మార్కండేయ మహా పురాణము
16 - దత్తాత్రేయ మాహాత్మ్య వర్ణనము
వత్సా! ఘటీ యంత్రముతో సమాన మగుచున్నదియు, అవశ్యము త్యాగము జేయ దగినదియు నగు సంసార స్థితిని, దేహము యొక్క స్వరూపమును గురించియు నాకు నీవు జెప్పితివి. ఈ ప్రపంచ మంతయు ఇట్టిదే యను జ్ఞానము కలిగినది. ఇట్టి పరిస్థితిలో నేను జేయ వలసిన కర్తవ్యమేమి? తెలుపుము.
తండ్రీ! నా మాట యందు నీకు విశ్వాసమున్న యెడల, యెంత మాత్రము శంకించక, గృహస్థాశ్రమమును వదలి, వాన ప్రస్థాశ్రమము నందు మనస్సు గల వాడ వగుము. విధి ప్రకారముగా వాన ప్రస్థాశ్రమమును అనుష్టించి, అగ్ని పరిగ్రహమును త్యాగము జేసి, ఆత్మ యందాత్మను జేర్చి ద్వంద్వ రహితుడవు, నిష్పరి గ్రహుడవు గమ్ము. మరియు ఏకాంత వాసివి గమ్ము. ఇంద్రియముల నాత్మ వశ్యము జేయుము. అలసత్వ రహితుడవై భిక్షుకుడవు గమ్ము. ఈ ప్రకారము యోగ చిత్తుడ వగుము. ఇట్లయినచో బాహ్య స్పర్శ రహితుడ వగుదువు.
అప్పుడు ముక్తి కారణము ఉపమా హీనము, వచనా తీతము, సంజ్ఞా రహితము, మరియు దుఃఖ సంయోగమునకు ఔషది రూప మగునట్టి యోగమును బొందగలవు. ఇట్టి యోగ ప్రాప్తిచే నీకు మరల పంచ భూతాత్మిక మగు శరీర సంయోగము లేనందున ముక్తి పొందెదవు.
వత్సా! అటు లైనచో ముక్తి కారణ మగు నా యోగ స్వరూపమును నాకు జెప్పుము. ఏ యోగము నవలంభించుటచే భౌతిక పదార్థ సంగముచే మరల జనన మరణములు గలిగి, నాకు దుఃఖము గలుగ కుండునో, యోగ మార్గము తెలుపుము. సంసారమనే త్రాళ్ళచే బంధింప బడి యున్నాను. సంసార మందు జ్ఞాన హీనుడ నగుటచే నాసక్తి గలిగి యున్నాను. గావున యిట్టి నాకు ఆత్మ జ్ఞానమును బోధించుము. ఏ యోగముచే జననాది యోగములు లేకుండునో, అట్టి యోగ శాస్త్రమును నాకు తెలుపుము. నా శరీరము, నా మనస్సు, సంసారమనే సూర్యుని తాపముచే మిక్కిలి పీడింప బడుచున్నది. కుమారా! నీవు బ్రహ్మ జ్ఞాన రూపమగు చల్లని నీటితో మిశ్రితమగు నీ వచన రూప జలముచే నన్ను అభిషేకించుము. నాకు శాంతిని ప్రసాదించుము. అజ్ఞాన రూపమగు సర్పము నన్ను కాటు వేసినది. విష మెక్కినది. మృత ప్రాయుడవై యున్నాను.
నీవు, నీ వచన రూపమగు అమృతమును త్రాగించుము. నన్ను మరల బ్రతికించుము. కుమారా! నేను పుత్రులు, భార్యలు, గృహములు, ధనములు, క్షేత్రములు, అను యినుప సంకెళ్ళచే బంధింపబడి మహా దుఃఖమును బొండు చున్నాను. నీవు సద్భావయుక్త మగు విజ్ఞానమును నాకు కలుగ జేయుము. నన్ను సంసార బంధము నుండి విముక్తుని జేయుము.
జనకా! మహాజ్ఞాన సంపన్నుడగు దత్తాత్రేయుడు చెప్పిన యోగ మార్గమును జెప్పెదను. వినుము. పూర్వము దత్తాత్రేయుడు అలర్కునికి చెప్పెను. అలర్కుడు దత్తాత్రేయుని భక్తి శ్రద్ధలతో లెస్సగా యడిగెను.
కుమారా! దత్తాత్రేయుడు ఎవని కుమారుడు? ఆతడు జెప్పిన యోగ మార్గ మేమిటి? యోగ విధానము నడిగిన మహానుభావుడగు యలర్కుడు ఎవరు?
పూర్వము ప్రతిష్టాన మను పట్టణమున కౌశికుడు అను నొకానొక బ్రాహ్మణుడు ఉండెను. ఆ విప్రుడు పూర్వ జన్మ యందు జేసిన పాపములచే కుష్ఠు రోగముతో బాధ పడుతూ ఉండెను. భార్య అట్లు వ్యాధి పీడితుడగు ఆ భర్తను దేవుని వలె సేవించు చుండెను.
పాదాభ్యంజన, శరీర రక్షణ, స్నాన, ఆచ్చాదన, భోజనములు, శ్లేష్మ, మూత్ర, పురీష, ఆసృక్ ప్రవాహ, ప్రక్షాళనములు జేయు చుండెను. ఏకాంత సమయము లందు ప్రియ సంభాషణాద్యుప చారముల చేతను వినయ విధేయతలతో మిక్కిలిగా పూజా భావముతో ప్రవర్తించు చుండెను. ఇట్లు ఎల్లప్పుడు శేవించి నప్పటికిని, ఆ భర్త తీవ్ర కోపము గలవా డగుటచే దుర్మార్గుడై హింసించు చుండెను. అయినను ఆ సాధ్వి ఆతడిని దైవమని తలంచు చుండను. ఆమె అతి భయంకరు డయినను అందరి కంటె తన భర్తయే శ్రేష్టుడని తలచెను. ఒకానొక సమయమున నడుచుటకు కూడా శక్తి లేని యా బ్రాహ్మణుడు, భార్యను యిటుల యాజ్ఞాపించెను. నేను గృహ మందుండగా రాజ మార్గమున బోవుచున్న యొక వేశ్యను ఉదయమున జూచితిని. ఇప్పుడు రాత్రియైనది. గాన నీవు ఆ వేశ్య ఇంటికి యిప్పుడు తీసుకొని బోవలెను.
నీవు ధర్మము తెలిసిన దానవు కదా! నీవు నన్ను ఆ వేశ్య కడకు తీసికొని బొమ్ము. ఆ వేశ్య నా మనస్సున నిలిచి యున్నది. నేను ఉదయ కాలమున యా వేశ్య యువతిని జూచితిని. ఇప్పుడు రాత్రి గూడ నయినది. ఆ వేశ్యను జూచి నప్పటి నుండి నా మనస్సు ఆమె నుండి తొలగి బోవుట లేదు. ఆ వేశ్య మనోహర సర్వాంగ సుందరి. పీనశ్రేణి పయోధర. నేను అట్టి తన్వంగిని యా లింగనము జేసికొననిచో నేను బ్రతుక జాలను. నీవు నన్ను జూడలేవు. నా మృత శరీరమును జూచేదవు. మన్మధుడు మనుష్యుల మనస్సులలో ప్రవేశించి క్రూర మయిన పనులు జేయు చుండును. నాకు బోవుటకు శక్తి లేదు. నాకు చాలా విషమ స్తితి ఏర్పడినది. అప్పుడామే తన స్వామి వచనమును వినెను. ఆతడు మిక్కుటమగు కామ వాంఛతో ఉండుట గ్రహించెను. సత్కులో త్పన్నురాలు, మహా సంభవురాలు, మహా పతివ్రత యగు నామె మహా వ్యాకులము జెందెను. ధైర్యము దెచ్చుకొనెను. నడుము బిగించెను. వేశ్య కిచ్చుటకు అధికముగా ధనమును తీసికొనెను.
తన స్వామిని భుజము మీదికి ఎక్కించు కొనెను. మెల్ల మెల్లగా బోవుచుండెను. ఆకాశము మేఘావృతమై యుండెను.అందులో రాత్రి గూడ నగుటచే అంధకార బందురమై యుండెను. చంచలములగు మెరుపులు మార్గమును గనబర్చు చుండెను. ఆ ద్విజాంగన తన స్వామి యభీష్టము నెరవేర్చ వలయునని కోరుకొనెను. ఇట్లు బోవుచుండ రాజ మార్గమున దొంగ కాక బోయినను దొంగ యని శంకించి శూలమునకు గుచ్చబడి యున్నవాడును, అతి దుఃఖార్తుడు అగు మాండవ్య మహామునిని కటిక చీకటిలో భార్య భుజము మీద యున్న కౌశిక బ్రాహ్మణుడు మాండవ్య మహాముని పాదములను తాకెను. అందుచే మాండవ్యుడు చలించెను. వామాంగా సంచలనముచే మాండవ్యుడు క్రుద్దుడయ్యెను. పిమ్మట యాతని శరీర స్పర్శచే మహా దుఃఖము జెందెను. మరియు నిట్లనెను. ఇట్లు వ్యర్ధముగా కష్టమును గలిగించిన పాపాత్ముడగు నరాధముడు సూర్యోదయ మగు సరికి ప్రాణ త్యాగము జెందుగాక. సంశయము లేదు.
వాడు సూర్యుని చూడగానే నిస్సంశయముగ మరణము బొంద గలడు. అనంతరమా విప్రుని భార్య మహా దారుణమగు నా శాపములను వినెను. అత్యంత దుఃఖితము జెంది యిట్లనియె. ‘సూర్యుడు ఉదయించ కుండు గాక’. ఇట్లు ఆమె శపించుటచే సూర్యోదయము గాకుండెను. ఎల్లవేళలా రాత్రిగానే యుండెను. ఇట్లు చాలా రాత్రులు గడిచెను. పిమ్మట దేవతలు భయము జెందిరి. అప్పుడు వారు ఇట్లు తలచిరి. స్వాద్యాయ, వషట్కార స్వధా, స్వాహాదులు లోపమయినవి. ఈ జగత్తు ఇటులైనచో జగద్రక్షణ ఎట్లు జరుగును? లోక నాశము గాకుండుటకు మార్గామే మున్నది? అహో రాత్ర వ్యవస్థ లేనిచో మానవులు, ఋతువుల విభాగ ముండదు. ఋతు విభాగము లేనిచో ఉత్తరాయణ, దక్షిణాయనములు దెలియవు.
అయిన విజ్ఞానము లేనప్పుడు సంవత్సర కాలమెట్లు తెలియును? సూర్యుడు పతివ్రతా వాక్యముచే ఉదయించుట లేదు. భానుడు ఉదయించక పోవుటచే స్నాన, దానాది క్రియలు లేకుండెను. అగ్ని హోత్ర కర్మలు లేకపోయెను. సమస్త యజ్ఞములు అభావమయ్యెను. కాల జ్ఞానము లేనిచో ఇష్టులు యజ్ఞాది క్రియలు లేకుండెను. చరాచర ప్రపంచమంతయు అంధకార బంధర మగుటచే సమస్త ప్రాణులు నశించెదరు. హోమములు లేనిచో మనకు తృప్తి గలుగదు. మానవులు యథోచితము లగు యజ్ఞ భాగములతో మనకు తృప్తి గలుగజేయు చుందురు. మనము సంతోషించి వర్షాదులచే వారికి సంతోషము గలుగ జేయు చుందుము. సమస్త ఔషధులు గలుగుటచే వారు యజ్ఞములచే మనల పూజించు చుందురు.
ఈ ప్రకారము మనము యజ్ఞాది పూజలచే వారి వారి కోర్కెల నిచ్చు చుందుము. మనము క్రిందికి జలమును వర్షించు చుందుము. మానవులు పైకి ఘృతమును వర్షించు చుందురు. మనము జల వర్షము చేతను మనుజులు ఘ్రుత వర్షము చేతను అన్యోన్యము సంతుష్టిని బొందు చుందుము. దురాత్ములగు కొందరు నిత్య నైమిత్తి కాది కర్మలను మనకు సమర్పించరు. లోభ బుద్ధులై యజ్న భాగములను స్వయముగా ననుభవించెదరు. మనము అట్టి వారలను నాశనము చేయుదుము. వారిని నశింప జేయుటకు భూమి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము అను ఈ పంచ భూతములను ( కల్మషము గల వానిని చేయుదుము.) పృథి వ్యాది పంచ భూతములు దూషితము లగుటచే దూషిత జలాదులను సేవించుదురు. మనకు యపకారము జేయునట్టి యా పాప కర్ములకు దుష్టము లైన జలాది భోగములచే రోగముల పాలగుదురు.
మేమట్టి మహాత్ములకు, సమస్త పుణ్య మయములగు స్థానముల నిచ్చు చుందుము. ఇప్పుడు వారి కెవ్విధమగు నాధారము లేదు. ఉపస్థితి లేదు. దీని కుపాయము తోచకున్నది. యజ్ఞాది కర్మలు నశించునని యాందోళన జెందుచున్న దేవతలు పరస్పర మిట్లు చెప్పుకొనసాగిరి. దిన సాంగత్యము మరల యెట్లు జరుగునో కదా! బ్రహ్మ దేవుడు దేవతల మాటలను విని యిట్లు జెప్పెను. దేవతలారా! తేజస్సుచే తేజస్సు, తపస్సుచే తపస్సు శాంతించును. అందువలన దేవతలారా! నా మాట వినుడు. పతివ్రతా ప్రభావముచే సూర్యుడు పైకి వచ్చుట లేదు. సూర్యోదయము కానిచో మానవులకు దేవతలగు మీకు హాని కలుగును. గావున యత్రి మహర్షి భార్య మహా తపస్విని మహా పతివ్రత యగు యనసూయా దేవిని ప్రార్థించుడు.
అమరులారా! సూర్యోదయము గావలయునను కోరికతో అత్రి పత్నిని ప్రసన్ను రాలిని గావించు కొనుడు.
అప్పుడు దేవతలు వెళ్లి ఆమెను ప్రసన్నురాలిని జేసుకొనిరి. పిమ్మట యామె ప్రసన్నురాలై మీకేమి గావలయునో కోరుడని బల్కెను. దేవతలు యథా ప్రకారముగా పగలు గావలయునని యాచించిరి.
దేవతలారా! పతివ్రతా ప్రభావ మెప్పటి కయినను క్షీణించదు. సురలారా! ఆ సాధ్విని గౌరవించి పంపెదను. తిరిగి అహోరాత్రములు గలుగు నట్లు జేసెదను. ఆమె భర్త శాపముచే నశింప కుండ జేసెదను.
మంగళ ప్రదురాలగు నామె దేవతలతో నట్లు జెప్పి యామె గృహమునకు బోయెను. ధర్మ దేవతకు నీ భర్తకు నీకు కుశలమే నా యని యడిగెను. భర్తృ సుఖమును గోరు కళ్యాణీ! ఆనందముతో యుంటున్నావా?
నీవు నీ భర్తను సమస్త దేవతల కన్న మిన్నయని తలంచు చున్నావా? భర్తృ సేవ జేయుట చేతనే నేను మహా ఫలమును బొందితిని. స్త్రీకి పతిసేవ వలన సర్వ కామ ఫలములు ప్రాప్తించును. ఎల్ల వేళలా మానవుడగు వాడు అయిదు ఋణములను దీర్చు కొనవలసి యున్నది. తన వర్ణ ధర్మ ప్రకారముగా విత్త సంచయము జేయవలెను. లభించిన ద్రవ్యమును విధి పూర్వకముగా సత్పాత్రులైన వారికి దానము జేయవలెను. ఎల్లప్పుడు సత్యము, మార్ధవము, తపస్సు, దానము, దయ వీటితో గూడి యుండ వలయును. మరియు ప్రతిదినము శ్రద్ధా పూర్వకముగా రాగ ద్వేషములను విడిచి బెట్టవలెను. యథా శక్తిగా సమస్త శాస్త్రోక్త క్రియల యొక్క యనుష్టానము జేయ వలెను. పురుషుడీ ప్రకారముగా తన శక్తి యొక్క యను సారముగా స్వజాతి విహిత ధర్మములను చేయువాడు ఉత్తమ లోకములను బొందును.
మరియు మహా క్లేశముచే క్రమముగా ప్రాజా ప్రత్యాది పవిత్ర లోకములకు వెళ్ళుటకు సమర్థుడగు చున్నాడు. స్త్రీ లయితే కేవలము పతిసేవా మాత్రము చేతనే పురుషుని యొక్క దుఃఖోపార్జితము లైన అన్ని పుణ్యములలో నర్థ భాగమును పొందు చున్నది. స్త్రీలగు ప్రత్యేకముగా యజ్ఞములు గాని, శ్రాద్ధములు గాని, యుపవాసములు గాని, శాస్త్రమందు విధించ బడలేదు. ప్రతి శుశ్రూషచే భర్త చేసిన పుణ్యములో సగము బొందు వారయ్యెదరు. స్త్రీ పతి సేవా ప్రభావము చేతనే యభీష్టము లగు సర్వ లోకములకు బోవుటకు సమర్థురాలగు చున్నది. ఈ కారణముచే హే సాధ్వీ! హే మహాభాగే! నీవు పతి దేవుని సేవ యందెల్లప్పుడు ప్రయత్నము గల దానవగుము. స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవము, పరమ గతియునై యున్నది. జూడుము. భర్త యగు వాడు దేవత లను, పితృ దేవతలను, అతిధి గణములను సత్కార పూజాది పుణ్య కర్మలను జేయును. భార్య పతి సేవ చేతనే యనగా శ్రద్దా భక్తులచే నననస్య చిత్తురాలై సేవించినచో పతి జేసిన ఋణ్య మందు సగము బొందును.
అత్రి పత్నియగు యనసూయ జెప్పిన యీ వాక్యములను విని, ద్విజ రమణి యత్యంతాదరముతో నామెను పూజించి యిట్లు బల్కెను. హే! స్వభావ శుభ దాయినీ! యిప్పుడు నేను ధన్యురాలను. అనుగృహీతురాలను. దేవతలు గూడ నేడు నా యందు గ్రహ దృష్టిని బ్రసరింప జేసిరి. నీవు నేడు మరల నా స్వామి యందు శ్రద్ధను వృద్ధిని బొందించితివి.
పతి ప్రసాదము చేతనే స్త్రీలు నీ లోకము నందును పర లోకము నందును సుఖములను అనుభవించు చున్నారు. కావుననే నారీ మణికి భర్త పరమ దైవమై యున్నాడు. స్త్రీకి పతితో సమానమైన వస్తువు లేదనియు, భర్త ప్రసన్ను డైనచో నీ లోక మందును పర లోక మందును ఉపకారమగు ననియు నాకు తెలియును. హే యశశ్వినీ! పతి ప్రసాదము చేతనే స్త్రీలు ఈ లోకమందును పరలోక మందును సుఖము లనుభవించు చున్నారు. గావుననే నారీ మణికి భర్త పరమ దైవమై యున్నాడు. హే మహాభాగే! హే శుభే! నా మందిరమునకు నీవు వచ్చితివి. పూజ్యురాలవైన నీకు నేను గాని, నా భర్త గాని జేయదగిన కృత్యము యున్న యెడల జెప్పుము.
హే సాద్వీ! నీ యొక్క వాక్యానుసారముగా అహర్నిశ విభాగము నశించినది. ఇందుచే సమస్త సత్క్రియలు నష్ట మైనవి. దీని కొరకు ఈ దేవతలంద రత్యంత దుఃఖితులై దేవరాజగు ఇంద్రునితో సహితముగా నా సమీపమునకు వచ్చిరి.
పూర్వపు మాదిరిగా అవిచ్చిన్న మైన పగళ్ళు రాత్రులను విభాగములు జరుగు చుండుటకు ప్రార్థించు చున్నారు. నే నిందు కొరకు నీ సమీపమునకు వచ్చితిని. నా మాటను వినుము. హే తపస్వినీ! దిన విభాగము లేనందున సమస్త యాగ కర్మలు శూన్య మయ్యెను. యజ్ఞములు లేనందున దేవతలకు పుష్టి లేక పోయెను. దిన వ్యవస్థ లేనందున సమస్త సత్కర్మలకు లోప మేర్పడెను. కర్మ లోపముచే అనావృష్టి సంభవించెను. అనావృష్టి వలన జగత్తంతయు నశించ గలదు. యిట్టి విపత్తు నుండి జగత్తును రక్షించ వలెనని నీవు దలంచినచో హే సాద్వీ! లోకములకు బ్రసన్ను రాలవు గమ్ము. సూర్య భగవానుడు గూడ పూర్వపు మాదిరిగా ఉదయించును.
హే మహా భాగే! మాండవ్య మహర్షి మహా క్రోధముతో నా భర్తను సూర్యోదయము కాగానే నీ భర్త మరణించును యని యిట్లు శాపమిచ్చెను.
నీ కభిలాష యున్నచో నీయొక్క పతి శరీరమును యథా ప్రకారముగా చేయ గలను. హే వర వర్ణినీ! పతివ్రతా స్త్రీల మహిమ నేను బాగుగా నెరుగుదును. పతివ్రతలు నాకు పూజనీయులు. అందు వలననే నిన్ను నేను గౌరవించు చున్నాను.
బ్రాహ్మణ స్త్రీ నీవు చెప్పినట్లే చేయుమని చెప్పెను. తరువాత తపస్వియగు యనసూయ నర్ఘ్యము సూర్యుని పైకి చూపించి సూర్య దేవుని యావాహనము జేసెను. అప్పుడు పది దినములు క్రమానుగతముగా రాత్రి యాయెను. అనగా నా సమయము వరకు పది రాత్రుల ప్రమాణము గడిచెనని భావము. అనంతరము వికసించిన కమలముతో సమానమైన ఎఱ్ఱని యాకృతి గల సూర్య భగవానుడు ఉదయాచలము నారోహించెను. తక్షణమే బ్రాహ్మణి యొక్క భర్త మరణించెను. భూ భాగ మందు పడిపోవు చున్న తన భర్తను యామె పట్టుకొనెను.
ఓ మంగళ ప్రదురాలా! నీవు విషాదము జెందకుము. పతి సేవ జేత మాత్రమే నేను సంపాదించిన తపోబలము ఎంతదో యిపుడే నీకు చూపించెదను. నేను రూప, శీల, బుద్ధి, వాక్య, మాధుర్యాది సద్గుణములలో నా భర్త కంటే నితరుడెవ్వడూ సరితూగ జాలడు యని నేను నిశ్చయముగా నమ్మితిని. ఇట్లు నేను నిశ్చయమైన పతి భక్తి గలదాన నైనచో నీ బ్రాహ్మణుడు వ్యాధి విముక్తుడై, యువకుడై భార్యా సహితముగా నూరు సంవత్సరములు జీవించు గాక! నేను, నా భర్త సమస్త దేవతల కంటే యధికుడని తెలసికొని యున్నాను. ఈ సత్య ప్రభావముచే యీ బ్రాహ్మణుడు రోగ రహితుడై మరల జీవించు గాక! మనో వాక్కాయ కర్మలచే భర్తృ సేవను గురించి ఎల్లప్పుడు నా మనస్సు నిత్యముగా నుండిన దాన నైనచో, నీ ద్విజుడు జీవించు గాక!
అనంతరమా బ్రాహ్మణుడు వ్యాధి రహితుడై, యువకుడై, జరా మరణములు లేని దేవత వలె దివ్య దేహ కాంతితో, గృహమును ప్రకాశింప జేయుచు లేచి నిలబడెను. తరువాత దేవతలు పుష్పములు వర్షించిరి. దేవ దుందుభులు మ్రోగెను. దేవతల యానందమునకు మేర లేదు. పిమ్మట దేవతలు పతివ్రతా శిరోమణి యగు అనసూయా దేవితో నిట్లు బలికిరి.
ఓ కళ్యాణీ! నీవు దేవతలకు మహా కార్యమును జేసితివి. వరమును గోరుకొనుము. సుపుత్రురాలా! ఆదిత్యోదయ మైనందున వరము గోరు కొనుము. తపస్వినీ! దేవతలు నీకు వర మిచ్చుటకు కుతూహలులై యున్నారు.
బ్రహ్మాది దేవతలారా! మీరందరు నాయందు ప్రసన్న చిత్తులై వరమీయ దలచిరి. వర యోగ్యురాలనని నన్ను దలచినచో వరదులగు మీరు బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులు పుత్రులగు నట్లు వరము ప్రసాదించుడు.
మరియు నా పతి సమేతముగా క్లేశములను బోగొట్టు యోగము గలదాన నగునట్లు వరమీయ గోరు చున్నాను.
అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలు నీవు గోరిన ప్రకారము యిచ్చితి మనిరి. తరువాత తపస్విని యగు నా యనసూయను యథా న్యాయముగా గౌరవించి వారి స్థానములకు బోయిరి. పిమ్మట బహుకాలము గడచినంత బ్రహ్మ దేవుని రెండవ కుమారుడునగు, అత్రి భగవాను డొక రోజున సర్వాంగ సుందరి, మనోహర మూర్తి , తన పత్ని యగు ననసూయ దేవిని ఋతు స్నాత మయిన దానిని చూచెను. ఆ మునీశ్వరుడు కామునికి వశుడయ్యెను. అనిందితు రాలగు నామెను మానసికముగా సంభోగము గావించెను. ఆమెను మోహముతో జూచు చుండ నా మునికి వికారము గలిగెను. రేత స్ఖలన మయ్యెను. వేగ వంతుడగు వాయు దేవుడు మహర్షి తేజస్సును తీసికొని బోయెను. ఊర్ధ్వ తిర్యగ్భావ రూపములుగా ప్రవహింప జేసెను. బ్రహ్మ తేజ సంపన్నమగు తెల్లని కాంతి యన్ని వైపుల పడు చుండెను.
రజో గుణ స్వరూపమగు నా తేజస్సు పడుచున్న సమయమున చంద్ర రూపముతో దశ దిశల యొక్క ఆశ్రయము బొందెను. సమస్త ప్రాణి జీవనాధారుడగు చంద్రుడు జన్మించెను. అనగా బ్రహ్మ రూపి యగు చంద్రుడు అత్రి ప్రజాపతి మానస రూపమున అనసూయ వలన జన్మించెను. సమస్త తత్వముల కాధారుడు, ఆయుర్ధాయ కారకుడు, మహాత్ముడగు విష్ణుమూర్తి గూడ నత్యంత సంతుష్టుడై తన యంశ ప్రధాన పూర్వకముగా సత్త్వ గుణావలంబి, ద్విజోత్తముడు నగు దత్తాత్రేయ రూపమున జన్మించెను. శ్రీ మహా విష్ణువు దత్తాత్రేయ నామముతో ప్రసిద్ధి జెంది సత్త్వో ద్రిక్తుడగు ద్విజోత్తముడుగా స్వ శరీరము నుండి యుద్భవించెను. అనసూయా దేవి యొక్క స్తన్య పానము చేసెను. ఈతడు సాక్షాత్తు నారాయణుడే. అత్రి మహర్షి రెండవ సుతుడుగా యవతరించెను. దత్తాత్రేయుడని ఖ్యాతి బొందెను. తరువాత కుపితుడైన రుద్రుడు తల్లి గర్భము నుండి ఏడు రోజుల లోనే జన్మించెను. ఉన్మార్గ గామి యగు హైహయాధిపతి దుష్ట స్వభావముచే తను, అత్రి మహర్షిని యవమాన రూపమగు యపరాధము జేయుట చేతను, రుద్రుడు వీనిని జూచి కుపితుడై హైహయుని దగ్ధము జేయుటకై యవతరించెను.
ఇంతియే గాక గర్భవాస దుఃఖమును సహించలేక బోయెను. ఇట్లు తమోగుణ ప్రదానమగు రుద్రాంశచే శ్రీ దుర్వాస మహర్షి యుద్భవించెను. ఈ ప్రకారముగా బ్రహ్మ, విష్ణు, శంకరుడు అను, ఈ మువ్వురు అనసూయా దేవికి పుత్రులుగా జన్మించిరి. బ్రహ్మ చంద్రుడాయెను. విష్ణుమూర్తి దత్తాత్రేయుడుగా బుట్టెను. శంకరుడు దుర్వాసుడుగా జనన మొందెను. దేవతల వర దానముచే నిట్లు జన్మించిరి. చంద్రుడు తన శీతల కిరణములచే లతలను, ఔషధులను మానవులను రక్షించును. ప్రజాపతి యగు చంద్రుడు ఇట్లందరినీ తృప్తి పరచును. ఎల్లప్పుడూ స్వర్గమందుండును. దతాత్రేయుడు దుష్ట దైత్యులను సంహరించి ప్రజలను గాపాడు చుండును. వైష్ణవాంశ యగు దతాత్రేయుడు శిష్టుల ననుగ్రహించెను. యోగ మార్గమును బోధించును. మహా యోగియని తెలియ వలెను. దుర్వాసుడు తన నవమానించిన వారిని దహించును.
రుద్ర శరీరావలంబనము జేసిన వాడు గాన దుర్వాసుడు, మనో వాక్కులచే దృష్టి ప్రసరణముచే దుష్టులను సంహరించును. భగవానుడగు అత్రి మహాముని చంద్రునికి సోమత్వ పదవిని యిచ్చి ప్రజాపతిని జేసెను. విష్ణు వంశతో జనించిన దత్తాత్రేయుడు యోగ నిష్టుడయ్యెను. విషయము లన్నిటినీ దర్శించెను. దుర్వాసుడు తల్లి దండ్రులను వదలి యుత్తమ వ్రతము నవలంభించెను. ఉత్తమ వ్రత మవలంభించి ఉత్తమ భావముతో ప్రపంచమున తిరుగు చుండెను. ముని పుత్రులను గూడ త్యజించ దలచి మునియగు దత్తాత్రేయుడు చిరకాలము నీటిలో మునిగి యుండెను. అటులైనను నా ముని పుత్రులు ప్రియ దర్శనుడు మహాత్ముడగు నా యోగిని విడువరైరి. సరస్సు యొక్క ఒడ్డున నా ముని కుమారులు యోగిని వదలక నచ్చటనే యుండిరి. ఇట్లు నూరు దివ్య సంవత్సరములు గడచినను తీర సంశ్రితులై యా చోటనే యుండిరి.
ఆ మహాయోగి యందలి ప్రీతిచే ముని కుమారులందరా దతాత్రేయుని విడవ నందున, వారు తనను త్యాగము జేయు నట్టి యుపాయము జేసెను. దివ్యాంబర ధారిణి నితంబిని సురూపవతియు మంగళ ప్రదాత్రి యగు నొక యువతిని వెంట బెట్టుకొని సరస్సు నుండి పైకి వచ్చెను. మునీశ్వరుడు స్త్రీ సన్నికర్షతో నున్న నన్ను ముని పుత్రులు వదలి వేయుదురని దలచెను. ముని కుమారులు విడచి బోయినచో తాను యోగనిష్టతో నేకాంతముగా యుండ గలుగుదు నని తలంచెను. అయినను నా మునికుమారు లా దత్తాత్రేయుని వదల లేదు. తరువాత దత్తాత్రేయుడు ఆ యువతితో గలసి మద్యపానము చేసెను. అప్పుడు గూడ ముని పుత్రులు మహాత్మునిగా భావించి త్యజించ లేదు. ఆ ముని పుత్రులు గీత వాద్యాది రమణీ సంభోగ సంసర్గ మున్నను వికార రహితుడగుట వలన మహాత్ముడని తెలసి కొనిరి. ఆ యోగిని యాశ్రయించు కొనియే యుండిరి.
ఆ యోగీశ్వరుడగు దత్తాత్రేయుడు తరుణీ సంభోగ మద్యపాన గీతావాద్యాది సంపర్గము గలిగినను చాండాల గృహ మందున్న వాయు దేవుని వలె దోషము జెందడు. యోగవేత్త యోగీశ్వరుడు నగు దత్తాత్రేయుడు సురా పానము తరుణీ సంభోగము జేయు చున్నను ముక్తిని గోరు యోగి జనులకు చింతనీయు డయ్యెను. కొంత కాలమునకు, బలవంతుడగు కార్తవీర్యార్జునుడు తండ్రియగు కృతవీర్యుడు స్వర్గస్థు డయిన పిమ్మట మంత్రులు పురోహితు లాతడిని రాజును జేయ దలచిరి. ఇట్లు పౌర జనులు గూడ రాజును జేయ దలచిరి. అప్పుడు వారితో నిట్లనియె. పురోహిత అమాత్య పౌరులారా! నేను నరక ప్రాప్తమగు రాజ్య పరిపాలనము జేయను. రాజ్య పాలన నిమిత్తము పన్ను తీసికొన వలసి యుండును. అట్లు తీసికొనుట దుర్లభము. పన్ను తీసికొని నప్పుడు రాజ్యమును ధర్మముగా పాలించ వలెను. వైశ్య జనము రాజునకు వస్తువులు విక్రయించి నందున వచ్చిన లాభములో పన్నెండు వంతులు పన్నుగా యీయవలెను.
ఇట్లు ఇచ్చినందున చోర భయము లేకుండ రక్షక భటులు తమను రక్షించు చుందురు. మార్గమున సుఖముగా బోవుదురు. గొల్లవారు దదిఘృత తక్రాదుల విక్రయములో వచ్చిన లాభములో ఆరవ భాగము, రైతులు గూడ ఆరవ భాగము రాజుకు ఇవ్వవలసి యున్నది. ఇట్లు రాజునకు ఇచ్చి ఇది రెండవ వానికి ఇచ్చినచో అందరు వ్యాపారులు వస్తువులకు అధిక భాగము తీసికొన వలసి యున్నది. అగ్ని హోత్రము, తపము, సత్యము, వేదాధ్యయనము, ఆతిధ్యము, వైశ్య దేవము, ఈ కర్మలన్నిటికి “ ఇష్ట” మని చెప్పబడును. దిగుడు బావి, బావి, చెరువు, దేవాలయములు, ఆర్తులకు అన్నదానము,ఈ సత్కర్మలను “పూర్త” మని యందురు. అధికముగా పన్ను తీసికొనినచో నా రాజు చోరుడుగా చెప్పవలెను. ఇంతియే గాక ఇష్టా పూర్తముల పుణ్యము నశించును. మరియు రాజు పన్ను దీసి కొనుచు తానూ పాలించక యితర వృత్తి నవలంభించి యితరులతో పాలనము జేయించినచో నరకమునకు బోవును.
ఇట్లు ఆరవ భాగము పన్ను, రక్షణ వేతనములకు గాను దీసికొని పాలించని నృపతికి తప్పక నరకము గలుగును. పూర్వము రాజులకు ప్రజా రక్షణ కొరకే వేతన రూపముగా పన్నులు చెల్లించెదరని పండితులైన వారు నిరూపించిరి. రాజు ప్రజలను రక్షింపక పన్ను తీసికొనినచో దొంగిలించిన దోషము గలవాడగుటచే వానిని దొంగగా భావన జేయవలెను. అందువలన నేను తపస్సు జేసి యోగి నయ్యెదను. యోగినై మనోభీష్టమును బొందెదను. భూమిని పాలించుటకు సమర్థుడు గావలెను. శస్త్రాస్త్రములు గలవాడు, మాననీయుడు గావలెను. అట్టి సామర్థ్యము గలవాడి నైనప్పుడు వృద్ది బొందిన వాడినై రాజ్యము జేయగలను. లేని యెడల వ్యర్ధముగా నన్ను బాపము పంచుకొను వానినిగా జేసికొనను. ఇట్లు బలికిన వాడై తన నిశ్చయమును మంత్రి మధ్య యందుండి జెప్పెను. బుద్ధిమంతుడు, వృద్దుడు, ముని శ్రేష్ఠుడు గర్గా చార్యుడు యను పేరు గల యొక మహర్షి భక్తి కృపా పూర్వకముగా రాజుతో నిట్లు బలికెను.
రాజ కుమారా! నీకు జక్కగా రాజ్య శాసనము జేయ వలెనని కోరిక యున్నచో నేను జెప్పెదను వినుము. జెప్పినట్లు జేయుము. సహ్యాద్రి పర్వతమున ఆశ్రమము జేసికొని ఉన్నవాడు, ముల్లోకములను పాలించు వాడు, మహాత్ముడునగు దత్తాత్రేయ మహాముని యారాధన జేయుము. ఆ మహర్షి పరమ యోగి, మహానుభావుడు, సర్వ సమదర్శి, జగద్రక్షణ కొరకు నారయణాంశచే జనించి భూభాగ మందు అవతరించి యున్నాడు. ఆ మహాత్ముని యారాధన జేసి, సహస్ర వేతృడగు ఇంద్రుడు దైత్యులను సంహరించి దైత్యుల పహరించిన తన స్థానమును బొందెను.
దేవతలు ప్రతాపవంతుడగు దత్తాత్రేయ మహర్షిని యెట్లారాధించిరి? ఇంద్రుడెట్లు దైత్యులను సంహరించి తన పదవిని బొందెను?
పూర్వము దేవతలకు, దానవులకు భయంకరమైన యుద్ధము జరిగెను. దేవతలకు ప్రభువు ఇంద్రుడు, దానవులకు రాజు జంభా సురుడు. వారిట్లు యుద్ధము జేయుచుండ సంవత్సర కాలము గడచెను. అనంతరము దేవతలు ఓడిపోయిరి. దైత్యులు జయించిరి. విప్రచిత్తి మొదలగు దానవులు దేవతలను జయించిరి. తరువాత దేవతలు శతృవులను జయించుటకు శక్తి లేక పలాయన పరాయణులైరి. దైత్య సైన్య వధ జేయ వలయునని కాంక్షించిరి. వాలఖిల్యాది మహర్షి సహితులై గురుడగు బృహస్పతి వద్దకు వచ్చి గురుని యడిగిరి.
దేవతలారా! మీరు విరుద్దాచరణ గల వాడయినను, తపోధనుడు, మహానుభావుడు అత్రి పుత్రుడు నగు దత్తాత్రేయ మహర్షిని భక్తితో శేవించి సంతుష్టుని జేయుడు.
వరదాతయగు నా మహానుభావుడు దైత్య వినాశనము కొరకు వరము నిచ్చును. దేవతలారా! అనంతరము దైత్య సహితులగు దానవులను వధింప గలరు.
శ్రీ దత్తాత్రేయుని యనుగ్రహముచే వధించుటకు సమర్థు లగుదురు. సందేహము లేదు. ఇట్లు జెప్పగా నప్పుడు ఆ దేవతలు దతాత్రేయాశ్రమమునకు బోయిరి. దేవతలు ఆశ్రమమున దత్తాత్రేయుని జూచిరి. లక్షీ సమన్వితుడై మదిరాపాన రతుడై యుండెను. గంధర్వులు గానము జేయుచుండిరి. ప్రశాంత చిత్తుడై యుండెను. అప్పుడా దేవతలు సమీపమునకు బోయిరి. భక్తితో సర్వార్ధసాదని యగు వందన మాచరించిరి. మధ్యమును త్రాగు వాడు గాన మద్యము మొదలగు పదార్థములు దెచ్చి సమర్పించిరి. దేవతలు దత్తాత్రేయ ముని కూర్చొని యున్న చోట కూర్చొను చుండిరి. నిలబడియున్న నిలబడిరి. పోవుచున్న ఎడ ఆయన వెంటనే బోవు చుండిరి. ఆసనమున కూర్చునినచో దేవతలు క్రింద యుండి చేతులొగ్గి యారాధించు చుండిరి.
అనంతరము దత్తాత్రేయ స్వామి త్రణతులైన దేవతల జూచి, “మీరు నా సమీపమున నుండి నన్ను శేవించు చున్నారు. నాకు శుశ్రూష జేయుచున్నా రెందులకు” అని యనియె.
ముని శార్దూలా! జంభాసురాది దానవులు మమ్ములను జయించిరి. భూర్భువాది ముల్లోకముల నాక్రమించిరి. సంపూర్ణ యజ్ఞ భాగము నపహరించిరి. పాప రహితుడా! తమరు వారిని వినాశనము జేయ ప్రార్థించు చున్నాము. మీరు వారిని వధించుట యందు బుద్ధిని నిలుపుడు. మమ్ములను రక్షించుడు. మీ యను గ్రహముచే మేము మరల మా స్వర్గమును బొందుదుము. ఇదియే మా కోరిక.
దేవతలారా! నేను మద్య పానము జేయువాడను. ఇంద్రియ నిగ్రహము లేని వాడను. నిరంతరము అపవిత్రుడను. ఇట్టి నేను ఎట్లు మీ శత్రువుల జయించుట గల్గును? నా వల్ల శత్రు జయము కల్గునని ఎట్లు దలంచితిరి?
ఓ జగన్నాథా! తమరు విద్యా ప్రక్షాళిత మగు పవిత్రాంతః కరణమున జ్ఞాన కిరణ సన్నివేశము గలవారు. గావుననే తమరు పాప రహితులు. ఏ విషయ వాసనలు మిమ్ముల నంటవు.
దేవతలారా! యథార్థమును గ్రహించితిరి. నేను విద్యా వంతుడను, సమ దర్శనము గల వాడను, అయినను, ఈ స్త్రీ సంసర్గముచే నేను అపవిత్రుడనైతిని. ఏ మనగా ఈ యువతికి సంతతము శేవ జేయుచు, ఈ స్త్రీ సంభోగము జేయుచున్నాను. స్త్రీ సంభోగము సర్వ దుఃఖములకు పుట్టినిల్లు. దేవతలు ఈ ప్రకారముగా జెప్పిన మాటలను విని మరల నిట్లు జెప్పసాగిరి.
ముని శ్రేష్టుడా! అనఘా! జగన్నాథా! ఈమె దూషితురాలు గాదు. ఈమె జగన్మాత. ప్రభో! సర్వజ్ఞుడవగు నీ హృదయ స్థితి యగు మహావిద్యా స్వరూపిణి. సూర్య కిరణములు బ్రాహ్మణ చండాల స్పర్శలచే దూషితములు గావు. అట్లు జగన్మాత యగు నీమె దూషితురాలు గాదు.
ముని వరుడగు దత్తాత్రేయుడు దేవతలు జెప్పిన యీ మాటను వినెను. కొంచముగా నవ్వెను. నవ్వుతూ దేవతలతో నిట్లనెను. దేవతలారా! నన్ను మీరు అట్లు తలంచుట సంతోషము.
సుర సత్తములారా! మీరెల్లరు రాక్షసులను యుద్ధమునకు బిలచి యిచ్చట నా దృష్టి గోచరము జేయుడు. ఆలసింపకుడు. అసురలకు నా యొక్క దృష్టి ప్రసారమను యగ్నిచే బలమును తేజస్సును క్షీణ మగును. నా దర్శన మాత్రమున నిశ్శేషముగా తక్షణమే నాశన మగుదురు.
దేవతలు దత్తాత్రేయుడు జెప్పిన యీ మాటలు విని రాక్షసులను యుద్ధమునకు బిలిచిరి. మహాబలవంతులు నగు అసురులు, రణము జేయుటకు వచ్చి , దేవతల నాక్రమించిరి. అనంతరము రాక్షసులు దేవతలను పీడించ సాగిరి. దేవత లెల్లరు భయాతురులైరి. దత్తాత్రేయుని యాశ్రమమునకు వచ్చిరి. దత్తాత్రేయుని శరణు వేడిరి. దైత్యులు పారిపోవు చున్న దేవతలను బిలుచుచూ వారి వెంట బోయిరి. ఆశ్రమము లోనికి జొచ్చిరి. మద్య పానముచే మత్తుడై యున్న మహానుభావుడగు నా దత్తాత్రేయ స్వామిని జూచిరి.
మరియు ఎడమ భాగమున నున్నదియు, సమస్త జగత్తునకు కోరిన కోర్కెల నిచ్చునదియు, మంగళములను గలుగ జేయు నదియు, చంద్ర బింబము వంటి ముఖము గలదియు, మనోహరాంగి యగు దత్తాత్రేయుని భార్యను జూచిరి. దైత్ములు నల్ల కలువల బోలు నేత్రములు గలదియు, పీనశ్రోణి పయోధరయు, సుమధుర భాషిణియు, చక్కని పలువరుస గలదియు, సంపూర్ణమగు స్త్రీ గుణములు గలదియును అగు లక్ష్మీ దేవిని జూచిరి. దానవులు ఎదుటగా నున్న లక్ష్మిని జూచి, యామె నపహరించ దలచిరి. ఉత్కటమగు మోహము గలవారైరి. కామవశు లైరి. మనస్సును నిగ్రహింపలేక బోయిరి. అప్పుడా యసురులు దేవతలను వదలిరి. లక్ష్మిని యపహరించ దలచిరి. పూర్వము జేసిన పాపకర్మ వారిని పాప కార్యమునకు ప్రేరేపించెను. ఆ ప్రేరేపణచే లక్ష్మి యందాసక్తులైరి. ఆ దైత్యు లిట్లను కొనసాగిరి. ఈ యువతి త్రిలోక సుందరి స్త్రీ రత్నము. త్రైలోక్య సారము అట్లుగా మనకు కనబడుచున్నది. మనమీ లలనా రత్నమును గ్రహించి నట్లయినచో కృతకృత్యుల మగుదుము. మన మనస్సు గూడ భావనా రహితమగును.
అందువలన ఓ దానవులారా! సురార్దనులమైన మనము ఈ యోషి ద్రత్నమును పల్లకి యందు యెక్కించి మన చోటికి తీసికొని బోవుదము. అని నిశ్చయించిరి.
తరువాత సాను రాగము గల యా దైత్యులు దత్తాత్రేయుని సమీపమునకు వచ్చిరి. కామబాణ పీడితులగు నా రాక్షసులు సాధ్వీ లలామ యగు నా దత్తాత్రేయ పత్నిని ఎత్తుకొని వచ్చి, పల్లకి యందున కూర్చుండ బెట్టిరి. దైత్య దానవులందరూ యేకమైరి. సిరస్సుల యందు పల్లకిని యుంచుకొని తమ స్వస్థానములకు బో సాగిరి. అప్పుడు ముని వరుడగు దత్తాత్రేయుడు చిరునవ్వు గలవాడై దేవతలతో నిట్లనెను. దేవతలారా! మీకు భాగ్యమిచ్చినది, ఈ లక్ష్మీ దేవత రాక్షసుల నెత్తి యెక్కినది. ఏడు స్థానముల నతి క్రమించినచో లక్ష్మి వారలకు తొలగి పోవును.
హే జగన్నాథా! లక్ష్మీ నివాస స్థానములు శలవిండు. ఏ ఏ స్థానముల యందు పురుషునకు శుభా శుభ ఫలములు జెందును?
లక్ష్మి పాద స్థాన మందున్నచో గృహమును ప్రసాదించును. తొడల యందున్నచో వస్త్రములు, రత్నములు, పలు విధములైన ద్రవ్యముల నిచ్చును. గుహ్య సంస్థ యగుచో సత్కళత్రము గలవాడగును. (క్రోడ వడి) యందున్న పుత్రుల నిచ్చును. హృదయ స్థాన మందున్న యడల పురుషుల మనోరథము లీడేర్చును. సర్వమునకు ప్రధాన భూతయగు లక్ష్మీ దేవి కంఠ స్థాన మందున్నచో లక్ష్మి యనుగ్రహము గల యట్టి వానికి కంఠ భూషణములు గలవాడగును. మరియు ప్రవాసులగు నభీష్ట బంధువుల సమాగమము, ప్రియతమా దారా పుత్రాదులతో వియోగము లేకుండుటయు గలుగును. క్షీర సముద్ర జాత యగు లక్ష్మి ముఖ స్థానమున నుండి నట్లైనచో మృష్టాన్నము, వాక్య లావణ్యము , ఆజ్ఞా సాఫల్యము, కవిత్వ లాభము గలుగును. లక్ష్మి శిరస్సు యందున్నచో నట్టి వానిని వదలి బోవును. అన్యుని యాశ్రయించును. ఇప్పుడీ లక్ష్మి యీ దానవుల శిరసున నుండుటచే వారిని త్యజించును.
అందువలన మీరు అస్త్ర శస్త్రములను గ్రహించి నిర్భయ చిత్తులై వారిని నాశనము జేయుడు. నా దృష్టి పాతముచే వారు తేజో హీనులైనారు. భయము జెందకుడు. బలాత్కారముగా పర భార్యా పహరణముచే వారి పుణ్యము నశించినది. ఈ కారణముచే మీరు ఎంత మాత్రము సంశయించక వారిని నాశనము జేయుడు.
పిమ్మట దేవతలు వివిధములగు శస్త్రాస్త్రములచే యుద్ధము జేయ సాగిరి. రాజ కుమారా! ఈ విధముగా శిరో భాగమున లక్షి నుంచుకొనుటచే దానవులు నశించి నట్లుగా వింటిని. తరువాత లక్ష్మీ దేవి వారి మస్తకముల నుండి దుమికినదై దత్తాత్రేయ సమీపమునకు వచ్చెను. పిమ్మట దైత్యులు చని బోవుటచే సంతోష చిత్తులగు ఇంద్రాది సమస్త దేవతలు మహాముని యగు దత్తాత్రేయుని స్తుతించిరి. దేవతలు మహర్షి యగు దత్తాత్రేయునికి నమస్కరించి యిట్లనిరి. హే కృష్ణా! హే జగన్నాథా! హే ప్రభో! తమకు జయమగు గాక!
హే నారాయణా! హే అచ్యుతా! హే అనంతా! హే వాసుదేవా! హే అక్షయా! హే అజరా! హే జనార్ధనా! తమ యనుగ్రహముచే సుఖము, లక్ష్మీ రాజ్యము, సంపత్తిని మేము బొందితిమి. హే శార్జధన్వా! హే చక్రపాణీ! తమరు భక్తులైన వారికి నిత్యమగు వాత్సల్యము గలవారలై యున్నారు. అని స్తుతించి దేవతా జనులు వారి వారి యథా స్థానములకు బోయిరి. గావున నో రాజేంద్రా! నీవు కూడ మనోభిలషిత మగు నఖండైశ్వర్యమును బొంద దలచినచో శీఘ్రముగా ముని వరుడగు దత్తాత్రేయుని యారాధింపుము.
Summary of chapter 15 of the Mārkandeya Mahā Purana is as follows:
The dialogue illuminates the pathways to liberation from hellish realms through sacred rites, ancestral shrāddha, and virtuous deeds. The execution of shrāddha ceremonies by dutiful descendants grants immediate relief to departed ancestors undergoing karmic retribution. The narrative extols the spiritual merit of holy pilgrimages, fasts, and sincere repentance in erasing ancient karmic debts and elevating souls to celestial abodes.