భాగవత మహా పురాణము
83 - శ్రీకృష్ణుని భార్యలతో ద్రౌపది సంలాపము
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు చెప్పెను --- గోపికలకు ఉపదేష్ట, పరమలక్ష్యము శ్రీకృష్ణ భగవానుడే. ఆయన వారికి ఆ విధముగా ఆత్మతత్త్వమునుపదేశించి అనుగ్రహించెను. తరువాత ఆయన ధర్మరాజును, సకలమిత్రులను కుశలప్రశ్న వేసి పలకరించెను.
ఈ విధముగా జగన్నాథుడగు శ్రీకృష్ణ భగవానుడు వారిని కుశలప్రశ్న వేసి బాగుగా సత్కరించేను. వారి మనస్సులు హర్షముతో నిండెను. ఆయన పాదములను దర్శించుటచే వారి పాపములు నశించెను. వారు ఇట్లు బదులు చెప్పిరి.
ఓ ప్రభూ! మహాత్ముల మనస్సునుండి వాగింద్రియము ద్వారా ప్రసరించే నీ పాదపద్మముల తేనె (కథామృతము) దేహధారులకు దేహమును కలిగించిన అజ్ఞానమును పటాపంచలు చేయును. ఆ కథామృతమునెవ రైతే ఒకప్పుడైననూ నిండా పానము చేయుదురో, వారికి అమంగళమెక్కడిది?(ఉండదు).
బుద్ధి నిమిత్తముగా ఆత్మయందు జాగ్రత్స్వప్నసుషుప్తులనే మూడు అవస్థలు ఆరోపించబడును. నీవు ఆనందఘనము, అద్వయము అగు స్వరూపప్రకాశముచే అట్టి ఆరోపమును త్రోసిపుచ్చినావు. అప్రతిహతమగు చిచ్చక్తిస్వరూపుడవగు నీవు కాలము లుప్తమైన వేదములను రక్షించుటకై నీ యోగమాయచే ఆకారమును స్వీకరించి అవతరించినావు. దేహమనే గృహమునందు ఆత్మాభిమానమును విడిచి పెట్టి పరమహంసలచే ఆత్మరూపముగా పొందబడే నిన్నే నమస్కరించెదము.
ఋషిరువాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా జనులు పవిత్రమగు కీర్తి గలవారిలో సర్వాధికుడగు శ్రీకృష్ణ భగవానుని స్తుతించుచుండిరి. యాదవుల మరియు కురువంశీయుల భార్యలు ఒకచో గూడి, ముల్లోకములలో గానము చేయబడే గోవిందుని గాథలను ఒకరికొకరు చెప్పుకొనిరి. వాటిని నీకు వర్ణించి చెప్పెదను. వినుము.
ద్రౌపద్యువాచ ।
ద్రౌపది ఇట్లు పలికెను --- ఓ రుక్మిణీ! ఓ భద్రా! ఓ జాంబవతీ! ఓ సత్యా! ఓ సత్యభామా! ఓ కాలిందీ! ఓ శైబ్యా! ఓ రోహిణీ! (కృష్ణపత్నులలో ఒకామె) ఓ లక్ష్మణా! ఓ శ్రీకృష్ణ పత్నులారా! శ్రీకృష్ణ భగవానుడు తన మాయాశక్తిచే మానవులననుకరిస్తూ మిమ్ముల నేవిధముగా తాను వివాహమాడెను? ఈ విషయమును మాకు చెప్పుడు.
రుక్మిణ్యువాచ ।
రుక్మిణి యిట్లు పలికెను --- నన్ను చేదిరాజగు శిశుపాలునకిచ్చి వివాహము చేయుటకు ఆతని అనుయాయులగు రాజులు ధనుస్సులను సిద్ధము చేసుకొనిరి. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి, సింహము మేకల గొర్రెల మందనుండి తన భాగమును వలే, నన్ను తీసుకువెళ్లాను. జయించ శక్యము కాని రాజభటుల తలలపై ఆయన పాదధూళి అలంకారమాయెను. శోభకు నిలయమైన ఆయనయొక్క పాదమును నేను పూజించెదను గాక!
సత్యభామోవాచ ।
సత్యభామ ఇట్లు పలికెను --- నా తండ్రి సత్రాజిత్తు తన తమ్ముడు ప్ర సేనుని మరణముచే హృదయములో పరితాపమును చెంది, శ్రీకృష్ణుడే తమ్ముని చంపించి మణిని అపహరించినాడనే నిందను ఆయన పై వేసెను ఆయన ఆ అపకీర్తిని తుడిచివేయుటకై జాంబవంతుని జయించి మణిని తెచ్చెను. తరువాత నా తండ్రి ఆ అపరాధమునకు భయపడెను. ఆయన నన్ను ఇతరునకు ఇచ్చి వివాహము చేసెదనని ప్రతిజ్ఞ చేసియుండెను. అయిననూ, ఆయన నన్ను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేసెను.
జాంబవత్యువాచ ।
జాంబవతి ఇట్లు పలి కెను - నా తండ్రి ఈ శ్రీకృష్ణుడు తన ప్రభువు, దైవము, సీతయొక్క భర్త అగు శ్రీరాముడేనని సుతరాము గుర్తించలేక, ఈయనతో ఇరవై ఏడు దినములు నిరంతరముగా యుద్ధము చేసెను. అది మా తండ్రి బలమునకు పరీక్షయే ఆయెను. అప్పుడాయన ఈయనను గుర్తించి కాళ్లను పట్టుకొని, స్యమంతక మణితో బాటుగా నన్ను కూడ ఉపహారముగా సమర్పించెను. నేనీయనకు సేవకురాలను.
కాలింద్యువాచ ।
కాలింది ఇట్లు పలి కెను --- తన పాదములను స్పృశించవలెననే కోరికతో నేను తపస్సు చేయుచున్నానని తెలిసి శ్రీకృష్ణుడు మిత్రుడగు అర్జునునితో నా వద్దకు వచ్చి నన్ను వివాహమాడెను. నేను ఆయన ఇల్లు తుడిచే సేవకురాలను.
మిత్రవిందోవాచ ।
మిత్రవింద ఇట్లు పలికెను --- లక్ష్మీపతియగు శ్రీకృష్ణుడు స్వయంవరములో రాజులను, నాకు అప కారము చేసే నా సోదరులను (విందాదులను) జయించెను. ఆయన దగ్గర గా వచ్చి, సింహము కుక్కల గుంపునుండి తన భాగమును వలె, నన్ను సంపదలకు నిలయమగు తన ద్వారకానగరమునకు తీసుకువెళ్లాను. నాకు జన్మజన్మలయందు ఆయన పాదములను కడిగే భాగ్యము కలుగుగాక!
సత్యవాచ ।
సత్య ఇట్లు పలికెను --- మా తండ్రి నగ్నజిత్తు రాజుల పరాక్రమమును పరీక్షించుటకై ఏడు ఎద్దులను సంపాదించెను. అధికమగు బలము, పరాక్రమము, వాడి కొమ్ములు గల ఆ లోకప్రసిద్ధములైన ఎద్దులు వీరుల పొగరును అణచినవి. వాటిని శ్రీకృష్ణుడు వేగముగా అణచి పట్టి ఆడుకుంటూ, బాలురు మేకపిల్లలను వలే, కట్టివేసెను.
శ్రీకృష్ణుడీ విధముగా పరాక్రమమే కట్నముగా గల నన్ను వివాహమాడెను. సోతో బాటు పరిచారికలు, చతురంగసైన్యము వచ్చు చుండెను. ఆయన మార్గమునందు అడ్డు వచ్చిన రాజులను జయించి నన్ను తీసుకువెళ్లాను. నాకు ఆయన సేవ చేసే భాగ్యము కలుగుగాక!
భద్రోవాచ ।
భద్ర ఇట్లు పలికెను --- ఓ ద్రౌపదీ! నా తండ్రి మేనమామ కొడుకగు శ్రీకృష్ణుని తానే పిలిచి, ఆయనయందే మనస్సు గల నన్ను ఇచ్చి వివాహము చేసి, చెలికత్తెలతో బాటుగా అక్షౌహిణి సేనను యిచ్చెను.
కర్మలచే సంసారములో పరిభ్రమించుచున్న నాకు ప్రతి జన్మలో ఈ శ్రీకృష్ణుని పాదముల స్పర్శ కలుగుగాక! ఎందుకంటే, దానిచే నాకు పరమపురుషార్థమగు మోక్షము లభించును.
లక్ష్మణోవాచ ।
లక్ష్మణ ఇట్లు పలికెను. --- ఓ మహారాణీ! శ్రీకృష్ణ భగవానుని అవతారమును, లీలను నారదుడు గానము చేయగా పలుమార్లు విని, నా మనస్సు కూడ మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణునిపై లగ్నమయ్యెను. చేతియందు పద్మము గల లక్ష్మీదేవి బాగా విచారించి లోకపాలకులను విడిచి పెట్టి ఆయనను వరించెను గదా!
పతివ్రతయగు ఓ ద్రౌపదీ! నా తండ్రి బృహత్సేనుడని ప్రసిద్ది చెందినవాడు. ఆయనకు కుమార్తెనగు నాయందు ప్రేమ మెండు. ఆయన నా అభిమతమును తెలుసుకొని, నేను శ్రీకృష్ణుని చెట్టపట్టుట అనే విషయమై ఉపాయమును చేయించెను.
ఓ మహారాణీ! ఏ విధముగానైతే నీ స్వయంవరములో అర్జునుని పొందే కోరికతో మత్స్యయంత్రము చేయబడినదో, అదే విధముగా నా స్వయంవరములో కూడ చేయబడినది. ఈ చేపైతే బయటనుండి కప్పివేయబడి, కేవలము నీటియందు మాత్రమే కనబడును.
ఈ మత్స్యయంత్రమును గురించి విని సకలములైన శస్త్రాస్త్రముల రహస్యములు తెలిసిన రాజులు ఆచార్యులతో గూడి అన్ని వైపులనుండి వేల సంఖ్యలో మా తండ్రిగారి నగరమునకు విచ్చేసిరి.
మా తండ్రి వారినందరిని వారి పరాక్రమమునకు, వయస్సుకు తగ్గట్లుగా బాగా ఆదరించిరి. వారు నాయందే చిత్తము గలవారై, సభలో మత్స్యమును కొట్టుటకు ధనుర్బాణములను తీసుకొనిరి.
కొందరు ధనుస్సును చేతిలోకి తీసుకోని వారిత్రాడును సంధించుటకు శక్తి లేక విడిచి పెట్టిరి. కొందరు నారిత్రాడును అగ్రము వరకు గట్టిగా లాగి, ఆ ధనుస్సుచే కొట్టబడి క్రింద బడిరి.
జరాసంధుడు, అంబషనరేశుడు, చేదిరాజగు శిశుపాలుడు, భీముడు, దుర్యోధనుడు, కర్ణుడు అనే ఇతరవీరులు నారిత్రాడును ధనుస్సునకు తగిల్చిరే గాని, మత్స్యము ఉన్న చోటును కనుగొనలేకపోయిరి.
అర్జునుడు నీటిలో చేపయొక్క ప్రతిబింబమును చూచి, అది ఉన్న చోటును కూడ గుర్తించి, సంసిద్ధుడై బాణమును విడిచి పెట్టెను. ఆ బాణము చేపను స్పృశించెనే గాని, పడగొట్టలేదు.
గర్విష్ఠులైన రాజులు గర్వభంగమును పొంది వెనుదిరిగిరి. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ధనుస్సును తీసుకొని, అవలీలగా నారిని తగిల్చెను.
అది మిట్ట మధ్యాహ్నము. ఆయన ఆ ధనుస్సునందు బాణమును సంధించి చేపను నీటిలో ఒకేసారి చూచి బాణముతో కొట్టి పడగొట్టెను.
జయశబ్దముతో బాటుగా దేవదుందుభులు మ్రోగినవి. దేవతలు - ఆనందముతో పరవశులై భూమి పై పూల వానలను కురిపించిరి.
అప్పుడు నేను సిగ్గు పడుతూ చిరునవ్వు ముఖముతో సభాస్థానమును ప్రవేశించితిని. జుట్టుముడిలో పూల మాలను దురుముకున్న నేను నడుస్తూ ఉంటే కాలియందేలు నినదించుచుండెను. గొప్ప కొత్త పట్టు వస్త్రముల జతను కట్టుకొని కప్పుకున్న నేను. ఉజ్జ్వలముగా ప్రకాశించే బంగరు రత్నమాలను పట్టుకొనియుంటిని.
ప్రేమ నిండిన హృదయము గల నేను చల్లని చిరునవ్వుతో చుట్టూ ఉన్న రాజులపై చూపులను ప్రసరింప జేసి, మెల్లగా నా మాలను మురాసురుని సంహరించిన శ్రీకృష్ణ భగవానుని మెడలో వేసితిని. దట్టని ముంగురులు, కుండలముల కాంతులు పడుచున్న చెక్కిళ్లు గల ముఖమును పైకెత్తి ఆయనను చూచితిని.
అంతలో మద్దెళ్లు, డోళ్లు, శంఖములు, భేరీలు, తప్పెటలు మొదలైన వాద్యములు మ్రోగినవి. పాటగాళ్లు పాడగా, నటులు నాట్యకత్తెలు నాట్యమాడిరి.
ఓ ద్రౌపదీ! నేనీ విధముగా శ్రీకృష్ణ భగవానుని భర్తగా వరించితిని. కాని, అసూయ గల రాజులైన సేనానాయకులు కామనచే వివశులై నేను శ్రీకృష్ణుని వరించుటను సహించ రైరి.
అంతలో శ్రీకృష్ణ భగవానుడు కవచము వేసుకొని నాలుగు గొప్ప గుర్రములు పూన్చిన రథముపై నన్ను ఎక్కించెను. ఆయన శార్ ఙధనుస్సును పైకెత్తి యుద్ధమునందు నిలిచెను.
ఓ మహారాణీ! లేళ్లు చూచుచుండగా సింహము వలె, రాజులు చూచు చుండగా లెక్క చేయకుండా దారుకుడు బంగరు సామగ్రితో నిండిన రథమును తో లేను.
ఆ రాజులలో కొందరు యుద్ధప్రయత్నమును చేసి ధనుస్సులను పైకెత్తి పట్టుకొని దారిలో శ్రీకృష్ణుని, కుక్కలు, సింహమును వలే, అడ్డుకొనుటకై వెనుకనుండి తరుముకు వచ్చిరి.
యుద్దమునందు శార్ఙధనుస్సునుండి విడిచి పెట్టబడిన బాణముల గుంపులచే చేతులు, కాళ్లు, మెడలు తెగి కొందరు రాజులు నేల గూలిరి. మరి కొందరు పారిపోయిరి.
తరువాత యాదవప్రభుడగు శ్రీకృష్ణుడు ద్వారకానగరమును అచటి తన గృహమును, సూర్యుడు తన స్థానమైన అస్తపర్వతమును వలె, ప్రవేశించెను. భూలోకస్వర్గలోకములలో కొనియాడబడే ఆ నగరములో అలంకారములైన ధ్వజముల వస్త్రములు ఎండను ఆపుచున్నవి. అచట రంగు రంగుల తోరణములు కట్టబడెను.
నా తండ్రి బృహత్సేనుడు మిత్రులకు, సంబంధీకులకు, బంధువులకు గొప్ప విలువైన వస్త్రములను, భూషణములను, పర్యంకములు, ఆసనములు మొదలైన సామగ్రిని యిచ్చి సత్కరించెను.
నా తండ్రి పూర్ణుడగు శ్రీకృష్ణ భగవానునకు భక్తితో పరిచారికలను, సకలసంపదలను, పదాతులను, ఏనుగులను, రథములను, గుర్రములను, గొప్ప విలువైన ఆయుధములను ఇచ్చెను.
ఈ మేము సకలములైన ఆసక్తులనుండి విరక్తులమై తపస్సు చేసి ఆత్మారాముడగు ఆ శ్రీకృష్ణునకు సాక్షాత్తుగా ఇంటిలో పరిచారికలమైతిమి. ఇది నిశ్చయము.
మహిష్య ఊచుః ।
పదహారు వేల భార్యలు పలికిరి --- శ్రీకృష్ణ భగవానుడు పొందబడిన సకలకామనలు గలవాడు (పూర్ణుడు). నరకాసురుడు దిగ్విజయము చేస్తూ అనేకరొజులను జయించి వారి కుమార్తెలగు మమ్ములను బందీలను చేసెను. ఆ విషయము తెలిసి శ్రీకృష్ణుడు సైన్యముతో సహా నరకాసురుని సంహరించి, పిదప మమ్ములను విడిపించెను. మేము సంసారమునుండి విముక్తినిచ్చే ఆయన పాదమునే సర్వదా స్మరించెదము. మమ్ములనాయన వివాహమాడెను.
ఓ పతివ్రతా! మేము భూలోకసామ్రాజ్యమును గాని, ఇంద్రపదవిని గాని, ఆ రెండింటి భోగములను గాని, అష్ట సిద్ధులను గాని, బ్రహ్మపదమును గాని, మోక్షమును గాని, వైకుంఠమునైననూ కోరుట లేదు. గదాధారియగు ఈ శ్రీకృష్ణ భగవానుని పాదములు ధూళి లక్ష్మీదేవియొక్క స్తనములయందలి కుంకుమయొక్క పరిమళముచే సంపన్నమై యుండును. మేమా ధూళిని మాత్రమే కోరుచున్నాము.
పరబ్రహ్మస్వరూపుడగు శ్రీకృష్ణ భగవానుడు గోవులను మేపుచుండగా ఆయన పాదముల స్పర్శను గోపాలకులు, గోపికలు, బోయ స్త్రీలు, గడ్డి, తీగలు ఏ విధముగా కోరుచుందురో, అదే విధముగా మేము కూడ కోరుచున్నాము.
శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్దములో శ్రీకృష్ణుని భార్యలతో ద్రౌపది సంతాపమును వర్ణించే ఎనుబది మూడవ అధ్యాయము ముగిసినది (83).
Summary of chapter 83 of the Bhāgavata Mahā Purana is as follows:
During the Kurukshetra assembly, Queen Draupadī met Śrī Kṛshṇa's principal queens—Rukmiṇī, Satyabhāmā, Jāmbavatī, Kālindī, Mitravindā, Satyā, Bhadrā, and Lakshmaṇā—and asked how each of them had achieved the supreme fortune of marrying Svayam Bhagavān. Each queen narrated her personal history, describing Kṛshṇa's heroic victories over kings, bulls, and demons to win her hand. The queens expressed that they valued their position as servants at Kṛshṇa's lotus feet far above imperial thrones or celestial opulences.