మార్కండేయ మహా పురాణము
102 - మార్తాండోత్పత్తి
పిమ్మట విభావసుడు తన తేజో మండలము యొక్క మధ్య భాగము నుండి మండు చున్న రాగి వంటి దేహము కలవాడై ప్రత్యక్ష మయ్యెను. ఓ మునీ! అతనిని దర్శించుట తోనే అదితీ దేవి నమస్కరించెను. అప్పుడు సూర్య భగవానుడు ఆమెతో నిట్లు పలికెను. “నీ కెట్టి కోరిక కలదో, దానిని అడుగుము. అభీష్టమును నెరవేర్చెదను.” అప్పుడు ఆ అదితి జానువులచే భూమిని తాకుచు మస్తకముచే ప్రణమిల్లుచూ వరము నిచ్చుటకు సిద్ధముగా నున్న వివస్వానునితో ఓ దేవా! ప్రసన్నుడ వగుము. అధిక బలసంపన్నులగు దైత్యులు, దానవులు, నా పుత్రుల యొక్క త్రిభువనములు మరియు యజ్ఞ భాగములను అపహరించిరి. “ఓ గోపతీ! అందుచే నాపై ప్రసన్నుడవై నీ యొక్క అంశమున వారికి సోదరుడవై శత్రువులను నాశనము చేయుము.”
హే ప్రభో! దివాకరా! ఇట్లు నా కుమారులు తిరిగి యజ్ఞ భాగ భోజన మందు అధికారమును, త్రైలోక్యాధిపత్యమును పొంద వలెను. ఓ దేవా! నా యందు ప్రసన్నుడవై నా పుత్రుల యెడల కృపను ప్రకాశింప జేయుడు. దుఃఖితుల భయమును పోగొట్టు వాడా! నిన్ను లోక పాలకుడని అందురు కదా! నా అభీష్టమును సిద్ధింప జేయుము. అని పలికెను.
ఓ విప్రా! అనంతరము వారి తస్కరుడగు భాస్కర భగవానుడు ప్రసన్నుడై ప్రణతురాలైన ఆ అదితితో నిట్లు పలికెను: “ఓ అదితీ! నేను సహస్రాంశ తేజస్సుచే నీ గర్భము నుండి జన్మించి నీ పుత్రుల యొక్క శత్రువుల నందరిని సమూలముగా నాశనము చేయుదును. నీ పుత్రులు వెంటనే సుఖముగా నుందురు గాక.” అని పలికి భాస్కర భగవానుడు అచటి నుండి అంతర్ధాన మయ్యెను. మరియు అదితియు కోరిన వరమును పొందినదై తపస్సును విరమించుకొని స్వగృహమునకు పోయెను.
ఓ విప్రా! పిమ్మట కొంత కాలమునకు రవి యొక్క “సౌషుమ్న” యను పేరు గల సహస్రాంశ కిరణము దేవమాత యగు అదితి యొక్క గర్భమున ప్రవేశించెను. ఓ ద్విజుడా! గర్భవతి యగు అదితి సావధానురాలై కృచ్చ్ర చాంద్రాయణాది వ్రతానుష్టానములు గర్భము శుచిగా నుండ వలెనని ఆచరింప సాగెను. అప్పుడు కశ్యపుడు కృద్ధుడై భార్యతో “నీవు నిత్యమూ ఈ విధముగా ఉపవాసము చేయుచూ ఈ గర్భస్త అండమును చంపుదువా ఏమి?” అని పరుషముగా పలికెను. ఆ పలుకులు వినిన అదితి “ ఓ కృద్ధ స్వభావుడా! నీవు చూచుచున్న ఈ గర్భాండమును చంపుట లేదు. ఇది శత్రు వినాశనమునకు కారణ మగును” అని ప్రత్యుత్తర మిచ్చెను.
ఇట్లు పలికిన సుర మాత యగు అదితి భర్త మాటలకు కోపించినదై తేజస్సుతో జాజ్వల్య మానముగా నున్న ఆ గర్భమును పరిత్యజించెను.
ఉదయ కాల భాస్కరునివలె ప్రకాశించు చున్న ఆ గర్భమును చూసి కశ్యపుడు నమస్కరించుచూ, ఆదరముతో ఆద్య ఋక్ మంత్రాదులచే స్తుతించెను. ఇట్లు కష్యపునిచే స్తుతించబడిన వాడై భాస్కరుడు తన తేజస్సును అన్ని దిక్కులకు వ్యాపింప చేయుచూ పద్మ పత్రము వంటి వర్ణము కలవాడై గర్భాండము నుండి బయల్వెడలెను. అనంతరము సజల జల ధ్వనితో అశరీర వాణి ఆకాశము నుండి మునివరుడగు కశ్యపునితో ఇట్లు చెప్పెను. “ఓ మునివరా! ఈ అండమును చంపుదువా” అని పలికితివి. ఈ కారణమున నీ పుత్రుడు “మార్తాండు”డని పిలువ బడును. “ఈ విభుడు ప్రపంచమున సూర్యుని కార్యములు చేయును. మరియు యజ్ఞ భాగాపహరు లైన దేవ శత్రువులగు అసురులను ఇతడే నాశనము చేయును.” అని పలికెను.
ఆకాశవాణి యొక్క ఈ వాక్యములను వినిన దేవగణాలు హర్షముతో ఆకాశము నుండి వచ్చిరి. దానవ గణాలు తేజో విహీనులైరి. తదనంతరము దేవతా సహితుడైన ఇంద్రుడు దైత్యులను యుద్ధమునకు పిలిచెను. ప్రసన్న చిత్తులై దానవ గణాలు, దేవ గణాలతో పోరునకు తలపడిరి. ఆ సమయమున అసురులతో దేవతలకు ఘోర యుద్ధము జరుగ సాగెను. భువనాంతరము లన్నియు దేవాసురుల యొక్క అస్త్ర శస్త్రాదుల కాంతిచే దీప్తి వంతము లయ్యెను. ఆ యుద్ధమున బీకర రూపులైన అసుర గణాలు భగవానుడగు మార్తాండ దేవుని చూచుట తోనే, మరియు ఆయన తేజస్సు శరీరమును తాకుట తోనే, దగ్ధ మగుచూ భస్మమై పోయిరి. అప్పుడు దేవతలు హర్షాతిరేకములతో, పులకిత శరీరులై సంపూర్ణ తేజః స్వరూపుడైన మార్తాండ దేవుని, తల్లి యగు అదితీ దేవిని స్తుతించిరి.
దేవతలు పూర్వము వలె తిరిగి తమ అధికారములను, యజ్ఞ భాగములను పొందిరి. మరియు సూర్య భగవానుడును స్వాధికార కార్యములను చేయ సాగెను. అతడు కదంబ పుష్పము వలె క్రింద పైన వెలుగు చున్న కిరణములచే దీప్తి మంతుడై గోళాకారమగు అగ్ని గుండము వలె కన్పించ సాగెను. మరియు నతడు స్వల్పమగు కాంతి గల శరీరమును ధరించెను.
Summary of chapter 102 of the Mārkandeya Mahā Purana is as follows:
The supreme majesty, light, and spiritual glory of Sūryadeva are celebrated as the visible soul of the universe. Sūryadeva is extolled as the embodiment of the Trimūrti—Brahmā in the morning, Vishṇu at noon, and Śiva in the evening—sustaining all life through His radiant rays.