మార్కండేయ మహా పురాణము
125 - మరుత్త చరితము
ఓ విప్రా! అటు పిమ్మట రాజ పుత్రుడు తన ప్రియ పుత్రుని తీసుకొని భార్యా సహితుడై తన నగరమునకు చేరుకొనెను. నగరమునకు వచ్చు సమయమున గంధర్వులు పాద చారులై వారి ననుసరించిరి. అతడు తండ్రి గృహమునకు చేరుకొని భక్తీ సహితముగా తండ్రి గారి చరణములకు వందన మొనరించెను. తన్వంగియగు రాజ కన్య లజ్జా భావముతో శిరస్సు వంచి ప్రణామము చేసెను. పిమ్మట రాజ పుత్రుడు బాలుడగు తన పుత్రుని తీసుకొని రాజుల మధ్యన ధర్మాసనముపై కూర్చొని యున్న తండ్రియగు కరంధమునితో ఇట్లు పలికెను. “నేను పూర్వము తల్లి ఆచరించిన కిమిచ్చక వ్రత సమయమందు మీతో చేసిన ప్రతిజ్ఞా ప్రకారము పౌత్రుని మీ ఒడి యందుంచుకొని పౌత్రుని ముఖమును జూడుడు” అని జెప్పి తండ్రి ఒడిలో పుత్రుని ఉంచెను. మరియు అతనితో జరిగిన వృత్తాంతము నంతయు వర్ణించెను.
రాజు ఆనందాశ్రు పూరిత నేత్రములతో ‘పౌత్రుని ఆలింగనము చేసుకొని సౌభాగ్యవంతుడ నైతిని’ అని ఇట్లు మాటి మాటికి తనను తానూ ప్రశంసించు కొనసాగెను. అటు పిమ్మట ఆనందముతో ఇతర కార్యములను మరచి, వచ్చి యున్న గంధర్వులను అర్ఘ్యాదులచే సన్మానించెను. ఓ మునీ! ఆ సమయమున నగర మందలి సమస్త పౌరుల గృహ మందును మమ్ములను రక్షించు నట్టి రాజునకు సంతానము కలిగెనని మహదానందముతో ఉత్సవమును జరుపుకొను చుండిరి. ఆనందముతో నిండిన ఆ నగరములో సుందర విలాసినీ గణాలు గీత వాద్య సంగీతములలో ఉత్తమమగు నృత్యములను చేయ సాగిరి. రాజు హర్ష చిత్తుడై గుణశాలురగు బ్రాహ్మణులకు ధన, రత్న, వస్త్ర, ఆభరణాదులు మరియు గోవులను దానము చేసెను.
అనంతరము ఆ బాలుడు శుక్లపక్ష చంద్రుని వలె వృద్ధి నొందుచు తండ్రికి ప్రీతి ప్రదుడై సాధారణ మనుష్యులకు గూడ ప్రియతము డయ్యెను. ఓ మునీ! ఆ బాలుడు యథా కాలమందు ఆచార్యుని వద్ద ప్రథమముగా వేదములను, అటు పిమ్మట ధనుర్విద్యలను నేర్చుకొనెను. ఆ బాలుడు ఎప్పుడయితే శాస్త్రము లన్నియు పూర్తీ చేసెనో, అప్పుడు ఖడ్గ, ధనుర్విద్యల యందును ఇతర శాస్త్రముల యొక్క ప్రయోగము లందును పారంగతు డయ్యెను. ఓ విప్రా! అప్పుడతడు వినయముతో నమ్రుడై మరియు గురువునకు ప్రీతిపాత్రుడై భృగు వంశీయుడగు భార్గవుని వద్ద నుండి సంపూర్ణ అస్త్ర విద్యలను గ్రహించెను. ఇట్లు అతడు అస్త్రములను గ్రహించి ధనుర్వేదము నందు పారంగతుడై కృత కృత్యు డయ్యెను. మరియు ధనుర్విద్య లందు పారంగతు డగుటయే గాక ఇంకను సమస్త విద్య లందు ప్రవీణు డయ్యెను. ఆ కాలమున అన్నింటిలోనూ ఈతనిని మించిన వారు ఎవరూ లేకుండిరి.
తన కుమార్తె గురించి అన్ని విషయములను విని దౌహిత్రుని యోగ్యతను విని విశాల రాజు కూడా హర్ష చిత్తు డయ్యెను. పౌత్రుని ముఖమును చూచుట తోడనే మనోరథములు సిద్దించి, శత్రువులను జయించు వాడు బల, బుద్ధి మంతుడు నగు కరంధముడు అనేకానేక యజ్ఞములను చేసి అర్థులకు అనేకములగు దానములు మరియు చక్కగా సత్కార్యములు చేసి బల, బుద్ధి పూర్వకముగా యథాధర్మముగా మహీపాలన చేయు చుండగా కొంత కాలము గడచినా పిమ్మట వనములకు వెళ్ల దలచి, పుత్రుడగు అవీక్షునితో ఇట్లనెను. “ఓ కుమారా! నేను వృద్దుడ నైతిని. ఇప్పుడు నేను వనమునకు వెళ్ళ వలయునని అభిలషించు చున్నాను. నా ఈ రాజ్యమును నీవు గ్రహింపుము. నేను అన్ని విషయము లందును కృతార్థుడ నైతిని. ఇప్పుడు నీకు రాజ్యాభిషేకము తప్ప ఇంకేమియు మిగుల లేదు. అందు వలన నీవు నాచే ఇవ్వబడు ఈ సుసంపన్న మగు రాజ్యమును గ్రహింపుము.”
నృప నందనుడగు అవీక్షితుడు తండ్రి వచనములు విని తానూ కూడా వనములకు వెల్ల నిచ్చగించిన వాడై వినయముగా తండ్రితో నిట్లు పలికెను. “ఓ తండ్రీ! నేను భూమిని పాలింపను. ఇప్పటి వరకు మనస్సు నందు నాకు జరిగిన అవమానము దూరము కాలేదు. అందు వలన మీరు మరెవరి నయిననూ రాజ్య మందు వినియోగింపుడు. నేను బంధీనయి తండ్రిచే విడిపింప బడితిని. నా వీర్యముతో విడువబడ లేక పోతిని. అందుచే నాకు పౌరుష మేమున్నది? పౌరుషము కలవారే భూమిని పాలించెదరు. ఎప్పుడయితే నేను నన్ను రక్షించు కొనుట యందు అసమర్థుడ నైతినో, అప్పుడు నేను రాజ్యము నేవిధముగా పరిపాలించుదును? ఈ కారణముచే వేరొకరి కయినను ఈ రాజ్య భారము ఒప్ప గించుము. మంత్రణాశీలుడు, ధర్మ శీలుడు అయి నప్పటికిని ఏ పురుషుడు శత్రువుల వలన పరాజితు డయ్యెనో, అట్టి వాడు మోహమునకు వశీభూతుడగుటకు యోగ్యుడు గాడు. ఏ పురుషుడు ఆ ఆత్మను తండ్రిగారి యత్నముచే బంధ విముక్తుని చేసికొనేనో, అట్టి స్త్రీ జాతితో సమానమగు ధర్మము గల వాడనగు నేను ఏ విధముగా మహీపాలుడ నగుదును?”
ఓ వీరా! తండ్రి పుత్రుని నుండి పుత్రుడు తండ్రి నుండి వేరు కాదు. అందువలన నా వలన విడువ బడుట పరాయి వానిచే విడువ బడినట్లు కాదు.
ఓ నరేశ్వరా! నేను ఇప్పుడు మనోవేగమును వెనుకకు మరల్చ లేను. మీ ద్వారా విడిపింప బడుటచే నా హృదయ మంతయు అత్యంత లజ్జా భావము జాగరితమై ఉన్నది. ఏ పురుషుడు తండ్రి సంపాదించిన సంపత్తిని అనుభవించునో, ఆపద యందు తండ్రిచే విడువ బడునో, మరియు తండ్రి పేరు తోనే పరిచితు డగునో, వంశములో అట్టి పుత్రుని జన్మ లేకుండుటయే ఉత్తమము. ఎవడు స్వయముగా ధనోపార్జన చేయునో, స్వయముగా ఖ్యాతిని బొందునో, మరియు స్వయముగా దుఃఖముల నుండి విడువ బడునో, అట్టి వాని కెట్టి స్థితి కలుగునో, నాకునూ అట్టి స్థితి కలుగు గాక.
ఓ మునీ! తండ్రి పలుమారులు ప్రార్థించి నప్పటికీ ఆ రాజ పుత్రుడు అదే సమాధానము ఇచ్చేనో, అప్పుడు కరంధమ రాజు అతని పుత్రుడగు మరుత్తుని రాజ్యమునకు రాజుగా చేసెను. మరుత్తుడు తండ్రి ఆమోదముతో రాజ్యమును పితామహుని వలన పొంది సుహృద్గణాలను ఆనందింప చేయుచూ, బాగుగా రాజ్యము శాసింప సాగెను. మనో వాక్కాయములచే సంయమ చిత్తుడై తపస్సు చేయుటకు కరంధమ రాజు వీర యను తన భార్యను వెంట బెట్టుకొని వనమునకు వెళ్ళి పోయెను. అక్కడ కరంధమ రాజు వేయి వత్సరముల పర్యంతము కఠినమగు తపస్సు చేసి దేహ పరిత్యాగము చేసి ఇంద్ర లోకమును పొందెను. మరియు అతని భార్య యగు “వీర” ఇంకనూ నూరు సంవత్సరముల పర్యంతము జడలను పెంచుకొని తపస్సు చేయుచూ, స్వర్గమును పొందిన మహాత్ముడగు భర్త యొక్క సాలోక్యమును కోరు చుండెను. కంద మూలములను భుజించుచూ భార్గవుని ఆశ్రమ మందు ఉండెను. ద్విజాతి పత్నుల మధ్య నుండి ద్విజ శుశ్రూషా తత్పరురాలై యుండెను.
Summary of chapter 125 of the Mārkandeya Mahā Purana is as follows:
Despite being rescued, Prince Avīkshita feels deeply humiliated by his capture and vows never to assume the crown or marry Princess Vaishālinī, taking a vow of lifelong austerity.