మార్కండేయ మహా పురాణము
120 - అవీక్షిత చరితము
అవీక్షితునిచే పెక్కు మారులు వోడిన ఆ రాజ పుత్రులు రాజులు ఈ విధముగా సంగ్రామమునకు సన్నద్దు లైరి. ఓ మునీ! అప్పుడు చాలా మంది రాజులు రాజ పుత్రులతో ఒక్క అవీక్షితునికి భీకర సంగ్రామము జరుగ సాగెను. అస్త్ర శక్తి, గద మరియు బాణములను చేతులలో ధరించి ఆ దుర్మదులైన రాజు లందఱు అతనితో యుద్దము చేసిరి. మఱియు అవీక్షితుడు గూడ ఒంటరిగా వారితో యుద్దము చేయు చుండెను. అస్త్రజ్ఞుడు, బల వంతుడు నగు నృప నందనుడు వందల కొలది ఉగ్ర బాణములచే వారిని గొట్ట సాగెను. మఱియు వారు గూడ నిశిత బాణములచే ఆ బాణములను త్రుంచు చుండిరి. రాజ పుత్రుడగు, అవిక్షితుడు కొందరి బాహువులు, కొందరి మస్తకములు త్రుంచి వేసెను. కొందరి గుండెలు పగల గొట్టెను. కొందరిని ఛాతి యందు గొట్టెను.
అతడు ఏనుగుల తొండములను, గుఱ్ఱముల మస్తకములను, కొందరి రథముల యొక్క గుఱ్ఱములను కొందరి సారథులను నాశనము చేసెను. శత్రువులు చేయుచున్న బాణములను తునకలు చేయ సాగెను. హస్త లాఘవముచే కొందరి ధనస్సులను విరగ గొట్టెను. అవీక్షితుడు కొందరికి కవచములను త్రుంచుటచే వారు మృతి చెందిరి. మరి కొందఱు పదాతులు గాయపడి రణ స్థలమును పరిత్యజించిరి. ఈ విధముగా అతడు సమస్త రాజ మండలమును వ్యాకుల పఱచి నప్పుడు పరాజయమును పొందిన సేనలు పారిపోయెను. అప్పుడు కేవలము ఏడు వందలు మంది వీరులు తమ కులము శౌర్యములను విచారించి సిగ్గు పడిన వారై మరణమును పొందుటకు నిశ్చయింకొని రణ క్షేత్రమున నిలిచి యుండిరి.
రాజ పుత్రుడు అత్యంత క్రుద్ధుడై వారి సమీపమునకు వచ్చి యదా విహిత ధర్మ యుద్దమున ఆ రాజు లందరితో యుద్దము చేయ సాగెను. ఓ మహా మునీ! ఎప్పుడయితే మహా బలశాలి యగు అవీక్షితుడు వారి అస్త్ర, కవచాదులను త్రుంచుటకు కృత సంకల్పుడై యుండెనో, అప్పుడు ముఖములు శ్వేత బిందువులతో తడిసి యున్న నరేంద్ర పుత్ర గణాలు ధర్మమును వీడి ఆ ధర్మ యోదునితో యుద్దము చేయ సాగిరి. కొందఱు బాణములచే బాధింప సాగిరి. ఒకడు ధనస్సును త్రుంచెను’ మరి యొకడు ద్వజమును ద్రుంచి భూమిపై బడ వేసెను. కొందఱు గుఱ్ఱములను చంపిరి, మరి కొందఱు రథమును విరగ గొట్టిరి. మరి కొందఱు అతని వీపుపై శస్త్రాఘాతము చేసిరి.
ధనుస్సు విరుగుటచే నృప నందనుడు అతిక్రుద్దుడై ఢాలు, కత్తి తీసుకొనెను. కాని ఒక వీరుడు దానిని గూడ త్రుంచెను. ఢాలు, కత్తి తునకలు కాగానే గదా యుద్దము నందు చతురుడైన అవీక్షితుడు గదను ధరించెను. కాని హస్త లాఘవ మందు అతి వీరుడగు నొకడు క్షురముతో దానిని గూడ చేధించెను. అటు పిమ్మట ధర్మ యుద్ద విముఖులైన ఆ రాజు లందఱు అతనిని చుట్టూ ముట్టిరి. మరియు ఎందఱో రాజులు సహస్ర బాణములతో, మరియు ఎందఱో వందల కొలది బాణములతో అతనిని గాయ పరచిరి. ఒంటరి వాడైన రాజ కుమారుడు అనేక మంది రాజులచే ఈ విధముగా గాయ వాడై విహ్వలుడై భూమి యందు పడి పోయెను. అప్పుడు మహాభాగులగు ఆ రాజ పుత్రులు ఆతనిని బంధించిరి. ఆ రాజులు అందఱు ఆతనిని అధర్మ యుద్దమున జయించి విశాల రాజుతో సహితముగా వైదిశ పురము నందు ప్రవేశించిరి.
ఆ రాజ కుమారుని బంధించి తెచ్చి వారందరూ పుష్టిని, ఆహ్లాదమును పొందిరి. అనంతరము వారు ఆ స్వయంవర కన్యను మఱియు రాజు పుత్రుని విశాల నరపతి సమ్ముఖమున నిలిపిరి. అటు పిమ్మట ఓ మునీ! “ఈ రాజు లందరిలోను ఎవరిని నీవు అభిలషించు చున్నావో ఆతనిని వరించుము” అని ఆమె తండ్రి మరియు పురోహితులు మాటి మాటికి ఈ విధముగా చెప్పిరి. ఆ కన్య అందెవరిని కూడ వరించుటకు ఇష్టపడ లేదు. అప్పుడు నరేశ్వరుడు జ్యోతిష్కులను వివాహ సంబంధ విషయమును గూర్చి అడిగెను. “ఈ రోజు ఈ విధముగా విఘ్నేత్పాదక యుద్దము సంభవించినది. అందుచే ఈమె వివాహమునకు మరి యొక్క ఉత్తమ దినమును తెలుపుడు.”
ఎప్పుడైతే నరేంద్రుడు ఈ విధముగా జ్యోతిష్కులను ప్రశ్నించెనో, అప్పుడు వారు ఆ విషయమును గూర్చి విచారించిరి, మరియు వృత్తాంతము నెరిగి దుఃఖిత మనస్కులై రాజుతో ఇట్లు చెప్ప సాగిరి. ఓ పృథ్వీపతీ! ఈ వివాహమునకు ప్రశస్తలగ్న యుక్తమగు మంచి రోజు త్వరలోనే రాగలదు. ఓ మానదా! ఆ రోజు తటస్థించి నప్పుడు వివాహ కార్యమును చేయుడు. ఈ సమయమున వివాహము యొక్క ఆవశ్యకత లేదు. ఎందు చేత ననగా ఇప్పుడు ఇట్టి మహా విఘ్నము ఉపస్థిత మైనది.
Summary of chapter 120 of the Mārkandeya Mahā Purana is as follows:
King Khanīnetra, son of Vivimsha, faces the trial of being childless for a long period. Performing severe penances and the grand Ashvamedha Yajna with unwavering faith, he pleases the devas and receives a heroic son named Karandhama.