మార్కండేయ మహా పురాణము
3 - చటక చతుష్టయము వింధ్యపర్వతమందు నివసించుట.
ఆ ముని సత్తముడు ప్రతి దినము పాలు మొదలగు నాహారములతో నో విప్రేంద్రా! పోషించుటయే గాక వాటిని జాగ్రత్తగా కాపాడుచుండెను. ఆ పక్షి శిశువులు ఒక మాస కాలము మాత్రములోనే సూర్య రథ మార్గము దనుక పయనించినవి. ముని కుమారులు కౌతూహల విలోల నేత్రములతో జూచిరి. ఇంతియే గాక ఆ పక్షులు నగరములు, నదులు, సముద్రలములతో గూడిన భూమినంతయూ రథ చక్రముతో సమానముగా ప్రదక్షిణము జేసి మరల ఆశ్రమమునకు వచ్చినవి. పయనించుటచే బడలిక చెందినవియు, మహత్తు గలవియు నగు ఆ పక్షులు మహర్షి ప్రభావమున జ్ఞానము బొందిన వయ్యెను. ఒక రోజున శిష్యుల యందనుగ్రహముచే ధర్మోపదేశము చేయుచుండ ఆ పక్షులు శమీక మహర్షికి ప్రదక్షిణము చేసి, చరణములకు ప్రణమిల్లెను. అనంతర మిట్లు పలికినవి. మునీశ్వరా! నీవు ఘోర మరణము నుండి మమ్ముల దప్పించితివి. పాలు, పండ్లు, భక్షములు, నివాసము ఇచ్చి రక్షించితివి. మాకు నీవే తల్లివి, దండ్రివి, గురువు. గర్భములో మేమున్నప్పుడే తల్లి చనిపోయినది. తండ్రి కూడా కాపాడలేదు. శిశువులమగు మమ్ము రక్షించి మీరు ప్రాణ దానము జేసితిరి.
అక్షయ తేజస్సు గల మునీశ్వరా! మేము భూమి మీద బడి క్రిముల వలె శుష్కించి పోవు చుండ గజ ఘంటను పైకి తీసి మమ్ము కాపాడితివి. బలహీనముగా నున్న ఈ పిల్లలు పెరుగుట ఎట్లు? వీటిని ఆకాశములో విహరించు చుండగా నెప్పుడు చూడ గలను? భూభాగమున నొక వృక్షము నుండి మరియొక వృక్షమునకు నెరుగు చుండ నెప్పటికి చూడ గలను? ఈ పిల్లలు నా సమీపమున సంచరించు చుండ వాటి రెక్కల గాలిచే వెడలిన ధూళి నా శరీర సహజ కాంతి నెప్పుడు పోగొట్టునో గదా! తండ్రీ! యిట్టి తలంపులతో తమరు మమ్ము పాలించితిరి. అట్టి మేమిప్పుడు పెద్ద వారమైతిమి. జ్ఞానము గల వారమైతిమి. ఇప్పుడేమి జేయవలయునునో మాకు చెప్పుడు. సమస్త శిష్య పరి వృతుడగు శమీక మహాముని, శృంగియను తన కుమారునితో గూడి స్పష్టమును, సంస్కార యుక్తములు నగు ఆ పక్షి శిశువుల వాక్యములను వినెను. ఆ ముని హర్షపుల కాంచిత శరీరుడయ్యెను. కౌతూహల పరుడై వాటితో, “సత్యము బల్కుడు; మీ కిట్టి స్పుటములగు మనుష్య వాక్యములు వచ్చుటకు కారణ మేమి!” యని అనెను.
మనవి: 20 - 39 శ్లోకములు భావము మూల గ్రంధము నందు లేవు.
మీ యొక్క మాంసముచే తక్షణమే తృప్తి కలుగును. అటులనే మీ రక్త పానముచే దప్పిక కూడ దీరును. గాన యట్లు జేయుడనెను. అనంతరము మేమత్యంత హృదయ వేదనతో భయపడచు, వణుకుచు యిట్లంటిమి. చాలా కష్టమైన పనియని జెప్పి మేము చేయలే మంటిమి. ఎంత పండితు డైననూ పర శరీర రక్షణ కొరకు తన శరీరమును మరియు జీవనమును నశింపజేసి కోనునా? తండ్రియే పుత్రుడై జన్మించును కదా.
తండ్రీ! కుమారుడైన వాడు పితృ, దేవ, మనుష్య రుణములను దీర్చ వలయునని శాస్త్ర మందున్నది. అంతియే గాని కుమారుడు శరీరము నిచ్చువాడు కాదు. ఇట్లడుగుటచే మేమీ పని చేయము. పూర్వములో గూడ నెవరును చేయలేదు.
జీవన్భద్రాణ్య వాప్నోతి జీవన్పుణ్యం కరోతి చ ।
మృతస్య దేహనాశ శ్చ ధర్మాద్యుపర తి స్తథా ॥ ఆత్మానాం సర్వతో రక్ష్య మాహుర్ధర్మవిదో జనాః ।
ఇత్థం శ్రుత్వా వచోస్మాకం ॥
బ్రతికి యున్న సుఖములు బడయ వచ్చును మరియు బ్రతికి యున్న పుణ్య కార్యములు జేయ వచ్చును. చచ్చిన దేహ నాశనమగును. చనిపోయిన ధర్మాచారము నశించును. ఇందుచేతనే ధర్మ వేత్తలయిన జనులను సర్వ ప్రకారములచే నాత్మ రక్షణము కర్తవ్యమని చెప్పుదురు. మహర్షీ! ఇట్లు మేము చెప్పిన మాటలు వినినంతనే నేత్రములచే దహించు వాని వలె కోపముచే మండిపడుచూ ముని మరల నిట్లు పలికెను. దుష్ట పుత్రులారా! నేనీ పక్షి రాజునకు ప్రతిజ్ఞ చేసితిని. మీరు నా మాట వినలేదు. అందుచే మీరు నా శాప దగ్దులై పక్షులు గండు. ఓ ద్విజోత్తమా! తండ్రి మాతో నిట్లుబలికి శాస్త్రానుసారముగా తన యౌర్ధ్వదైహికము నంత్యేష్టిని జేసికొని యా పక్షితో నిట్లు పలికెను.
పక్షిరాజా! నీవు సావధానముగా నన్ను భక్షించుము. నేను నా శరీరమును నీకు ఆహారముగా చేసితిని. పతగశ్రేష్టుడా! బ్రహ్మణుడగు వాడు సత్య వాక్య పరిపాలన చేసినపుడే బ్రాహ్మణుడనిపించు కొనును. సత్య వాక్య పరిపాలన వలన లభించు మహా పుణ్యము దక్షిణా యుక్తములగు యజ్నములచే గాని మరి యితర సత్కర్మలచే గాని లభింపదు. పక్షి రూపదారి యగు ఇంద్రుడు ఋషి శ్రేష్టుని ఈ వాక్యములను విని మనస్సులో అత్యంత విస్మయము నంది ఆయనతో నిట్లు పలికెను. ఓ బ్రాహ్మణోత్తమా! ముందుగా యోగ మార్గానుసారముగా నీ శరీరమును వదలి పెట్టుము. నేను జీవితముతో నున్న జంతువు నెన్నడు భక్షించలేదు. పక్షి యోక్క యీ వాక్యమును విని మునిరాజు యోగము నవలంభించెను. వెంటనే ఇంద్రుడతని నిశ్చయము తెలిసికొని నిజ రూపమును ధరించి యిట్లు పలికెను. “పండితాగ్రణీ!
బ్రహ్మర్షీ! నేను తమ మహత్త్వమును తెలిసికొన దలచి తమ సమీపమందు ఇట్టి అపరాధము చేసితిని.”
శుద్ధ స్వభావా! నన్ను క్షమింపుము. నీ కోరిక ఏమి. ఆజ్ఞాపించుము. నీ సత్యవాక్య పరిపాలన వలన నీ యందు నా కత్యంత ప్రీతి జనించినది. ఈ రోజు నుండి నీకు నైంద్ర జ్ఞానముద్భవించు గాక. మరియు తపస్సు యందు ధర్మమందు నెప్పుడు గూడ విఘ్నము కలుగకుండు గాక. దేవ రాజగు ఇంద్రుడిట్లు చెప్పి వెళ్ళిన పిమ్మట మేము తండ్రి చరణములపై వ్రాలి, నమస్కరించి యిట్లంటిమి. తండ్రీ! మహామతీ! మేము మరణ భయము చేతను బ్రతుకు నందలి యాశ వలనను, అట్లంటిమి. మా తప్పులను క్షమింపుడు. ఈ శరీరము త్వగస్తి మాంస సముదాయమై, పూయ శోణిత పూరితమై యుండును. ఇట్టి దేహమునకై యెంత మాత్రమాసక్తి జూపజనదు. కాని మాకు మాత్ర మిట్టి కాయమందు అభిలాష మిక్కుటమై ఉన్నది. మహాభాగా! ప్రబల శత్రు రూపములగు కామ క్రోమాది దోషములకు వశమై ఈ లోకము మోహము పొందు చున్నదని వినుచున్నాము. ఓ తండ్రీ! ప్రజ్ఞా రూపమగు ప్రాకారముచే నా వరింపబడిన యీ శరీరమను పట్టణమున కస్థులను స్తంభములు, చర్మమను గోడలు, మాంస శోణితములు పూతలుగా నున్నవి.
అన్ని వైపుల నరములచే అందింపబడి తొమ్మిది ద్వారములు కలదై యున్న యీ శరీరమను పట్టణమునకు చైతన్య రూపుడగు పురుషుడు రాజై యున్నాడు. ఈ రాజునకు ఇద్దరు మిత్రులు. మనస్సు, బుద్ధియను వారు గలరు. వీరిద్దరూ గూడ పరస్పర విరోధము గలవారై యుందురు. ఎల్లప్పుడొకరి నొకరు నాశము చేసికొనుటకు ప్రయత్నించు చుందురు. మరియు ఈ రాజునకు నలువురు శత్రువులు కామ, క్రోధ, లోభ, మోహములను నామములు గల వారున్నారు. వీరు కూడా ఎల్లవేళలా రాజును నాశనము జేయుటకై ప్రయత్నిచు చుందురు. రాజయిన చైతన్య పురుషుడు పూర్వోక్తములగు నవ ద్వారములను బందించిన యెడల ఎల్లప్పుడూ అత్యంత సుఖము కలవాడై యుండును. ప్రేమ, అనురాగాదులు గల వాడగును. కామ క్రోదాది శత్రువులు కూడా ఈ రాజు నేమి జేయ జాలరు. నవ ద్వారములు తెరచి యుంచిన యెడల మొదటి రాగమను శత్రువు, నేత్రాది నవ ద్వారములలో ప్రవేశించి సర్వము నాక్రమించును. ఈ శత్రువు సర్వ వ్యాప్తియే గాక యత్యంత ప్రబలమైనది.ఈ అనురాగ శత్రువయిదు ఇంద్రియములను ద్వారములలో ప్రవేశించిన వెంటనే రాగము ననుసరించి క్రోధ, లోభ మోహములను ముగ్గురు శత్రువులు ప్రవేశింతురు. ఈ రాగా రూప శత్రువు ఇంద్రియ నామకములగు ద్వారముల గుండా ప్రవేశించి మనోబుద్ధులతో కలుసుకొని నవ ద్వారముల యందు అభిలాష కలుగ జేయును.
ఈ జయింప శక్యము కాని యీ రాగ శత్రు వింద్రియ సమూహమును మనస్సును, మరియు అన్ని ద్వారములను వశము జేసికొని ప్రజ్ఞారూపమగు ప్రాకారమును (బుద్ధి రూపమగు) కోటను కూలగొట్టు చున్నది. ప్రజ్ఞయను మనస్సును, దాని నాశ్రయించి యున్న కామాదులను చూచినా తత్ క్షణమే నశించు చున్నది. చైతన్య పురుషుడగు ఈ రాజును, మంత్రులగు ఈ ఇద్దరు మనో బుద్ధులు ఎప్పుడైతే వదలి వేసిరో ప్రజలు అనగా కోరికలు కూడా వదలి పెట్టును. (లభించవు) ఇప్పుడా చైతన్య పురుషుడను రాజు శత్రువులగు కామాదులచే ఆక్రమింపబడి నాశనమగు చున్నాడు. ఈ ప్రకారముగా కామ, క్రోధ, లోభ, మోహ, రూప శత్రువులు ప్రజ్ఞను నాశనము చేయుచున్నవి. కామాది శత్రు గణము చైతన్య పురుషుడనే రాజు యొక్క దేహమను కోటలో ఉండి రాజు యొక్క బుద్ధిని నశింప చేయుచున్నవి. రాగము వలన క్రోధము, క్రోధము వలన లోభము పుట్టు చున్నవి.
పుత్రులారా! నేను పలికినది ఎన్నటికి అభద్దము గానేరదు. ఇంతవరకు నేనన్న వచనము అసత్యము గాలేదు.
దైవమత్ర పరం మన్యే దిక్పౌరుష మనర్తకమ్ ।
దైవ బలమే పురుష కారము కంటే గొప్పదియని తలంచుచున్నాను. దైవబలమే నాచే ఇట్టి ఊహించని అకార్యము చేయించినది. మీరు నాకు నమస్కరించి ప్రసన్నుని జేసికొనినారు. అందువలన పక్షి జన్మలను పొందిననూ జ్ఞానము గల వారలయ్యెదరు గాక. నా యనుగ్రహముచే మీరు జ్ఞానము గలవారై పాప రహితులగుచు సంశయ రహితమగు చిత్తముతో పరమ సిద్ధి నందెరు గాక.
భగవానుడా ఈ విధముగా దైవ వశముచే పూర్వము మా తండ్రి శాప మిచ్చెను. పిమ్మట చాలాకాలము గడువగా నిట్లు పక్షి జన్మలను బొందితిమి. ఓ ద్విజోత్తమా! యుద్ధ స్థలమందు జన్మించిన మమ్ములను మీరు రక్షించితిరి. మేము ఇట్లు పక్షుల మైతిమి. ఓ మునిశ్రేష్టా! ఈ సంసారములో ప్రారబ్ద కర్మను అనుభవించని వాడెవ్వడు నుండడు. సమస్త జీవుల కర్మలన్నియు దైవా దీనములై యున్నవి.
భగవానుడగు శమీక మహర్షి ఇట్లు చెప్పిన పక్షి బాలకుల వాక్యములను విని సమీప మందున్న బ్రాహ్మణులతో నిట్లనెను. ద్విజోత్తములారా! నేను ఈ పక్షి శిశువు లేప్పుడైతే యలౌకిక మగు మహాయుద్ధము నందు మరణము జెందక జీవించి యుండెనో యప్పుడే మీ సన్నిధిలో యీ పక్షులు సామాన్య పక్షులు గావని చెప్పి యుంటిని. అనంతరమా పక్షులు ప్రసన్నుడు, మహాత్ముడునగు శమీక మహర్షి యాజ్ఞను బడసి, వృక్ష లతా ప్రపూరితము పర్వత శ్రేష్టమునగు వింధ్య పర్వతమునకై వెళ్ళెను. ఆ ధర్మ పక్షిరూపులగు ఆ ముని పుత్రులు ఇప్పటి వరకు ఆ పర్వతమందు నివసించు చున్నారు. తపస్స్వా ధ్యాయ నిరతులై యున్నారు. సమాధి యందు నిశ్చయ సంకల్పులై యున్నారు.
ఇట్లు శమీక మహర్షి యొక్క యాజ్ఞను బడసి, ఆ పక్షి రూపులగు ముని కుమారులాయన వలన సమస్త సదాచార క్రియల నుపదేశ మంది, అతి పవిత్ర నిర్మల జలయుత మగు ఆ పర్వత శిఖరము నందు మనో నిగ్రహము గలవారై నివసించు చున్నారు.
Summary of chapter 3 of the Mārkandeya Mahā Purana is as follows:
Resolving Jaimini's inquiry regarding Draupadī's wedlock with the five Pāṇḍava princes, the celestial birds explain the subtle workings of divine incarnation. When Indra committed ancient transgressions by slaying Trishirā and Vṛtra, his supreme celestial majesty and vigor were divided into five essential energies. These five divine portions took birth on Earth as Yudhishtira, Bhīma, Arjuna, Nakula, and Sahadeva, while the eternal Mother Śrī manifested from the sacred sacrificial altar as Draupadī to serve as their unified divine consort, thereby upholding cosmic harmony without violating holy law.