మార్కండేయ మహా పురాణము
37 - యోగసిద్ధి
ఆత్మ యొక్క దర్శనమై నపుడు యోగులకు ఏ విధమైన ఉపసర్గలన్నియు ఉత్పన్న మగునో వాటిని సంక్షిప్తముగా చెప్పెదను వినుము. ఆ సమయ మందు అనేక విధాలైన కోరికలు, క్రియలు మరియు మనస్సునకు సంబంధించిన నానా విధాల భ్రాంతిచే భోగాల ననుభవించ వలెనను కోరిక కలుగును. స్త్రీ, దానము, ఫలము, విద్యా, మాయ కూపము నందలి నీరు, ధనము, స్వర్గము, అమరత్వము, దేవేంద్రత్వము, నానా ప్రకారమగు రసాయనాలు, వాయు స్థానము లందు దూకుట, యజ్ఞము, జలము, మరియు అగ్ని ప్రవేశము, సమస్త శ్రాద్ధములు, దాన సమూహముల యొక్క ఫలములు మరియు నియమములు మొదలైన విషయము లందు యోగికి కోరికలు ఉత్పన్న మగును. ఆ కాలమందు అతడు ఉపవాసము పూర్తాది కర్మలు, దేవతార్చన, ఎప్పుడు ఎప్పుడు ఆయా కర్మలను చేయవలెనను కోరిక కలుగునో యోగి అప్పుడు యత్న సహితముగా ఆయా విషయముల నుండి చిత్తమును మరల్ప వలెను.
మనస్సును బ్రహ్మ యందుంచినచో విషయముల నుండి విముక్తు డగును. వీటిని జయించినను మాటి మాటికి ఆదేశించు చుండును. ఈ సమస్త ఉపసర్గలను జయించిన పిమ్మట సాత్త్విక, రాజస, తామస భేదముల నుండి పరంపరా గతముగా విఘ్నములు వచ్చి యోగిని ఆక్రమించును. వానిలో ప్రాతిభ, శ్రావణ, దైవ, శ్రమ మరియు ఆవర్త అను ఈ ఐదు విధములైన ఉపసర్గలు యోగిని యోగ విఘ్నము కలిగించుట కొరకు భయంకర రూపముతో ఆవిర్భవించును. దేని వలన నిఖిల వేదార్థమగు సమస్త కావ్యములు , శాస్త్రార్థములగు విద్యలు మరియు శిల్పములు యోగి యొక్క చిత్తము నందు భాసిల్లునో వాటిని “ప్రతిభ” అందురు. దేని వలన సంపూర్ణ శబ్దము యొక్క అర్థము తెలియునో మరియు సహస్ర సహస్ర యోజనాల దూరము యొక్క శబ్దము కూడ వినబడునో దానిని “శ్రావణము” అని అందురు. దేని ద్వారా విగ్రహ రూపుడైన దేవతలతో సమానముగా యోగి ఉన్మత్తుని వలె ఎనిమిది దిక్కులను దర్శించునో పండితులు దానిని “దైవోపసర్గ” మని అందురు. దేని ద్వారా యోగి యొక్క చిత్తము సంపూర్ణ ఆచారాది శ్రమలతో మరియు మనస్సు యొక్క దోషముల కారణముచే నిరాలంబన భావనతో శ్రమ పడునో, దానిని “శ్రమ” అని చెప్పెదరు. దేని ప్రభావమున జలా వర్తములతో సమానముగా జ్ఞానా వర్తము వ్యాకులమగునో చిత్తమును నాశనము జేయునో దానిని “ఆవర్తోప సర్గము” అని చెప్పుదురు. యోగులు ఈ సమస్త ఉప సర్గముల ప్రభావముచే దేవ యోనులై ఈ మహా ఘోరములైన పంచోప సర్గలచే యోగ భ్రష్టులై మాటి మాటికి సంసార చక్రమందు తిరుగు తుందురు. ఈ కారణముచే యోగి మనోమయ రూపమగు తెల్లని కంబళిని కప్పుకొని (శరీర మండల మందు గురువు యొక్క జ్ఞానమును అవలోకనము చేయ వలెను. బుద్దిమంతులైన వారు జ్ఞాన పూర్వకముగా యోగము చేయవలెనని ఎరుంగ వలెను).
మనస్సు నందు ఒక్క పర బ్రహ్మను మాత్రమే ధ్యానించుచు చింతన చేయుట యోగి యొక్క కర్తవ్యము. యోగ పురుషుడు జితేంద్రియుడై లఘు భోజుడై మరియు యోగ యుక్తుడై భూరాది ఏడు ప్రకారములైన సూక్ష్మములగు వాటిని మస్తిష్కము నందు ధారణ చేసినచో అతనికి దాని సూక్ష్మము తెలియును. అతడు ఈ విధముగా ఆత్మ చింతన చేయుట వలన ధరిత్రి యందలి బంధనములను తెంచుకొనుటకు సమర్థుడగును. ఈ విధముగా జలము నందు సూక్ష్మ రసము, తేజమందు రూపము, వాయువు నందు స్పర్శ మరియు ఆకాశ మందు సూక్ష్మ ప్రవృత్తి మరియు శబ్ద ధారణ పూర్వకముగా పరిత్యజించ వలెను. ఎప్పుడు మనస్సుచే సమస్త భూతముల యొక్క మనస్సు నందు ప్రవిష్టుడగునో అప్పుడు సూక్ష్మమగు మనస్సు ఉత్పన్న మగును.
ఈ విధముగా యోగ పురుషుడు సమస్త భూతముల యొక్క బుద్ధి యందు ప్రవిష్టుడై అత్యుత్తమ సూక్ష్మ బుద్ధి యొక్క స్వరూప లాభమును పొంది దానిని పరిత్యజించును. ఓ అలర్కా! ఏ యోగి సప్త ప్రకారములైన సూక్ష్మ భావాలను చక్కగా తెలుసుకొని పరిత్యజించునో, వాటిని తిరిగి జన్మలో గ్రహించ వలసిన పని లేదు. ఆత్మవంతుడైన పురుషుడు ఈ సప్త ప్రకారములైన సూక్ష్మ తత్త్వాలను మాటి మాటికి దృష్టి యందు గోచరింప జేసుకొనుచు మాటి మాటికి సిద్ధి గ్రహణ మైన పిదప విసర్జన చేయుచు పరమ గతిని పొందును. మహీపతి! అతడు ఏ ఏ భూతము లందు అనురాగము కలిగి యుండునో ఆయా భూతము లందు ఆసక్తి పరుడై వినాశనమును పొందును. అందువలన ఏ దేహి పరస్పర సంసక్తమగు భూత గణాలను తెలుసుకొని పరిత్యజించునో ఆ దేహి పరమ పద లాభమును పొందును.
ఓ పార్థివా! ఈ సప్త విధుల సూక్ష్మములను అను సంధానము చేసి భూతాదు లందు విగత రాగు లైనప్పుడే సద్భావజ్ఞ పురుషుడై ముక్తి లాభమును పొందును. ఓ రాజా! గంధాదు లందు ఆసక్తుడైనచో నష్ట పడవలసి వచ్చును. మరియు అతనికి తిరిగి సంసార చక్రమందు పడి తిరుగ వలసి వచ్చును. ఓ నరేశ్వరా! యోగ పురుషుడు ఈ సప్త ప్రకారముల ధారణను అతిక్రమణ చేసి పోవుటకు ఇచ్చ కలిగినప్పుడు ఆయా సూక్షములగు భూతములందు లయమును పొందును. మరియు దేవతలు, దానవులు, గంధర్వులు, పన్నగములు, రాక్షసులు వీరి శరీర మందు విలీనమై పోవుదురు. కాని ఎవని యందును ఆసక్తి ఉండదు. అతడు అణిమా, లఘిమా, మహిమా, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము మరియు కామావసాయిత్వము అను ఈ అష్టవిధ నిర్వాణ ప్రద, ఐశ్వరిక గుణాలకు అధికారి అగును. దేని ద్వారా సూక్ష్మము నుండి సూక్ష్మ తరమగునో దాని పేరు “అణిమ”, దేని ద్వారా సమస్త కోరికలు ప్రాప్తించునో (అనగా అన్ని కార్యములందు శీఘ్రమే ఉత్పన్నత కలుగుట) దానిని “లఘిమ” అని అందురు. దేని ద్వారా వ్యాపక శక్తి ఉత్పన్నమగునోదాని పేరు “ప్రాకామ్యము” దేని ప్రభావముచే ఈశ్వర రూపమగునో దానిని “ఈశిత్వ”మని అందురు. మరియు దేని ప్రభావముచే అన్ని వశీభూతము లగునో దాని పేరు “వశిత్వము” ఈ వశిత్వమే యోగి జనులకు ఏడవ గుణమని చెప్పబడెను. దేని ద్వారా తన ఇచ్చాను సారముగా ఇక్కడకు అక్కడకు గమనము చేయునో మరియు అన్ని కార్య సాధనములు కలుగునో దాని పేరు “కామవసాయితా” ఈ ఎనిమిది ప్రకారముల గుణ ప్రభావముచే ఈశ్వరుని సమస్త కార్యములను చేయుటలో సమర్థత కలుగును. ఓ రాజా! ఈ అన్ని గుణములు ముక్తికి సూచనలు అయి ఉన్నవి. అనగా ఈ అన్ని గుణములు ప్రకాశించి నప్పుడే యోగి వెంటనే ముక్తి లాభము పొందునని తెలుసుకొన వలెను. నిర్వాణ లాభము కలుగుటకు సమయము ఆసన్న మైనదని, జన్మ గ్రహణము పొందవలసి రాదని, బుద్ధిని పొందవలసి రాదని మరియు వినాశనము కలుగదని గ్రహించ వలెను.
క్షయమును పొందుట, దాని గురించి ఏదేని పరిణామము పొందుట, తిరిగి ఎప్పుడు భూరాది భూత వర్గముల నుండి చిన్న, భిన్న, క్లిన్న, దగ్ధ, శుష్కములు మొదలైనవి కూడ ఉండవు. శబ్దాదులన్ని దానిని అపహరించుటలో సమర్థత ఉండదు. శబ్దాది విషయముల సాంగత్యము తిరిగి దానికి ఏ సంబంధము ఉండదు. మరియు శబ్దాది భోక్త కూడా ఉండడు. మరియు వాని సాంగత్యముతో దాని స్పర్శ తిరిగి ఏమీ ఉండదు. మహీపతీ! ఏవిధముగా ఒక స్వర్ణ ఖండమును చెడు ద్రవ్యముతో సమానముగా వెలుపల దగ్ధము చేసి దోష రహితముగా చేసి నప్పుడు మరియొక స్వర్ణ ఖండముతో ఏకత్వము పొందునో, ఏ విధముగా గాని భేదము కనిపించదో, ఆ ప్రకారముగా యోగాగ్ని ద్వారా రాగ ద్వేషాది రూప దోషాలను భస్మము చేయుట వలన యోగి కూడ బ్రహ్మతో ఐక్యమగును. ఓ రాజా! ఏవిధముగా అగ్ని యందు అగ్నిని పడ వేయుట వలన సమానత్వము ప్రాప్తినచునో మరియ తాదాత్మ్యము, తన్మయము అగుచున్నదో మరియు దాని భేదము స్థిరముగా చేయబడదో ఈ విధముగా దోషములు దగ్ధము అయినప్పుడు యోగి బ్రహ్మ సాంగత్యముచే ఒకసారి సంయుక్తు డగుచో అప్పుడు తిరిగి అతనికి ఎప్పుడును వేరు భావమును పొందవలసి రాదు. జలము ఏ విధముగా నీటి యందు పడి సమాన భావమూ పొందు చున్నదో, యోగి పురుషుల యొక్క ఆత్మ కూడ అట్లే పరమాత్మ యందు విలీనమయి సామ్యతను పొందు చున్నది.
Summary of chapter 36 of the Mārkandeya Mahā Purana is as follows:
Having attained transcendent realization through Dattātreya's grace, Alarka returns to his captors and cheerfully surrenders his remaining kingdom to Subāhu. Subāhu joyfully reveals that the war was merely a loving spiritual divine play organized to break Alarka's worldly attachment. Subāhu then transfers the kingdom to the King of Kānshī and both brothers retire into deep forest meditation.