మార్కండేయ మహా పురాణము
85 - దేవీ మహాత్మ్యము నందలి రక్తబీజ వధ
చండ ముండాసురులు చని పోవుటయు, సమస్త సైన్యము నాశన మగుటయు తెలిసిన పిమ్మట ప్రతాపవంతుడు, రాక్షస రాజగు శుంభుడు అత్యంత క్రోధము కలవాడై సమస్త రాక్షస సైన్యములను యుద్దము చేయుటకు ఆదేశించెను. ఇప్పుడు అన్ని విధములైన ఎనుబది ఆరు వేల “ఉదాయుధులు” మరియు “కంబు” లను పేరు గల ఎనుబది నాలుగు వేల దైత్యులు బయలు వెడలుదురు గాక. “కోటి వీర్యులు” అను పేరు గల యాబది కులముల రాక్షసులు “ధూమ్ర వంశ” జాతులగు నూరు కుల మూలా రాక్షస గణములు నా ఆజ్ఞ ప్రకారము యుద్ధమునకు నడుపుడు.
కాలకులు, మౌర్యులు, కాలకేయులు మొదలగు రాక్షస గణములు శీఘ్రముగా నా ఆజ్ఞచే యుద్ధమునకు సంసిద్ధులై వెడలుదురు గాక. భీకరమైన శాసనము గలవాడు, అసుర పతియు నగు శుంభుడు ఈ ప్రకారము ఆజ్ఞ యిచ్చి వేల కొలది మహా సేనలను వెంట బెట్టుకొని యుద్ధమునకు వెడలెను. చండికా దేవి అత్యంత భయంకర మైన ఆ సేనా సమూహము వచ్చు చుండుటను చూచి ధనుష్టంకారము చేసెను. ఆ ధ్వని భూమి, ఆకాశము అంతయు నిండెను. రాజా! పిమ్మట దేవీ వాహనమగు సింహము భయంకరమగు మహా నాదము చేసెను. ఆ సమయమున అంబికా దేవి తన ఘంటా నాదముతో సింహ నాదమును ఇనుమడింప చేసెను.
దేవి యొక్క ధనుష్టంకార ఘంటా నాదముల చేతను, సింహ నాదముల చేతను దిక్కు లన్నియు పిక్కటిల్లెను. మరియు నా కాళికా దేవి తన నోరు తెరచి అత్యంత భయంకర నినాదములతో జయ జయ శబ్దములను చేయసాగెను. ఆ శబ్దము వినిన దైత్య సేనలు క్రోధముతో చండికా దేవి మీదకు, కాళికా దేవి వైపుకు సింహము దగ్గరకు నాలుగు వైపులా చుట్టు ముట్టిరి. రాజా! ఈ సమయమున అసుర నాశనము చేయదలచి దేవతలకు క్షేమము చేయ సంకల్పించిన యా దేవి మహావీర్య బల సమన్వితురాలై యుండెను. ఆ సమయ మందు బ్రహ్మ, శివ, కుమార స్వామి, విష్ణు, దేవేంద్ర దేవతలా శరీరముల నుండి వేరు వేరుగా శక్తులు ఉత్పన్న మయ్యెను. ఆ శక్తులు వారి వారి దేవతా రూపములు ధరించి చండికా దేవి యొద్దకు వచ్చెను. ఏ యే దేవతలకు యే యే రూపములు, అలంకారములు, వాహనములు ఉండెనో,ఆ దేవతల శరీరముల నుండి జన్మించిన శక్తులు గూడ అట్టి రూప అలంకార, వాహనములతో రాక్షసుల మీదకి యుద్ధమునకు వెడలెను.
హంస యుక్త విమానమున చేతిలో అక్షర మాల, కమండలము ధరించి బ్రహ్మ శక్తి వచ్చెను. “బ్రహ్మాణీ” యను పేరుతో ఆమె ప్రసిద్ధు రాలయ్యెను. వృషభ వాహనా రూడయై త్రిశూలమును ధరించి చంద్ర రేఖచే శోభాయ మానయై సర్పములను, కంకణములుగా ధరించి శివశక్తి “మహేశ్వరి” యను పేరుతో వచ్చెను. శక్తియను ఆయుధమును ధరించి గుహ రూపిణియగు “కౌమారీ”యను శక్తి సుందర మగు నెమలి నెక్కి యుద్ధము చేయుటకై వచ్చెను. అటులనే గరుడా వాహనారూడయై “వైష్ణవీ” శక్తి శంఖ, చక్ర గదా, ఖడ్గ, శార్జములను ధరించి వచ్చెను. యజ్ఞ వారాహ రూపమును ధరించిన వాడును, భగవంతుడు నగు విష్ణు మూర్తి యొక్క శక్తి వరాహ రూపమును ధరించి “వారాహీ”యను నామముతో వచ్చెను. (బ్రాహ్మీ, మహేశ్వరీ, వైష్ణవీ, కౌమారీ, వారాహీ, ఐంద్రీ , చాముండీ, వీరు సప్త మాతృకా గణములని అందురు.)
“నారశింహీ” శక్తి నృసింహ రూపమును ధరించి వచ్చెను. ఆమె జూలును విదిల్చి నప్పుడు నక్షత్ర పంక్తులు ఇటునటు చలించు చుండెను. గజ రాజును అధిష్టించి సహస్ర నేత్రములతో “ఐంద్రీ” శక్తి హస్త మందు వజ్రమును ధరించి వచ్చెను. ఆమె ఇంద్రుని వలెనె యుండెను. అనంతరము ఆ సమస్త దేవతా శక్తులను వెంట బెట్టుకొని రుద్రుడు వచ్చి చండికా దేవితో “నా ప్రీతి కొరకు రాక్షసులను శీఘ్రముగా చంపుము.” అని అనెను. పిమ్మట దేవి శరీరము నుండి అత్యంత క్రూరము, అత్యంత భయంకరము, శివా శత నినాదములతో సమానమైన నాదము చేయు చున్నదియు నగు చండికా శక్తి యుద్భవించెను. అపరాజిత యగు నా చండికా దేవి ధూమ్ర వర్ణములగు జడలు గలదియై శంకరునితో, భగవానుడగు మహేశ్వరా! నీవు శుంభ నిశుంభుల సమీపమునకు దూతగా పొమ్ము.
అత్యంత గర్వితులగు శుంభ నిశుంభులకు యుద్ధము చేయుటకు అక్కడకు వచ్చిన ఇతరులగు దానవులకు ఇట్లు చెప్పుము. దానవులారా! దేవేంద్రుడు త్రైలోక్య రాజ్యమును పొంద వలెను. మీరందరు బ్రతుక దలచినచో పాతాళమునకు పోవలెను. బల గర్వముచే యుద్ధము చేయ దలచినచో రండు. నా శివ గణములు మీ రక్త పానముచే తృప్తిని పొందు గాక. ఇట్లు దేవి స్వయముగా శివుని దూత కార్య మందు నియోగించుటచే, ఈ లోకమున “శివ దూతీ” నామమున ప్రఖ్యాతిని పొందెను. ఇట్లు శంకరునిచే దేవి చెప్పిన మాటలను విని, యా మహా దానవులు క్రోధ పూరితులై దేవి యున్న చోటికి వచ్చిరి.
అనంతరము అత్యంత క్రోధితు లైన ఆ అసుర బృందము ప్రథమముగా దేవి ఎదుట శర, శక్తి, ఋష్టి ఇత్యాదులను వర్షింప సాగెను. ఆ అసురు లందరు వేయుచున్న బాణములు, శూలములు, చక్రములు, గొడ్డళ్ళు మొదలగు వాటిని చండికా దేవి ధనుస్సు ఎక్కు పెట్టి వదులు చున్న పెద్ద పెద్ద బాణములతో లీలా పూర్వకముగా త్రుంచి వేసెను. అదే సమయ మందు చండికా దేవి సమ్ముఖమున కాళి ఎందరెందరినో రాక్షసులను శూలములతో చీల్చు చుండెను. మరికొందరిని ముసలముచే బాదుచూ విహరించ సాగెను. శత్రు గణాలు ఏ వైపుగా పరుగెత్త సాగెనో, ఆ వైపున బ్రహ్మాణీ శక్తి వారిపై కమండలము నందలి జలమును జల్లి వారిని హత వీర్యులుగా, తేజో హీనులుగా చేయ సాగెను. మహేశ్వరీ శక్తి త్రిశూలముచే, వైష్ణవీ శక్తి చక్రముచే, దైత్యులను సంహరింప సాగిరి. అతి కృద్దురాలైన కౌమారీ శక్తి శక్తిచే అనేక మంది దైత్యులను సంహరించెను. ఐంద్రీ యొక్క వజ్ర ఘాతముచే వందల కొలది దైత్య దానవులు నెత్తురు కక్కుచు నెల కొరుగు చుండిరి.
వరాహమూర్తి శక్తి యొక్క తుండా ఘాతముచే విధ్వంసులై, చక్రా ఘాతముచే చీల్చ బడిన వారై, కోరల యోక్క అగ్ర భాగముచే గుండెలు పగిలిన వారై దైత్య గణాలు కూల సాగిరి. నారసింహీ శక్తి భూమ్యాకాశములు నిండు నట్లుగా గర్జించుచు గోళ్లచే చీల్చి, అసురులను భక్షించుచు యుద్ధ క్షేత్రమున విహరించ సాగెను. శివదూతి చేసిన భీకర అట్టహాసముచే భీతావహులై అసుర గణాలు పృథ్వి యందు పడ సాగిరి. అట్లు పడుచున్న అసురులను శివదూతి భక్షించు చుండెను. మాతృ గణాలు ఈ విధముగా క్రోధ పూరితులై అనేక ఉపాయములచే రాక్షసులను మర్దించు చుండిరి. ఇది చూచిన అసుర సేనలు పారిపోవ మొదలిడిరి. మాతృ గణాలచే పీడితులై దైత్య గణాలు పారిపోవు చుండిరి. ఇది చూసి రక్త బీజుడను మహాసురుడు కృద్దుడై యుద్దము చేయుటకు వచ్చెను. ఈ రక్త బీజుడను రాక్షసుని శరీరము నుండి ఒక రక్త బిందువు భూమి మీద పడిన వెంటనే భూమి నుండి అతనితో సమానుడగు ఒక రాక్షసుడు ఉత్పన్నమగు చుండెను.
అట్టి రాక్షసుడగు రక్తబీజుడు చేతి యందు గదను ధరించి ఇంద్ర శక్తి యొక్క సహాయముచే యుద్ధము చేయ సాగెను. అపుడు ఐంద్రి తన వజ్రముచే రక్తబీజుని కొట్టెను. వజ్ర పీడితుడైన రక్త బీజుడి శరీరము నుండి పడిన రుధిరముచే అతనితో సమానులగు పరాక్రమ శాలురైన అనేకులగు యోధులు ఉత్పన్నమైరి. నెత్తురు కారు చుండుటచే అతని శరీరము నుండి ఎన్ని రుధిర బిందువులు పడు చున్నవో, అంత మంది పురుషులు ఉత్పన్నమైరి. బల, వీర్య పరాక్రమముల యందు రక్తబీజుని వలె ఉండిరి. ఆ రక్త బిందువుల నుండి ఉత్పన్నమైన పురుషులు కూడా ఆ రణ క్షేత్రమున మాతృ గణాలతో ఉగ్ర శాస్త్రములు విడుచుచూ అతి భయంకరముగా యుద్ధము చేయ సాగిరి. తిరిగి ఎప్పుడు వజ్రముచే ఐంద్రి ఆ రాక్షసుని తల నరికెనో అప్పుడు దెబ్బ తగిలిన స్థానము నుండి రక్తము ప్రవహించ సాగెను. మరియు దాని నుండి వేల కొలది అసురులు ఉత్పన్నమైరి.
వైష్ణవీ శక్తి యుద్దమున అతనిని చక్రముతో నరికెను. ఐందరి గదచే ఆ అసురేశ్వరుని గొట్టెను. వైష్ణవీ యొక్క చక్రముచే నరకబడిన ఆ అసురుని యొక్క రుధిరము ప్రవహించుటచే అతని వలెనే యున్న వారై ఉత్పన్న మైన వేల కొలది గొప్ప గొప్ప రాక్షసులచే జగత్తు వ్యాపించెను. కౌమారి శక్తిచే, వారాహి ఖడ్గముచే, మహేశ్వరి త్రిశూలముచే మహాసురుడగు ఆ రక్త బీజుని కొట్ట సాగిరి. మరియు అసురుడగు ఆ రక్తబీజుడు కూడా కృద్ధుడై గదచే సమస్త మాతృ గణాలను వేరు వేరుగా కొట్ట సాగెను. శక్తి, శూలము మొదలగు నానా విధములగు అస్త్రములచే గాయ పడిన ఆ రక్తబీజుని శరీరము నుండి ఎంత రక్తము భూమిపై పడు చున్నదో, దాని నుండి వందల కొలది రాక్షసులు పుట్టు చుండిరి.
ఆ అసురుని రక్తముచే ఉత్పన్నమైన రాక్షసులు విశ్వమంతా వ్యాపించిరి. అపుడు దేవతలు అత్యంత భీతా వహులైరి. అనంతరము అట్లు భయపడు చున్న దేవతలను చూచినదై చండిక వెంటనే కాళితో ఇట్లు పలికెను. ఓ చాముండీ! నీవు నీ నోటిని విస్తరింప జేయుము. నా శస్త్ర ఘాతముచే ఉత్పన్న మగుచున్న రక్త బిందువులచే ఉత్పన్న మగుచున్న రాక్షసులను నీవు నోటి లోనికి వేగముగా గ్రహింపుము. మరియు అట్లు ఉత్పన్నమైన రాక్షసులను భక్షించుచూ రణమున సంచరించు చుండుము. అట్లు చేయుటచే ఈ దైత్య్ని రుధిరము క్షీణ మగును. అపుడు ఆతడు వినాశమును పొందును. ఎప్పుడైతే నీవు వారిని భక్షించుట ప్రారంభించుదువో అప్పుడు తిరిగి వారు పుట్టుట ఉండదు.
ఇట్లు కాళితో చెప్పి చండికా దేవి త్రిశూలముచే ఆ రాక్షసుని గాయపరచెను. కాళి ఆ గాయ పడిన రక్తబీజుని రక్త బిందువులను నోటి లోనికి గ్రహింప సాగెను.
అపుడు ఆ రక్తబీజాసురుడు రణ క్షేత్రమున గదచే దేవిని కొట్టెను. కాని ఆ గదా ఘాతము దేవిని అల్ప మాత్రమును కూడా వేదన కలుగ జేయలేక పోయెను. ఇపుడు గాయ పడిన ఆ అసురుని శరీరము నుండి ఏ రుధిరము పడు చున్నదో, దాని నంతయు చండిక నోటి లోనికి గ్రహించెను. చాముండికా దేవి ముఖము నుండి రక్తము జారి పడగానే ఏ రాక్షసులు ఉత్పన్న మైనారో వారందరినీ రుధిర సహితముగా గ్రహించసాగెను. చాముండి ఈ విధముగా రక్త బీజుని రుధిరమును పానము చేయగానే చండికా దేవి వారిని శూల, చక్ర, బాణ, ఖడ్గాదులచే చంపి వేసెను. అనంతరము ఓ మహీపాలా! మహాసురుడగు ఆ రక్తబీజుడు శస్త్ర సమూహములచే కొట్టబడి రుధిర హీనుడై భూమిపై పడి ప్రాణములను వదిలెను. ఓ రాజా! అనంతరము దేవతలు అమితమగు ఆనందమును పొందిరి. మాతృ గణాలు అసురుల రక్త పానముచే మత్తెక్కిన వారై నృత్యము చేయు చుండిరి.
Summary of chapter 84 of the Mārkandeya Mahā Purana is as follows:
Indra and all the devas bow in deep humility before the victorious Goddess, offering the sublime Śakrādi Stuti. They extol Her as the supreme embodiment of Śraddhā, Svāhā, Svadhā, and Mahāvidyā, who resides as fortune in the homes of the virtuous and as intelligence in the hearts of the wise. Pleased by their selfless devotion, the Mother of the Universe grants them the boon that whenever they remember Her in times of distress, She will instantly descend to destroy their afflictions.