మార్కండేయ మహా పురాణము
96 - భౌత్య మన్వంతర కథ యందు అగ్నిస్తోత్రము
తరువాత “భౌత్య” మనువు యొక్క జననము, అతని మన్వంతర మందలి దేవతలు, ఋషులు, వసుదాధిపతులు వారి యొక్క పుత్రులు మొదలగు వారి విషయములను వినుము. “అంగిరా” అను పేరు గల ముని శ్రేష్టునకు “భూతి” యను పేరు గల ఒక శిష్యు డుండెను. అతడు అతి కోప స్వభావము కలవాడు. అల్పమగు అపరాధ మైనను తీక్షణమగు శాపము నిచ్చును. మరియు నిరపరాధులైన పురుషుల యెడల కూడా అతడు పరుషముగా మాటలాడెడి వాడు. అమిత తేజుడు, కోప స్వభావము గల ఆ ఋషికి భయపడి ఆయన ఆశ్రమ మందు వాయువు వేగముగా వీచదు. సూర్యుడు తన తాపము నధికముగా చూపుటకు భయ పడును. ఇంద్రుడు అధికముగా వర్షించి పంకిలమును చేయుటకు భీతిల్లును. మరియు పరి పూర్ణుడైన చంద్రుడును తన కిరణములచే అతి శీతలము చేయడు. అతి కోప స్వభావము గల ఆ ముని యొక్క భయముచే విశేష మగు శీతలము ఉండదు. ఆ ముని యొక్క ఆజ్ఞానుసారముగా ఋతువు లన్నియు తమ క్రమములను త్యజించి, ఆ ముని యొక్క ఆశ్రమ స్థలము నందలి వృక్షముల యందు ఎల్లవేళలా ఫల పుష్పముల నుత్పన్నము చేయు చుండును.
ఆశ్రమ సమీపము నందలి జలములు (నదులు) మహాత్ముడగు భూతికి భయపడి అతని ఇచ్చానుసారముగా ముహూర్త కాలముననే ఆయన కమండలము లోనికి చేరును. ఓ విప్రుడా! అతి కోపము గల ఆ ముని క్లేశములను సహించ లేక పోయెడివాడు. అయినను పుత్రులు లేక పోవుటచే ఆ మహాభాగుడు వనములో తపస్సు చేయ వలెనని ఇచ్చగించినాడు. పుత్రుని కోరునట్టి ఆ ముని “సంయమ చిత్తుడనై శీత, వాత ఉష్ణములను సైచి తపస్సు చేయుదును” అని నిశ్చయించుకొని తపస్సు నందు మనస్సును లగ్నము చేసెను. ఓ మహామునీ! ఆతను తపస్సు చేయు సమయము నందు ఆయన యెడల చంద్రుడు అతి శీతలమును, సూర్యుడు అధిక తాపమును చూప లేదు. వాయువు కూడా వేగముగా వీచలేదు. ముని సత్తముడగు ఆ భూతి ద్వంద్వ భావములగు ఉష్ణ శీతలములచే పీడితుడై నప్పటికీ తానూ అభిలషించిన దానిని పొందలేదు. అందుచే తపస్సు చేయుట విరమించెను.
పిమ్మట భూతికి “సువర్చు”డను పేరు గల ఒక సోదరు డుండెను. ఆయన యజ్ఞము చేయుచు ఇతనిని ఆహ్వానించెను. అచటకు వెళ్ళ వలెనని అనుకొనిన వాడై బుద్ధిమంతుడగు “శాంతి” అను పేరు గల తన శిష్యునితో ఇట్లు పలికెను. ఓ ముని సత్తమా! ఇతడు పేరుకు తగినట్లుగా శాంతముతో గురువు యొక్క కార్యము లందు వినీతుడై సదా పనులను చేయుచు సదాచారుడై, ఉదారుడై యుండెడి వాడు.
ఓ శాంతీ! నా సోదరుడు సువర్చసుడు పిలుచుటచే నేను అతని యజ్ఞమునకు పోవు చున్నాను. ఇప్పుడు నీవు ఇక్కడ ఉండి ఏమి చేయవలెనో వినుము. “నీవు నా ఆశ్రమ మందున నిత్యాగ్ని హోత్రమును చేయుము. అగ్ని చల్లారకుండా దానిని యత్న సహితముగా రక్షణ చేయుము.”
గురువు గారిచే ఈ విధముగా ఆజ్ఞను పొంది శిష్యుడగు శాంతి “అట్లే చేయుదును” అని చెప్పెను. అప్పుడు భూతి కనిష్ఠ సోదరుని యజ్ఞమునకు పోయెను.
పిమ్మట శాంతి గురువు గారి అగ్ని పోషణార్థము వనము నుండి సమిధలు, పుష్పములు, ఫలాదులను తెచ్చు చుండెను. మరియు గురు భక్తికి వశీభూతుడై ఇతర కార్యములు చేయుట యందు నిమగ్నుడై యున్న సమయమున గృహీతమైన అగ్ని చల్లబడి పోయెను. (ఆరి పోయెను) బుద్ధిమంతుడగు శాంతి ఆ అనలము ఆరి పోవుట చూచి అత్యంత దుఃఖితుడై భూతి యొక్క భయముచే భీతి నొందిన వాడై అనేక విధముల చింతింప సాగెను. ఇప్పుడేమి చేయుదును? ఈ సమయమున గురువు గారు వచ్చినచో, నేను ఏమి చేసిన ఉచితముగా నుండును? ఏమి చేసినచో మేలు కలుగును? ఇప్పుడు నా గురువు ఈ గృహము నందు అగ్ని ఈ విధముగా ఆరి పోవుట చూచినచో నిస్సందేహముగా నన్ను విషమ దుఃఖము లందు నియోజితుని చేయును.
ఒకవేళ నేను అగ్ని స్థానము నందు వేరొక అగ్నిని స్థాపించినను ప్రత్యక్ష దర్శియగు ఆ గురువు నన్ను తప్పక భస్మము చేయును. పాపాత్ముడ నైన నేను గురువు యొక్క కోప, శాపములకు హేతు భూతమైన పాపమును గురువు యెడల చేసిన పాపము యొక్క శోకమును పొందుదును. గురువు చల్లబడిన అగ్నిని చూచి నిశ్చయముగా నన్ను శపించును. లేక పావకునికి అయినను శాప మివ్వగలడు. నా గురువు యొక్క వీర్య మటువంటిది. దేవతలు కూడా ఎవని ప్రభావముచే భీతిల్లి శాసనా దీనులైరో అట్టివాడు నన్ను అవమానింపడా?
గురు భయముచే ఎల్లప్పుడూ భీతి కల్గియుండు వాడును, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడును అగు శాంతి ఇట్లు అనేక విధాలుగా చింతించిన వాడై జాతవేదసు డను అగ్ని దేవుని శరణు బొందెను.
పిమ్మట ఆ శాంతి ఇంద్రియ నిగ్రహముతో ఏకాగ్ర చిత్తుడై భూమి యందు ముంగాళ్ళపై నిలిచి చేతులు జోడించి, సప్త శిఖా యుక్తుడగు అగ్నిని స్తుతింప సాగెను.
ఎవడు ప్రాణు లందరకు సాధకుడై యున్నాడో, ఎవడు మహాత్ముడై ఉన్నాడో, ఎవడు ఏక ద్విపంచ రూపుడై ఉన్నాడో, మరియు ఎవడు రాజసూయ యజ్ఞ మందు షణ్మూర్తిధరుడై ఉన్నాడో, అతనికి నమస్కారము. ఎవడు సమస్త దేవతలకు వృత్తిని ప్రసాదించు చున్నాడో, ఎవడు సువర్చలుడై యున్నాడో, ఎవడు జగత్తు నంతటికి స్థితిని కల్పించు చున్నాడో, అట్టి శుక్ర రూపునకు నమస్కారము. నీవే దేవత లందరకు ముఖ స్వరూపుడవు. ఓ భగవానుడా! నీవు ఘృతపానము చేసి దేవత లందరకు సంతుష్టులను చేయు చున్నావు. నీవే దేవత లందరకు ప్రాణ స్వరూపుడవు. నీ యందే యజ్ఞ సామాగ్రులు భస్మమై నిర్మలమగు పరిశుద్ధిని పొంది, అటు పిమ్మట అవి జల స్వరూపములో పరిణతి చెందు చున్నవి.
ఓ అనిల సారదీ! ఆ జలములచే సమస్త ఔషదులు పుట్టుచున్నవి. మరియు ఆ ఔషదుల వలననే జీవగణా లన్నియు సుఖముగా జీవించు చున్నవి. ఓ పావకుడా! మనుష్య గణాలు నీ ద్వారా ఉత్పన్నము లైన ఔషదుల ద్వారా ఎట్టి యజ్ఞములు చేయు చున్నారో, అట్టి యజ్ఞముల ద్వారానే దేవతలు, దైత్యులు, రాక్షస గణాలు, తృప్తులగు చున్నారు. ఓ హుతాశనా! నీవే ఆ యజ్ఞము లన్నింటికి ఆధార స్వరూపుడవు. అందు వలన ఓ వహ్నీ! నీవే అందరిని ఉత్పన్నము చేయు వాడవు. సర్వమయుడవు. ఓ పావకా! దేవా, దానవ, యక్ష, దైత్య, గాంధర్వ, మానవ, పశు, వృక్ష, మృగ, పక్షి, సరీసృప గణాలు నీ వలననే తృప్తులగు చున్నారు. సంవర్ధితులగు చున్నారు. నీ వలననే ఉత్పన్నమై అంత్య తాలమున నీ యందే లీనమగు చున్నారు.
ఓ దేవా! నీవే జలమును ఉత్పన్నము చేయు చున్నావు. మరియు నీ ద్వారా అది జీర్ణము చేయు శక్తి గలదై ప్రాణులకు పుష్టి కారక మగుచున్నది. ఓ అగ్ని భగవానుడా! నీవే దేవతల యందు తేజః స్వరూపముతో, సిద్దులందు కాంతి స్వరూపముతో, నాగులందు విష రూపముతో, పక్షుల యందు వాయు రూపముతో, వెలుగు చున్నావు. ఓ దేవా! నీవే మనుష్యుల యందు క్రోధ రూపముతో, పక్షి, మృగముల యందు మోహ రూపముతో, వృక్షముల యందు స్థితి రూపముతో, పృథ్వి యందు కాఠిన్య రూపముతో, మరియు జలమందు ద్రవ రూపముతో ఉన్నావు. నీవే వాయువు నందు వేగ రూపముతో, ఆకాశ మందు వ్యాప్తి స్వరూపముతో ఆత్మను నిలిపితివి. ఓ అగ్నీ! నీవే పాలన చేయుచూ అన్ని జీవుల అంతస్సు లందు చరించు చున్నావు. కవి గణాలు నిన్ను ఒక్కనిగా నిర్దేశించుకొని తిరిగి వారే నిన్ను త్రివిధములని చెప్పు చున్నారు.
కవి గణాలు నిన్ను అష్ట విధాలుగా కల్పించి యజ్ఞ వాహునిగా గల యజ్ఞములను కల్పించినారు. నీ వలననే జగత్తు పుట్టు చున్నది అని పరమర్షి గణాలు చెప్పు చున్నారు. ఓ హుతాశనా! నీవు లేనిచో, వెంటనే సంపూర్ణ జగత్తు వినాశనమును పొందును. బ్రాహ్మణ గణాలు నిన్ను హవ్య, కవ్యాదులచే పూజించి ‘స్వధా’ “స్వాహా” అని ఉచ్చరించు కారణమున స్వకర్మ విహిత గతిని పొందు చున్నారు. దేవతలచే పూజింపబడు వాడా! ప్రాణుల యొక్క పరిణామాత్మకుడవగు వీర్య స్వరూపా! సమస్త అగ్ని శిఖలు నీ నుండియే వెలువడి భూత గణాలను దగ్ధము చేయు చున్నవి. ఓ మహాద్యుతీ! జాతవేదా! ఈ విశ్వ మంతయు నీ సృష్టియే. ఓ అనలా! వైదిక కర్మలు, మరియు సర్వ భూతాత్మకమగు జగత్తు నీ ఆధీనములోనే ఉన్నది. ఓ అనలా! పింగాక్షా! నీకు నమస్కరించు చున్నాను. ఓ హుతాశనా! నీకు ప్రణమిల్లు చున్నాను.
ఓ ఆద్యా! ఓ పావకా! నీకు నమస్కారము. నీవే భుక్త పీత ద్రవ్యములను జీర్ణము చేయు వాడవగుటచే విశ్వ పావనుడవు. ఓ విశ్వపావనా! నీవు సర్వ భూతములను పవిత్రులుగా చేయు వాడవు. నీవే సస్యపాక కర్తవు. జగత్తునకు పుష్టి కారకుడవు. మేఘములు నీవే. వాయువు నీవే. సస్యోత్పాదక హేతువాదు బీజ స్వరూపుడవు నీవే మరియు నీవే అన్ని భూతముల యొక్క పోషణ కొరకై భూత, భవిష్యద్వర్తమాన కాల స్వరూపుడవు. నీవే సమస్త భూతముల యందలి జ్యోతి స్వరూపుడవు. మరియు సూర్యుడు పగలు నీవే. ఉభయ సంధ్యలు నీవే. ఓ వహ్నీ! నీవే హిరణ్య రేణువులచే సువర్ణము నుత్పన్నము చేయు వాడవు. నీవు హిరణ్య (సువర్ణ) గర్భుడవు. మరియు హిరణ్యముతో సమానమగు కాంతిని గల వాడవు. ముహూర్త కాలము నీవే. త్రుటి కాలము లవ పరిమాణములు కూడా నీవే.
ఓ జగత్ప్రభో! నీవే కలాకాష్టా నిమేషాది రూపము లందు పరిణామాత్మకుడవగు అఖిల స్వరూపుడవు. ఓ ప్రభో! కాల నిష్టాకరియైన నల్లని జిహ్వాచే ఓ దేవా! పాప భయముల నుండి మరియు ఐహికమగు గొప్ప భయముల నుండి మమ్ములను రక్షింపుము. మహా ప్రళయ మందు “కరాళీ” అను పేరు గల ఎట్టి జిహ్వ నీకు గలదో, దానిచే ఐహిక భయముల నుండి, పాపముల నుండి మమ్ములను రక్షింపుము. లఘిమాగుణ యుక్తమగు “మనోజవా” అను పేరుగల ఎట్టి జిహ్వ నీకు కలదో, అట్టి జిహ్వచే ఐహికమగు మహా భయముల నుండి, పాపముల నుండి మమ్ములను రక్షింపుము. ఏ “సులోహిత” అను పేరుగల నీ జిహ్వ ప్రాణుల యొక్క కోర్కెల సిద్ధింప జేయునో, అట్టి దాని చేత ఐహికమగు మహా భయముల నుండి, పాపముల నుండి మమ్ములను రక్షింపుము.
“సుధూమ్ర వర్ణ” మను పేరు గల ఏ జిహ్వ ప్రాణుల రోగములను దగ్ధము చేయు చున్నదో, అట్టి జిహ్వచే ఐహిక మహా భయముల నుండి, పాపముల నుండి మమ్ములను రక్షింపుము. “స్ఫులింగినీ” యను పేరుగల ఏ జిహ్వచే ఆత్మ, దేహము ఉత్పన్నమగు చున్నవో, అట్టి నీ యొక్క జిహ్వచే ఐహిక మహా భయముల నుండి, పాపముల నుండి మమ్ములను రక్షింపుము. నీ యొక్క ‘విశ్వ’ యను పేరు గల ఏ జిహ్వ ప్రాణులకు శుభములను ప్రసాదించు చున్నదో, అట్టి జిహ్వచే ఐహిక మహా భయముల నుండి, పాపముల నుండి మమ్ములను రక్షింపుము. ఓ హుతాశనా! నీ నేత్రములు పింగళ (పసుపు పచ్చని) వర్ణములు. కంఠము లోహిత (ఎఱ్ఱని) వర్ణము. మరియు నీవు స్వయముగా కృష్ణ వర్ణము గల వాడవు. నీవు నన్ను అన్ని దోషముల నుండి రక్షింపుము. మరియు నన్ను ఈ ప్రపంచము నుండి ఉద్ధరింపుము. ఓ వహ్నీ! సప్తార్చి, హవ్యవాహన, కృశాను అగ్ని, పావక, శుక్ర, ఇత్యాది ఎనిమిది నామములతో చెప్పబడు చున్నావు. నాపై ప్రసన్నుడవు కమ్ము.
ఓ అగ్నీ! నీవు అన్ని భూతముల కన్న ముందుగా ఉత్పన్నమైనావు. హే విభావసో! ఓ హవ్యవాహనా! ఓ అవ్యయా! నేను నిన్ను స్తుతించు చున్నాను. నా స్తుతిని నీవు స్వీకరించి నాపై ప్రసన్నుడ వగుము. ఓ వహ్నీ! నీకు క్షయము లేదు. నీ రూపము అచింత్యము. నీవు సమృద్ధి సంపన్నుడవు. ఆశ్రయుడవు. మరియు అతి తీవ్రుడవు. మూర్తివంతుడ వైనను నీ ఎంత బలశాలి వనగా అవ్యయా! భీమ రూపమగు సంపూర్ణ జగత్తును కూడా నాశనము చేయ గలవు. ఓ హుతాశనా! నీవు ఉత్తమ తత్త్వానివి. సంపూర్ణ ప్రాణుల యొక్క హృదయ కమల స్వరూపుడవు. నీవు అందరిచే పూజింపబడు అనంత బ్రహ్మ స్వరూపుడవు. నీవే బ్రహ్మ స్వరూపముతో ఈ చరాచర జగత్తును వ్యాపించినావు. అందు వలన నీవు ఒక్కడివే అయినను అనేక విధాలుగా ఈ ప్రపంచము నందు నిలిచి యున్నావు. ఓ అనలా! నీవు అక్షయుడవు. నీవే పర్వత, వన, యుక్తమైన పృథ్వీ స్వరూపుడవు. నీవే సూర్య చంద్ర యుక్తమగు ఆకాశ స్వరూపుడవు. నీవే పగలు రాత్రి ఇత్యాది నిఖిల కాల స్వరూపుడవు. నీవే మహా సముద్రము నందలి బడబాగ్నివి. నీవే పరమ విభూతిచే అన్ని కిరణముల యందును నిలిచి యున్నావు. ఓ హుతాశనా! నీవు నా హవిస్సులను భుజింపుము. నిష్టాగారిష్టులగు మహర్షి గణాలు మహా యజ్ఞము లందు నిన్ను సదా పూజించెదరు. నీవు కూడా అనేక విధాల స్తవములను పొంది జగత్కళ్యానమునకై సోమ రసమును, వషట్కార పూర్వకముగా పానము చేయు చుందువు.
సమస్త వేదాంగము లందు నిన్నే స్తుతించెదరు. మరియు నీ కొరకు యజన పరాయణులగు ద్విజ శ్రేష్ఠులు సదా వేదాంగములను అధ్యయనము చేయుదురు. యాజన పరుడవగు బ్రహ్మవు నీవే. విష్ణువు నీవే. మరియు భూతనాదుడగు మహా దేవుడవు నీవే. దేవేంద్రుడు, అర్యముడు, జలేశ్వరుడగు వరుణుడు, సూర్యుడు,చంద్రుడు కూడా నీవే. దేవ దానవు లందరును హవ్యముచే నిన్ను సంతుష్టుని చేసి ఫలమును బొందుదురు. అత్యుప ఘాతములచే కలుషిత మైన వస్తువు లన్నియు నీ శిఖా స్పర్శ చేత పవిత్రము లగుచున్నవి. వివిధ స్నానము లందు భస్మ లేపన స్నానమే శ్రేష్టమైనది. ఈ కారణముచే ముని గణాలు సంధ్యా కాలమున అట్టి స్నానమునే చేయుదురు. అట్లు చేయుట వలన స్వర్గ లోకమును పొందుదురు. మరియు సద్భక్తిని పొంది అనేక సుఖములను పొందుదురు. ఓ వహ్నీ! ఈ కారణమున నీవు “శుచి” అను పేరు గల వాడవు. అట్టి రూపము తోనే నాపై ప్రసన్నుడ వగుము. నీవు పవిత్ర ప్రబల వాయు స్వరూపముచే ప్రసన్నుడ వగుము. ఓ పావకా! వైద్యుతాగ్ని ఇత్యాది నామములచే కీర్తింప బడుదువు. అట్టి రూపముతో నాపై ప్రసన్నత జూపుము. ఓ హవ్యవాహనా! నాపై ప్రసంనత జూపి నన్ను రక్షింపుము.
ఓ వహ్నీ! నాచే స్తుతింప బడి నీ మంగళ స్వరూపములగు జ్వాలలచే తండ్రి పుత్రుని గాపాడు విధమున నీవు నన్ను గాపాడుము.
Summary of chapter 96 of the Mārkandeya Mahā Purana is as follows:
Obeying his ancestors, Prajāpati Ruci offers a profound and beautiful hymn of praise to the Pitṛs, extolling them as divine beings of light who sustain the worlds. He worships them as the recipients of svadhā offerings who grant health, spiritual wisdom, progeny, and heavenly realms to devoted descendants.