భాగవత మహా పురాణము
27 - కామధేనువు శ్రీకృష్ణుని గోవిందునిగా అభిషేకించుట
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమునెత్తి గోకులమును కుండపోత వర్షమునుండి రక్షించెను. అప్పుడు గోలోకమునుండి కామధేనువు ఇంద్రునితో కలిసి ఆయన వద్దకు వచ్చెను.
ఇంద్రుడు ఈ శ్రీకృష్ణుని యెడల అపరాధమును చేయుటచే సిగ్గు పడెను. ఆయన ఏకాంతములో శ్రీకృష్ణుని వద్దకు వచ్చి సూర్యుని వలె వెలిగిపోయే కిరీటము రెండు పాదములకు తగులునట్లు నమస్కరించెను.
అనంతశక్తియగు శ్రీకృష్ణుని ప్రభావమును గురించి విని చూచిన ఇంద్రునకు తాను ముల్లోకములకు ప్రభువుననే గర్వము నశించెను. ఆయన చేతులు జోడించి నమస్కరించి ఇట్లు పలికెను.
ఇంద ఉవాచ।
ఇంద్రుడిట్లు పలికెను --- నీ స్వరూపము శుద్ద (రజస్తమస్సులచే పరాభూతము కాని) సత్త్వ ప్రధానము, (కావుననే) జ్ఞానఘనము, వికారములు లేనిది. నీ స్వరూపమునందు రజస్తమోగుణములు లేవు. సత్త్వరజస్తమోగుణముల ప్రవాహమైన ఈ సంసారము ఇంద్రజాలము (మాయాశక్తి యొక్క కార్యము). ఇది ఆత్మస్వరూపము యొక్క అజ్ఞానముచే మాత్రమే అనుభవమునకు వచ్చును. ఇది నిన్ను బంధించదు.
ఓ ఈశ్వరా! లోభము, క్రోధము మొదలగు భావములు అజ్ఞానుల లక్షణములు. అవి అజ్ఞానము వలన పుట్టి సంసారమునకు హేతువులగును. అవి నీయందెక్కడనుండి వచ్చును? (నీయందు లేవు). అయిననూ, నీవు దుష్టులను శిక్షించి ధర్మమును కాపాడుటకై శిక్షను అమలు చేసెదవు.
ప్రాణులకు తండ్రివి, గురుడవు, అధీశ్వరుడవు నీవే. దండము (శిక్ష) ను చేపట్టిన, అతిక్రమించ శక్యము కాని కాలము నీవే. నీవు లీల కొరకై అవతారములనెత్తి, జగత్తునకు ప్రభువులమని గర్వించువారల గర్వమునడంచి, లోకమునకు (తద్ద్వారా వారికి) హితమును చేస్తూ ప్రవర్తిల్లెదవు.
నావంటి ఆజ్ఞానులు జగత్తునకు తామే ప్రభువులమని విర్రవీగెదరు. కాని, వారు కాలము (మృత్యువు) నకు భయపడెదరు. నీవైతే కాలము వలని భయము లేనివాడవు. నిన్ను చూచి వారు ఆ గర్వమును విడిచి పెట్టెదరు. గర్వము తొలగి వారు సత్పురుషుల దారిలో నడచెదరు. నీ లీల దుష్టులను కూడ శీక్షించి దారికి తెచ్చును.
ఓ ప్రభూ! ఒళ్లంతా అధికారగర్వము గలవాడనై నేను అపరాధమును చేసితిని. నీ మహిమను యెరుగని నా బుద్ధి వ్యామోహమును పొందెను. అట్టి సర్వేశ్వరుడవగు నీవు నన్ను క్షమించ దగును. నాకు ఈ పైన మరల ఇట్టి దుర్బుద్ధి కలుగకుండు గాక!
ఇంద్రియగోచరము కాని స్వరూపము గల ఓ దేవా! స్వార్ధపరులై భూమికి పెద్ద భారమైన జన్మ కలిగి సేనలను నడిపే దుష్టరాజులను వినాశము చేయుటకై నీవు ఈ భూలోకమునందవతరించితివి. మరియు, నీ తారము నీ పాదములను శరణు జొచ్చినవారికి క్షేమమును కలిగించును.
ఓ శ్రీకృష్ణ భగవానుడా! నీవు పూర్ణ పరమాత్మవు. వసుదేవపుత్రుడవగు నీవు యాదవులను, భక్తులను పాలించెదవు. నీకు అనేక నమస్కారములు.
కేవలజ్ఞానఘనుడవగు నీవు యథేచ్ఛగా అవతారములను స్వీకరించెదవు. సర్వకారణుడవైన సర్వమై యున్నావు. సకల ప్రాణులలో ఆత్మరూపుడవైన నీకు సమస్కారము.
ఓ భగవానుడా! గర్విష్ఠినగు నాకు తీవ్రమగు కోపము. గలదు. నా యజ్ఞము అడ్డుకొనబడగా, నేను గోకులమును నాశనము చేయుటకై ఈ విధముగా కుండపోత వానను, తుఫాను గాలులను కలిగించితిని.
ఓ ఈశ్వరా! నా ఉద్యమము వ్యర్థమై నా గర్వము నశించినది. నీవు నన్ను అనుగ్రహించితివి. నీవు ఈశ్వరుడవు, తండ్రివి, ఆత్మస్వరూపుడవు. నేను నిన్ను శరణు వేడుచున్నాను.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఇంద్రుడి విధముగా శ్రీకృష్ణ భగవానుని చక్కగా స్తుతించెను. అప్పుడాయన నవ్వి మేఘగర్జనపలె గంభీరమైన స్వరముతో ఇంద్రునితో నిట్లనెను.
శ్రీభగవానువాచ ।
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఓ ఇంద్రా! నీవు దేవరాజ్యముతో మిక్కిలి గర్వించి యుంటివి. నిన్ను అనుగ్రహించుటకే నేను యజ్ఞమునకు విఘాతమును కలిగించితిని. వలన నీవు నిత్యము నన్ను స్మరించెదవు.
జనులు అధికారము చే సంపదచే గర్వించి వివేకమును కోల్పోవుదురు. దండము చేతియందు పట్టుకొనియున్న నన్ను వారు తెలుసుకోరు. నేను ఎవరిని అనుగ్రహించ గోరెదనో, వారి సంపదలను పోగొట్టెదను.
ఓ ఇంద్రా! వెళ్లి నా ఆజ్ఞను పాలించుము. నీకు శుభము కలుగును. మీరు (లోకపాలకులు) గర్వమును విడనాడి ఏకాగ్రచిత్తముతో మీ అధికారము (బాధ్యత) లను నిర్వర్తించుడు.
గోపాలకుని రూపములోనున్న ఈశ్వరుడే శ్రీకృష్ణుడు. తరువాత ప్రశస్తమైన మనస్సు గల కామధేనువు తన సంతానమైన గోవులతో కూడి ఆయనను సంబోధించి ఇట్లు పలికెను.
సురభిరువాచ।
కామధేనువు ఇట్లు పలికెను --- ఓ శ్రీకృష్ణా! ఓ శ్రీకృష్ణా! నీవు గొప్ప యోగివి. సర్వమునకు ఆత్మవైన నీనుండియే జగత్తు పుట్టినది. నీకు స్వరూపచ్యుతి లేదు. లోకములకు ప్రభువగు నీవే మాకు రక్షకుడవు.
నీవు మా పరమదైవము. ఓ జగన్నాథా! నీవే మా ఇంద్రుడవు (ఈశ్వరుడవు). నీవు గోవులకు, వేదవేత్తలకు, దేవతలకు, సత్పురుషులు ఎవరు గలరో వారికి, క్షేమమును కలిగించుము.
జగత్తునకు ఆత్మయైన ఓ దేవా! బ్రహ్మదేవుని ప్రేరణను పొందిన మేము నిన్ను ఇంద్రునిగా అభిషేకించెదము. నీవు భూమి యొక్క బరువును పోగొట్టుటకై అనతరించితివి.
శ్రీ శుక ఉవాచ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా యదువంశోద్భవుడగు శ్రీకృష్ణుని సంబోధించి కామధేనువు తన పాలతో అభిషేకించెను. అదితి మొదలైన దేవమాతలు ప్రేరేపించగా, ఇంద్రుడు కూడ దేవర్షులతో కూడి ఐరావతగజము పైకి ఎత్తి పోసిన ఆకాశగంగ యొక్క జలములతో అభిషేకించి, గోవిందుడు (గోవులను కాపాడువాడు) అని బిరుదమునిచ్చెను.
అచటకు విచ్చేసిన దేవర్షి నారదుడు, తుంబురుడు, చిత్రరథుడు మొదలైన గంధర్వులు, విద్యాధరులు, సిద్ధులు, చారణులు జనుల పాపములను పోగొట్టే శ్రీహరి కీర్తిని గానము చేసిరి. అప్సరసలు ఆనందముతో కూడి నాట్యమాడిరి.
అప్పుడు దేవగణములలోని ప్రముఖులు ఆ శ్రీకృష్ణుని స్తుతించి అచ్చెరువును గొలిపే పూలవానలను కురిపించిరి. ముల్లోకములు మహానందమును పొందెను. ఆవులు భూమిపై పాల వరదను కలిగించినవి.
నదులు పలు రసముల జలప్రవాహములను, చెట్లు తేనెల ధారలను, దున్నకుండానే నేలలు పంటలను ప్రకటించగా, పర్వతములు తమలోని మణులను బాహ్యమునందు ప్రకటించినవి.
కురువంశీయుడవగు నాయనా! శ్రీకృష్ణుడు అభిషేకించబడగా, స్వభావము చేతనే క్రూరములైన పులి మొదలగు జంతువులు కూడ వైరమును విడిచి పెట్టినవి.
ఆ ఇంద్రుడీ విధముగా దేవతలు, గంధర్వులు మొదలగువారు చుట్టువారియుండగా, గోవులకు గోకులమునకు నాయకుడగు శ్రీకృష్ణుని గోవిందునిగా అభిషేకించెను. తరువాత ఆయన అనుమతి తీసుకొని స్వర్గమునకు వెళ్లెను.
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము
పూర్వార్ధములో కామధేనువు శ్రీకృష్ణుని గోవిందునిగా అభిషేకించుటను
వర్ణించే ఇరువది ఏడవ అధ్యాయము ముగిసినది (27).
Summary of chapter 27 of the Bhāgavata Mahā Purana is as follows:
Following the Govardhana incident, a thoroughly humbled King Indra descended secretly from Svargaloka accompanied by the celestial cow Surabhi. Approaching Śrī Kṛshṇa in a secluded area, Indra prostrated himself at Kṛshṇa's lotus feet, shedding tears of repentance and offering prayers acknowledging Kṛshṇa as the Supreme Controller (*Īśvara*) who chastises prideful devatās out of mercy. Surabhi cow showered Kṛshṇa with her milk, and Indra, along with Airāvata elephant, bathed Kṛshṇa with holy Gaṅgā water. On behalf of the devatās, Surabhi and Indra coronated Śrī Kṛshṇa with the divine title **Govinda**—the protector and lord of the cows, land, and senses.