కూర్మ మహా పురాణము
36 - ప్రయాగ మహాత్త్యము
ఋషయ ఊచుః :-
మాహాత్మ్య మవిముక్తస్య యథావ త్సముదీరితమ్ ।
ఇదానీం చ ప్రయాగస్య మాహాత్మ్యం బ్రూహి సువ్రత ॥
యాని తీర్థాని తత్రైవ విశ్రుతాని మహాన్తి వై ।
ఇదానీం కథయా స్మాకం సూత సర్వార్ధవి ద్భవాన్ ॥
ఋషు లిట్లు పలికిరి.
మంచి నియమము కలవాడా ! అవిముక్త క్షేత్రము యొక్క మహత్త్వమును గూర్చి ఉన్నదున్నట్లుగా నీ చేత తెలుపబడినది. ఇక ఇప్పుడు ప్రయాగ క్షేత్రము యొక్క మాహాత్మ్యమును గూర్చి తెలుపుము.
ఆ ప్రదేశములో ఏయే తీర్థములు శ్రేష్ఠములైనవి, ప్రసిద్ధములైనవి కలవో, వానిని గూర్చి మాకిప్పుడు తెలుపుము. ఓ సూతుడా ! నీవు అన్ని విషయములు తెలిసినవాడవుకదా !
సూత ఉవాచ :-
శృణుధ్వ మృషయః సర్వే విస్తరేణ బ్రవీమి వః ।
ప్రయాగస్య చ మాహాత్మ్యం యత్ర దేవః పితామహః ॥
మార్కణ్డేయేన కథితం కౌన్తేయాయ మహాత్మనే ।
యథా యుధిష్ఠిరా యైత త్తద్వక్ష్యే భవతా మహమ్ ॥
నిహత్య కౌరవా న్సర్వాన్ భ్రాతృభిః సహ పార్థివః ।
శోకేన మహతా విష్టో ముమోహ స యుధిష్ఠిరః ॥
అచిరేణా థ కాలేన మార్కణ్డేయో మహాతపాః ।
సంప్రాప్తో హస్తినపురం రాజద్వారే స తిష్ఠతి ॥
ద్వారపాలోఽపి తం దృష్ట్వా రాజ్ఞే కథితవా న్ద్రుతమ్ ।
మార్కణ్డేయో ద్రష్టు మిచ్ఛం స్త్వా మాస్తే ద్వర్యసౌ మునిః ॥
సూతుడిట్లు చెప్పెను :-
ఓ ఋషులారా! మీరందరు వినుడు. నేను ప్రయాగక్షేత్రము యొక్క మాహాత్మ్యమును విస్తరముగా చెప్పుదును. అక్కడ భగవంతుడగు బ్రహ్మ నీవసించి యుండును.
మహాత్ముడైన ధర్మరాజుకొరకు మార్కండేయ మహామునిచేత ఏ ప్రకారముగా చెప్పబడినదో దానిని నేను మీకు తెలియజెప్పుదును.
తమ దాయాదులైన కౌరవులందరినీ యుద్ధములో చంపి, యుధిష్ఠిరుడు తన సోదరులతో గూడ గొప్ప శోకముతో కూడినవాడై మోహమును పొందెను.
తరువాత కొద్ది కాలమునకు గొప్ప తపశ్శక్తి కలిగిన మార్కండేయముని హస్తిన పురమునకు విచ్చేసి రాజద్వారము వద్ద నిలిచి ఉండెను.
ఆ మునిని చూచి ద్వారపాలుడు ఆ వృత్తాంతమును శీఘ్రముగా రాజునకు తెలియజేసెను. “ఓ రాజా! మార్కండేయముని మిమ్ము దర్శించుటకు వచ్చి ద్వారము వద్ద వేచియున్నాడు” అని.
త్వరితో ధర్మపుత్ర స్తు ద్వార మభ్యేత్య సత్వరమ్ ।
ద్వార మభ్యాగత స్యేహ స్వాగతం తే మహామునే ॥
అద్య మే సఫలం జన్మ అద్య మే తారితం కులమ్ ।
అద్య మే పితర స్తుష్టా స్త్వయి తుష్టే సదా మునే ॥
సింహాసన ముపస్థాప్య పాదశౌచార్చనాదిభిః ।
యుధిష్ఠిరో మహాత్మేతి పూజయామాస తం మునిమ్ ॥
మార్కణ్డేయ స్తు సంపృష్టః ప్రోవాచ స యుధిష్ఠిరమ్ ।
కిమర్థం ముహ్యసే విద్వన్ సర్వం జ్ఞాత్వా సమాగతః ॥
తతో యుధిష్ఠిరో రాజా ప్రణమ్య శిరసాఽబ్రవీత్ ।
కథయస్వ సమాసేన యేన ముఞ్చామి కిల్బిషమ్ ॥
నిహతా బహవో యుద్ధే పుమాంసోఽనపరాధినః ।
అస్మాభిః కౌరవైః సార్థం ప్రసఙ్గా న్ముని సత్తమ ॥
వెంటనే ధర్మరాజు శీఘ్రముగా ద్వారము వద్దకు వచ్చి, “ఓ మహామునీ! మా భవన ద్వారమునకు విచ్చేసిన మీకు స్వాగతము” అని పలికెను.
ఈనాడు నా జన్మ సార్థకమైనది. నేడు నా వంశము పవిత్రము చేయబడినది. ఓ మునీశ్వరా! నీవు సంతోషించినప్పుడు నా పితృదేవతలిప్పుడు తృప్తులైనారు.
యుధిష్ఠిరుడు, మహాత్ముడైన ఆ మునిని సింహాసనముపై కూర్చుండబెట్టి, పాదములు కడిగి, అర్ఘ్యము మొదలగు వానితో పూజించెను.
కుశల ప్రశ్నలు అడుగబడిన మార్కండేయుడు ధర్మరాజుతో ఇట్లనెను. పండితుడవైన ధర్మజా! అన్నియు తెలిసి కూడా నీవు ఎందుకు మోహము చెందుతున్నావు?
తరువాత రాజగు ధర్మరాజు తలవంచి నమస్కరించి ఇట్లుపలికెను. “మునీశ్వరా! ఏ ఉపాయముతో నేను పాపము నుండి విముక్తుడనగుదునో సంగ్రహాముగా తెలుపుము”.
గడచిన యుద్ధములో, మాచేత, కౌరవులచేత గూడ నిరపరాధులైన చాలా మంది మనుష్యులు చంపబడినారు. ఓ మునిశ్రేష్ఠా! దానికి పాప నివృత్తిని గూర్చి తెలుపుము.
యేన హింసాసముద్భూతా జ్జన్మాంతరకృతాదపి ।
ముచ్యేమ పాతకా దద్య తద్భవా న్వక్తు మర్హతి ॥
మార్కణ్డేయ ఉవాచ :-
శృణు రాజ న్మహాభాగ ! యన్మాం పృచ్ఛసి భారత ।
ప్రయాగగమనం శ్రేష్ఠం నరాణాం పాపనాశనమ్ ॥
తత్ర దేవో మహాదేవో రుద్రోఽవాత్సీ న్నరేశ్వర ।
సమాస్తే భగవాన్ బ్రహ్మా స్వయమ్భూః సహ దైవతైః ॥
యుధిష్ఠిర ఉవాచ :-
భగవ ఞ్ఛోతు మిచ్ఛామి ప్రయాగగమనే ఫలమ్ ।
మృతానాం కా గతి స్తత్ర స్నాతానాం చైవ కిం ఫలమ్ ॥
యే వసన్తి ప్రయాగే తు బ్రూహి తేషాంతు కిం ఫలమ్ ।
భవతో విదితం హ్యేత త్తన్మే బ్రూహి నమోఽస్తు తే ॥
హింసనుండి పుట్టినది, పూర్వ జన్మములందు చేయబడినదియు అగు పాపము నుండి ఏ ఉపాయముతో విముక్తులగుదుమో, దానిని నీవు మాకు చెప్పదగియున్నావు.
మార్కండేయుడిట్లు చెప్పెను :-
మహాభాగుడవైన ఓరాజా! నీవు దేనిని గూర్చి నన్ను అడుగుచున్నావో, దానిని చెప్పెదను వినుము. ప్రయాగక్షేత్రమునకు వెళ్ళుట శ్రేష్ఠమైనది అది పాపములను నశింపజేయును.
ఓ రాజు! ఆ ప్రయాగలో మహాదేవుడగు శివుడు పూర్వము నివసించెను, భగవంతుడగు బ్రహ్మదేవుడు స్వయంభువు, దేవతలతో సహ అక్కడ నిలిచియున్నాడు.
ధర్మరాజు పలికెను :-
మహాత్మా! ప్రయాగ క్షేత్రమునకు వెళ్ళినందుకు ఫలమును వినగోరుచున్నాను. అక్కడ మరణించిన వారికి గతి ఎటువంటిది? స్నానము చేసిన వారికే ఫలము కలదు?
ఎవరు ప్రయాగక్షేత్రములో నివసింతురో, వారికి ఎటువంటి ఫలము కలుగును? మీకు తెలిసిన ఈ విషయమును నాకు తెలుపుము. నీకు నమస్కారము
మార్కణ్డేయ ఉవాచ :-
కథయిష్యామి తే వత్స ప్రయాగస్నానజం ఫలమ్ ।
పురా మహర్షిభిః సమ్య క్కథ్యమానం మయా శ్రుతమ్ ॥
ఏత త్ప్రజాపతేః క్షేత్రం త్రీషు లోకేషు విశ్రుతమ్ ।
అత్ర స్నాత్వా దివం యాన్తి యే మృతా స్తేఽపునర్భవాః ॥
తత్ర బ్రహ్మాదయో దేవా రక్షాం కుర్వన్తి సఙ్గతాః ।
బహూ న్యన్యాని తీర్థాని సర్వపాపాపహాని తు ॥
కథితుం నేహ శక్నోమి బహువర్షశతై రపి ।
సంక్షేపేణ ప్రవక్ష్యామి ప్రయాగ స్యేహ కీర్తనమ్ ।
షష్టి ర్ధనుఃసహస్రాణి తాని రక్షన్తి జాహ్నవీమ్ ।
యమునాం రక్షతి సదా సవితా సప్తవాహనః ॥
మార్కండేయముని యిట్లు చెప్పెను :-
కుమారా! పూర్వ కాలములో మహర్షులచేత చెప్పబడుచుండగా నాచేత వినబడినది, ప్రయాగలో స్నానము చేయుట వలన కలుగునది అగు ఫలమును నేను మీకు చెప్పగలను.
ఇది ప్రజాపతి యొక్క క్షేత్రముగా మూడు లోకముల యందు ప్రసిద్ధమై యున్నది. ఇక్కడ స్నానము చేసినవారు మరణించిన తరువాత పునర్జన్మలేని వారుగా ఉత్తమగతిని పొందుదురు.
అక్కడ బ్రహ్మ మొదలగు దేవతలందరు కూడి యుండి రక్షణ భారమును వహింతురు. సమస్త పాపములను నశింపజేయునట్టి ఇతర తీర్థస్థలములు ఇంకను చాలా కలవు.
వానిని గూర్చి వివరించుటకు కొన్ని వందల సంవత్సరముల కాలములో గూడా శక్తుడను కాను. ప్రయాగ తీర్థము యొక్క ప్రశస్తిని ఇక్కడ సంగ్రహముగా తెలియజేయగలను.
అరువది వేల ధనుస్సులు గంగానదిని కాపాడుచున్నవి. ఏడు అశ్వములు వాహనములుగా కలిగిన సూర్యుడు ఎల్లప్పుడు యమునా నదిని రక్షించుచున్నాడు.
ప్రయాగే తు విశేషేణ స్వయం వసతి వాసవః ।
మణ్డలం రక్షతి హరిః సర్వదేవై శ్చ సమ్మితమ్ ॥
న్యగ్రోధం రక్షతే నిత్యం శూలపాణి ర్మహేశ్వరః ।
స్థానం రక్షన్తి వై దేవాః సర్వపాపహరం శుభమ్ ॥
స్వకర్మణా వృతా లోకా నైవ గచ్ఛన్తి తత్పదమ్ ।
స్వల్ప మల్పతరం పాపం యస్య చాస్తి నరాధిప ॥
ప్రయాగం స్మరమాణస్య సర్వ మాయాతి సంక్షయమ్।
దర్శనా త్తస్య తీర్థస్య నామ సఙ్కీర్తనా దపి ॥
మృత్తికాలమ్భనా ద్వాపి నరః పాపా త్ప్రముచ్యతే।
పఞ్చ కుణ్డాని రాజేంద్ర యేషాం మధ్యే తు జాహ్నవీ॥
ప్రయాగ క్షేత్రములో ప్రత్యేకముగా ఇంద్రుడు స్వయముగా నివసించుచున్నాడు. సమస్త దేవతలచే అధిష్ఠింపబడిన మండలమును విష్ణువు కాపాడుచున్నాడు.
శూలమును చేతి యందు ధరించిన మహేశ్వరుడు అక్కడి మట్టిచెట్టును ఎల్లప్పుడు కాపాడుచుండును. సమస్త పాపములను నశింపజేయు మంగళకరమైన తీర్థ స్థలమును దేవతలు రక్షించుచుందురు.
తమ కర్మ సంబంధము చేత ఆవరింపబడిన జనులు ఆ స్థానమును పొందజాలరు. ఓ రాజా! ఎవనికైతే చిన్నదైన పాపమైనను కొంచెము మిగిలియున్నప్పటికిని,
ప్రయాగక్షేత్రమును మనస్సులో స్మరించినవానికి, ఆ తీర్థమును చూచినవానికి, దాని యొక్క నామమును కీర్తించినప్పటికి ఆ నరుని పాపలేశము పూర్తిగా నశించును.
ఓ రాజా! అయిదు కుండముల మధ్యలో గంగానది ప్రవహించుచోట ఆ ప్రదేశములోని మృత్తికను లేపనము చేసికొనుట వలన కూడా మనుష్యుడు పాపముల నుండి విడుదల చెందును.
ప్రయాగం విశతః పుంసః పాపం నశ్యతి తత్క్షణాత్ ।
యోజనానాం సహస్రేషు గఙ్గాం స్మరతి యో నరః ॥
అపి దుష్కృతకర్మాసౌ లభతే పరమాం గతిమ్ ।
కీర్తనా న్ముచ్యతే పాపాత్ దృష్ట్వా భద్రాణి పశ్యతి॥
తథో పస్పృశ్య రాజేంద్ర సురలోకే మహీయతే ।
వ్యాధితో యది వా దీనః క్రుద్ధో వాపి భవే న్నరః॥
పితౄణాం తార కఞ్చైవ సర్వపాపప్రణాశనమ్।
యైః ప్రయాగే కృతో వాస ఉత్తీర్ణో భవసాగరః ॥
గఙ్గాయమున మాసాద్య త్యజే త్ప్రాణాంప్రయత్నతః।
ఈప్సితా న్లభతే కామా న్వదన్త మునిపుఙ్గవాః ॥
ప్రయాగక్షేత్రమును ప్రవేశించు మనుష్యుని యొక్క పాపము ఆ క్షణములోనే నశించును. వేల యోజనముల దూరములో నుండి కూడా ఏ మనుజుడు గంగానదిని స్మరించునో,
అట్టివాడు పాపకర్మములు చేసినవాడైనను ఉత్తమమైన పుణ్యగతిని పొందును. గంగను కీర్తించుట వలన పాపము నుండి దూరుడగును. దానిని చూచి శుభములు పొందును.
ఆ గంగలో ఆచమనము చేసి దేవలోకములో పూజింపబడును. ఓ రాజా! రోగగ్రస్తుడు కాని, దీనుడుకాని, కోపమునకు వశమైనవాడు గాని అగునరుడు పూర్వోక్త ఫలమును పొందును.
ఆ ప్రయాగము తమ పితృదేవతలను తరింపజేయునది, అన్ని పాపములను నశింపజేయునది కూడా, ఎవరిచేత ప్రయాగములో నివాసము చేయబడునో, వారీ చేత సంసారమను సముద్రము దాటబడిన దగును.
గంగాయమునల సంగమ ప్రదేశముచేరి ప్రయత్న పూర్వకముగా ప్రాణములను విడిచినచో, తాను కోరుకున్న కోరికలను పొందునని మునిశ్రేష్ఠులు తెలుపుచున్నారు.
దీప్తకాఞ్చనవర్ణాభై ర్విమానై ర్భానువర్తిభిః ।
సర్వరత్నమయై ర్దివ్యై ర్నానాధ్వజసమాకులైః॥
వరాఙ్గనాసమాకీర్ణై ర్మోదతే శుభలక్షణః ।
గీతవాదిత్రనిర్ఘోషైః ప్రసుప్తః ప్రతిబుధ్యతే ॥
యావ న్న స్మరతే జన్మ తావ త్స్వర్గే మహీయతే।
తస్మా త్స్వర్గా త్పరిభ్రష్టః క్షీణకర్మా సరోత్తమః ॥
హిరణ్యరత్నసమ్పూర్ణే సమృద్ధే జాయతే కులే।
తదేవ స్మరతే తీర్థం స్మరణా త్తత్ర గచ్ఛతి ॥
దేశే వా యది వారణ్యే విదేశే యది వా గృహే।
ప్రయాగం స్మరమాణ స్తు యస్తు ప్రాణా న్పరిత్యజేత్॥
బ్రహ్మలోక మవాప్నోతి వదంతి మునిపుఙ్గవాః ।
సర్వకామఫలా వృక్షా మహీ యత్ర హిరణ్మయీ ॥
ఋషయో మునయః సిద్ధా స్తత్ర లోకే స గచ్ఛతి।
స్త్రీసహస్రాకులే రమ్యే మన్దాకిన్యా స్తటే శుభే॥
మోదతే మునిభిః సార్థం స్వకృతే నేహ కర్మణా ।
సిద్ధచారణగంధర్వైః పూజ్యతే దేవదానవైః ॥
తతః స్వర్గా త్పరిభ్రష్టో జమ్బూద్వీపపతి ర్భవేత్।
తతః శుభాని కర్మాణి చిన్తయానః పునః పునః॥
గుణవా న్వృత్తసమ్పన్నో భవతీ త్యనుశుశ్రుమ।
కర్మణా మనసా వాచా సత్యే ధర్మే ప్రతిష్ఠితః॥
మెరయుచున్న బంగారు రంగు కాంతి కలిగిన, సూర్యమండల ప్రాంతములో సంచరించునవి, సమస్త మణులతో నిర్మింపబడినవి, పలు విధముల పతాకములతో కూడిన దివ్య విమానములతో, శ్రేష్ఠ వనితలు నిండి యుండగా శుభ లక్షణములు కలిగి సంతోషించును. గీత వాద్యముల ధ్వనులతో నిద్రనుండి మేలుకొలుపబడును.
ఎప్పటి వరకు తన పూర్వజన్మను స్మరించుకొనడో, అంతకాలము స్వర్గములో పూజింపబడును. కర్మ ఫలము క్షీణించిన మనుష్యుడు ఆ స్వర్గము నుండి జారినవాడై, బంగారము రత్నములు నిండుగ కల సంపన్నమైన వంశములో జన్మించును మరల ఆ పుణ్యతీర్థమునే స్మరించి దాని వలన మరల అక్కడికి చేరుకొనును.
తన దేశములో కాని, అడవిలో కానీ, పరదేశములోకాని, తన యింటిలోకాని ప్రయాగక్షేత్రమును స్మరించుచు ఎవడు తన ప్రాణములు వీడుచునోవాడు బ్రహ్మలోకమును చేరు కోనునని మునిశ్రేష్ఠులు చెప్పుచున్నారు. ఎక్కడ భూమి బంగారు మయమో, వృక్షములు అన్ని కోరికలను ఫలింప జేయునో, ఎచట ఋషులు, మునులు, సిద్ధులు ఉందురో ఆ లోకమునకతడు వెళ్ళును. వేల కొలది స్త్రీలతో నిండి, మనోహరమైన, శుభకర గంగా నది యొడ్డున, సిద్ధులు, చారణులు, గంధర్వులచేత, దేవదానవులచేత అతడు పూజింపబడును.
తరువాత స్వర్గము నుండి తొలగి జంబూ ద్వీపమునకు ప్రభువు కాగలడు. తరువాత మంగళకరమైన కార్యమును గూర్చి మరల మరల ఆలోచించువాడై, గుణవంతుడు, శీలము కలవాడుగా అగునని పెద్దల వలనవినుచున్నము. కర్మచేత, మనస్సుచేత, మాటచేత కూడా సత్యమునందు, ధర్మము నందు ప్రతిష్ఠింపబడినవాడగును.
గఙ్గాయమునయో ర్మధ్యే యస్తు గ్రాసం ప్రయచ్ఛతి।
సువర్ణ మథ ముక్తాం వా తథైవా న్య త్పరిగ్రహమ్॥
స్వకార్యే పితృకార్యే వా తీర్థే యోఽ భ్యర్చయే న్నరః ।
నిష్ఫలం తస్య తత్తీర్థం యావ త్తత్ఫల మశ్నుతే ॥
అత స్తిర్థే న గృహ్ణీయా త్పుణ్యే ష్వాయతనేషు చ ।
నిమిత్తేషు చ సర్వేషు అప్రమత్తో ద్విజో భవేత్॥
కపిలాం పాటలాం ధేనుం యస్తు కృష్ణాం ప్రయచ్ఛతి।
స్వర్ణశృఙ్గీం రౌష్యఖురాం చైలకర్ణీం పయస్వినీమ్॥
తస్య యావంతి లోమాని సంతిగాత్రేషు సత్తమ।
తావ ద్వర్షసహస్రాణి రుద్రలోకే మహీయతే ॥
ఇతి శ్రీ కూర్మపురాణే ప్రయాగ మాహాత్మ్యే షట్త్రింశోఽ ధ్యాయః ॥
గంగా యమునా నదుల మధ్య భాగములో ఎవడైతే అన్నదానము చేయునో, బంగారము లేదా ముత్యము మరియేదేని వస్తువు నిచ్చునో, తన పని సందర్భమున కాని, మరణించిన తల్లిదండ్రుల కర్మల సమయమున గాని తీర్థ స్థలములో ఏ మనుష్యుడు పూజించునో, అతనికి దానఫలము నను భవించునంత కాలము తీర్థ స్థలపుణ్యము లభించదు అది నిరర్థకమగును.
అందువలన తీర్థ స్థలములో, దేవతా మందిరములలో, పుణ్య స్థలములలో అన్ని నిమిత్తముల యందు దానము స్వీకరించకూడదు. బ్రాహ్మణుడీ విషయములో అప్రమత్తుడుగా నుండవలెను.
కపిల వర్ణము, పొటల వర్ణము, నలుపు కలిగిన ఆవును, బంగారు కొమ్ములు కలదానిని, వెండి గిట్టలు కలదానిని, వెడల్పు చెవులు కలది, బాగుగా పాలిచ్చునదగు ఆవును ఎవడు దానము చేయునో అట్టివాడు,
ఓ శ్రేష్ఠుడా! దానికి ఎన్ని రోమములుండునో అన్ని వేల సంవత్సరముల కాలము దాత రుద్రలోకములో పూజలందుకొనుచుండును.
శ్రీ కూర్మపురాణములో ప్రయాగ మాహాత్మ్యములో ముప్పది యారవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 36 of the Kūrma Mahā Purana is as follows:
Sūta describes the supreme majesty of Prayāga, the king of all holy pilgrimage sites, situated at the confluence of the holy rivers Gangā, Yamunā, and the invisible Sarasvatī. Prayāga is revealed as the sacrificial altar of Brahmā, guarded personally by Bhagavān Vishṇu and Mahādeva. A single bath at the Saṅgama during the holy month of Māgha bestows unimaginable spiritual merit equal to performing a hundred Ashvamedha sacrifices.