మార్కండేయ మహా పురాణము
123 - అవిక్షి చ్చరితము
ఒకనాడు రాజ పుత్రుడు వనము నందు మృగ, వరాహములను కోరలు గల శార్దూల, సింహాది జంతువులను వేటాడు చుండెను. ఆ సమయమున హఠాత్తుగా దుఃఖించు చున్న ఒక స్త్రీ యొక్క కంఠము నుండి “రక్షింపుడు” “రక్షింపుడు “ అని భయముతో డగ్గుత్తికతో బిగ్గరగా అక్రోశించుచున్న శబ్దమును వినెను. ఆ ధ్వని వినిన వెంటనే రాజపుత్రుడు “భయము లేదు” “భయము లేదు” అని వణుకుచు ఆ శబ్దము విన వచ్చిన ప్రదేశమునకు వేగముగా గుఱ్ఱమును పరుగెత్తించెను. అనంతరము దను పుత్రుడగు దృఢ కేశునిచే పట్టుకొన బడియున్న ఆ “మానిని” నిర్జన వనము నందు ఈ విధముగా విలపించెను. నేను కరంధముని పుత్రుడు బుద్ధిమంతుడు పృథ్వీశ్వరుడు నగు అవీక్షితుని భార్యను. ఈ దుర్మార్గుడు నన్ను ఈ వనములో అపహరించు చున్నాడు.
ఎవని ఎదుట సమస్త రాజులు , గుహ్యకులు గంధర్వులు గూడ నిలువలేరో, అట్టి వాని భార్యనై యుండియు అపహరింప బడు చున్నాను. ఎవని కోపము మృత్యువుతో సమానమో, పరాక్రమము ఇంద్రునితో సమానమో, అట్టివాడగు కరంధముని పుత్రుని భార్యను. ఈతడు నన్ను అపహరించు చున్నాడు.
చేతి యందు ధనుస్సు ధరించిన రాజ పుత్రుడు ఈ మాటలు విని ఇట్లు యోచింప సాగెను. “ఈ వనములో నా భార్యయా? ఏమి విచిత్రము? ఇది నిస్సందేహముగా వనము నందు సంచరించు రాక్షసుల మాయయే. ఏమయిన గాని సమీపమునకు బోయినచో విషయ మంతయు తెలియును.”
అటు పిమ్మట రాజ పుత్రుడు వెంటనే అచటకు చేరుకొని ఆ వనములో సమస్త ఆభరణములచే అలంకరింప బడినదియు, అత్యంత మనోహరియు అగు ఒక కన్యను చూచెను.
చేతి యందు దండమును ధరించిన దానవుడగు ధృడకేశుని చేపట్టు కొనబడినదై “రక్షింపుము, రక్షింపుము” అని మాటి మాటికి పలుకుచు రోదించు చున్న ఆమెను చూసెను. అవిక్షితుడు ఆ కన్యతో భయము లేదు అని పలికి దానవునితో ఇట్లనెను. నీకు మృత్యువు అత్యంత సమీపమున ఉన్నది. కరంధముని యొక్క పృథ్వీ పాలన సమయమున దుఃఖమును పొందు వారెవరు ఉందురు? ఎట్టి కరంధమ రాజు యొక్క ప్రతాపమునకు భూమి యందలి రాజు లందరు తలలు వంచుకొని యుందురో, అట్టి వాని శాసన కాలమున ఏ దుష్ట మానవుడు జీవింప గలడు? అని ప్రచండ ధనుర్ధారియై వచ్చుచున్న ఆ రాకుమారుని చూచి ఆ కృశాంగి మాటి మాటికి ఇట్లు పలుక సాగెను. “నన్ను రక్షింపుడు. ఇతడు నన్ను అపహరించు చున్నాడు. నేను కరంధ మహారాజు యొక్క పుత్రుడగు అవీక్షుని భార్యను. అందువలన నాథుడుండియు కూడ అనాథ వాలే ఈ వనము నందు దుష్టునిచే హరింపబడు చున్నాను.”
ఆ కన్య పలుకులు విని రాజ పుత్రుడు ఇట్లు ఆలోచింప సాగెను. ఈ కన్య నాకు భార్యయా? నా తండ్రి గారికి కోడలా ? ఎట్లు అగును?
ఏమయినను ముందు ఈ కన్యను విడిపించెదను. అటు పిమ్మట అన్ని విషయములను తెలుసుకొనెదను. ఎందు వలన యనగా ఆర్త జనులను రక్షించుటకు క్షత్రియులు శస్త్రములను ధరింతురు. అని పలుకుచూ తరువాత మహా వీరుడగు రాకుమారుడు క్రోధితుడై దుర్మతియగు దానవునితో ఇట్లు పలికెను. “జీవింప వలెనను కోరిక యున్నచో, ఈమెను వదిలి పారి పొమ్ము. లేనిచో తప్పక నీకు మృత్యువు సంప్రాప్తించును. దానవుడు రాజ పుత్రుని మాటలు విని కన్యను వదిలి దండమును చేతిలో ధరించి అతని పైకి యురికెను. అప్పుడు అతడు బాణములను వర్షించి అతనిని కప్పి వేసెను. దానవుడు రాజ పుత్రుని బాణములను నిరోధించి అత్యంత అహంకారముతో రాజ పుత్రునిపై వందల కొలది ముండ్లు గల దండమును విసిరెను. కాని రాజ పుత్రుడు మధ్య లోనే దానిని బాణములచే త్రుంచి వేసెను. అప్పుడు దానవుడు సమీపమున నున్న ఒక పెద్ద వృక్షమును తీసికొని యుద్ద క్షేత్రమున ప్రవేశించెను.
బాణములను వర్షించు చున్న ఆ రాజ పుత్రునిపై దానిని విసిరెను. కాని రాజ పుత్రుడు దానిని కూడ ధనస్సుచే వదులు చున్న బాణములచే తిల పరిమాణములుగా ఖండ ఖండములు చేసెను. అటు పిమ్మట దానవుడు రాజ పుత్రునిపై ఒక శిలను వేయ సాగెను. అతడు హస్త లాఘవముచే దానిని కూడ వ్యర్థ పరచి భూమిపై పడ వేసెను. ఈ విధముగా దానవుడు క్రోధముతో రాజ పుత్రునిపై ఏమేమి విసురు చున్నాడో, వాని నన్నింటిని అతడు బాణములచే మధ్యలోనే త్రుంచి వేయు చుండెను. ఈ విధముగా దానవుడు దండము, సంపూర్ణ అస్త్ర శస్త్రములన్నియు తునకలు కాగానే ఆ దానవుడు కృద్ధుడై పిడికిలి బిగించి రాజ పుత్రుని పైకి ఉరికెను. కాని అతడట్లు వచ్చు చుండగానే కరంధముని కుమారుడు వేతస పాత్ర బాణముచే ఆతని శిరస్సును త్రుంచి భూమిపై బడ వేసెను.
ఇట్లు దుష్టుడగు దానవుని చంపగానే దేవత లందరూ “బాగు, బాగు” అని పలుక సాగిరి. పిమ్మట దేవతలు వారము కోరుకొను మనిరి. అప్పుడు రాజ పుత్రుడు తండ్రి యొక్క ప్రియ కార్యమును సఫలము చేయుటకై మహా వీర్యవంతుడగు పుత్రుని యిమ్మని కోరెను.
ఓ పాపరహితుడా! నీవు ఎవరిని రక్షించితివో ఈ కన్య యొక్క గర్భము నందే నీకు బలవంతుడగు చక్రవర్తి అగు పుత్రుడు ఉదయించును.
నేను తండ్రి ఎదుట సత్య పాశమునకు బద్దుడనై పుత్రుని కోరు చున్నాను. కాని పూర్వము యుద్ధ స్థలమున ఓడిపోయి నందున భార్యను పరిగ్రహింప వలెనను కోరికను పరిత్యజించి యుంటిని. నేను విశాల రాజ పుత్రికను పరిత్యజించగానే ఆ కన్య కూడ అప్పటి నుండి నా కారణముననే నన్ను దక్క అన్య పురుషుని సంగమును పరిత్యజించెను.
ఇప్పుడు విశాల రాజ కన్యను వదిలి నేను ఏ విధముగా అన్య స్త్రీని గ్రహింతును.
“ఎవరిని నీవు సదా ప్రశంసించు చున్నావో, ఆమెయే ఈమె నీ భార్య. ఈ సుందరియే విశాల రాజు యొక్క కుమార్తె. నీ కొరకు తపస్సు నవలంభించిన ఆ రాకుమారి ఈమెయే. ఈమె గర్భము నుండి నీకు సప్త ద్వీప ప్రసాధకుడు, సహస్ర సహస్ర యజ్ఞకర్త , చక్రవర్తి వీరుడునగు పుత్రుడు జన్మించును.”
దేవతలు కరంధముని పుత్రునితో నిట్లు పలికి అంతర్ధాన మయిరి. అప్పుడు రాజ పుత్రుడు భార్యతో నిట్లనెను. ఓ వీరురాలా! ఈ సంఘటన ఎట్లు సంప్రాప్తించినది? దానిని చెప్పుము.
ఎప్పుడయితే మీరు నన్ను వదిలి వెల్లితిరో, అప్పుడు నేను అత్యంత దుఃఖముతో బంధువులను త్యజించి ఈ వనము నందు ప్రవేశించితిని.
ఓ వీరా! ఇక్కడ తపస్సు చేయుటచే దేహ మత్యంత క్షీణ మయ్యెను. నేను ఒక దినమున దేహ త్యాగము చేయవలె ననుకొంటిని. అదే సమయమున ఒక దేవ దూత వచ్చి నన్ను నివారించెను. అతడిట్లు చెప్పెను. నీకు బలవంతుడు చక్రవర్తి యగు పుత్రుడు ఉదయించును. ఆపుత్రుడు అసురులను చంపును. మరియు దేవతలా ప్రీతి బడయును. అందువలన దేవతల ఆజ్ఞ ప్రకారము ప్రాణ త్యాగమును చేయవద్దు.” ఇట్లు నివారింప బడిన దానినై నేను అప్పుడు మిమ్ములను కలియుదునను ఆశచే జీవన త్యాగమును చేయలేదు. ఒకనాడు నేను గంగా నదికి వెళ్లి అచ్చట స్నానము చేయుటకు నీటి లోనికి దిగితిని. అదే సమయమున ఒక వృద్ద నాగ రాజు నన్ను లాగు కొనుచు రసాతలమునకు తీసుకొని పోయెను. ఎప్పుడయితే నేను రసాతలమునకు చేరు కొంటినో, అప్పుడు వేల వేల నాగులు, నాగ పత్నులు మరియు నాగ కుమారులు నా ఎదుటకు వచ్చి నిలచిరి.
కొందరు నన్ను పూజింపసాగిరి.అటు పిమ్మట నాగులు, నాగ పత్నులు వినయముతో నన్ను ఇట్లు ప్రార్థించిరి. “మీరు మా అందరిపై దయ జూపవలెను. మీ పుత్రుని యెడల ఒక వేళ మేము అపరాథుల మైనచో, అతడు మమ్ములను వధించుటకు ప్రయత్నించును. అప్పుడు మీరు అతనిని నివారించ వలెను” వాయు భోజులగు నాగ గణాలు ఎప్పుడయితే మీ పుత్రునికి అపరాధము చేసినను మీరు ఈ నిమిత్తము అతనిని నివారింప వలెను. అనుగ్రహించి ఈ విషయము నంగీకరింపుడు.” అని ప్రార్థించెనో, అప్పుడు నేను ‘అట్లే అగు గాక’ అని అంగీకరించితిని. అప్పుడు నన్ను దివ్యములగు పాతాళ భూషణములచే మనోహర గంధ వస్త్రాదులచే మరియు పుష్పాదులచే అలంకరించిరి. ఆ వృద్ధ నాగరాజు మరల భూలోకమునకు తీసుకొని వచ్చి తన లోకమునకు బోయెను. అప్పుడు నేను పూర్వము వాలే కాంతి యుక్త రూపవతి నయితిని.
ఇట్లు సర్వ భూషణాలంకృతురాలైన రూపవతినై యున్న నన్ను చూచి దుర్మార్గుడగు దృఢకేశుడు అపహరింప వలెనను కోరికచే పట్టుకొని తీసుకొని పోవు చుండెను. ఓ రాజపుత్రా! నేను మీ యొక్క బాహు బలముచే ఈ సమయమున విముక్తురాల నైతిని. అందువలన ఓ మహాబాహూ! అనుగ్రహించి నన్ను స్వీకరింపుము. నేను సత్యము చెప్పు చున్నాను. భూమియందు మీతో సమానుడగు గుణవంతుడగు రాజు లేడు.
Summary of chapter 123 of the Mārkandeya Mahā Purana is as follows:
Prince Avīkshita attends the Svayaṃvara of Princess Vaishālinī. When rival kings attempted to abduct the princess by force, Avīkshita challenged them single-handedly in battle, defeating numerous royal suitors through his skill.