మార్కండేయ మహా పురాణము
113 - భలందనవత్సప్రీ చరితము
ధర్మజ్ఞుడగు రాజు భార్యా పుత్రుల వచనములు విని తిరిగి వారితో వేరు వేరుగా నిట్లు పలికెను. ముందుగా భార్యతో నిట్లు చెప్పెను. నేను నా తండ్రి గారి ఆజ్ఞానుసారము ఒకసారి రాజ్యము త్యజించితిని. దానిని ఇప్పుడు తిరిగి చేపట్ట లేను. నీవు వృధా వాక్యములను పలికి, ఎందులకిట్లు వృధా ప్రయాస నొందెదవు? పిమ్మట పుత్రునితో నిట్లు పలికెను. “నేను వైశ్య వృత్తి యందే ఉంటూ నీకు పన్నులు చెల్లిస్తాను. నీవు ఈ సంపూర్ణ రాజ్యము ననుభవించుము. నీకు యిష్టము గానిచో పరిత్యజించుము. రాజ పుత్రుడగు భలందనుడు ఈ విధముగా తండ్రి గారి ఆజ్ఞను పొంది ధర్మానుసారము రాజ్య పాలన చేయ సాగెను. మరియు యథా సమయమున వివాహము చేసుకొనెను. ఓ ద్విజుడా! ధరణీ చక్రమున ఆతడి రథ చక్రము అవ్యాహతముగా సంచరించెను. అతని మనస్సు ఎన్నడును అధర్మ మార్గము నందు నడువ లేదు. అందు వలన రాజు లందరును ఆతనికి వశమై యుండిరి.
అతడు యధావిధిగా యజ్ఞములను చేయుచూ, చక్కగా రాజ్యపాలన చేయు చుండెను. క్రమానుసారముగా పృథ్వి యందు అతని శాసనము వ్యాపించుటచే శత్రు శాసనుడైన అతడొక్కడే పృథ్వీశ్వరుడుగా విఖ్యాతి చెందెను. పిమ్మట ఆ రాజుకు ‘వత్సప్రీ’ అను పేరు గల పుత్రుడు కలిగెను. ఆ మహాత్ముడు గుణములలో తండ్రిని అతిశయించెను. విదూరథుని కన్య యగు “సౌనంద” వత్సప్రీతికి భార్య అయ్యెను. అతడు శౌర్యముచే ఇంద్రుని శతృవగు కుజ్రుంభుడను దైత్యనాథుని చంపి ఈ మహా పతివ్రత యగు భాగ్యశాలిని పొందెను.
హే భగవన్! వత్సపి ఏ విధముగా కుజ్రుంభుని చంపి సౌనందను పొందెను? దయ ఉంచి దానిని వివరింపుము.
భూమండలమున “విదూరథుడు” అను ప్రసిద్ధ కీర్తి గల ఒక రాజు కలడు. ఆ రాజుకు “సునీతి”, “సుమతి” అను ఇరువురు పుత్రులు కల్గిరి.
ఒకనాడు విదూరథుడు వేటకు వెళ్లి తిరిగి వచ్చు చుండగా మార్గమధ్యలో ఒక పెద్ద లోయను చూసెను. ఆ గర్తము భూదేవి ముఖమును నట్లుగా యుండెను. ఆ రాజు భయంకరమగు ఆ లోయను చూసి “ఈ లోయ ఏమిటి?” అనుకొని తిరిగి ఇట్లాలోచించెను. “ఇది పూర్వ కాలమున త్రవ్విన లోయ మాత్రము కాదు. ఇది పాతాళ మార్గమని నాకు తోచుచున్నది.” అని ఈ విధముగా ఆలోచించు చుండెను. అదే సమయమున ఆ నిర్జన ప్రదేశ మందు సువ్రతుడను ఒక బ్రాహ్మణ తపస్వి వచ్చు చుండుట చూచెను. ఆశ్చర్యచిత్తుడైన ఆ రాజు బ్రాహ్మణుని భూసంబంధమగు ఆ గంభీర లోయను చూపించుచూ దాని వివరము అడిగెను.
ఓ రాజా! దీనిని నీవెరుగవా? భూమి సంబంధమగు సమస్త వృత్తాంతమును రాజు తెలిసికొని యుండుట ఉచిత మైనది. నా ఉద్దేశ్యమున నీవు దీని గురించి వినుటకు నిజమైన యోగ్యుడవు.
మహా బలశాలి యగు ఉగ్రుడగు ఒక దానవుడు రసాతల మందు నివసించు చున్నాడు. వాడు భూమిని జృంభించుటచే అందరు వాడిని కుజృంభుడని పిలుచు చుండిరి. ఓ రాజా! ఈ భూమండల మందు స్వర్గ మందు ఒక్కచోట యేమి రాజ్యము నందలి ప్రతి ప్రాణి యందు జరిగిన సమస్త ఘటనలకు వాడే కారణము. నీవు దీనిని ఎరుగవా? పూర్వము విశ్వకర్మ “సునంద” అను పేరు గల ముసలమును నిర్మించెను. దురాత్ముడగు ఆ దానవుడు దానిని అపహరించి యుద్ద కాలమున ఆ ముసలముచే శత్రువులను వధించు చుండెను. మరియు ఆ ముసలము తోనే రసాతల మందు భూమిని త్రవ్వి ఇతర రాక్షసు లందరికి ద్వారము ఏర్పాటు చేసెను. ఆ “సునంద” అను పేరు గల ముసలము యొక్క దెబ్బలచే ఈ భూప్రదేశమును సొరంగముగా చేసెను. నీవు వానిని ఓడింపక ఏవిధముగా భోగముల ననుభవించెదవు? ఉగ్ర కర్ములగు దైత్యులు ముసలాయుధముచే అధిక బలశాలియై యజ్ఞ కర్మలను నాశనము చేసి దేవతలను పీడించుచూ, దైత్యులకు తృప్తిని కలిగించు చున్నాడు.
ఇప్పుడు నీవు పాతాళ మందున్న ఈ శత్రువులను ఓడింప గలిగినచో, సమస్త భూమికి అధిపతివై పరమేశ్వరు డగుటకు సమర్థుడ వగుదువు. జనులు ఈ ముసలమును “సౌనంద” అని చెప్పుదురు. విచక్షుణులగు పురుషులు కూడా దాని బలమును గూర్చి అట్లే పిలిచెదరు. ఆ ముసలము ఏ రోజు స్త్రీ చేతి స్పర్శను పొందునో, ఆ రోజు వీర్య హీనమును పొందును. కాని మరుసటి రోజే తిరిగి పూర్వము వలే బలశాలి యగును. కాని ఆ దుర్మార్గుడు ముసలము యొక్క ఈ ప్రభావమును మరియు స్త్రీ యొక్క హస్త స్పర్శ వలన అది తన బలమును పోగొట్టు కొనునను విషయమును ఎరుగడు.
ఓ రాజా! దుష్టులగు దానవుల బలమును గూర్చి యథాతథముగా నీకు చెప్పబడినది. ఇప్పుడు నేను చెప్పిన దాని ననుసరించి కార్యమును సాదించుము. ఓ రాజా! నీ పురము సమీపము నందే వాడు భూరంధ్రమును చేసినాడు. అయినచో నీవు నిశ్చింతగా ఎట్లుంటివి? అని ఎప్పుడయితే ఋషి ఈ విధముగా చెప్పి పోయెనో, అప్పుడు రాజు కూడా తన పురమునకు వచ్చి తన మంత్రులతో మంతనములు జరిపెను. ముసలము యొక్క ప్రభావము, వీర్యహాని మొదలగు ఏ ఏ విషయములు వినెనో, ఆ విషయము లన్నియు మంత్రులకు తెలియ జెప్పెను. రాజు ఈ విషయమును గూర్చి మంత్రులతో సభ చేయుచున్న సమయములో ముదావతి అను రాజు కుమార్తె పార్శ్వ మందు కూర్చొని దాని నంతయు విను చుండెను.
ఈ విషయము జరిగిన కొంత కాలమునకు ముదావతి తన సఖులతో ఉద్యానవనమునకు వెళ్ళెను. అప్పుడు కుజృంభ దైత్యుడు ఆ కన్యను అపహరించెను. ఈ విషయమును విని రాజు మండిపడి, కండ్లెర్ర జేయుచు ఆ వన ప్రదేశము నెరిగిన తన యిద్దరు పుత్రులతో ‘మీరు ఆ వన ప్రదేశమును ఎరుగుదురు. అందువలన వెంటనే వెళ్ళండి’. నిర్వింధ్యాలది ఒడ్డున ఒక సొరంగము గలదు. దాని ద్వారా రసాతలమునకు వెళ్లి ముదావతిని అపహరించిన ఆ దురాత్ముని చంపండి. అని పలికెను.
వెంటనే ఆ యిద్దరు రాకుమారులు ఆ సొరంగమునకు చేరు కొనిరి. ఆ సొరంగము లోని పాద చిహ్నముల ననుసరించి పోవుచు, అత్యంత క్రోధముచే సేనా సహితులై కుజృంభునితో యుద్ధము చేసిరి. ఆ సమయమున ఆయుధ విశేషములగు బరిశలు, శూలములు, గండ్రగొడ్డళ్ళు, శక్తి, బాణములు మొదలగు వానిచే దారుణమగు యుద్ధము జరిగెను.
కాని మాయా బలముచే బలవంతులైన దైత్యులు ఆ యుద్ద క్షేత్రమున రాజ పుత్రుల సైన్యమును సంపూర్ణముగా నాశనము చేసి ఆ ఇద్దరు రాజ కుమారులను బంధించిరి. ఓ ముని సత్తమా! పుత్రులను బంధించి రన్న వార్తను విని రాజు హృదయమున అత్యంత దుఃఖమును పొంది సైన్యముతో నిట్లు పలికెను. “ఎవరు ఆ దైత్యులను చంపి నా కన్యను మరియు నా యిద్దరు కుమారులను విడిపించుదురో, వారికి విశాల నేత్రములు గల నా కుమార్తె ముదావతి నిచ్చెదను.” ఓ మునీ! రాజు తన పుత్రులను, కన్యను విడిపించు విషయమున నిరాశను చెంది తన నగరమున ఈ విధముగా చాటించెను. బలవంతుడు, వీరుడు, అస్త్ర సంపన్నుడగు వత్సప్రీయను భలందన పుత్రుడు ఈ చాటింపును విని తండ్రిగారి మిత్రుడు పార్థివ సత్తముడగు విథూరథునకు నమస్కరించి వినయముతో నమ్రుడై ఇట్లు పలికెను.
“నాకు ఆజ్ఞ నిమ్ము. నేను ఇప్పుడే నీ యొక్క తేజో బలముచే ఆ దైత్యులను సంహరించి మీ యొక్క పుత్రులను మరియు కుమార్తెను విడిపించుదును.”
తన మిత్రుని పుత్రుడు అగు వత్సప్రీని హర్షముతో ఆలింగనము చేసుకొని ఇట్లనెను. “ఓ కుమారా! కార్య సిద్ధికై వెళ్లుము” “ఈ కార్యమును నీవు చేయగలిగినచో నిజమైన మిత్రుని పుత్రుడు తలపెట్టిన కార్యము సిద్ధించెనని తలంచెదను. ఓ కుమారా! ఈ కార్యమును చేయుటకు నీవు నీ మనస్సు అత్యంత ఉత్సాహమును చూపినచో వెంటనే ఈ కార్యమును సాధించుము.”
పిమ్మట మహావీరుడగు వత్సప్రి ఖడ్గము, ధనుస్సు అంగుళి త్రాణము మొదలగు ఆయుధములు ధరించి ఆ సొరంగ మార్గము ననుసరించి శీఘ్రముగా పాతాళమునకు చేరు కొనెను.
అక్కడ రాజ పుత్రుడు ఉగ్రమగు ధనుష్టాంకారము చేసెను. దాని వలన పాతాళమంతయు ప్రతి ధ్వనించెను. దానవ పతి యగు కుజృంభుడు ఈ ధనుష్టంకారమును వినుట తోడనే అత్యంత కృద్ధుడై తన సైన్యమును వెంట పెట్టుకొని వచ్చెను. అప్పుడు అత్యంత బలశాలురగు సైన్యము కలిగి యున్న రాజ పుత్రునితో అత్యధిక సేనచే బలవంతుడగు కుజృంభునికి గొప్ప యుద్ధము జరిగెను. దానవుడు మూడు రోజులు వారితో యుద్ధము చేసి క్రోధ చిత్తుడై ముసలమును తెచ్చుటకు పరుగెత్తెను. ఓ మహాభాగా! ప్రజాపతిచే నిర్మితమైన ఆ ముసలము గంధ, మాల్య, ధూప దీపాదులచే పూజింప బడి, అంతఃపురము నందు ఉంచబడెను.
ఇంతకు ముందు ముదావతి ముసలము యొక్క ప్రభావమును విని యుండుటచే ఆమె తన శిరస్సు వంచి దానిని స్పృశించెను. మరియు ఎప్పుడయితే అసురుడు ఆ ముసలమును తీసు కొనునో అప్పటి లోగా ఆ సుందరి దానిని పూజించు నెపముతో మాటి మాటికి స్పృశించు చుండెను. పిమ్మట ఆ అసురపతి యుద్ధ క్షేత్రమున ప్రవేశించి ముసలముతో యుద్ధము చేయ సాగెను. కాని శత్రువుల యెడల ముసలము యొక్క దెబ్బలు వ్యర్థమగు చుండెను. ఓ మునీ! సౌనంద అను ఆ ముసలము వీర్యహీన మగుటచే దైత్యులు అస్త్ర శస్త్రాదుల ద్వారానే శత్రువులతో యుద్దము చేయ సాగిరి. కాని దైత్యులు రాజ పుత్రుని అస్త్ర శస్త్రాదులచే గెలువలేక పోయిరి. మరియు వారి వద్ద వున్న ముసలము యొక్క బలము కూడా ఆమె బుద్ధి బలము వలన వ్యర్థమై పోయెను.
అందు వలన రాజ పుత్రుడు ఆ దైత్యుల అస్త్ర శస్త్రములను వ్యర్థ పరచి వారిని వెంటనే విరథులను చేసెను. అప్పుడు దైత్య రాజు తిరిగి కత్తిని, ఢాలును గ్రహించి రాజ పుత్రుని పైకి ఉరికెను. ఇంద్రుని శతృవగు ఆ దైత్యుడు క్రుద్ధుడై వేగముగా వచ్చుచుండ రాజ పుత్రుడు కాలాగ్ని వలె మెరియు చున్న ఆగ్నేయాస్త్రముచే ఆ దైత్యుని సంహరించెను. దేవతలా శతృవగు కుజృంభుడు ఆ ఆగ్నేయాస్త్రముచే గుండె పగిలి ప్రాణములు వీడెను. ఆ సమయమున పాతాళ వాసులగు ఉరగములు మహోత్సవమును చేసు కొన్నవి. రాజ పుత్రునిపై పుష్ప వృష్టి కురియ సాగెను. గంధర్వులు సంగీతమును ఆలపించిరి. దేవ దుందుభులు మ్రోగ సాగెను. రాజ పుత్రుడగు వత్సప్రీ ఈ విధముగా దైత్యుని అంత మొందించి సునీతి, సుమతి అను రాజ పుత్రులను మరియు కోమలమైన శరీరము గల రాజ కన్యయగు ముదావతిని విడిపించెను.
కుజృంభుడు మరణించిన పిమ్మట శేషుడను పేరు గల నాగ రాజు ఆ ముసలమును గ్రహించెను. మరియు ఓ ద్విజుడా! తపోధనుడగు నాగరాజు రాజ కన్య యగు ముదావతి యొక్క అభిప్రాయమును తెలుసుకొని ఆమె యెడల సంతుష్టు డయ్యెను. స్త్రీ కర స్పర్శ యొక్క ప్రభావమును తెలుసుకొని ముదావతి మాటి మాటికి ముసలమును స్పృశించుటచే, నాగరాజు ముదావతి మరియు సౌనంద యను పేరు గల ముసలము యొక్క గుణముచే “సునందా” అను పేరు పెట్టెను. పిమ్మట రాజపుత్రుడు ఆ యిద్దరు సోదరుల సహితముగా ఆ కన్యను వెంటనే తండ్రి సమీపమునకు తీసుకొని వెళ్లి నమస్కరించి ఇట్లనెను. “ఓ తండ్రీ! మీ ఆజ్ఞానుసారము మీ ఈ పుత్రులను, మరియు ముదావతిని తీసుకొని వచ్చితిని. ఇప్పుడు నేనింక ఏమి చేయవలెనో, దానిని ఆజ్ఞాపించుడు.”
అప్పుడు రాజు ప్రీతి పూర్ణ హృదయముతో హెచ్చైన ప్రీతి స్వరముతో “సాధు వత్సా” సాదువత్సా అని పలికి
తిరిగి ఇట్లనెను. ఓ కుమారా! ఈ రోజు నేను మూడు కారణముల వలన దేవతల ద్వారా కూడా ప్రశంసింప బడుచున్నాను. మొదటిది, నిన్ను నేను జామాతగా పొందితిని. రెండవది, శత్రువు మరణించెను. మరియు మూడవది, నా పుత్రులు, పుత్రిక స్వస్థ శరీరములతో తిరిగి వచ్చిరి. అందు వలన ఓ రాజ పుత్రా! నేటి ఈ శుభ దినము నందు నా ఆజ్ఞానుసారము శుభ లక్షణ యుక్తురాలైన నా ఈ కన్య ముదావతిని పరిణయ మాడుము. అట్లు చేసినచో నేను సత్యవాది నగుదును.”
“ఓ తండ్రీ! మీ ఆజ్ఞ తప్పక అనుసరించుటకు యోగ్య మైనది. అందు వలన మీరు ఏమి ఆజ్ఞాపించినారో దానినే చేయుదును. ఓ తండ్రీ! మీరు కూడా ఎరుగుదురు కదా! నేను పూజ్యులగు వారి ఆజ్ఞ ఎన్నటికిని తిరస్కరించను.”
అనంతరము రాజేంద్రుడగు విదూరథుడు ముదావతికి మరియు భలందన పుత్రుడగు వత్సప్రీ యను వానికిని వివాహ కార్యము నిర్వర్తించెను.
అనంతరము నవ యువకుడు వత్సప్రి ముదావతితో రమణీయ స్థానములకును మరియు ప్రాసాది శిఖరము లందు విహరించ సాగెను. కాలక్రమమున వత్సప్రి యొక్క తండ్రి భలందనుడు వృద్ధుడై వనములకు బోయెను. అప్పుడు వత్సప్రీ రాజై యజ్ఞానుష్టానమును మరియు ధర్మానుసారము ప్రజలను పాలింప సాగెను. ప్రజలు ఆ మహాత్మునిచే పుత్రుల వలె పాలింప బడుచు ఉత్తరో త్తరము సమృద్ధ శాలురై వర్దిల్లు చుండిరి. ఆతని రాజ్య మందు ఎక్కడను వర్ణ సంకరము లేదు. ఆతని శాసన కాల మందు చోరులు, హింసక జంతువులు దుర్మార్గులు మొదలగు వానిచే కలుగు ఉపద్రవములు లేకుండా నిర్భయముగా నుండెను.
Summary of chapter 113 of the Mārkandeya Mahā Purana is as follows:
The story of Prince Nābhāga unfolds as his brothers deprived him of his royal inheritance while he was residing at his guru's gurukula. Instructed by his father Manu, Nābhāga assisted the Angiras sages in completing a grand sacrifice, receiving vast wealth and establishing a prosperous kingdom through righteousness.