భాగవత మహా పురాణము
22 - గోపికా వస్త్రాపహరణము
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- హేమంత-ఋతువు మార్గశీర్షమాసమునందు నందుని గోకులమునందలి కన్యలు కాత్యాయనీ దేవిని పూజించే వ్రతమును అనుష్ఠించిరి. వారు గోధుమ నూక, బెల్లములతో చేసిన హవిస్సును మాత్రమే భుజించుచుండిరి.
ఓ పరీక్షిన్మహారాజా! తెల్లవారుతుండగా వారు యమునానదీజలములలో స్నానము చేసి నీటి ఒడ్డున ఇసుక మట్టితో కాత్యాయనీ దేవియొక్క విగ్రహమును చేసి పూజించిరి.
వారు గంధములను, పరిమళభరితములైన పూలమాలలను, కొబ్బరి కాయ మొదలగువాటీని సమర్పించి ధూపదీపములతో పూజించిరి. చిగుళ్లతో, అక్షతలతో పూజించి గొప్పవి, మామూలువి అగు పదార్థములను, పళ్లను నైవేద్యము పెట్టిరి. .
ఓ దేవీ! నీవు కల్యాణములకు నిధానమవు, మహామాయవు, గొప్ప యోగినివి, సర్వేశ్వరివి. నాకు నందగోపుని పుత్రుడగు శ్రీకృష్ణుని భర్తునుగా చేయుము, నీకు నమస్కారము, అనే మంత్రమును జపిస్తూ ఆ కన్యలు పూజను చేసిరి.
శ్రీకృష్ణునియందు మనస్సు గల కన్యలీ విధముగా నెల రోజులు నిరంతరముగా వ్రతముననుష్ఠించిరి. తమకు నందుని పుత్రుడగు శ్రీకృష్ణుడు భర్త కావాలని వారు కల్యాణములనిచ్చే పార్వతీదేవిని యథావిధిగా ఆరాధించిరి.
వారు ప్రతి రోజు తెల్లవారు జామున నిద్ర లేచి తమ తమ పేర్లతో పిలుచుకుంటూ ఒకరి చేతులు మరియొకరు పట్టుకొని యమునానదికి స్నానము చేయుటకు వెళ్లాడివారు. అపుడు వారు శ్రీకృష్ణుని కీర్తిని బిగ్గరగా గానము చేసెడివారు.
ఒకనాడు వారు నది వద్దకు వచ్చి మామూలుగానే గట్టు పై బట్టలను పెట్టి, శ్రీకృష్ణుని కీర్తిని ఆనందముగా గానం చేస్తూ, నీటిలో విహరించిరి.
యోగులకు, యోగేశ్వరులకు కూడ ప్రభుడగు శ్రీకృష్ణ భగవానునకు వారి వ్రతమును గురించి తెలిసెను. వారి వ్రతమును సిద్ధింప జేయుటకై ఆయన, మిత్రులు చుట్టువారి రాగా, అచటకు వెళ్లాను.
శ్రీకృష్ణుడు విసురుగా వారి వస్త్రములను తీసుకొని కడిమి చెట్టు పైకి ఎక్కెను. నవ్వుచున్న బాలకులతో బాటుగా ఆయన కూడ గట్టిగా నవ్వుతూ ఆ కన్యలను పరిహాసము చేస్తూ ఇట్లు పలికెను.
ఓ అమ్మాయిలూ! మీరీ చెట్టు క్రిందకు వచ్చి మీ మీ వస్త్రములను యథేచ్చగా తీసుకొనుడు. నేను సత్యమును చెప్పుచున్నాను. వేళా కోళము కాదు. ఎందుకంటే, మీరు వ్రతము కారణముగా కృశించినారు.
ఓ సుందరులారా! నేనిదివరలో అసత్యమును చెప్పలేదు. ఇది .. నిశ్చయము. ఈ విషయమీ గోపబాలకులకు తెలియును. మీరు ఒక్కొక్క రుగా గాని, లేదా అందరు కలిపి గాని (వస్త్రములను) తీసుకొనుడు,
ప్రేమచే ముంచెత్తబడిన మనస్సులు గల ఆ గోపికలు ఆ శ్రీకృష్ణుని ఆ పరిహాసమును చూచి సిగ్గు పడిరి. వారు ఒకరినొకరు చూచుకుంటూ నవ్వుకొనిరే గాని, నీటినుండి బయటకు రాలేదు.
గోపాలకుడగు శ్రీకృష్ణుడిట్లు పలుకగా, ఆ పరిహాసవాక్యములచే గోపికల చిత్తములాకర్షించబడెను. వారు చల్లని నీటిలో కంఠము వరకు మునిగి వణికిపోతూ ఆయనతోనిట్లనిరి.
ఓయీ! అన్యాయ్యమును చేయవద్దు. నీవైతే నందగోపుని ప్రియపుత్రుడవగు శ్రీకృష్ణుడవనియు, గోకులమునకు కొనియాడ దగినవాడవనియు మేము యెరుగుదుము. ఓయీ! వస్త్రములనిమ్ము. చలి మమ్ము వణికించుచున్నది.
ఓ నల్లనివాడా! నీవు ధర్మములు తెలిసిన అందగాడవు. నీకు మేము దాసీలము. నీవు చెప్పినట్లు మేము చేసెదము. వస్త్రములనిమ్ము. లేనిచో, నందమహారాజునకు చెప్పేదము.
శ్రీభగవానువాచ ।
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఓ సుందరులారా! మీ చిరునవ్వు స్వచ్చముగా నున్నది. పూజించదగిన మీరు నాకు దాసీలైనచో, నా మాటను చేయబోయే పక్షములో, ఇచటకు వచ్చి మీ వస్త్రములను స్వీకరించెదరు గాక!
ఆ కన్యలు బయట చలికి వణుకుతూ లోపల చలిచే కృశించి యుండిరి. వారందరు రెండు చేతులతో జననేంద్రియమును కప్పుకొని నదినుండి బయటకు వచ్చిరి.
వారి పవిత్రమగు అంతఃకరణములచే శ్రీకృష్ణ భగవానుడు ప్రసన్ను డై ప్రీతిని పొందెను. చలిచే పీడించబడుతూ దగ్గరకు వచ్చిన వారిని చూచి ఆయన వస్త్రములను భుజము పై పెట్టుకొని చిరునవ్వుతో నిట్లనెను.
మీరు ప్రతనియమములో ఉన్నారు. అయినా వస్త్రములు లేకుండా నీటిలో స్నానమును చేసితిరి. ఆ ఈ చర్య ఖచ్చితముగా జలాధిష్ఠానదేవత యెడల అపరాధము. ఆ దోషమును పోగొట్టుటకై మీరు తలపై దోసిలి ఘటించి వంగి నమస్కరించి, వస్త్రమును తీసుకొనుడు.
శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు చెప్పగా ఆ గోపికలు నగ్నముగా స్నానము చేయుట వ్రతమునకు భంగమని తెలుసుకొనిరి. ఆ వ్రతము పూర్తి కావాలనే కోరిక వారికి కలదు. వారు ఆ వ్రతమునకు మరియు సకలకర్మలకు ఫలరూపుడైన కర్మసాక్షి శ్రీకృష్ణునికే నమస్కరించిరి. ఎందుకంటే, అట్టి నమస్కారము సకలదోషములను తుడిచి పెట్టును.
ఆ విధముగా వారు చేసిన నమస్కారమును చూచి దేవకీపుత్రుడగు శ్రీకృష్ణుడు సంతోషించెను. దయాళువగు ఆయన వారికి వస్త్రములను యిచ్చెను.
శ్రీకృష్ణుడు ఆ గోపికలను గట్టిగా తప్పు పట్టి కపటము చేసి వారు సిగ్గు విడుచునట్లు చేసెను. వారిని పరిహసించి ఆటబొమ్మలవలె చేసి వస్త్రములను కూడ తీసుకుపోయెను. అయిననూ, వారు తమ ప్రియుని కలయికచే ఆనందించిరే గాని, ఈ శ్రీకృష్ణునిపై తప్పు మోపలేదు.
శ్రీకృష్ణునిచే దోచబడిన చిత్తములు గల ఆ గోపికలు తమ ప్రియతముని కలుసుకొనుటచే పరవశులై, వస్త్రములను ధరించిన పిదప కూడ (అక్కడనుండి) వెళ్లకుండిరి. వారు సిగ్గుతో విలాసగా ఆయననే చూచుచుండిరి.
వ్రతమును పట్టిన ఆ గోపీకల సంకల్పములో తన పాదములను స్పృశించాలనే కోరిక గలదని భగవాన్ దామోదరుడు (నడుమునకు త్రాడు కట్టబడినవాడు) గమనించాను. ఆయన ఆ యువతులతోనిట్లనెను.
ఓ పుణ్యవతులారా! పూజనీయులగు మీరు నన్ను పూజించాలనే సంకల్పముతోనున్నారని నాకు తెలియును. మీ సంకల్పము నాకు ఆమోదమే. మీ ఈ సంకల్పము సత్యము అగుటకు తగియున్నది.
నాయందు లగ్న మైన బుద్ధి గల సాధకుల కామన సంసారభోగముల వైపు తీసుకువెళ్లదు. కాల్చిన మరియు ఉడికించిన గింజ మొల కెత్తుటకు సమర్థము కాదు.
ఓ యువతులారా! మీరు గోకులమునకు వెళ్లుడు. పుణ్యవతులగు మీరు, సిద్ధిని పొందితిరి. మీరు ఈ (రాబోయే) రాత్రులు నాతో రమించగలరు. ఆ సంకల్పముతోనే మీరు పార్వతీదేవిని పూజించే వ్రతమును చేసితిరి గదా!
శ్రీశుక ఉవాచ ।
శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- ఆ కన్యల మనోరథము సిద్ధించేను. శ్రీకృష్ణ భగవానుడిట్లు ఆదేశించగా, వారు కష్టము మీద (ఆయనను విడిచి) పద్మములవంటి ఆయన పాదములనే ధ్యానిస్తూ గోకులమును చేరిరి.
తరువాత దేవకి పుత్రుడగు శ్రీకృష్ణ భగవానుడు అన్నగారితో కలిసి గోవులను మేపుతూ బృందావనమునుండి దూరముగా వెళ్లాను. గోప బాలకులు ఆయనను చుట్టువారి యుండిరి.
సూర్యుని వేడి తీక్ష్ణముగా నుండి చెమట పట్టుచుండెను. చెట్లు తమ నీడలతో శ్రీకృష్ణునకు గొడుగు వలె పని చేయుచుండెను. వాటిని చూచి ఆయన గోకులవాసులగు గోపాలకులతో నిట్లనెను.
ఓ స్తోకకృష్ణా!, ఓ అంశూ!, ఓ శ్రీదామా!, ఓ సుబలా!, ఓ అర్జునా!, ఓ విశాలా!, ఓ ఋషభా!, ఓ తేజస్వీ!, ఓ దేవప్రస్థా! ఓ వరూథపా!
గొప్ప భాగ్యము గల ఈ చెట్లను చూడుడు. ఇతరప్రాణుల ప్రయోజనమే వీటి జీవితమునకు ఏకైకలక్ష్యము. ఇవి గాలి, వాన, ఎండ, మంచులను తాము సహిస్తూ మనలను వాటినుండి తప్పించుచున్నవి.
ఆహా! సకలప్రాణులకు బ్రదుకు దెరువునిచ్చే వీటి జన్మ గొప్పది. ఇవి సత్పురుషుని వంటివి. పళ్లు మొదలగువాటిని కోరి వీటి వద్దకు వచ్చిన జనులు ముఖము త్రిప్పుకొని వెళ్లే పని ఉండదు. (కోరిక తప్పక తీరును).
చెట్లు మానవులకు ఆకులు, పువ్వులు, పళ్లు, వేళ్లు, బెరడు, కట్టెలు, జిగురు, భస్మ, బొగ్గులు, చిగుళ్లు అనే ఉపయోగకరమైన వస్తువులను ఇచ్చును. మరియు, అవి మానవులకు నీడను, సుగంధమును ఇచ్చి వారి అవసరములను తీర్చును.
ప్రాణములను, సంపదలను, బుద్దిని, వాక్కును వినియోగించి ఎల్లవేళలా ప్రాణులకు హితమును మాత్రమే చేయవలెను. ఇదియే దేహధారులకు ఈ లోకములో జన్మించినందులకు సఫలత.
ఇట్లు పలికి శ్రీకృష్ణుడు చెట్ల మధ్యగుండా యమునానదికి వెళ్లాను. చిగుళ్లు, గుత్తులు, పళ్లు, పువ్వులు, ఆకుల సముదాయములతో ఆ చెట్ల - కొమ్మలు వంగి యుండెను.
ఓ పరీక్షిన్మహారాజా! ఆ నదియందు వారు గోవులచే నీళ్లను త్రాగించిరి. ఆ నీళ్లు స్వచ్చముగా, చల్లగా, ఆరోగ్యకరముగా నుండెను. తరువాత ఆ గోపాలకులు తాము కూడ తియ్యని ఆ నీటిని కడుపు నిండా త్రాగిరి.
ఓ పరీక్షిన్మహారాజా! గోపాలకులు ఆ యమునానదిని ఆనుకుని ఉన్న ఉద్యానమునందు పశువులను యథేచ్చగా మేపుచుండిరి. వారికి ఆకలిచే. పీడ కలిగి బలరామ కృష్ణుల వద్దకు వచ్చి ఇట్లు పలికిరి.
శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధము పూర్వార్థములో గోపికా వస్త్రాపహరణమును వర్ణించే ఇరువది రెండవ అధ్యాయము ముగిసినది (22).
Summary of chapter 22 of the Bhāgavata Mahā Purana is as follows:
During the month of Mārgaśīrsha (December), the young unmarried gopīs of Vṛndāvana observed the sacred Kātyāyanī-vrata vow. Rising at dawn, they bathed in the cold waters of the Yamunā, worshipped a Deity of Goddess Kātyāyanī made of sand, and prayed with unalloyed hearts to obtain Śrī Kṛshṇa as their husband. Knowing their pure desires, Śrī Kṛshṇa arrived at the riverbank while they were bathing, took their garments left on the shore, and climbed a Kadamba tree. He requested the maidens to step out of the water with folded hands to receive their clothes, teaching them to abandon subtle shyness and body-consciousness before the Supreme Soul. Pleased with their total surrender, Kṛshṇa promised to fulfill their pure desire during the upcoming autumn nights.