మార్కండేయ మహా పురాణము
112 - నాభాగ చరితము
ఓ ద్విజుడా! భార్గవుడగు ప్రమతి ఈ విధముగా సుదేవునికి శాపమిచ్చి త్రిలోకములను దగ్ధము చేయు నట్టి క్రోధము గలవాడై నలునితో నిట్లు పలికెను. “నీవు మదోన్నతుడవై నా ఆశ్రమ మందు నా భార్యను బలాత్కారముగా గ్రహించితివి. అందు వలన నీవు ఇప్పుడే భస్మమై పోదువు గాక.” ప్రమతి మహర్షి ఇట్లు శపించిన వెంటనే అతడి వచనములు పూర్తి యగుట తోడనే నలుని స్వదేహము నుండి పుట్టిన అగ్నిచే నలుని శరీరము తత్క్షణమే భస్మ రాసిగా అయ్యెను. అప్పుడా సుదేవుడు ప్రమతి యొక్క ప్రభావమును చూచి మమతను వీడి వినయముతో నమస్కరించుచు ఇట్లనెను. “ఓ భగవానుడా ! నన్ను క్షమించుము. ఓ భగవానుడా! సురాపాన మత్తుడనై మీ యెడల నేనెట్లు ప్రవర్తించితినో, దాని నంతయు క్షమించి నా యందు ప్రసన్నుడవై నీవు ఇచ్చిన ఈ శాపమును ఉపసంహ రించుము.”
ఎప్పుడయితే ఈ విధముగా రాజు వేడు కొనుటయు, నలుడు దగ్ధ మగుటయు జరిగెనో, అప్పుడు భార్గవ ప్రమతి యొక్క కోపము శాంతించెను. తిరిగి అతడు అనాసక్త చిత్తుడై ఇట్లు పలుక సాగెను. నా వచనములు ఎప్పటికి వృధా కావు. అయినను ప్రసన్నుడనై నిన్ను అనుగ్రహించు చున్నాను. కొద్ది రోజులు మాత్రము తప్పక వైశ్య జాతి వాడవగుదువు గాక. ఎప్పుడయితే ఎవరైనా క్షత్రియ కుమారుడు బలవంతముగా నీ కుమార్తెను గ్రహించునో, ఓ వైశ్యా! అప్పుడు నీవు తిరిగి క్షత్రియుడ వగుదువు. ఓ భూపాలా ! ఈ విధముగా నా తండ్రి సుదేవుడు వైశ్యు డయ్యెను. ఓ మహాభాగా! ఇప్పుడు నా గురించి కూడా సమస్తమును తెలిపెదను వినుము.
పూర్వము సురతుడను రాజర్షి గంధమాదన పర్వతము నందు వనములో ఆశ్రమము నిర్మించుకొని నియతాహారముతో సంగ రహితుడై తపస్సు చేయుచుండెను. ఒకనాడు ఒక డేగ నోటి నుండి భూమిపై పడిపోవు చున్న గోరు వంకను చూచి దయతో ఆ మహాత్మునకు మూర్చ కలిగెను. ఓ ప్రభూ తిరిగి తెలివి వచ్చిన పిమ్మట, ఆయన శరీరము నుండి నేను జన్మించితిని. అప్పుడాయన నన్ను చూచి స్నేహార్ద చిత్తముతో గ్రహించెను. మరియు ఇట్లు పలికెను. నా యొక్క కృప వలన ఈ కన్య జన్మను పొందినది. గావున ఈమె “కృపావతి” యను పేరు గలది యగును గాక. పిమ్మట నేను ఆయన ఆశ్రమ మందు నివసించుచు దిన దినము వృద్ధి నొందు చుంటిని. మరియు నా సమాన వయస్కులగు చెలికత్తెలతో సదా వనము నందు విహరించు చుంటిని.
ఒకనాడు అగస్త్యునితో సమాన ప్రభావశాలి యగు అగస్త్య భ్రాత ఆ వనములో పుష్పాదులను ఏరుకొను చుండెను. ఆ సమయమున నా సఖులు, ఆయనకు కోపమును కలిగించిరి. అప్పుడు ఆయన కృద్ధుడై నాకిట్లు శాపము నిచ్చెను. “నీవు నన్ను వైశ్యుడవని ఎగతాళి చేసితివి. ఆ కారణమున నీవు నా శాపము వలన వైశ్య కన్య వగుదువు గాక.” అని ఈ విధముగా దారుణ మగు శాపమును విని నేను ఆయనతో నిట్లంటిని, “ఓ ద్విజోత్తమా ! నేను మీకు ఏ విధమగు అపకారమును చేయ లేదు. ఇతరుల అపరాధమునకు నన్నెందుకు శపించు చున్నారు.?”
“కేవలము ఒక్క సురా బిందువు పడుట వలన ఏవిధముగా పంచగవ్వముతో నిండిన భాండము కలుషిత మగు చున్నదో, అట్లే దోషరహితులగు మనుష్యులు కూడా దుష్ట సాంగత్యము వలన దుష్టులగు చుందురు. ఓ బాలికా ! నీవు ప్రమాణ పూర్వకముగా “నేను దుష్టురాలను గాను” అని నన్ను ప్రసన్నుడను చేసితివి. అందు వలన నేను నీ యెడల అనుగ్రహించు చున్నాను. వినుము.
నీవు వైశ్య యోని యందు జన్మించి ఎప్పుడయితే నీ పుత్రుని రాజ్య లాభము కొరకు నియమించెదవో, అప్పుడు నీవు జాతి స్మరణమును పొందెదవు. మరియు నీ భర్తతో పాటు తిరిగి క్షత్రియురాలవై దివ్య భోగములకు అధికారిణి వగుదువు. ఇప్పుడు నీ ఆశ్రమమునకు వెళ్ళుము. భయమును వీడుము. ఓ రాజేంద్రా !ఈ విధముగా ఆ మహర్షి వలన పూర్వము నేను శాపమును పొంది యుంటిని. మరియు ప్రమతియు పూర్వము నా తండ్రికి ఇట్లు శాపము నిచ్చెను. అందువలన ఓ రాజా! మీరు గాని నా తండ్రి గాని వైశ్యులు కారు. ఈ విధముగా నేను దోషరహితు రాలనైనను నా సాంగత్యము వలన మీరు ఏ విధముగా దూషింప బడుచున్నారో, ఆ విధముగా ఇక మీదట మీరు ఎప్పటికిని దుష్టులు కారు.
Summary of chapter 112 of the Mārkandeya Mahā Purana is as follows:
The history of Prince Pūshadhra, son of Vaivasvata Manu, is recounted. While guarding his guru's cattle at night, Pūshadhra accidentally killed a cow mistaking it for a tiger in the dark. Cursed by his guru to become a Shūdra, Pūshadhra embraced life of intense penance, ultimately attaining liberation through fire meditation.