మార్కండేయ మహా పురాణము
42 - బ్రహ్మోత్పత్తి
హే ద్విజశ్రేష్టులారా! వైదిక కర్మలు రెండు విధములు. ప్రవృత్తి మరియు నివృత్తి. ఆ విషయము గురించి మీరు నాకు బాగుగా వర్ణించి చెప్పితిరి. ఆహా! తండ్రి గారి ప్రసాదము వలన మీరు అట్టి జ్ఞానమును పొందితిరి. ఆ జ్ఞానము యొక్క బలముచే తిర్యగ్ యోనిని పొంది నప్పటికి మీరు మోహమునకు దూరమైతిరి. మీమనస్సు ఎప్పుడు సిద్ధి లాభము కొరకు పూర్వావస్థ యందే నిలుచునో, అప్పుడే మీరు ధన్యులగుదురు. విషయ జనితమైన మోహము మీ మనస్సును విచలితము చేయ లేదు. సౌభాగ్య వశమున బుద్ధిశాలి, భగవానుడు అయిన మార్కండేయుడు మీ కథను చెప్పి యుండిరి. మీరు అన్ని సందేహములను హరించు వారు. సంకటములతో నిండిన ఈ సంసార మందు ఎవరు తిరుగు చుందురో, అట్టి వారికి మీ వంటి తపస్సంపన్నులతో కలియుట చాలా కష్టము.
మీరు జ్ఞాన దర్శులు మీ సాంగత్యము ప్రాప్తించి నప్పటికి నా మనోరథములు సిద్ధింపనిచో మరి ఇంకెక్కడను సిద్ధించుట? అసంభవము. ప్రవృత్తి, నివృత్తి అను ఈ రెండు విధముల జ్ఞాన కర్మల యందును మీకు అట్టి విషద బుద్ధి సంప్రాప్త మైనది. నా దృష్టిలో ఆ విధముగా మరెవ్వరికినీ కలుగలేదు. ఓ ద్విజ శ్రేష్టులారా! నా యెడల మీకు అనుగ్రహము కలిగిన యెడల నేనడిగిన దానిని సవిస్తరముగా చెప్పుడు. ఏ విధముగా ఈ స్థావర జంగ మాత్మకమైన జగత్తు యొక్క సృష్టి కలిగినది? మరియు తిరిగి ఏ విధముగా ప్రళయ కాలమందు లయ ప్రాప్తమగు చున్నది. ఏ విధమైన వంశము నుండి దేవతలు, ఋషులు, పితృ గణాలు మరియు భూత గణాలు మొదలగు వాని ఉత్పత్తి కలుగు చున్నది? ఏ విధముగా అన్ని మన్వంతరముల యొక్క పుట్టుక కలిగినది? ఇదికాక వంశముల యొక్క అను పూర్వీకుల వివరములు, సమస్త సృష్టి, సమస్త ప్రళయములు, కల్ప విభాగములు, మన్వంతరముల స్థితి, పృథ్వి యొక్క సంస్థానము మరియు పరిమాణము, కొండలు, పర్వతములు, వృక్షములు మరియు వనములు మొదలగు వాని వివరములు, మృత్యులోకము, స్వర్గలోకము, పాతాళలోకము యొక్క వృత్తాంతము మరియు సూర్య చంద్రాది గ్రహ నక్షత్ర జ్యోతిస్సుల గమనము ఈ అన్నింటిని ప్రళయ పర్యంతము వినవలెనని కోరు చున్నాను. జగత్తు ప్రళయ కాలమందు ఉప సంహృతమైన పిదప ఏ అవశేషములు మిగిలి యుండునో వానిని కూడ వినవలెనని అభిలషించు చున్నాను.
ఓ జైమినీ! ముని సత్తమా! మీరు మా మీద అతులనీయమైన ప్రశ్న భారమును వేసితిరి. మీరు అడిగినందున మేము చెప్పుచుంటిమి. వినుడు. తొలుత మార్కండేయుడు ఏ విధముగా శాంతవృత్తి, విధ్యాస్నాతకుడు నాగు క్రౌష్టుకి నిమిత్తము చెప్పెనో అది చెప్పెదము. ఓ ప్రభూ! మీరేమి అడిగితిరో క్రౌష్టుకి కూడ బ్రాహ్మణులతో ఉపాసింపబడు మహాత్ముడగు మార్కండేయుని అదియే అడిగెను. ఓ ద్విజశ్రేష్టా! భృగు నందనుడు ప్రసన్న చిత్తుడై ఏమి చెప్పెనో అదియే నేను నీతో చెప్పెదను. వినుము. ఎవడు జగత్కారణము, పద్మ గర్భుడు, నగు పితామహుని రూపముతో ఈ విశ్వమును ఉత్పన్నము గావించెనో, విష్ణు రూపముతో స్థితి విధానము చేసెనో, రౌద్ర రూపమగు రుద్ర రూపముతో ప్రళయ కాలమందు అందరినీ సంహరించునో అట్టి జగన్నాధునికి నమస్కరించి మేము కూడా దానిని సవిశేషముగా వర్ణించి చెప్పెదము వినుడు.
పూర్వ కాలమందు అవ్యక్త యోని యగు బ్రహ్మ పుట్టుట తోడనే అతని నాలుగు ముఖముల నుండి వేదములు మరియు పురాణములు ఆవిర్భవించెను.
ఋషులు ఆ పురాణములను వివిధ భాగము లందు మరియు వేదములను కూడా వేల వేల భాగాలలో విభజించిరి. ఆ మహాత్ముల ఆదేశము లేక ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, మరియు ఐశ్వరీయ భావము ఈ నాలుగింటి యొక్క సిద్ధి కలుగుట అసంభవము. ఆతని మనస్సు నుండి సప్తర్షులు ఉత్పన్న మైనప్పుడు ఆ మానస ఋషులు అతని వద్ద నుండి సమస్త వేదములను మరియు మానసోత్పను లయిన తదితర ఋషులు పురాణమును గ్రహించిరి. చ్యవనుడు భ్రుగువు వద్ద నుండి ఆ పురాణమును తీసికొని ఋషుల సమీపమున ప్రకాశింప జేసెను. మహాత్ములగు ఋషులు ఆ పురాణమును దక్షునికి చెప్పెను. ఆ దక్షుడే మాకు దానిని ప్రసాదించెను. అప్పటి నుండి అది మా వద్దనే ఉన్నది. ఇప్పుడు నీకు చెప్పుచుంటిమి. దీని ప్రభావమున కలియుగ మందు పాప సమూహములు నాశన మగును.
ఓ మునీ! మహాభాగా! మేము ఇంతకూ ముందు దక్షుని వలన ఏ విధముగా విని యుంటిమో, అది అంతయు సావధాన చిత్తుడవై ఇప్పుడు నీవు వినుము. ఎవరు జగత్కారణుడై ఉన్నాడో. జన్మ రహితుడో, అవ్యయుడో, చరాచర జగత్తునకు ఆశ్రయము మరియు తండ్రి అయి ఉన్నాడో, ఎవరు పరమపద స్వరూపుడై ఉన్నాడో, ఎవరు సృష్టి, స్థితి, ప్రళయ కారణమునకు ఆది పురుషుడై ఉన్నాడో, ఎవరు ఉపమారహితుడో, మరియు ఎవని యందు సమస్తము నిండి యున్నదో, అట్టి దీమంతుడగు హిరణ్య గర్భునకు నమస్కరించి అత్యుత్తమమగు ప్రపంచమును బాగుగా వర్ణించెదము. మహత్తు మొదలు విశేష పర్యంతము అన్ని భౌతిక, సృష్టి,వికార లక్షణములను, ఐదు విధాల ప్రమాణములను, మరియు షట్ స్రోతస్సుల సహితముగా ఆనుపూర్విగా చెప్పెదము.
ఓ మహాభాగా! ఈ భూత సృష్టి పురుషుని వలన అధిష్టిత మైనది. మరియు ఈ కారణచేత నిత్య మైనప్పటికి ఏ విధముగా అనిత్యముగా అనిపించు చున్నదో దానిని కూడా వర్ణించెదము. నీవు సావధాన చిత్తుడవై వినుము. ఏది అవ్యక్తమని చెప్పబడు చున్నదో, దానిని మహర్షులు సదదాత్మిక నిత్య సూక్ష్మ ప్రకృతి అని చెప్పిరి. ఏది నిత్యమూ, అక్షయము, జీర్ణము కానిది మరియు పరిమితము కానిది అయి ఉన్నదో, ఏది ఎవరినీ ఆశ్రయింపక యుండునో, ఏది గంధ విహీనము, రస విహీనము, మరియు శబ్ద, స్పర్శ రహితముగా నుండునో, ఏది అనాదియై, అనంతమై ఉన్నదో, ఏది జగత్తు యొక్క ఉత్పత్తి స్థానమై యున్నదో, దేని వలన మూడు గుణములు ఉత్పన్న మైనవో, ఏది నాశము లేనిదై యున్నదో, ఏది ఎల్లప్పుడు విరాజిల్లుతూ అవిజ్నేయమై యున్నదో, అట్టి ప్రధాన స్వరూపమగు బ్రహ్మయే అందరి కంటె ముందు ఉండిన వాడై ప్రళయము తరువాత అఖిల జగత్తును బాగుగా వ్యాప్తి గావించి విరాజిల్లునట్లు చేయును. మూడు గుణములు పరస్పరము అనుకూలముతో అవ్యాహత రూపముతో వాని యందె అధిష్టములై యున్నవి.
సృష్టి కాల మందు క్షేత్రజ్ఞుడి అధిష్టాన కారణమున వారు ఆయా గుణముల సహాయముతో సృష్టి కార్యము లందు ఉద్యుక్తులయి నప్పుడు ప్రథమ మైన ప్రధాన తత్వము ఆవిర్భూతమై మహా తత్త్వమును మూసి వేయును. బీజము ఎట్లు చర్మము ద్వారా కప్పి ఉంచునో, ప్రదానము కూడా అట్లే మహా తత్త్వమును ఆవరించును. ఈ మహా తత్త్వము మూడు విధములు. సాత్త్వికము, రాజసము, తామసము. తిరిగి మహా తత్త్వము నుండి అహంకారము ఉత్పన్న మైనది. ఈ అహంకారము కూడా మూడు విధములు. వికారము, తైజసము, తామసము. ఈ తామసాహంకారమునే భూతాదుల పేరుతో చెప్పబడెను. మహా తత్త్వము ఏవిధముగా ప్రధాన తత్త్వముచే కప్పబడి ఉండునో, అట్లే ఈ అహంకారము కూడ మహా తత్త్వము చేత కప్పబడి యుండును. మరియు దాని ప్రభావముచే వికారమును పొంది శబ్ద తన్మాత్రను సృష్టించును. శబ్ద లక్షణము అగు ఆకాశముచే ఈ శబ్ద తన్మాత్ర ఉత్పన్న మగును. అప్పుడు తామసాహంకారముచే శబ్ద మాత్ర ఆకాశమును కప్పివేయును.
దీని వలన నిస్సందేహముగా స్పర్శ తన్మాత్రల యొక్క ఉత్పత్తి కలుగును. అప్పుడు మహా బలీయమగు స్పర గుణ యుక్తమగు వాయువు ఉత్పన్న మగును. శబ్ద మాత్ర గుణకమగు ఆకాశము వలన స్పర్శ మాత్ర ఆవృత మగును. దీని వలన వాయువు యొక్క వికృతి కారణమున రూప మాత్ర ఉత్పన్న మగును. వాయువు వలన రూప, గుణ, యుక్తమగు జ్యోతి యొక్క ఆవిర్భావము కలుగును. స్పర్శమను వాయువు ద్వారా రూప మాత్రకు ఆవృతము కలుగును. వెనుక జ్యోతి వికృతమై రసమును ఉత్పన్నము చేయును. దీని వలన రసాత్మక జలము ఉత్పన్న మగును. అదే రసాత్మక జలము రూప మాత్రకు ఆవృతమై యుండును. తిరిగి రసరూప జలము వికృతమై గంధ మాత్రను ఉత్పన్నము చేయును. దాని వలన గంధ గుణ యుక్తమగు పృథ్వి యొక్క ఉత్పత్తి కలుగును.
ఈ విధముగా ఆయా పదార్థము లందు ఏ పరిమాణము లుండునో, దాని ద్వారానే తన్మాత్రల యొక్క పరిమాణము కలుగును. ఇందు కొరకు విశేష వాచకము కానందున అది కూడా అవిషేశ మైనది. ఈ అవిశేష కారణమున అది శాంతము, ఘోరము, మూఢము కాదు. తామసాహంకారము చేతనే ఈ విధముగా భూత తన్మాత్రల యొక్క ఉత్పత్తి కలుగును. సత్త్వో ద్రిక్తము మరియు వికారాహంకారము వలన ఒకేసారి వైకారిక సృష్టి ప్రవర్తిత మగును. పంచ జ్ఞానేద్రియములను, మరియు పంచ కర్మేంద్రియములను, త్తేజస ఇంద్రియములు అని చెప్ప బడెను. అక్కడ వైకారిక దశ దేవతలు కలరు. మనస్సు పదకొండవది పైన వ్రాయబడిన పది ఇంద్రియములు మరియు పదునొకండవ మనస్సు, అక్కడ వైకారిక దేవతలు అని చెప్పబడెను. చెవులు, చర్మము, కళ్ళు, నాలుక మరియు ముక్కు వీటి ద్వారా శబ్దాదుల జ్ఞానము కలుగును. ఈ కారణమున ఇవి బుద్ధీంద్రియములు అని చెప్పబడెను. చరణములు, గుదము, హస్తము మరియు వాక్యము, ఇత్యాదులను కర్మేంద్రియములు అని చెప్పుదురు. వాని ద్వారా చలనము, మల త్యాగము, ఆనందము, శిల్పము, మరియు వాక్య కథనము ఈ అన్ని పనులు సమకూరును. శబ్ద మాత్రమగు ఆకాశము స్పర్శ మాత్రమగు ఆకాశ మందు ఆవిష్టమై ద్విగుణ వాయువును ఉత్పన్నము చేయును. కాని స్పర్శయే దానికి విశేష గుణము. శబ్దము మరియు స్పర్శ ఈ రెండు గుణముల రూపమందు ఆవిష్టమై (కలిసి) అగ్ని ఉత్పన్నమగును. ఈ అగ్ని శబ్దము, స్పర్శ మరియు రూపము ఈ మూడు గుణముల యుక్తమైనది. శబ్దము, స్పర్శ, రూపములు ఈ రసము నందు ఆవిష్టమై, నాలుగు రెట్లు అధికముగా రసాత్మక జలమును ఉత్పన్నము చేయును. శబ్దము, స్పర్శ, రూప రసములు గంధము నందు ఆవిష్టమగుట వలన (కలియుట) వాటి సంఘటితము వలన, ఈ భూమికి సంపూర్ణ రూపము కలుగును. ఈ కారణముచే భూత గణ మందు పంచ గుణ సంపన్న స్థూలాకారమగు భూమి కనిపించును.
ఈ కారణముచే అది శాంతము, దట్టము, మూఢమైనది అని చెప్ప బడినది. అది పరస్పరమును ధరించును. ఈ దట్టమైన సమస్త లోకాలోకములు, భూమి అంతర మందు సన్నివిష్టములై ఉండును. నియతత్త్వ కారణముచే దీనిని “ఇంద్రియ గ్రాహ్య” ములై విశేషముల పేరుతో చెప్పదరు. మొట్ట మొదటగా గుణము ఉత్తరోత్తర మందు అనుప్రవేశము చేయును. ఈ నానా విధములగు ఏడు పదార్థములు ఎప్పటి వరకు పరస్పరము కలియక వేరు భావమందు నిలిచి యుండునో అప్పటి వరకు ప్రజా సృష్టి యందు సమర్థత కలుగును. ఇది ఏ సమయ మందు పురుషుని సహాయము మరియు ప్రక్రుతి యొక్క అనుగ్రహము పొందునో, ఆ సమయ మందు మహత్తు వలన విశేష పర్యంతము ఈ అన్నిటి యందు అండ ప్రధానము చేయును. ఈ అండము జల బుద్భుదముతో సమానముగా జలమందు ఆశ్రయ పూర్వకముగా క్రమముగా వృద్ధి యగుచు ఉండును.
ఓ బుద్ధిమంతుడా! సలిల మందు ఉన్న ఈ అండము భూత గణము కంటె గొప్పది. బ్రహ్మ సంజ్ఞుడు, క్షేత్రజ్ఞుడు, కూడ ఆ ప్రకృత అండ మందు వృద్ధిని పొందును. అదియే ప్రథమ శరీరము. మరియు పురుషుడు అను పేరుతో చెప్ప బడెను. అతడే భూత గణము యొక్క ఆది కర్త యగు బ్రహ్మ, అతడే అందరి కంటె ముందు విరాజితుండయ్యెను. అతడే చరాచర త్రైలోక్యమును వ్యాప్తి చేయుచుండెను. ఆ గొప్ప అండమును మేరు పర్వతము దాని యొక్క గర్భాశయము, పర్వతములు మరియు సముద్రములు, దానికి గర్భ సలిలము. సురులు, అసురులు మరియు మనుష్యులతో నిండిన సమస్త జగత్తు ఆ అందము నందే ఉండును.
ద్వీపాదులు, పర్వతములు, సాగరము మరియు జ్యోతి సహితము అన్ని లోకములు దాని యందు ఉన్నవి. జలము, వాయువు, అగ్ని మరియు ఆకాశము. ఇది భూతాది సహితము. ప్రత్యేక ఉత్తరోత్తర దశగుణ నియమములతో వెలుపలి వెలుపలి భాగమందు ఆ అండమును పరివేష్టించి ఉండును. ఇంతేగాక అదే ప్రమాణముతో మహా తత్త్వము కూడ వానితో పాటు అండమును కప్పి వేయును. ప్రకృతి ఈ మహా తత్త్వ సహితముగా అండము మూయబడి శోభను పొందును. ఈ విధముగా ఏడు ప్రాకృత ఆవరణముల ద్వారా పై అండము కప్పి వేయబడి ఉండును. ఈ విధముగా ఎనిమిది ప్రకృతులు పరస్పరము ఆవరించి ఉండును. ఈ ప్రకృతి నిత్య స్వరూపమని తెలుసుకొన వలెను. దీనికి అంత మందు ఆది పురుషుడు విరాజిల్లును.
నీ యందు ఏ బ్రహ్మ సంజ్ఞితమగు పురుషుని ఉల్లేఖించితినో వాని విషయములను సంక్షిప్తముగా చెప్పెదను. జల మందు మునిగి యున్న పురుషుడు ఏ విధముగా జలము నుండి లేచు సమయ మందు జలము మరియు జలము యొక్క సంబంధమగు, ద్రవ్యములను, ఎట్లు విసిరి వేయునో, అట్లే బ్రహ్మను కూడ ప్రకృతి యొక్క విభుడు అని ఎరుంగ వలెను. ఈ ప్రకృతియే క్షేత్రము, బ్రహ్మయే క్షేత్రజ్ఞుడు అని చెప్పబడు చున్నాడు. ఆ క్షేత్రమే క్షేత్రజ్ఞుని యొక్క లక్షణము. ఇదే విధముగా క్షేత్రజ్ఞుడుండిన ప్రాకృత సృష్టి అ బుద్ధి పూర్వకముగా మొదట మెరుపుతో సమానముగా ఆవిర్భూతమై యున్నది.
Summary of chapter 41 of the Mārkandeya Mahā Purana is as follows:
The son outlines the strict moral conduct and mental purity required for a steadfast yogi. He emphasizes freedom from anger, greed, lust, and delusion, instructing that a yogi must treat all living beings with equal compassion, view gold and stone with equal indifference, and constantly dwell on non-dual reality.