భాగవత మహా పురాణము
6 - పూతన ఉత్తమగతిని పొందుట
శూరపుత్రుడగు వసుదేవుని మాట అసత్యము కాదని మార్గములో తలచిన నందుడు అపశకునములు కలుగునేమోననే సందేహము గలవాడై శ్రీహరిని శరణు వేడెను.
కంసుడు క్రూరురాలగు పూతనను పం పెను. ఆమె పిల్లలను చంపును. నగరములు, గ్రామములు, గొల్లపల్లెలు, బస్తీలు మొదలగువాటియందు ఆమె పిల్లలను చంపుతూ తీరిగెను.
సత్త్వగుణప్రధానులగు భక్తులకు ప్రభువు శ్రీహరి. ఆయన కీర్తిని వినుట, కీర్తించుట మొదలైనవి రాక్షసులను నశింపజేయును. ఎక్కడనైతే జనులు తమ పనులను చేసుకుంటూ ఆ శ్రీహరియొక్క కీర్తిని వినుట మొదలైనవి చేయరో, అక్కడనే నిశ్చయముగా రాక్షసులు ఉండెదరు.
ఆ పూతన తనకు నచ్చిన రూపమును దాల్చి యథేచ్చగా ఆకాశమునందు సంచరించును. ఒకనాడామె నందుని గోకులమును చేరి, మాయచే తనను సుందరియగు యువతిగా మలచుకొని ప్రవేశించేను.
విశాలమైన కటిభాగము, స్తనములు మరియు సన్నని నడుము గల ఆ పూతన చక్కని కోకను ధరించి, జుట్టుముడియందు, మల్లెల మాలను తురిమెను. కర్ణాభరణములు కదలాడుచుండగా ఆ కాంతులచే ముంగురులు అధికముగా ప్రకాశించుటచే ఆమె ముఖము శోభిల్లెను.
అనురాగమును కలిగించే ఆ యువతి అందమైన చిరునవ్వుతో ప్రక్కచూపులను విసురుతూ ఆ గొల్లపల్లెయందలి జనుల మనస్సును దోచివేయుచుండెను. చేతిలో పద్మము ఉండుటను బట్టి ఆమె తన భర్తయగు శ్రీహరిని చూచుటకై రూపు దాల్చి వచ్చిన లక్ష్మీదేవియా అన్నట్లు గోపికలు తలపోసిరి.
పూతన పిల్లలను హతమార్చే పిశాచము. ఆమె ఆ గోకులములో పిల్లలను వెదుకుచుండెను. ఆమెకు అనుకోకుండా (ఈశ్వరేచ్చచే) నందుని ఇంట్లో శయ్య పై దుష్టులను మట్టుబెట్టే బుడతడు కనబడెను. ఆ బాలకృష్ణుడు తనదైన గొప్ప తేజస్సును దాచి పెట్టి, బూడిదయందు పెట్టిన నిప్పువలె నుండెను.
స్థావరజంగమాత్మకమగు జగత్తునకు శ్రీకృష్ణుడే ఆత్మ. పిల్లలను మట్టుబెట్టే ఆ పిశాచమును ఆ అనంతుడు గుర్తించి కళ్లు మూసుకొని యుండెను. పామని తెలియనివాడు త్రాడని భ్రమపడి నిద్రిస్తున్న పామును పట్టుకున్నట్లు, ఆమె అంతకుడగు కృష్ణుని ఒడిలో కూర్చుండ బెట్టుకొనెను.
ఒరలో దాచి పెట్టిన చురకత్తివలె ఆ పూతన క్రూరమైన చిత్తము గలదే ఐననూ మిక్కిలి అందమైన చేష్టలను చేస్తూ పుణ్యస్త్రీ వలె కనబడెను. ఇంటి మధ్యలో ఆమెను చూచి రోహిణీయశోదలిద్దరు తల్లులు ఆమె కాంతిచే అవాక్కయిపోయి కేవలము చూస్తూ నిలబడిరి.
ఆ ఇంటి మధ్యలో క్రూరురాలగు పూతన పిల్లవానిని ఒడిలోనికి తీసుకొని పాలను త్రాగించేను. ఆమె స్తనము అరిగించుకొన శక్యము కాని శక్తి గల విషముతో భయమును గొల్పెను. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కోపించి ఆ స్తనమును రెండు చేతులతో గట్టిగా నొక్కి పట్టుకొని ప్రాణములతో సహా త్రాగివేసెను.
జీవశక్తియొక్క మర్మస్థానములన్నింటియందు అధికముగా పీడను పొందిన ఆ పూతన, విడువుము, విడువుము, చాలు అంటూ, బిగ్గరగా పలి కెను. ఆమె రెండు కళ్లను తేలవేసి, చేతులను కాళ్లను కొట్టుకుంటూ ఆర్తనాదము చేసెను. ఆమె దేహమంతా చెమటతో తడిసి ముద్దయ్యెను.
ఆమెయొక్క మహావేగము గల భయంకరధ్వనిచే పర్వతములతో సహా భూలోకము, గ్రహములతో సహా ద్యులోకము, క్రింది లోకములు కూడ కదలాడి పోయినవి. దిక్కులు మారు మ్రోగినవి. పిడుగు పడినదనే భయముతో జనులు నేల పై బడిరి.
ఓ పరీక్షిన్మహారాజా! ఈ విధముగా స్తనమునందు పీడించబడిన రాక్షసికి ప్రాణములు పోయెను. ఆమె నోరు వెళ్లబెట్టి, జుట్టు విరబోసుకొని, చేతులను కాళ్లను కూడ చాపి, వజ్రముతో కొట్టబడిన వృత్రాసురుడు వలె, తన వాస్తవరూపముతో గొల్లపల్లెకు బయట పడిపోయెను.
ఓ రాజరాజా! ఆమె దేహము క్రింద పడుతూ ఆరు క్రోసుల దూరము వరకు ఉన్న చెట్లను నుగ్గు చే సెను. అది గొప్ప ఆశ్చర్యమును కలిగించెను.
ఆమె దేహము భయమును గొల్పుచుండెను. ఆమె నోరు నాగలి చాలు పరిమాణము గల కోరలతో భీతిల్లజేయుచుండెను. ఆమె ముక్కు పుటములు కొండగుహలను, స్తనములు కొండనుండి జారిపడిన బండరాళ్లను పోలియుండెను. ఆమె ఎర్రని జుట్టు విరబోసి యుండెను.
ఆ దేహమునందు కన్నులు. చీకటి నూతులవలె లోతుగా నుండెను. ఇసుకతిన్నెలవంటి పిరుదులు భీతిని గొల్పుచుండెను. చేతులు, తొడలు, కాళ్లు జనులచే కట్టబడిన సేతువులను పోలియుండెను. ఆమె పొట్ట నీరు లేని సరస్సువలె నుండెను.
ఆమె గర్జనశబ్దముచే గోపాలకులకు, గోపీకలకు ముందే హృదయములు, చెవులు, తలలు పేలిపోయెను. ఆపై ఇప్పుడు వారా దేహమును చూచి అధికముగా భయపడిరి.
ఆమె వక్షఃస్థలముపై బాలకృష్ణుడు దేనికీ భయపడకుండా ఆడుచుండెను. కంగారు పడిపోయిన గోపికలు వెంటనే దగ్గరకు వచ్చి ఆ పిల్లవానిని తీసుకొనిరి.
ఆ గోపికలు యశోదారోహిణులతో బాటు పిల్లవానికి ఆవు తోకను త్రిప్పుట, ఆవు చెవులను స్పృశింప జేయుట మొదలగు విధులతో సర్వవిధములుగా చక్కని రక్షను చేసిరి.
వారు బాలకృష్ణునకు గోమూత్రమును, గోధూళిని చల్లి, గోమయముతో కూడ పన్నెండు తిలకస్థానములయందు ఈశ్వరుని పేర్లతో రక్షను చేసిరి.
గోపికలు ఆచమనము చేసి తమకు న్యాసము చేసుకొని, తరువాత పిల్లవానికి అవయవములయందు, రెండు చేతులయందు వేరుగా బీజాక్షరముల న్యాసమును చేసిరి.
పుట్టుక లేని శ్రీహరి నీ పాదములను, కౌస్తుభమణిధారియగు శ్రీహరి నీ మోకాళ్లను, యజ్ఞరూపుడగు శ్రీహరి తొడలను, స్వరూపచ్యుతి లేని శ్రీహరి నడుము భాగమును, హయగ్రీవరూపియగు శ్రీహరి ఉదరమును, వివిధశక్తులకు ఉద్గమస్థానమగు శ్రీహరి గుండెను, సర్వాంతర్యామియగు శ్రీహరి వక్షఃస్థలమును, సూర్యరూపియగు శ్రీహరి కంఠమును, సర్వవ్యాపియగు శ్రీహరి చేతులను, మూడు అడుగులలో బ్రహ్మాండమును కొలిచిన శ్రీహరి నోటిని, సర్వనియామకుడగు శ్రీహరి తలను రక్షించుగాక!
చక్రధారియగు శ్రీహరి ముందు, గదాధారి వెనుక, ధనుర్ధారియగు మధుసూదనుడు ఒక ప్రక్కన, కత్తిని చేత బట్టిన పుట్టుక లేని శ్రీహరి మరియొక ప్రక్కన, శంఖధారియై గొప్పగా కీర్తించబడే శ్రీహరి దిక్కుల మూలలయందు, వామనుడైన శ్రీహరి పైన, గరుడారూఢుడగు శ్రీహరి మరియు నాగలిని ధరించే సంకర్షణుడు నేల పై, పూర్ణుడగు శ్రీహరి అంతటా ఉండుగాక ! (ఉండి రక్షించుగాక!)
ఇంద్రియాధిపతియగు శ్రీహరి ఇంద్రియములను, నారాయణుడు ప్రాణాపానాదులను, శ్వేతద్వీపాధిపతియగు శ్రీహరి చిత్తమును (స్మృతిని), యోగులకు ప్రభువగు శ్రీహరి మనస్సును రక్షించుగాక।
పృశ్నికి పుత్రుడై అవతరించిన శ్రీహరి నీ బుద్దిని (కర్తృత్వమును), పరమాత్మయగు శ్రీహరి భగవానుడు నీ వ్యక్తిత్వము (భోక్తృత్వము) ను, వేదములను పాలించే శ్రీహరి నీవు ఆడుచున్నప్పుడు, లక్ష్మీపతియగు శ్రీహరి నీవు పరున్నప్పుడు రక్షించుగాక!
వైకుంఠవాసియగు (వినాశము లేని జ్ఞానమే స్వరూపముగా గలవాడు) శ్రీహరి నీవు వెళ్లుచున్నప్పుడు, లక్ష్మీపతియగు శ్రీహరి నీవు కూర్చున్నప్పుడు, యజ్ఞభాగములను భుజించువాడు మరియు సకలపిశాచములకు భయమును గొల్పువాడు (నృసింహరూపీ) అగు శ్రీహరి. నీవు భుజించుచున్నప్పుడు రక్షించుగాక!
దుష్ట స్త్రీలు, రాక్షసస్త్రీలు, ఉపద్రవములను కలిగించే కూష్మాండములనే క్షుద్రదేవతలు, పిల్లలను పీడించే భూతప్రేతపిశాచములు, యక్షులు, రాక్షసులు, విఘ్నములను కలిగించే క్షుద్రదేవతలు, కోటర, రేవతి, జ్యేష్ఠాదేవి, పూతన, మాతృక మొదలగు బాలగ్రహములు, పిచ్చిని కలిగించే గ్రహములు, చిత్తభ్రాంతిని కలిగించే గ్రహములు, దేహమును ప్రాణమును ఇంద్రియములను నశింపజేసే గ్రహములు, స్వప్నమునందు కనబడిన పెద్ద అపశకునములు, పెద్దలను పిల్లలను పట్టి పీడించే గ్రహములు ఏవైతే గలవో అవన్నీ శ్రీహరి నామమును ఉచ్చరించినంత మాత్రాన భయభీతములగును. అవన్నీ నశించు గాక!
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా ప్రేమచే కట్టివేయబడిన గోపికలు బాలకృష్ణునకు రక్షను విధించిరి. తల్లియగు యశోద పాలను త్రావించి నిదుర బుచ్చెను.
అంతలో నందుడు మొదలుగా గల గోపాలకులు మథురనుండి గొల్లపల్లెను చేరిరి. వారు పూతన దేహమును చూచి అత్యాశ్చర్యమును పొందిరి.
ఆశ్చర్యము! వసుదేవుడు పూర్వజన్మలో మహర్షిగా గాని, గొప్ప యోగియై గాని ప్రకాశించెను. ఇది నిశ్చయము. ఏలయన, ఆయన ఏ అపశకునమును గురించి చెప్పినాడో, అదియే కానబడినది.
గోకులమునందు నివసించే ఆ జనులు ఆ శరీరమును గొడ్డళ్లతో అవయవములుగా తెగగొట్టి దూరముగా పడవేసి చుట్టూ కట్టెలను పేర్చి పూర్తిగా తగుల బెట్టిరి.
శ్రీకృష్ణుడు పొలను ప్రాణములను త్రాగుట వలన పూతన పాపములు వెనువెంటనే సమూలముగా నశించెను. ఆ దేహము తగులబడుచుండగా పైకి యెగసిన పొగ అగురు సుగంధమును కలిగియుండెను.
జనుల పిల్లలను చంపుతూ రక్తాన్ని త్రాగే పూతన కూడ చంపాలనే కోరికతోనే ఐనా శ్రీహరికి పాలనిచ్చి ఉత్తమగతిని పొందెను.
శ్రద్దాభక్తులతో శ్రీకృష్ణ పరమాత్మకు మిక్కిలి ప్రియమైన వస్తువునిచ్చువాడు ఉత్తమగతిని పొందునని వేరుగా చెప్పవలెనా? ఆ శ్రీకృష్ణుని తల్లులు వలె అనురాగము గలవారై ఇచ్చువారు మరింత ఉత్తమగతిని పొందెదరని చెప్పవలేనా?
భక్తులచే హృదయమునందు స్థిరముగా ధ్యానించబడే భగవానుని పాదములను జనులచే ఆరాధించబడే ఇంద్రాదులు కూడ నమస్కరించెదరు. శ్రీకృష్ణ భగవానుడు. అట్టి రెండు పాదములతో పూతనయొక్క దేహమును అడ్డముగా ఆక్రమించి పాలను త్రాగెను, ఆమె రాక్షసీయే ఐననూ, తల్లీ పొందదగిన స్వర్గమునే పొందెను. అట్టిచో, శ్రీకృష్ణుడు ఏ ఆవుల మరియు తల్లుల పాలను త్రావెనో, వారు ఉత్తమోత్తమగతిని పొందెదరని వేరుగా చెప్పవలయునా?
ఓ పరీక్షిన్మహారాజా! మోక్షము మొదలుకొని సకలముననుగ్రహించే భగవానుడు దేవకికి పుత్రుడై యశోద మొదలగు తల్లుల మరియు గోవుల పాలను తృప్తిగా త్రివేను. శ్రీకృష్ణునియందు నిరంతరముగా పుత్రదృష్టిని కలిగియున్న వారలకు పుత్రునియందలి ప్రేమ వలన పాలు స్రవించెడివి. వారికి అజ్ఞానము వలన కలిగే జననమరణప్రవాహము మరల కలుగదు.
గోకులములో నివసించే గోపాలకులు శవముయొక్క పొగయందలి పరిమళమునాఘ్రాణించి, ఇది యేమి? ఎక్కడనుండి వచ్చుచున్నది? అంటూ పలుకుతూ, గోకులమును చేరిరి.
గోకులమునందలి గోపాలకులు పూతన వచ్చుట, శ్రీకృష్ణునకు పాలను త్రావీంచుట. ఇత్యాది వృత్తాంతమును, ఆమె మరణమును, పిల్లవాడు క్షేమముగా ఉన్న వైనమును వర్ణించి చెప్పిరి. నందాదులు దానిని విని చాల ఆశ్చర్యమును పొందిరి.
కురువంశశ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! నందుడు పెద్ద మనస్సు గలవాడు. మృత్యుముఖమునుండి బయట పడిన తన పుత్రుడగు శ్రీకృష్ణుని ఆయన దగ్గరకు తీసుకొని లలాటము పై ముద్దాడి అతిశయించిన ఆనందమును పొందెను.
ఏ మానవుడైతే శ్రీకృష్ణుని విస్మయమును కలిగించే ఈ బాలలీలను, పూతన స్వర్గమును పొందుటను శ్రద్ధతో వినునో, అట్టివానికి గోవిందునియందు ప్రేమ (భక్తి) కలుగును.
శ్రీమద్భాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్ధములో పూతన ఉత్తమగతిని పొందుటను వర్ణించే ఆరవ అధ్యాయము ముగిసినది (6).
Summary of chapter 6 of the Bhāgavata Mahā Purana is as follows:
Following Kaṁsa's orders, the terrifying witch Pūtanā, who smeared lethal poison on her breasts and flew through the sky killing infants, arrived in Gokula disguised as an extraordinarily beautiful maiden. Entering Nanda Mahārāja's home while the elders were away, she took infant Kṛshṇa onto her lap and offered Him her poisoned breast. Knowing her demonic identity, infant Kṛshṇa closed His eyes and tightly bit her breast, sucking out the lethal poison along with her very life air. Roaring in agony, Pūtanā reverted to her gigantic, twelve-mile-long monstrous form, crushing forest trees as she fell dead. The residents of Gokula chopped her colossal body and burned it; remarkably, because she had offered her breast to Bhagavān in a maternal gesture, the smoke rising from her funeral pyre emitted the sweet fragrance of aguru incense, confirming that Bhagavān granted her the exalted post of a surrogate mother in Vaikuṇṭha.