మార్కండేయ మహా పురాణము
58 - స్వారోచిషే మన్వంతరే బ్రాహ్మణ వాక్యం
ఓ మునిసత్తమా! ఎప్పుడయితే ఆ అతిథి పాదముల యందు లేపనము చేసెనో, అప్పుడు ఆ బ్రాహ్మణుడు “దినము నందలి ప్రథమార్థమునకే వేల యోజనములు వెల్లుదునుమరియు అపరాహ్నమునకు అక్కడినుండి కూడ తిరిగి రాగలను” అని అనుకొనిన వాడై అనేక ప్రవాహములతో నిండి యున్న హిమాలయ పర్వతములు చూచుటకు వెళ్ళెను. ఆ ద్విజవరుడు సహజముగానే హిమాలయ పీఠమునకు చేరుకొని ఆ హిమాచల భూమి యందు విహరింప సాగెను. అచట చరించు చుండగానే పాదములకు అధిక శీతలము సోకుటచే పరమోషధముల యొక్క లేపనము పాదముల నుండి కరిగి పోయినది. అప్పుడు ఆ బ్రాహ్మణుని గతి జడత్వముగా నుండెను. అనంతరము అతడు ఇటునటు తిరుగుచు ఆ హిమాలయ పర్వతము యొక్క మనోహర మగు సాను ప్రాంత భాగములను చూడ సాగెను.
అచట సిద్ధులు, గంధర్వులు, కిన్నెరులు విహరించు చుండిరి. మరియు ఆ పర్వత ఒడ్డున దేవతల క్రీడలకు విహరించుటకు అత్యంత రమణీయమగు ప్రదేశములు చేయ బడినవి. ఓ మునీ! ఆ ద్విజ శ్రేష్ఠుడు ఆ ప్రదేశమును వందల కొలది అప్సరసలతో నిండి యుండుట చూడ సాగెను. అనంతరము దేనిని చూచుట తోడనే అతని దేహము పులకించి పోయెనో, దాని వలన అతడు తన మనస్సును తృప్తి పరచ లేక పోయెను. ఆ బ్రాహ్మణుడు ప్రసన్న చిత్తముతో చూచుట ప్రారంభించెను. హిమాలయ పర్వతములు ఒక్కొక్క స్థానము నందు రాళ్ళపై నుండి జలరాశులు క్రిందకు పడుటచే సుందరముగా నున్నవి మరియొక చోట నెమళ్ళు కేంకారావముతో నాట్యము చేయు చుండెను. వాటి కేంకారావములతో శబ్దాయమానమై యున్నది. వేరొక చోట ఇతర అనేక పక్షులు పలు విధముల ధ్వనులు చేయుచున్నవి. మరియొక చోట అత్యంత మనోహరములగు దాత్యూహములు, వాన కోయిలలు, కోయష్టికములు, అను పక్షులు టిటిహరి (పెన్నడ పులుగు) అను మొదలగు పక్షులచే వ్యాప్తమై యున్నది. వేరొక చోట పుంస్కోకిలల మధురాలాపాలతో ప్రతి ధ్వనించు చున్నది. మరియొక చోట ఫల పుష్ప, గంధ సువాసితములతో వృక్షములు వాయువుచే వీచుచున్నది. ఆ బ్రాహ్మణుడు ఈ విధముగా హిమవంతమను మహాగిరి యొక్క శోభను చూసి అత్యంత ముగ్దుడయ్యెను.
ఆ తరువాత బ్రాహ్మణ కుమారుడు హిమవంతమను పేరు గల మహాచలమును చూచి తన మనస్సులో ఇట్లు అనుకొన సాగెను. “తిరిగి రేపు ప్రాతః కాలమందు వచ్చి చూచెదను.” అని నిశ్చయించుకొని గృహమునకు వెళ్ళుటకు సిద్ధ మయ్యెను. అక్కడ ఆలస్యమయి నందున పాద లేపనము కరిగి పోవుటచే జడుడుని వలె కదల లేని వాడై ఆ బ్రాహ్మణుడు ఇట్లు చింతింప సాగెను. “నేను అజ్ఞానముతో ఏమి చేసితిని? ఎప్పుడు నా పాదములకు ఈ శీతల జలముతో నష్టమై పోయినదో, అప్పుడు ఇక్కడి నుండి వెళ్ళుట చాలా కష్టము. ఈ పర్వతము మహా దుర్గము. నా గృహము చాలా దూరములో నున్నది. ఇప్పుడు నాకు గొప్ప సంకటము ప్రాప్తించినది. ఇక్కడ అగ్ని శుశ్రూషణాది కార్యములు ఏ విధముగా చేయుదును? అట్లు చేయని యెడల నిత్య క్రియలన్నియు నష్టమై పోవును. ఇది రమణీయ మైనది. అని ఈ విధముగా ఈ శ్రేష్ఠ పర్వత మందు ఆసక్తి కల వాడనై నూరు సంవత్సరము లైనను నేను తృప్తి పొందలేను.
ఆహా నాలుగు వైపులా నుండి చెవులకు ఇంపుగా, మధురముగా కిన్నెరుల సుఖదాయకమైన ఆలాపనలు వినిపించు చున్నవి. పుష్పించిన వృక్షముల నుండి సుగంధమును పొంది నాసిక తృప్తి పొందినది. ఇచ్చటి వాయువు యొక్క సుఖ స్పర్శ, సమస్త ఫలములు, సరస మనోహరమగు సరోవరముల యందు నా మనస్సు ఆకర్షింప బడుచున్నది. ఇప్పుడు ఈ విధముగా కొద్ది సేపు గడపిన పిమ్మట ఎవరయిన తపోధనులు కనిపించిన యెడల, వాని వలన గృహమునకు వెళ్ళు ఉపాయమును తెలుసు కొనెదను.
పాదములకు పూయ బడిన ఔషద శక్తి నష్టమై పోవుటచే అధిక దుఃఖము కలవాడై ఆ ద్విజవరుడు ఈ విధముగా చింతించుచు హిమాలయము లందు చరింప సాగెను. ఆ సమయమున వరూథిని అను పేరు గల మౌలేయ రూప శాలిని మహాభాగ అప్సరసలలో శ్రేష్టురాలునగు ఆమె ఆ ముని శ్రేష్ఠుడు చరించుట చూచెను.
ఆ ద్విజవరుని చూచుట తోడనే కామ బాణములచే పీడిత హృదయురాలై ఆ వరూథిని వెంటనే అతని యందు అనురాగము గలదయ్యెను. మరియు ఇట్లు అనుకొన సాగెను. “ఈ మనోహర ఆకృతి గల పురుషుడు ఎవరు? ఈతడు నన్ను అనాదరణ చేయనిచో నా జన్మ సఫల మగును. ఆహా! ఏమి ఇతని రూప మాధుర్యము? ఏమి మనోహర గతి విధి? ఏమి ఆ దృష్టి గాంభీర్యము నందలి చమత్కారము? భూమండల మందు ఈతడికి సమాన పురుషుడు ఎవరు? దేవ, దైత్య, సిద్ధ, గంధర్వ, పన్నగులు మొదలగు వారి నెందరినో చూచితిని. కాని వారిలో ఈ మహాత్మునితో సమానమగు రూపముల వాని నెవరినీ చూడలేదు. ఏ విధముగా నేను ఇతని ఎడల ప్రీతి గల దాని నైతినో, అట్లే అతడు కూడ నా యందు అనురక్తు డైనచో నా పూర్వ జన్మ కృత పుణ్య ఫలము ప్రాప్తించినదను కొనవచ్చును.
ఈతడు నన్ను స్నిగ్ధ దృష్టితో చూచినచో, మూడు లోకము లందును నాతో సమానమగు పుణ్యాంగనలు ఇంకెవరుందురు?
దివ్యంగాన యగు ఆ వరూథిని కామాతురురాలై ఈ విధముగా చింతించుచు తన మనోహరమగు సంపూర్ణ అంగ ప్రత్యంగములను ఈ బ్రాహ్మణునికి చూపించెను. బ్రాహ్మణ కుమారుడు ఆ శోభాయ మానమగు, రూపవతి యగు వరూథినిని చూసి, చక్కగా పాద్యాది ఉపచారములు తీసుకొని, ఆమె వద్దకు వెళ్లి ఇట్లు పలికెను. ఓ సుందరీ! నీ వర్ణము కమల గర్భముతో సమానముగ మనోహరముగా నున్నది. నీవు ఎవరవు? ఇక్కడ ఏమి చేయు చున్నావు? నేను బ్రాహ్మణుడను. అరుణాస్పదము నుండి ఇక్కడకు వచ్చితిని. ఓ మదిరేక్షణా! నేను దేని ప్రభావమున ఇక్కడికి వచ్చితినో అట్టి ఔషధ లేపనము నా పదముల నుండి మంచులో కరిగి పోయినది.
వరూథిని: ఓ మహాభాగా! నేను వరూథిని అను పేరు గల ప్రఖ్యాత అప్సరసను. ఎల్లప్పుడును ఈ రమణీయ పర్వతము నందు విహరించు చుందును. ఓ విప్రవరా! ఇప్పుడు నిన్ను చూసి నేను కామమునకు వశీభూతురాలనై నిందనీయురాల నైతిని. ఇప్పుడు నేనేమి చేయుదును? ఇప్పుడు నేను నీకు ఆధీనమైతిని.
ఓ శుచిస్మితా! నేను ఏ విధముగా నా గృహమునకు చేరుకొన గలనో అది నాకు చెప్పుము. ఓ కళ్యాణీ! పరదేశ మగుటచే ఇచట నాకు నిత్య నైమిత్తిక క్రియలకు హాని కలుగు చున్నది. బ్రాహ్మణులకు నిత్య నైమిత్తిక క్రియల యొక్క హాని మహా అనిష్ట కారకము. అందుచేత ఓ భద్రా! ఈ హిమాలయముల నుండి నన్ను పంపుము. బ్రాహ్మణులకు పరదేశము నందు ఉండుట ఎప్పుడును ప్రశంసనీయము కాదు. ఓ భీరూ! నేను ఏ అపరాధమును చేయలేదు. దేశములను చూడ వలెనను కుతూహలముతో పరదేశుడ నైతిని.
గృహము నందుండు బ్రాహ్మణునకు నిత్య నైమిత్తిక సంపూర్ణ కర్మలు సంపన్న మగును. కాని పరదేశుడ నగుటచే వాటన్నింటికిని హాని కలుగు చున్నది. ఓ యశస్వినీ! ఇంత చెప్పనేల? ఇప్పుడు ఏ విధముగా సూర్యాస్తమయమునకు ముందుగా నా గృహమును చూడ గలనో నీవు దానిని చెప్పుము.
ఓ మహాభాగా! ఏ దినము నీవు నన్ను వదలి నీ గృహమునకు చేరుకొందువో, ఆ దినము నాకు రాకూడదు. ఓ ద్విజ నందనా! స్వర్గము కూడా ఈ ప్రదేశము కంటే మనోహరముగా నుండదు. అందువలన నేను స్వర్గమును వదలి ఈ ప్రదేశము నందు నివసించుదును. ఓ కాంతుడా! ఈ రమణీయ హిమాచలము నందు నాతో విహరించుచూ నీవు నీ బంధువులను కూడా స్మరించ లేవు.
ఇచ్చట నీకు మాల్య, వస్త్ర, అలంకార, భక్ష్య, భోజ్య, అనులేపదాదులను కలుగ జేయుదును. ఎందుచేత ననగా కామాతురాలనై నేను నీకు వశీభూతురాల నైతిని. ఓ మహాభాగా! ఈ ప్రదేశము నందు నివసించుటచే వేణునాదము, కిన్నెరుల యొక్క మనోహరములగు సంగీతము, ఆహ్లాద జనితమగు వాయువు, ఉష్ణాన్నము, పవిత్ర జలము, అభిలషించు నట్టి శయ్య, సుగంధాను లేపనము, ఇవన్నియు నీకు సులభమగును. వీటన్నింటిని మించినవి నీ గృహమున మరేమున్నవి? మరియు ఇచ్చట నివసించుటచే నీకు ఎన్నటికిని ముసలితనము రాదు. ఎందుచేత ననగా ఇది దేవ భూమి. యౌవనమును వృద్ధి చేయునది. ఇట్లు చెప్పి అనురాగవతి యగు కమలముల వంటి నేత్రములు గల ఆ వరూథిని అత్యంత వ్యాకులత గలదై మధుర స్వరముతో “ప్రసన్నుడవు కమ్ము” అని పలుకుచూ ఆతనిని వెంటనే ఆలింగనము చేసు కొనెను.
ఓ దుష్టురాలా! నన్నుంటూ కొనకుము. ఎవరు నీకు యోగ్యుడగునో అతని వద్దకు పొమ్ము. నా ప్రార్థనను నీవు విపరీతముగా తలచి నన్ను కలవాలనుకొను చున్నావు. ప్రాతః సాయం కాలము లందు హోమము చేయుటచే నిత్యమగు, సంపూర్ణ, శాశ్వత లోకములు ప్రాప్తించు చున్నవి. మూఢురాలా! ఈ సమస్త త్రైలోక్యములు హోమము ద్వారానే ప్రతిష్టితమగు చున్నవి. అందువలన దానిని నిర్వర్తించుటకు ఏ యుపాయముచే నేను నా గృహమును చేరుకుందునో దానిని వెంటనే చెప్పుము.
ఓ విప్రుడా! నన్ను చూచి నీ వెందులకు ప్రసన్నుడ వగుట లేదు. ఈ హిమాలయములు రమణీయముగా నుండలేదా? గంధర్వ, కిన్నెరాదులే కాక ఇంకా ఏ పురుషుని నీవు ఇష్ట పడుదువో, నిస్సందేహముగా ఇచ్చటి నుండి నీవు ఆతని ఇంటికి పోగలవు. కాని ఈ సమయ మందు నాతో ఇక్కడ కొంచెము కాలము వరకు దుర్లభమగు సుఖమును అనుభవింపుము.
గార్హపత్యుడు, ఆహవనీయుడు, దక్షిణాగ్ని, అనుముగ్గురు అగ్నులు నాకు అభీష్టులు. అగ్ని గల గృహము నాకు రమణీయ స్థానము. విష్ణరిణీ వేదియే నాకు ప్రియురాలై యున్నది.
ఓ ద్విజుడా! ఎనిమిది విధాలగు ఆత్మా గుణములలో దయా గుణమే ప్రధానమైనది. మరి నీవు సద్ధర్మ పాలకుడవై యుండియు ప్రీతి దయ నా ఎడల ఎందులకు చూపుట లేదు? నేను నీ ఎడల ఎంతటి అనురాగతి నయివుంటి ననగా నీవు లేక జీవింప లేను. నేను అసత్యము చెప్పుట లేదు. నీవు నీ కులమునకు ఆనందము నిచ్చువాడవు. నా యెడల ప్రసన్నుడవు కమ్ము.
నీవు నా ఎడల నిజముగా ప్రీతి కలిగి ఉన్నట్లయితే మరియు నాతో ఏమి చెప్పితివో అవన్నియు అసత్యము కానిచో, నేను ఏవిధముగా నా గృహమునకు చేరుకుందునో దానిని నాకు చెప్పుము.
నీవు నిస్సందేహముగా ఈ ప్రదేశము నుండి నీ గృహమునకు పోగలవు. కాని ఇప్పుడు నాతో స్వల్ప కాలము వరకు దుర్లభమగు భోగములను అనుభవించి వెళ్ళుము.
వరూథినీ! శాస్త్రానుసారముగా భోగములు బ్రాహ్మణులకు కాదు. కారణ మేమనగా, అట్టి భోగములు బ్రాహ్మణునకు ఇహ లోకమున క్లేశములు, పర లోకమున విపరీత ఫలములు సంభవించును.
నేను మృతి చెందిన దానివలె నుంటిని. నన్ను రక్షించుటచే నీకు పర లోక మందు ఆ పుణ్య ఫలము ప్రాప్తించును. మరియు మరు జన్మము నందు నీకు దాని ద్వారా అనేక భోగములు సంప్రాప్తమగును. పర లోకము నందలి మరియు జన్మాంతర మందలి భోగములు, ఈ రెండు విధాల పుణ్యముల ఫలము నీకు లాభదాయకము కాని నన్ను నిరాశ పరచినచో నేను మరణింతును. అప్పుడు నీవు కూడా పాపమునకు భాగస్థుడ వగుదువు.
పరస్త్రీని కోరవద్దని మా గురువు గారు చెప్పిరి. అందుచేత నీవు విలపించినను లేక యౌవన త్యాగము చేసినను సరే నిన్ను నేను కోరను.
వరూథినితో ఈ విధముగా పలికిన వాడై ఆ నియమ వంతుడగు మహాభాగుడు అగు బ్రాహ్మణుడు ఆచమనా నంతరము శుద్దుడై గార్హ పత్యడగు అగ్నికి ప్రణామ పూర్వకముగా ఉపాంశు జపము ద్వారా ఇట్లు పలుక నారంభించెను. హే భగవాన్! గార్హపత్య అగ్నీ నీవే అన్ని కర్మలకు బీజ స్వరూపుడవు. ఆవహ నీయ,దక్షిణ అను ఈ ఇద్దరు అగ్నులు నీ వలననే ఉత్పన్నమైరి. ఇతరులెవరును వారిని ఉత్పన్నము చేయువారు కారు.
నీవు ప్రసన్నుడ వైతేనే దేవతలు వర్షాలు, ధాన్యములు, ఇత్యాదులను ప్రసాదింతురు. ధాన్యము వలననే జగత్తంతయు ప్రతిష్టితమై యున్నది. మరే విధముగాను ఉండుట అసంభవము. ఏ సత్యముచే ఈ జగత్తు నీ యందు ఈవిధముగా ఇమిడిపోయి ఉన్నదో, అట్టి సత్యము ద్వారా నేను వెంటనే సూర్యుడు ప్రకాశించు చుండగానే నా గృహమును చూచుదును గాక. ఏ సత్యము ద్వారా సంపూర్ణ వైదిక కర్మలు యథోచిత కాలములందు జరుగు చుండునో, అట్టి సత్యముచే నేను వెంటనే గృహవాసినై దివాకరుని చూచుడును గాక. ఏ సత్యముచే ఎట్టి సమయమునను నా మనస్సు పర ద్రవ్యముల యందు గాని, పరస్త్రీ యందు గాని అభిలాషిణి కాకున్నదో, అట్టి సత్యముచే నా యీ మనస్సు ఇప్పుడు ఈ విషయము నందు సిద్ధి లాభమును పొందు గాక.
Summary of chapter 57 of the Mārkandeya Mahā Purana is as follows:
The sacred geography and unique spiritual glory of Bhāratavarsha are celebrated as the exclusive karmabhūmi among all cosmic realms. Mārkaṇḍeya lists the seven holy mountain chains, major sacred rivers such as Gaṅgā, Yamunā, Sarasvatī, and Narmadā, declaring that even devas desire human birth in Bhāratavarsha to attain spiritual liberation through selfless action.