మార్కండేయ మహా పురాణము
28 - శ్రాద్ధ కల్పము
మదాలస:
సపిండీకరణ మందు పితృ పిండమున తండ్రి యొక్క ప్రపితామహునకు అధికారము లేదు. వారు లేప భాజులుగా లెక్కింప బడుదురు. వాటిలో నాల్గవ స్థాన మందున్న పిండము పుత్ర లేపాన్న భోజి యగును. అతను సంబంధ హీనుడై ఉండును. అతడు లేప మాత్ర బోగమును మాత్రమునే పొందు వాడగును. తండ్రి, తాత, ముత్తాత. ఈ ముగ్గురు పురుషులు మాత్రమే సపిండులై ఉన్నారు. ముత్తాత యొక్క తండ్రి, తాత, ముత్తాతలు లేప సంబంధులై యున్నారు. వీరి తరువాత యజమాని ఏడవ వాడై యున్నాడు. మునీశ్వరులు పై విధముగా యజమాని లగాయితు అనులేప భుజుల వరకు సంబంధము స్థిరముగా నుండునని చెప్పిరి.
స్వర్గ వాసులైన పూర్వ పురుషులు మరియు నరక వాసులైన పురుషులు, తిర్యగ్యోని యందున్న వారు, భూతాదుల యందున్న వారు, వీరందరినీ గురించి గృహస్థు అయిన వాడు ఏ ఏ ప్రకారముగా ఏ ఏ విధానానుసారముగా శ్రాద్ధము చేసిన వారికి తృప్తి కలుగునో వత్సా! వాని విధానమును గురించి వినుము. పిశాచ జన్మ ఎత్తిన పురుషునకు భూమి మీద వికిర పిండ మిచ్చినచో తృప్తి నొందును. కుమారా! స్నాన వస్త్రము నీటి ఒడ్డున పిండినచో వృక్ష జాతి యందు పుట్టిన పురుషుడు తృప్తి నొందును. కుల మందు దేవత్వాన్ని పొందిన వారు భూమి యందు పడిన శరీర జల బిందువులచే తృప్తిని బొందుదురు.
పిండోద్వాసన సమయ మందు భూమి యందు పడిన అన్న కణములచే తిర్యగ్యోని గతులైన జీవులకు తృప్తి కలుగు చున్నది. ఏ పురుషుడు క్రియా యోగ్యుడై నప్పటికి సంస్కరింప బడక బాల్యా వస్థలోనే దగ్దులై ప్రాణ త్యాగము చేయుదురో వారికి అన్న వికిర సమ్మార్జన జలములచే తృప్తి కలుగును. బ్రాహ్మణుడు భోజనము చేసిన పిమ్మట ఆచమన సమయ మందు ఏ జలమును వదులుదురో పాద ప్రక్షాళన సమయ మందు ఏ జలము భూమి యందు బడునో వాటిచే అన్ని విధముల వారు తృప్తి పొందుదురు. వత్సా! పిశాచత్వమును పొందిన వారు క్రిమి కీటకముల జన్మల నెత్తిన వారు యజమాని బ్రాహ్మణుల నిమిత్తము పవిత్రమైనను అపవిత్రమైనను జలము నిచ్చెదరో ఆ జలముచే యోన్యంతర మందు వున్న వారలు తృప్తి బొందుదురు.
శ్రద్ధా భక్తులతో శ్రాద్ధము చేయుటచే పితృ దేవతలు గొప్పగా తృప్తి పొందుదురు. ఏ మనుష్యుడు అన్యాయార్జిత ద్రవ్యముతో శ్రాద్ధమును పెట్టునో ఆ శ్రాద్ధము చేత చండాల పులస్కాది యోనుల యందు పుట్టిన పితరులకు తృప్తి కలుగును. ఈ ప్రకారము బంధువులైన వారికి కూడా కలుగును. శ్రాద్దానుష్టాన పూర్వకముగా అన్నోదకములు ఇచ్చినచో వాని వలన పితృ దేవతలకు తృప్తి కలుగు చున్నది. ఈ ప్రకారము భక్తి కలిగి శాకపాకము చేత నైనను శ్రాద్ధము చేయదగినదై వున్నది. శ్రద్ధగా అనుష్టించినచో అతని వంశములో ఎవరికీ ఖేదము పొందుట ఉండదు. కుమారా! ఇప్పుడు శ్రాద్ధము యొక్క నిత్య నైమిత్తిక కాలము గురించి చెప్పెదను వినుము. ఏ విధి ప్రకారముగా శ్రాద్ధము ననుసరించ వలెనో అది కూడా చెప్పెదను. ప్రతి మాసము నందు చంద్రునికి క్షీణము కలుగును. అపుడు అమావాస్య అగును. అపుడు విధి విదానముగా అమా శ్రాద్ధము పెట్ట వలెను.
మరియు పౌష మాసాది కృష్ణాష్టమి యందు కూడా శ్రాద్ధమును పెట్టవలెను. శ్రాద్ధములు పెట్టుటకు ఉత్తమ కాలములను చెప్పెదను వినుము. బ్రాహ్మణులు సంప్రాప్తించి నప్పుడు, సూర్య చంద్ర గ్రహణముల యందు, ఉత్తరాయణ మందు, విషువత్ పుణ్యకాల మందు, రవి సంక్రణ మందు, వ్యతీపాతము నందు, శ్రాద్ధ యోగ్యములగు వస్తువులు లభించి నపుడు, దుస్స్వప్నములు వచ్చినపుడు, జన్మ నక్షత్ర మందు, గ్రహ పీడలు కలిగి నపుడు ఇచ్చా పూర్వకముగా శ్రాద్ద కర్మ చేయవలెను. విశిష్ట మైన శోత్రయుడు, యోగి, వేదజ్ఞుడు, జ్యేష్టుడు, సామ గానము చేయువాడు, త్రినాచికేతుడు, అనగా (నాచికేత ప్రణీతము లైన మూడు ఉపనిషత్తులు ఉపాసన చేయువాడు) త్రిమదు, త్రిసువర్ణుడు, షడంగవేత్త, దౌహిత్రుడు, ఋత్విక్కు, జామాత, మేనల్లుడు, పంచాగ్ని, కర్మ, నిష్టులు,తపఃపరాయణుడు, మేనమామ, తల్లిదండ్రియందు భక్తీ గల పురుషుడు, శిష్య సంబంధ బాంధవులు, వీరందరూ కూడా శ్రాద్ధమునకు యోగ్యులు. తన తల్లి దండ్రుల యందు ప్రేమగల వారిని, తల్లి దండ్రుల శిష్యులను, సంబంధులను, బాంధవులను, ఇట్టి బ్రాహ్మణోత్తములను శ్రాద్ధ నిమంత్రణము చేయుటకు తగిన వారు.
బ్రహ్మచర్యాది రహితుడు, రోగి, స్థూలాంగుడు, హీనాంగుడు, మారు మనువు స్త్రీకి పుట్టిన వాడు, ఏకాక్షి, కుండుడు (అనగా భర్త బ్రతికి ఉండగా జారుడి వలన జన్మించిన వాడు) గోళకుడు, (అనగా భర్త మరణించిన పిమ్మట జారుని వలన జన్మించిన వాడు) మిత్ర ద్రోహి, పిప్పి పళ్ళు గలవాడు, కుష్ఠు రోగి, నల్లని దంతములు గలవాడు, రూపము లేని వాడు, అభిశస్తుడు (అనగా దూషింపబడిన వాడు), చోరుడు, లోభి, సోమ విక్రయము చేసిన వాడు, కన్యను చెరచిన వాడు, వేద విక్రయము చేసిన వాడు, గురువును త్యజించిన వాడు, తల్లి దండ్రులను వదలి పెట్టిన వాడు, జీతము తీసికొని చదువు చెప్పిన వాడు, శత్రువు, పరుని భార్యను తన భార్యగా చేసుకొనిన వాడు, వేదత్యాగి, అగ్నిహోత్ర త్యాగి, సూద్ర స్త్రీ యందు సంతానమును పొందిన వాడు, వీరే కాక నీచ కర్మలను చేయు బ్రాహ్మణులను, పితృ కర్మల యందు వర్జింప వలెను.
శ్రాద్ధ కర్మకు ముందు రోజున పూర్వోక్తమైన బ్రాహ్మణ శ్రేష్టులను దేవ కార్య పితృ కార్యముల యందు నిమంత్రణము చేయవలెను. శ్రాద్ధకర్త శ్రాద్ధ భోజన నియమమును పాటించి యుండవలెను. శ్రాద్ధ కర్త , శ్రాద్ధభోజి మైధునము చేసిన యడల వారిద్దరికీ పితరులు ఒక నెల రోజులు వారి రేతస్సు యందు శయ నించుదురు. శ్రాద్ధకర్త, నిమంత్రణము చేసిన వాడు, స్త్రీ సాంగత్యము చేసి శ్రాద్ధము పెట్టినను, శ్రాద్దాన్నము భుజించినను, వారిద్దరి తల్లిదండ్రులు నెల రోజుల వరకు రేతో మూత్రములే ఆహారముగా గలవారై ఉందురు. అందు వలననే ప్రాజ్ఞులు పూర్వ దినమందే నిమంత్రణము చేయుదురు. శాద్ధ దినమున బ్రాహ్మణోత్తములు దొరకక పోయినను స్త్రీ సాంగత్యము గలవాడిని ఎప్పటికి నిమంత్రణము చేయ కూడదు. సకాలమున భిక్షకు వచ్చిన యతులను నమస్కారాదులచే ప్రసన్నులను చేసుకొని శుద్ధ చిత్తముతో భుజింప చేయ వలెను. శుక్ల పక్షము కంటె కృష్ణ పక్షము పితృ దేవతలకు ప్రియ మైనది. నమస్కారాలతో ప్రసన్నులను చేసి నియత మనస్కుడై భుజింప చేయ వలెను.
ఈ ప్రకారము పితృ దేవతలకు పూర్వాహ్నము కంటె అపరాహ్నము ప్రియమైనది. ఇంటికి వచ్చిన బ్రాహ్మణులను స్వాగతము పలికి అచ్చన చేసి పవిత్ర ప్రాణియై ఆచమించి ఆసన మందు కూర్చుండ బెట్టవలెను. పితృ స్థానమునకు బేసి సంఖ్యలో, దేవకార్య మందు సరి సంఖ్యలో బ్రాహ్మణులను అర్చించ వలెను. తన యొక్క సామర్థ్యము ననుసరించి పితృ స్థానమందు ఒకరిని , విశ్వే దేవ స్థానము నందు ఒకరిని అర్చించ వచ్చును. మాతామహుని శ్రాద్ధము నందున కూడా ఈ ప్రకారముగానే వైశ్వదేవ విధానము నిర్దిష్టమై యున్నది. కొంతమంది తూర్పు ముఖముగా దేవ కర్మలను మరియు మాతామహ కర్మలను చేయవలెనని చెప్పుదురు. ఈ సమయము నందు ఆసనము కొరకు కుశలు ఇవ్వ వలెను. అర్ఘాదులచే పూజింప వలెను.
తరువాత పవిత్రములను యిచ్చి బ్రాహ్మణానుజ్ఞ తీసికొని మంత్రం పూర్వకముగా దేవతలను ఆవాహనము చేయ వలెను. యవలతో కూడిన జలముతో విశ్వే దేవతల నుద్దేశించి అర్ఘ్య ప్రధాన పూర్వకముగా గంధ, మాల్య, ధూప, దీప, జల కుంభ, దానములు చేసి, దక్షిణ దిక్కు యందు అపసవ్యముగా పితృ దేవతలకు సమస్త కర్మలు చేయ వలెను. అనంతరము రెట్టింపుగా దర్భల నిచ్చి వారి యాజ్ఞ తీసికొన వలెను. మంత్రం పూర్వకముగా పితృ దేవతల యొక్క ఆవాహనము చేయవలెను. ఈ సమయ మందు పితృ దేవతల యొక్క సంతుష్టి యందు ఆసక్తి గలవాడై ప్రాచీనావీతియై యావ, తిలలతో కూడిన అర్ఘ్యము నీయవలెను. అటు పిమ్మట బ్రాహ్మణానుజ్ఞ తీసికొని అగ్ని కార్యము చేయ వలెను. పితృ ప్రీతిని చేయుటకు ఆసక్తి గలిగి యుండ వలెను.
అగ్ని కార్య మందు విదానానుసారముగా వ్యంజన సహితము. క్షారరహిత ములగు అన్నమును హోమము చేయవలెను. “ఆగ్నయే కవ్యవాహనాయ స్వాహా” అనగా (కవ్యమును పొందుచున్న అగ్నిని ప్రసన్నుని చేసు కొనుటకు ఈ అన్నమును ఇచ్చు చున్నాను.) ఈ మంత్రమును ఉచ్చరించి మొదటి ఆహుతిని ఇవ్వవలెను. మరల “సోమాయ వైపితృమతే స్వాహా” అని ఈ మంత్రమును ఉచ్చరించి రెండవ ఆహుతిని ఇవ్వ వలెను. “యమాయ ప్రేత పతయే స్వాహా” ఈ మంత్రమును ఉచ్చరించి మూడవ ఆహుతిని ఇవ్వ వలెను. హోమంత మందు మిగిలిన అన్నమును బ్రాహ్మణుల యొక్క భోజన పాత్రల యందు ఉంచ వలెను. సర్వ పదార్థములు ఉంచి భోజన పాత్రను స్పృశించి “యధాసుఖం జుషద్వం భోః” అని మృదు వచనములతో పలుక వలెను. అపుడు బ్రాహ్మణులు ఏకాగ్ర చిత్తులై మౌనముతో యదా సుఖముగా భోజనము చేయుదురు.
ఏ భోజన పదార్థములు భోక్తలకు ప్రియమగునో క్రోధములు లేనివాడై మెల్ల మెల్లగా ఆ పదార్థము లందు రునిని కలుగునటుల చెప్పుచు ఆదరముతో ఆ పదార్థములను వడ్డించు చుండవలెను. రక్షోఘ్న మంత్రములను జపించ వలెను. భూమి యందు అన్ని వైపుల నువ్వులు చల్లవలెను. శ్రాద్ధ రక్షణార్థమై ఆవాలను కూడా చల్ల వలెను. ఎందువలన అనగా స్వభావముగా శ్రాద్ధము అనేక చిద్రములతో కూడుకొని యుండును. అనంతరము పుష్టిగా తృప్తిగా భోజనము చేసిన బ్రాహ్మణులను “తృప్తాః స్థః” అనగా తృప్తిగా భోజనము చేసితిరా? అని అడుగవలెను. “తృప్తాః స్మః” అనగా తృప్తుల మైతిమి అని వారు చెప్ప వలెను. అపుడు వారి యొక్క అనుజ్ఞ తీసికొని భూమి యందు అన్నము జల్లవలెను. ఆచమనము కొరకు విధానానుసారముగా ఒక్కొక్కసారి జలమును ఇవ్వవలెను. పిమ్మట ఆజ్ఞను తీసికొని త్రికరణ శుద్ధితో నువ్వులతో కూడుకొనిన పిండమును దక్షిణ దిక్కుగా పితరుల నుద్దేశించి దర్భల మీద ఉచ్చిష్ట సన్నిధిన పిండములను ఉంచ వలెను.
సమాహిత చిత్తుడై పితృదేవతల నుద్దేశించి భక్తి పూర్వకముగా పితృ తీర్థముచే తర్పణము చేయవలెను. అటులనే మాతామహుల నుద్దేశించి కూడా ఈ ప్రకారముగనే పిండ ప్రధానము చేయవలెను. గంధ మాల్యాదులతో ఇట్లు పిండమును అర్చించి ఆచమనము ఇవ్వవలెను. అనంతరము తన శక్తి ననుసరించి దక్షిణ ఇచ్చి “సుస్వదాస్తు” అని వారిని గురించి పలుకవలెను. సంతుష్టులైన బ్రాహ్మణులు “తథా” అని వారు చెప్పవలెను. అనంతరము విశ్వే దేవతలను గురించి “ప్రీయంతామితి భద్రం వో విశ్వే దేవాః” యని యడుగ వలెను. “తథా” అని వారు చెప్పవలెను. అనంతరము వారిచే ఆశీర్వచనము పొందవలెను. తరువాత ప్రియ వచనములు పలికి అందరికి భక్తితో నమస్కరించి ద్వార పర్యంతము వారిని అనుసరించి వారి యాజ్ఞ తీసికొని లోపలి తిరిగి రావలెను.
పిమ్మట నిత్య క్రియలను చేయవలెను. పిమ్మట అతిథులను భుజింప చేయవలెను. కొందరు పితృ దేవతలకు నిత్య క్రియలు చేయవలెనని చెప్పుదురు. కొందరు కూడదని చెప్పుదురు. తర్వాత అవశిష్ట కర్మను పూర్వము వలె సమాప్తి చెందించ వలెను. కొందరి మతము ప్రకారము వేరుగా పాకము చేయించి పితృ కార్యము చేయవలెనని, కొందరు చేయకూడదని అందురు. అనంతరము ఆ అన్నమును శ్రాద్దకర్త భృత్యాదులతో భుజింప వలెను. ధర్మజ్ఞుడా! ఏ ప్రకారముగా బ్రాహ్మణులు సంతోషించుదురో ఆ ప్రకారముగా సావధాన చిత్తుడై పితృ దేవతల నుద్దేశించి శ్రాద్ధ కర్మను చేయ వలెను. దౌహిత్రుడు కుతపము (పగటి 15 భాగములలో ఎనిమిదవ భాగము) తిలలు ఈ మూడు శ్రాద్ధమునందు పవిత్రమైనవి. కోపము, ప్రయాణము, తొందర ఈ మూడింటిని బ్రాహ్మణులు వర్ణించ వలెను. పుత్రా! శ్రాద్ధమందు వెండి పాత్ర శ్రేష్ట మైనది. రజత దానము రజత దర్శనము శ్రాద్ధమందు ఉచితమై ఉన్నవి. పితృదేవతలు, రజత పాత్ర యందు భూమి నుండి స్వధా రూపమైన పాలను పితుకుదురు అని పెద్దలచే వినబడు చున్నది. ఈ కారణముచే వెండి పితృదేవతలకు అభీష్టమై ప్రీతి వర్ధకమై ఉన్నది.
Summary of chapter 27 of the Mārkandeya Mahā Purana is as follows:
Madālasā continues her sublime discourses on Advaita wisdom, explaining how the ego-sense creates bondage in saṃsāra. She teaches her sons that name, caste, physical form, and worldly relationships belong solely to the perishable body and subtle mind. By constantly contemplating 'Shuddhoham Buddhoham'—I am pure, enlightened consciousness—one dissolves all karmic illusions and rests in eternal bliss.