భాగవత మహా పురాణము
85 - శ్రీకృష్ణుడు వసుదేవునకు బ్రహ్మజ్ఞానమునుపదేశించి మృతులైన అన్నలను బ్రదికించుట
శ్రీబాదరాయణిరువాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- తరువాత ఒకనాడు బలరామ శ్రీకృష్ణ భగవానులు వసుదేవుని వద్దకు వచ్చి పాదములకు నమస్కరించిరి. ఆయన పుత్రులనిద్దరిని ప్రేమతో అభినందించి ఇట్లు పలికెను.
ఆ వసు దేవుడు పుత్రులిద్దరి ప్రభావమును సూచించే మహర్షుల వచనమును వినెను. వారిద్దరి పరాక్రమమును చూచి ఆయనకు నమ్మకము కలిగెను. ఆయన వారిద్దరిని పిలిచి ఇట్లు పలికెను.
ఓ శ్రీకృష్ణా! శ్రీకృష్ణా! నీవు మహాయోగివి. ఓ బలరామా! నీవు సనాతనుడవగు సంకర్షణుడవు. మీరిద్దరు సాక్షాత్తు ఈ జగత్తునకు కారణరూపులైన మాయాశక్తి, పూర్ణ బ్రహ్మలని నాకు తెలియును.
ఈ జగత్తు ఏయే రూపములో ఏ ప్రకారముగా ఉన్నదో ఆ సర్వము సాక్షాత్తుగా నీవే. ఈ జగత్తునకు ఆధారము, ఈ జగన్నిర్మాణమునకు కరణము (సాధనము) నీవే. నీకు చెందిన ఈ జగత్తు నీ లీల కొరకే ఉన్నది. ఇది ఉన్న కాలము కూడ నీవే. మాయాశక్తిని, జీవులను శాసించే భగవానుడవీవే.
ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరము కాని ఓ దేవా! పుట్టుక లేని నీవు నీచే సృష్టించబడిన అనేకప్రకారములగు ఈ జగత్తును నీవు నీచే సృష్టించి, దానిలో నీవు క్రియాశక్తిగా, జ్ఞానశక్తిగా ప్రవేశించి నీయందే నిలబెట్టుచున్నావు.
సమష్టి ప్రాణతత్త్వము మొదలైన జగత్కారణతత్త్వముల శక్తులేవి గలవో అవి పరమాత్మవే. ఎందుకంటే, ఈ తత్త్వములు పరమాత్మతంత్రములే గాని, స్వతంత్రములు కావు. పైగా, పరమాత్మ చేతనుడు కాగా, ఇవి జడములు. చేష్ట చేసే వాటికి చేష్ట మాత్రమే గలదు గాని, చేష్ట వెనుక ఉండే శక్తి పరమాత్మదే.
చంద్రుని కాంతి, అగ్నియొక్క తేజస్సు, సూర్యుని ప్రభ, నక్షత్రముల మెరుపుల స్పురణరూపమగు ఉనికి, పర్వతముల స్థిరత్వము, భూమి సర్వాధారమై యుండుట, భూమియొక్క గంధము పరమార్థముగా నీవే.
ఓ ఈశ్వరా! జలములలోని తృప్తినిచ్చే శక్తి, ప్రాణములను నిలబెట్టే శక్తి, పావనము చేసే శక్తి, ఆ జలములు, వాటి రసము నీవే. ఇంద్రియములలో, అంతఃకరణములో, దేహములో ప్రకటమయ్యే ప్రాణవాయువుయొక్క శక్తి, కదిలే శక్తి, నడిచే శక్తి కూడ నీ శక్తులే.
దిక్కుల ఖాళీ, దిక్కులు, ఆకాశము, దానికి ఆశ్రయమగు శబ్దతన్మాత్ర (సూక్ష్మాకాశము), నాదము, అక్షరము, ఓంకారము, పదార్థములలో భేదమును కలిగించే నామము నీవే.
ఇంద్రియముల విషయప్రకాశనశక్తి, అధిష్ఠానదేవతలు, వారి అను గ్రహము నీవే. బుద్ధియొక్క నిశ్చయశక్తి, జీవుని ఆత్మానుసంధానము నీవే.
పంచభూతములలో వాటి కారణమగు తామసాహంకారము, ఇంద్రియ శక్తులలో వాటి కారణమగు రాజసాహంకారము, వివిధజ్ఞానములకు ఆశ్రయమగు దేవతలలో వారికి కారణమగు సాత్త్వికాహంకారము, కర్మవాసనలతో సంసరించే జీవులకు ఆశ్రయమగు మాయాశక్తి నీవే.
మట్టి మొదలగు ద్రవ్యముతో చేసిన కుండ మొదలగు వికారములలో వాస్తవముగా నశించని తత్త్వము మట్టి మొదలగు ద్రవ్యమే. అదే విధముగా, ఈ లోకములో నశించే స్వభావము గల సకలపదార్థములలో నశించని ఆ కారణసత్త నీవే.
సత్త్వరజస్తమోగుణములు, వాటి వృత్తులగు సుఖదుఃఖమోహములు కూడ (జీవరూపముగా ప్రకటమైన) సాక్షాత్తు పరబ్రహ్మవగు నీయందు యోగమాయచే కల్పించబడినవి.
ఈ సుఖదుఃఖాది వికారములు జీవరూపుడవగు నీయందు కల్పించబడినవి. కావున, అవి నీయందు యథార్థముగా లేవు. అవి కల్పించబడిన కాలములో, నీవు వాటియందు అనువృత్తుడవై యుండెదవు. జ్ఞానముచే కల్పన అంతమైనప్పుడు నీవు వీటి సంబంధము లేని శుద్ధసచ్చిత్స్వరూపుడవై యుండెదవు.
ఈ దేహేంద్రియాదులు సత్త్వరజస్తమోగుణముల ప్రవాహము. సకలప్రాణులకు ఆత్మవగు నీవు వీటియందు, సూక్ష్మమైన సచ్చిద్రూపుడవై ఉన్నావు. కాని, నిన్ను తెలియని వారు అజ్ఞానముచే కర్మల ద్వారా ఈ జననమరణప్రవాహములో పరిభ్రమించుచున్నారు.
ఓ ఈశ్వరా! ఈ . లోకములో మానవజన్మ పురుషార్థమును సాధించుటలో సమర్థ మైనది, దుర్లభము. కాని, నేను అనుకోకుండా ఈశ్వరేచ్చచే దానిని పొందితిని. కాని, నీ మాయచే స్వార్థమునందు తగుల్కొని నేను అసావధానుడనై యుండగనే, వయస్సు వెళ్లిపోయినది.
దేహమునందు ఇది నేను అనే అహంకారము, దేహమును బట్టి వచ్చే భార్యాదులయందు వీరు నావారే అనే మమకారము అనే ఆసక్తిరూపమైన త్రాళ్లతో నీవు సకలజగత్తును గట్టిగా బంధించుచున్నావు.
మీరిద్దరు మా పుత్రులు కారు. మీరు సాక్షాత్తు ప్రకృతిని జీవులను శాసించే ప్రభువులు. భూమికి బరువైన రాజులను వినాశము చేసే నిమిత్తమై అవతరించినారనీ నీవే చెప్పియుంటివి.
ఆపన్నులను రక్షించే బంధువా! అందువలన నేనీనాడు ఆపద గొన్నవాని సంసారభయమును పోగొట్టే నీ పద్మమువంటి పాదమును శరణు పొందుచున్నాను. ఇంద్రియభోగములయందలి తృష్ణ ఇక చాలును. దీని కారణముగానే నేను మరణించే దేహమునందు ఆత్మ అనే బుద్ధిని, పరబ్రహ్మవగు నీయందు పుత్రుడనే బుద్ధిని కలిగియుంటిని.
అధికముగా కీర్తించబడే ఓ దేవా! పుట్టుక లేని నేను ప్రతియుగమునందు నా ధర్మమును రక్షించుటకై అవతరించెదనని నీవు మా యిద్దరికి ప్రసవగృహములో నిశ్చయముగా చెప్పితివి. ఆకాశము వలె అసంగుడవగు నీవు అనేకరూపములను దాల్చి విడిచి పెట్టుచుందువు. పరబ్రహ్మవగు నీ విభూతుల మహిమను ఎవడు తెలియగల్గును?
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- యాదవశ్రేష్ఠుడగు శ్రీకృష్ణ భగవానుడు తండ్రియొక్క ఈ మాటను విని వినయముతో కొంచెము వంగి నమస్కరించెను. ఆయన నవ్వుతూ మధురమైన వాక్కుతో ఇట్లు బదులు చేప్పెను.
శ్రీభగవానువాచ ।
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- తండ్రీ! మీ ఈ వచనము యుక్తియుక్త మైన అర్థము గలదని నేను తలచెదను. మీరు పుత్రులమగు మాకు తత్త్వసమూహమును చక్కగా వివరించి చెప్పితిరి.
యాదవులలో శ్రేష్ఠుడవైన ఓ తండ్రీ! నేను, మీరు, ఈ అన్నగారు, ఈ ద్వారకానగరవాసులు, అందరు, కదిలే మరియు కదలని ప్రాణులు ఈ విధముగా బ్రహ్మరూపముగనే తెలియబడవలెను.
ఏలయనగా, అద్వితీయము, స్వయంప్రకాశము, నిత్యము, నిర్గుణము అగు ఆత్మ దేహాదులకంటే విలక్షణమైనది. ఆత్మ తనచే తననుండి సృష్టించబడిన గుణములు నిమిత్తముగా ఆ గుణములచే చేయబడే ప్రాణులయందు అనేకమా యన్నట్లుగా ప్రతీయమానమగుచున్నది.
ఆకాశము, వాయువు, అగ్ని, జలములు, పృథివి అనే పంచభూతములు, వాటిచే చేయబడే ఘటాదులను బట్టి హెచ్చుతగ్గులు కలవి వలె కన్పట్టును. అదే విధముగా, ఈ అద్వితీయమగు ఆత్మ కూడ ఒక్కటీయే అయిననూ, అది వ్యాపించియుండే ప్రాణుల బహుత్వమును బట్టి అనేకముగను, మనుష్యాదులయందు ఆవిర్భావమును, వృక్షాదులయందు తిరోభావమును, ప్రాణిదేహముయొక్క పరిమాణమునకు తగ్గట్లుగా హెచ్చుతగ్గులను పొందినట్లుగా కన్పట్టును.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను - రాజా! శ్రీకృష్ణ భగవానుడీ విధముగా వర్ణించిన తత్త్వమును విని, సత్యము అనేకమనే వసుదేవుని ధారణ పటాపంచలయ్యెను. ప్రీతి జెందిన మనస్సుతో ఆయన మిన్నకుండెను.
కురువంశీయులలో శ్రేష్ఠుడవగు ఓ రాజా! తరువాత తన పుత్రులిద్దరు గురువగు సాందీపుని పుత్రుని యమలోకమునుండి తీసుకువచ్చినారని అప్పుడు విని సకలదేవతాస్వరూపురాలగు దేవకి చాల ఆశ్చర్యపడెను.
కంసునిచే సంహరించబడిన పుత్రులు గుర్తుకు వచ్చి దేవకికి శోకముతో కన్నులలో నీరు నిండెను. ఆమె , శ్రీకృష్ణ బలరాములను సంబోధించి, దీనముగా నిట్లనెను.
దేవక్యువాచ !
దేవకీ ఇట్లు పలికెను --- ఓ బలరామా! రామా! నీ స్వరూపము ప్రమాణ ములకు గోచరము కాదు. ఓ శ్రీకృష్ణా! నీవు యోగేశ్వరులగు సనకాదులకు కూడ ఈశ్వరుడవు. నేను మిమ్ములనిద్దరినీ ఎరుగుదును. మీరు సృష్టిని చేసే ప్రజాపతులకు కూడ ఈశ్వరులు, జగత్కారణమగు పురుషోత్తములు.
కాలప్రభావముచే సాధుత్వము నశించుట వలన కొందరు రాజులు శాస్త్రమునుల్లంఘించి ప్రవర్తిస్తూ భూమికి బరువగుచున్నారు. వారిని మట్టుబెట్టుటకై మీరిద్దరు నాకు పుత్రులై ఈ కాలములో అవతరించినారు.
ఓ జగత్కారణా! జగద్రూపుడవు నీవే (జగత్తుయొక్క సారతత్త్వము నీవే). మాయాశక్తి నీ అంశ. సత్త్వాదిగుణములు ఆ శక్తియొక్క అంశలు. ఆ గుణముల చిన్న అంశనుండి ఈ జగత్తుయొక్క సృష్టిస్థితిలయములు ఘటిల్లుచున్నవి. అట్టి నిన్ను నేను శరణు పొందుచున్నాను.
చాల కాలము క్రితం మరణించిన పుత్రుని తీసుకురండని గురువు కోరగా, మీరిద్దరు యముని భవనమునుండి గురువు కొరకు గురుదక్షిణగా ఆ బాలుని తీసుకువచ్చితిరి గదా! .
పుత్రులారా! మీరిద్దరు యోగేశ్వరులకు కూడ ఈశ్వరులు. నా కోరికను కూడ అదే విధముగా నెరవేర్చుడు. భోజరాజగు కంసుడు చంపిన పుత్రులను తీసుకురండు. నాకు వారిని చూడాలని కోరిక గలదు.
ఋషిరువాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! తల్లి ఇట్లు ప్రేరేపించగా, బలరామ శ్రీకృష్ణులు యోగమాయనాశ్రయించి సుతలలోకమును ప్రవేశించిరి.
సకలప్రాణులకు దైవము, తనకు సుతరాము దైవము అగు బలరామ శ్రీకృష్ణులు ఆ సుతలమునందు ప్రవేశించుటను రాక్షసరాజగు బలి చూచెను. వారిని చూచుటచే కలిగిన ఆనందముతో ఆయన హృదయము నిండిపోయెను. ఆయన పరివారముతో కూడి వెంటనే లేచి నిలబడి నమస్కరించేను.
ఆయన వారిద్దరికి ఆనందముతో ఆసనమునిచ్చెను. దానియందు వారిద్దరు కూర్చుండగా, ఆయన వారి పాదములను కడిగి ఆ నీటిని పరివారముతో కూడి తలపై దాల్చెను. ఎందుకంటే, ఆ నీరు బ్రహ్మదేవునితో సహా సకలజగత్తును పావనము చేయును.
ఆయన వారిద్దరికీ మిక్కిలి విలువైన వస్త్రములు, ఆభరణములు, అంగరాగములు, తాంబూలము, ధూపదీపములు, అమృతనైవేద్యము మొదలగువాటిని పుష్కలముగా ఇచ్చి బాగుగా పూజించెను. ఆయన పరివారమును, ధనమును, దేహమును కూడ వారికి సమర్పించెను.
ఓ పరీక్షిన్మహారాజా! ఆ బలి కళ్లు ఆనందాశ్రువులతో నిండి దేహమంతా రోమాంచము కలిగెను. బుద్ధి ప్రేమతో ఆర్ద్రము కాగా, ఆయన శ్రీకృష్ణ భగవానుని పద్మమువంటి పాదమును పలుమార్లు ధరించెను. ఆయన గద్గదమైన స్వరముతో ఇట్లు పలికెను.
బలిరువాచ –
బలి ఇట్లు పలికెను --- దేశకాలపరిచ్ఛేదములు లేని పరబ్రహ్మ పరమాత్మ శ్రీకృష్ణుడే. ఆయనయే సృష్టికర్త. సాంఖ్యయోగ కర్మయోగ ములను ప్రవర్తిల్ల జేసినది ఆయనయే. ఆయనకు అనేక నమస్కారములు.
ప్రాణులకు మీ యిద్దరి దర్శనము దుర్లభమే. అయినా, ఈశ్వరకృపచే మీ దర్శనము తేలికగా లభించుననుట నిశ్చయము. ఎందుకంటే, రజోగుణ తమోగుణ స్వభావము గల మాకు మీ యిద్దరి దర్శనమైనది.
నీ మూర్తి రజస్తమోగుణముల సంసర్గము లేని సత్త్వగుణమయమైనది. వేదమే సాక్షాత్తుగా. నీ శరీరము. దితి పుత్రులు, దను పుత్రులు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు, చారణులు, యక్షులు, రాక్షసులు, పిశాచములు, భూతములు, ప్రమథగణనాయకులు, మేము, మావంటి మరికొందరు అట్టి నీయందు సర్వదా గట్టి వైరమును పూనియుందురు.
కొందరు (కంసాదులు) నీయందు గట్టి వైరముతో, కొందరు (గోపికలు) ప్రేమపూర్వకమగు భక్తితో నిన్ను చేరుకొనిరి. వారు పొందినట్లుగా, సత్త్వగుణప్రధానులగు దేవతలు, మహర్షులు మొదలగువారు నిన్ను పొందలేకపోయిరి.
యోగేశ్వరులకు కూడ ఈశ్వరుడవైన ఓ శ్రీకృష్ణా! (నారదాది) యోగేశ్వరులు కూడ తరుచు నీ యోగమాయ (స్వరూపమహిమ) ను ఇదమిత్తముగా తెలియకున్నారు. ఇక మా గురించి వేరుగా చెప్పవలెనా?
చీకటి నూతివంటి ఇంటినుండి బయటపడి నేను, నిష్కాములచే (ధ్యానములో) అన్వేషించబడే జగద్రక్షకుడవగు నీ పద్మములవంటి పాదములను ఆశ్రయించవలెను. నేను జగత్తునకు ఆహారమునిచ్చి రక్షించే చెట్ల మొదళ్లయందు కాయ కసరు తిని బ్రదుకవలెను. నేను శాంతుడనై ఏకాంతములో గాని, లేదా అందరికీ మిత్రులైన జ్ఞానులతో గూడి గాని సంచరించవలెను. ఆ విధముగా తమరు నన్ను అనుగ్రహించుడు.
ఓ ప్రభూ! సకలజీవులను నీవు శాసించెదవు. మమ్ములను పాపము లేనివారినిగా చేసి ఆదేశించుము. నీ ఆదేశమును శ్రద్ధతో అనుష్ఠించే వ్యక్తి వేదముయొక్క విధిని షేధములనుండి విముక్తుడగును.
శ్రీభగవానువాచ ।
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- స్వాయంభువ మన్వంతరములో మరీచి ప్రజాపతికి ఊర్ణయందు ఆర్గురు పుత్రులు కలిగిరి. వారు దేవతలు. వారు కుమార్తెను కామిస్తున్న బ్రహ్మదేవుని చూచి నవ్విరి.
ఓ బలి చక్రవర్తీ! ఆ తప్పు పని కారణముగా వారు వెంటనే రాక్షసజన్మను పొంది హిరణ్యకశిపుని పుత్రులై జన్మించిరి. వారిని యోగమాయ కొనిపోయి దేవకి గర్భములో ప్రవేశ పెట్టగా వారు ఆమె పుత్రులుగా జన్మించి కంసునిచే సంహరించబడిరి.
ఆమె ఆ తన పుత్రులను గురించి శోకించుచున్నది. వారే వీరు నీ వద్ద నివసించుచున్నారు. తల్లి దుఃఖమును పోగొట్టుటకై వీరిని మేము ఇక్కడనుండి తీసుకువెళ్లేదము. తరువాత వీరు శాపవిముక్తిని పొంది దుఃఖము లేనివారై దేవలోకమునకు వెళ్లగలరు.
స్మరుడు, ఉద్గీథుడు, పరిష్వంగుడు, పతంగుడు, క్షుద్రభృత్తు, ఘృణీ అనే ఈ ఆర్గురు సొ అనుగ్రహముచే మరల సత్పురుషులు పొందే సౌ ధామము (మోక్షము) ను పొందగలరు.
శ్రీకృష్ణ బలరాములు ఇట్లు పలికి బలి చక్రవర్తి పూజలనందుకొని వారిని తీసుకొని మరల ద్వారకకు వచ్చి తల్లికి పుత్రులనప్పజెప్పిరి.
ఆ పిల్లలను చూడగానే దేవకీదేవికి పుత్రులయందలి ప్రేమచే స్తనములు పొలను స్రవించెను. ఆమె వారిని ఒడిలో కూర్చుండబెట్టుకొని నుదుటిపై పలుమార్లు ముద్దాడెను.
దేవకి చాల సంతోషించెను. పుత్రులయందలి ప్రేమచే ఆమె స్తనములు పాలను స్రవించెను. విష్ణుమాయచే మోహితురాలైన ఆమె వారికి పాలను తావించెను. జగత్తు విష్ణుమాయచేతనే ప్రవర్తిల్లుచున్నది.
వారు గదాధారియగు శ్రీకృష్ణ భగవానుడు త్రోవగా మిగిలిన ఆ దేవకియొక్క పాలను త్రాగిరి. వారికి శ్రీకృష్ణ భగవానుని దేహముయొక్క స్పర్శ వలన స్వరూపజ్ఞానము కలిగెను.
వారు శ్రీకృష్ణ బలరాములకు, దేవకీ వసుదేవులకు నమస్కరించి, సకలప్రాణులు చూచుచుండగా స్వర్గవాసుల సరసన చేరిరి.
ఓ పరీక్షిన్మహారాజా! మరణించిన పిల్లలు తిరిగి వచ్చుట, స్వర్గమునకు వెళ్లుట అనే ఈ సందర్భమును చూచి దేవకీదేవి చాల ఆశ్చర్యపడెను. ఇది శ్రీకృష్ణుడు రచించిన మాయయని ఆమె తలపోసెను.
భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! అనంతమగు శక్తి గల శ్రీకృష్ణ పరమాత్మయొక్క ఇటువంటి అద్భుతములగు పరాక్రమములు అనంతముగా గలవు.
సూత ఉవాచ !
మురాసురుని సంహరించిన శ్రీకృష్ణ భగవానుని కీర్తి అమృతము. లోకముల పాపములను నిశ్శేషముగా పోగొట్టే ఆ కీర్తిని వ్యాసపుత్రుడగు శుకమహర్షి వర్ణించినాడు. అది భగవద్భక్తు లైన సజ్జనుల చెవులకు పరమానందమునిచ్చును. దానిని ఎవడైతే వినునో, లేదా వినిపించునో, అట్టివాని మనస్సు ఆ భగవానునిపై లగ్నమగును. ఆతడు భగవానుని అభయస్వరూపమును పొందును.
శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో
శ్రీకృష్ణుడు వసుదేవునకు బ్రహ్మజ్ఞానమునుపదేశించి
మృతులైన అన్నలను బ్రదికించుటను వర్ణించే
ఎనుబది ఐదవ అధ్యాయము ముగిసినది (85).
Summary of chapter 85 of the Bhāgavata Mahā Purana is as follows:
Following the Kurukshetra pilgrimage, Vasudeva and Devakī returned to Dvārakā. Devakī recalled how Kṛshṇa had brought His guru's dead son back from the realm of Yamarāja and tearfully requested Kṛshṇa and Balarāma to bring back her first six infant sons who had been murdered by Kaṁsa. Śrī Kṛshṇa and Balarāma descended to the subterranean realm of Sutala, where King Bali received Them with intense devotion. Kṛshṇa retrieved the six infants, who were formerly the sons of Marīci suffering under a curse, and brought them back to Dvārakā. Devakī wept with joy, nursing her long-lost babies at her breast. Having touched Kṛshṇa's body and drunk Devakī's milk, the six infants were instantly liberated, ascending to the spiritual sky in celestial airplanes before the astonished eyes of all.