మార్కండేయ మహా పురాణము
68 - ఔత్తర మన్వంతర వృత్తాంతము
రాజు ఆ బ్రాహ్మణ స్త్రీని ఆమె భర్తృ గుహమున పంపి దీర్ఘముగా శ్వాస విడుచుచూ ఇట్లు చింతించ సాగెను. ఇప్పుడు ఏమి చేసిన మేలు జరుగును? మహాత్ముడగు ఆ మహర్షి నాతో “భార్యా వియోగ కారణమున నీవు అర్ఘ్యమునకు పాత్రుడవు కావు” అని విషాద జనకములైన వచనములను పలికెను. మరియు ఈ నిశాచరుడు కూడా విప్రుని దృష్టిలో ఉంచుకొని ఇదే విధముగా భార్యా వియోగము వలన వైకల్యమును చెప్పెను. నేను నా భార్యను త్యజించితిని. ఇపుడు నేనేమి చేయ వలెనో, జ్ఞాన దృష్టి సంపన్నుడగు ఆ ముని శ్రేష్ఠుని అడిగెదను. ఈ విధముగా చింతించిన వాడై ఆ రాజు రథము నెక్కి త్రికాలజ్ఞుడు, ధర్మాత్ముడు అగు ఆ మహాముని ఎచట నివసించు చుండెనో అచటికి వెళ్ళెను. అతడు రథము నుండి దిగి ఆయన సమీపమునకు వెళ్ళి ఆయనకు ప్రణామము చేసి, రాక్షసుని కలియుట, బ్రాహ్మణుని దర్శించుట, ఆమె దుష్ట స్వభావము యొక్క నాశనము, ఆమెను భర్తృ గృహానికి పంపుట మరియు తాను మరల వచ్చిన ఉద్దేశ్యము అద్యోపాంతము వర్ణించి చెప్పెను.
ఓ నరాధిపా! మీ క్రియా కార్యములు మరియు నా సమీపమునకు మీరు వచ్చిన ఉద్దేశ్యము ఇవన్నియు నేను ముందుగానే తెలిసి కొంటిని. ఐనను మీరు నన్ను స్వయముగా అడుగుదురని ఉద్విగ్న మనస్సుతో ప్రతీక్షించు చుంటిని. ఓ మహీపాలా! ఇప్పుడు మీ కర్తవ్య మేమిటో వినుడు. భార్యయే మనుష్యులకు ధర్మార్థ, కామ, సాధనకు ప్రబల కారణము. విశేషముగా భార్యను త్యజించిన వాడు ధర్మమును కూడా త్యజింతురు. ఓ భూపతీ! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎవరైనను భార్యను త్యజించి నిజ కార్యములు అనుష్టించుట యందు సమర్థులు కాలేరు.
ఓ రాజా! మీరు భార్యను పరిత్యజించి మంచి పని చేయ లేదు. ఏ విధముగా స్త్రీ భర్తను వదిలి యుండరాదో, అట్లే భర్తకు కూడా భార్యను విడుచుట ఉచితము కాదు.
హే భగవాన్! నేనేమి చేయుదును? నా భార్యను పరిత్యజించుట నా పూర్వ జన్మ యందలి కర్మ ఫలము. నేను ఎల్లప్పుడూ ఆమె యెడల అనుకూలముగా నుంటిని. కాని ఆమె నా యందు ఎంత మాత్రము అనుకూలముగా నుండెడిది కాదు. ఈ కారణమున నేను ఆమెను పరి త్యజించితిని. ఓ భగవానుడా! ఆమె వియోగముచే కలిగిన బాధ వలన నా అంతరాత్మ భిన్నమగు చున్నది. మనస్సు మందు చున్నది. అందుచేత నా భార్య ఏ ఏ అప్రియములు చేసెనో వాటి నన్నింటిని క్షమించితిని. కాని ఇపుడు వనము నందు వదిలి వెయ బడిన నా భార్య ఎచటికి పోయెనో? లేక వనము నందలి సింహము, వ్యాఘ్రములు లేక రాక్షసులు గాని ఆమెను భక్షించినవో? అది నేను ఎరుగను.
ఓ భూపాలా! సింహము, వ్యాఘ్రము, నిశాచరులు ఏవియు ఆమెను భక్షింప లేదు. ఈ సమయమున మీ భార్య విశుద్దమగు చరిత్రతో రసాతలము నందు నివసించు చున్నది.
హే బ్రాహ్మన్! నా భార్య ఎవరి ద్వారా రసాతలమునకు చేరు కొనెను? ఏ విధముగా అదూషితురాలై అచట నివసించు చున్నది? ఈ అద్భుత విషయమును యదార్థముగా వర్ణించి చెప్పుడు?
ఓ రాజా! పాతాళము నందు కపోతకుడను ప్రఖ్యాత నాగరాజు నివసించు చున్నాడు. అతడు మీ వలన త్యజించ బడిన రూప వంతురాలు, యువతి అయిన మీ భార్యను మహావనము నందు తిరుగు చుండుట చూసి ఆమె యడల అనురాగము కలిగి తన అభిప్రాయమును తెల్పి ఆమెను పాతాళమునకు తీసుకొని పోయెను. ఓ మహీపతీ! ఆ బుద్ధిమంతుడగు నాగరాజు యొక్క అందమైన కుమార్తె పేరు “నంద” మరియు అతని భార్య పేరు “మనోరమ”. ఆ నాగ కన్య నంద ఈ సుందరిని తన తల్లి యొక్క కాబోయే సవతగా తలచి అంతఃపుర మందు తన గృహమునకు తీసుకొని వెళ్ళి దాచి ఉంచెను.
నాగరాజు ఎప్పుడు నంద వద్దకు వచ్చి ఆ సుందరి కొఱకు ప్రార్థించినచో అపుడు నంద అతని కేమియు జవాబు చెప్ప లేదు. అనంతరము నాగరాజు ఆ కన్యతో “నీవు మూగ దానివి అగుదువు గాక” అని శపించెను. ఓ భూపతీ! ఆ నాగరాజు కుమార్తె నంద తండ్రి వలన ఈ విధముగా శాపము పొందెను. మరియు ఆ ఉరగేంద్రుని ద్వారా పాతాళమునకు చేరుకున్న నీ సతి అతని కుమార్తె సంరక్షణములో వున్నది.
అనంతర మా రాజు పరమానందమును పొంది ఆ ద్విజ శ్రేష్ఠుని తన యందు ప్రియురాలి యొక్క అప్రియ భావమునకు కారణము నడిగెను.
ఓ భగవానుడా! నా యందు సర్వ జనులకు అత్యుత్తమ ప్రీతి ఉన్నది. కాని నా స్వీయ పత్ని యందు అనురాక్తురాలు కాదు. దీనికి కారణమేమి? ఓ మహా మునీ ఓ ద్విజోత్తమా! నా భార్య నా ప్రాణముల కంటెను ప్రియతముడ నైనప్పటికి, ఏ కారణముచే నా యడల చెడుగా వ్యవహరించు చున్నది? దాని గురించి చెప్పుడు.
వివాహ లగ్న సమయమున రవి, మంగళ, శనేశ్చరుల దృష్టి యున్నది. మీ భార్యను శుక్రుడు మరియు బృహస్పతి చూచు చుండిరి. మరియు ఆ ముహూర్త కాలము నందు మీ భార్యకు చంద్రుడు, మీకు బుధుడు, ఈ రెండును పరస్పరము అత్యంత విరుద్ధముగా నుండిరి. ఇప్పుడు వెళ్ళి స్వధర్మము ద్వారా పాలించుట మరియు భార్యా సమేతముగా కలిసి అన్ని విధాలా ధర్మ యుక్త కార్యములను అనుష్టింపుడు.
మహాత్ముడగు ఋషి ఈ విధముగా చెప్పిన పిమ్మట పృథ్వీ పాలుడగు ఉత్తముడు, ఆయనకు నమస్కరించి రథము నెక్కి తన పురమునకు చేరెను.
Summary of chapter 67 of the Mārkandeya Mahā Purana is as follows:
Mārkaṇḍeya concludes the chronicle of the Second Manvantara, listing the Seven Sages, the devas, and the heroic sons of Svārocisha Manu, extolling the peace and righteousness that characterized this cosmic epoch.