మార్కండేయ మహా పురాణము
25 - మదాలసానుశాసనము
ఇట్లు తల్లి చెప్పిన మాటలు విని అలర్కుడు మరల వర్ణ ధర్మమును మరియు ఆశ్రమ ధర్మములను గూర్చి అడుగ సాగెను.
అలర్కుడు:
అమ్మా! మహాభాగే! నీవు రాజ ధర్మములను మాత్రమే చెప్పితివి. ఇప్పుడు నేను వర్ణ ధర్మములను, ఆశ్రమ ధర్మములను వినుటకు వాంచించు చున్నాను.
వత్సా! దానము, అధ్యయనము, యజ్ఞము ఈ మూడును బ్రాహ్మణ ధర్మములై యున్నవి. వీటి కంటే ఐరిక్తముగా నాల్గవ ధర్మము లేదు. ఆపత్కాలము నాడు మాత్రము అన్యధర్మ ముండును. శుద్ధ భావముతో యజ్ఞము చేయించుట, అధ్యాపనము, ప్రతిగ్రహము ఈ మూడు బ్రాహ్మణ జాతికి జీవనా ధారముగా చెప్పబడినవి. దానము, అధ్యయనము, యజ్ఞము చేయుట ఈ మూడు క్షత్రియ ధర్మములు. మరియు ప్రజారక్షణము, శాస్త్ర విద్య ఈ రెండు క్షత్రియులకు జీవనాధారము.
వైశ్యునకు కూడా మూడు ధర్మము లున్నవి. దానము, అధ్యయనము, యజ్ఞము మరియు పశు పాలనము, వాణిజ్యము. వ్యవసాయము వారికి జీవనాధారము. దానము, యజ్ఞము, పైమూడు వర్ణముల వారిని సేవించుట ఈ మూడు సూద్రజాతి ధర్మములు. శిల్పకర్మ, విప్రసేవ, పశుపోషణ, క్రయ విక్రయము ఇవి వీరికి జీవనాధారము . ఇవి వర్ణ ధర్మములు. నీకు చెప్పితిని. పిమ్మట ఆశ్రమ ధర్మము లను చెప్పెదను వినుము. తమ తమ వర్ణ ధర్మముల ప్రకారముగా నడుచుకొనుట చేత మానవులు మోక్షమును పొందుదురు. వర్ణ ధర్మములకు విరుద్ధముగా ప్రవర్తించినచో నరకమునకు బోవుదురు. పుత్రా! బ్రాహ్మణునకు ఉపనయన సంస్కారము కానంత వరకు ఇచ్చానుసారముగా ఆహారాదుల యందు ప్రవర్తించ వచ్చును.
ఉపనయనమైన పిమ్మట బ్రహ్మచారియై గురు కులమందు నివసించి యేయే ప్రకారంబుగా బ్రహ్మచారి ధర్మముల నాశ్రయించ వలెనో వాటిని చెప్పెదను వినుము. స్వాధ్యాయనము, అగ్ని శుశ్రూష, స్నానము, భిక్షాటనము, భిక్షను గురువునకు నివేదించుటయు , తిరిగి గురువు యొక్క ఆజ్ఞానుసారముగా భోజనము చేయుటయు, గురువు గారి పనులను చేయుటయు, గురువునకు సంతోషము కలిగించుటయు, గురువు పిలిచినప్పుడు ఏకాగ్ర చిత్తముతో చదువు కొనుటయు, ఇవన్నియు బ్రహ్మచారి ధర్మములై యున్నవి. ఒకటి గాని, రెండు గాని, నాలుగు వేదములను గాని గురువు ముఖముగా అధ్యయనము చేసి, గురు చరణములకు నమస్కరించి, గురువాజ్ఞను బొంది, గురు దక్షిణ సమర్పించ వలెను. పిమ్మట గృహస్త ధర్మము నందు ఇచ్చయున్న యెడల గృహస్థాశ్రమ మందు ప్రవేశినచ వలెను. లేనిచో వానప్రస్థాశ్రమమును గాని, సన్యాసాశ్రమమును గాని ఇష్టాను సారముగా స్వీకరించ వలెను.
కానిచో నైష్టిక బ్రహ్మచారియై గురు దేవుని గృహమందే నివసింప వలెను. గురువు లేనిచో అతని కుమారుని సమీపము నందు ఉండ వలెను. కుమారుడు లేనిచో గురువు యొక్క శిష్యుల సమీపము నందు ఉంది సేవా పరాయణుడై ఉండవచ్చును. కాని గురు పుత్ర, గురుశిష్య పుత్రుల వద్ద నుండ కూడదు. అభిమాన రహితుడై బ్రహ్మచర్యాశ్రమ మందు నివసించ వలెను. మరల గృహస్థాశ్రమ మందు ఇచ్చ కలిగిన యెడల గురువు గారి ఆశ్రమము నుండి తనకు అనురూపమైన కన్యను వివాహమాడ వలెను. కన్య రోగ రహితురాలు, అంగహీనురాలు, కుల గోత్ర సంపన్నురాలునై యుండ వలెను. స్వధర్మ కర్మల ద్వారా న్యాయానుసారముగా ద్రవ్యమును సంపాదించి భక్తి కలిగి యథా విధిగా తల్లిదండ్రులను దేవతలను అతిథి గణములను ఆశ్రిత జనులను సంతృప్తి పరచవలెను. దాసీ పుత్రులను, దీనులను, పతితులను, మరియు పక్షులను, పశువులను తన శక్తి ననుసరించి, అన్నదానము చేసి పోషించ వలెను.
ఋతుకాల మందు స్త్రీ గమనము, శక్తి ననుసరించి పంచ యజ్ఞముల యొక్క అనుస్థానము చేయ వలెను. ఇవి గృహస్థునకు ముఖ్య ధర్మములు. గృహస్థుడు శక్తి ననుసరించి ఆదరముతో, పితృ గణములను, దేవతా గణములను, అతిథి గణములను, జ్ఞాతులను, భ్రుత్యులను భుజింప జేసిన పిమ్మట భుక్త శేషమును తాను భుజించ వలెను. నేను సంక్షిప్తముగా గృహస్థాశ్రమ ధర్మములను చెప్పితిని. ఇప్పుడు వానప్రస్థ ధర్మములను వివరించెదను. శ్రద్ధగా వినుము. బుద్దిమంతులైన పురుషులు అపత్య సంతానము చూచి, తన శరీరము యొక్క నాశానమును చూసి, ఆత్మను శుద్ధి చేసుకొనుటకు వానప్రస్థ ఆశ్రమమును స్వీకరించ వలెను. అచట వనము లోని ఫలములను ఆహారముగా తీసుకొనుచు తపస్సు చేత ఆత్మా యొక్క ఉన్నతిని సంపాదించి, భూమి యందు శయనించి, బ్రహ్మచర్యానుష్టానము పితృ దేవతల యొక్క, అతిథిదేవుల యొక్క, పరిచర్యలు చేయ వలెను.
హోమము, మూడు వేళల యందు స్నానము, జడలు, నారచీరలు ధరించుట, నిరంతరమూ యోగాభ్యాసము మరియు వనములోని మిత్రులకు సేవలు చేయ వలెను. ఈ విధముగా పాప ప్రక్షాళన నిమిత్తము మరియు ఆత్మకు ఉపకారము చేయుట కొరకు వానప్రస్థాశ్రమమును ఆశ్రయించ వలెను. ఈ ఆశ్రయము పిమ్మట తుది ఆశ్రమమునగు సన్యాసము స్వీకరించ వలెను. ఓ కుమారా! మహాత్ములు, ధర్మజ్ఞులు అయిన పురుషులు ఈ నాల్గవ ఆశ్రమ స్వరూపమును చెప్పిన విధానమును చెప్పెదను వినుము. సర్వసంగ పరిత్యాగము, బ్రహ్మచర్యము రోషము లేకుండుట, ఇంద్రియ నిగ్రహము, ఒకే ప్రదేశ మందు చాల దినములు నివాసము చేయ కుండుట, కర్మను విడిచి భిక్షాటన వలన లభించిన అన్నముతో ఒక్కసారి మాత్రమే భోజనము చేసి ఆత్మ జ్ఞానమును తెలిసికొన వలెను మరియు ఆత్మ దర్శనము ఇవన్నియు చతుర్థాశ్రమము యొక్క కర్తవ్యములు.
చతుర్థాశ్రమ మందు ఏ విధముగా ధర్మానుష్టానము చేయవలెనో వాటిని నీకు చెప్పితిని. ఇప్పుడు ఆశ్రమము యొక్క ఇతర సాధారణ కర్తవ్యములు ఏవయితే ఉన్నవో అవి వినుము. సత్యము, శౌచము, అహింసా, అసూయ లేకుండుట, క్షమా, ఆనృశంస్యము, కార్పణ్యము లేకుండుట మరియు సంతోషము ఈ ఎనిమిది గుణములు పర్ణాశ్రమముల ధర్మాలకు సాధారణ ధర్మములుగా చెప్పబడెను. నేను నీ సమక్షము నందు సంపూర్ణ వర్ణాశ్రమ ధర్మాలను సంక్షిప్తముగా వర్ణించితిని. ఎల్లరకు తమ తమ వర్ణాశ్రమ ధర్మాలను పాటించ వలసి యున్నది. ఏ పురుషుడు ఎల్లప్పుడు స్వధర్మ పరిపాలన చేయునో అతడు ఎప్పటి వరకు పదునాలుగవ ఇంద్రుని పతనము కలుగదో, అప్పటి వరకు బ్రహ్మ లోకములో నివసించును. ఏ మనుష్యుడు స్వీయ వర్ణాశ్రమ ధర్మాలను ఉల్లంఘించి ఇతరముల యందు దృష్టి కలిగి యుండునో, అతడు రాజు వలన శిక్షింప బడును. ఏ మనుష్యుడు స్వధర్మాలను విడిచి పాపానుష్టానము చేయునో అతనిని శిక్షింపక ఉపేక్షించిన యడల నరపతి యొక్క ఇష్టా పూర్వములకు వినాశనము కలుగును. ఈ కారణముచే నరపతి విశేష ప్రయత్నముతో సర్వ వర్ణముల వారిని తమ తమ ధర్మముల యందు ఉంచ వలెను. ఉపేక్షించినచో ఇష్టా పూర్తములు నశించి నరక లోకమునకు బోవును. మరియు దీనికి విరుద్ధముగా వ్యవహరించినపుడు వారిని శిక్షించి స్వకర్మల యందు ఉంచ వలెను.
Summary of chapter 24 of the Mārkandeya Mahā Purana is as follows:
King Ashvatara performs intense penance to Devi Sarasvatī on the banks of the Himalayan streams, attaining the perfection of divine music and sacred speech. Pleased by his music, Svayambhū Brahmā grants Ashvatara the power to resurrect Madālasā in her exact physical form. Ashvatara then joyfully reunites Kuvalayāshva with the resurrected Madālasā in the Nāga realm, bestowing divine blessings upon the couple.