మార్కండేయ మహా పురాణము
134 - శ్రవణ పఠన మాహాత్మ్య ఫల కథనము.
జైమిని మహర్షీ! మార్కండేయ మహాముని ఈ ప్రకారముగా చెప్పి క్రౌష్టుకి మునికి బోవుటకు అనుజ్ఞ నిచ్చి మాధ్యాహ్నిక క్రియలను చేసుకొనెను. మహర్షీ! ఇప్పుడు నీకు చెప్పిన దంతయు బ్రహ్మ దేవుడు మార్కండేయ మహామునికి చెప్పెను. ఈ పురాణము అనాది సిద్ద మైనది. మేము చెప్పిన ఈ మార్కండేయ మహా పురాణము, పవిత్రము, అయు ర్వర్దనము, ధర్మ కామార్ధ సిద్దులను కలుగ జేయునది, ఈ పురాణము యొక్క పఠన శ్రవణములచే మానవులకు సర్వ పాపములు తొలగి పోవును. పూర్వము నీ వడిగిన నాలుగు ప్రశ్నలకు సమాధానములు చెప్పితిమి. పితాపుత్ర సంవాదము, బ్రహ్మ సృష్టి, మనూత్పత్తి, వారి స్థితులు మఱియు రాజుల చరిత్రములు చెప్పితిమి.
ఇప్పుడు ఇంకా ఏమి విన దలచితివి? మనుష్యుడు ఈ మహా పురాణ శ్రవణము చేయుట చేతగాని సభ యందు పఠించుటచే గాని సమస్త పాపముల నుండి విడువడి అంత్య కాలమున బ్రహ్మ యందు లయము చెందును. బ్రహ్మ దేవుడు చెప్పిన అష్టాదశ పురాణము లందు, ఈ మార్కండేయ మహా పురాణము ఏడవదిగా ప్రసిద్ది పొందెను. 1. బ్రహ్మ పురాణము, 2. పద్మ పురాణము, 3. విష్ణు పురాణము, 4. శివ పురాణము, 5. భాగవతము, 6. నారద పురాణము, 7. మార్కండేయ మహా పురాణము, 8. అగ్ని పురాణము, 9. భవిష్య పురాణము, 10. బ్రహ్మ వైవర్త పురాణము, 11. లింగ పురాణము, 12. వరాహ పురాణము, 13. స్కాంద పురాణము, 14. వామన పురాణము, 15. కూర్మ పురాణము, 16. మత్స్య పురాణము, 17. గరుడ పురాణము, 18. బ్రహ్మాండ పురాణము.
ఈ పదు నెనిమిది పురాణముల యొక్క నామములు నిత్యము త్రికాలముల యందు పారాయణము చేసినచో అశ్వమేధ యాగ ఫలము కలుగును. సర్గము, ప్రతి సర్గము, వంశము, మన్వంతరము, వంశాను చరితము అను ఈ అయిదు లక్షణములు పురాణమునకు ఉండును. ప్రశ్న చతుష్టయముతో గూడిన ఈ యుత్తమ పురాణమును వినుటచే కల్ప కోటి శతముల నుండి చేసిన పాపములు నశించును. బ్రహ్మ హత్యాది పంచ మహా పాపములే కాక ఇతరములగు అనేక పాపములు(గాలిచే తృణము ఎగిరి పోవునట్లుగా) తొలగి పోవును.
పుష్కర క్షేత్రములో దానము చేసిన ఫలము ఈ పురాణ శ్రవణముచే లభించును దీనిని సంపూర్ణముగా వినినచో సర్వ వేద పారాయణము కంటే అధిక ఫలములు కలుగును. ఈ పురాణం శ్రవణము చేయు వారికి బ్రహ్మదేవునితో సమానముగా పూజించ వలెను. గంధ, పుష్ప, వస్త్రాదులచే సన్మానము చేసి, బ్రాహ్మణ సమారాధన చేయ వలెను. రాజులు వారి శక్తి ననుసరించి గ్రామములు, వాహనములు ఇవ్వ వలెను. ఈ పురాణము సర్వ వేదార్ధ యుక్తమై ఉన్నది. ధర్మ శాస్త్రములకు నిలయమై యున్నది. దీనిని వినుట వలన సర్వార్ధములను పొందును. ఈ పురాణము వినిన పిమ్మట ధర్మార్ధ కామ మోక్షముల యొక్క సంపూర్ణ ఫలములను పొందుటకు వ్యాస పూజ చేయ వలెను. శ్రవణా నంతరము గురువునకు ఫల ప్రాప్తి కొఱకు స్వర్ణ, వస్త్ర, అలంకారములతో గూడిన గోవును దానము చేయ వలెను. ఇట్లు గురువును సంతోషింప చేయ వలెను.
పురాణము చెప్పు వారిని పూజింపక ఒక్క శ్లోకము విన్ననూ మానవుడు శ్రవణ ఫలమును పొందడు. పండితులు అట్టి వానికి ‘శాస్త్ర చోరుడు’ అని అందురు. దేవతలు అట్టి వారిని చూచి ప్రసన్నులు కారు. పితృ దేవతలు యొక్క అనుగ్రహము గూడ నట్టి వారికి కలుగదు. వారు పెట్టిన శ్రాద్ధములు గ్రహించరు. తీర్ధ స్నాన ఫలము లుండవు. సజ్జన సభలో శాస్త్ర చోరుని నింద చేయుదురు. బుద్ది మంతులైన వారు మార్కండేయ పురాణమును ఆశ్రద్దగా వినరాదు. సత్పురుషులు ఈ పురాణమును చదువు చుండగా ఎవరు హేళన చేయుదురో, అట్టి వారు ఏడు జన్మల వరకు మూగి వారుగా, మూర్ఖులుగా పుట్టుదురు. ఏడవది యగు ఈ మహా పురాణమును వినిన పిమ్మట ఎవరు పూజించెదరో, అట్టి వారు సర్వ పాపముల నుండి విముక్తు లగుదురు. వారి వంశమును పవిత్రము చేయుదురు.
మార్కండేయ మహా పురాణ శ్రవణముచే గొప్ప యోగ లాభమును పొందుదురు. ఈ విషయములో ఎంత మాత్రము సందేహము లేదు. అట్టి వారు విష్ణు సాయుజ్యమును పొందుదురు. విష్ణు లోకము నుండి చ్యుతుడై తిరిగి మానవ జన్మను పొందడు. ఈ పురాణము నాస్తికునకు, వృషలునకు, వేద నింద జేయు వానికి చెప్పరాదు. గురుద్వేషి, భగ్న వ్రతుడు, తల్లి దండ్రుల నిందించు వాడు, లేక త్యజించు వాడు, వేద శాస్త్రమును నిందించు వాడును అగు నట్టి వారికి చెప్పరాదు. మర్యాదా భంగము చేసిన వాడు, జ్ఞాతులను దూషించు వాడు నగు నట్టి వారందరికీ ప్రాణములు కంఠ గతము లైననూ చెప్ప రాదు. ఏ పురుషు డైననూ, లోభ, మోహ, భయములచే ఈ పురాణమును పఠించి గాని లేక చదివించిన గాని, అట్టి వాడు నిజముగా నరకమునకు బోవును.
ఈ మార్కండేయ మహా పురాణ మంతయు ధర్మమును స్వర్గాప వర్గముల నిచ్చును. ఈ పురాణమును విన్న వారికి, చెప్పిన వారికిని సర్వ మనోరథములు సిద్దించును. ఆధి వ్యాధుల వలన కలుగు దుఃఖములు ఎప్పుడునూ కలుగవు. బ్రహ్మ హత్యాది పాపముల నుండి విముక్త డగును. ఇందు సందియము లేదు. స్వజనులు, మిత్రులు, హితము చేయువారు అగుదురు. శత్రువు లుండరు, చొర బాధలు కలుగవు. ధనము లభించును, మృష్టాన్న భోజనము కల వాడగును. దుర్భిక్షములు కలుగవు. పరస్త్రీ, పరద్రవ్య పరహింసాది పాపములు తొలగి పోవును. ఓ ద్విజోత్తమా! అనేక పాపముల నుండి విముక్తు డగును బుద్ది, వృద్ది, స్మృతి, శాంతి, లక్ష్మీ, పుష్టి, తుష్టి, మొదలగునవి నిత్యము ఈ పురాణ శ్రవణముచే లభించును.
ఈ మార్కండేయ మహా పురాణమును సంపూర్ణముగా వినిన పిమ్మట మానవునకు దుఃఖించు అవసరము కలుగదు. ఈ పురాణమును చెప్పిన బ్రాహ్మణుడు కూడ దుఃఖమును పొందడు. శ్రోతలు, వక్తలు, యోగ, జ్ఞాన, విశుద్ధ సిద్దులతో స్వర్గాది లోకములకు పోవుదురు. ఇంద్రాది దేవతలతో కూడి స్వర్గమున సదా పూజించ బడుదురు. జ్ఞాన, విజ్ఞాన యుక్త మగు ఈ పురాణమును వినిన వారు అంత్య కాలమున విమానము నధిరోహించి స్వర్గమునకు పోవుదురు. సూక్ష్మ దర్షి, మహా బుద్దిమంతుడు నగు మార్కండేయ మహర్షి ఈ “మార్కండేయుడు పురాణము” యొక్క అక్షర సంఖ్యచే ప్రసిద్ధిని బొందించెను. ఆరువేల తొమ్మిది వందలు మరియు యెనుబది తొమ్మిది శ్లోకములు పదునొకండు శ్లోకములు (అనగా మొత్తము యేడు వేల శ్లోకములు మార్కండేయ పురాణం అను అక్షర సంఖ్యను యేడు అక్షరముల సంఖ్యా గల యేడు వేల శ్లోకములను ధీమంతు డగు మార్కండేయునిచే పూర్వము చెప్ప బడెను.)
పక్షి రూపులగు ముని కుమారులారా! మహాభారత మందు నాకు కలిగిన సందేహములను మిత్ర భావముతో నా సంశయములను పోగొట్టిరి. ఇట్టి ధర్మ సూక్ష్మములను ఎవరు చెప్ప గలరు. మీరందరు దీర్ఘా యుష్మంతులు, బుద్ది విశారదులు అగుదురు గాక. మీ యొక్క బుద్ది సాంఖ్య యోగ మందు స్థిరమైనది యగు గాక. మీ తండ్రి పెట్టిన శాపము వలన మీకు యెంత మాత్రము దుఃఖము లేకుండు గాక మహాముని ఇట్లు పలికి పిమ్మట పక్షి రూపులగు ముని కుమారులు చెప్పిన వచనములను తలంచు కొనుచు తన యాశ్రమమునకు బోయెను.
* మార్కండేయ పురాణము సర్వమూ సమాప్తము. శుభం *
Summary of chapter 134 of the Mārkandeya Mahā Purana is as follows:
Prince Dama attends the Svayaṃvara of Princess Sumanā, daughter of King Dashārṇa. Sumanā places the victory garland around Dama's neck, prompting jealous rival kings led by Vapushmat to launch an unrighteous attack, whom Dama valiantly defeats.