మార్కండేయ మహా పురాణము
75 - వైవస్వత మన్వంతరము
అనంతరము దేవతలు మరియు దేవర్షి గణాలు సమావేశమై వారందరూ త్రైలోక్య పూజ్యుడగు రవిని స్తుతించ సాగిరి.
ఓ దేవా! నీవు ఋక్ స్వరూపుడవు. నీకు నమస్కారము. నీవు సామ స్వరూపుడవు. నీకు నమస్కారము. నేవే యజు స్వరూపుడవు. మరియు సామము యొక్క ద్యుతి మానుడవు. నీకు నమస్కారము. నీవే జ్ఞానమునకు ఏకైక ఆధార స్వరూపుడవు. తామస నాశన కారివి. శుద్ధ జ్యోతి స్వరూపుడవు. విశుద్ధుడవు. మరియు అమలాత్ముడవు. నీకు నమస్కారము. నీవు శంఖ, చక్ర, గదా, పద్మధారుడవు. నీకు నమస్కారము. నీకు నమస్కారము. నీవే వరిష్టుడవు. వరేణ్యుడవు, పరుడవు, పరమాత్మవు. నీవే సంపూర్ణ జగద్వ్యాపి స్వరూపుడవు. ఆత్మా మూర్తివయిన నీకు నమస్కారము. నీవే జ్ఞాన చైతన్యము గల మనుష్యులకు నిష్ఠాస్వ రూపుడవు. సర్వ భూతములకు కారణ స్వరూపుడవు.
నీవు సూర్య స్వరూపుడవు. ప్రకాశాత్మ రూప స్వరూపుడవు. మరియు దినకరుడవు. నీకు నమస్కారము. నేవే రాత్రికి కారణ స్వరూపుడవు. మరియు సంధ్యా జ్యోత్స్నా కారుడవు. నీకు నమస్కారము. నీవు భగవానుడవు. నీకు నమస్కారము. నీ వలననే జగత్తు జాగృత మగును. మరియు విహరించును. నీ వలననే ఈ చరాచర ముక్త, అఖిల, బ్రహ్మాండము, విద్రుతమై భ్రమించు చున్నది. స్పర్శ యోగ్యములగు సంపూర్ణ ద్రవ్యములు నీ యొక్క కిరణముల స్పర్శ చేతనే పవిత్రములగు చున్నవి. నీ కిరణముల చేతనే జలాడులకు పవిత్రత సిద్ధించు చున్నది. నీ కిరణములచే పవిత్రత సిద్ధింపని వరకు హోమ దానాది ధర్మములు ఉపకరించవు. ఓ దేవా! ఈ జగత్తు ఎప్పటి వరకు నీ కిరణ సంయోగమును పొందదో అంత వరకు జగత్తుకు పవిత్రత లేదు. నీ అవయవములచే ఏ కిరణములు వెలువడునో, అవన్నియు ఋక్ యజు స్సామములు. ఓ జగన్నాథా! నీవే ఋజ్మయుడవు. నీవే యజుర్మయుడవు.
మరియు నీవే సామ రూపుడవు. అందువలన ఓ ప్రభూ! నీవే త్రయీ మయుడవు. నీవే బ్రహ్మ రూపుడవు. నీవే ప్రధానుడవు మరియు అప్రధానుడవు. నీవే మూర్తి ధారుడవు. మూర్తి కాని వాడవు. స్థూల సూక్ష్మము లందు నీవే ఉన్నావు. ఓ దేవా! నిమేష కాష్టాది స్వరూపమున క్షయాత్మక కాల రూపమున నున్నావు. నీవు ప్రసన్నుడ వగుము. నీ కోరిక ప్రకారము రూపమును, తేజస్సును క్షీణింప చేసుకొనుము. (ఈ మనోహరమగు స్తోత్రమును మనుష్యులు శ్రద్ధతో వినవలెను. మరియు గురువు సమాధి యందు స్థితుడై తన శిష్యులకు ఇవ్వవలెను.)
అనంతరము దేవతలు మరియు దేవర్షులు ఈ విధముగా స్థుతించిన పిమ్మట తేజో రాశి అవ్యయుడగు సూర్యుడు తన తేజస్సును తగ్గించెను.
ఆ రవి యొక్క ఋజ్మయ తేజస్సుచే పృథ్వి, యజుర్మయ తేజస్సుచే ఆకాశము, సామ మాయ తేజస్సుచే స్వర్గము అయ్యెను. ఏ త్వష్ట్రు ప్రజాపతి సూర్యుని యొక్క తేజస్సు నందలి ఏ పంచ దశ భాగములను సూర్యుని నుండి వేరు చేసెనో, మహాత్ముడగు నాతడే ఆ తేజస్సు చేతనే మహా దేవుని శూలమును, విష్ణువు యొక్క చక్రమును మరియు వసుగణాలకు దారుణములగు శంఖులను, పావకుని యొక్క దారుణ శక్తిని నిర్మించెను. మరియు దాని ద్వారానే కుభేరుని యొక్క పల్లకీ మరియు అన్యాన్య దేవ గణాలకు మరియు యక్ష, విద్యాధరులకు ఏ ఏ ఉగ్ర అస్త్రము లున్నవో ఆ సమస్తములను విశ్వకర్మ నిర్మించెను. అనంతరము విభుడగు సూర్య భగవానుడు తన తేజస్సు యొక్క పదునారవ భాగమును మాత్రమే ధరించెను. విశ్వకర్మ దానిని కూడ తిరిగి పదునైదు మారులు విభజించెను. (చీల్చెను)
ఆ తరువాత భానుడు అశ్వ రూపమును ధరించి ఉత్తర కురు దేశమునకు వెళ్లి ఆడు గుఱ్ఱము రూపముతో నున్న సంజ్ఞా దేవిని చూచెను. ఆ సంజ్ఞా దేవి అతనిని చూచి పర పురుషుడేమో నని శంకించుచూ తనను రక్షించు కొనుట కొరకు పృష్ట రక్షణ తత్పరురాలై అతనికి సమ్ముఖముగా అతని వద్దకు వెళ్ళెను. తదనంతరము ఆ స్థానము నందే ఆ ఇద్దరి నాసికలు కలియగానే ఆడు గుర్రము యొక్క ముఖము నుండి నాసత్య, డశ్రు లను పేరుగల ఇద్దరు పుత్రులు జన్మించిరి. ఆ వీర్యము యొక్క శేష భాగము నుండి డాలు, కవచము, ఖడ్గమును ధరించి, బాణ తుణీర యుక్తుడై అశ్వారూఢుడై రేవంతుడను పేరు గాలొక పుత్రుడు ఉదయించెను. అనంతరము సూర్యుడు ఆమెకు తన అమితమగు రూపమును చూపించెను. అప్పుడు ఆడు గుఱ్ఱము రూపమున నున్న సంజ్ఞా దేవి అతని యథార్థ స్వరూపమును చూసి ప్రసన్నురాలై తన స్వరూపమును ధరించెను.
అప్పుడు తస్కరుడగు భాస్కరుడు స్వస్వరూప ధారిణి యగు సంజ్ఞ అను పేరు గల ప్రీతిమతి యగు భార్యను తన గృహమునకు గొని పోయెను. ఈతని జ్యేష్ఠ పుత్రుడే వైవస్వతుడను పేరు గల మను వయ్యెను. ద్వితీయ పుత్రుడు యముడు శాప కారణమున ధర్మ దృష్టి కలవాడయ్యెను. “నీ పాదము నుండి మాంసమును తీసికొని సమస్త క్రిములు పృథ్వీ తలమందు పడు గాక” అని తల్లి శాపమునకు ప్రతీకారము ఆతని తండ్రే స్వయముగా చేసెను. యమునికి ధర్మదృష్టి, శత్రు మిత్రుల యందు సమ దృష్టి కలిగి యుండుట చూచి తిమిరారి యగు సూర్యుడు ఆతనిని యమత్వ మందు నియమించెను. యమునా అను పేరుగల కన్య నదీ రూపముతో కళింద దేశ మధ్య భాగమున ప్రవహించా సాగెను. మరియు అశ్వనీ కుమారు లిద్దరూ మహాత్ముడగు తండ్రిచే నియమింప బడి స్వర్గాము నందు వైద్యులుగా నుండిరి.
మరియు రేవంతుడు గుహ్యకాధిపత్య మందు నియుక్తు డయ్యెను. ఇప్పుడు ఛాయా సంజ్ఞ యొక్క పుత్రుల నియోగ మును నా వలన వినుము. ఆ తరువాత పూర్వజుడగు వైవస్వత మనువుతో సమానుడగు ఛాయా సంజ్ఞ యొక్క గర్భము నుండి జనించిన సూర్యుని జ్యేష్ట పుత్రుడు ‘సావర్ణికు’దను పేరును పొందెను. ఏ సమయమున బలి ఇంద్రుడగునో, అప్పుడు ఈతడు కూడా మనువగును. శనైశ్చరుడు కూడ తండ్రిచే గ్రహము లందు నియమితు డయ్యెను. అందరికన్నా చిన్నది ఒక కన్య ఉన్నది. ఈమె పేరు తపతి. ఆమె సంవరణుడను పేరుగల రాజుచే ‘కురు’ వను పుత్రుని పొందెను. ఇప్పుడు నేను ఆ ఏడవ మనువు అగు వైవస్వత మన్వంతరము నందలి సమస్త ఋషులు, దేవాగణాలు ఇంద్రుడు మరియు ఆ భూపాలుని పుత్రులను గురించి చెప్పెదను.
Summary of chapter 74 of the Mārkandeya Mahā Purana is as follows:
The Fourth Manvantara, presided over by Tāmasa Manu, is detailed along with its Seven Sages, deva clans such as the Satyas and Haris, and the heroic royal sons who protected the Earth from demoniac incursions.