మార్కండేయ మహా పురాణము
49 - రుద్ర సర్గము
అవ్యక్త జన్ముడగు బ్రహ్మ యొక్క ఈ తామస సృష్టిని గురించి చెప్పబడెను. ఇప్పుడు రుద్రసర్గ విషయమును చెప్పెదను వినుము. బ్రహ్మ ఎనిమిది మంది పుత్రులు, వారి భార్యలు మరియు సమస్త పుత్రులు కల్పము ముందుగా ఆత్మతుల్య పుత్రులను చింతించుటచే అట్లే కలిగిరి. ఓ ద్విజోత్తమా ! ఆ ఎనిమిది మంది కుమారుల యందు ఒక కుమారుడు నీలలోహిత శరీరుడు, బ్రహ్మ శరీరము నుండి ఉత్పన్నమయ్యెను. అతడు ప్రభుని ఒడిలో సుస్వరముతో రోదించ నారంభించెను. అతడు అట్లు రోదించుట చూసి బ్రహ్మ ఇట్లనెను. “నీవు ఎందుకు ఏడ్చు చున్నావు?” కుమారుడు చెప్పెను. “ఓ జగత్పతీ! నాకు పేరును ప్రసాదించుము.”
నీ పేరు “రుద్రుడు”. ఇప్పుడు ఏడువకుము. ధైర్యమును పొందుము. బ్రహ్మ ఇట్లు చెప్పిన పిమ్మట ఆ కుమారుడు తిరిగి ఏడు సార్లు రోదించెను.
ఓ ద్విజుడా! అప్పుడు క్రమానుసారముగా అతనికి ఇంకను ఏడూ పేర్లు ప్రసాదించెను. తిరిగి ఈ ఎనిమిది మందికి ఎనిమిది స్థానములు, భార్యా పుత్రులను ప్రసాదించెను. పితామహుడగు బ్రహ్మ, రుద్రా, భవ, శర్వ, ఈశాన, పశుపతి, భీమ, ఉగ్ర, మహాదేవ, అను పేర్లతో పలికెను. ఈ ఎనిమిది పేర్లను ప్రసాదించి స్థానములను నిర్దేశించెను. సూర్యుడు, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, దీక్షితుడునగు బ్రాహ్మణుడు, సోముడు అను ఎనిమిది స్థానములను ఇచ్చెను. సువర్చల, ఉమా, వికేశీ, స్వధా, స్వాహా, దిశ, దీక్షా మరియు రోహిణి. వీరు రుద్రాది పేర్లు గల రుద్రాదుల భార్యలు. ఓ ద్విజశ్రేష్టా! ఇప్పుడు సూర్యుని పుత్రుల పేర్లను చెప్పెదను వినుము.
శనైశ్వరుడు, శుక్రుడు, లోహితాంగుడు, మనోజవుడు, స్కందుడు, సర్గుడు, సంతానుడు, మరియు బుద్ధుడు. ఈ ఎనిమిది మంది క్రమానుసారముగా సూర్యుని పుత్రులు. ఈ రుద్రుడు ఈ విధముగా సతిని భార్యగా పొంది ఉండెను. తిరిగి దక్షుని కోపము వలన సతి తన దేహమును త్యజించెను. (కారణమే మనగా ఎక్కడ శివునికి నిరాదరము కలుగునో, అక్కడ విద్వాంసులు ఉండరాదు. ఏ బ్రాహ్మణులు మహేశ్వరుని ద్వేషించెదరో వారు పాపము వలన నష్టచిత్తులగుదురు గాక! వేదము నుండి తొలగుదురు గాక! వేద విరుద్దము నందు నిరతులై నరకమునకు బోవుదురు గాక! వీరు కలి యుగము ప్రాప్తించుట తోడనే దరిద్రులును, శూద్రులను గూర్చి జపించు వారును అగుదురు గాక! ఇట్లు సతీదేవి శాపమిచ్చెను.) ఆ సతీ దేవి మేనక గర్భము నందు హిమవంతునికి పుత్రికయై పార్వతిగా జన్మించెను. సముద్రుని సఖుడైన మైనాకుడు పార్వతి సోదరుడు. భగవంతుడైన భవుడు తిరిగి పార్వతిని వివాహము చేసుకొనెను. భృగువు యొక్క భార్య అయిన ఖ్యాతికి ఇద్దరు పుత్రులు, ఒక కన్యక కలిగిరి. మొదటి వాని పేరు ధాత, రెండవ వాని పేరు విధాత, కన్యకకు లక్ష్మి అని పేర్లు పెట్టెను. మరియు దేవా దేవుడైన భగవానుడగు నారాయణునికి లక్ష్మి భార్య అయ్యెను. మహాత్ముడైన మేరునకు ఆయతి, నియతి అను పేర్లు గల ఇద్దరు కన్యలు ఉండిరి.
వారు ధాత, విధాతలకు భార్యలైరి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పుత్రుడు కల్గెను. ఆయతికి కల్గిన పుత్రునకు ధాత ప్రాణుడు అని పేరు పెట్టెను. నియతికి కల్గిన పుత్రునకు విధాత “మృకండుడు” అని పేరు పెట్టెను. ఇతడు గొప్ప కీర్తి గలవాడు. నాకు తండ్రి నా తండ్రి యగు మృకండుని వివాహము “మనస్విని” తో జరిగెను. ఆమె నా తల్లి. నాకు ఒక పుత్రుడు కలిగెను. నేను వానికి వేదశిరుడు అని పేరు పెట్టితిని. ప్రాణుని పత్నియగు దూమ్రావతికి ఇద్దరు పుత్రులు కలిగిరి. వారిని గురించి చెప్పెదను. ధూమ్రావతి యొక్క గర్భము నుంచి ధ్యుతిమానుడు, అజరుడు అను పేర్లు గల ఇద్దరు పుత్రులు ప్రాణునకు కల్గిరి. వీరికి పుత్రులు, పౌత్రులు అనేకమంది కల్గిరి. మరీచి యొక్క పత్ని సంభూతి పౌర్ణమానుని ఉత్పన్నము చేసెను. అతనికి విరజా, పర్వతులను పేర్లు గల ఇద్దరు మహాత్ములగు పుత్రులు కల్గిరి. ఓ ద్విజవరా! వీరి పుత్రుల యొక్క వంశములను వర్ణించెదను. అనగా రాజ వంశములను గూర్చి చెప్పెదను. శ్రద్ధగా వినుము.
“అంగిరా” యొక్క పత్నియగు “స్మృతి” సినీవాలీ, కూహూ, రాక, అనుమతి అను పేర్లు గల నల్గురు కన్యలను ఉత్పత్తి చేసెను. అత్రి వలన అనసూయ పాపరహితులగు సోముడు, దుర్వాసుడు, యోగియగు దత్తాత్రేయుడు అను పేర్లు గల మువ్వురను పుత్రా రూపములో పొందెను. పులస్త్యుని భార్య యగు ప్రీతి గర్భము నుండి దత్తుడను మరియొకడు ఉత్పన్నమయ్యెను. ఇతడే పూర్వ జన్మము నందు అనగా స్వాయంభువ మన్వంతర మందు అగస్త్యుడను పేరుతో ఖ్యాతి పొందెను. ప్రజాపతి యగు పులహుని యొక్క భార్య అయిన క్షమ ‘కర్దమ’, ‘అర్వవీర’, ‘సహిష్ణు’ అను పేర్లు గల ముగ్గురు పుత్రులను ఉత్పన్నము చేసెను. క్రతువు యొక్క భార్య సన్నతి ఊర్ద్వ రేతస్కులగు అరువది వేల వాలఖిల్య గణాలను ఉత్పన్నము చేసెను. ఊర్జయను భార్య యందు వశిష్టునకు ఏడుగురు పుత్రులు కల్గిరి.
వారి పేర్లు ‘రజ’, ‘గాత్ర’, ‘ఊర్ద్వబాహు’, ‘సబల’, ‘అనఘ’, ‘సుతప’, శుక్లులను వీరే సప్త ఋషుల పేర్లతో విఖ్యాతులైరి. ఓ ద్విజుడా! బ్రహ్మ యొక్క జేష్ట్య పుత్రుడైన అభిమానము గల అగ్ని యొక్క వివాహము స్వాహా దేవితో జరిగినది. వారికి కూడా ముగ్గురు పుత్రులు కలిగిరి. వారు గొప్ప ప్రతాపవంతులు, మహా బలశాలురు. వారి పేర్లు పావక, పవన, శుచి అను వారు ఎల్లప్పుడు జలము త్రాగుచుందురు. వారికి నలుబది ఐదు మంది పుత్రులు కల్గిరి. మరియు ముగ్గురు పుత్రులు పితా పుత్రులని చెప్పబడుదురు. వారు అగ్నికి పౌత్రులు. ఈ నలుబది తొమ్మిది మంది అగ్ని యొక్క పౌత్రులు దుర్జయులని చెప్పబడుదురు. నేను నీకు వీరిని పూర్వము పితరులు అన్న పేరుతో వాఖ్యానించితిని. అగ్నిష్వాత్తులు బర్హిషదులు, అనగ్నులు, సాగ్నులు. అను పితరుల వలన స్వథ మేన, వైధారిణి అను పేర్లు గల ఇద్దరు కన్యలను పొందినది. ఓ ద్విజుడా! ఈ ఇద్దరు కన్యలు బ్రహ్మ వాదినులై యోగాభ్యాసముల యందు తత్పరులై ఉండిరి.
Summary of chapter 48 of the Mārkandeya Mahā Purana is as follows:
Mārkaṇḍeya elaborates on the secondary creation of immobile plants, animals, birds, devas, humans, and asuras born from the various subtle bodies assumed by Brahmā during cosmic meditation. Each species is endowed with specific attributes according to past cosmic karma.