భాగవత మహా పురాణము
31 - గోపికా గీతము
గోప్య ఊచుః ।
గోపికలిట్లు పలికిరి --- ఓ ప్రియుడా! నీ జన్మచే గోకులము స్వర్గాదులకంటె అధికముగా సర్వోత్కృష్టముగా నున్నది. ఎందుకంటే, లక్ష్మి శాశ్వతముగా ఇచటనే ఉంటున్నది. కాని, నీ కొరకు మాత్రమే ప్రాణములను ధరించియున్న (కొన ప్రాణము గల) నీ వారు దిక్కులలో నిన్ను వెదుకుచున్నారు. చూడుము (తెలుసుకో)!
ఓ ఆనందనాయకా! నీవు వరములనిచ్చువాడవు. మేము నీకు జీతము లేని దాసీలము. కాని, శరత్కాలములో చెరువునందు చక్కగా పుట్టి బాగా వికసించిన పద్మము యొక్క లోపలి సౌందర్యమును దొంగిలించిన చూపుతో నీవు మమ్ములను హింస పెట్టుచున్నావు. ఈ. లోకములో ఇది హత్య కాదా యేమి? (కత్తితో పొడిస్తేనే హత్య యగునా యేమి?)
ఓ పురుష శ్రేష్ఠా! కాలియుని విషపు నీటి వలన కలిగే నాశమునుండి, కొండ చిలువ రూపములోనున్న అఘాసురునినుండి, ఇంద్రుడు పంపిన గాలివాననుండి, తృణావర్తునినుండి, ఇంద్రుని వజ్రము (పిడుగుపాటు) కలిగిన అగ్నినుండి, వృషభాసురుని రూపములోనున్న అరిష్టమునుండి, మయుని పుత్రుడగు వ్యోమాసురునినుండి, అన్ని రకముల భయములనుండి నీవు మమ్ములను కాపాడితివి.
ఓ మిత్రనూ! నీవు గోపికయగు యశోద పుత్రుడవు కావు. నీవు సకల ప్రాణులలో మనోవృత్తుల సాక్షియగు పరమాత్మవు. బ్రహ్మదేవుడు జగత్తును రక్షించుటకై కోరగా నీవు యాదవుల వంశములో అవతరించితివి.
ఓ ప్రియుడా! నీవు వృష్టి వంశీయులలో శ్రేష్ఠుడవు. సంసారము వలన భయపడినవారు నీ పాదములను శరణు వేడినప్పుడు వారికి నీవు పద్మమువంటి చేతితో అభయమునిచ్చెదవు. లక్ష్మీదేవి చేతిని పట్టుకొని భక్తుల కోరికలనీడేర్చే నీ చేతిని మా తలపై నుంచుము.
ఓ మిత్రమా! నీవు గోకులమునందలి జనుల ఇడుములను బాపే వీరుడవు. నీ వారల గర్వమును పోనాడుటకు నీ చిరునవ్వు చాలును. నీ దాసీలమగు మాకు తప్పకుండా ఆనందమును కలిగించుము. అబలలమగు మాకు పద్మమువలె సుందరమైన నీ ముఖమును చూపుము.
శరణు జొచ్చిన ప్రాణుల పాపములను పోగొట్టే నీ పాదపద్మములు గడ్డిని మేసే పశువులను వెంబడించును. లక్ష్మీదేవికి నివాసమైన నీ పాద ములతో కాలియనాగుని పడగలను తొక్కితివి. నీ పాదములను మా వక్షః స్థలము పై నుంచి, మా హృదయములలోని తాపమును తొలగించుము.
ఓ వీరా! నీ కన్నులు పద్మములను పోలియున్నవి. మనోహరములగు వాక్యములు నీ మధురమగు వాక్కు పండితులను మెప్పించును. నీ ఆజ్ఞను పాలించే మేము అట్టి నీ వాక్కుచే మోహమును పొందితిమి. ఇట్టి మమ్ములను నీ అధరామృతముతో జీవింప జేయుము.
విద్వాంసులచే కొనియాడబడే నీ గాథ అనే అమృతము తాపసంతప్తులకు జీవితమునిచ్చును. నీ గాథ విన్నంత మాత్రాన పాపములను పోగొట్టి మంగళమును కలిగించును. మిక్కిలి సుందరము మరియు విస్తృతము అగు నీ కథామృతమును ఈ లోకములో ఏ జనులైతే వర్ణించెదరో, వారే గొప్ప దాతలు (జ్ఞానము కంటె గొప్ప దానము లేదు).
ఓ ప్రియా! నీవు మోసగాడవు. ధ్యానమాత్రముచే మంగళములనిచ్చే నీ నవ్వు, ప్రేమతో కూడిన చూపు, విహారము, హృదయమును తాకే ఏకాంతమునందలి ఏ నీ రహస్యసంకేతములు (వినోదవచనములు) గలవో అవి, మాకు నిశ్చయముగా మనస్తాపమును కలిగించుచున్నవి.
ఓ ప్రియ ప్రభూ! నీవు గోకులమునుండి ఆవులను మేపుతూ వెళ్లినప్పుడు పద్మమువలె అందమైన (కోమలమైన) నీ పాదములకు ధాన్యపు కంకులు (చిన్న రాళ్లు), దర్భగడ్డి, వాడి మొలకలు గుచ్చుకొని నొప్పి కలుగుననే తలపుతో మా మనస్సు అస్వస్థమగుచుండును.
ఓ వీరుడా! సాయంకాలము పద్మమువంటి నీ ముఖము రేగిన జుట్టుతో కప్పబడి దట్టని దుమ్ము కలిగియుండును. అట్టి నీ ముఖమును మాకు పలు మార్లు చూపించి మా మనస్సునందు ప్రేమను కలిగించుచున్నావు.
ఓ శ్రీకృష్ణా! నీవు మనస్సునందలి దుఃఖమును పోగొట్టి రమించెదవు. పద్మమువంటి నీ పాదములను నమస్కరించువారికి కోరికలీడేరును. పద్మమునుండి పుట్టిన బ్రహ్మదేవుని (లక్ష్మీదేవి) చే పూజించబడే నీ ఇప్పుడు భూలోకమునకు అలంకారమై యున్నది. మహానందదాయకమగు నీ పాదము విపత్తునందు ధ్యానించ దగినది. అట్టి నీ పాదమును మా హృదయములలో నిలుపుము.
ఓ వీరా! ప్రేమను పెంచి శోకమును పోగొట్టే నీ అధరామృతమును మాకిమ్ము. నీవు వేణునాదము చేయునప్పుడు వేణువును నీ అధరము బాగుగా ముద్దిడును. నీపై ప్రేమ కలిగిన మానవులకు ఇతరములపై రాగము మరుపునకు వచ్చును.
పగలు నీవు అడవికి వెళ్లినప్పుడు నిన్ను చూడలేని మాకు క్షణము యుగమువలె నుండును. వంకరలు తిరిగిన జుట్టుతో అందమైన నీ ముఖమును చూచే మా కళ్లకు రెప్పపాటును పెట్టిన బ్రహ్మదేవుడు మందబుద్ధి.
ఓ అచ్యుతా! నీవు మోసగాడవు. నీవు అందరికీ వినపడేలా చేసిన వేణుగానముచే మోహితులమై మేము భర్తలను, పుత్రులను, వంశమర్యాదలను, సోదరులను, బంధువులను కాదని నీ వద్దకు వచ్చితిమి. మేము వచ్చిన విషయము (సంగీతస్వరములు) నీకు తెలియను. రాత్రి పూట స్త్రీలను ఒంటరిగా ఎవడు విడిచి పెట్టును? (ఎవడైననూ విడిచిపెట్టడు).
ఏకాంతములో నీవు చేసే సంకేతపు పలుకులు, హృదయములో ప్రేమను కలిగించే నీ చిరునవ్వు ముఖము, ప్రేమ తోడి చూపు, లక్ష్మీ దేవికి నివాసమగు విశాల వక్షఃస్థలము - వీటిని చూచి మాకు అధికమగు ప్రేమ కలిగి, మనస్సు పలుమార్లు మోహమును పొందుచున్నది.
ఓయీ! నీ అవతారము గోకులవాసులకు, అడవియందు నివసించే మహర్షులకు దుఃఖములను పోగొట్టి, జగత్తునకు జగత్తునకు అతిశయముగా కల్యాణమును కలిగించును. మా హృదయములలో నీపై అనురాగము మెండు. మేము నీ వారము. మా హృదయముల పీడను నాశము చేసే ఔషధమును కొంచెమైననూ మా కొరకు విడిచి పెట్టుము.
ఓ ప్రియా! నీ పాదము పద్మము వలె సుకుమారమైనది. కావుననే, మేము దానిని కఠినమగు మా వక్షఃస్థలములపై భయపడుతూ మెల్లగా ధరించెదము. అట్టి పాదముతో నీవు అడవిలో తిరి గెదవు. వాడియైన రాళ్ల వలన నీ పాదమునకు నొప్పి కలుగుట లేదా? అని ఆలోచించి మా బుద్ధి భ్రమించుచున్నది. మాకు జీవితము నీవే సుమా!
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధములో గోపికా గీతమును
వర్ణించే ముప్పది ఒకటవ అధ్యాయము ముగిసినది (31).
Summary of chapter 31 of the Bhāgavata Mahā Purana is as follows:
Gathering on the sandy banks of the Yamunā, the gopīs wept bitterly and sang nineteen immortal verses known as the **Gopī-gīta** (*SB 10.31.1–19*). They glorified Kṛshṇa's birth as the supreme ornament of Vṛndāvana and recalled how He had repeatedly saved them from poison, demons, rain, and fear. They declared that His lotus feet, which tread gently upon the forest grass, are the sole shelter of their lives, and that hearing His divine pastimes is the life-giving nectar (*Kathāmṛtam*) for souls suffering in the material world. Begging Him to bestow His merciful glance and appear before them, their tearful prayers reached the apex of unalloyed devotional surrender.