భాగవత మహా పురాణము
16 - కాళీయ మర్దన లీల
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- సర్వసమర్థుడగు శ్రీకృష్ణుడు నల్ల త్రాచుచే కలుషితము చేయబడిన ఆ యమునానదిని చూచి. దానికి పరిశుద్దిని కలిగించ గోరెను. ఆయన ఆ పామును అచటనుండి పంపించివేసెను.
రాజోవాచ ।
పరీక్షిత్తు ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! శ్రీకృష్ణ భగవానుడు లోతైన నీటి మధ్యలో పామును ఎట్లు నిగ్రహించెను? ఆ పాము చాల యుగముల కాలము నీటిలో ఏ విధముగా ఉండగలెను? ఈ గాథను చెప్పడు.
ఓ మహర్షీ! అనంతుడు, స్వేచ్చావిహారి అగు ఆ శ్రీకృష్ణ భగవానుడు గోవులను రక్షిస్తూ చేసిన గొప్ప లీలలు వినుటకు అమృతము వంటివి. వాటిని సేవించేవాడెవడు తృప్తిని జెందును? (ఎవడైననూ తృప్తి జెందడు).
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- యమునానదిలో కాలియనాగమునకు ఒక కుండము (ప్రవాహసంబంధము లేనిది) ఉండెను. అది దాని విషము యొక్క వేడికి ఉడికిపోతూ ఉండేది. దాని పైన వెళ్లే పక్షులు మరణించి దానిలో పడేవి.
ఆ కుండములోని విషపు నీటి తరంగములనుండి వీచే గాలిలో విషపు నీటి బిందువులుండేవి. ఒడ్డు పైన ఉండే ప్రాణులు కదిలేవి (పశువులు మొదలైనవి), కదలనివి (చెట్టుచేమలు) ఆ గాలి సోకి చచ్చిపోయెడివి.
కాలియుని బలము భయంకరమగు వేగము గల విషమే. వాడు యమునానదిని కలుషితము చేసినాడు. ఈ సంగతిని చూచిన శ్రీకృష్ణుడు నడుమునకు వస్త్రమును గట్టిగా కట్టి ఎత్తైన కడిమి చెట్టునెక్కి జబ్బ చరచెను. దుష్టనిగ్రహము కొరకై అవతరించిన ఆయన ఆ చెట్టునుండి విషజలములతో నిండియున్న కుండములోనికి దుమికెను.
పాముల విషముతో కూడిన సెగలను పైకి చిమ్మే ఆ కాలియుని మడుగులోని నీరు విషముచే కషాయముగా చేయబడి భయంకరమగు కెరటములను లేపుచుండెను. పురుషోత్తముడు వేగముగా దుముకగా, ఆ జలసమూహము వంద ధనుస్సు (8 అడుగులు) ల దూరము వరకు పరుగెత్తి అంతటా ప్రసరించేను. అనంతమగు శక్తి గల భగవానునకు అది యెంతటిది?
ఓ రాజా! గొప్ప ఏనుగుయొక్క పరాక్రమము గల శ్రీకృష్ణుడు ఆ మడుగులో విహరిస్తూ దండములవంటి భుజములతో నీటిని కొట్టుచుండగా పెద్ద ధ్వని కలిగెను. ఆ చప్పుడును కళ్లే చెవులుగా గల కాలియుడు వినెను. ఆ సర్పము తన నివాసముపై జరిగిన ఈ దాడిని చూచి, దానిని సహింపజాలక (కోపముతో) దగ్గరకు వచ్చెను.
సుందరుడు, సుకుమారుడు అగు శ్రీకృష్ణుడు మేఘము వలె స్వచ్చమైన నల్లని వర్ణము గలవాడు. రొమ్ముపై శ్రీవత్సము గల ఆయన పచ్చని వస్త్రమును ధరించెను. చిరునవ్వుతో సుందరమైన ముఖము గల ఆయన భయము లేకుండా విహరించుచుండెను. ఆయన పాదములు పద్మపు పొట్టను పోలి ఎర్రగా నుండెను. ఆయనను ఆ పాము కంఠము మొదలైన మర్మస్థానములలో కరిచి తన దేహము (పడగ) తో కప్పివే సెను.
పాము పడగతో చుట్టి వేయగా ఆ శ్రీకృష్ణుని కదలికలు ఆయన ప్రియమిత్రులైన గోపాలకులకు కానరాలేదు. వారు తమను, బంధువులను, సంపదలను, స్త్రీలను, భోగములను శ్రీకృష్ణునియందే సమర్పించినవారు. వారు అధికమగు పీడను పొంది ఏడ్చిరి. బుద్ధి శోకముతో, భయముతో మొద్దుబారి పోగా, వారు నేలగూలిరి.
ఆవులు, ఎద్దులు, ఎదిగిన దూడలు ఆర్తనాదము చేస్తూ అధికముగా దుఃఖిస్తూ శ్రీకృష్ణుని వైపే కళ్లను అప్పగించి చూచుచుండెను. అవి భయముతో ఏడ్చుచున్నవా యన్నట్లు నిలబడి యుండెను.
వెంటనే గోకులములో నేలపై (భూకంపము), అంతరిక్షమునందు (ఉల్కలు పడుట), దేహమునందు (మగవారికి ఎడమ కన్ను అదురుట) అనే మూడు విధములైన అపశకునములు బయలు దేరినవి. మిక్కిలి భయమును గొల్పే ఆ అపశకునములు భయము దగ్గరలో రాబోవుచున్నదని సూచించును.
బలరాముడు లేకుండా శ్రీకృష్ణుడు గోవులను మేపుటకు వెళ్లినాడని నందుడు మొదలుగా గల గోపాలకులకు తెలిసెను. వారా అపశకునములను చూచి భయముతో ఆందోళనను చెందిరి.
ఆ చెడు శకునములను చూచి మృత్యువే వచ్చిపడినదని వారు దుఃఖముతో కంగారు పడిరి. వారికి శ్రీకృష్ణుడంటే ప్రాణము. వారి మనస్సు ఆయనయందే ఉండెను. కాని, వారికి ఆయన ప్రభావము తెలియదు. అందుచే వారు బెంగతో, భయముతో వ్యాకులు రైరి.
ఓ పరీక్షిన్మహారాజా! గోకులములోని వారందరు గంగిగోవు వంటివారు. వారందరు పిల్లలు, వృద్ధులు, స్త్రీలతో సహా శ్రీకృష్ణుని చూడాలనే అధికమగు ఇచ్చ గలవారై దీనముగా గోకులమునుండి బయలు దేరిరి.
మధువంశీయుడగు బలరామ భగవానుడు ఆ విధముగా వ్యాకులపడుచున్న ఆ గోపాలకులను చూచి నవ్వి ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే, ఆయనకు తమ్ముడగు శ్రీకృష్ణుని మహిమ తెలియును.
ఆ గోపాలకులు తమకు ఇష్టుడగు శ్రీకృష్ణుని వేదుకుతూ కాలి గుర్తులను బట్టి యమునానదీతీరమును చేరిరి. కాలి గుర్తుల యందు పద్మము మొదలగు చిహ్నములు ఆయన భగవానుడని సూచించును.
ఓ పరీక్షిన్మహారాజా! వారు గోవుల దారిలో అక్కడక్కడ ఇతరగోపాలకుల కాలి గురుతుల మధ్య మధ్యలో గోపాలకుల నాయకుడగు శ్రీకృష్ణుని కాలి గుర్తులను చూసుకుంటూ వేగముగా వెళ్లిరి. శ్రీకృష్ణుని కాలి గుర్తులయందు పద్మము, బార్లీ గింజ, అంకుశము, వజ్రము, జెండాల చిహ్నములుండును.
వారికి దూరముగా సరస్సు మధ్యలో పాము పడగలచే చుట్టివేయబడి చేష్టలుడిగిన శ్రీకృష్ణుడు, సరస్సు ఒడ్డునందు మొద్దుబారిన బుద్ధి గల. గోపబాలకులు, మరియు చుట్టూ బిగ్గరగా ఆర్తనాదము చేస్తున్న పశువులు కూడ కనబడిరి. వారు చాల పీడితులై అధికమగు మోహమును పొందిరి.
గోపికల మనస్సులో అనంతుడగు, శ్రీకృష్ణ భగవానునియందు అనురాగము గలదు. వారు ఆయన ప్రేమను, చిరునవ్వును, చూపులను, మాటలను స్మరించుచుందురు. మిక్కిలి ప్రియుడగు శ్రీకృష్ణుని పాము పట్టుకొనగా, వారు తీవ్రమగు దుఃఖముచే తాపమును పొందిరి. వారికి ప్రియుడగు కృష్ణునిచే విరహితమైన ముల్లోకములు శూన్యముగా తోచినవి.
తన పుత్రుడగు శ్రీకృష్ణుని వెంటే సరస్సులో ప్రవేశించబోయిన తల్లీ యశోదను ఆ గోపికలు పట్టుకొని ఆపిరి. వారికీ కూడ ఆమెతో సమానమైన దుఃఖముతో కన్నీళ్లు ప్రవహించుచుండెను. వారు గోకులమునకంతకూ ప్రియుడైన శ్రీకృష్ణుని లీలలను చెప్పుచుండిరి. వారు చూపులను శ్రీకృష్ణుని ముఖము పైననే అప్పజెప్పి శవములను పోలియుండిరి,
నందుడు మొదలగు గోపాలకులకు శ్రీకృష్ణుడే ప్రాణము. వారు కూడ ఆ సరస్సులో దిగబోగా, ఆ బలరామ భగవానుడు అడ్డుకొనెను. శ్రీకృష్ణుని మహిమ ఆయనకు తెలియును.
శ్రీహరియే శ్రీకృష్ణరూపములో మానవుల రీతిని అనుసరించెను గదా! తన గోకులమునకు తాను తప్ప మరియొకరు శరణు లేరని ఆయన గమనించెను. తన నిమిత్తముగా స్త్రీలతో, పిల్లలతో సహా గోకులమంతయు దుఃఖములో మునిగిపోయినదని ఆయన తెలుసుకోనేను. ఆయన పాము యొక్క పట్టులో గంట లోపు ఉండి, తరువాత పైకి లేచెను.
ఆ శ్రీకృష్ణుని శరీరము పెరుగజొచ్చెను. దానితో పామునకు తన పడగలయందు నొప్పి కలిగెను. దాని ముక్కు పుటములయందు విషము, నోళ్లయందు మంటలు ఉండెను. దాని స్థిరమైన కళ్లు ఎర్రగా కాల్చిన పెనముల వలె నుండెను. అది కోపముతో తన పడగలను పైకెత్తి నిట్టూరుస్తూ శ్రీకృష్ణుని విడిచి పెట్టి చూస్తూ ఉండెను.
ఆ పాము రెండు కొనలు గల సౌలుకలతో పెదవుల మూలలను చుట్టూ ఆస్వాదించుచుండెను. దాని చూపులు మిక్కిలి భయంకరమగు విషముయొక్క నిప్పులను చెరగుచుండెను. శ్రీకృష్ణుడు పక్షిరాజగు గరుడుడు వలె ఆ ఈ పాముతో ఆడుకుంటూ చుట్టూ తిరిగెను. అది కూడ కాటు వేసే అవకాశము కొరకు ఎదురు చూచెను.
ఈ విధముగా చుట్టూ తిరుగుటచే దాని బలము దెబ్బ తినెను. శ్రీకృష్ణుడు సర్వజగత్కారణుడు, కళలన్నింటికీ మొట్టమొదటి గురువు. ఆయన ఎత్తైన పడగలు గల ఆ పామును కొంచెము వంచి దాని పెద్ద తలల పైకెక్కి నాట్యమాడెను. దాని తలలపైనుండే రత్నసమూహముల స్పర్శచే పద్మములవంటి ఆయన పాదములు మిక్కిలి ఎర్రనయ్యెను.
ఆ శ్రీకృష్ణుడు నాట్యము చేయుటకు సంసిద్దుడగుటను చూచి అప్పుడు వెంటనే ఆయన భక్తులైన చారణులు మద్దెళ్లు, తప్పెట్లు, భేరీలు మొదలగు వాద్యములను వాయించగా గంధర్వులు పాడిరి. అప్సరసలు నాట్యమాడగా సిద్దులు పూలవానను కురిపించి ఉపహారములను సమర్పించిరి. దేవతలు స్తుతించిరి.
ఓ పరీక్షిన్మహారాజా! దుష్టులను శిక్షించే శ్రీకృష్ణుడు నూటొక్క తలలు గల కాలియుని ఏయే తల వంగలేదో, ఆయా తలను కాళ్లతో తొక్కి మర్ధించెను. బలము క్షీణించగా ఆ పాము గిర గిర తిరుగుతూ నోటినుండి ముక్కునుండి విషమిశ్రితమై భయంకరమైన రక్తమును గ్రక్కుతూ గట్టిగా మూర్ఛను పొందెను.
ఆ కలియుడు కన్నుల గుండా విషమును గ్రక్కుతూ కోపముతో నిట్టూర్చుచుండెను. ఆతడు ఏయే తలను పైకెత్తితే దానిని శ్రీకృష్ణుడు నాట్యము చేస్తూ కాలితో తొక్కివేసెను. ఈ సందర్బములో పురాణపురుషుడగు శ్రీకృష్ణుని కాలి పై రక్తబిందువులు పడి, ఆయనను కాలియుడు ఎర్రని పువ్వులతో పూజించినాడా యన్నట్లుండెను.
ఓ పరీక్షిన్మహారాజా! ఆ శ్రీకృష్ణుని రకరకముల తాండవముచే కాలియుని గొడుగులవంటి పడగలు అధికముగా గాయపడెను. అవయవములు విరిగిన ఆతడు నోళ్లనుండి రక్తమునధికముగా క్రక్కుచుండెను. ఆతడు మనస్సుతో స్థావరజంగమాత్మకమగు ప్రాణికోటికీ తండ్రియైన నారాయణుని మనస్సుతో శరణు వేడెను. పూర్ఖుడగు ఆ నారాయణుడే సర్వజగత్తునకు కారణము.
జగత్తంతా శ్రీకృష్ణుని గర్భమునందుండును. ఆ బరువుచే ఆక్రమించబడిన కాలీయుని గొడుగుల వంటి పడగలు కాలి మడమల దెబ్బలచే అంతటా గాయపడెను. ఆ స్థితిని గమనించి దుఃఖమును పొందిన ఆతని భార్యలు హడావుడిలో వస్త్రములు, భూషణములు, జుట్టుముడులు జారిపోవుచుండ, జగత్కారణుడగు శ్రీకృష్ణుని సమీపించిరి.
తరువాత మిక్కిలి ఆందోళన చెందిన మనస్సు గల కాళియపత్నులు తమ పిల్లలను ముందుంచుకొని సకలప్రాణికోటికి ప్రభువగు శ్రీకృష్ణునకు దండప్రణామమునాచరించిరి. ఆ పతివ్రతలు తమ భర్తకు అపరాధమునుండి (శిక్షనుండి) విముక్తి కలగాలని కోరువారై దోసిలి యొగ్గి, శరణునిచ్చే ఆ శ్రీకృష్ణుని శరణు వేడిరి.
నాగపత్న్య ఊచుః ।
కాలియనాగుని భార్యలు ఇట్లు పలికిరి --- పాపమును చేసిన ఈతనికి నీవు శిక్షను విధించుట న్యాయమే. శత్రువునందు, పుత్రులయందు నీకు సమదృష్టి గలదు. నీవు అవతరించినది దుష్టులను శిక్షించుట కొరకే. నీవు దుష్టుడు బాగుపడే విధానమును విచారించియే శిక్షను అమలు పరచెదవు.
నీవు మాకు ఈ విధముగా అనుగ్రహమునే చూపితివి. ఎందుకంటే, నీవు దుష్టులకు వేసే శిక్ష వారి పాపములను పోగొట్టును. గదా! పాపము వలననే ఈ జీవునకు పాము జన్మ కలిగినది. నీ కోపము కూడ అనుగ్రహమేనని మేము స్వీకరించెదము.
ఈతడు పూర్వజన్మలో అభిమానమును త్రోసిపుచ్చి ఇతరులకు సత్కారమును కూడ చేస్తూ ఏదో ఒక తపస్సును బాగుగా చేసియుండును. లేదా, ఈతడు సకలప్రాణులయందు దయతో ధర్మమును చేసియుండును. ఎందుకంటే, సకలప్రాణులలోని జీవశక్తి వైన నీవు ఆ తపోధర్మముల చేతనే ప్రీతుడవగుదువు.
ఓ దేవా! ఈతనికి నీ పాదధూళిని స్పృశించే యోగ్యత కలిగినది. అది ఏ తపస్సు ఫలమో (ప్రభావమో) మాకు తెలియదు. లక్ష్మీదేవి నీ పాద ధూళిని కోరి భోగములను విడిచి చిరకాలము ప్రతనిష్ఠతో తపస్సు చేసెను.
నీ పాదధూళిని శరణు వేడిన భక్తులు స్వర్గ స్థానమును గాని, భూలోకరాజ్యమునైననూ, బ్రహ్మపదమును గాని, పాతాళరాజ్యమును గాని, యోగసిద్ధులను గాని, పునర్జన్మ లేని మోక్షమునైననూ కోరరు.
ఓ ప్రభూ! పాములకు ప్రభువగు ఈ కాలియుడు తమోగుణమునుండి పుట్టి కోపమునకు వశవర్తియే అయినా, ఇతరులచే పొంద శక్యము కాని ఆ పాదధూళిని పొందినాడు. సంసారమనే చక్రములో తిరిగే దేహధారి ఆ పాదధూళిని కోరినచో, ఆతనికి ప్రత్యక్షముగా (స్వయముగా) సంపద కలుగును.
ఓ భగవానుడా! పూర్ణుడవగు నీకు నమస్కారము. సర్వాంతర్యామి, సకలప్రాణులకు అధిష్టానము అగు నీవు సర్వులలో ఆత్మరూపుడవై యున్నావు. దేశకాలవస్తుపరిచ్ఛేదములు లేని సధనుడవీవే.
జ్ఞానములకు, అనుభవములకు ఆశ్రయమగు పరబ్రహ్మ నీవే. నీవు నిర్గుణుడవే అయినా, నీ శక్తి అనంతము. ప్రకృతికి అతీతుడవగు నీయందు వికారములు (మార్పులు) ఏమీ ఉండవు. నీకు నమస్కారము.
కాలరూపుడవగు నీవే కాలశక్తికి, ఆశ్రయము, మరియు కాలావయవములగు క్షణనిమేషాదులకు సాక్షివి. జగత్తునకు నిమిత్త కారణము, మరియు ఉపాదాన కారణము కూడ జగద్రూపుడవగు నీవే. జగత్సాక్షివగు నీకు నమస్కారము.
పంచభూతములు, శబ్దాది తన్మాత్రలు, ఇంద్రియములు, ప్రాణాపానాది ప్రాణములు, మనస్సు, బుద్ధి, చిత్తముల యథార్థతత్త్వము నీవే. సత్త్వరజస్తమోగుణాత్మకములగు ఈ దేహాదులయందు నేను, నాది అనే అభిమానము ఆత్మరూపుడవగు నీవు అనుభవమునకు రాకుండా కప్పివేయును. నీకు నమస్కారము.
నీవు అంతము లేనివాడవు, సూక్ష్ముడవు, నిర్వికారుడవు, సర్వజ్ఞుడవు. నీవు పలు వాదములను అనుసరించి, ఆ వాదులనా రూపములలోనే అనుగ్రహించెదవు. నామరూపముల శక్తి నీవే (నీకు నమస్కారము). ,
ప్రత్యక్షాది ప్రమాణములకు మూలమునందుండే సాక్షి చైతన్యము నీవే. సర్వజ్ఞుడవగు నీవే వేదకర్తవు, వేదప్రతిపాద్యుడవు. రామాద్యవతారము లలో ప్రవృత్తి, దక్షిణామూర్త్యాద్యవతారములలోని నివృత్తి నీ స్వరూపమే. వేదరూపుడవగు నీకు అనేక నమస్కారములు.
వసుదేవుని పుత్రుడవై భక్తులనాకర్షించే కృష్ణుడవు నీవే.(బల) రాముడవై భక్తుల హృదయములను రమింపజేసేది నీవే. ప్రద్యుమ్న (ఉత్కృష్ట ప్రకాశము గలవాడు)-అనిరుద్ద (ఆటంకములు లేనివాడు) రూపములలో నున్నది నీవే. యాదవులకు (సత్త్వగుణప్రధానులగు భక్తులకు) ప్రభువగు నీకు నమస్కారము.
గుణకార్యములగు దేహాదులను ప్రకాశింపజేసే చైతన్యము నీవే ఐనా, నీ స్వరూపమును వాటియందలి అభిమానమే కప్పి వేయును. ఐతే, గుణ. కార్యములగు మనస్సు మొదలగువాటి వ్యాపారములు నీ స్వరూపము వైపు సంకేతములనిచ్చుచునే యుండును. దేహేంద్రియాదులకు సాక్షియగు స్వయంప్రకాశ-ఆత్మవగు నీ కొరకు నమస్కారము.
ఇంద్రియములను ప్రవర్తిల్లజేసే ఓ దేవా! మాయాశక్తియందు విహరించే నీనుండి సకలనామరూపములు సిద్ధించుచున్నవి. ఆత్మా రాముడవై ప్రకాశించే నీ స్వభావము మౌనమే. నీకు నమస్కారమగు గాక!
మాయాశక్తి మొదలగు కారణముల తత్త్వము, పంచభూతాది కార్యముల తత్త్వము సర్వసాక్షివగు నీకే తెలియును. నీవు జగద్రూపముగా ప్రకటమైననూ జగత్తులోని వికారములు నీకు లేవు. ఈ జగత్తునకు కారణమైన నీవే జగత్తునకు సాక్షి వై జగత్తును ప్రకాశింప జేయుదువు.(విశ్వము లేని నీయందు విశ్వము ప్రకటమగుచున్నది, అనగా నీవు విశ్వమునకు వివస్త్రాధిష్ఠానము). నీకు నమస్కారము.
ఓ ప్రభూ! నీ విహారము అమోఘము. నీయందు క్రియ గాని, ఇచ్చ. గాని లేదు. అయిననూ, నీవు కాలము యొక్క శక్తిని దాల్చి సత్త్వరజస్తమోగుణములతో ఈ జగత్తు యొక్క సృష్టి స్థితిలయములను చేయుదువు. నీయందు బీజరూపముగానున్న ఆయా ప్రాణుల స్వభావములను నీవు నీ చూపుతో ఉద్బుద్దము చేసి క్రీడించేదవు.
ముల్లోకములయందు సత్త్వగుణప్రధానములై శాంతములు (దేవాదులు), రజోగుణ ప్రధానములై అశాంతములు (మనుష్యాదులు), తమోగుణప్రధానములై మూఢములు (సర్పాదులు) అగు ఈ మూడు రకముల జన్మలు గలవు. అవన్నీ జగదధిష్ఠానమగు నీ - రూపములు మాత్రమే. ఇది నిశ్చయము. ఇప్పుడు నీవు సత్పురుషుల ధర్మమును రక్షించే కోరికతో ప్రవర్తిల్లుచున్నావు. సత్పురుషులను రక్షించుటకై నడుము కట్టియున్న నీకు శాంతజనులే ప్రీతిని కలిగించెదరు.
శాంతమైన మనస్సు గల ఓ ప్రభూ! ప్రభువు తన సేవకుని తప్పును ఒక్కసారి క్షమించవలెను. ఈ కాలియుడు తమోగుణప్రధానుడు, కావుననే నీ మహిమను యెరుగడు. వీనిని నీవు క్షమించ దగును.
హే భగవన్! ఈ పామును అనుగ్రహించుము. లేనిచో ఇది ప్రాణములను కోల్పోవును. సత్పురుషులు స్త్రీల పై జాలిని చూ పెదరు. స్త్రీలమగు మాకు భర్తయే ప్రాణము. మాకు పతిభిక్షను పెట్టుము.
మేము నీ సేవికలము. మేము ఏమి చేయవలెనో ఆజ్ఞాపించుము. నీ ఆజ్ఞను శ్రద్దతో అనుష్ఠించువాడు, అన్ని వైపులనుండి భయముతో కూడియున్న సంసారమునుండి నిశ్చయముగా విముక్తుడగును.
శ్రీశుక ఉవాచ ।
శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీకృష్ణ భగవానుని కాలితాపులతో పడగలు విరిగి కాలియనాగుడు మూర్చిల్లేను. ఆతని భార్యలీ విధముగా చక్కగా స్తుతించగా, ఆయన వానిని విడిచి పెట్టేను.
కాలియునకు పోయిన ఇంద్రియశక్తులు, ప్రాణములు తిరిగి వచ్చేను. ఆతడు కష్టముగా నిట్టూర్పులను విడుస్తూ దీనముగా దోసిలి యొగ్గి పాపహరుడగు. శ్రీకృష్ణ భగవానునితో నిట్లనెను.
కాలియ ఉవాచ ।
కాలియుడిట్లు పలికెను --- ఓ ప్రభూ! మేము పుట్టుకతోటే దుష్టులము, తమోగుణప్రధానులము. మా కోపము చిరకాలము కొనసాగేది. ప్రాణులకు స్వభావమును విడిచి పెట్టుట దుర్ఘటము. సంసారులు దురాగ్రహము (దురభిమానము) ను కలిగియుందురు.
ఓ విధాతా! సత్త్వరజస్తమోగుణముల కార్యమగు ఈ వైవిధ్యభరితమైన జగత్తును సృష్టించినది నీవే. దీనియందు పలు విధముల శాంతాది స్వభావములు, దేహశక్తి, ఇంద్రియశక్తి, తల్లి శక్తి, తండ్రి శక్తి, వాసనలు, రూపములు గలవు.
హే భగవన్! ఆ జగత్తులో పాములము మేమైతే పుట్టుకతోనే అధికమగు. కోపము గలవారము. నీ మాయను అతిక్రమించుట చాల కష్టము. మోహితులమై యున్న మేము మా అంత మాకుగా మాయను ఎట్లు అతిక్రమించగలము? (అతిక్రమించ లేము),
జగన్నాథుడవగు నీవు సర్వము తెలిసినవాడవు. మా స్వభావమునకు కారణము నీవే. అనుగ్రహము గాని, శిక్ష గాని, దేనిని నీవు భావిస్తే, దానిని మాకు విధించుము.
శ్రీశుక ఉవాచ ।
శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను -- శ్రీకృష్ణ భగవానుడు దేవకార్యము కొరకై మానవునిగా అవతరించెను. ఆయన ఈ మాటను వినీ, కాలియునితో నిట్లనెను: ఓ కాలియా! నీవిక్కడ ఉండవద్దు. బంధువులు, - సంతానము, భార్యలతో కూడి విలంబము లేకుండా సముద్రమునకు వెళ్లుము. ఈ నదిని గోవులు, మానవులు వినియోగించేదరు గాక!
ఏ మానవుడైతే నేను నీకిచ్చిన ఈ శిక్షను రెండు సంధ్యలయందు కీర్తిస్తూ చక్కగా స్మరించునో, అట్టివానికి నీ వలన భయము కలుగదు.
ఎవడైతే ఉపవాసము చేసి నేను క్రీడించిన ఈ సరస్సులో స్నానము చేసి, దేవతలకు పితృదేవతలకు తర్పణములనిచ్చి, నన్ను స్మరిస్తూ పూజించునో, అట్టివాడు సకలపాపములనుండి పూర్తిగా విముక్తుడగును.
గరుడుని వలన భయపడి నీవు రమణకద్వీపమును విడిచి పెట్టి ఈ సరస్సునాశ్రయించితివి. నా పాదముల గుర్తులు గల నిన్ను ఆ గరుడుడు భక్షించకుండును గాక!
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి పలి కెను --- శ్రీకృష్ణ భగవానుని లీలలు అచ్చెరువును గొలుపును. ఆయన ఈ విధముగా పలుకగా, కాలియుడు మరియు ఆతని భార్యలు కూడ ఆనందముతో ఆదరపూర్వకముగా ఆయనను పూజించిరి.
జగన్నాథుడగు శ్రీకృష్ణుని ధ్వజముపై గరుడుడు ఉండును. కాలియుడు ప్రకాశించే వస్త్రములను, మాలలను, మణులను, మిక్కిలి విలువైన ఆభరణములను, దివ్యమగు గంధలేపనములను, పెద్ద కమలముల మాలను కూడ సమర్పించి ఆయనను పూజించెను. ఆ విధముగా ఆయనను ప్రసన్నుని చేసి, ఆతడా తరువాత ఆనందముతో ఆయనకు ప్రదక్షిణము చేసి నమస్కరించి సెలవు తీసుకొనెను.
భార్యలు, బంధువులు, పుత్రులతో కూడి కాలియుడు సముద్రములోని రమణకద్వీపమునకు వెళ్లాను. అప్పుడే ఆ యమునానదిలోని విషము పోయి నీరు అమృతము వలె ఆయెను. అదంతా లీల కై మానవరూపమును దాల్చిన శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహమే.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్ధములో కాలియమర్దన లీలను వర్ణించే పదునారవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 16 of the Bhāgavata Mahā Purana is as follows:
The narrative records the historical purification of the Yamunā River. In a deep pool of the Yamunā resided the multi-hooded, venomous serpent Kāliya, whose deadly poison boiled the water and emitted toxic fumes that killed flying birds and surrounding vegetation. When the cowherd boys and cows drank the poisoned water, they fell lifeless on the shore; Śrī Kṛshṇa restored them to life with His merciful glance. Stepping onto a Kadamba tree, seven-year-old Kṛshṇa leaped heroically into the boiling pool. Kāliya wrapped his massive coils around Kṛshṇa, but Bhagavān expanded His body, forced the serpent to release Him, and leaped onto Kāliya's hundred hoods. Dancing with exquisite rhythmic steps (*Kāliya-mardana*), Kṛshṇa trampled the serpent's pride, causing him to vomit blood. Realizing Kṛshṇa's divinity, Kāliya's wives (*Nāgapatnīs*) offered exalted prayers begging for mercy. Kṛshṇa spared Kāliya's life, imprinted His lotus footprints upon the serpent's heads as protection against Garuḍa, and banished him to Ramanaka Island.