మార్కండేయ మహా పురాణము
43 - బ్రహ్మాయుః ప్రమాణ కథదమ్
హే భగవాన్! మీరు అండముల ఉత్పత్తి, బ్రహ్మాండ మందు మహాత్ముడగు బ్రహ్మ యొక్క జన్మము విధిగా వర్ణించితిరి. హే భ్రుగు వంశోద్భావా! ప్రళయాంత మందు సమస్త సంహారము జరిగిన పిమ్మట ఎప్పుడు సృష్టి యొక్క వెలుగు కొంచమైనను ఉండదో, ఆ తరువాత తిరిగి ఏ విధముగా భూత గణముల ఉత్పత్తి కలిగినది? ఇప్పుడు ఆ విషయమును విన వలెనని అభిలషించు చున్నాను.
ఏ సమయ మందు ఈ విశ్వము ప్రకృతి యందు లీన మగునో, అప్పుడు విజ్ఞులు దానిని ప్రకృతి ప్రళయమని చెప్పిరి. ప్రకృతి ఆత్మ యందు స్థితి కలిగి యుండుటచే సంపూర్ణ సృష్టి పదార్థము సంహారమును పొందు చున్నది. ఏ సమయ మందు ప్రకృతి పురుషుని సాధర్మ్య మందు అవస్థితమై యుండునో, ఆ కాలమందు సత్త్వ, తమములను రెండు గుణములు సమభావ సహితముగా అధిష్టితమై యున్నవి. ఆ సమయ మందు వాటి యందు ఎవరికినీ ఏ విధముగాను వృద్ధి లేక నూతనత్త్వము విరాజిల్లదు. అవి రెండును పరస్పర సమ భావములతో కలిసి పోయి అధిష్టితమై యుండును.
నువ్వుల యందు తైలము మరియు పాల యందు ఘృతము వలె రజో గుణము కూడా సత్త్వతమో గుణముల యందు లీనమగుచు స్థిరముగా నుండును. సర్వేశ్వరుడగు బ్రహ్మ యొక్క పరమాయు యొక్క పరిమాణము ద్విపరార్థ పర్యంతము. బ్రహ్మ యొక్క పగలు పరిమాణము ఏ విధముగా నుండునో, రాత్రి కూడా అదే పరిమాణము కలిగి యుండును. (ఎనిమిది సహస్ర యుగములు ప్రజాపతికి ఒక పగలు ఒక రాత్రి యగును. ఈ పరిమాణమున బ్రహ్మ నూరు సంవత్సరములు జీవించును. ఇట్లు బ్రహ్మకు నూరు సంవత్సరములు గడచినచో విష్ణువు యొక్క స్థితికి ప్రమాణము. శివుని యొక్క అర్థ నిముష మందు పదు నాలుగు వేల విష్ణువులు కలిగెదరు. బ్రాహ్మలు ఎందఱో, దీనికి సంఖ్య లేదు. ఇది క్షేపకము.) అతడు జగత్తునకు మూలము అతనికి ముందు ఎవరూ లేరు. అతడు అందరి యొక్క కారణమునకు, అచింత్యాత్మకు, పరమేశ్వరునికి మరియు క్రియలకు అతీతుడు. అతడు జగత్పతి పరమ యోగ హేతువు. ప్రకృతి మరియు పురుషుల యందు ప్రవేశించి వారిని వ్యాకుల బెట్టును. మద గర్వము మరియు వసంత వాయువు ఏ విధముగా నవ యువతుల అంతస్సు నందు ప్రవేశించి వ్యాకులత కలుగ జేయునో, యోగ మూర్తి మంతుడగు బ్రహ్మ కూడా అదే విధముగా ప్రకృతి పురుషులకు వ్యాకులత కలుగ చేయును.
ప్రకృతి క్షోభిత మగుటచే ఆ బ్రహ్మ అను పేరు గల దేవత అండకోశ మందు ప్రవేశించి సముత్పన్న మగును అని నేను నీకు చెప్పితిని. అతడు మొదట కలత బెట్టును. తిరిగి ప్రకృతి యొక్క పతి అయి స్వయంగా కలతను బొందును. ఈ విధముగా సంకోచ, వికాసముల ద్వారా అతడు ప్రకృతి రూప మందు విరాజిల్లును. అతడు జగత్ యోని నిర్గుణ మయినప్పటికి రజో గుణమును అవలంభించి బ్రహ్మ యొక్క రూపముతో ఉత్పన్నమై సృష్టిని చేయుటకు ఉద్యుక్తు డగును. ఆ బ్రహ్మ రూపముచే ప్రజా సృష్టి పూర్వకముగ సత్త్వగుణ మదిక మగుటచే విష్ణు రూపమును ధరించి న్యాయాను సారముగ ప్రజా పరిపాలన చేయును. అనంతర మందు తమోగుణ మదిక మగుటచే రుద్ర రూపమును గ్రహించి సంపూర్ణ విశ్వమును సంహారము చేయుచూ శయనించును. ఏ విధముగా అతడు నిర్గుణుడై నప్పటికి పైన చెప్పిన మూడు కాలము లందూ మూడు గుణములను భజించెను.
అందరి యొక్క జనన క్షేత్రము, సర్వవ్యాపి యగు ఆ ఈశ్వరుడు ఈ విధముగా సృజనము, రక్షణము మరియు సంహారము చేయుటచే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పేర్లు ప్రాప్తించినవి. ఆ బ్రహ్మత్వములో సంపూర్ణ లోకముల ఉత్పత్తి రుద్రత్వములో సంహారము, విష్ణుత్వములో ఉదాసీనుడు అయి పాలించెను. స్వయంభువునకు ఈ మూడు అవస్థలు కలిగినవి. బ్రహ్మయే సాక్షాత్తు రజో గుణుడు మరియు జగత్పతి విష్ణువు సత్త్వ గుణుడు. ఈ విధముగా రుద్రుడు తమో గుణుడు. ఈ ముగ్గురు దేవతలు మూడు గుణము లందు పరస్పరము నిపుణ భావముతో పరస్పరమును ఆశ్రయించు కొనుచు విరాజిల్లు చుందురు. క్షణ మాత్రము కూడా వీరికి వియోగము ఉండదు మరియు ముహూర్త మాత్రమున కూడా ఎవరు ఎవరినీ పరి త్యజించరు. ఈ విధముగా జగత్తునకు ఆది దేవ దేవుడు చతురాననుడు రజో గుణమును అవలంభించి అందరిని సృష్టించుట యందు ప్రవృత్తు డగును.
హిరణ్య గర్భుడు ఆది దేవుడు మరియు ఒక విధముగా అనాది. భూ పద్మ కర్ణిక యొక్క అవలంబన పూర్వకముగా అందరి కంటే ముందుగ జన్మించెను. ఆ మహాత్ముని యొక్క పరమాయువు సంఖ్య బ్రహ్మ మానముచే శత వర్ష నిరూపితము వాని సంఖ్య చెప్పెదను వినుము. పదునైదు నిమేషముల కాలము ఒక కాష్టము ముప్పది కాష్టములు ఒక కళ. ముప్పది కళలు ఒక ముహూర్తము మరియు ముప్పది ముహూర్తములు మానవునికి ఒక పగలు, ఒక రాత్రి కాల మగును. ముప్పది దివా రాత్రములు, లేక రెండు పక్షములు ఒక మాసము అగును. ఆరు మాసములు ఒక ఆయనము. రెండు ఆయనములు ఒక సంవత్సరము అగును. ఆయనములు రెండు విధములు. దక్షిణాయానము, ఉత్తరాయనము. ఈ విధముగా మానవునికి ఒక సంవత్సర కాలము. దేవతలకు ఒక అహో రాత్రము అగును. ఇందు ఉత్తరాయనము వారికి ఒక పగలు అగును.
దివ్య పరిమాణముచే వేయి సంవత్సరములు, సత్యాది నాలుగు యుగము లగును. ఆ నాలుగు యుగముల యొక్క విభాగములను గురించి చెప్పెదను వినుము. దివ్య మగు నాలుగు వేల సంవత్సరములు సత్య యుగ మగును. నాలుగు వందల సంవత్సరములు దానికి సంధ్యా మరియు నాలుగు వందల సంవత్సరములు సంధ్యాంశము అగును. మూడు వేల దివ్య సంవత్సరములు త్రేతా యుగ మగును. దేవ మానము యొక్క మూడు వందల సంవత్సరములు దానికి సంధ్యా మరియు మూడు వందల సంవత్సరములు సంధ్యాంశము అగును. ద్వాపర యుగము యొక్క పరిమాణము రెండు వేల దివ్య సంవత్సరములు. రెండు వందల దివ్య సంవత్సరములు దానికి సంధ్యా మరియు రెండు వందల సంవత్సరములు సంధ్యాంశము అగును. ఓ ముని సత్తమా! ఒక వేయి దివ్య సంవత్సరములు కలి యుగ మగును. మరియు దీనికి సంధ్యా, సంధ్యాంశము రెండింటికి ఒక రెండు వందల దివ్య సంవత్సరములు.
కవులు ఈ విధముగా నాలుగు యుగముల యొక్క పరిమాణమును పది రెండు వేల దివ్య సంవత్సరములలో విభజించిరి. దీనికి సహస్ర గుణితము చేయుటచే ఏమగునో. అదే బ్రహ్మకు ఒక దినముగా నిరూపిత మగును. హే బ్రాహ్మన్! బ్రహ్మ యొక్క ఈ ఒక్క దిన మందు విభాగముగ పదునాలుగు మనువులు ఉత్పన్న మైనచో, వాని యొక్క సహస్ర విభాగములు కల్పిత మైనవి. ఇంద్రాది దేవతలు, సప్తర్షి గణాలు, మను పుత్రులు, నృపతి గణాలు, మన్వంతర సహితముగా ఉత్పన్న మగును. మరియు పూర్వము వలెనే సంహారమును పొందును. డెబ్బది ఒకటి చతుర్యుగములు ఒక మన్వంతర మగును. మనుష్య మానాను సారముగ దాని సంఖ్యను చెప్పెదను వినుము. సంపూర్ణమగు ముప్పది కోట్ల అరువది ఏడు లక్షల ఇరువది వేల మనుష్యుల సంవత్సరములే ఒక మన్వంతరము యొక్క పరిమాణము. ఇప్పుడు దివ్య మానము యొక్క సంవత్సరాను సారము వినుము.
ఇరువది వేల దివ్య సంవత్సరములు ఒక మన్వంతరముగా చెప్ప బడినది. ఎనిమిది లక్షల యాబది రెండు వేల దివ్య వర్షములు ఒక మన్వంతర ముండును. ఈ కాలమును చతుర్దశ గుణితము చేసినచో 1,92,28000 దివ్య సంవత్సరములు బ్రహ్మకు ఒక దిన మగును. హే బ్రహ్మన్! ఈ బ్రహ్మ దినము యొక్క అంత మందు ఏ ప్రళయము సంఘటిత మగునో, దానిని పండిత గణాలు నైమిత్తిక ప్రళయమని చెప్పుదురు. భూర్లోక, భువర్లోక స్వర్గ లోక నివాసులు ఈ లోకముల యొక్క నాశనము సంభవించి నపుడు మహర్లోకమునకు వెళ్ళుదురు. మహర్లోక నివాసులు ప్రళయ కాల మందు జనించిన తాపముచే జనలోక మందు చేరు కొనెదరు. అప్పుడు త్రిభువనములు ఏక మగును. బ్రహ్మ రాత్రి కాల మందు శయనించును.
పగలు పరిమాణము ఎట్లుండునో బ్రహ్మకు రాత్రి పరిమాణము కూడా అట్లే ఉండును. రాత్రి యొక్క అంత మందు తిరిగి సృష్టి కార్య మారంభ మగును. ఈ విధముగా మూడు వందల అరువది దినములు బ్రహ్మకు ఒక సంవత్సర మగును. ఒక నూరు సంవత్సరములను ‘పర’ మని అందురు. ఈ విధముగా ఏబది సంవత్సరములు ఒక పరార్ధ మగును. ఓ ద్విజోత్తమా! ఈ విధముగా బ్రహ్మ యొక్క ఒక పరార్ధము గడచి పోయినది దాని యొక్క అంత మందు పాద్మమను పేరు గల మహా కల్పము ఉపస్థిత మైనది. ఓ ద్విజుడా! ఇప్పుడు పరార్ధము జరుగు చున్నది. దీనిని వరాహ కల్పమని అందురు. ఇదే ప్రధమ కల్పమని చెప్పబడి పరికల్పిత మైనది.
Summary of chapter 42 of the Mārkandeya Mahā Purana is as follows:
The supreme spiritual glory of the sacred monosyllable Oṃ is revealed as the acoustic manifestation of the Supreme Brahman. The son explains the subtle significance of the three letters A, U, and M representing creation, preservation, and dissolution, alongside the half-mātrā representing the transcendent, unmanifest Absolute.