మార్కండేయ మహా పురాణము
12 - మహా రౌరవాది నరక వివరణము
కుమారా! నీవు జ్ఞాన ప్రదమగు మహా ఫలము నిచ్చు నట్టి యత్యంత సంసార గహనమును గురించి చక్కగా చెప్పితివి. మహామతీ! నీవు రౌరవాది నరకము లెన్నియో జెప్పితివి. వాటిని గురించి సవిస్తరముగా జెప్పుము.
తండ్రీ! నీకు మొదట రౌరవ నరకము గురించి జెప్పితిని. ఇప్పుడు మహా రౌరవ నరకమును గురించి జెప్పెదము. పొంద గూడని స్త్రీలను బొందిన వారు, అభక్ష్య భక్షణ రతులు, మిత్ర ద్రోహులు, స్వామి విశ్వాస ఘాతకులు, పర స్త్రీ గమనము జేయువారు, స్వభార్యా త్యాగము జేయువారు, మార్గములు, చెరువులు, తోటలు, పాడు జేయువారు.
వీరే గాక యితరులగు దురాచారులగు పాపుల నచ్చటికి తీసికొని బోయి యమ దూతలు దహించు చుందురు. ఆ మహా రౌరవ నరకము బన్నెండు యోజనముల సమాన ప్రమాణము గలదియు, దాని భూమి తామ్ర మయ మగు నదిగా నుండును. ఆ తామ్ర భూమి క్రింద నగ్ని హోత్రుడుండి దహించు చుండును. ఆ తామ్ర మయ భూమి యగ్నిచే తప్తమై మెరుపుల వలె యన్ని దిక్కులను బ్రకాశించును. ఆ జ్వాలలను స్పర్శ చేయుటకు గాని జూచుటకు గాని యతి మహా రౌద్రమై భయంకరముగా నుండును. యమదూతలు పాపాత్ముల పాదములను, జేతులను గట్టి దాని యందు బడ వైతురు. పాపాత్ములు దాని యందు దొర్లు చుందురు. దాని లోపలికి బోవు చుందురు. మార్గ మందు కాక, బక, వృక, ఉలూక, వృశ్చిక, మశక, గృద్రములు కరుచు చుండ, మరియు భక్షించు చుండ, యమ దూతలు త్వరితముగా నీడ్చుకొని బోవు చుందురు. పాపాత్ము లిట్లు దహింప బడుచు, వ్యాకుల చిత్తులై, తల్లీ! తండ్రీ! అన్నా! అని యిట్లు పలుమార్లు బిలుచుచు రోదనము జేయు చుందురు. ఉద్విగ్న హృదయులై శాంతిని బొంద లేని వారగుదురు.
ఎల్లవేళలా పాపములు జేయు దుష్ట బుద్ధులగు వీ రిట్లు వేల కొలది సంవత్సరము లను భవించిన పిదప నా నరకము నుండి విముక్తు లగుదురు. దీని తరువాత నంధకార బంధురమగు “తమ” మను నరకము గలదు. అది స్వభావముగా నత్యంత శీతలముగా నుండును. ఇది మహా రౌరవ నరకముతో సమానమగు ప్రమాణము గలదిగా నుండును. గోహత్య, భ్రాతృ హత్య, బాల హత్య జేసిన వారిని, యతి శీతలము, మహా దుఃఖదాయక మగు నీ నరకమున బడ వేయుదురు. దారునమగు చీకటియు, మహా శీతలమగు నా నరకమున బడ వేయబడిన పాపులు చీకటిలో శీతార్తులై యిటు నటు పరుగిడు చుందురు. మరియు చలిచే నొకరి నొకరు గౌగిలించు కొని పరస్పరాశ్రయమును బొందుచు, నివసించు చుందురు. శీతార్తులై మిక్కిలి వణుకు చుందురు. మిక్కిలి చలి వలన దంతము లూడిపోవును.అచ్చట యాకలి దప్పులు మిక్కుటముగా నుండును. మరియు నితర యుపద్రవము లెన్నియో యుండును.
మంచు గడ్డలు, దహించునట్టి దారుణ మగు చలి గాలిచే పాపుల ఎముకలు ముక్క చక్కలగును. మరియు వాటి నుండి మజ్జయు, రక్తమును స్రవించు చుండును. పాపు లత్యంత మగు నాకలి గొనియున్న వారగుటచే వాటిని భక్షింతురు. మరియు నొకరి యొక్క శరీరమును మరి యొకరు నాకుచుందురు. ఇటు నటు పరిగిడు చుందురు. ఈ ప్రకారమా తమో నరక మందున మహా దుఃఖము నను భవించు చుందురు. బ్రాహ్మణోత్తమా! యిట్లు పాప క్షయ మగునంత దనుక నా తమో నరకమున పాపులు క్లేశముల ననుభ వించు చుందురు. దీని తరువాత మరి యొకటి “నికృంతన” మను ప్రఖ్యాత మగు నొక ప్రధాన నరకము గలదు. తండ్రీ! యా నరకమున నిరంతరము కుమ్మరి సాలెలు తిరుగుచు నుండును. ఆ చక్రముల యందు పాపాత్ముల బడవైచి కర్తనము గావించు చుందురు. చూడక బోయినను చూచినట్లు, జూచినను జూడనట్లు జెప్పు వారీ నరకమున బడుదురు. ప్రణవ మంత్రోప దేశకుడగు గురుని భగవంతునిగా దలచని వాడు, గురు వాక్యములను శాస్త్ర వాక్యములను వినుపించు కొనని వాడు, నికృంతన మను నీ నరకమును బొందును.
పాపాత్ములు దురాచారులు నగు నా మనుష్యులు నికృంతన నరకమందు బడ వేయ బడుదురు. మరియు కాలం సూత్రముచే చేదింప బడుదురు. యమ దూతల చేతి యందున్న కాల సూత్రము ద్వారా పాదముల నుండి మస్తక పర్యంతము నరక బడుచుందురు. మరియు నో ద్విజోత్తమా! యిట్లు కోసివేయ బడినను వారు జీవిత భ్రంశమును బొందరు. వారి శరీరము వందల కొలది ముక్క ముక్కలుగా ఖండింప బడినను, మరల యవి యన్నియు ఏకమగును. ఈ ప్రకారము పాపకర్ముడగు మనుష్యుడు వేయి సంవత్సరములు చేదింప బడుచుండును. నిశ్శేషముగా పాప క్షయమగు వరక నచ్చట నుందురు. ఇక “ అప్రతిష్ట” మను నరక విశేషమును జెప్పెదను. అప్రతిష్ట నరక మందున్న పాపాత్ములు సహింప శక్యము గాని దుఃఖము ననుభ వించు చుందురు. స్వధర్మరతు లగు ద్విజులకు విఘ్నము జేయు వారలీ నరకమును జెందెదరు.
మరియు వానిని దారుణ మగు త్రాళ్ళచే బంధించి చక్ర సంకర నరకమునకు తీసికొని బోయెదరు. అచ్చట చక్రములు ఘటీ యంత్రము లుండును. పాప కర్మలు చేసిన నరులకు నా యంత్రములు దుఃఖ హేతువులగును. వాటి యందు మానవుల బడ వైచి త్రిప్పు చుందురు. సాధారణముగా వేయి సంవత్సరముల దనుక వారందులో యుందురు. కొందరిని జలమందు ఘటీ యంత్రము వలె బందింపుదురు. పాపులు మాటి మాటికి రక్తమును వాంతి జేసుకొను చుందురు. కొంతమంది ప్రాణుల ముఖము నుండి నరములు బైటికి వచ్చు చుండును. నేత్రముల నుండి రక్త ధారలు స్రవించు చుండును.అచ్చట నా పాపులు సహింప రాని దుఃఖముల బొందు చుందురు. మరియొకటి “యసి పత్రవన” మను నరకమును గూర్చి జెప్పెదను వినుము.
ఈ నరకము మండుచున్న యగ్నితో వ్యాప్తమై యున్న వేయి యోజనముల భూమి. బ్రహ్మచర్య వ్రత విఘ్నము, మరియు తపో విఘ్నము జేయు వారిని యిందు బడ వేయుదురు. మరియు నెల్లవేళల మానసికముగా బాధలు కలుగజేయు వారును, యీ అసిపత్ర వనమును బొందుదురు. ఈ అసిపత్ర వనము నందు మహా దారుణములు, ప్రచండములు నగు సూర్య కిరణములచే పాపులు మాడి పోవు చుందురు. నరక వాసులగు ప్రాణులు ఎల్లప్పుడచట చేసిన పాపములచే నందు బడుదురు. ఆ నరక మందతి మనోహరమగు వన మున్నది. అత్యంతము దత్త మగు నాకులతో నున్నట్లుగా భావింప బడు చుండును. మరియు నో ద్విజ శ్రేష్టా! ఆ యాకులన్నియు కత్తుల వలె నుండును. మరియు నచ్చట వేలకొలది బలీయము లును, చాలా పెద్దవగు కుక్కలతో శోభాయ మానముగా నుండును. మరియు నా కుక్కలు పెద్ద పులుల బోలు మహా వక్త్రములు, ఘోరములగు కోరలతో భయానకముగా నుండును.
అచ్చట జీవులు యాకలి దప్పికలచే పీడితు లగుచు, హా తల్లీ! హా తండ్రీ! యని యార్త ధ్వనులు జేయుచు నత్యంత దుఃఖితులై బోవుచుందురు. అట్లచ్చటికి బోయిన జీవుల పాదములను భూమి యందున్న నిప్పుల కుప్పలు దహించు చుండును. ఆ యసి పత్ర వనమందలి గాలి మిక్కుటముగా వీచు చుండును. ఆ జీవుల మీద కత్తులు విసరి వేయుదురు. అప్పుడచ్చట నున్న మండుచున్న నిప్పుల కుప్పల గూల్చెదరు. అనంతర మచ్చట నతి భయంకరము లగు కుక్కలు వచ్చి యిట్లేడ్చు చున్న జీవుల సర్వాంగములను కరచి ముక్క ముక్కలు జేయును. ఇట్లు భీషణములగు కుక్కలు రోదనము జేయుచున్న వారి శరీర చర్మమును శరీరాంగములను భేదించును. తండ్రీ! దీనిని “యసిపత్ర వన” మని యందురు. దీని వృత్తాంతమును తమకు జెప్పితిని.
దీని తరువాత దీని కన్న భయంకరమగు “తప్తకుంభ” మను బేరు గల నరకమును గురించి జెప్పెదను. వినుడు. ఈ నరకమున అన్ని వైపులా మంట లెగయు చుండును. వహ్ని జ్వాలలచే మరుగు చున్న తైలము, లోహ చూర్ణ పరి పూర్ణమై తప్త కుంభము లుండును. అట్లు మరుగు చున్న బానలందు తల క్రిందుగా బడ వేయుదురు. ఎవరు ధర్మ శాస్త్రములను దూషణము జేయుదురో, తీర్థ క్షేత్రముల బాడు జేయుదురో, ప్రియమైనది, శుభ చారిణి సర్వ సుఖములు భోగములను భవింప జేసిన యుత్తమురాలగు స్త్రీని యే దోషము కనబడక పోయినను మూఢ బుద్దియై త్యజించునో, యట్టి వారిని దీసుకొని వచ్చి శీఘ్రముగా తప్త లోహ కుంభముల బడవేసి యుడక బెట్టుదురు. ఆ సమయమున వారి శరీరములు పగిలి పోవు చుండును. మజ్జా జలమంతయు దహింప బడును. భయంకరము లగు గ్రద్దలు కపాల, నేత్ర, అస్థులను పొడుచుచు పెరికి వేయు చుండును.
మరియు నా గృద్రములు వారి శరీరములను ముక్కులతో కరచుకొని పైకి దీసుకొని పోయి వేగముతో మరల నా శరీరముల నందులోనే పడవేయును. వారి శరీరములు చిమ చిమలాడుతు నా తైలములో గలసి బోవును. తరువాత యమ దూతలు గూడ పెద్ద వగు గరిటలతో గలియబెట్టు చుందురు. జనకా! యీ విధముగా పాప కర్మలు పొగలు బారుచు సుడులు దిరుగు చున్న యా తైల కుంభముల యందెట్లు మదింప బడు చుండెదరో దాని నంతయు సవిస్తరముగా నీకు జెప్పితిని. దీనినే “తప్త కుంభ” నరకమని యందురు.
Summary of chapter 11 of the Mārkandeya Mahā Purana is as follows:
The enlightened son instructs his father on the inevitable cycle of saṃsāra and the precise workings of karmic fruit. Every action performed in thought, word, or deed leaves a subtle impression that determines the soul's future embodiment across human, animal, or divine species. Virtue leads to celestial realms of light and joy, whereas unrighteousness drags the mind into dense delusion and painful rebirths, emphasizing that true freedom lies only in transcending worldly attachment.