మార్కండేయ మహా పురాణము
46 - సృష్టి ప్రకరణము
హే బ్రాహ్మన్! మీరు అర్వాక్ స్త్రోతమగు మనుష్యుల విషయములను చెప్పిరి. ఇప్పుడు తిరిగి దానిని విస్తార సహితముగా చెప్పుడు. హే మహామతీ! ఇట్టి గుణ యుక్తమగు సమస్త వర్ణముల సృష్టి ఏ విధముగా జరిగినది? మరియు బ్రాహ్మాణాదులకు ఏ యే కర్తవ్యములు కలవు? అవన్నియు సవిస్తరముగా చెప్పుడు.
సృష్టికి ప్రథమ మందే ధ్యానశీలుడగు బ్రహ్మ యొక్క ముఖము నుండి సహస్ర మిథునముల ఉత్పత్తి కలిగినది. అవన్నియు తేజోవంతమై సత్త్వము అధికముగా నుండెను. మరియు ఆయన వక్ష స్థలము నుండి అన్య సహస్ర మిథునము (దంపతులు) ఉత్పన్నమయిరి. అవన్నియు తేజము, క్రోధ స్వభావము, రజో గుణము కలవి. ఆయన ఊరువుల నుండి ఏ సహస్ర మిథునముల ఉత్పత్తి కలిగెనో, అవి రజ స్తమో గుణోద్రిక్తమై, ఈర్షా యుక్తమై ఉండెను. మరియు పాదముల నుండి ఏ సహస్ర మిథునములు ఉత్పన్నమయ్యెనో, అవి తమో గుణములు, లక్ష్మీ రహితములు, నిస్తేజము లయ్యెను. తిరిగి సంఘర్షణముచే ద్వంద్వ రూపమగు ప్రాణులు జనించెను.
మరియు ఆ ద్వంద్వోత్పన్న మగు ప్రాణులు ప్రసన్న చిత్తముతో పరస్పరము మైథునము చేయుట యందు ప్రవృత్త మయ్యెను. అప్పటి నుండి ఈ కల్పమందు ఈ విధముగా మిథునము యొక్క ఉత్పత్తి కలిగినది. ముందు స్త్రీలకు ప్రతి మాస మందు రజో ధర్మము లేదు. ఈ కారణముచే మైథునము చేసినను, సంతానము లేదు. ఆయుశ్యము యొక్క చివరి భాగమున మాత్రము ఒకసారి సంతానము కలుగు చుండెను. అప్పటి నుండి ఈ కల్ప మందు మిథున కర్మచే ఉత్పత్తి ఈ విధముగా కలుగు చున్నది.
ఎప్పుడు బ్రహ్మ ప్రజలను గురించి చింతించునో అప్పుడు ఆయన మనస్సు నుండి ఒకేసారి ఏ పంచ మహా భూతములు, శబ్దాది విషయములు ఉత్పన్న మైనవో, వాటిని ప్రజాపతి యొక్క మానస సృష్టి అందురు. ఈ సమయ మందు ఆ సృష్టి వలన జగత్తు పరిపూర్ణమగు చుండును. పూర్వ యుగము నందు ప్రజా గణాలు, అల్ప శీతోష్ణమైన సరిత్సరోవరము లందు, సముద్రము యొక్క సమీప మందు, పర్వతముల యందు చరించు చుండెడి వారు. ఓ మహామతీ! వారు ఉపభోగ్య విషయము లందు స్వాభావికముగా తృప్తి లాభము పొందేవారు. వారిలో ఏ విధమైన విఘ్నములు, ద్వేషము, మాత్సర్యము లుండేవి కావు. వారు ఇండ్లు నిర్మించు కొనక పర్వతములు, సముద్రపు ఒడ్డుల యందు నివసిస్తూ ఎల్లప్పుడు నిష్కామ చారులై ప్రసన్న చిత్తులై ఉండేడి వారు.
పిశాచములు, ఉరగములు, రాక్షసులు, అభిమానులగు మానవులు, పశువులు, పక్షులు, తేళ్ళు, మొసళ్ళు, చేపలు, ప్రాణి విశేషములు, అండము నందలి ప్రాణులు అధర్మము వలన ఉత్పన్న మైనవి. ఆ కాలమందు ఫల, మూల, పుష్పాదులు, ఋతువులు, వర్షములు, మొదలైన వేవియు లేవు. ఆ సమయ మందు అధికమగు శీతలము కూడ లేవు. సర్వత్ర అత్యంత సుఖముగా నుండెను. కాలక్రమ మందు వారికి అద్భుత సిద్ధి కలిగెను. పూర్వాహ్ణ మందు లేక మధ్యాహ్న మందు వారికి తృప్తి కలుగని యెడల కోరినప్పుడు సహజముగానే వారు తృప్తులగుదురు. మరియు కోరినచో మనస్సు నుండి వారి యొక్క మనోరథములు ప్రకటితమగును. అప్పుడు జలము యొక్క సూక్ష్మత కారణంగా వారి యొక్క నానా ప్రకారములగు రసోల్లాస యను సిద్ధి ఉపస్థిత మగుటచే కోరికలు సంపూర్ణముగా సిద్ధించెను. వారు సంస్కార హీను లైనను స్థిరమగు యౌవనమును పొందు చుండిరి.
సంకల్పము లేకనే వారికి మిథున ప్రజలు ఉత్పన్న మగుదురు. ఈ మిథున ప్రజలు ఏ విధముగా ఒకేసారి ఉత్పన్న మగుదురో, అట్లే రూపాదుల సమానత్వమును పొంది ఒకేసారిగా ప్రాణ త్యాగము చేయుదురు. వారికి పరస్పరము అభిలాష గాని ద్వేషము గాని కొంచెమైనను ఉండదు. అందరూ సమాన భావముతో కాలమును గడుపుదురు. వారిలో ఎవరూ ఉత్తములు గాని, అధములు గాని కారు. ఎందుచేత ననగా అందరూ ఆయుష్య మందు, రూపాదుల యందు సమాన భావముతో నుందురు. ఈ మిథున ప్రజలు పరిమాణ మందు నాలుగు వేల సంవత్సరములు జీవింతురు. క్లేశములు లేకుండ విపత్తులు లేకుండ ప్రాణ త్యాగము చేయుదురు. దైవ వశమున భూమి యొకా ఆయా స్థానము లందు ఈ విధముగా ప్రజలు క్రమానుసారముగా జీవనమును విసర్జించెదరు.
అప్పుడు క్రమానుసారముగా ఆ సిద్దు లన్నియు నష్టమై పోవును. అవి నష్టమై నప్పుడు ఆకాశము నుండి రసము పడుట మొదలిడెను. జలము, పాలు ప్రాప్తించినవి. గృహము లందు కల్ప వృక్షము కూడా ఉత్పన్న మయ్యెను. ఈ కల్ప వృక్షముల నుండియే వాటి యొక్క సమస్త భోగములు లభింప మొదలిడెను. త్రేతాయుగ ప్రారంభ మందు మానవులు ఈ విధముగా జీవన యాత్ర నిర్వహించేవారు. అనంతరము కాలక్రమాన వారికి ఆకస్మికముగా రాగము కలిగెను. అప్పుడు ఈ రాగము ఉత్పన్న మగుటచే వారికి ప్రతి మాస మందు రజస్సు ఉద్భవించెను. ఈ కారణముచే మాటి మాటికి గర్భోత్పత్తి కలుగుట ప్రారంభించెను. మరియు వారి గృహము లందలి కల్ప వృక్షములు నశించి పోయెను. మరియు నాలుగు శాఖలు గల వృక్షములు ఉత్పన్న మయ్యెను. వాటి ఫలముల యందు వస్త్రములు ఆభరణములు నిండి యుండెను.
మరియు ఆ ఫలములపై తొర్రల యందు అందమైన సుగంధముతో వర్ణయుక్తము, బాల కారకమగు, అమాక్షికమునగు మధువు ఉత్పన్న మయ్యెడిది. త్రేతా యుగ ప్రారంభమందు ఈ మధువును పానము చేయుచు అప్పటి ప్రజలు జీవితమును గడిపెడివారు. అనంతరము కాల క్రమమున వారు అత్యంత లోభ గుణము కలవారై, మమతా యుక్తమగు మనస్సులతో ఆ వృక్షము లన్నింటిని గ్రహించుట ప్రారంభించిరి. అప్పుడు ఈ అపచారము కారణముగా వృక్షము లన్నియు నశించి పోయెను. (ఎందుచేత ననగా వృక్షములు ఉండవలసిన ప్రదేశములో గృహములు నిర్మించ బడెను). అనంతరము శీత, ఉష్ణ, క్షుదమోదలగు సమస్త ద్వంద్వములు ఉత్పన్న మయ్యెను. ఆ ద్వంద్వము లన్నియు నివారింప బడుటకు వారు ముందుగా పురములను నిర్మించిరి. అప్పుడు మరుభూమి, పర్వతములు, గుహలు, మొదలయిన వాటి యందు దుర్గము లన్నియు నిర్మితము లయినప్పుడు పర్వతములు, జలములు, ఇత్యాదుల యొక్క దుర్గముల యందు నివసింప నారంభించిరి.
మరియు తమ తమ అంగుళము మొదలగు పరిమాణములతో సమస్త కృత్రిమ దుర్గములను పరిమితము చేసుకొని, పరిమాణ నిరూపణము కొరకు ప్రమాణములు నియమించిరి. అతి సూక్ష్మ ప్రమాణార్థము పరమాణువు ( జాలీ యొక్క రంద్రముల నుండి కిరణములు పడుటచే సూక్ష్మ రజము కనబడును. దాని మూడవ భాగమును పరమాణువు అందురు.) త్రస రేణువు, ధూళి మరియు స్థూల పరిమాణార్థము నిష్క, యూకా, యవలు, స్థిరమై ఉన్నవి. (30 పరమాణువులు 1 త్రస రేణువు, 30 త్రస రేణువులు 1 కేశాగ్రము, 30 కేశాగ్రములు 1 నిష్కము, 30 నిష్కములు 1 యూర, 30 యూరలు 1 యవము, 8 యవలు 1 అంగుళము.) ఎనిమిది యవలు ఒక అంగుళము, ఆరు అంగుళములు ఒక పదము, రెండు పదములు ఒక జానెడు, రెండు జానలు ఒక హస్తము, బ్రహ్మ తీర్థ పర్యంతము చుట్టబడిన నాలుగు హస్తములు ఒక ధనుర్దందము, లేక నాదికా యుగము, రెండు వేల ధనువులు ఒక గవ్యూతి, (అనగా రెండు కోసులు) మరియు నాలుగు గవ్యూతులు ఒక యోజనము అగును. బుద్ధి మంతులగు పురుషులు సంఖ్యా నిరూపణము కొరకు ఈ విధముగా నిర్ధారణ చేసిరి.
పూర్వము చెప్పిన నాలుగు విధాలగు దుర్గము లందు మూడు స్వాభావిక మైనవి. తరువాతది కృత్రిమ మైనది. అనగా మానవ నిర్మితము. ఇదే దుర్గముల కర్తవ్యము. ఓ ద్విజుడా! ఆ తరువాత వారు ఆ అన్ని స్థానము లందు నగరములు, గ్రామములు, ద్రోణీ ముఖములు, శాఖా నగరములు, ఖర్వటములు, ద్రమీ గ్రామములు, సంఘోషములు వీటన్నింటిని స్థాపించి వాటి యందు తిరిగి వేరు వేరుగా నివాస స్థానములు చేసుకొనిరి. వాటికి నాలుగు వైపులా పొడుగైన గోడలు, ఆవరణలు నిర్మించిరి. ఏది పొడవు రెండు క్రోసులు, ఎనిమిది భాగములు వెడల్పు ఉండునో దానిని పురము అందురు. అట్టి పురము యొక్క తూర్పు, ఉత్తర భాగము లందు జలము ద్వారా ప్లావిత మైనచో దాని యందు విశుద్ధ వంశము వారిచే సేతువు నిర్మితమైనచో అది శ్రేష్టమైన దగును. పురము యొక్క అర్థభాగ లక్షణ యుక్త మైన స్థానమును చిన్న గ్రామ మందురు. దానిలో అర్థ భాగ స్థానమును ఖర్వటము అందురు. పురము నందలి అష్ట భాగమును ద్రోణీ ముఖము అందురు.
ఏ పురము నందు ప్రాకారములు, కందకములు ఉండవో, దానిని ఖర్వటమని అందురు. దేని యందు మంత్రులు, సామంతులు మొదలగు వారు నివసింతురో మరియు నానా ప్రకారములగు భోగ పదార్థములు కూడ ఉండునో, దానిని శాఖా నగరము అందురు. ఏ ప్రదేశము లందు శూద్ర గణాలు స్వయముగా సమృద్ధులగు రైతులు నివసింతురో, దానిని వసతి అందురు. ఎక్కడ ప్రజలందరు, దుష్టులు, బలవంతురు, తనది కాని పరుల క్షేత్రములను గ్రహించు వారు ఉందురో, ఎక్కడ రాజ ప్రియులు నివసింతురో, ఆ గ్రామమును ద్రమీ అందురు. గోపాలకులు ఎక్కడ తమ పాత్రలు బాండాదులను బండి మీద పెట్టు కొండురో, ఎక్కడ గోవులు అధికముగా నివసించునో, ఎక్కడ దుకాణములు ఉండవో, తన ఇచ్చానుసారముగా ధనము లేకనే భూమి దొరుకునో, దానిని ఘోషము అందురు.
వారు ఈ విధముగా తాము నివసించుటకు నగరాదులు నిర్మించి సమస్తములగు దుఃఖములను నివారించుట కొరకు వ్యాపారము మొదలగునవి చేయుట కొరకు గృహములను నిర్మించిరి. ముందుగా ఏ విధముగా సమస్త వృక్షములు వారికి గృహములుగా ఉండేడివో, వాటిని స్మరిస్తూ అదే విధముగా గృహము లన్నింటిని నిర్మించిరి. వృక్షముల యొక్క శాఖలు ఏ విధముగా పైకి క్రిందకు ఎగుడు దిగుడుగా ఉండునో ఆ విధముగా వారి సమస్త గృహములను నిర్మించిరి. హే! ద్విజోత్తమా పూర్వము కల్ప వృక్షములకు కొమ్మలన్ని ఎట్లుండెడివో ఆ కొమ్మ లన్నియు ఇప్పుడు వారి గృహములుగా రూపొందినవి అనగా ఎత్తైన శిఖరములతో ఇండ్లను నిర్మించిరి. అప్పుడు ఈ గృహము లున్నవారి యొక్క శీత ఉష్ణాదుల దుఃఖములను నాశనము చేసెను. అప్పుడు వారందరూ జీవనమును గురించి చింతించుట ప్రారంభించిరి. ఎందుచేత ననగా ఆ సమయము నందు మధు సహితమగు సమస్త కల్ప వృక్షములు నష్టమై పోయినవి.
అప్పుడు సమస్త ప్రజలు విషాదముతో వ్యధ చెందిన వారై ఆకలి దప్పులతో బాధ పడుచు అత్యంత భయస్థులైరి. ఆ సమయ మందు త్రేతా యుగ ప్రారంభ మందు వారికి ఈ విధముగా సిద్ధి ఉత్పన్న మైనది. ఆ సమయ మందు వారికి ఇష్టమై నప్పుడే ఎక్కువ వర్షము కలుగును. ఆ వర్షము యొక్క సమస్త జలము క్రింద పడుచు, ఆగిపోయిన సమస్త వర్షపు నీరు ప్రవహించుచు లోతుగా నది రూపములో పరిణితి చెందెను. ముందుగా సామాన్య జలము భూమి యందు పడి ఉండెను. ఇప్పుడు ఆ జలమంతయు మట్టి యొక్క సంయోగముచే దోషరహిత మయ్యెను. దీనిలో పదునాలుగు రకాల వృక్షములు, పొదలు ఎవరును నాటకుండానే ఉత్పన్న మయ్యెను. అవి అన్ని ఋతు కాలము లందు ఫల పుష్పాదులు ఉత్పన్న మగుట ప్రారంభ మయ్యెను. ఈ విధముగా త్రేతా యుగ ప్రారంభ మందు సంపూర్ణ ఔషధములు ఉత్పన్న మయ్యెను.
ఓ మునీ! ప్రజా గణములు అకస్మాత్తుగా రాగము లోభాములను పొంది ఆ ఔషధముల వలన ఉత్పన్నమైన పదార్థముల ద్వారా త్రేతాయుగ ప్రారంభ మందు జీవించుట ప్రారంభించిరి. అనంతరము మాత్సర్యముచే వారి వారి బలము ననుసరించి అనంతరము నదులు, క్షేత్రములు, పర్వతములు, వృక్షములు, పొదలు మరియు సమస్త ఔషధములు వీటిని ఆశ్రయించుట ప్రారంభించిరి. హే ద్విజవరా! ఇట్టి దోషముచే చూచు చుండగానే ఆ ఔషధము లన్నియు నాశన మయ్యెను. అనగా భూమి ఒక్కసారిగా ఆ ఔషధము లన్నింటిని తన ఆహారముగా చేసికొనెను. ఈ విధముగా ఔషధము లన్నియు నష్ట మగుటచే తిరిగి ప్రజలందరు విభ్రాంతులైరి. ఆకలిచే పీడించబడి పరమేష్టి యగు బ్రహ్మ దేవుని శరణు వేడిరి. ఆ బ్రహ్మ దేవుడు భూమిని బాగుగా గ్రాస కారిణిగా ఎరిగి మేరు పర్వతమును దూడగా చేసి భూమిని గోవుగా చేసి సమస్త ఔషధములను పాల రూపముగా పితికెను.
అప్పుడు భూమి పృథ్వీ తలమందు సమస్త ధాన్యములను మరల ఇచ్చుట ప్రారంభించెను. దాని వలన ఆ బీజము లన్నియు ఉత్పన్న మయ్యెను. మరియు గ్రామము యందు వనముల యందు వృక్షములు ఉత్పన్న మయ్యెను. పదునేడు ప్రకార ఫలములు పండగానే ఎండి పోయిన సమస్త ఔషధములు ఉత్పన్న మైనవి. వాటి పేర్లు వరి ధాన్యము, యవలు, గోధుమలు, నువ్వులు, ఆవాలు, అణువులు, సెనగలు, కోవిదారము, బటాణి, మినుములు, పెసలు, పప్పు దినుసులు, అలచందలు, ఉలవలు, కందులు, సెనగలు, చిరి శెనగలు మొదలగు గ్రామ్య ఔషధముల యొక్క ఈ పదునేడు రకాల జాతులు ఉత్పన్న మైనవి. గ్రామము వనముల యొక్క పదునాలుగు రకముల ఔషధములు ఉన్నవి. అవి యజ్ఞ వ్యవహారము లందు వచ్చు ధాన్యములు. యవలు, గోధుమలు, చామలు, నువ్వులు, బాగుగా పండు ఉలవలు, శ్యామాకములు, నువ్వులు, గవేధుక ధాన్యములు, మర్కాటక ధాన్య విశేషములు, వెదురు ధాన్యములు ఈ పదునాలుగు రకాల ఔషధములు గ్రామ్యారణ్యములు.
ఈ విధముగా ఎప్పుడైతే అట్టి శ్రేష్ఠ ఔషధము లన్నియు తిరిగి ఉద్భవింప లేదో అప్పుడు బ్రహ్మ వాటి వృద్ధి కొరకు జీవనోపాయము గురించి చింతింప నారంభించెను. అప్పుడు భగవానుడు స్వయంభువు అయిన బ్రహ్మ కర్మ వలన సిద్ధమగు నట్టి హస్త సిద్ధిని చేసెను. అప్పటి నుండి దున్నుటచే ఉత్పన్నమగు ఔషధములు ఉత్పన్న మయ్యెను. ఈ విధముగా వారి జీవనోపాయము నిర్ధారించిన మీదట స్వయంభువు అగు బ్రహ్మ న్యాయానుసారముగా వర్ణానుసారముగా నియమములు స్థాపించెను.
ఓ ధార్మిక శ్రేష్టా! అప్పుడు సమస్త వర్ణములు, ఆశ్రమముల ధర్మములు మరియు ధర్మార్గములను పాలించుటను సర్వ వర్ణాలకు, లోకాలకు ధర్మ నిరూపణము చేసెను. క్రియా నిష్టులగు బ్రాహ్మణుల కొరకు ఆయన ప్రాజాపత్య స్థానమును నియమించెను. సంగ్రామము నందు పారిపోవ నట్టి క్షత్రియుల కొరకు ఇంద్ర స్థానమును, స్వధర్మ పరాయణులగు వైశ్యుల కొరకు మారుత స్థానము, మరియు సేవాపరాయణులగు శూద్రుల కొరకు గాంధర్వ స్థానములను నియమించెను. ఎనుబది ఎనిమిది వేల ఋషుల కొరకు ఏ స్థానము కల్పించబడినదో గురువు ఇంటి యందు నివసించు బ్రాహ్మణులకు కూడా అట్టి స్థానము కల్పించబడెను. ఎట్టి స్థానము సప్త ఋషుల కొరకు నిర్దేశింప బడినదో వనవాసులకు కూడా అట్టి స్థానము కల్పించ బడినది. గృహస్థునకు ప్రజాపత్యము, సన్యాసులకు అక్షయ బ్రహ్మ పదము, మరియు యోగులకు అమృతమగు మోక్ష స్థానము కల్పించబడినది.
Summary of chapter 45 of the Mārkandeya Mahā Purana is as follows:
The narrative transitions to the dialogue between Maharshi Mārkaṇḍeya and his disciple Kraushtuki, opening with the cosmic creation. Mārkaṇḍeya describes how at the end of Mahāpralaya, the unmanifest Supreme Being awakens Prakṛti, causing the emergence of Mahattattva, Ahaṃkāra, and the Cosmic Egg wherein Svayambhū Brahmā manifests to initiate creation.