భాగవత మహా పురాణము
23 - యజ్ఞపత్నుల ఉద్ధారము
గోపా ఊచుః ।
గోపాలకులిట్లు పలికిరి --- ఓ బలరామా! రామా! నీ పరాక్రమము గొప్పది. ఓ శ్రీకృష్ణా! నీవు దుష్టులను మట్టుబెట్టెదవు. ఈ ఆకలి మమ్ములను నిశ్చితముగా పీడించుచున్నది. మీరిద్దరు దీనికి ఉపశాంతిని కలిగించినచో బాగుండును.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- గోప బాలకులు దేవకీ పుత్రుడగు శ్రీకృష్ణ భగవానునకు ఇట్లు విన్నవించిరి. భక్తురాండ్రగు బ్రాహ్మణపత్నుల యెడల ఆయన ప్రసన్నుడై యుండెను. ఆయన ఇట్లు పలికెను.
మీరు యజ్ఞవాటికకు వెళ్లుడు. ఎందుకంటే, అచట వేదవేత్తలగు బ్రాహ్మణులు స్వర్గమును పొందాలనే కోరికతో బృహస్పతిసవమనే యాగమును చేయుచున్నారు.
ఓ గోపాలకులారా! మా ఇద్దరిచే పంపబడే మీరు అచటకు వెళ్లుడు. అన్నగారు, పూజనీయుడు అగు బలరాముని పేరు చెప్పుడు. నా పేరును కూడ చెప్పి ఆహారమును కోరుడు.
శ్రీకృష్ణ భగవానుడిట్లు ఆదేశించగా ఆ గోప బాలకులు వెళ్లి, వేద వేత్తలకు దోసిలి యొగ్గి సాష్టాంగప్రణామము చేసి అదే విధముగా కోరిరి.
ఓ బ్రాహ్మణోత్తములారా! వినుడు. మేము శ్రీకృష్ణుని ఆజ్ఞను పాలించే గోపాలకులము. బలరాముడు పంపగా మేము వచ్చినామని తెలియుడు. మీకు మంగళమగు గాక!
ఓ బ్రాహ్మణులారా! ఇక్కడకు దగ్గరలోనే బలరాముడు, శ్రీకృష్ణ మీరిచ్చిన ఆహారమును భుజించ గోరుచున్నారు. మీరు ధర్మము తెలిసిన వారిలో గొప్పవారు. మీకు శ్రద్ధ ఉన్నట్లైతే, వారిద్దరికి ఆహారమునిండు.
ఓ గొప్ప పుణ్యాత్ములారా! పశువినియోగము ఉండే దీక్షను, సౌత్రామణిని విడిచి పెట్టి మిగిలిన యజ్ఞములయందు దీక్ష తీసుకున్నవాని ఆహారమును తిన్ననూ నిశ్చయముగా దోషము లేదు.
ఈ విధముగా భగవానుని కోరికను వారు విని కూడ పట్టించుకోలేదు. వారి కోరికలు స్వర్గము మొదలగు అల్పవిషయములకు చెందినవి. వారి కర్మలు చాల క్లేశముతో కూడినవి. వారు తత్త్వము తెలిసినవారు కారు. కాని, తాము జ్ఞానవృద్ధులమనే గర్వము వారికి గలదు.
యజ్ఞమును చేసే దేశకాలములు, దానిలోని వేర్వేరు ద్రవ్యములు, మంత్రములు, కర్మను చేసే పద్ధతి, ఋత్విక్కులు, గార్హపత్యము మొదలైన అగ్నులు, అగ్ని మొదలగు దేవతలు, యజ్ఞమును చేయువాడు, యజ్ఞము, దాని వలన కలిగే పుణ్యము అనేవి ఆ భగవానుని రూపము లే.
శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తుగా ఇంద్రియగోచరము కాని పరబ్రహ్మయే. ఆ బ్రాహ్మణులు మరణించే దేహమే ఆత్మ అనే దుష్ఠమగు బుద్ది గలవారు. కావుననే, మానవుడని తలచి వారాయనను ఆదరించలేదు.
అంతశ్శత్రువులను నశింపజేసిన ఓ పరీక్షిన్మహారాజా! ఆ బ్రాహ్మణులు అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు. అప్పుడా గోపాలకులు నిరాశ జెంది తిరిగి వచ్చి ఆ విషయమును బలరామకృష్ణులకు చెప్పిరి.
జగన్నాథుడగు శ్రీకృష్ణ భగవానుడు ఆ మాటను విని బిగ్గరగా నవ్వెను. అన్నము కావాలంటే అడగాల్సింది గృహిణిని, అనే లోకవ్యవహార శైలిని ప్రదర్శించువాడై ఆయన మరల గోపాలకులతో నిట్లనెను.
బలరామునితో గూడి నేను వచ్చియున్నానని ఆ బ్రాహ్మణుల భార్యలకు తెలుపుడు. వారు సహజప్రేమ గలవారు, మనస్సులో నన్నే భావన చేయువారు. వారు మీకు కావలసినంత ఆహారమునీయగలరు.
అప్పుడు గోపాలకులు వెళ్లి బ్రాహ్మణపత్నుల శాలయందు కూర్చున్న బ్రాహ్మణపత్నులను చూచిరి. వారు చక్కగా అలంకరించుకొని యుండిరి. ఆ బాలకులు వారికి నమస్కరించి వినయముగా నిట్లనిరి.
ఓ బ్రాహ్మణపత్నులారా! మీకు నమస్కారము. మా మాటలను దయతో వినుడు. ఇక్కడకు దగ్గరలోనే శ్రీకృష్ణుడు వచ్చియున్నాడు. ఆయన మమ్ములను ఇక్కడకు పంపినాడు.
శ్రీకృష్ణుడు బలరామునితో, గోపాలకులతో కలిసి గోవులను మేపుకుంటూ చాల దూరము వచ్చినాడు. ఆయనకు, ఆయన అనుచరులకు ఆకలి వేయుచున్నది. దయచేసి వారికి ఆహారమునిండు.
ఆ బ్రాహ్మణపత్నులకు శ్రీకృష్ణ భగవానుని చూడాలనే ఉత్కంఠ ఎల్లవేళలా ఉండెను. ఆయన గాథలచే వారి మనస్సులు ఆకర్షితములయ్యెను. ఆయన దగ్గరకు వచ్చియున్నాడని, ఆకలితోనున్నాడని విని వారు చాల కంగారు పడిరి.
ఆ బ్రాహ్మణపత్నులందరు భక్ష్య (నమిలి తినేది)-భోజ్య (త్రాగిది)-లేహ్య (ఆస్వాదించేది)-చోష్య (చప్పరించేది) ములనే నాలుగు రకముల ఆహారమును పాత్రలతో తీసుకొని తమకు ఇష్టుడగు శ్రీకృష్ణుడు ఉన్న వైపుకు, నదులు సముద్రము వైపుకు వలె, వెళ్లిరి. ఆ ఆహారమునకు రుచి, పుష్టి మొదలగు గుణములనేకము గలవు.
భర్తలు, సోదరులు, బంధువులు, పుత్రులు అడ్డుకున్ననూ వారు వెళ్లిరి. వారు ఉత్తమమగు కీర్తి గల శ్రీకృష్ణ భగవానుని గురించి చాల కాలము నుండి వినుచుండిరి. వారి మనస్సు ఆయనయందు లగ్నమయ్యెను.
యమునానది ఒడ్డున అశోకవృక్షముల కొత్త చిగుళ్లతో అందముగానున్న ఉద్యానము గలదు. అచట అన్నగారితో, గోపాలకులతో కలిసి విహరిస్తున్న శ్రీకృష్ణుని బ్రాహ్మణపత్నులు చూచిరి.
బంగరు వన్నె గల వస్త్రమును దాల్చిన ఆ నల్లనయ్య మేడలో అడవి పూల మాలను, తలపై నెమలి పింఛమును చిగుళ్లను, దేహముపై రాతి రంగులను అలంకరించుకొని నటుని వలె నుండెను. ఆయన ఒక చేతిని ప్రక్కనున్న అనుచరుని భుజము పై వేసి, రెండవ చేతితో పద్మమును త్రిప్పుచుండెను. ఆయన చెవులలో కలువలు, చెక్కిళ్లపై ముంగురులు, పద్మమువంటి ముఖమునందు చిరునవ్వు ఉండెను.
ఓ పరీక్షిన్మహారాజా! ఆ బ్రాహ్మణపత్నులకు శ్రీకృష్ణునిపై ప్రీతి మెండు. వారు. ఆయన గోపదవములను పలుమార్లు వినుటయే. కరాభరణములు కలిగియుండిరి. అట్లు విని వారి మనస్సు ఆయనయందు లగ్న మైనది. అప్పుడు వారాయనను కళ్లు అనే ద్వారముల గుండా లోపల (అంతఃకరణమునందు) ప్రవేశ పెట్టి, మనస్సులోనే చాల సేపు కౌగిలించుకొనిరి. నిద్రావస్థలో జనుల అహంకారములు ఒకే చిదన-ఆత్మయందు విలీనమై సేద దీరునట్లుగా, అప్పుడు వారు తాపమును విడిచి పెట్టిరి.
శ్రీకృష్ణుడు సకలప్రాణులలో సకలబుద్ధివృత్తిసాక్షియగు ఆత్మయై ఉన్నాడు. వారు సకలకామనలను విడిచి పెట్టి తనను చూడ కోరికతో వచ్చినారని ఆయనకు తెలియును. ఆయన చిరునవ్వు మోముతోనిట్లనెను.
ఓ గొప్ప పుణ్యవతులారా! మీకు స్వాగతము. కూర్చుండుడు. నేను మీకు చేయదగినది ఏది గలదు? నన్ను చూచే కోరికతో (అడ్డులను దాటి) వచ్చుట అనే ఈ మీ ప్రవృత్తి మీ (ప్రేమ) కు ఎంతయు తగియున్నది.
తమ పురుషార్థమును గురించి స్పష్టమగు కల్పన గల నిపుణులైన (ఆత్మానాత్మవివేకము గల) సాధకులు సాక్షాత్తుగా నాయందు యథార్థముగా భక్తిని చేయుదురు. ఇది నిశ్చయము. వారి భక్తియందు ఫలాసక్తి గాని, అంతరాయములు గాని ఉండవు. నేను సర్వులకు ఆత్మను మరియు ప్రియుడను.
ఆత్మతోడి (కల్పిత) సంబంధము వలననే వ్యక్తికి తన ప్రాణములు, బుద్ది, మనస్సు, శరీరము, భార్య, సంతానము, ధనము, కీర్తి మొదలైనవి ప్రియములగుచున్నవి. అట్టి ఆత్మకంటె ప్రియమైనది మరొకటి ఏది గలదు? (లేదు).
కావున మీరు యజ్ఞవాటమునకు వెళ్లుడు. మీ వలన గృహస్థులై మీ భర్తులగు బ్రాహ్మణులు తమ సత్రయాగమును సంపన్నము చేసుకొనెదరు.
పత్న్య ఊచుః ।
బ్రాహ్మణపత్నులిట్లు పలికిరి --- ఓ ప్రభూ! నీవీ విధముగా పరుషముగా పలుక తగదు. ఏకాంతభక్తులకు పునరావృత్తి లేదు, అనే వేదవాక్యము (నీ ఉపదేశము) ను . సత్యము చేయుము. మేము సకలబంధువులను తిరస్కరించి నీ పాదమూలమును చేరినాము. నీవు కాలితో (తిరస్కారపూర్వకముగా) ఇచ్చిన తులసిమాలనైననూ మేము జుట్టుముడియందు దాల్చెదము.
నీవు కామక్రోధములు మొదలైన అంతశ్శత్రువులను పోగొట్టెదవు. మా భర్తలు గాని, తల్లిదండ్రులు గాని, పుత్రులు గాని, సోదరులు గాని, బంధువులు గాని, మిత్రులు గాని మమ్ములను స్వీకరించరు. ఇక ఇతరులు ఏల స్వీకరించేదరు? కాబట్టి నీ పాదాగ్రములపై పడియున్న దేహములు గల మాకు (నీవు తప్ప) మరియొక గతి లేదు. మాకు నీ దాస్యమునిమ్ము.
శ్రీభగవానువాచ ।
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- భర్తలు, తల్లిదండ్రులు, సోదరులు, కొడుకులు, బంధువులు మొదలగు వారు, జనులు కూడ మీ యెడల తప్పు పట్టరు. మీరు నాచే అనుజ్ఞనీయ బడినవారు. మిమ్ములను దేవతలు కూడ (నిర్దోషులని) స్వీకరించేదరు.
ఈ లోకములో మానవులకు శరీరముతో కలయిక ఆనందమును గాని, అనురాగమును గాని కలిగించదు. కావున, మనస్సును నాయందు లగ్నము చేయుడు. తొందరలో నన్ను పొందెదరు.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీకృష్ణుడిట్లు చెప్పగా, ఆ బ్రాహ్మణపత్నులు తిరిగి యజ్ఞవాటమునకు వెళ్లిరి. వారి భర్తలు వారియెడల దోషారోపణ చేయలేదు. పైగా, ఆ బ్రాహ్మణులు తమ భార్యలతో కలిసి సత్రయాగమును పూర్తి చేసిరి.
వారిలో ఒకామెను భర్త వెళ్లకుండా అడ్డుకొనెను. ఆమె శ్రీకృష్ణ భగవానుని రూపమును తాను విన్నట్లుగా మనస్సుతో ఏకాగ్రముగా ధ్యానించి, కర్మఫలరూపముగా నిర్మాణమైన దేహమును విడిచి పెట్టెను.
సర్వసమర్థుడై గోవులను కాపాడే శ్రీకృష్ణ భగవానుడు కూడ నాలుగు రకముల ఆ అన్నమునే గోపాలకులకు తినిపించి తాను కూడ తినేను.
లీలకై మానవ దేహమును దాల్చిన శ్రీకృష్ణ భగవానుడీ విధముగా మనుష్య జీవితముననుకరించుచుండెను. ఆయన తన రూపముతో, మాటలతో, చేష్టలతో గోవులకు, గోపాలకులకు, గోపికలకు ఆనందమును కలిగిస్తూ, తాను కూడ రమించెను.
మానవులననుకరించే జగన్నాథులైన బలరామకృష్ణుల కోరికను మనము నిరాకరించితిమి, అని గుర్తు చేసుకొని అపరాధము చేసిన ఆ బ్రాహ్మణులు తరువాత పశ్చాత్తాపపడిరి.
ఆ బ్రాహ్మణులు తమ భార్యలకు శ్రీకృష్ణ భగవానునియందు గల లోకాతీతమైన భక్తిని చూచిరి. అట్టి భక్తి తమయందు లేకపోవుట కూడ వారికి తెలి సెను. దానికి వారు పశ్చాత్తాపపడి తమను తాము తిట్టుకొనిరి.
మనమైతే ఇంద్రియగోచరుడు కాని శ్రీహరి యెడల పెడమొగము కలిగి యున్నాము. మన మూడు ఆవృత్తుల (తల్లి కడుపున పుట్టుట, ఉపనయనము, యజ్ఞదీక్ష) జన్మ, వేదవిద్య, బ్రహ్మచర్యవ్రతము, గొప్ప పాండిత్యము, కులము, వైదికకర్మలయందలి దక్షత అనువాటి గురించి నిందయగుగాక!
ఓ వేదవేత్తలారా! శ్రీహరి భగవానుని మాయ నిశ్చయముగా యోగులను కూడ ప్యామోహ పెట్టును. ఎందుకంటే, మానవులకు గురువులమైన మనము మన పురుషార్థము విషయములో వ్యామోహము (సత్యమును తెలియ లేకపోవుట) ను పొందుచున్నాము.
ఆహా! జగద్గురువగు శ్రీకృష్ణునియందు స్త్రీలు కూడ సర్వమును నిరాకరించి అగాధమగు భక్తిని చేసిరి. అట్టి భక్తి ఇల్లు-వాకిలి అనే పేరు గల మృత్యురూపములైన పాశములను (ఆసక్తులను) తెగగొట్టును.
వీరికి ఉపనయనసంస్కారము గాని, గురుకులవాసము గాని లేవు. వీరు తపస్సు గాని, ఆత్మవిచారము గాని చేయలేదు. వీరియందు (మంత్రకృతమగు) శౌచము లేదు. వీరు వేదోక్తములగు పుణ్యకర్మలను చేయలేదు.
ఐననూ వీరికి పవిత్రకీర్తియగు శ్రీకృష్ణునియందు దృఢమగు భక్తి గలదు. ఇది నిశ్చయము. ఆయన యోగులకు, యోగేశ్వరులకు కూడ ప్రభుడు. ఉపనయనసంస్కారము, గురుకులవాసము మొదలైనవి గలవారమే అయినా, మనకు భక్తి లేనే లేదు.
సత్పురుషులు పొందగోరేది భగవానుని మాత్రమే. మనమైతే గృహస్థకర్మలలో పడి స్వర్గాదికామనలే పరమార్థమనే వ్యామోహములో పడియుంటిమి. ఆహా! ఆయన మన ఆత్మవిస్మృతిని మనకు గోపాలకుల మాటల ద్వారా గుర్తు చేసినాడు. ఇది నిశ్చయము.
అట్లు, గానిచో, శ్రీకృష్ణ భగవానునకు ఆయనచే పాలించబడే మనతో ప్రయోజనమేమి గలదు? (ఏమీ లేదు). ఆయన పూర్ణ మైన కామనలు గలవాడు; మోక్షము, స్వర్గము ఇత్యాదికామనలన్నింటినీ పరిపూర్తి చేసే ప్రభుడు. ఇది (మనలను అన్నము కోరుట) లోకానుకరణము మాత్రమే.
ఒక్కసారి పాదములను స్పృశించవలెననే కోరికతో లక్ష్మీదేవి ఇంద్రాదులను విడిచి పెట్టి, తనయందలి చాంచల్యము మొదలగు దోషములను ప్రక్కన బెట్టి ఆయనను సేవించుచున్నది. అట్టి శ్రీకృష్ణ భగవానుడు అన్నమును కోరుట (మనవంటి) జనులను మోహ పెట్టును.
యజ్ఞమును చేసే దేశకాలములు, దానిలోని వేర్వేరు ద్రవ్యములు, మంత్రములు, కర్మను చేసే పద్ధతి, ఋత్విక్కులు, గార్హపత్యము మొదలైన అగ్నులు, అగ్ని మొదలగు దేవతలు, యజ్ఞమును చేయువాడు, యజ్ఞము, దాని వలన కలిగే పుణ్యము అనేవి ఆ భగవానుని రూపములే.
యోగులకు, యోగేశ్వరులకు ప్రభుడగు ఆ (యజ్ఞరూపుడగు) ఈ (శ్రీకృష్ణరూపుడగు) శ్రీహరి భగవానుడే సాక్షాత్తుగా యాదవులలో అవతరించెనని ఏంటిమి గదా! అయినా, మూఢులమగు మనమాయనను గుర్తించలేదు.
ఆహా! అట్టి (గొప్ప భక్తి గల) భార్యలను కలిగియున్న మనము మిక్కిలి ధన్యులము. ఏలయన, వారి భక్తిచే మన బుద్ధి కూడ శ్రీకృష్ణ భగవానునియందు నిశ్చలముగా నిలుచును.
ఓ శ్రీకృష్ణా! నీవు బాధితము కాని జ్ఞానము గల భగవానుడవు. నీకు నమస్కారము. నీ మాయచే మోహితులమైన మేము (కామ్య)కర్మమార్గములయందు తిరుగాడుచున్నాము.
జగత్కారణుడగు ఆ పూర్ణపరమాత్మయొక్క మాయచే మా బుద్ది నిశ్చయముగా మోహమును చెందినది. కావుననే, మేము ఆయన మహిమ తెలియక అపరాధమును చేసితిమి. ఆయన మా అపరాధమును మన్నించ దగును.
శ్రీకృష్ణుని అవహేళన చేసిన ఆ బ్రాహ్మణులు ఈ విధముగా తమ తప్పు తెలుసుకొనిరి. స్వరూపచ్యుతీ లేని బలరామకృష్ణులను చూడాలనే కోరిక వారికి కలిగేను. కాని, ఆ విషయము కంసునకు తెలిసి శ్రీకృష్ణునకు హానిని తల పెట్టునేమో అనే భయము వలన వారు వెళ్లలేదు.
శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధముపూర్వార్ధములో యజ్ఞపత్నుల ఉద్ధారమును వర్ణించే ఇరువది మూడవ అధ్యాయము ముగిసినది (23).
Summary of chapter 23 of the Bhāgavata Mahā Purana is as follows:
While pasturing cows at a distance from Vṛndāvana, the cowherd boys became exhausted with hunger and asked Kṛshṇa for food. Kṛshṇa sent them to a nearby sacrificial arena where learned Angirasa brāhmaṇas were performing a grand Vaidika sacrifice (*Angirasa-satra*). When the boys begged for food in Kṛshṇa's name, the proud ritualistic brāhmaṇas ignored them, considering the cowherd boys impure and prioritizing ritual rules over direct service to the Supreme Being. The boys returned disappointed, but Kṛshṇa sent them back to the brāhmaṇas' wives. Hearing Kṛshṇa's name, the chaste, devoted wives immediately gathered plates of delicious food and rushed to Kṛshṇa in the forest, disregarding the warnings of their husbands. Kṛshṇa accepted their offering, blessed them with devotion, and sent them back to their homes. Humbled by their wives' devotion, the brāhmaṇas repented deeply for their ritualistic arrogance and lack of devotion.