మార్కండేయ మహా పురాణము
40 - అలర్కుని నిర్వేదము
ఓ మహారాజా! ఇప్పుడు నీకు సమస్త అరిష్టములను చెప్పెదను వినుము. యోగి వీటి నన్నింటిని చూచి తన మృత్యువును ఎరుంగ వలెను. ఏ పురుషుడు దేవా మార్గమున ధృవుని, శుక్రుని, సోముని, తన నీడను మరియు అరుంధతిని చూడ లేక పోవునో, అతడు ఒక సంవత్సరమునకు మృత్యు ముఖము నందు పడును. ఏ పురుషుడు సూర్య బింబమును కాంతి హీనముగా మరియు అగ్నిని సూర్యునిగా చూచునో, అతడు పదునొకండు నెలల కంటే ఎక్కువ జీవించలేడు. స్వప్న మందు మూత్రము, పురీషము మరియు వమనము వీటి యందు సువర్ణము గాని వెండిని గాని దర్శించినచో అట్టి పురుషుడు కేవలము పది నెలలు మాత్రమే జీవించును. ఏ పురుషుడు ప్రేత , పిశాచాదులను, గాంధర్వ నగరమును, బంగారు రంగు గల వృక్షములను చూచునో, అతడు కేవలము తొమ్మిది నెలలు మాత్రమే జీవించును.
ఏ హఠాత్తుగా స్థూలుడై మరల కృశించి మరియు కృశించి తిరిగి హఠాత్తుగా స్థూలుడగునో అతని ఆయుష్షు ఎనిమిది మాసముల పర్యంతము అవశిష్టమని ఎరుంగ వలెను. ఆ తరువాత ప్రకృతి భ్రష్టుడగును. బురద యందు కాలు వేసినచో ఎవరి యొక్క కాలి మడిమ గాని లేక కాలు యొక్క అగ్ర భాగము యొక్క చిహ్నము గాని ఖండిత మైనట్లు కనిపించునో, అతడు కేవలము ఏడు నెలలు జీవించును. గ్రద్ద, పావురము, గుడ్లగూబ, కాకి లేక క్రవ్యాదులు లేక ఇతరము లైన నీల వర్ణము కలవి, మాంసాహారి పక్షులు ఎగిరి శిరస్సు నందు కూర్చున్న యెడల ఆరు మాసముల వరకే ఆయువుండు నని ఎరుంగ వలెను. ఎవడు కాకశ్రేణి వలన మరియు ధూళి వలన దెబ్బను పొందునో, ఎవడు తన శరీర నీడను విపరీతముగా చూచునో, అతడు నాలుగు నెలలు లేక ఐదు మాసములు జీవించి యుండును. దక్షిణ దిక్కున మేఘములు లేకుండా మెరుపులను చూసినచో మరియు రాత్రి కాల మందు ఇంద్ర ధనస్సును చూచుట వలన కేవలము రెండు లేక మూడు నెలలు జీవించి యుండును.
నెయ్యి, తైలము, దర్పణము, మరియు వీటి యందు కన్నులుంచి చూచినచో తన ప్రతిరూపము కనిపించనిచో మరియు తన దేహమును శిరస్సు లేకుండా మొండెముగా చూసినచో ఒక మాసము కంటే అధిక కాలము అతడు జీవింప జాలడు. ఓ రాజా! ఎవని గాత్రము నుండి శవము వలే దుర్గంధము వెలువడునో, ఆ యోగి కేవలము అర్థ మాసము జీవించి యుండును. స్నానము చేయుట తోడనే ఎవని హృదయము మరియు కాళ్ళు ఎండిపోవునో, మరియు జలమును త్రాగిన వెంటనే తిరిగి తృష్ణచే ఎవని కంఠము శుష్క మగునో, అతడు కేవలము పది రోజులు మాత్రమే జీవించును. వాయువు చిన్నాభిన్నమై ఏ పురుషుని మర్మ స్థానమును విభిన్నము చేయునో, మరియు జలమును స్ప్రుశించుటచే ఎవనికి రోమాంచము కలుగదో అతనికి మృత్యు కాలము సమీపించదని తెలియ వలెను. ఏ పురుషుడు స్వప్నము నందు ఋక్ష, వానర యానములందు ఎక్కి పాడుచు దక్షిణ దిక్కుగా పోవునో అతనికి మృత్యువు అతి దగ్గరగా వచ్చినట్లు గ్రహింప వలెను.
స్వప్న మందు ఎర్రని వస్త్రములు ధరించిన స్త్రీ హాస్య ముఖముతో గానము చేయుచు ఎవరిని దక్షిణ దిక్కునకు తీసికొని పోవునో, అతడు వెంటనే మృత్యు ముఖము నందు పడవలసి వచ్చును. స్వప్న మందు మహాబలుడు, నాస్తికుడు, నగ్నుడు, బౌద్ధ సన్యాసి వీరిని ఒంటరిగా నవ్వుచు వెళ్ళుచుండగా చూచినచో మృత్యు కాలము చాలా దగ్గరగా ఉన్నదని తెలియ వలెను. ఏ పురుషుడు స్వప్నము నందు తన దేహమును మస్తక పర్యంతము పంక పాగరమందు ఉన్నట్లుగా చూచునో, అతనికి వెంటనే మృత్యువు కలుగును. స్వప్న మందు కేశములు, నిప్పు, భస్మము, సర్పము మరియు ఎండిపోయిన నది ఇవన్నియు చూచుటచే పది దినముల తరువాత పదు నొకండవ దినమున మృత్యువు కలుగును. స్వప్న మందు భయంకరమగు, వికటాకారమగు, నల్లని రంగు గల పురుషుడు శస్త్రములను ధరించి వచ్చి పాషాణముతో కొట్టు చున్నట్లు చూచిన వెంటనే అతనికి మృతువు సంభవించును.
సూర్యోదయ కాలమందు ఏ వ్యక్తి ఎదుట, వెనుక లేక నాలుగు వైపుల గ్రద తిరుగునో అతడు వెంటనే మృత్యు ముఖము నందు పడిపోవును. భోజనము చేసిన వెంటనే మరల ఎవ్యక్తికి ఆకలి కలుగునో మరియు దంత ఘర్షణ కలుగునో అట్టి వ్యక్తి ఆయుశ్యము నిస్సందేహముగా తీరిపోవును. ఎవని నాసిక యందు దీప గంధము తెలియదో, పగలు, రాత్రులందు కూడ భయమును పొందునో ఇతరుల నేత్రము లందు తన ప్రతిబింబమును చూడలేక పోవునో, అట్టి వానికి జీవితము అంతమైనట్లు గ్రహింప వలెను. అర్థరాత్రి సమయ మందు ఇంద్ర ధనుస్సు మరియు పగలు గ్రహనమును చూచునో, ఆత్మవంతుడగు పురుషుడు ఆయువు క్షీణమైనదని ఎరుంగ వలెను. ఎవని నాసిక వంకరగా అగునో, రెండు చెవులు పైకి క్రిందికి అగుచుండునో మరియు ఎడమ కంటి నుండి ఆశ్రువులు కారుచుండునో, అట్టి వాని ఆయుర్దాయము తీరి పోయినదని తెలుసుకొన వలయును.
ముఖము లోహిత (ఎర్రని) రంగు గాను, నాలుక శ్యామ వర్ణము గాను మారినట్లయితే బుద్ధిమంతుడగు పురుషుడు తనకు మృత్యువు దగ్గరలో నున్నదని ఎరుగ వలెను. ఎవడు స్వప్నము నందు ఒంటె, గాడిద, బండి ఎక్కి దక్షిణ దిక్కుగా వెళ్ళునో, అతడు వెంటనే మరణించును. ఇందు సందేహము లేదు. రెండు చెవులను మూసి నప్పుడు స్వీయ శబ్దము ఎవరికి వినిపించదో, మరియు ఎవరి యొక్క కన్నుల యందలి జ్యోతి తొలగి పోవునో అట్టి పురుషుడు వెంటనే జీవితమును వదలి పెట్టును. ఎవడు స్వప్నమందు గోతిలో పడిపోయి బయటకు వచ్చుటకు ద్వారమును పొందలేక పోవునో, వెంటనే లేచుటకు అసమర్థుడగునో అతని ఆయుశ్యము తీరినదని తలంచ వలెను. ఎవడి దృష్టి ఊర్ధ్వ భాగమందు నిలువదో, ఎర్రని వర్ణము కలిగి మాటి మాటికి కోపముతో చంచలమై యుండునో మరియు ముఖము వేడిగా ఉండి నాభి ప్రదేశము చల్లగా ఉండునో అతడు ఈ దేహమును విడిచి వేరొక శరీరమును గ్రహింప వలసి యుండును.
ఎవడు స్వప్నము నందు అగ్ని లేక జలము యందు ప్రవేశించి తిరిగి బయటకు రాలేక పోవునో అతని జీవితము అంతమైనదని గ్రహింప వలెను. ఎవడు పగలు గాని దుష్ట భూత గణాలతో దెబ్బలను పొందునో ఆ రోజు నుండి ఎడవ రోజు రాత్రి అతడు మృత్యు ముఖము నందు పడును. ఎవడు తన తెల్లని వస్త్రములు ధరించియు దానిని ఎర్రని వర్ణముగా లేక కృష్ణ వర్ణముగా చూచునో అతడు మృతువు సమీపమునకు వెళ్ళును. విపరీత స్వభావము మరియు ప్రక్రుతి యొక్క విపరీతములు కలిగిన యెడల యముడు మరియు అంతకులు ఆ మనిషి వద్దకు వచ్చెదరు. బుద్ధిమంతులగు వారు నిశ్చయముగా ఎరుగ వలసిన దేమంటే కాలమాసన్న మైనప్పుడు పూజనీయు లైన పురుషులను మరియు ఎవరి ఎదుట వినయముగా నుండుట ఉచితమో వారిని అవమానించుట, చేయునో, దేవతలను పూజించుట యందు విముఖుడౌనో, వృద్ధులను, బ్రాహ్మణులను నిందించునో, తల్లి దండ్రులను గౌరవించుట యందు మరియు అల్లుని గౌరవించుట యందు, విముఖు డగునో మరియు యోగులు, జ్ఞానులు, ఇతర మహాత్ములు వీరిని అగౌరవ పరచుటకు ఉద్యుక్తు డగునో అట్టి పురుషునికి మృత్యువు సమీపించును.
ఓ అవనీ పతీ! యోగి గణాలు ప్రయత్న శీలురై నిరంతరము ఎరిగి యుండ వలెను. “ఈ అరిష్టము లన్నియు సంవత్సరాంత మందు పగలు గాని రాత్రి గాని ఫలితము కలుగ జేయును. అతి భీషణ మగు అట్టి ఫలితాల యందు చక్కగా దృష్టిని ఉంచ వలెను. ఈ ఫలితముల న్నింటిని చక్కగా తెలుసుకొని వాటి రాకను ఎల్లప్పుడు మనస్సు నందు ఉంచుకొన వలెను. ఈ విధముగా యోగి ఉపస్థిత మైన కాలమును తెలుసు కొని బాగుగా నిర్భయ స్థానమగు ఆశ్రమ మందు యోగ మందు అభినివిష్టుడవ వలెను. అట్లు చేసినచో కాలము యొక్క బలము నిలువదు.
అరిష్టములను చూచుట తోడనే యోగి భయమును వదలి ఆ అరిష్టముల స్వభావము గురించి యోచన చేసి ఏ సమయ మందు అరిష్టములు కలుగునో, యోగి అయిన పురుషుడు ఆ సమయ మందే యోగ మందు నివృత్తుడవ వలెను. ఆరోజు పూర్వాహ్ణ మందు గాని, లేక రాత్రి కాల మందే యోగ నిష్టుడు అవవలెను. ఎప్పటి వరకు ఇదే విధముగా యోగ ప్రక్రియలు ఆచరింప వలెను. అతడు ఆత్మవంతుడై అన్ని భయాలను వర్జించి ఆ కాలమును ఓడించి ఆ గృహము నందు లేక అన్య ప్రదేశము లందు మనస్సును స్థిరముగా నుంచ వలెను. అట్టి ప్రదేశము లందు నివసించు మూడు గుణములను జయించి యోగ యుక్తుడై పరమాత్మ యందు చిత్తముతో అభి భూతుడై మరియు ఆత్మను తన్మయము చేసి అంత మందు చిత్త వృత్తిని కూడ విసర్జింప వలెను.
ఇట్లు చేయుట వలననే అతడు ఇంద్రియాతీత మగు బుద్ధికి అగోచరమగు మరియు హశ్యమునకు అతీతము అయిన పరమ నిర్వాణ లాభమును పొంద గలుగును. ఓ అలర్కా! నేను యధార్థముగా నీకు ఇవన్నియు వర్ణించితిని. ఇప్పుడు ఏ ఉపాయముచే బ్రహ్మ పదార్థ లాభము కలుగునో దానిని సంక్షిప్తముగా చెప్పుచుంటిని, వినుము. చంద్రుని కిరణముల సంయోగము చేతనే చంద్రకాంత మణి నుండి జలము వెలువడును. చంద్రుని కిరణముల సహితముగా సంయోగము జరిగినట్లయితే జలము ఎప్పుడును వెలువడదు. ఇదే యోగి యోక్క యోగ సిద్ధికి ఉపాయము. అనగా యోగ మందు మనస్సును నిలుపనిచే యోగి హృదయ మందు ఆనంద రసము సంచరించదు. యోగ మందు మనస్సును నిలిపినపుడే అతడు ఆనందమును పొందును. సూర్యుని కిరణముల సంయోగముతో సూర్యకాంతి మణి నుండి అగ్ని పుట్టును. ఇది కూడా యోగ సిద్ధికి మరియొక ఉపాయము అనగా యోగమందు చిత్తము లేనిచో ఎప్పుడును యోగి బ్రహ్మ సాక్షాత్కారమును పొంద లేడు. చీమ, ఎలుక, ముంగిస, ఆవు, కపింజలము, పావురము ఇవన్నియు గృహ యజమానితో సమానముగా నుండును. అనగా ఆస్థాన మందు ఎల్లప్పుడు నివసించును. వాటికి నష్టము వాటిల్లి నప్పుడు ఇతర స్థానములకు పోవును.
గృహస్థుడు ద్వంశమైనను దుఃఖమును పొందడు. ఓ రాజేంద్రా! ఇది యోగ సిద్ధికి మూడవ ఉపమానము అనగా స్వభావ సిద్ధముగా శరీరము వెనుక శరీరము యొక్క ఆవిర్భావము తిరుగుతూ ఉండును. అందువలన దాని కొరకు దుఃఖము మమతలకు వశీభూతులగుట క్షేమము కాదు. యోగి ఈ విషయములను తెలుసుకొని దుఃఖాదులను త్యజించి యోగ సాధన యందు మనస్సు లగ్నము చేయవలెను. చూడు! చీమ అత్యల్ప వస్తువు నైనను అత్యంత సూక్ష్మమగు తన నోటితో ప్రోగు చేయును. అది కూడా యోగికి ఒక ఉపదేశము. అనగా బ్రహ్మ సాధనము కఠిన కార్యము. కాని యోగ రూపముతో సామాన్య ఉపాయముల తోనే దానిని పొంద గలుగును. పశు, పక్షులు, మనుష్యులు, మొదలైనవి ఫలములను, పుష్పములను, పత్రాన్వితమగు వృక్షములను నష్ట పరచును. యోగి ఇది చూసి కూడా యోగ సిద్ధి పొందును. అనగా సమృద్ధ మగునప్పుడే నాశనము కలుగు సమయ మందు కాలము యొక్క చేతిలో తప్పక నష్టపడ వలసి వచ్చును. ఈ విధముగా తెలుసుకొని యోగి యోగ సాధన మందు నిర్ణయ లాభము చేయ వలెను. మృగ విషాణాదులందు కొమ్ముల యొక్క అగ్రభాగము నువ్వు గింజ పరిమాణముతో నల్ల వర్ణముగా ఉన్నప్పటికీ దాని సంబంధముతో అది వృద్ధిని పొందును. అదే విధముగా అనుసరించి యోగి సిద్ధి లాభమును పొందును. అనగా యోగ చర్య ఎంత కష్టతర మైనను నెమ్మది నెమ్మదిగా అభ్యాసము చేయుటచే తప్పక కృత కృత్యుడగును. మరియు ఎల్లప్పుడూ మానవుడు ద్రవ పూర్ణమగు పాత్రను చేతి యందు ఉంచుకొని భూమి నుండి పైకి ఆరోహణ చేయు ఆ సమయ మందు అతని అంగముపై బాగుగా దృష్టిని ఉంచుట చేత యోగికి అజ్ఞాతమగు విషయ మేమియు ఉండదు.
మానవుడు జీవనము కొరకు తన సర్వస్వమును నష్ట పరచు పనులను చేయును. దానిని బాగుగా తెలుసు కొన్నట్లయితే యోగి కృత కృత్యుడు కాగలడు. ఏ ప్రదేశ మందు నివసించునో అదే గృహము. దేని ద్వారా ప్రాణ ధారణ కలుగునో అది భోజ్యము మరియు దేని ద్వారా అర్థ నిష్పన్న మగునో అది సుఖము అని చెప్పబడెను. అందుచేత ఈ విషయ మందు మమత పెంచుకొన వలసిన అవసరమేమున్నది? ఏ కారణము చేత తన కోరిక సిద్ధించునో, అదే విధముగా యోగి పార లౌకిక బుద్ధి చేతనే బ్రహ్మ యొక్క సాధన చేయ వలెను.
అనంతరము నరపతి యగు అలర్కుడు వినయముగా అత్రి నందనుడగు దత్తాత్రేయునికి ప్రణామము చేసి ఆనందముతో చెప్ప నారంభించెను. హే బ్రాహ్మన్! నా భాగ్యము వలన నాకు ఈ అత్యుగ్రము ప్రాణ సందేహము నందు పడవేయు భయంకర మగు శత్రువు నుండి విముక్తి లభించినది.
నా భాగ్య వశముననే కాశీ రాజు మహాబల పరాక్రమములతో సమృద్దుడైనాడు. ఆ కారణముచే నాకు మీ సాంగత్యము లభించినది. నా భాగ్యము చేతనే నేను బలహీనుడ నైనను, భృత్య గణాలు హతులైనారు. కోశాగారము క్షయమై పోయెను. మరియు భయము వ్యాపించినది. నా సౌభాగ్యము చేతనే మీ చరణ ద్వయము నా స్మృతి పథము నందు నిలిచినది. నా సౌభాగ్యము చేతనే మీ వాక్కు లన్నియు నా హృదయ మందు స్థానమును పొందినవి. మరియు నా సౌభాగ్యము వశమున మీతో సమాగమ లాభము కలుగుటచే జ్ఞానోదయము కలిగినది. హే బ్రాహ్మన్! సౌభాగ్య వశము చేతనే తమరు నా యందు దయ చూపినారు. పురుషునికి శుభోదయము కలిగిన యెడల అనర్థాలు కూడా అర్థ రూపములో పరిణితి చెందును. ఇట్టి భయంకర విపత్తు కూడా తమరితో కలియుటకు నా యెడల ఉపకార సాధన మైనది.
హే ప్రభో! యోగీశ్వరా! ఎవరి కోసము నేను తమరి సన్నిధానమునకు వచ్చితినో ఆ సుబాహు, కాశీరాజులు ఇద్దరు నాకు పరమ ఉపకారులు. ఇందు సందేహము లేదు. మీ యొక్క ప్రసాద రూపమగు అగ్ని యందు నా అజ్ఞాన రూపమగు పాపము దగ్ధమై పోయినది. దేని వలన తిరిగి అట్టి దుఃఖము సంభవింపదో అట్టి అనుస్థానము నందు యత్నుడనై యుందును. హే బ్రాహ్మన్! మీరు జ్ఞాన దాతలు. మహాత్ములు. తమరి ఆజ్ఞ అయినచో నేను గృహస్థాశ్రమమును త్యజించెదను. ఆ ఆశ్రమము దుఃఖ రూపము గల వృక్షములతో నిండిన వనము వంటిది.
ఓ రాజేంద్ర! నీవు ఇక వెళ్ళుము. నీకు మంగళమగు గాక. నేను నీకు ఏ విధముగా ఉపదేశము చేసితినో, నీవు మమతాహంకారములను వదలి ముక్తి లాభము కొరకు దాని ననుసరించి పనులు చేయుము.
దత్తాత్రేయుడు ఇట్లు చెప్పిన తరువాత అలర్కుడు వారికి నమస్కరించి వెంటనే అగ్రజుడగు సుబాహుడు మరియు కాశీరాజు వద్దకు వెళ్ళెను.
అతడు మహాబాహుడగు కాశీ రాజు వద్దకు, సుబాహుని వద్దకు వచ్చి నవ్వుచు ఇట్లు చెప్పెను. ఓ కాశీరాజా! నీవు రాజ్య లాభమును కోరితివి. అందువలన ఈ సమృద్ధవంతమగు రాజ్యమును అనుభవింపుము. లేక సుబాహునికి ఇమ్ము. లేక నీకు ఏది ఇష్టమో అది చేయుము.
ఓ అలర్కా! నీవు యుద్ధము చేయక రాజ్యమును ఎందుకు త్యజించు చుంటివి? ఇది క్షత్రియులకు ధర్మము కాదు. నీవు క్షాత్ర ధర్మములను ఎరిగిన వాడవు. నరపతి అమాత్య వర్గాలను గెలిచి మరణ భయమును వదలి శత్రువును లక్ష్య సిద్దికై శర సంఘాతము చేయును. అతడు శత్రువులను ఓడించుటకు అభిలషించును. అతి ఉత్తమ భోగాలను అనుభవించాలని, అనేక శ్రేష్టము లైన యజ్ఞములు చేయవలెనని కోరెను.
ఓ వీరా! పూర్వము నాకును ఇదియే కోరిక ఉండినది. మరియు నా మనస్సు కూడా అట్లే కోరెడిది. కాని ఇప్పుడు దానికి ప్రతికూలముగా మారినది. దానికి కారణము వినుము. మనుష్య మాత్రునకు స్నేహము ఏ విధముగా భౌతిక మైనదో వారి అంతః కరణము మరియు గుణ సమూహములు కూడా అదే విధముగా భూతలముల సమిష్టి అయి ఉన్నవి. ఓ రాజా! కేవలము చిచ్చక్తి రూపమగు బ్రహ్మయే సత్యము. అట్లు కాక ఇతరు లెవ్వరును సత్యము కాదు. అట్లు జ్ఞాన లాభము కలిగిన యెడల శత్రువులు, మిత్రులు మరియు ప్రభువు, భ్రుత్యులు మొదలగు వారి కల్పనఎట్లు కలుగును? ఓ రాజా! నేను నీ వలన భయముచే అత్యంత దుఃఖమును పొందితిని. అట్టి సమయమున శ్రీ దత్తాత్రేయుని ప్రసాదము చేత జ్ఞానమును పొందితిని. ఇప్పుడు జితేంద్రియుడనై బాగుగా సమస్త బంధములను పరిత్యజించి మనస్సును పరబ్రహ్మ యందు నిలుపును. ఇంద్రియములను జయించి నప్పుడే సమస్తమును జయించ వచ్చును.
ఎవడిని మించిన గొప్పవాడు ఉండడో, అట్టి వాని కొరకు కాక ఇతరమైన వానిని కొలుచుట ఉచితము కాదు. జితేంద్రియుడై నప్పుడే సిద్ధి లాభమును పొంద గలుగును. ఓ రాజా! నేను నీకు శత్రువును కాను. నీవు నాకు విరోధివి కాదు. ఈ సుబాహుడు కూడా నాకు అపకారము ఏమియు చేయలేదు. ఇది నేను బాగుగా ఎరిగితిని. అందువలన ఇతర శత్రువులను వెదకుము. అలర్కుడు ఇట్లు చెప్పిన తరువాత కాశీరాజు అత్యంత సంతోషము చెందెను. మరియు సుబాహుడు సంతోషముతో లేచి “పరమ సౌభాగ్యము” అని చెప్పి సోదరుని అభినందిస్తూ కాశీ రాజుతో ఇట్లు చెప్ప దొడంగెను.
Summary of chapter 39 of the Mārkandeya Mahā Purana is as follows:
The son details the practical system of Yoga, including posture, prāṇāyāma, and mental withdrawal from sensory objects. He explains how regulating the vital breath stills the restless mind, purifies subtle nāḍīs, and prepares the practitioner for unbroken concentration on the Supreme Soul.