం యయా హరేః ॥
తపస్వినీషు పూజ్యా చ తపస్విషు చ భారతే ।
సర్వ మంత్రాధిదేవీ చ జ్వలంతీ బ్రహ్మ తేజసా ॥
బ్రహ్మ స్వరూపా పరమా బ్రహ్మ భావన తత్పరా ।
జరత్కారుమునేః పత్నీ కృష్ణశంభు పతివ్రతా ॥
ఆస్తీకస్య మునేర్మాతా ప్రవరస్య తపస్వినాం ॥
కశ్యపమహర్షి పుత్రికయగు మనసా దేవి కూడ ప్రకృతి యొక్క ఒక ప్రధానాంశమే. ఆమె చాలా గొప్ప జ్ఞానము కలది. శంకరునికి చాల ఇష్టమైన శిష్యురాలు, సర్ప శ్రేష్టుడైన అనంతునకు సోదరి. ఆమెను సర్పములెప్పుడూ కొలుచుచుండును. ఆమె భూషణములు సర్పములే. ఆమె సిద్ధయోగిని, విష్ణుభక్తురాలు. విష్ణురూప. ఆమె శ్రీహరి గురించి మూడు లక్షల దివ్య సంవత్సరములు తపస్సు చేసినది. అందువలననే ఆమె భారత వరమందలి తపస్వులందరికి పూజనీయురాలైనది. ఆమె నమస్త మంత్రములకు అధిదేవత. బ్రహ్మతేజస్సుతో వెలిపోవుచున్న ఆ మనసాదేవి బ్రహ్మ భావనలో ఎల్లప్పుడు ఉండును. ఈమెకు జరత్కారు అనే పేరు కూడా ఉన్నది. ఈమె జరత్కారు మహర్షిని పెండ్లియాడి తపోధనులలో శ్రేష్ఠుడని కీర్తిపొందిన ఆస్తీక మహర్షిని కన్నది.
ప్రధానాంశస్వరూపా యా దేవసేనా చ నారద ॥
మాతృకా సా పూజ్యతమా సాచ షష్ఠి ప్రకీర్తితా ।
శిశూనాం ప్రతి విశ్వం తు ప్రతిపాలన కారిణీ ॥
తపస్వినీ విష్ణుభక్తా కార్తికేయస్య కామిని ।
షష్టాంశరూపా ప్రకృతే: తేన షష్ఠీ ప్రకీర్తితా ॥
పుత్రపౌత్రప్రదాత్రీ చ ధాత్రీ చ జగతాం సదా ।
సుందరీ యువతి రమ్యా సతతం భర్తురంతికే ॥
స్థానే శిశూనాం పరమా వృద్దరూపా చ యోగినీ ।
పూజ ద్వాదశమాసేషు యస్యా: షష్ట్యా స్తు సంతతం ॥
పూజా చ సూతికాగోరే పరషష్టదినే శిశో: ।
ఏకవింశతిమే చైవ పూజా కళ్యాణ హేతుకీ ॥
శశ్వన్నియమిత చైషా నీత్యా కామ్యాఽప్యతః పరా ।
మాతృరూపా దయారూపా శశ్వద్రక్షణకారిణీ ॥
జలే స్థలే చాంతరిక్షే శిశూనాం స్వప్న గోచరా ।
ప్రకృతి యొక్క మరియొక ప్రధానాంశము దేవసేన. ఆమె ప్రకృతి యొక్క ఉషాంశ రూపగావున మ అని కూడా ఆమెను ఏలుతురు. ఆమె మిక్కిలి గౌరవించదగిన “మాతృక'. సమస్త విశ్వములలో ఉండే శిశువుల నామే కాపాడుచుండును. అందరకు పుత్రపౌత్ర సంపదనిచ్చును. భర్త సమీపమున ఆందమైన యువతీగా ఎల్లప్పుడు కన్పించుచున్నమ శిశువుల దగ్గర యోగిని యైన పండుముసలివలె ఉండును.
ఈషష్టీదేవి యొక్క పూజను ఎల్లప్పుడు సంవత్సరమున పన్నెండు నెలలు చేయవచ్చును. శిశువు పుట్టిన తరువాత సూతీక గృహములో, ఏడవ దినమున లేనిచో ఇరువది యొకటవ దినమున ఈమె పూజు చేసినచో శిశువువకు ఆయురారోగ్యములు కలుగును. మాతృ రూపిణియగు నీ దేవసేన మిక్కిలి దయగలది. ఆమె శిశువులను నీటిలోను, భూమి సైనమ, ఆకాదువందును రక్షించును. వారికి ఆమె స్వప్నములో దర్శనమొసగుచుండును.
ప్రధానాంశ స్వరూపా యా దేవీ మంగళ చండికా ॥
ప్రకృతేర్ముఖసంభూతా సర్వమంగళదా సదా ।
సృష్టౌ మంగళరూపాచ సంహారే కోపరూపిణీ ॥
తేన మంగళ చండీ సా పండితైః పరికీర్తితా ।
ప్రతిమంగళవారేషు ప్రతివిశ్వేషు పూజితా ॥
పంచోపచారైర్భక్త్యా చ యోషిదీ: పరిపూజితా ।
పుత్రపౌత్ర ధనైశ్వర్య యశోమంగళ దాయినీ ॥
శోక సంతాప పాపార్తి దుఃఖ దారిద్ర్య నాశినీ ।
పరీతుష్టా సర్వవాంఛాప్రదాత్రీ సర్వయోషితాం ॥
రుష్టా క్షణేన సంహర్తుం శక్తా విశ్వం మహేశ్వరీ ।
‘ప్రకృతి’ దేవీయొక్క మరొక ప్రధానాంశము ఆమె ముఖముమండి పుట్టిన మంగళచండిక, ఆమె సమస్త మంగళములను తన భక్తుల కిచ్చును. ఆమె సృష్టి జరుగునప్పుడు మంగళ స్వరూపిణిగా సంహారసమయమున చండీ స్వరూపిణిగా కనిపించుచున్నందువలన మంగళ చండియనీ కీర్తింపబడుచున్నది. ఆమె సమస్తలోకములలో ప్రతి మంగళవారము స్త్రీలచే పంచోపచారములచే పూజింపబడుచున్నది. ఆమె తనను పూజించువారికి పుత్రపౌత్ర ధనైశ్వర్యములను, కీర్తిని, సంతోషమును ఇచ్చును. అట్లే వారికి శోకము, సంతాపము, ఆర్తి, దుఃఖము. దారిద్ర్యము, పాపములు కలుగనివ్వదు. ఆమె సంతుష్టురాలైనచో స్త్రీలందరకు అన్ని కోరికలు తీర్చును. కోపగించినచో క్షణములో సమస్త ప్రపంచమును సంహరించును.
ప్రధానాంశ స్వరూపా చ కాళి కమలలోచనా ॥
దుర్గాలలాట సంభూతా రణే శుంభనిశుంభయోః ।
దుర్గార్థాంశ స్వరూపా స్యాద్గుణైన తేజసా సమా ॥
కోటి సూర్య ప్రభాఙాష్ట్ర దివ్యసుందర విగ్రహా ।
ప్రధానా సర్వశక్తీనాం వరా బలవతీ పరా ॥
సర్వసిద్ధిప్రదా దేవి పరమా సిద్ధయోగినీ ।
కృష్ణభక్తా కృష్ణతుల్యా తేజసా విక్రమైర్గుణై:
కృష్ణ భావనయా శశ్వత్ కృష్ణవర్ణా సనాతనీ ॥
బ్రహ్మాండం సకలం హర్తుం శక్తా విశ్వాసమత్రతః ।
రణం దైత్యైః సమం తస్యా క్రీడాస్యాల్లోక రక్షయా॥
ధర్మార్థ కామమోక్షాంశ్చ దాతుం శక్తా సుపూజితా ।
బ్రహ్మాదిభిః స్తూయమానా మునిభిర్మనుభిర్నరై: ॥
ప్రకృతియొక్క మరియొక ప్రధానాంశము కాళికాదేవి, దుర్గాదేవి శుంభనిశుంభ రాక్షసులతో యుద్ధము చేయుచున్నప్పుడు కోపించిన ఆమె ముఖమునుండి తదర్ధాంశముగా కాళికాదేవి పుట్టినది. ఆ కాళిక తన గుణములతో తేజస్పులో దుర్గాదేవితో సమానమైనది. కోటి సూర్యుల కాంతితో సమానమైన కాంతి గలది. దివ్య సౌందర్యముచే ప్రకాళీంచునది. ఆమె తన భక్తులకు సకల సిద్దులనొసంగును. కృషభక్తురాలైన కాళీక శ్రీకృష్ణుని సంతతము ధ్యానించుచున్నందువలన శ్రీకృష్ణుని వలే నల్లని శరీరముతో ప్రకాశించుమ. లోకములను రక్షించుటకై రాక్షసులతో ఆమె యుద్ధము చేయుచుండును. ఆమెకదీ ఒక ఆట.. ఆమె తన నిట్టూర్పులో సకల బ్రహ్మాండములను హరించును. బ్రహ్మాది దేవతలతో, మునులతో, నరులతో పూజలందుకొను ఆ కాళీక ధర్మార్థ కామ మోక్షములనిచ్చును.
ప్రధానాంశ స్వరూపాచ ప్రకృతిశ్చ వసుంధరా ।
ఆధార భూతా సర్వేషాం సర్వ సస్య ప్రసూతికా॥
రత్నాకరా రత్నగర్భా సర్వ రత్నాకరాశ్రయా ।
త్రాదిభిః ప్రజేశైశ్చ పూజితా వందితా సదా ॥
సర్వోపజీవ్యరూపా చ సర్వసంపద్విధాయినీ ।
యయా వినా జగత్సర్వం నిరాధారం చరాచరం ॥
ప్రకృతి యొక్క మరియొక ప్రధానాంశము వసుంధర. ఈ భూమి అందరకు ఆధారమైనది. సమస్త సస్యములను పండించునది. ఈ భూమి రత్నములకు నిలయమైనదీ, సమస్త సముద్రములు దీనిని ఆశ్రయించుకొని యున్నవి. ఈమె నరులచే నరాధిపతులచే పూజలందుకొనును. అందరు జీవించుటకు కారణమగుచున్నది. అందరకు సంపదలను కల్గించునది. ఈ భూమిలేనిచో ఈ చరాచర జగత్తంతయు నిరాధారమై నశించిపోవును.
ప్రకృతేశ్చ కళా యా యాస్తా నిబోధ మునీశ్వర ।
యస్య యస్య చ యా పత్న్యస్తా: సర్పా వర్ణయామి తే ॥
ఓ నారదా! ప్రకృతి యొక్క ఆంశ స్వరూపలను, వారి భర్తల పేర్లను నీకు తెలుపుదును.
స్వాహాదేవీ వహ్నిపత్నీ త్రిషు లోకేషు పూజిలో ।
యయా వీనా హవీర్దత్తం న గ్రహీతుం సురాః క్షమాః ॥
దక్షిణా యజ్ఞపత్నీ చ దీక్షా సర్వత్ర పూజితా ।
యయా వినాచ విశ్వేషు సర్వం కర్మచ నీష్ఫలం॥
స్వధా పితృణాం పత్ని చ మునిభిర్మనుభిర్నరైః ।
పూజితా పైతృకం దానం నిష్ఫలం చ యయా వినా ॥
స్వస్తిదేవీ వాయుపత్నీ ప్రతి విశేష పూజితా ।
ఆదానం చ ప్రదానం చ నిష్ఫలం చ యయా వినా ॥
పుష్టిర్గణపతేః పత్ని పూజితా జగతి తలే ।
యయా వినా పరిక్షీణాః పుమాంసో యోషితోఽపి చ ॥
అనంతపత్నీ తుష్టిశ్చ పూజితా వందితా సదా ।
యయా వినా న సంతుష్టా: సర్వే లోకాశ్చ సర్వతః ॥
ఈశానపత్నీ సంపత్తి; పూజితా చ సురైర్నరైః ।
సర్వే లోకా దరిద్రాశ్చ విచ్వేషు చ యయా వినా ॥
ధృతి: కపిలపత్నీ చ సర్యైః సర్వత్ర పూజితా ।
సర్వే లోకా ఆధీరాః స్యుః జగత్పు చ యయా వినా ॥
యమపత్నీ క్షమా పార్వీ సుశీలా సర్వపూజితా ।
సమున్మతాశ్చ రుద్రాశ్చ సర్వే లోకా యయా వినా॥
'స్వాహాదేవి' అగ్నిదేవుని భార్య. యజ్ఞములలో ఆమెలేకుండ హవిస్సునిస్తే దేవతలు దానిని తీసికొనలేరు. 'దక్షిణాదేవి" యజ్ఞపత్ని, ఆమె లేనిచో సమస్త కర్మలు నిష్ఫలమగుచున్నది. "స్వధా దేవి" పితృపన్నీ, స్వధాకారము లేక పితృకర్మలలో చేసిన దానము వ్యర్థమగుచున్నది.
స్వస్తిదేవి వాయువుభార్య. ఆమెలేకుండ చేసిన ఆదాన ప్రదానములు వ్యర్థమగుమ.
‘పుష్టిదేవి’ గణపతి యొక్క భార్య. అనంతుని భార్య “తుష్టిదేవి". “సంపత్తి" ఈశ్వరుని భార్య. “ధృతి" కపిలమహర్షి భార్య. "క్షమ" యముని భార్య. ఆమె లేనిచో సమస్తలోకములు కోపముతో పిచ్చెక్కినట్లుండును.
క్రీడాధిష్ఠాతృదేవీ సా కామపత్నీ రతిః సతీ ।
కేళికౌతుకహీనాశ్చ సర్వే లోకా యయా వినా ॥
సత్యపత్నీ పతి ముక్తి: పూజితా జగతాం ప్రియా ।
యయా వినా భవేల్లోకో బంధుతారహితః సదా ॥
మోహపత్నీ దయా సాద్వీ పూజితా చ జగత్ప్రియా ।
సర్వేలోకాశ్చ సర్వత్ర నిష్ఠురాశ్చ యయా వినా॥
పుణ్యపత్ని ప్రతిష్ఠ సా పుణ్యరూపా చ పూజితా ।
యయా వినా జగత్సర్వం జీవన్మృతసమం మునే ॥
సుకర్మపత్ని కీర్తిశ్చ దన్యా మాన్యా చ పూజితా ।
యయా వినా జగత్సర్వం యశోహీనం మృతం యథా ॥
క్రియా ఉద్యోగపత్నీ చ పూజితా సర్వసంగతా ।
యయా వినా జగత్పర్వం ఉచ్ఛిన్నమివ నారద ॥
ఆధర్మపత్ని మిథ్యా సా సర్వ ధూర్తైశ్చ పూజితా ।
యయా వినా జగత్సర్వం ఉచ్ఛిన్నం విధినిర్మితం ॥
సత్యే ఆదర్శనా యా చ త్రేతాయాం సూక్ష్మ రూపిణీ ।
ఆర్ధావయవ రూపా చ ద్వాపర సంహృతా ప్రియా ॥
కలో మహాప్రగల్భా చ సర్వత్ర వ్యాప్తి కారణాత్ ।
కపటేన సహభ్రాత్రా భ్రమల్యేవ గృహే గృహే ॥
శాంతిర్లజ్జా చ భార్యే ద్వే సుశీలస్య చ పూజితే ।
యాభ్యాం వినా జగత్సర్వం ఉన్మత్తమీవ నారద॥
జ్ఞానస్య త్రిస్రో భార్యాశ్చ బుద్ధిర్మేధా స్మృతీస్తథా ।
యాభిర్వినా జగత్సర్వం మూఢం మృతసమం సదా॥
రతికేళీకౌతుకమునకు కారణమైనది, రతిక్రీడకు అధిష్టాన దేవతయగు 'రతీదేవి' మన్మథుని భార్య. అందరకు ఇష్టమైన “ముక్తి దేవత" సత్యపత్ని. “దయాదేవి" మోహపత్ని. పూణ్య స్వరూపిణియైన "ప్రతిష్టాదేవి" పుణ్యపత్ని. పేరు ప్రతిష్ఠలకు కారణభూతురాలైన "కీర్తిదేవి” సుకర్మపత్ని. క్రియాదేవీ" ఉద్యోగపత్ని- సమస్త దుష్టులచే గౌరవింపబడుచున్న “మిథ్యాదేవి" ఆధర్ముని భార్య. ఆమె సత్య(కృత) యుగములో కనిపించలేదు. త్రేతా యుగములో సూక్ష్మరూపములో ఉండినది. ద్వాపరయుగములో ముడుచుకొని పోయి ఆల్ట్రావయవములున్నట్లు కనిపించును. కాని కలియుగములో అంతటా కనిపిస్తూ కపటుడను తన సోదరునితో కలిసి ఇంటింటికి తీరుగుచుండును.
సుశీలుని భార్యలు "శాంతి, లజ్జ", జ్ఞానదేవునకు "బుద్ధి, మేధ, సతీ" అను ముగ్గురు భార్యలు కలరు.
మూర్తిశ్చ ధర్మపత్నీ సా కాంతిరూపా మనోహరా ।
పరమాత్మా చ విశ్వౌఘా నిరాధారా యయా వీనా ॥
సర్వత్రశోభరూపా చ లక్ష్మీర్మూర్తిమతి సతీ ।
శ్రీరూపా మూర్తిరూపాన మాన్యా ధన్యా చ పూజితా ॥
కాలాగ్ని రుద్రపత్నీ చ నిద్రాయా సిద్ధయోగినాం ।
సర్వలోకాః సమాచ్ఛన్నా: మాయాయోగేన రాత్రిషు ॥
కాలస్య త్రిస్రో భార్యాశ్చ సంధ్యా రాత్రిర్దినాని చ ।
యాభిర్వీసా విధాత్రా చ సంఖ్యాం కర్తుం న శక్యతే ॥
క్షుత్పిపాసే లోభభార్యే ధన్యే మాన్యే చ పూజితే ।
యాభ్యాం వ్యాప్తం జగత్ క్షోభయుక్తం చింతితమేవ చ ॥
ప్రభా దాహికా చైవ ద్వే భార్యే తేజసస్తథా ।
యాభ్యాం వినా జగత్ర్సష్ణుం విధాతా చ న హీశ్వరః ॥
కాలకన్యే మృత్యుజరే ప్రజ్వరస్య ప్రియే ప్రియే ।
యాభ్యాం జగత్సముచ్ఛిన్నం విధాత్రా నిర్మితే విధౌ ॥
నీద్రాకన్యా చ తంద్రా సా ప్రీతీరన్యా సుఖప్రియే ।
యాభ్యాం వ్యాప్తం జగత్సర్వం వీధిపుత్ర విధేర్విధౌ ॥
వైరాగ్యస్య చ ద్వే భార్యే శ్రద్ధా భక్తిశ్చ పూజితే ।
యాభ్యాం శశ్వత్ జగత్సర్వం జీవన్ముక్తమిదం మునే ॥
అదితిర్దేవమాతా చ సురభిశ్చ గవాం ప్రసూః ।
దితిశ్చ దైత్యజననీ కద్రూశ్చ వినతా దను: ॥
ఉపయుక్తా: సృష్టి విధావేతాశ్చ ప్రకృతే: కళాః ।
కళాశ్చాన్యాః సంతి బహ్వ్య: తాసు కాశ్చిన్ని బోధమే ॥
కాంతి రూపమైనది. అందమైనదీ అగు ‘మూర్తీదేవి' ధర్మపత్ని. ఆమె లేనిచో సమస్త లోకములు పరమాత్మ నిరాధారులగుదురు. కాంతి రూపిణియగు ఆ దేవి లక్ష్మీదేవి స్వరూపిణి, ఆమె అందరిచే గౌరవింపబడుచున్నది. శ్రీ మూర్తి ఈమె యొక్క రూపములు.
“నిద్రాదేవి" కాలాగ్ని రుద్రుని యొక్క భార్య. ఈమేయొక్క మాయయందు సమస్తలోకములు రాత్రివేళలో మునిగిపోవుచున్నవి. సంధ్య, రాత్రి, దినములను ముగ్గురు కాలముయొక్క భార్యలు. 'క్షుత్పిపాసలు' లోభదేవత యొక్క భార్యలు. తేజస్సునకు “ప్రభా,దాహికా" అను ఇద్దరు భార్యలు. కాలుని కుమార్తెలైన మృత్యు. జరలు ప్రజ్వరుని యొక్క భార్యలు. నిద్రాదేవి కూతురైన "తంద్ర" సుఖదేవుని భార్య. అతని యొక్క మరియొక భార్య పేరు ప్రీత", "శ్రద్ధా, భక్తి" వైరాగ్యునీ భార్యలు.
ఇంకను దేవతల తల్లియైన "ఆదితీ", గోవులకు మూలమైన 'సురభి'. దైత్యులకు తల్లియైన 'దితి', కద్రువ, వినత, దనువు వీరందరు సృష్టి క్రమములో ఉపయోగింపబడినవారు.
పైన పేర్కొన్న వారందరు ప్రకృతి యొక్క సూక్ష్మాంశస్వరూపలు. ఇంకను ప్రకృతి యొక్క సూక్ష్మాంశ స్వరూపలు చాలా మంది గలరు.
రోహిణీ చంద్రపత్నీ చ సంజ్ఞా సూర్యస్య కామినీ ।
శతరూపా మనోరార్యా శచీంద్రస్య చ గేహినీ ॥
తారా బృహస్పతేర్భార్యా వసిష్ఠస్యాప్యరుంధతి ।
అహల్యా గౌతమస్త్రీ స్యాదనసూయాఽత్రి కామినీ ॥
దేవహూతీః కర్దమస్య ప్రసూతిర్ధక్ష కామినీ ।
పితౄణాం మానసీ కన్యా మేనకా సాంఽబికా ప్రసూః ॥
లోపాముద్రా తథా హూతీ: కుబేరస్యతు కామినీ ।
వరుణానీ యమస్త్రీ చ బలేరింధ్యావళీతి చ ॥
కుంతీ చ దమయంతీ చ యశోదా దేవకీ సతీ ।
గాంధారీ ద్రౌపదీ సవ్యా సావిత్రీ సత్యవత్ప్రియా ॥
వృషభానుప్రియా సౌదీ రాధామాతా కళావతి ।
మందోదరీ చ కౌసల్యా సుభద్రా కైకయీ తథా ॥
రేవతీ సత్యభామా చ కాళిందీ లక్ష్మణా తథా ।
మిత్రవిందా వాగ్నజితీ తథా జాంబవతీ పరా ॥
లక్ష్మణ రుక్మిణీ సీతా స్వయం లక్ష్మీః ప్రకీర్తితా ।
కళాయోజనగంధా చ వ్యాసమాతా మహాసతీ ॥
బాణపుత్రీ తథోషా చ చిత్రలేఖా చ తత్సభీ ।
ప్రభావతీ భానుమతీ తథా మాయావతి సతీ ॥
రేణుకా చ భూగోర్మాతా హలీమాతా చ రోహిణీ ।
ఏకోనంశా చ దుర్గా సా శ్రీ కృష్ణభగినీ సతీ ॥
బహ్వ్య: సంతి కళాశ్చైవం ప్రకృతేరే భారతే ।
యా యాశ్చ గ్రామదేవ్యస్తా: సర్వాశ్చ ప్రకృతేః కళాః ॥
“రోహిణీదేవి" చంద్రుని భార్య కాగా "సంజ్ఞాదేవి" సూర్యుని భార్య. “శతరూపాదేవి, మనువుభార్య. ఇంద్రుని భార్య పేరు "శని". 'తార' బృహస్పతి భార్య. వసిష్ఠుని భార్య పేరు “అరుంధతి”. “అహల్యాదేవి" గౌతమ మహర్షి భార్య. ఆత్రీ మహర్షి భార్య “అనసూయదేవి”. దేవహూతీ కర్దముని భార్యకాగా "ప్రసూతి" దక్షప్రజాపతి భార్య. మనసాదేవి కూతురైన మానసీదేవి పితృభార్య. పార్వతీదేవిని గన్నతల్లి "మేనక", లోపాముద్ర, హోలి, వరుణానీ, యమపత్ని, వింధ్యావళీ, కుంతి, దమయంతి, యశోద, దేవకీదేవి, గాంధారి, ద్రౌపది, సత్యవంతుని భార్యయైన సావిత్రి, రాధకు తల్లియైన కళావతి, మండోదరి, కౌసల్య, సుభద్ర, కైకేయి, రేవతి, సత్యభామ, కాళింది, లక్ష్మణ, మిత్రవింద, నాగ్నజితి, జాంబవతి లక్ష్మీదేవి స్వరూపాలైన సీత, రుక్మిణి, వ్యాసుని తల్లియైన యోజనగంధ, బోణాసురుని కూతురైన ఉషాదేవి, ఆమె స్నేహితురాలైన చిత్రలేఖ, ప్రభావతి, భానుమతి, మాయావతి, పరశురాముని తల్లియైన రేణుకాదేవి, బలరాముని తల్లియగు రోహిణీ, శ్రీకృష్ణునకు సోదరియగు దుర్గ మొదలైన వారందరు ప్రకృతి యొక్క ఆంశ స్వరూపలు. అట్లే గ్రామ దేవతలందరు ప్రకృతి యొక్క సూక్ష్మాంశ స్వరూపాలే.
కళాంశాంశ సముద్భూతాః ప్రతి విశ్వేషు యోషితః ।
యోషీలామపమానేన ప్రకృతేశ్చ పరాభవః ॥
బ్రాహ్మణీ పూజితా యేన పతి పుత్రవతీ సతీ ।
ప్రకృతిః పూజితా తేన వస్త్రాలంకార చందనైః ॥
కుమారీ చాష్ట్రవర్షియా వస్త్రాలంకార చందనైః ।
పూజితా యేన వీప్రస్య ప్రకృతిస్తేన పూజితా ॥
సర్వాః ప్రకృతిసంభూతా ఉత్తమాధమమధ్యమా: ।
సత్వాంశాశ్చోత్తమా జ్ఞేయా: సుశీలాశ్చ పతివ్రతాః ॥
మధ్యమా రజసచ్చాంశాస్త్రాశ్చ భోగ్యాః ప్రకీర్తితాః ।
సుఖసంభోగవత్యశ్చ స్వకార్యే తత్పరాః సదా॥
అధహస్తమసశ్చాంశా: పుంశ్చల్య పరికీర్తితాః ।
దుర్ముఖాః కులటా ధూర్తా, స్వతంత్రాః కలహప్రియాః ॥
పృథివ్యాం కులటా యాశ్చ స్వర్గీ చాప్సరసాంగణాః ।
ప్రకృతేస్తమనశ్చాంశా: పుంశ్చల్య: పరికీర్తితాః ॥
ఏవం నిగదీతం సర్వం- ప్రకృతర్భేదపంచకం ।
తాః సర్వాః పూజితాః పృథ్య్వాం పుణ్యక్షేత్రే చ భారతే ॥
స్త్రీలందరు ప్రకృతి యొక్క అంశాంశ స్వరూపలు. కావున స్త్రీలనవమానించినచో ప్రకృతిని అవమానించినట్లే అగును. భర్త, పుత్రులు గల స్త్రీని వస్త్రాలంకారములచే గౌరవించినచో ప్రకృతిని పూజించినట్లే అగుమ. ఎనిమిది సంవత్సరముల వయసు కలిగిన కన్యను వస్త్రము, ఆలంకారము చందనములతో గౌరవించిన ప్రకృతిని పూజించినట్లగును.
ప్రకృతి వలన పుట్టిన స్త్రీలలో ఉత్తమస్త్రీలు, మధ్యమ స్త్రీలు, అధమ స్త్రీలు అవి ఉందురు. మంచి నడవడిక గలిగిన పతివ్రతలు సత్వగుణాంశలైన ఉత్తమ స్త్రీలుగా పరిగణింపబడుదురు. సుఖసంభోగమునిచ్చుచు తమ పనులను తాము చేసికొను ప్రీలు రజోగుణాంశగల మధ్యమస్త్రీలు, కలహప్రియులు. కులటలు, దుష్టలు ఐన స్త్రీలు తామసాంశగల అధమ స్త్రీలు. ఈ భూమీపై నున్న కులటలు, స్వర్గ మందున్న అప్పరసలందరు అధమస్త్రీలుగా పరిగణింపబడుదురు.
ఈ విధముగా ప్రకృతి యొక్క పంచభేదములన అంశాంశములుగా వివరించుట జరిగినది. ఆ ప్రకృతియొక్క అంశస్వరూపలందరు పుణ్యక్షేత్రమైన ఈ భారతవర్షమున సదా పూజింపబడుచుందురు.
పూజితా సురథేనాదౌ దుర్గార్తినాశనీ ।
ద్వితీయా రామచంద్రేణ రావణస్య వధార్థినా ॥
తత్పశ్చాజ్జగతాం మాతా త్రిషు లోకేషు పూజితా ।
జాతాSదౌ దక్షపత్న్యాంచ నిహంతుం దైత్య దానవాన్ ॥
తతో దేహం పరిత్యజ్య యజ్ఞే భర్తుచ్చ నిందయా ।
జజ్ఞే హిమవతః పత్యాం లేభే పశుపతిం పతిం॥
గణేశశ్చ స్వయం కృష్ణుః స్కందో విష్ణుకళోద్భవః ।
బభూవతుస్తౌ తనయౌ పశ్చాత్తస్యాశ్చ నారద ॥
లక్ష్మీర్మంగళ భూపేన ప్రథమే పరిపూజితా ।
త్రిషు లోకేషు తత్పశ్చాద్దేవతాముని మానవి: ॥
సావిత్రీ ప్రథమం చాపి భక్త్యా వై పరిపూజితా ।
తత్పశ్చాత్రిషు లోకేషు దేవతాముని మానవైః ॥
ఆదౌ సరస్వతీ దేవీ బ్రహ్మణా పరీపూజితా ।
తత్పశ్చాత్ త్రిషులోకేషు దేవతాముని మానవైః ॥
ప్రథమం పూజితా రాధా గోలోకే రాసమండలే ।
పౌర్ణమాస్యాం కార్తీకస్య కృష్ణేన పరమాత్మనా ॥
గోపికాభిశ్చ గో పైశ్చ బాలికాభిశ్చ బాలకైః ।
గవాంగణైః సురగణైః తత్పశ్చన్మాయయా హరేః ॥
తదా బ్రహ్మాదిభిరేవైర్మునిభీర్మనుభీస్తథా ।
పుష్ప ధూపాదిభిరక్త్యా పూజితా వందితా సదా ॥
పృథివ్యాం ప్రథమాదేవీ సుయజ్ఞేన చ పూజితా ।
శంకరేణోపదిష్టేన పుణ్యక్షేత్రే చ భారతే ॥
త్రిషు లోకేషు తత్పశ్ఛాదాజ్ఞయా పరమాత్మనః ।
పుష్ప ధూపాదిభిర్భక్త్యా పూజితా మునిభిః సురైః ॥
కళా యా యా: సుసంభూతా పూజితాస్త్రాశ్చ భారతే ।
పూజితా గ్రామదేవ్యశ్చ గ్రామే చ నగరే మునే ॥
మిక్కిలి గొప్పనైన ఆర్తులను తొలగించు దుర్గాదేవిని సురధుడను రాజు తొలుత పూజింపగా రావణవధకై వెళ్ళుచు శ్రీరామచంద్రుడు తరువాత పూజించెను. ముల్లోకములకు తల్లియగు ఆ దుర్గాదేవి సమస్తలోకములయందు ఆ తరువాత పూజింపబడినది. దుర్గాదేవి దైత్యులను దానవులను చంపుటకై తొలుత దక్షప్రజాపతి ఇంట పుట్టినది. దక్షయజ్ఞమున తండ్రియైన దక్షుడు తన భర్తను నిందించుచుండగా సహింపలేక యజ్ఞాలో తన దేహమును చాలించి హిమవంతునకు కూతురుగా జన్మించి శంకరుని మరల భర్తగా పొందిను, శ్రీకృష్ణస్వరూపుడైన గణపతి, శ్రీకృష్ణాంశ రూపుడైన కుమారస్వామి ఆమెకు పుత్రులైరి.
లక్ష్మీదేవిని తొలుత మంగళభూపతి పూజించెను. అట్లే సావిత్రి దేవిని తొలుత భక్తి పూజించెను. సరస్వతీదేవి తొలుత బ్రహ్మదేవుని చేత పూజింపబడినది,
రాధాదేవి తొలుత గోలోకమున రాసమండలమున పరమాత్మయగు శ్రీకృష్ణునిచే కార్తీక పూర్ణిమనాడు పూజింపబడినది. ఆ తరువాత గోపి, గోపికలతో, బాలబాలికలతో గోగణముతో, దేవతాగణముతో పూజింపబడినది.
భూలోకమున ఆ రాధాదేవిని తొలుత సుయజ్ఞుడను రాజు శంకరుని ఉపదేశముననుసరించి భారతవర్షమున పూజించెను. ఆ తరువాత శ్రీకృష్ణపరమాత్మయొక్క ఆజ్ఞవలన దేవతలు, మునులు ఆమెను పూజచేసిరి.
ప్రకృతీదేవి యొక్క అంశలలో పుట్టిన గ్రామదేవతలు పల్లెలలో పట్టణములలో ఈ భారతదేశమున పూజలను అందుకొనుచున్నారు.
ఏపం తే కథితం సర్వం ప్రకృతేశ్చరితం శుభం ।
యథాగమం లక్షణం చ కిం భూయః శ్రోతుమిచ్ఛపి ॥
నారదా! నీకు ఈ విధముగా ప్రకృతి యొక్క చరిత్రమ శాస్త్రబద్దమైన దాని యొక్క లక్షణమునంతయు వివరించితిని. ఇంకను నీవు వినవలసినదేమైన ఉన్నచో తెలుపుము.
ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృతి ఖండి నారాయణ నారద సంవాదే ప్రకృతి స్వరూప తద్భేద వర్ణనం నామ ప్రథమోఽధ్యాయః ॥
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములో రెండవదైన ప్రకృతి ఖండములో నారద నారాయణ సంవాద సందర్భమున చెప్పబడిన ప్రకృతి స్వరూపము, దావీ భేదములను తెలుపు ప్రథమాధ్యాయము సమాప్తము.
Summary of chapter 1 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
In the beginning of the discourse, the venerable sage Śrī Sūta Gosvāmī explained to Maharshi Śaunaka the transcendent nature of Parā Prakṛti, the supreme divine energy of Lord Śrī Kṛshṇa. At the mere desire of the Supreme Being to manifest the cosmos, this primordial potency expanded into five magnificent forms to execute the functions of creation, preservation, and spiritual elevation. These five primary goddesses are Goddess Durgā who is the personification of courage and power, Goddess Rādhā who embodies supreme divine love and sweetness, Goddess Lakshmī who bestows all beauty and opulence, Goddess Sarasvatī who reigns over wisdom and speech, and Goddess Sāvitrī who is the sacred mother of the Vedas and noble virtue. Each of these divine forms represents an essential attribute of the Supreme Lord, demonstrating that all cosmic potencies and spiritual graces emanate from the single unmanifest Divine Mother.