భాగవత మహా పురాణము
88 - వృకాసురుని వృత్తాంతము
రాజోవాచ !
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- దేవతలు, రాక్షసులు, మానవులలో ఎవరైతే అమంగళ వేషధారి (విరాగి) యగు శివుని భజింతురో, వారు తరుచుగా ధనవంతులు, భోగపరాయణులు అగుచున్నారు. కానీ, దీనికి భిన్నముగా, లక్ష్మీపతియగు శ్రీహరిని సేవించువారు అట్లు లేరు.
ఈ విషయమును మేము తెలియగోరుచున్నాము. ఎందుకంటే, ఈ విషయములో మాకు పెద్ద సందేహము గలదు. విరుద్ధమగు స్వభావములు (త్యాగభోగములు) గల ప్రభువులిద్దరి భక్తులకు లభించే ఫలము (భోగత్యాగములు) విరుద్ధముగా ఉండుటకు కారణమేమి?
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను ---- శివుడు సర్వదా శక్తి (త్రిగుణాత్మకము) తో కూడి సమష్టి-అహంకారరూపుడై యుండును. ఆ మూడు గుణములు ఆయనకు ఉపాధులు. అవి ఆయన యథార్థస్వరూపమును కప్పివేయును. ఆ అహంకారము వైకారికము, తైజసము, తామసము అని మూడు రకములు.
వైకారిక (సాత్త్విక) అహంకారమునుండి మనస్సు, తైజస (రాజస) అహంకారమునుండి పది ఇంద్రియములు (కర్మేంద్రియములు ఐదు, జ్ఞానేంద్రియములు ఐదు), తామసాహంకారమునుండి పంచభూతములు, వెరసి పదహారు కార్యములు పుట్టినవి. సాధకుడు వీటిలో ఏ అధిష్ఠానదేవతను ఉపాసించినా, సకలసంపదలను ఫలముగా పొందును.
శ్రీహరియైతే నిర్గుణుడు, సాక్షాత్తు పూర్ణ బ్రహ్మ. ప్రకృతికి అతీతుడగు ఆయన సర్వజ్ఞుడు, సాక్షి. ఆయనను భజించువాడు ముక్తుడగును.
అశ్వమేధయాగములు పూర్తి అయిన పిదప మీ తాతగారు ధర్మరాజు శ్రీకృష్ణ భగవానునినుండి ధర్మములను వినుచుండెను. ఆయన ఆ అచ్యుతుని ఇట్లు ప్రశ్నించెను.
మానవులకు మోక్షధర్మమునుపదేశించుటకై యదువంశములో అవతరించిన సర్వసమర్థుడగు ఆ శ్రీకృష్ణ భగవానునకు ధర్మములను వినగోరిన ధర్మరాజు పై ప్రీతి కలిగి ఇట్లు పలికెను.
శ్రీభగవానువాచ ।
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- నేను ఎవనిని అనుగ్రహించెదనో, వాని ధనమును మెల్లగా హరించెదను. ఆతడు నిర్దనుడై దుఃఖముల పరంపరతో పీడితుడగును. అప్పుడు వీనిని బంధువులు విడిచి పెట్టెదరు.
ఎప్పుడైతే ఆతని ప్రయత్నములు విఫలమై ధనమును పొందుటకై చేసే ప్రయత్నమునుండి విరక్తుడగునో, అప్పడాతడు నా ఏకాంత భక్తులతో మైత్రిని నెరపును. అప్పుడు నేనాతనిని అనుగ్రహించెదను.
వేదములయందు ప్రసిద్ధమైనది, ప్రకృతికి అతీతమైనది, ఇంద్రియగోచరము కానిది, చిదనము, సదనము, దేశకాలపరిచ్ఛేదములు లేనిది అగు బ్రహ్మను ఆతడు ఆత్మరూపముగా తెలుసుకొని విముక్తుడగును. ఈ విధముగా నన్ను ఆరాధించుట చాల కష్టము. కావుననే, మానవులు నన్ను విడిచి ఇతరదేవతలనారాధించుచుందురు.
ఆ విధముగా ఆరాధించిన తరువాత వారు తొందరగా సంతోషించే ఆ దేవతలనుండి రాజ్యము ఇత్యాది సంపదలను పొంది ధర్మమును తప్పెదరు. వారు అసావధానులై గర్వించి వరములనిచ్చినవారినే మరిచేదరు, లేదా అవమానించెదరు.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- ఓ పరీక్షిన్మహారాజా! బ్రహ్మదేవుడు, శ్రీహరి, శివుడు, ఇంద్రుడు మొదలగువారు శపించుటకు, వరములనిచ్చుటకు సమర్థులు. బ్రహ్మదేవుడు, శివుడు వెంట వెంటనే శాపములను, వరములను ఈయగా, శ్రీహరి మాత్రము అట్లు కాదు.
ఈ సందర్భములో మహాత్ములు ఈ ప్రాచీనమగు వృత్తాంతమునుటంకించెదరు. కైలాసవాసియగు శివుడు వృకాసురునకు వరమునిచ్చి ఆపదలో పడెను.
వృకుడని ప్రసిద్ది చెందిన రాక్షసుడు, శకుని పుత్రుడు ఉండెను. ఆ దుర్బుద్ధి మార్గములో నారదుని ఇట్లు ప్రశ్నించెను --- త్రిమూర్తులలో శీఘ్రముగా ప్రసన్నమయ్యే దేవుడు యెవరు ?
ఆ నారదుడిట్లు చెప్పెను ... నీవు కైలాసవాసియగు దేవుని ఆరాధించుము. శీఘ్రముగా సిద్దిని బడయగలవు. ఆ దేవుడు తక్కువ గుణముచే శీఘ్రముగా ప్రీతుడగును, చిన్న తప్పుచే వెంటనే కోపించును.
రావణాసుర బాణాసురులు స్తోత్రపాఠకుల వలె స్తుతించగా శివుడు సంతోషించి, వారికి సాటిలేని సంపదనిచ్చి, పెద్ద ఆపదలను (కైలాసమును రావణుడు పెల్లగించుట, బాణుని నగరమునకు శివుడు కాపలా కాయుట) కొని తెచ్చుకొనెను.
నారదుడీ విధముగా ఉపదేశించెను. అప్పుడా రాక్షసుడు కేదార క్షేత్రమునందు తన దేహమునుండి మాంసమును కోసి హోమము చేస్తూ అగ్నియే ముఖముగా గల శివుని ఆరాధించెను.
ఆతనికి దేవదర్శనము కాలేదు. ఏడవ నాడు ఆతడు నిస్పృహ చెంది, ఆ కేదారతీర్థములో స్నానము చేసి, కత్తితో తడి జుట్టుతోనున్న తలను నరికి హోమము చేయబోయెను.
అప్పుడు గొప్ప దయామయుడగు శివుడు అగ్నిహోత్రమునుండి అగ్నిదేవుడు వలె పైకి లేచి, చేతులతో వాని భుజములను గట్టిగా పట్టుకొని (తలను నరికే ప్రయత్నమునుండి) నివారించేను. ఎవరైనా ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటే, మనము కూడ అట్లే చేసి ఉందుము. ఆయనయొక్క స్పర్శచే వృకుని గాయములన్నీ మానిపోయెను.
వానితో శివుడిట్లనెను --- ఓయీ! చాలు, చాలు. నీ కోరికకు తగ్గట్లుగా వరమును కోరుకొనుము. నీకు వరమునిచ్చెదను. శరణాగతి చేసే మానవులు సమర్పించే నీటితో నేను ప్రీతి జెందెదను. నీవు వ్యర్థముగా దేహమునకు అధికమగు పీడను కలిగించుకొనుచున్నావు.
ఆ మహాపాపి శివునినుండి సకలప్రాణులకు భయమును కలిగించే వరమును కోరెను. నేను ఏయే వ్యక్తుల తలపై నా చేతిని పెడతానో, ఆయా వ్యక్తులు మరణించెదరు గాక! అని కోరెను.
ఆ మాటను విని శివ భగవానునకు మనస్సు చెడిపోయినదా అన్నట్లు ఆయెను. ఆయన నవ్వుతూ సరే అని, పామునకు పాలను వలే, వానికి వరమునిచ్చెను.
శివుడిట్లు పలుకగా, ఆ రాక్షసునకు గౌరీదేవిని అపహరించవలెననే అభిలాష కలిగెను. ఆ రాక్షసుడా వరమును పరీక్షించుటకై శివుని తలపై చేతిని పెట్టుటకు కూడ సంసిద్దుడాయెను. శివునకు తాను చేసిన పని వలన భయము సంప్రాప్తమయ్యెను.
శివుడు అధికమగు భయముతో వణికిపోయెను. ఆయన ఆ రాక్షసుడు తరుముచుండగా వెనుదిరిగి, ద్యులోక భూలోకముల అంతము వరకు, ఉత్తరదిక్కు వైపు పరుగెత్తేను.
ఈ ఆపదను నివారించే ఉపాయము తెలియక దేవనాయకులు మిన్నకుండిరి. అప్పుడు శివుడు చీకటికి ఆవల ఉజ్జ్వలముగా ప్రకాశించే వైకుంఠమునకు వెళ్లాను.
ప్రాణిహింసను విడిచి మనస్సును నిగ్రహించి సర్వసంగపరిత్యాగులైన మహాత్ములు పొందే పరమఫలము నారాయణుడు. సాక్షాత్తు ఆయనయే అక్కడనుండును. అక్కడకు చేరినవారికి మరల జన్మ ఉండదు.
భయములను పోగొట్టే నారాయణ భగవానుడు ఆ విధముగా కష్టము పాలైన శివుని చూచి. యోగమాయచే బ్రహ్మచారియై దూరమునుండి యెదురేగెను.
మేఖల, కృష్ణమృగచర్మ, దండము, జపమాలలతో కూడిన ఆ బ్రహ్మచారి తేజస్సుతో అగ్ని వలె గొప్పగా ప్రకాశించెను. ఆతడు వినయముతో ఆ రాక్షసునకు నమస్కరించెను.
శ్రీభగవానువాచ !
నారాయణ భగవానుడిట్లు పలి కెను - శకునిపుత్రా! నిన్ను చూస్తే అలిసి నావని తెలుస్తూనే ఉంది. దూరమునుండి వచ్చినావా యేమి? క్షణకాలము విశ్రమించుము. వ్యక్తికి ఈ దేహము సకలకామనలను తీర్చే కామధేనువు.
ఓ ప్రభూ! నేను వినుటకు యోగ్యమైనచో మీరు చేయదలచుకున్న పనిని గురించి చెప్పడు. వ్యక్తి తరుచుగా ఇతరులను సహాయులుగా కలుపుకుని తన ప్రయోజనమును సాధించగల్గును.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- భగవానుడు అమృతమును వర్షించే వాక్కుతో ఇట్లు ప్రశ్నించగా, ఆతడు / జరిగిన వృత్తాంతమును ముందునుండి క్రమమును తప్పకుండా చెప్పెను.
శ్రీభగవానువాచ ।
శివుడు నీకు వరములిచ్చినాడా? అటైనచో, మేము ఆయన మాటను నమ్ముటలేదు. ఆయనకు దక్షుని శాపముచే పిశాచభావము వచ్చి, పిశాచములకు ప్రేతములకు రాజైనాడు.
ఓ రాక్షసరాజా! ఆ శివుడు జగద్గురువని ఆయన మాట సత్యమని నీకు నమ్మకమున్నదా? ఓయీ వెంటనే చేతిని నీ తలపై పెట్టి పరీక్షించుము.
ఓ రాక్షసశ్రేష్ఠా! శివుని మాట అసత్యమని తేలినచో, అసత్యమును పలికే ఈయనను ఏ విధముగానైననూ సంహరించుము. అప్పుడు మరల అసత్యమును చెప్పబోడు.
ఈ విధముగా నారాయణ భగవానుని మిక్కిలి మధురములై భ్రమను కలిగించే మాటలచే బుద్ధి జారిపోయి, ఆతడు వరము యొక్క అర్థమును మరిచెను. ఆ దుర్బుద్ధి తన చేతిని తలపై పెట్టుకొనెను.
అప్పుడాతని తల వెంటనే పగిలి, వజ్రపు దెబ్బ తిన్నవాడు వలె నేల గూలెను. స్వర్గమునందు జయధ్వానములు, నమస్కారశబ్దములు, బాగు బాగు అనే శబ్దములు బయలుదేరినవి.
పాపియగు వృకాసురుడు వధించబడగా దేవతలు, మహర్షులు, పితరులు, గంధర్వులు పూల వానలను కురిపించిరి. శివుడు ఆపదనుండి గట్టెక్కించబడెను.
విముక్తు డైన కైలాసవాసియగు శివునితో పురుషోత్తమ భగవానుడిట్లు పలికెను --- ఆహా! ఓ దేవా! మహాదేవా! ఈ పాపిని తన పాపమే మట్టుబెట్టినది. ఓ ఈశ్వరా! మహాత్ముల యెడల పాపమును చేసిన ఏ ప్రాణి క్షేమముగా నుండును? (ఏదీ ఉండదు). నీవు జగత్తునకు తండ్రివి, సర్వేశ్వరుడవు. నీయందు పాపము చేసినవాడు క్షేమముగా నుండలేడని వేరుగా చెప్పవలెనా? (అక్కరలేదు).
ప్రకృతికి అతీతుడగు శ్రీహరి ఇంద్రియగోచరము కాని శక్తులకు సముద్రమువంటి వాడు. ఆయన ప్రాణులలో ఆత్మరూపుడై ఉన్నాడు. ఆయన సాక్షాత్తు కైలాసపాలకుడగు శివుని విముక్తుని చేసిన వృత్తాంతమును ఎవడు ప్రవచించునో, లేదా వినునో అట్టివాడు సంసారబంధములనుండి, మరియు శత్రుబాధనుండి విముక్తుడగును.
పదవ స్కంధము ఉత్తరార్ధములో భస్మాసురుని వృత్తాంతమును వర్ణించే
ఎనుబది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 88 of the Bhāgavata Mahā Purana is as follows:
King Parīkshit inquired why devotees of Mahādeva Śiva often acquire swift material wealth while devotees of Bhagavān Vishṇu often live in material simplicity. Śukadeva Gosvāmī explained that Vishṇu is the master of the transcendental energy, and when He bestows His highest mercy upon a devotee, He gradually removes material impediments to fix their mind entirely upon Him. To illustrate, Śukadeva narrated the history of the demon Vṛkāsura, who performed severe penances cutting his own flesh into fire to please Mahādeva Śiva. Śiva appeared and granted Vṛkāsura a boon: that whomever's head he touched with his hand would instantly burst into ashes. Intoxicated by power, Vṛkāsura immediately attempted to touch Śiva's own head to test the boon and claim Parvati. Śiva fled across the cosmos until Bhagavān Vishṇu appeared disguised as a young celibate student (*Brahmacārī*). Vishṇu cleverly tricked Vṛkāsura into touching his own head to verify if Śiva's words were true, whereupon Vṛkāsura placed his hand on his own head and was instantly reduced to ashes, saving Mahādeva Śiva.