66 - పౌండ్రకుని కాశిరాజుని ఉద్ధరించుట

శ్రీశుక ఉవాచ !

శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! బలరాముడు నందుని గోకులమునకు వెళ్లగా, అజ్ఞానియైన . కరూషదేశాధిపతి పౌండ్రకుడు తానే వాసుదేవుడనని శ్రీకృష్ణుని వద్దకు దూతను పం పెను.

భూమిపై అవతరించిన జగన్నాథుడగు వాసుదేవ భగవానుడవు నీవే, అని అవివేకులు ప్రోత్సహించగా, ఆతడు తానే శ్రీహరినని తలచేను.

పిల్లలు ఆటలో తమలో ఒకరిని రాజుగా కల్పించెదరు. వానికి రాజంటే ఏమీ తెలియదు. పౌండ్రకుడట్టి మూర్ఖుడు. ఆతనికి శ్రీకృష్ణుని మహిమ తెలియదు. ఆతడు ద్వారకయందున్న ఆయన వద్దకు దూతను పం పెను.

ఆ దూత ద్వారకకు వచ్చి సభలోనున్న శ్రీకృష్ణునకు పౌండ్రకరాజుయొక్క సందేశమును చెప్పెను. కలువ రేకులవంటి కన్నులు గల శ్రీకృష్ణుడు సర్వసమర్థుడు.

ప్రాణులను అనుగ్రహించుటకై అవతరించిన వాసుదేవుడను నేనొక్కడిని మాత్రమే; మరియొకడు కాదు. నీవు అసత్య మైన వాసు దేవుడనే బిరుదును విడిచి పెట్టుము.

ఓ యాదవా! నీవు మోహము వలన నా చిహ్నములను (చక్రము ఇత్యాదులు) ధరించుచున్నావు. నీవు వాటిని విడిచి పెట్టి నన్ను శరణు పొందుము. లేదా, నాతో యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము.

శ్రీశుక ఉవాచ

శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- మందబుద్దియగు పౌండ్రకుని ఆ బడాయి మాటలను విని అప్పుడు ఉగ్రసేనుడు, సాత్యకి మొదలైన సభాసదులు బిగ్గరగా నవ్విరి.

సభాసదుల పరిహాస ప్రసంగములైన పిదప శ్రీకృష్ణ భగవానుడు దూత ద్వారా పౌండ్రకునుద్దేశించి ఇట్లు పలికెను -- ఓరీ మూఢా! నీవే ఏ చిహ్నములను (ఎవరి ఆసరా) చూసుకొని ఈ విధముగా బడాయిలు పలుకుతున్నావో, వాటిని నీపై (నీ అనుయాయులపై) విడిచి పెట్ట గలను.

ఓరీ మూర్ఖ! నేను నిన్ను వధించినప్పుడు బడాయిలు చెప్పిన ఆ నోటిని వెళ్లబెట్టి యుద్ధభూమిలో పడి యుండెదవు. అప్పుడు నీ చుట్టూ రా బందులు, గ్రద్దలు, గవ్వ పక్షులు చేరును. నీవు కుక్కలకు శరణు కాగలవు.

ఈ విధమైన ఆ నిందావచనమునంతనూ దూత తన ప్రభువగు పౌండ్రకునికి నివేదించెను. శ్రీకృష్ణుడు కూడ రథము నెక్కి కాశీకి వెళ్లాను.

శ్రీకృష్ణుని యుద్దప్రయత్నము తెలిసి మహారథుడగు పౌండ్రకుడు కూడ రెండు అక్షౌహిణీల సేనతో గూడి వెంటనే పురమునుండి నిషమించెను.

ఓ పరీక్షిన్మహారాజా! ఆ పౌండ్రకుని మిత్రుడగు కాశీరాజు మూడు అక్షౌహిణులతో వెనుకనుండి రక్షిస్తూ అనుసరించెను. శ్రీకృష్ణ భగవానుడా పౌండ్రకుని చూచెను.

శంఖము, చక్రము, కత్తి, శార్బధనుస్సు, శ్రీవత్సము, కౌస్తుభ మాణిక్యము (నకిలీవి), వనమాల, పింఛము మొదలగువాటిని అలం కరించుకున్న పౌండ్రకుని శ్రీకృష్ణుడు ఆ చిహ్నములను బట్టి గుర్తు పట్టెను.

ఆ పౌండ్రకుడు జత పచ్చని పట్టు వస్త్రములను ధరించెను. ఆతని జెండా పై గరుడుడు (నకిలీ) ఉండెను. ఆతడు చవకబారు కిరీటమును, మకరాకృతి గల కుండలములను దాల్చెను.

రంగస్థలము పైనుండే నటుడు వలె తనను పోలిన నకిలీ వేషమును ధరించిన ఆ పౌండ్రకుని చూచి శ్రీకృష్ణ భగవానుడు విరగబడి నవ్వెను.

శత్రువులు శ్రీకృష్ణ భగవానుని శూలములు, గదలు, గుదియలు, బల్లెములు, ఖడ్గములు, ఈటెలు, చిల్లకోలలు, చురకత్తులు, అడ్డకత్తులు, బాణములు అనువాటితో కొట్టిరి.

ప్రళయకాలమునందు అగ్ని పలు రకముల ప్రాణులను వలె, శ్రీకృష్ణుడైతే ఆ పౌండ్రకకాశీరాజుల సైన్యమునకు గదలు, కత్తులు, చక్రము, బాణములతో అధికముగా పీడను కలిగించెను. ఆ సైన్యమునందు ఏనుగులు, రథములు, గుర్రములు, పదాతులు గలరు.

ఆ యుద్ధరంగము చక్రముచే ముక్కలుగా చేయబడిన రథములు, గుర్ర ములు, ఏనుగులు, పదాతులు, గాడిదలు, ఒంటేలతో వ్యాప్తమయ్యెను. భూతనాథుడగు రుద్రుని భయంకరమగు క్రీడాస్థలమును పోలిన ఆ యుద్ధస్థలము శూరులకు హర్షమును కలిగిస్తూ ప్రకాశించెను.

తరువాత శ్రీకృష్ణుడు పౌండ్రకునితో నిట్లు పలికెను -- ఓయీ పౌండ్రకా! నీవు దూతవాక్యము ద్వారా వేటిని విడిచి పెట్టమని నాకు కబురు పెట్టితివో, ఆ అస్త్రములను నీపై విడిచి పెట్టుచున్నాను.

ఓరీ మూర్జా! నీవు నా పేరును కపటముతో పెట్టుకుంటివి. ఇప్పుడు నీవా పేరును విడిచి పెట్టునట్లు చేసెదను. నాకు యుద్ధము పై ఇచ్ఛ లేకున్నచో, నిన్ను ఈనాడు శరణు వేడెదను.

శ్రీకృష్ణుడీ విధముగా పౌండ్రకుని తిరస్కరించి వాడి బాణములతో రథహీనునిగా చేసెను. అపుడాయన, ఇంద్రుడు వజ్రముతో పర్వతశిఖరమును వలె, చక్రముతో వాని తలను నరి కెను.

అదే విధముగా ఆయన రెక్కల బాణములతో కాశీరాజు తలను మొండెమునుండీ ఊడగొట్టి, పద్మపు మొగ్గను వాయువు వలె, కాశీనగరములో పడునట్లు చేసెను.

శ్రీకృష్ణ భగవానుడీ విధముగా తన ఉత్కర్షను సహించలేని పౌండ్రకుని, వాని మిత్రుడగు కాశీరాజును సంహరించెను. ఆయన అమృతమువంటి తన కీర్తిని సిద్ధులు గానము చేయుచుండగా, ద్వారకలో ప్రవేశించెను.

ఓ రాజా! ఆ పౌండ్రకుడు ఎల్లవేళలా శ్రీకృష్ణ భగవానుని ధ్యానించుట వలన ఆతని సకలబంధములు ధ్వస్తమయ్యెను. పైగా, ఆతడు ఆయన రూపమునే ధరించెను. ఆతడు భగవంతునిలో విలీనమయ్యెను.

రాజద్వారము పై కుండలములతో కూడిన తల పడేను. దానిని చూచి జనులకు, ఇది యేమి? ఇది ఎవని తల? అనే సంశయములు కలిగెను.

ఆ తల కాశీరాజుదని తెలిసి ఆయన భార్యలు, పుత్రులు, బంధువులు, పురజనులు కూడ, అయ్యో! హతులమైతిమి, ఓ రాజా! ప్రభూ! ప్రభూ! అని బిగ్గరగా రోదించిరి.

సుదక్షిణుడనే ఆయన పుత్రుడు తండ్రికి ప్రేతకార్యములను చేసెను. అపుడాతడు, తండ్రిని చంపినవానిని చంపి తండ్రి ఋణమును తీర్చుకొనేదను, అని సంకల్పించేను.

సుదక్షిణుడు బుద్దీతో ఈ విధముగా నిశ్చయించి పురోహితునితో గూడినవాడై మహేశ్వరుని అతిశయించిన చిత్తేకాగ్రతతో ఆరాధించెను.

కాశీ క్షేత్రములో ఆరాధించిన ఆతనిపై శివభగవానుడు ప్రీతినీ జెంది వరమునిచ్చెను. ఆతడు తన తండ్రిని చంపినవానిని వధించే ఉపాయమును అభీష్టమైన వరమునుగా కోరుకొనెను.

బ్రాహ్మణులతో గూడి ఋత్విగ్రూపుడైన దక్షిణాగ్నిని అభిచార (శత్రువధ) ప్రయోగముతో ఆరాధించుము. ఆ అగ్ని ప్రమథగణములచే చుట్టువారబడి ప్రకటమగును. బ్రాహ్మణభక్తుడు కానివానియందు ప్రయోగించినచో, ఆ అగ్ని నీ సంకల్పమును సాధించి పెట్టును, అని శివుడు ఆదేశించెను. ఆతడు ప్రతనిష్ఠ గలవాడై అదే విధముగా శ్రీకృష్ణుని పై అభిచార ప్రయోగమును చే సెను.

తరువాత అగ్నికుండమునుండి అగ్ని మిక్కిలి భయంకరమగు రూపు దాల్చి పైకి లేచెను. ఆయన జుట్టు, మీసము, గెడ్డము కాల్చిన రాగివలె నుండెను. ఆయన కళ్లనుండి మండే కొరివిలను వెళ్లగ్రక్కెను.

ఆ అగ్నిదేవుడు కోరలతో భయంకరమైన, కనుబొమలతో భయ పెట్టుచున్న క్రూరమైన ముఖమును కలిగియుండెను. ఆతడు తన నాలుకతో పెదవుల కొనలసాస్వాదిస్తూ మండుచుండెను. అతడు దిగంబరుడై త్రిశూలమును త్రిప్పుచుండెను.

తాటి చెట్టు పొడవు గల పాదములతో ఆతడు భూతలమును కంపింపజేయుచుండెను. ఆతడు దిక్కులను అధికముగ దహిస్తూ, ప్రమథగణములు చుట్టువారి రాగా, ద్వారక వైపునకు పరుగెత్తెను.

అభిచారమునకు చెందిన ఆ అగ్ని వచ్చుచుండగా చూచి ద్వారకా వాసులందరు, కార్చిచ్చును చూచిన జంతువులు వలె, భయపడిరి.

ఆ సమయములో శ్రీకృష్ణ భగవానుడు సభలో పాచికలాడుచుండెను. భయముతో కంగారు పడిన జనులు ఆయన వద్దకు వెళ్లి, ముల్లోకములను శాసించే ఓ ప్రభూ! నగరమును కాల్చి వేయుచున్న అగ్నినుండి రక్షించుము, రక్షించుము, అని మొర పెట్టిరి.

జనులు పడుతున్న ఆ కంగారును విని, తనవారల భయమును కూడ చూచి శరణాగతవత్సలుడగు శ్రీకృష్ణుడు గట్టిగా నవ్వి ఇట్లు పలికెను -- భయపడకుడు, నేను రక్షించెదను.

శ్రీకృష్ణ విభుడు సర్వమునకు లోపల, బయట కూడ సాక్షి యై తెలియును. ఆ అగ్ని మహేశ్వరుని సంహారకదేవతయని తెలిసి, ఆయన ప్రక్కనే ఉన్న చక్రమును దానిని నశింపజేయుమని ఆదేశించెను.

సుదర్శనమనే ఆ చక్రము మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణ భగవానుని ఆయుధము. అది కోటి సూర్యులను పోలి ఉజ్వలముగా ప్రకాశించేను. ప్రళయకాలమునందలి అగ్నియొక్క తేజస్సువంటి తేజస్సు గల ఆ చక్రము తన తేజస్సుచే ఆకాశమును, దిక్కులను, ద్యులోక భూలోకములను ప్రకాశింప జేసెను. అది ఆ అభిచారాగ్నిని పీడించెను.

ఓ రాజా! చక్రపాణియగు శ్రీకృష్ణ భగవానుని సుదర్శనాయుధము యొక్క బలము ఆ అభిచారాగ్నిని కొట్టి దాని ముఖమును విరుగకొట్టినది. ఆ అగ్ని అక్కడనుండి వెనుకకు మళ్లీ కాశీనగరమును చుట్టివచ్చి, సుదక్షిణుని, ఆతని ఋత్విక్కుల సమూహమును తగులబెట్టెను. ఎందుకంటే, ఆ అభిచారాన్ని వారిచే సృష్టించబడినదే గదా!

ఆ విష్ణుచక్రము కూడ కృత్యాన్ని వెనుకనే కాశీపురములో ప్రవేశించెను. ఆ నగరములో ఒకటితోనొకటి కలిసి వేదికలు, సభలు, ఆలయములు, బజారులు, గోపురములు, బురుజులు, కొట్టములు, బొక్కసములు, ఏనుగులు, గుర్రములు, రథములు, అన్న క్షేత్రములు ఉండెను.

సుదర్శనమనే విష్ణుచక్రము కాశీనగరమునంతనూ తగులబెట్టి మరల లీలలను నెర పే (ఉదారచేష్టుడగు) శ్రీకృష్ణ భగవానుని వద్ద వచ్చి చేరెను.

శ్రీకృష్ణ భగవానుని కీర్తి గొప్పది. ఏ మానవుడైతే ఆయనయొక్క ఈ పరాక్రమమును గురించి ఏకాగ్రచిత్తముతో వినిపించునో, లేదా వినునో, అట్టివాని సకలపాపములు నిశ్శేషముగా నశించును.

శ్రీమద్భాగవతము పదవ స్కంధములో పౌండ్రక కాశిరాజుల ఉద్ధారమును వర్ణించే అరువది ఆరవ అధ్యాయము ముగిసినది.