మార్కండేయ మహా పురాణము
132 - దమ చరితము
ఆ శూద్ర తాపసుడు ఈ విధముగా ఇంద్రసేన యొక్క ఆజ్ఞ గైకొని దముడి సమీపమునకు బోయి, అతడి తండ్రి యొక్క మరణ వృత్తాంతమును మరియు రాణి యగు ఇంద్రసేన ఇచ్చిన ఆదేశము మొదలగు నవన్నియు చెప్పెను. తండ్రి వధింప బడిన వృత్తాంతమును ఆ తాపసుడు ఆద్యంతము వర్ణించెను. అప్పుడు దముడను ఆ రాజు ఆజ్యముచే ప్రజ్వరిల్లు నట్టి అగ్ని వలె క్రోధముచే మండి పడెను. ఓ మహామునీ ! అతడు ధీర స్వభావము గల వాడై యున్నను ఈ సమయ మందు క్రోధాగ్నిచే ప్రజ్వలింప బడు చున్నవాడై ఒక చేతిలో వేరొక చేతిని నలుముకొనుచు ఇట్లు పలికెను. “నా వంటి పుత్రుడు జీవించి యుండగనే వంశమును అగౌరవ పరచిన నృశంసుడు నా తండ్రిని అనాధుని వలె వధించెను. నేను కోపించ వలెనా? లేక నపుంసకుని వలె క్షమించ వలెనా? నేను దుష్టుల నణచి వేసి శిష్టులను పాలించుటకు నియమింప బడితిని.”
అయిననూ నా తండ్రి హతుడగుట చూచియు కూడ, నా శత్రువు ఇప్పటి వరకు జీవించి యున్నాడు. అందువలన ఎక్కువగా మాట్లాడి ప్రయోజన మేమున్నది? ఓ తండ్రీ! యని ఈ విధముగా విలపించుట వలన లాభమే మున్నది? ఇప్పుడు కర్తవ్యమే మున్నదో, దానిని చేయుదును. నేను పపుష్మాసుని దేహము నుండి వెలువడు రక్తముతో తండ్రికి తర్పణము చేయనిచో, అగ్ని ప్రవేశము చేయుదును. నేను యుద్ధము నందు అతడిని చంపి అతని రక్తముతో మృతుడైన తండ్రికి ఉదక కర్మ మరియు మాంసముచే (రాక్షస కులోత్పన్నులగు ) బ్రాహ్మణులకు భోజనము బెట్టనిచో, మరియు అతని మాంసముచే పితరులకు పిండ ప్రధానము చేయనిచో నేను అగ్ని ప్రవేశము చేయుదును. యక్ష, గంధర్వ, విద్యాధర, సిద్ధ గణాలు వాడికి సహాయ పడనిచో, వారిని కూడ నా క్రోధాగ్ని యందు భస్మీపటలము చేయుదును. శౌర్య హీనుడు, అధార్మికుడు, నిందితుడు నగు ఆ దాక్షిణాత్యుని సమర మందు చంపి తిరిగి నేను భూమి నంతటిని అనుభవించెదను. ఒకవేళ అతనిని చంపుట యందు అసమర్థుడ నైనచో అగ్ని ప్రవేశము చేయుదును.
వనవాసి, తపోనిరతుడు, వృద్ధుడు అగు నా తండ్రి శాంతి వచనములు చెప్పి నప్పటికిని ఉద్రిక్తుడై ఏ దుర్మతి నా తండ్రిని వధించెనో, నేను ఇప్పుడే సమస్త బంధువులు, మిత్రులు, పదాతులు, ఏనుగులు, గుఱ్ఱములు, సేనలతో బోయి, అతనిని చంపెదను. నేను ఇప్పుడే ఖడ్గము, ధనుస్సును ధరించి, రథముపై నెక్కి శత్రు సేనలను చేరుకొని, అతనిని ఎట్లు చంపెదనో, ఆ దేవ గణములన్నియు చూచును గాక. నేడు అతడు నాతో సంగ్రామము నందు ప్రవృత్తుడై నప్పుడు ఎవరెవరు అతనికి సహాయము చేయుదురో, నా ఈ స్వీయ సైన్యముచే వెంటనే వారికి కూడా సమస్త కులక్షయము చేయుట కుద్యుక్తుడ నయ్యెదను గాక. ఈ యుద్దము నందు వజ్రహస్తుడగు ఇంద్రుడు, క్రోధముచే దండ ధారియై యముడు, లేక కుబేరుడు, వరుణుడు, సూర్యుడైనను సరే అతనిని రక్షించుటకు యత్నించరేని నేను నిశితము లగు బాణములచే వారిని నాశనము చేయుదును గాక. నా వంటి ప్రభావశాలి యగు పుత్రుడుండగనే సంమయ చిత్తుడు, నిర్దోషి, వనవాసి, రాలిన పండ్లను మాత్రమే భుజించుచూ జీవించునట్టి వాడు సర్వ ప్రాణుల యందు మైత్రీ భావనా పరాయణుడగు నా తండ్రికి వధించెను. అతని మాంస రుధిరములచే నేడు గృద్రకుముల సంతృప్తిని పొందును గాక.
Summary of chapter 132 of the Mārkandeya Mahā Purana is as follows:
King Narishyanta, son of Marutta, rules the empire with profound generosity. During his sacrifices, he distributed so much gold and wealth to the Brāhmaṇas that all citizens became wealthy, eliminating poverty throughout his realm.