మార్కండేయ మహా పురాణము
84 - దేవీ మహాత్మ్యము నందలి చండ ముండ వధ
అనంతరము చండుడు, ముండుడు మొదలగు రాక్షసులు చతురంగ సేనా సహితులై ఆయుధములను ధరించి స్వర్ణమయ మగు హిమాచల శిఖరము నందు సింహ వాహన స్థితయై యున్నదియు, చిరునవ్వుతో గూడి యున్నదియు నగు దేవిని చూసిరి. అసురులు మరియు సమీప వర్తులైన ఇతరులగు రాక్షస గణములు ఇట్లు దేవిని చూసి బాణములను ఎక్కు బెట్టి ఖడ్గములను గ్రహించి ఆమెను పట్టుకొనుటకు ప్రయత్నము చేయ సాగిరి. అప్పుడు అంబికా దేవి ఆ అసురుల మీద అత్యంత క్రోధము కలిగిన దయ్యెను. కోపముచే ఆమె ముఖము నల్లని వర్ణము గలదయ్యెను. భృకుటీ కుటిలమగు నామె లలాట ఫలకము నుండి శీఘ్రమే ఒక భయంకర ముఖము కలది, ఖడ్గ పాశాయుధనములు ధరించినది, భీకరమగు కోరలు గలదియు నాగు కాళికా దేవి యుద్భవించెను. మరియు ఆమె విచిత్రమగు “ఖట్వాంగ” మను ఆయుధమును ధరించినదియు ముండ మాలా ధారిణి, వ్యాఘ్ర చర్మ ధారిణి, శుష్కించిన మాంసము గలది యగుటచే అతి భయంకరముగా నున్నదియు, మహా విస్తారమయిన మోము గలదియు, నాలుకను చప్పరించుచూ భీకరముగా నున్నదియు, ఎర్రగా, లోతుగా నున్న నేత్రములు గలదియు , పెద్దగా నాదము చేయుటచే పది దిక్కుల ప్రతి ధ్వనింప జేయు చున్నదియై ఉత్పన్న మాయెను.
పిమ్మట భయంకరమగు నా దేవి దైత్య సేనా సమూహము పైకి వేగముగా పోయి, సంపూర్ణముగా ఘోర రాక్షసులను సంహారము చేయుచు సేన నంతయు భక్షణము చేయ సాగెను. దేవియగు కాళిక పార్శ్వ రక్షకులను, అంకుశ ధారులగు యోధులను ఘంటా సహితములైన ఏనుగులను, ఒక చేతితోనే పట్టుకొని, నోటిలో వేసుకొను చుండెను. మరియు నా కాళికా దేవిచే అశ్వ యోధులు, గజ యోధులు, సారథులు, అశ్వములు గల రథముల సహితముగా రథికులు తన నోటి యందు వేసుకొన బడుచుండిరి. మరియు నా కాళిక భీతి గొలుపు నట్లు నములు చుండెను. ఆమె కొందరిని జుట్టు పట్టుకొని, కొందరిని మెడ పట్టుకొని, కొందరిని పాదముచే త్రొక్కి, కొందరిని వక్షః స్థలము బద్దలు కొట్టి చంపెను. ఆ రాక్షసులు వేయుచున్న శాస్త్రాస్త్రములను నోటితో గ్రహించి కోపముతో కరకర నములు చుండెను.
కాళికా దేవి బల వంతులును, దుర్మార్గులును, గొప్ప శరీరము గలవారలు నగు రాక్షసులు గల ఆ సైన్యమును ఈ ప్రకారముగా మర్దించెను. కొందరిని భక్షించెను. కొందరు ఖడ్గముచే చంపబడిరి. కొందరిని ఖట్వాంగముచే చంపెను. కొందరిని దంతపు కొనలచే కొరికి చంపెను. రాక్షసుల ఆ మహా సైన్యము క్షణములో నాశన మయ్యెను. చండుడు యిట్లు సైన్యము నాశనమగుటను చూచి క్రోధముతో అతి భీషణాకారము గల కాళికా దేవి వైపుకు పరుగెత్తెను. ముండాసురుడు భీకర నేత్రములు గల దేవి మీదికి భయంకరమగు బాణములు వర్శించుచు, వేల కొలది చక్రములను వేయుచు దేవిని కప్పి వైచెను. దేవి యా బాణములను అనేకములగు చక్రములను నోరు తెరచి మ్రింగి వైచెను. ఆ సమయమున అనేక సూర్య బింబములు మేఘ గర్భమున ప్రవేశించి నట్లు ఉండెను. అనంతరము ఘోరముగా నాదము చేయుచు కాళికా దేవి కోపముతో భయంకరమైన వికటాట్ట హాసము జేయ సాగెను. నవ్వు చున్న సమయమున భీకర ముఖము నందలి దంత పంక్తి చూడ శక్యము గాని కాంతి కిరణములతో నిండి యుండెను.
పిమ్మట దేవి సింహము నధిష్టించి చండాసురుని మీదకి పరుగెత్తి వాని జుట్టు పట్టుకొని యీడ్చి ఖడ్గముచే వాని శిరస్సును ఖండించెను. ఆ రాక్షసుడు తలను నరుకు చున్న సమయమున అత్యంత భయంకరముగా నాదము చేసెను. వాని నాద ధ్వనిచే మూడు లోకములు భీతిల్లెను. చండుడు చని పోవుట చూచి ముండుడు దేవి మీదకు పరుగెత్తెను. అప్పుడు దేవి ముండుని గూడ ఖట్వాంగముచే తల నరికెను. హతశేషులగు సైనికులు మహా వీర్యవంతులగు చండ, ముండులు పడుట చూచి భయాతురులై నలు దిక్కులకు పరుగెత్తిరి. పిమ్మట యా కాళికా దేవి చండ, ముండుల శిరస్సులను తీసికొని చండికా సమీపమునకు బోయి ప్రచండమగు నట్టహాసము చేయుచు ఆమెతో నిట్లు పలికెను.
అంబికా దేవి! నేను మహా పశువులగు చండ ముండులను రాక్షసులను చంపి నీకు ఉపహారముగా తెచ్చితిని. ఈ యుద్ధ యజ్ఞము నందు శుంభ నిశుంభులను నీవే స్వయముగా చంప గలవు.
మహా సురులగు చండ ముండులను తీసికొని వచ్చుట చూసి కళ్యాణి యగు నా దేవి కాళికా దేవితో అత్యంత మధుర వచనములతో నిట్లు పలికెను.
కాళికా దేవీ! నీవు చండ ముండులను చంపి వచ్చితివి. గాన లోకమున నీవు “చాముండ” యను పేరుతో ప్రసిద్ధి జెందుదువు గాక.
Summary of chapter 83 of the Mārkandeya Mahā Purana is as follows:
Mahishāsura, assuming terrifying illusory forms of an elephant, a lion, a giant warrior, and a wild buffalo, fiercely attacked the Divine Mother. The Goddess, stepping upon the demon with Her lotus foot and piercing his throat with Her sharp trident, struck him down with Her sword as his true form attempted to emerge from the buffalo's mouth. Upon Mahishāsura's death, the demonic forces fled in terror, and the three worlds resounded with joy and divine celebration.