మార్కండేయ మహా పురాణము
101 - దివాకర స్తుతి
బ్రహ్మ జగత్తును సృష్టించి పూర్వము వలె వర్ణ ఆశ్రమాలను పర్వత, సముద్రాలను, సమస్త ద్వీపముల విభాగములను కల్పించెను. కమల యోనియగు బ్రహ్మ దేవ, దైత్య, ఉరగ గణాల రూపాలు మరియు వాని స్థానములు, దేవతలు మొదలుకొని అందరి స్థానములను పూర్వము వలె నిర్దేశించెను. “మరీచి” అను పేరుతో విఖ్యాతి చెందిన బ్రహ్మ దేవుని పుత్రునకు “కశ్యపు”డను గొప్ప పుత్రుడు కలిగెను. అతడే కాష్యపుడని పేరుతో ప్రసిద్ధి చెందెను. హే బ్రహ్మన్! దక్షుని యొక్క పదమూడు మంది కన్యలు కశ్యపుని భార్యలైరి. వారి ద్వారా ఆయనకు దేవతలు, దైత్యులు, ఉరగములు మొదలగు అనేక మంది పుత్రులు కలిగిరి. అందు “అదితి” అను భార్య త్రిభువనేశ్వరులగు దేవతలను కనెను. “దితి” అను నామె దైత్యులను మరియు “దనువు” అను నామె మహా విక్రములగు, ఉగ్ర దానవులను ప్రసవించెను.
‘వినత’ గరుడ, అరుణులను, ‘ఖస’ యక్ష, రాక్షసులను, ‘కద్రువ’ నాగులను, ‘ముని’ గంధర్వులను కనెను. ఓ ద్విజుడా! “క్రోధ’ కుల్య గణాలను, ‘రిష్ట’ అప్సరసలను, “ఇరా” ఐరావతాది ఏనుగులను, ప్రసవించెను. “తామర” శ్యేని మొదలగు కన్యలను ఉత్పన్నము చేసెను. ఆ కన్యలే శ్యేన, భాస, శుక మొదలగు ఖేచర (పక్షి) గణాలను ఉత్పన్నము చేసెను. “ఇలా” అను భార్య వలన వృక్ష గణాలు, “ప్రధ” అను భార్య వలన పతంగ గణాలు ఉత్పన్న మైనవి. ఓ మునీ! అదితి గర్భము నుండి కశ్యపునకు ఏ సంతానము కలిగినదో, వారికి పుత్రా, పౌత్ర, దౌహిత్రులు కలిగిరి. ఈ విధముగా వారి సంతానముచే ప్రపంచ మంతయు నిండి పోయెను.
ఓ మునీ! కశ్యపుని పుత్రులలో దేవతా గణాలు ప్రధానములు. వారు సాత్త్విక, రాజస, తామసులను మూడు గణాలు. బ్రహ్మజ్ఞ శ్రేష్ఠుడు, పరమేష్టి, ప్రజాపతి యగు బ్రహ్మ ఆ దేవతలను త్రిభువనేశ్వరులుగా, యజ్ఞ భుక్కులుగా నియమించెను. కాని సవతి తల్లి పుత్రులగు దైత్యులు, దానవులు, రాక్షసులు ఏకమై శత్రుత్వమును పెంచుకొని దేవతలను భాదింప సాగిరి. ఈ కారణముచే దేవతలలో దివ్య సహస్ర వత్సరముల పర్యంతము దారుణమగు యుద్ధము జరిగెను. ఈ యుద్ధమున దేవతలు పరాజితులైరి. ఓ విప్రా! బలశాలురాగు దైత్య, దానవులు విజయము నొందిరి. ఓ మునిసత్తమా! పిమ్మట దైత్య దానవులచే త్రిభువనములు అపహరింప బడుట, మరియు పుత్రులు పరాజితులగుట, యజ్ఞ భాగముల నుండి వంచింప బడుటయు చూచి అదితి దుఃఖముతో అత్యంత పీడితు రాలై సూర్య దేవుని ఆరాధించుటకు పరమ యత్నము చేసెను.
ఆమె ఏకాగ్ర చిత్తముతో నియమిత ఆహారముతో శ్రేష్ఠ నియమ పరాయణురాలై గగన మందున్న తేజో రాశి స్వరూపుడగు దివాకరుని స్తుతింప సాగెను.
ఓ శాశ్వతుడా! నీవు సుందర సూక్ష్మ సావర్ణిక తనువును ధరించు వాడవు. నీవు జ్యోతి స్వరూపుడవు. జ్యోతిష్క గణాలలో నీవే ప్రథముడవు. జ్యోతికి ఆధార స్వరూపుడవగు నీకు నమస్కారము. ఓ గోపతీ! జగత్తునకు ఉపకారము చేయుటకై జలమును గ్రహించు సమయమున తీవ్రతను దాల్చు నట్టి నీ రూపమునకు నమస్కరించు చున్నాను. నీవు ఎనిమిది మాసముల కాలము ఇందుమయ రస గ్రహణమునకు ఎట్టి అతి తీవ్రమగు రూపమును పొందుదువో అట్టి మూర్తికి నమస్కరించు చున్నాను.
ఓ భగవానుడా! ఆ సమస్త రసమును వర్షణార్థము పరిత్యజించు సమయమున నీవు తృప్తి కారిణి యగు మేఘ రూపమును గ్రహించు చున్నావు. అట్టి నీ యొక్క మేఘ మూర్తికి నమస్కరించు చున్నాను. జలమును వర్షించుటచే ఉత్పన్నమైన అనేక ఔషధులను పండించుటకై నీవు ఎట్టి స్వరూపమును పొందు చున్నావో, అట్టి భాస్కర మూర్తికి నమస్కరించు చున్నాను. ఓ తరణీ! హేమంత కాలమందు సస్య పోషణకై నీవు ఎట్టి హిమ వర్షణాదులచే శీతల స్వరూపమును పొందు చున్నావో, అట్టి నీ రూపమునకు నమస్కరించు చున్నాను. ఓ రవీ! వసంత ఋతువు నందు నీ యొక్క ఎట్టి రూపము అతి తీవ్రత మరియు శీతలము లేనిదై యుండునో, సౌమ్యుడవగు ఓ దేవా! అట్టి నీ మూర్తికి నమస్కరించు చున్నాను. అశేష దేవతలను మరియు పితరులను తృప్తులను చేయు నట్టిది, పంటలను పండించునదియు నగు నీ రూపమునకు నమస్కరించు చున్నాను.
సమస్త గుల్మలతల యొక్క జీవన కారణము నగు నీ ఈ రూపము అమృతమయ మగుటచే దేవతలు, పితరులు పానము చేయుదురో, అట్టి సోమ రూపమునకు నమస్కరించు చున్నాను. అగ్ని, సోమ యను రెండు రూపములు మిళితమగుటచే నీ యొక్క ఏ విశ్వమయ రూపము సంభవించెనో, ఆ గుణాత్మునకు నమస్కరించు చున్నాను. ఓ విభావసూ! ఋక్, యజుః, సామములను ఈ మూడు వేదములు కలియుటచే నీ యొక్క ఏ రూపము “త్రయీ” అను పేరుతో ఈ విశ్వ మందు వెలుగు చున్నదో, అట్టి నీ రూపమునకు నమస్కరించు చున్నాను. అంతియే గాక ఎట్టి రూపమును శ్రేష్ఠము, సూక్ష్మము, విమలము మరియు ఓంకారము అని చెప్ప బడినదో, అట్టి నీ యొక్క నిత్య రూపమునకు నమస్కరించు చున్నాను.
ఓ మునీ! ఆ అదితీ దేవి ఈ విధముగా నియమ యుక్తముగా నిరాహారురాలై వివస్వానుడగు సూర్యునారాధించు ఇచ్చ గలదై పగలు రాత్రి ఇట్లు చక్కగా స్తుతింప సాగెను.
ఓ ద్విజోత్తమా! అనంతరం చాలా కాలము గడచినా పిమ్మట సూర్య భగవానుడు ఆకాశము నందే ఆ దాక్షాయణికి దృష్టి గోచర మయ్యెను. దీప్తి శాలియగు అంశు మాలలచే ఆకాశము నందు ప్రత్యక్షమైన తేజోరాశి స్వరూపుడగు రవిని ధరాతలమునకు వచ్చు చుండుట అదితి చూసెను. అతనిని ఈ విధముగా చూసినదై ఆ దేవి అత్యధిక భయమును పొందెను. మరియు ఇట్లు పలుకుచున్నది. ఓ గోపతీ! నా యందు ప్రసన్నుడ వగుము. నేను నిన్ను చూడ లేకున్నాను. పూర్వము నిరాహారురాలనై ఆకాశ మందు స్థితుడవై యున్న నిన్ను ఏ విధముగా తాపమును ప్రసాదించు చుండగా చూచితినో, పిమ్మట ఇప్పుడు ఈ భూతల మందు అదే విధముగానే తేజ స్సమూహము యొక్క మూర్తిని చూడగోరు తున్నాను. ఓ దివాకరా! నాపై ప్రసన్నత చూపుము. అందువలన నేను నీ యొక్క ప్రకృతి రూపమును చూచెదను. ఓ విభూ! నీవు భక్తులపై కృపజూపు వాడవు. నేను నీ భక్తురాలను. నా పుత్రులను రక్షింపుము. నీవు బ్రహ్మ రూపముతో ఈ విశ్వమును సృష్టించు చున్నావు. నీవు స్థితి యందు ప్రవృత్తుడవై పాలించు చుందువు. మరియు ప్రళయ కాలమందు అఖిల తత్త్వమును నీ యందు లయమును పొందు చున్నది. అందు వలన నీవు లేక సర్వ లోకములకు గతి లేదు.
నీవే బ్రహ్మవు. నీవే హరివి. నీవే అజుడవు. మహాదేవుడవు. నీవే ఇంద్రుడవు. ధనేశ్వరుడగు కుభేరుడు, యముడు, వరుణుడు, సమీరుడవు, నీవే సోమ, అగ్ని, గగన, మహీధర, సముద్రులును నీవే. సంపూర్ణ తేజః పదార్థముల యొక్క సర్వ స్వరూపుడవు నీవే. అటువంటి నిన్ను ఏమని స్తుతించెదను? ఓ యజ్ఞేశా! ఆత్మ కర్తానురక్తులగు ద్విజ గణాలు వివిధ ఛందోబద్ధ వాక్యాదులచే స్తుతించుచూ నిన్ను పూజించు చుందురు. సంయత చిత్తులగు యోగి జనులు నిన్ను ధ్యానించుచు యోగ మూర్తులై పరమ పదమును పొందు చున్నారు. విశ్వమునకు తాపము నిచ్చు వాడవు నీవే. విశ్వమును పక్వ రక్షిత, భస్మ కిరణములచే నీవు ప్రకాశింప చేయు చుందువు. మరియు జల గర్భము వంటి కిరణ సమూహములచే ఆహ్లాదింప చేయుచూ తిరిగి ఉత్పన్నము చేయు చున్నావు. దేవతలు, మనుష్యులు కూడా నీకే నమస్కరింతురు. పాపకర్మ కారులు స్థిర భావన చేసి నప్పటికీ నిన్ను పొంద లేరు.
Summary of chapter 101 of the Mārkandeya Mahā Purana is as follows:
Mārkaṇḍeya initiates the detailed genealogical accounts of the glorious Solar Dynasty, Surya Vamsha, descending from Sūryadeva. He explains that contemplating these royal lineages purifies sins, inspires moral rectitude, and connects human history with divine cosmic order.