మార్కండేయ మహా పురాణము
66 - ఔత్తర మన్వంతర వృత్తాంతము ఋషి దర్శనము
ఓ బ్రాహ్మన్! మీరు స్వారోచిష మన్వంతరమును విస్తారముగా చెప్పితిరి. ఇదే విధముగా ఎనిమిది మన్వంతరములు, నిధుల గూర్చి నేను అడిగిన దానిని చెప్పుడు. స్వాయంభువ మన్వంతరమును మీరు ముందుగానే చెప్పితిరి. ఇప్పుడు ఉత్తముడను మూడవ మన్వంతర వృత్తాంతమును చెప్ప గోరెద.
సురుచి యను రాణి గర్భమున ఉత్తానపాద నృపతికి పరాక్రమశాలి యగు ఉత్తముడను పుత్రుడు జన్మించెను. ధర్మశీలుడు, పరాక్రమశాలి, మహాత్ముడునగు, ఉత్తమ మహారాజు తన పరాక్రమముతో ప్రాణు లందరిని మించి సూర్యునితో సమానముగా ప్రకాశించు చుండెను. ఓ మహా మునీ! ధర్మాత్ముడగు ఆ రాజు శత్రు మిత్రుల యందు, పరుల యందు, పుత్రుల యందును, సమదృష్టి కలిగి యుండెను. అతడు దుష్టులకు యమునితో సమానముగా ఉగ్రుడై శిష్టులకు చంద్రునితో సమానముగా సౌమ్య ప్రకృతి కలిగి యుండెను.
ఇంద్రుడు ఏ విధముగా సర్వ లోక విఖ్యాత యగు శచీ దేవిని వివాహము చేసు కొనెనో, అట్లే ఈ ఉత్తాన పాదుని తనయుడు, ధర్మజ్ఞుడగు బభ్రు కుమార్తె యగు బహుళ అను ప్రసిద్ధ కన్యను వివాహము చేసు కొనెను. ఓ ద్విజవరా! చంద్రుని మనస్సు ఏ విధముగా రోహిణి యందు అత్యంతాసక్తి కలిగి యుండునో, అదే విధముగా ఆ భూపాలుని మనస్సు కూడా ఆ బహుళ యందు అత్యంతాసక్తి కలిగి యుండెను. ఆ రాజు యొక్క చిత్తము బహుళ యందు గాక ఏ ఇతరుల యందును ఆసక్తి కలిగి యుండెడిది కాదు. ఇంత యేల? స్వప్న మందు కూడా ఆతని మనస్సు ఆ యొక్క ప్రియురాలినే అవలంభించెడిది. అనగా బహుళ కాక ఇతర స్త్రీ స్వప్న మందు కూడ ఆతని మనస్సు నందు స్థానము పొందలేక పోయెడిది. ఆ రాజు రూపవతి యగు ప్రియురాలిని దర్శించుట తోడ అంగములను స్పృసించును మరియు స్పృసించుటతోనే తన్మయుడగును. కాని ఆ రాణి ఆ రాజు యొక్క ప్రియ వచనములు చెవులకు సోకినను, తనను అత్యధికముగా గౌరవించినను కూడా తనను అవమానించి నట్లుగా భావించెడిది.
అతడు ఇచ్చిన పూల దండల యందు రమణీయములగు ఆభరణము లందు అనాదరము చూపును. అత్యుత్తమ ఆసనమును పొందు సమయమునను, ఆతని సమీపమున దుఃఖానుభవమును పొందుచూ వ్యధిత శరీరము గల దాని వలె అచటి నుండి తొలగి పోయెడిది. ఓ ద్విజోత్తమా! ఆ నరేంద్రుడు భోజనము చేయుచూ ఆమె చేయి పట్టుకొని తినుటకు ప్రార్థించినచో అప్పుడు అప్రసన్న చిత్తముతో కొద్దిగా మాత్రమే భుజించెడిది. ఈ విధముగా మహాత్ముడగు మహీపతి యెడల రాణి ప్రతికూలముగా నున్నప్పటికిని అతడు ఆమెపై అత్యధిక అనురాగము కలిగి యుండెను. ఒక సమయమున సంగీతములో శ్రేష్ఠులు, చతురలు అగు వారాంగనలు మధుర స్వరముతో రాజు సమీపమున గానము చేయు చుండిరి. అట్టి సమయమున భూపాలుడు సురాపాన సక్తుడై సమీపమున నున్న రాజ వర్గము ఎదుటనే సాదరముతో మనస్విని యగు ఆ భార్యకు మధువుతో నిండి యున్న పాత్రను ఇచ్చెను.
కాని ఆ రాజు లందరి సమక్షము నందు కూడ రాజు అతనికి విముఖురాలై ఆ పాన పాత్రను గ్రహించుటకు ఇష్టపడ లేదు. దీని వలన రాజు క్రోధితుడై సర్పము వలే బుసలు కొట్టుచు ద్వారపాలకుని పిలిచి ఇట్లు చెప్పెను. “ఓయీ! నాకు ప్రియతమ యగు ఈ బహుళ అప్రియునిగా యెంచి నన్ను నిరాదరము చేయు చున్నది. అందు వలన ఈ దుష్ట హృదయురాలిని వెంటనే తీసుకొని పోయి నిర్జన వనము లందు వదలి రమ్ము. నా ఆజ్ఞ మంచిదా? కాదా? అని విచారించ వద్దు.”
ఆ ద్వార పాలకుడు మంచి చెడుల నాలోచింపక “రాజుగారి ఆజ్ఞ” అని పలికి ఆమెను రథముపై ఎక్కించు కొని ఆ రాణిని వనము నందు విడిచి వచ్చెను. మహీపతి ఇట్లు వనము నందు విడువగానే ఆ రాణి రాజు తనను అనుగ్రహించి నట్లుగా తలచెను.
ఇచట ఆ భూపాలుడగు, ఉత్తానపాదుని పుత్రుడు రాణి యెడల అత్యంత ప్రీతి కల వాడగుటచే దుఃఖముతో దహించు హృదయము కలవాడై మరియొక భార్యను గ్రహింప లేదు. కేవలము దుఃఖిత మనస్సుతో సోభాయ మానమగు అవయవములు కలిగిన ఆ భార్యను స్మరింప సాగెను. కాని ఇట్టి స్థితి యందు కూడా ధర్మానుగతుడై ప్రజా పాలనము చేయుచూ తన రాజ్యము చేయు చుండెను. భూపతి ఔరస పుత్రుల వలె ప్రజలను పాలించు చుండెను. ఆ సమయమున ఒక రోజున ఒక బ్రాహ్మణుడు ఆతని సమీపమునకు వచ్చి దుఃఖముతో ఇట్లు చెప్ప సాగెను.
మహారాజా! నేను అత్యంత క్లేశమును పొందు చున్నాను. నా మాటలు వినుము. ఎందుచేత ననగా రాజుచే గాక ఇతరులెవరి వల్లను మనుష్యులకు క్లేశములు నివారింప బడవు. నేను రాత్రి నిద్రించు చుంటిని. అట్టి సమయమున ఇంటి ద్వారములు తెరవకనే ఎవరో నా భార్యను అపహరించిరి. ఇప్పుడు నా భార్యను తీసుకొని వచ్చుటకు నీవు అర్హుడవు.
ఓ ద్విజుడా! మీ భార్యను ఎవరు అపహరించిరి? మరియు ఎచట నుండిరి? ఇవేవియు నేను ఎరుగ నప్పుడు నేను ఎవరితో విరోధము చేయుదును? ఆమెను ఎచటి నుండి తీసుకొని వత్తును?
మహీపతి నేను నిద్రించు చున్నాను. గృహ ద్వారములు మూసి యున్నప్పటికి నా భార్యను ఏ విధముగా అపహరించెనో, అది తమరే ఎరుగ వలెను. ఎట్లనగా తమరు రాజు, ధర్మముగా ఆరవ అంశమును వేతన స్వరూపమున నియమింప బడితిరి. ఈ కారణము చేత మనుష్యులు నిశ్చింతగా రాత్రు లందు నిద్రించు చుందురు.
నేను మీ భార్యను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మీ భార్య యొక్క ఆకృతి అవస్థ స్వభావము ఇవన్నియు చక్కగా చెప్పుడు.
భూపాలా! నా భార్య కఠోర నేత్రములు కలది, అతి దీర్ఘాకృతి కలది చిన్న భుజములు కలది, పెద్దదగు ఉదరము గలది, సన్నని నడుము గలది, చిన్న వంబన స్తనములు కలది మరియు అత్యంత వికృత రూపము కలది అయిననూ నేను ఆమెను నిందింపను.
మహీపతి ఆమె వచనములు, స్వభావము ఈ రెండును అతి కర్కశముగా నుండును. మరియు ప్రథమావస్థ కొద్దిగా గడచి పోయెను. దుర్నిరీక్షణ యగు నా భార్య గురించి అన్ని వివరములు నీ ఎదుట చెప్పితిని. నా భార్య ఎట్లున్నదో దానిని యథార్థముగా నివేదించితిని.
ఓ బ్రాహ్మణా! మీకు ఆ కులక్షణ యగు భార్య యొక్క అవసరమేమి? నేను మీకు వేరొక భార్య నిచ్చెదను. శుభ లక్షణ యుక్తురాలగు భార్య సుఖము కొరకు మరియు మీ భార్య వంటి పత్నులు కేవలము దుఃఖము కొరకే. ఓ విప్రుడా! సౌందర్యము, సత్ స్వభావము, శుహములకు కారణము. అందుచే కురూపి, దుశ్శీలురాలగు భార్యను వదిలి వేయుట మంచిది.
ఓ మహీపాలా! “భార్య బాగుగా రక్షింప తగినది” అను వాక్యమును నేను ఎరుగుదును. భార్యను రక్షించుటచే సంతానమునకు రక్షణ కలుగును.
ఓ నరేశ్వరా! ఆత్మయే పుత్రుని రూపమున భార్య గర్భము నుండి జన్మించును. ఈ కారణముచే సంతానమును రక్షించుటచే ఆత్మకు రక్ష కలుగును. అందుచే భార్యను బాగుగా రక్షించుకొనవలెను. ఓ మహీపతీ! ఆ భార్యను చక్కగా రక్షింపనిచో వెంటనే వర్ణ సంకర మేర్పడును. అది పూర్వీకులగు పితరులను స్వర్గము నుండి క్రిందకు పడ వేయును. ఓ రాజా! గురు జనుల అనుజ్ఞచే అగ్ని యందు సమిధను వేల్చి ఈ కర్కశురాలగు భార్య నన్ను వరించినది. అందుచే ఈమెను వదలి ఏ విధముగా ఇతర స్త్రీతో మేలు పొంద గలను? ఎందుచేత ననగా అట్టి ఆచరణచే మనుష్యులకు గృహస్థ ధర్మము మరియు శాశ్వత బ్రహ్మ పదవి ప్రాప్తించును. ఇందు వలన పూర్వ స్త్రీతో ధర్మము చేయుటచే గృహస్థుడు దుఃఖమును పొందడు.
మరియు ఆమెను వదిలి ఎట్టి క్రియలు చేయునో, ఆతనికి వాని ఫలితములు ప్రాప్తించవు. ఏ స్త్రీ అగ్నితో పాటు గృహమునకు తీసుకొని రాబడునో, ధర్మ ప్రకారము గ్రహించుట యందు మొదటి ఆమెయే ప్రశంసా యోగ్యురాలు. ఆమెను వదిలినచో వర్ణ సంకరము జరిగే అవకాశము ఉన్నది. భార్యా హీనుడగుటచే నా ధర్మమునకు ప్రతి దినము హాని కలుగు చున్నది. ఈ విధముగా నిత్య క్రియలకు హాని కలిగినచో దీని వలన నేను పతితుడను గావలసి వచ్చును. ఓ పృథ్వీ నాథా! ఆ భార్య గర్భము నుండి నాకు ఏ కుమారుడు కలుగునో, అతడు మీకు ధర్మ పూర్వకముగా ఆరవ భాగము నిచ్చును. ప్రభూ! నేను ఈ అన్ని కారణములచే చెప్పున దేమనగా హరింప బడిన నా భార్యను తెచ్చి ఇమ్ము. ఎందుచేత ననగా మీరు మా రక్షణ కొరకు నియమింప బడినవారు.
ఉత్తమ మహారాజు ఆ బ్రాహ్మణుని వాక్యములు విని కొన్ని క్షణాలు ఆలోచించి, అన్ని ఉపకరణములతో నిండి యున్న ఒక మహా రథమును అధిరోహించెను. రాజు ఆ రథముపై కూర్చొని ఇటు నటు భూ భ్రమణము చేయుచు ఒక మహా వనము నందు ఒక అత్యుత్తమమగు తాపసాశ్రమమును చూసెను. అచ్చట రథము దిగి ఆ ఆశ్రమ మందు ప్రవేశించి దర్భాసనముపై విరాజమానుడై తన తేజస్సుచే మండుచున్న అగ్ని వలె దీప్తివంతుడగు ఒక మునిని చూసెను. రాజు రాగానే ముని వెంటనే లేచి అత్యంత గౌరవముతో స్వాగతము పలికి వెంటనే శిష్యునితో అర్ఘ్యము తీసుకొని రమ్మని చెప్పెను. అది విని శిష్యుడు మెల్లగా “ఈ రాజునకు అర్ఘ్య మిచ్చుట ఉచితమో అనుచితమో ఇది విచారించి అనుజ్ఞను ఇమ్ము. ఇప్పుడే మీ ఆజ్ఞను పాలింతును.” అని చెప్పెను. అనంతరము ఆత్మావంతుడగు ఆ ముని సమస్త వృత్తాంతమును తెలుసుకొని, సంభాషణము మరియు ఆసనము మాత్రము వరకే రాజును సన్మానించెను.
ఓ రాజా! మీరు ఉత్తముడను పేరు గల ఉత్తానపాదుని పుత్రులు. ఈ విషయమును నే నెరుగుదును. మీరు ఎందు కొరకు ఇక్కడకు వచ్చితిరి? మరియు మీరు అభిలషించు విషయమేమి?
ఓ మునీ! ఎవరో అజ్ఞాత వ్యక్తి ఒక బ్రాహ్మణుని గృహము నుండి అతని భార్యను అపహరించెను. ఆ ద్విజ పత్నిని వెదకుటకు నేను ఇచ్చటకు వచ్చితిని. ఓ భగవానుడా! నేను ప్రణతుడనై మిమ్ములను దేనిని అడుగుదునో, (గృహమునకు వచ్చిన మనుష్యుడు క్రుపా పాత్రుడు) దానిని విచారించి అనుగ్రహముతో దానిని అడుగుటకు అనుజ్ఞ నిమ్ము.
భూపాలా! నీ వడుగ తలచినది నిస్సందేహముగా అడుగుము. నేను చెప్పదగినది అయినచో మీకు యదార్థమే చెప్పెదను.
ఓ మునీ! మీ గృహమునకు రాగానే ముందుగా నన్ను చూచుట తోనే అర్ఘ్య మిచ్చుటకు ఉద్యుక్తు లైతిరి. కాని తిరిగి ఎందులకు ఆ కార్యము నుండి నివృత్తు లైతిరి?
ఓ రాజా! మిమ్ములను చూచుట తోనే ఉత్సుకతతో నేను అర్ఘ్య మిచ్చుటకు ఆజ్ఞ ఇచ్చితిని. ఆ సమయమున ఈ శిష్యుడు నాకు తెలియ జెప్పెను. ఏ విధముగా నేను అతీత వర్తమానములు, అన్ని విషయములను ప్రత్యక్ష పరోక్షములు గుప్త రూపము లైనను చక్కగా తెలిసికొన గలవో, అట్లే ఈ శిష్యుడు కూడ నా ప్రసాదముచే జగత్తు నందలి సమస్త భూత, భవిష్యత్, వర్తమాన కాలములను ఎరుగును. ఈ శిష్యుడు “విచారించి ఆజ్ఞ నిమ్ము” అని చెప్పగానే నేను విషయ మంతను తెలిసి కొంటిని. ఈ కారణముచే నేను నీకు యథా విధిగా అర్ఘ్యము నివ్వలేదు. ఓ రాజా! మీరు స్వాయంభువ మనువు యొక్క వంశమున జన్మించితిరి. అందుచే మీరు అర్ఘ్యమునకు యోగ్యులు. ఇది సత్యము. కాని నేను మిమ్ములను శ్రేష్ఠమగు అర్ఘ్యమునకు యోగ్యులు కారని తలంచితిని.
హే బ్రహ్మన్! జ్ఞానము చేత గాని అజ్ఞానము చేత గాని నేను ఎట్టి కార్యమును చేయుటచే క్రొత్తగా వచ్చినప్పటికీ కూడ మీ వద్ద అర్ఘ్యమునకు అయోగ్యుడ నైతిని.
ఓ రాజా! మీరు మీ భార్యను వనము నందు విడిచితిరి. అది మరచితిరా ఏమి? ఆ భార్యతో పాటు అన్ని ధర్మాలను విడిచితిరని తెలుసు కొనుడు. ఒక పక్షము దినముల వరకు ఎవని క్రియలకు హాని కలుగునో, ఆ మనుష్యుడు అట్టి హానిచే జన సమాజమున స్పృసించుటకు కూడ యోగ్యుడు కాడు. నీకైతే ఒక సంవత్సరము నుండి నిత్య నైమిత్తిక క్రియలకు హాని కలిగినది. భార్య లేనిచో మీ నిత్య కర్మలకు హాని కలుగును. దీని వలన అర్ఘ్యమునకు మీరు ఎంత యోగ్యులో, అది మీరే విచారించి చూడుడు. ఓ నరేశ్వరా! భర్త ఏ విధముగా చరిత్ర యుక్తుడు కాకపోయినను పతి ననుసరించి యుండుట భార్యకు ఎట్లు ఉచితమో అట్లే భార్య దుశ్శీలురాలైనను భార్యను భరించి పోషించుట అవశ్య కర్తవ్యము. ఓ రాజా! చూడుము బ్రాహ్మణుని ఏ భార్య హరింప బడినదో ఆమె ఇతనికి ప్రతికూలముగా నున్నప్పటికి కేవలము కర్మలు చేయ వలెనను కొని కార్యవంతు డగుటచే ఆ బ్రాహ్మణుడు ఇంత వెదకు చున్నాడు. ఓ మహీపతీ! ఎవరు ధర్మము నుండి భ్రష్టు లగుదురో, వారిని మీరే స్వధర్మ మందు నిలబెట్టు చుందురు. కాని స్వయముగా మీరే స్వధర్మము నుండి చలించినచో మిమ్ములను ఎవరు ప్రవృత్తులుగ చేయుదురు?
(అడవి చెరకు యొక్క పొలమును, ధాన్య భక్షణము చేసి తన జీవనము నిర్వహించు కొనినను, రాజు అన్యాయవర్తి అయినప్పుడు మరియు విద్వాంసులు పాపము చేసి నప్పుడు, ఈ ప్రపంచమున శిక్షించు వారెవరుందురు?)
బుద్ధిమంతుడగు ఋషి ఇట్లు చెప్పుటచే రాజు లజ్జితుడై అవన్నియు స్వీకరించి బ్రాహ్మణుని భార్య గూర్చిన వృత్తాంతమును అడిగెను. ఓ భగవాన్! జగత్తు నందలి అన్ని విషయములను మీరు ఎరుగుదురు. ఇప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీని ఎవరు అపహరించిరి? మరియు ఎచట నుంచిరి? మీరు అనుగ్రహించి చెప్పుడు.
భూపతీ! ఆ బ్రాహ్మణిని అద్రి పుత్రుడగు బలాకుడను రాక్షసుడు హరించెను. మీరు ఇప్పుడే ఆమెను ఉత్పలావత వనము నందు చూడగలరు. వెళ్ళుడు. ద్విజోత్తముని అతని భార్యను వెంటనే కలుపుడు. ఆ బ్రాహ్మణుడు మీ వలె దిన దినము పాపమునకు భాగస్థుడు కాకుండు గాక.
Summary of chapter 65 of the Mārkandeya Mahā Purana is as follows:
Svarochis is blessed with a radiant son named Dyutimān, born from his queen Manoramā. Dyutimān grows in wisdom and strength, performing intense penances to Sūryadeva and earning divine boons of universal sovereignty.