మార్కండేయ మహా పురాణము
7 - పాండవేయ జనన మరణ కారణ వివరణము
పూర్వము త్రేతా యుగమున హరిశ్చంద్రుడను రాజుండెను. అతడత్యంత కీర్తి గల వాడు, భూపరిపాలకుడు, ధర్మాత్ముడై యుండెను. ఆ రాజు పరిపాలించు చుండగా ప్రజలకు దుర్భిక్ష్యము, వ్యాధి, యకాల మరణము లేకుండెను. పౌరులధర్మ మందిష్టము లేనివారై యుండిరి. అటులనే ధన, మాన, వీర్య, తపోమదములచే నున్మత్తులు కాకుండిరి. ఏ స్త్రీలు కూడా యౌవనము రాకుండ సంతానమందుట లేదు. ఇట్లుండ నొకప్పుడు మహా బాహువగు నా రాజు యరణ్యములో మృగముల వేటాడు చుండు సమయమున “రక్షింపుము, రక్షింపుము “ అను స్త్రీల యొక్క కంఠ ద్వనిని మాటి మాటికి వినెను.
అపుడు హరిశ్చంద్ర మహారాజు వేటను చాలించి “భయము చెందకు” మని పలికెను. నేను భూమిని పరిపాలించు చుండగా నన్యాయ ప్రవృత్తి గల యా దుర్భుద్ధి ఎవడు? ఇట్లు పలికి ఆ ఆర్త ధ్వని ననుసరించి వెళ్ళెను. అట్టి సమయమున సర్వ కార్యములకు విఘ్నకారియు, రుద్ర పుత్రుడగు విఘ్నేశ్వరు డిట్లుగా తలంచెను. ఈ వనమున మహాతేజస్వి ముని శ్రేష్టుడగు విశ్వామిత్రుడు వ్రత నిష్టుడై యింతకు పూర్వమెవ్వరు చేయలేని తపస్సు చేయుచూ భవాది విద్యలను సాధన చేయుచున్నాడు. క్షమ, మౌన, చిత్త సంయమములతో నా మునివరుడు సాధించ దలచిన యా విద్యా దేవతలు స్త్రీ మూర్తులై భయార్తలగుచు రోదనము జేయుచున్నారు. ఇప్పుడు నేనేమి ఉపాయము చేసిన బాగుగా నుండును?
ఈ విశ్వామిత్రు డత్యంత తేజస్సు గలవాడు. మేమతని ముందు బలహీనుల మని యీ విద్యలు భీతితో నాక్రోశించు చున్నవి. ఏమి చేయవలెను? నాకు గూడ నంతు చిక్కుట లేదు. కానిమ్ము ఈ రాజు భయపడకు మని మాటి మాటికి పలుకుచు నిచ్చటికి వచ్చుచున్నాడు. కాని ఇతని శరీరమున ప్రవేశించి నా యభీష్టమును నెరవేర్చు కుందును గాక . శివ కుమారుడగు గణపతి మనస్సు నందీ విధముగా నాలోచించి రాజ శరీర మందు ప్రవేశించెను. ప్రవేశించిన వెంటనే, యా రాజు మిక్కిలి కోపముతో నీ వాక్యమును బలికెను. బలమనేడి అత్యంత మగు వేడి గల తేజస్సుతో దేదీప్య మానముగా నున్న పృథ్వీపతి యగు నీ హరిశ్చంద్ర మహారాజిచ్చటకు వచ్చి యున్నాడు. కొంగున యగ్నిని ముడి వేసు కొనుచున్న యా పాపాత్ము డేవడు?
వాడిప్పుడు నా కార్ముకము నుండి బయల్వెడలినవియు, దిక్కుల ప్రకాశింప జేయునవియు నగు బాణములచే సర్వాంగములు చేదింప బడి దీర్ఘ నిద్రను పొందగలడు. అనంతరము విశ్వామిత్రుడు రాజగు హరీశ్చంద్రుడను చున్న యభిమాన పూర్వక వాక్యములు విన్నంతనే యత్యంత కోపము గల వాడయ్యెను. కోపము జెందిన తక్షణమే యా విద్య లనన్నియు నష్టము లయ్యెను. ఆ రాజు కూడా తపోనిధి యగు విశ్వామిత్రుని హఠాత్తుగా చూడగానే నత్యంత భయము గలవాడై రావి యాకు వలె ప్రకంపము చెందెను.
ముని వరుడగు విశ్వామిత్రుడు “దుర్మాత్ముడా! ఆగుము” అని పలుకగా రాజు నమస్కరించి వినయ పూర్వకముగా నిట్లు పలికెను. భగవానుడా! ఇది నా ధర్మము. ఓ స్వామీ! నా యపరాధము లేదు. మునివరా! స్వధర్మ రతుడనగు నా యందలుగకుము. ధర్మజ్ఞులగు రాజులు ధర్మానుసారముగా దానమును, రక్షణమును, ధనుర్ధరుడై యుద్దమును జేయ వలసి యున్నది.
విశ్వామిత్రుడు:
దాతవ్యం కస్య కే రక్షాః కై ర్యోద్దవ్యం చ తే నృపః । క్షిప్ర మే తత్సమాచక్ష్వ యద్య ధర్మ భయం తవ ॥
రాజా నీ కధర్మమన భీతి యున్నచో, దాన మన నెవ్వరికి? రక్షణ మెవ్వరికి? యుద్ధమన నెవ్వరితో చేయ వలెను? నాకు వెంటనే తెలుపుము.
హరిశ్చంద్రుడు:
దాత వ్యం విప్రముఖ్యేభ్యో యే చాన్యే కృశవృత్తయః । రక్ష్యా భీతాః సదా యుద్ధం కర్త్యం పరిపన్థిభిః ॥
మునిచంద్రా! బ్రాహ్మణ శ్రేష్టులగు వారికి, మరియు జీవనాధారము లేని ఇతరులకు దానము చేయ వలెను. భయమందిన వారినెల్ల వేళలా రక్షించ వలెను. శత్రువులతో యుద్ధము జేయ వలెను.
రాజా! నీవు సక్రమముగా రాజ ధర్మ మెరిగిన వాడవైనచో నేను ముముక్షువు నగు బ్రహ్మణుడను. నా కభీష్టమగు దక్షిణ నిచ్చెదవు గాక.
జైమినీ మహర్షీ! రాజు ఆ మాట విని ప్రహృష్ట మగు నంతరాత్మతో మరల జనించిన వాడిగా తలచెను. మరియు కౌశికునితో నిట్లు పలికెను. ఓ భగవానుడా! తమరు తమ యభిలాష ఏమియో చెప్పుడు. నేను దాని నిచ్చుటకు సిద్దముగా ఉన్నాను. శంకించకుడు. ఎంతటి దుర్లభమైన దాని నయిననూ యిచ్చి నట్లుగానే తలంపుడు.
ఓ బ్రాహ్మణుడా! తమకు హిరణ్యము, సువర్ణము, పుత్రుడు, పుత్రిక, నా శరీరము, నా ప్రాణము, రాజ్యము, పురము, ఐశ్వర్యము, వీటిలో నేమి కావలయునో తెలుపుడు.
రాజా! నీవిచ్చినవి ప్రతి గ్రహించితిని. ప్రస్తుతము రాజసూయ యజ్ఞమునకు దక్షిణ నిమ్ము.
ద్విజ శార్దూలా! అట్లే ఇచ్చెదను. రాజసూయ యాగమున కగు దక్షిణ ఎంతయో తమ ఇష్ట ప్రకారముగా కోరుకొన గోరెద.
వీరుడా! ఈ సమస్త నగర గ్రామ పట్టణములతో సాగర సహితమైన భూమిని, రథాశ్వ గజ సంకులమగు సకల రాజ్యమును దక్షిణగా యిమ్ము.
మరియు కోష్ఠాగారము (అంతర్గృహము ) రాజ కోశము మొదలగు నన్ని వస్తువులనిమ్ము. పాప రహితుడా! నీ శరీరమును, నీ భార్యా పుత్రులను వదిలి తక్కిన వన్నియు నిమ్ము. ఇంతియే గాక ధర్మ శాస్త్రానుసారముగా అంత్య కాలమందు నీ వెంబడి వచ్చునవేమియో యవన్నియు నిమ్ము. ఇంతకన్నా నేనేమి చెప్పుదును? ధర్మజ్ఞుడా! నీకున్న దంతయు నా కివ్వ గోరు చున్నాను.
ముని శ్రేష్టుడగు కౌశికుడాడిన ఈ మాటలను విని యా హరిశ్చంద్రుడు ప్రసన్న చిత్తుడై వికార రహితమైన ముఖముతో నమస్కరించి అటులనే యిచ్చితి ననెను.
రాజ్యము, భూమి, బలము, ధనము, సర్వస్వమూ నాకిచ్చినచో తపస్వినై రాజ్యము చేయుటచే రాజర్షి యగుదును. హరిశ్చంద్రా! ఈ రాజ్య మందు ప్రభుత్వమెవ్వరి కగును?
బ్రహ్మణ్యుడా! నే నెప్పుడైతే తమకు రాజ్యము నిచ్చితినో యప్పుడే తమరు ప్రభువులైతిరి. ప్రభుత్వమును గురించి చెప్పున దేమి యున్నది?
రాజా! అట్లయిన ఏ క్షణమున సమస్త భూమిని నాకిచ్చితివో ఆ క్షణముననే నేను రాజ్యమునకు స్వామి నయితిని గాన నా రాజ్యము నుండి నీవు వెళ్ళవలసి యున్నది.
రాజా! నీవు, నీభార్యా, పుత్రులును మొలత్రాడు మొదలుగా గల సమస్త భూషణ సముదాయమును త్యజించవలెను. మీ రందరు నార చీరలు ధరించి పోవలయును.
జైమినీ! హరిశ్చంద్రు డటులనే పోయెదనని చెప్పి శిబి వంశమున బుట్టిన యా దేవితో నాత్మజుడైన చిన్న పిల్ల వానితో సహా వెళ్ళుట కుపక్రమించెను. అనంతర మట్లు వెళ్ళుచున్న యా హరిశ్చంద్రుని మార్గము నడ్డగించి కౌశికుడు “రాజసూయ యజ్ఞ దక్షిణ నివ్వకుండా నెచ్చటి కేగెద” వనెను.
భగవానుడా! ఈ నిష్కంటకమగు సమస్త రాజ్యమును నీకిచ్చితిని. ఇప్పుడు నాకీ మూడు దేహములు మాత్రమే మిగిలినవి.
రాజా! నీవు దేహత్రయము మాత్రమే గలవాడ వయినను నాకు యజ్ఞ దక్షిణ మాత్రము ఇవ్వవలసి యున్నది. విశేషించి బ్రాహ్మణులకు ఇచ్చెదనని చెప్పి ఇవ్వక పోయినచో నష్టము కలుగును. నృపవరా! రాజసూయ యాగ మందు బ్రాహ్మణు లేమియిచ్చిన సంతుష్టు లగుదురో యంత దక్షిణ ఇవ్వవలసి యున్నది. మరియు ద్విజులకు దానము జేయవలయును. శత్రువులతో యుధ్ధము చేయవలయును. ఆర్తులను కాపాడ వలయునని నీవే జెప్పితివి.
భగవానుడా! ఇప్పుడు నా యొద్ద ఏమియూ లేదు. కొంత కాలమునకు పిదప నిచ్చెదను. ఓ బ్రహ్మర్షీ! అనుగ్రహింపుము.
జనాధిపా! నేనెంత కాలము దనుక వేచియుండ వలెను? త్వరగా చెప్పుము. లేనిచో నా శాపాగ్ని నిన్ను దహించ గలదు.
బ్రహ్మర్షీ! నీకు నెల రోజులలో దక్షిణా ధన మిచ్చెదను. ప్రస్తుతము నా వద్ద ధనము లేదు. అనుజ్ఞ నిమ్ము.
నృప శ్రేష్టుడా! పొమ్ము, పొమ్ము. స్వధర్మమును పాలించుము. నీ మార్గము మంగళ ప్రదమగు గాక. నీ శత్రువులు నశింతురు గాక.
అనంతర మా వసుధాదిపుడు “వెళ్ళు” మను యనుజ్ఞను బొంది బయలు వెడలెను. నడువలేని దయ్యును అతని భార్య అతనిని అనుసరించి వెళ్ళెను.
అనంతర మచ్చటి పురజనులు రాజు యొక్క అనునాయులగు మంత్రులు మొదలగు వారు సతీ సుతులతో పురము నుండి పోవుచున్న హరిశ్చంద్రుని చూసి ఇట్లు పలికిరి. ఓ మహారాజా! నీవు ధర్మతత్పరుడవు. ప్రజల ననుగ్రహించు వాడవు. నిత్యార్తి పీడితులగు మమ్ముల నెందుకు వదలి వెళ్ళుచున్నావు? ఓ రాజర్షీ నీవు ధర్మము నపేక్షించిన వాడ వైనచో మమ్ములను నీతో కూడా తీసికొని పొమ్ము. రాజేంద్రా! ముహూర్త మాత్ర మాగుము. నీ ముఖ కమలమును జూచెదము. నేత్ర భ్రమరములతో నీ ముఖ కమల మకరందమును త్రాగెదము. మరల నిన్నెప్పుడు చూడ గలుగుదుమో గదా. ఏ మహారాజు ప్రయాణము జేయుచుండ ముందు వెనుకను సామంత రాజు లేనుగు లెక్కి నడుచు చుండెడి వారో అట్టి హరిశ్చంద్ర మహారాజునకు ఆయన భార్యయగు చంద్రమతి కుమారుడగు బాలకుని బట్టుకొని ననుసరించి పోవుచున్నది. ఏ మహారాజు బయలు దేరగా కుంజర స్థితు లయిన సేవకులు ముందుగా పోవు చుండెడివారో, అట్టి హరిశ్చంద్ర మహారాజిప్పుడు కాలి నడకను వంటరిగా పోవు చున్నాడు. మహారాజా! సుకుమారము, మృదువు నగు శరీరము సుందరములగు కను బొమ్మలు యున్నత మగు నాసికయు నగు నీ ముఖము, మార్గమందు ధూళి, ధూసరితమై యెట్టిదగునో, యేమగునో, గాన నో మహారాజా! ఆగు మాగుము. స్వధర్మ పాలనము జేయుము.
క్షత్రియులకు విశేషించి భూత దయ పరమ ధర్మము. ప్రభో! నీవు లేనిచో మాకు దారా పుత్ర ధనాదులతో గాని మరి యే ఇతరములైన ధన దాన్యాదులతో గాని పని ఏమున్నది? మేమీ సమస్తము త్యజించి నీకు చాయా రూపముగా నుండెదము. హే నాథ! హే రాజ! హే స్వామీ! మమ్మెందులకు వీడి పోవుచున్నావు? నీ వెక్కడ యుండెదవు? నీ వున్న చోట నుండుటయే మాకు సుఖము. మా రాజెచ్చట నుండునో యదియె మాకు నగరము, స్వర్గమునై యున్నది. హరిశ్చంద్రుడు ప్రజల యొక్క యిట్టి మాటలను విని యత్యంత దుఃఖము పొందెను. వారికి తన యందున్న దయచే మార్గమందు నిలిచెను. ఆ సమయమున విశ్వామిత్రుడు రోశామర్ష వివృత నేత్రుడై పౌర వాఖ్యములచే వ్యాకులము చెందిన హరిశ్చంద్రుని జూచి, సమీపించి యిట్లనియె. ఛీ, ఛీ దుష్టుడా! దురాచారుడా! మిథ్యావాదీ! ఈ సమస్త రాజ్యమును నాకిచ్చి ఇప్పుడు తిరిగి అపహరించ దలచితివి. హరిశ్చంద్రుడిట్లు పలికిన గాధి తనయుని మాటలు వినగానే వణుకు చున్నవాడై “వెళ్ళు చుంటి” నని పలుకుచు తొందరగా ప్రియురాలి కరమును బట్టుకొని ప్రయాణ మయ్యెను.
కోమలాంగి యగు శైబ్యా దేవి మిక్కిలి యలసి యుండెను. విశ్వామిత్రుడు తొందర పెట్టు చుండుటచే యలసి యున్న తన భార్యను శ్రమార్తు రాలిని తొందర తొందరగా బట్టుకొని తీసికొని పోవు చున్నప్పటికిని కౌశికుడు కర్రతో నామెను మోదెను. మహాపతి యగు హరిశ్చంద్రుడు తన భార్య నిట్లు విశ్వామిత్రుడు కొట్టి నప్పటికిని యత్యంత దుఃఖార్తుడై “వెళ్ళు చున్నా” ననియనుట తప్ప నింకేమియు మాట్లాడలేదు. అనంతర మప్పుడు విశ్వే దేవత లయిదుగురు దయ కలవారై విశ్వామిత్రు నిట్లనిరి. మహా పాపాపచితుడగు ఈ విశ్వామిత్రు డెట్టి పాప లోకముల బొందగలడో గదా! మేము శ్రద్ధా వూతము, మంత్ర సంస్కృతము పవిత్రము నగు సోమ పాన మెవని మహాధ్వర మందు చేయు చుండు వారమో, అట్టి యజ్ఞములు చేయు వారలలో శ్రేష్టుడగు నీ రాజును రాజ్య భ్రష్టుని జేసిన కౌశికున కెట్టి నరక లోకములు వచ్చునో కదా!
ఇట్లనిన వారి మాటలు విని విశ్వామిత్రు డతి రుశాన్వితుడై మీరందరూ మనుష్య జన్మల నందెదరు గాక యని వారల శపించెను. అప్పుడు వారు ప్రార్థింప ప్రసన్నుడై మహాముని తిరిగి యిట్లు పలికెను. మానవ జన్మల నందిననూ మీకు సంతతి లేక పోవుగాక. దార సంగ్రహము లేకుండు గాక . కామ, క్రోధ వినిర్ముక్తులై మరల దేవతలగుదురు గాక.
అనంతర మా విశ్వే దేవతలు ద్రౌపదీ గర్భ జనితులై కురు వంశ మందు వారి వారి యంశలచే పాండవ కుమారులుగా జన్మించిరి. ఓ జైమినీ మహర్షీ! ఆ విశ్వామిత్ర మహర్షి శాప కారణముగా మహారథులగు పాండవేయులు వివాహములు కాని వారలయిరి. జైమినీ మహర్షీ! పాండవులకు సంబంధించిన నాల్గు ప్రశ్నలకు సంపూర్ణముగా సమాధానము చెప్పితిమి. ఇంకనేమి విన దలచిరి?
Summary of chapter 7 of the Mārkandeya Mahā Purana is as follows:
The immortal narrative of Maharājā Harishchandra demonstrates the unparalleled height of truthfulness and devotion to sacred duty. When Muni Vishvāmitra tested the king's steadfastness, Harishchandra cheerfully surrendered his entire kingdom, wealth, and royal power as a holy gift without a moment of hesitation. Accompanied by his devoted queen Shaibyā and young son Rohitāshva, the noble king departed for the sacred city of Kānshī to earn the remaining dakshiṇā required to complete his sacred vow.