మార్కండేయ మహా పురాణము
15 - స్వర్గ ప్రాపక ధర్మ సూక్ష్మ వర్ణనము - కర్మ విపాక కథనము
రాజా! పతిత పురుషుని ద్రవ్యమును ప్రతిగ్రహణము జేసిన ద్విజుడు గార్ధభ యోని యందు జన్మించును. మరియు పతిత పురుషునితో యజ్ఞము జేయించినచో నరకము నుండి విముక్తుడైన బిమ్మట పురుగు జన్మ నందును. ఉపాధ్యాయుని సమీపమున కపటముగా బ్రవర్తించినను, ఆతడి భార్యను గాని యాతడి ద్రవ్యమును గాని యభిలషించి నచో కుక్క జన్మ వచ్చును. తల్లి దండ్రుల నవమానించిన వాడు గాడిదగా బుట్టును. మరియు తల్లి దండ్రుల దూషించిన వాడు సారిక ( గోరువంక ) జన్మ బొందును. సోదరుని భార్యను యవమానించిన వాడు కపోత ( పావురం) మై బుట్టును. యజమాని యన్నము భుజించుచు, యజమాని యిష్ట ప్రకార ముండని వాడు మోహము బొందిన వాడై జచ్చి కోతియై బుట్టును.
దాచి పెట్టిన ద్రవ్యము నపహరించిన వాడు నరకము నుండి విముక్తుడైన పిమ్మట పురుగుగా బుట్టును. మరియు నసూయా గుణము గలవాడు నరకము నుండి విడి వడిన తరువాత రాక్షసుడగును. విశ్వాస ఘాతకుడు నగు నరుడు చాపయై బుట్టును. ధాన్య, యావ, తిల, మాష, కుళుత్థ (ఉల్టవ), సర్షప (ఆవాలు), చణక (శనగలు)ములు, కలాయ, కలమ (రాజనాలు), ముద్గ (పెసలు), గోధూమ, అతసీ (అవిశ)లను, మరియు నిరతములగు ధాన్యముల నజ్ఞానముచే నచేతనుడై హరించిన వాడు ముంగిస వంటి దీర్ఘమగు గొప్ప ముట్టె గల ఎలుకగా బుట్టును. పరస్త్రీ గమనము జేసినవాడు, భయంకరమైన తోడేలు జన్మ నెత్తును. తరువాత క్రమానుసారముగా కుక్క, నక్క, కొంగ, గ్రద్ద, పాము, కాకి జన్మల బొందును. సోదర భార్యను, గురు భార్యను, రాజ భార్యను, సంభోగించినవాడు పందియై బుట్టును. యజ్ఞ, దాన, వివాహములను విఘ్నమాచరించు వాడు పురుగై బుట్టును. ఒకడి కిచ్చిన కన్యను మరి యోకడికి ఇచ్చిన నీచుడు గూడ పురుగు గానే బుట్టును. దేవతా, పితృ, విప్రులకు బెట్టక యన్నము దిను వాడు నరక విముక్తుడైన బిదప కాకియై జన్మించును. తండ్రితో సమానుడగు అన్నగారి నవమానించిన వాడు గూడ, నరకము నుంచి క్రౌంచ (బెగ్గురు) జన్మ గల వాడగును. బ్రాహ్మణ స్త్రీని సంగమించిన శూద్రుడు పురుగుగా జన్మించును.
అబ్రాహ్మణ స్త్రీ యందు సంతానము గలిగించినచో కట్టేలలో కీటకమగును. తరువాత క్రమముగా పంది, పురుగు, నీటి కాకి, చండాల జన్మ బొందును. మానవులలో కృతజ్ఞత లేని వారు, క్రుతఘ్నులు, నధము లగు వారు నరక విముక్తి బొంది క్రమముగా కృమి, కీటక, మిడత, తేలు, చాప, కాకి, తాబేలు జన్మలెత్తి చివరకు కుక్క మాంసము దిను చండాల జన్మను బొందుదురు. చేతిలో శాస్త్రము లేని వాని జంపిన గాడిదగా జన్మించును. స్త్రీ వధ, బాల వధ జేసినవాడు పురుగగును. అన్నమును దొంగిలించిన వాడు మక్షిక మగును. ఇచ్చట భోజనములో విశేష మున్నది. చెప్పేద వినుము. భోజన పదార్ధములలో పాలు నపహరించి నచో నరకము నుండి వచ్చి పిల్లిగా బుట్టును. తెలక పిండితో గూడిన యన్నమును హరించినచో మూషిక మగును.
నేతి నపహరించిన ముంగిస యగును. మేక మాంసమును హరించిన నీటి కాకిగా బుట్టును. మత్స్య మాంసాపహారి కాకి జన్మ బొందును. గొర్రెమాంసము దొంగిలించిన డేగ బుట్టుక వచ్చును. ఉప్పును దొంగిలించినచో నీటి కాకి యగును. పెరుగు దొంగతనము వలన కృమి జన్మ, పాలను దొంగిలించిన కొంగ జన్మ గలుగును. నూనె నపహరించినచో గబ్బిలముగా బుట్టును. తేనే నపహరించిన అడవి ఈగ గాను అప్పము లపహరించిన చీమగాను బుట్టును. హీవిష్యాన్నము హరించినచో బల్లిగా బుట్టును. మధ్య విశేషములను దొంగిలించిన తీతువ పక్షి యగును. ఇనుము నపహరించినచో నా పాపాత్ముడు కాకియై బుట్టును. కంచును దొంగిలించిన హారీత (పచ్చని పిట్ట) పక్షిగాను, వెండి పాత్ర నపహరించిన పావురము గాను బుట్టును.
బంగారపు పాత్ర దొంగిలించినచో కృమి యోని యందు బుట్టును. పట్టు దారము నపహరించినచో, చక్రవాక (జక్కువ పిట్ట )పక్షి యగును. పట్టు వస్త్రము నపహరించిన పట్టు పురుగు గాను, దకూల (రెక్కచాపు) హరించిన పాపి చిలుక గాను, బుట్టును. చీరె నపహరించినను చిలుకగానే పుట్టును. దావలిని చీనాంబరము హరించిన యెలుగుబంటి గాను, కార్పాసమును హరించిన క్రౌంచ పక్షి గాను, అగ్ని నపహరించిన కొంగ, మరియు గాడిద గాను బుట్టును. వర్ణక (సుగంధ ద్రవ్యముల) ను హరించిన గాని,శాక పత్రమును హరించిన గాని పత్ర శాకముగా బుట్టును. యెర్రని వస్త్ర మపహరించిన జీవం జీవక (వన్నె పులుగు) పక్షి యగును. శోభనములగు గంధ ద్రవ్యముల యపహరణచే చుచ్చుందరీ యగును. వస్త్రాపహరణమున చెవుల పిల్లియై బుట్టును. మాంసాహారి మయిన ఖంజ జన్మ గలుగును. కట్టెల దొంగిలించిన ఘుణ కీటకమగును. పుష్పాపహారి దరిద్రుడై బుట్టును. వాహనాపహారి కుంటి వాడగును. శాకాహారి హరీత పక్షి యగును. నీటి నపహరించిన చాతక మగును.
భూమి నపహరించిన వాడు నరకమను భవించిన బిమ్మట క్రమముగా తృణ, గుణ్మలతా వల్లీ త్వత్సార వృక్షములుగా జన్మించును. తరువాత పాపమంతయు ననుభవించి, స్వల్ప పాపముతో మానవుడై బుట్టును. వృషభము యొక్క వృషణములు చేదించిన కొజ్జ వాడై బుట్టును. అట్లు ఇరువది ఒక్క సారి నపుంసకుడై బుట్టి బిమ్మట క్రమముగా కృమి, కీట, పతంగ, పక్షి, జలచర, మృగ, గో జన్మల బొంది పిమ్మట గుడ్డి, కుంటి, చెవిటి, కుష్ఠు, క్ష్యయ రోగములతో పీడితుడై అతి నీచమైన పుల్కసాది జన్మల బొందును.
ముఖ రోగ, అక్షి రోగ, గుద రోగములు గలవాడగును. అపస్మార రోగము గల వాడును గూడ వగును. తరువాత శూద్రుడగును. గో, సువర్ణాపహారులకు గురు దక్షిణ యీయని వారాలకు నీ క్రమముగానే జన్మలు వచ్చును.
పర పురుషుని భార్యను తీసికొని వచ్చి ఇంకొక నరునికి అప్పగించిన మూఢ మానవుడు అనేక నరకములను అనుభవించి పిమ్మట నపుంసకుడుగా జన్మించును. అగ్ని హోత్రమందు జ్వాలలేని సమయమున హోమము జేసినచో అగ్ని మాంధ్య రోగములచే ఘనమగు నజీర్ణ దుఃఖము గలవాడై బుట్టును. పరనింద, క్రుతఘ్నత్వము, పర రహస్యముల బయలు పరచుట, నిష్టురత్వము, దయాహీనుడగుట, పర భార్యను బొందుట, పర ద్రవ్యాభిలాష, దేవతా నింద, మోసముతో ప్రజలను వంచించుట, ప్రతీషిద్దములగు వానిని మంచివిగా ప్రశంసించుట, యీ పైన జెప్పిన వన్నియు నరక లోకము నుండి యీ లోకమున బుట్టిన వారికా లక్షణములు ఉండును. భూతదయ, భూతము లందు సద్భావము, వేద ప్రామాణ్య మందు దృష్టి, స్వర్గాది లోకములు బోవుటకు దగిన సత్కర్మలు, గురు, దేవర్షి, సిద్దర్షి, పూజనములు,స త్క్రియాభ్యాసము, స్నేహము, ఇవన్నియు పండితున కుండును.
ఇక నితరములైన సద్ధర్మ క్రియలు, ఇవన్నియు స్వర్గలోకము నుండి యీ లోకములో బుట్టిన వారికీ లక్షణము లుండును. రాజా! ఉద్దేశ మాత్రముగా పుణ్యాత్ముల, పాపాత్ముల స్వకర్మ పుణ్య పాప ఫలము లెట్లుగా ననుభవించుదురో, నీకు జెప్పితిని. రాజా! రమ్ము! ఇంకొక ప్రదేశమునకు బోదము. ఇప్పుడన్నియు నీవు జూచితివి గదా! నరకము జూచితివి గాన ఇంకొక చోటికి బోవుదము. రమ్ము.
తరువాత నా రోజు యమ దూతయగు నాతడిని ముందిడుకొని వెళ్ళుట కుద్యమించెను. తత్ క్షణమై యాతనల యందున్న పాపులంద రొక్కసారిగా రాజా! అనుగ్రహించుము. ఒక్క ముహూర్త ముండుము. నీ శరీరము నుండి వచ్చిన గాలి మా మనస్సుల నానంద పరచుచున్నది. ఓ నరశ్రేష్టుడా! మా శరీర తాపము, పీడ, బాధ, సర్వము సంపూర్ణముగా బోయినది. మా యందు కృప యుంచుము.
ఆ రాజు వారి మాటలను వినిన తరువాత నా యమదూతను నే నుండ వారి కానందము గలుగుట ఏమిటని యడిగెను. వీరందరి కాహ్లాదము గలుగునట్టి యంతటి మహాపుణ్యము మర్జ్య లోకమున నేనేమి జేసితినో, దానిని జెప్పుము.
రాజా! నీవు భూలోకమున పితృ, దేవ, అతిధి, భ్రుత్యాదులు తినిన బిమ్మట శిష్టాన్నముచే నీ శరీరము పుష్టి బొందినది. మరియు నీ మనసెప్పుడు వారి యందభిలాష గలదిగా నుండెను. అందుచే నీశరీర సంసర్గము నొందిన వాయువు వారి కాహ్లాద దాయకమైనది. రాజా! యీ కారణముచే పాప కర్ములకు యాతనలు బాధించుట లేదు. మరియు నో రాజా! నీ వశ్వమేదాది మహా యజ్ఞములు శాస్త్రవిధిగా జేసితివి.
రాజా! నీ పుణ్య తేజః ప్రభావముచే పాపాత్ము లనుభవించు చున్నవి, మహా దుఃఖములకు హేతువు లయిన పీడన, చేదన, దాహాది బాధలన్నియు మృదుత్వము బొంది హరింప బడినవి.
యమ పురుషా! నరులు ఆర్తులైన వారికి సుఖము నిచ్చుట గలిగిన యానందము స్వర్గమందు గాని, బ్రహ్మ లోకమందు గాని, గలుగదని నా మనో నిశ్చయము. భద్ర ముఖుడను బేరు గల ఓ యమ పురుషా! నా సమీపమున వీరికి యాతనలు బాధలు గలుగని యెడల నే నిచ్చటనే స్థాణువు వలె కదల కుండ యుండెదను.
రాజేంద్రా! పాప కర్మలు గాన పాపములను భరించుదురు గాక. నీకెందులకు? నీవు నీ నిజ పుణ్యార్జితము లచే సంభవించిన భోగముల ననుభవించెదవు గాక రమ్ము నేను బోవు చున్నాను.
భద్రా! నా సన్నిధానముచే నరక వాసులు సుఖము గల వారగు చున్నారు.గాన, వీరి దుఃఖములు దొలగునంత వరకు నేను బోవజాలను.
శత్రు పక్షమైనను శరణని వచ్చిన వారి నను గ్రహించిన నా పురుషుని జీవితమూ నింద్యమైన దగును. ఆర్తులైన వారిని రక్షించిన వచ్చు ఋణ్యమునకు ఈ లోకమందు గాని బరలోక మందు గాని యజ్ఞదాన తవస్సులు సమానముగా జాలవు. ఏ మానవుని మనస్సు చాలా వృద్దా తురాదుల యందు కఠినముగా నుండునో వాడు మానవుడు గాడు. మరేమన వాడు రాక్షసుడని నా తలంపు. వీరులకు నే నిచ్చట సమీపమున నుండుటచే, అగ్ని తాపము, దుర్గంధము, నరక సంభవము లగు దుఃఖములు, ఆకలి దప్పికల వలన కలుగు దుఃఖము, ఇంకను మూర్ఛ ప్రదాములగు దుఃఖములన్నియు నశించు చున్నవి గాని నో భద్రా! నాకిచ్చట స్వర్గ సుఖము కన్నా మిన్నగా నున్నదని తలంచు చున్నాను.
ఈ నరక వాసులగు అనేక జీవుల సుఖమే నాకు సుఖము. నాకు ఇంతకన్నా కావలసినది ఏమున్నది? వారు దుఃఖ పడుటయే నాకు దుఃఖమగును. గాన నీవు త్వరగా పొమ్ము.
రాజా! ధర్మ దేవుడు దేవేంద్రుడును, నిన్ను దీసికొని పోవుటకు వచ్చినారు గావున యిచ్చటి నుండి యవశ్యముగా వెళ్ళవలసి యున్నది. రమ్ము.
రాజా! నీవు మహా పుణ్య కర్మలు జేసినావు. నిన్ను స్వర్గమునకు దీసికొని బోయెదను. ఇదిగో! యీ విమాన మారోపణము జేసి బోవలసి యున్నది. ఆలస్యము జేయకుము.
ధర్మ దేవా! వేల కొలది మానవులీ నరకము వలన బాధ నొందు చున్నారు. వీరు నన్ను రక్షింపమని యరచు చున్నారు. ఇందు వలన నేనిక్కడి నుండి బోవ జాలను.
రాజా! ఈ పాపాత్ముల పాప కర్మలచే నరక ప్రాప్తి యైనది. నీవు జేసిన పుణ్య కర్మలచే స్వర్గము ప్రాప్తించి నది. అందువలన నీవు స్వర్గమునకు బోవలయును.
ఓ ధర్మ దేవా! ఓ దేవేంద్రా! మీ ఇరువురిలో నెవ రైనను నేను జేసిన పుణ్య కర్మల ప్రమాణ మెంతయో దెలసిన యెడల నాకు చెప్ప గోరు చున్నాను.
సముద్రములోని నీటి చుక్కలు, యాకాశమందలి చుక్కలు, వర్ష మందున్న వర్ష ధారలు, గంగా నదిలోని యిసుక, నానా యోనుల యందు బుట్టు ప్రాణులు, యే విధముగా లెక్క బెట్ట శక్యము గాక యున్నవో, యా విధముగా నీ పుణ్యము లసంఖ్యాకములుగా నున్నవి. రాజా! మరియు నిప్పుడు ఈ నరక వాసుల యందు దయగా వాడగుటచే ఇంత వరకు నీకు ఉన్న పుణ్యము నూరువేల రెట్లు వృద్ధి పొందినది. గావున నిట్టి పుణ్యఫలము ననుభ వించుటకు స్వర్గమునకు రమ్ము. ఈ పాపాత్ములగు జీవులు గూడ నరక లోక మందు ఉండి వారి దుష్కర్మలచే కలిగిన పాపఫలముల ననుభవించి పాప క్షయము జేసికొందురు గాక. నృప శ్రేష్టుడా! అందు వలన సుకృత ఫల భోగములకు స్వర్గ స్థానమునకు బొమ్ము. ఈ పాపులు తమ పాప క్షయమగు వరకు నీ నరక మందు యుండెదరు గాక.
ధర్మ, దేవేంద్రులారా! నా సామీప్యముచే నీ పాపులకు సుఖము లేనిచో, వీరు నా సాన్నిధ్యము నెందుకు కోరుదురు? అందుచేత నో త్రిదశాదిపా! నా సుకృతమే కొంచమున్నను, దానిచే యాతనల యందున్న నీ పాపులు విముక్తు లగుదురు గాక.
రాజా! ఇట్లు నీవు చెప్పుటచే నీకు ఇంతకన్న పుణ్య ఫల మధికమగుటచే గొప్పదగు ఉన్నత స్థానము ప్రాప్తించినది. చూడుము! ఆ పాపాత్ములు పుణ్యాత్ముడవగు నీవు పుణ్యమును యిచ్చుటచే నరకము నుండి విముక్తులై స్వర్గమునకు బోవు చున్నారు.
అనంతర మందా రాజుగారి మీద పుష్ప వృష్టి బడుట గాంచెను. దేవేంద్రుడు రాజు గారిని విమానమున యెక్కించి స్వర్గమునకు దీసికొని బోయెను. జనకా! నేను మరి యితరులగు పాపాత్ములు, నరక యాతనల నుండి విముక్తులమై చేసు కొనిన కర్మల ననుసరించి యనేక యోనులందు జన్మించితిమి.
ద్విజ సత్తమా! యే యే పాపములచే యే యే నరకములు మరియు జన్మలు గలుగునో, వీటినన్నియు నీ ప్రకారముగా జెప్పితిమి. తండ్రీ! నేను నీకు పూర్వము చూచినది జూచినట్లు జెప్పితిని. పూర్వానుభవము వలన గలిగిన జ్ఞానమును బొంది నీకు జెప్పితిని. మహాభాగా ! దీని తరువాత నింక నీ కేమి జెప్ప వలయును?
Summary of chapter 14 of the Mārkandeya Mahā Purana is as follows:
The messengers of Yamarāja deliver solemn instructions regarding the specific transgressions that lead to hellish suffering and the righteous actions that avert them. Sins such as disrespecting parents, betraying trust, stealing sacred property, and abandoning truth carry severe karmic penalties. Conversely, acts of charity, devotion to Bhagavān Vishṇu, truthfulness, and protection of cows and Brāhmaṇas shield the soul from all Yamadūtas.