మార్కండేయ మహా పురాణము
118 - కరంధమ చరితము
అనంతరము ఖనీనేత్ర మహారాజు పాప నాశిని యగు గోమతీ తీరమునకు బోయి ఇంద్రియ నియమము గలిగి దేవేంద్రుని స్తుతించ సాగెను. ఓ మహామునీ! ఎప్పుడు మహీపతి మనో వక్కాయముల నియమించి పుత్రుని గోరి ఇంద్రుని స్తుతించెనో అప్పుడు సురేశ్వరుడగు దేవేంద్రుడు అతని స్తుతిచే సంతోషించి ఆతనితో నిట్లు బలికెను. ఓ రాజా! నీ యొక్క తపస్సు, భక్తి, స్తోత్ర ఉచ్చారణల వలన నేను అత్యంతము సంతోషించితిని. గాన వరము కోరు కొనుము.
నేను అపుత్రకుడను సమస్త శస్త్ర ధారులలో శ్రేష్ఠుడు, ప్రతిబంధ రహితుడు ఐశ్వర్య వంతుడు. ధర్మజ్ఞుడు, ధర్మచారి, ధర్మవేత్త యగు పుత్రుడు కలుగు గాక.
రాజు ప్రార్ధన విని ఇంద్రుడు “అటులే యగు గాక” యని వరమిచ్చెను. అప్పుడు రాజు ప్రజా పాలనకై తిరిగి తన పురమునకు వచ్చెను. ఆ రాజు యజ్ఞా నుష్టానము, ప్రజా పాలనము చేయుచుండ ఇంద్రుని యను గ్రహముచే ఒక కుమారుడు జన్మించెను. రాజు ఆ కుమారునికి “బలాశ్వుడు” అని పేరు బెట్టెను. మఱియు వానికి సంపూర్ణ అస్త్ర విద్యలను గ్రహింప జేసెను. విప్రా! బలాశ్వుడు తండ్రి మరణించిన పిమ్మట సామ్రాజ్యమునకు రాజు అయి, భూమి యందలి సమస్త రాజులను తన వశము చేసి కొనెను. మరియు ధర్మ పూర్వకముగా పన్నును స్వీకరించెను. ప్రజా పాలనము చక్కగా చేయు చుండెను.
అనంతరము సమస్త రాజులు, దుర్మదులగు జ్ఞాతి గణాలు అభ్యుత్ధాన రూపమగు సత్కారమును చేయక పన్నులు చెల్లించుట మాని వేసిరి. మరియు వారు అభ్యుత్థాన రహితులై స్వార్ధముతో రాజ్య శాసనము చేయుటతోనే సంతుష్టులు కాలేదు. చివరకు వారు ఆ బలాశ్వ రాజు యొక్క అదీనములో నున్న భూములను కూడ చేజిక్కించు కొనిరి. పృథ్వీశ్వరు డగు బలాశ్వుడు అనేక మంది రాజులతో యుద్దము చేసి హీన బలుడై తన రాజ్యమును మాత్రము దక్కించు కొని తన రాజధాని యందు నివసించు చుండెను. సాధన ధన సంపన్నులు, మహా బలవంతులైన ఆ రాజు లందఱు ఆతని పురమును జుట్టు ముట్టిరి. ఆ రాజు పురమును ముట్టడించు టచే అత్యంత కుపితు డయ్యెను. కాని ఆ బలశాలి యగు బలాశ్వుడు ఆ సమయమున స్వల్ప కోశము, కొద్ది సైన్యము గల వాడు అగుటచే మిక్కిలిగా విషాదము పొందెను.
రక్షణకై వేరొక ఉపాయము కనబడక అత్యంత వికలు డయ్యెను. మరియు వ్యథిత హృదయుడై రెండు చేతులను ముఖముపై నుంచుకొని దీర్ఘ మగు శ్వాసమును విడువ సాగెను. అట్లు చేయుటచే అతని హస్తముల నుండి వచ్చు చున్న వాయువు వలన వందల కొలది యోధులు, రథములు, గుఱ్ఱములు, ఏనుగులు వచ్చు చుండెను. ఓ మునీ! ఈ విధముగా క్షణ కాలములోనే సర్వోత్తమ బలశాలురు అగు ఆ సైన్య సమూహములచే భూపతి యొక్క నగర మంతయు వ్యాపించెను. అనంతరము మహత్తర మగు ఆ సైన్యముతో రాజు నగరము నుండి వచ్చి శత్రువులను గెలిచెను. ఓ మహాభాగా! అప్పుడు నరపతి పరాజితులను చేసి తన వశము గావించు కొని, పూర్వము వలె కప్పములు చెల్లించు నట్లు నియమించి సౌభాగ్య శాలి అయ్యెను.
బలాశ్వుని యొక్క కంపితము లగు రెండు చేతుల మధ్య నుండి శత్రువులను వధించు నట్టి సైన్యము పుట్టుటచే బలాశ్వుడు “కరంధము” డను పేరుతో విఖ్యాతి చెందెను “కరంధముడు” మూడు లోకము లందును విఖ్యాతుడు, ధర్మాత్ముడు, మహాత్ముడు మరియు సర్వ ప్రాణుల యందు మైత్రీ భావము కలవాడు నుండెను, ఆ రాజు స్వయముగా ధర్మ ప్రదత్త మగు బలమును పొంది శత్రువులకు దుఃఖము కలిగించి వారిని నాశనము చేసెను.
Summary of chapter 118 of the Mārkandeya Mahā Purana is as follows:
King Khanitra's forest penance is celebrated as he dissolves all personal desires and merges his consciousness in the Supreme Soul, setting a luminous example of royal detachment and forgiveness.