భాగవత మహా పురాణము
21 - వేణు గీతము
శ్రీశుక ఉవాచ ।
బృందావనములోని సరస్సులలోని నీరు శరత్కాలము కారణముగా నిర్మలముగా నుండెను. వాటిలోని పద్మముల మీదనుండి వీచే గాలి వనమునంతనూ వ్యాపించెను. శ్రీకృష్ణ భగవానుడు గోవులతో, గోపాలకులతో గూడి ఇటువంటి వనమును ప్రవేశించెను.
మధువనప్రభుడగు శ్రీకృష్ణుడు బలరామునితో మరియు గోపాలకులతో కూడి గోవులను మేపుతూ బృందావనమును ప్రవేశించేను. ఆ వనములోని పుష్పించిన చెట్ల గుంపుల పంక్తులు, సరస్సులు, నదులు, పర్వతములు మత్తెక్కిన తుమ్మెదల మరియు పక్షుల గుంపుల ధ్వనులతో నిండి యుండెను. అప్పుడాయన పిల్లన గ్రోవిని వాయించెను.
గోకులమునందలి గోపికలు కొందరు ప్రేమను వర్దిల్ల జేసే శ్రీకృష్ణుని ఆ వేణుగానమును దగ్గరగా వినిరి. తరువాత వారు గోకులములోనే ఉండి వినలేకపోయిన తమ స్నేహితురాండ్రకు వర్ణించి చెప్పిరి.
ఓ పరీక్షిన్మహారాజా! గోపికలా వేణుగానమును వర్ణించుట మొదలిడిరి. ఇంతలో వారికి శ్రీకృష్ణుని చేష్టలు గుర్తుకు వచ్చి ప్రేమావేశముచే మనస్సు చెల్లాచెదరై వర్ణించ లేకపోయిరి.
గొప్ప నటుని శరీరమువంటి శరీరము గల శ్రీకృష్ణుడు తలపై నెమలి పింఛముల ఆభరణమును, రెండు చెవులయందు కొండగోగు పువ్వులను, బంగారము వలె పచ్చనైన వస్త్రమును, ఐదు రంగుల పువ్వులతో తయారైన మాలను ధరించెను. ఆయన పిల్లన గ్రోవిని మోవిపై ఆనించి చిల్లులను పూరించుచుండెను. గోపాలకులు గుంపులుగా చేరి ఆయన కీర్తిని పాడుచుండిరి. ఆయన తన కాలి గుర్తులచే రమ్యమైన బృందావనమును ప్రవేశించేను. (ఈ విధముగా గోపికలు స్మరించిరి).
ఓ పరీక్షిన్మహారాజా! ఈ విధముగా సకలప్రాణుల చిత్తమును దోచివేసే వేణుధ్వనిని గోకులములోని స్త్రీలందరు వినిరి. వారు కలుసుకున్నప్పుడు దానినే వర్ణిస్తూ ఒకరినొకరు కౌగిలించుకొనిరి.
గోప్య ఊచుః ।
గోపికలిట్లు పలికిరి --- ఓ చెలులారా! గోకులప్రభుడగు నందుని పుత్రులైన బలరామకృష్ణులు మిత్రులతో కలిసి పశువులను తోలుకుంటూ అడవిలో ప్రవేశించెదరు. వారిద్దరు తమను ప్రేమించే గోపాలకుల వైపు కటాక్షములను బరపుచుందురు. వారి పెదవుల పై వేణువు సిద్ధముగా నుండును. అట్టి వారి ముఖమును త్రాగుచున్నారా యన్నట్లు చూసినవారు పొందే ఆనందమేది గలదో, ఇదియే కన్నులు ఉన్నందులకు ఫలము. అంతకంటే గొప్ప ఫలము మాకైతే తెలియదు.
బలరామకృష్ణుల వస్త్రధారణము మామిడి చిగుళ్లు, నెమలి పింఛము, పూల గుత్తులు (తలపై), కలువలు (చెవులలో), పద్మములు (చేతిలో), పూల మాల (మెడలో) అనువాటితో మిళితమై అనేకములగు రంగులను కలిగియుండెను. వారు ఒకప్పుడు ఒకచోట గోపాలకుల సమావేశములో వారి మధ్యలో రంగస్థలమునందలి గొప్ప నటులు వలే పాడెడివారు.
ఓ గోపికలారా! ఈ పిల్లన గ్రోవి ఏమి పుణ్యమును చేసియుండును? ఎందుకంటే, ఇది గోపికల సొత్తెన దామోదరుని (నడుముకు కట్టబడిన త్రాడు గలవాడు) అధరామృతమును తాను తడి కూడ మిగలకుండా (తడి మాత్రమే మిగిలే విధముగా) ఆస్వాదించుచున్నది. ఈ వేణువు వచ్చిన వెదురు పొదలకు నీటిని ఇచ్చిన నదులకు ఆనందముతో శరీరము పై గగుర్పాటు (వికసించిన పద్మములు) కలుగుచున్నది. ఆ చెట్లు తమ వంశములో పుట్టిన వేణువును తలచుకొని కులవృద్దులు వలె ఆనందాశ్రువులను విడిచి పెట్టుచున్నవి.
ఓ చెలీ! బృందావనము భూలోకముయొక్క కీర్తిని విస్తరింప జేయుచున్నది. ఎందుకంటే, ఇచటి నేల దేవకీపుత్రుడగు శ్రీకృష్ణుని అడుగులలోని పద్మపు గుర్తుల శోభలు గలది. గోవులను కాచే నల్లనయ్యయొక్క వేణుగానమును విని మదించిన నెమళ్లు నాట్యము చేయుచుండగా, మిగిలిన ప్రాణులన్నియు కొండ చరియలయందు కదలిక లేకుండా ఆ నాట్యమును చూచుచున్నవి. (గానమును వినుచున్నవి).
ఈ ఆడు లేళ్లు వివేకము లేనివే ఐననూ, ధన్యములు గదా! ఎందుకంటే, ఇవి మగ లేళ్లతో కలిసి వేణుగానమును విని, రంగు రంగుల వేషమును దాల్చిన నందసూనుడగు శ్రీకృష్ణుని అనురాగపు చూపులతో చూస్తూ, ఆ చూపులే పుష్పములు కాగా పూజను చేసినవి.
శ్రీకృష్ణుని రూపము, స్వభావము యువతులకు ఉత్సాహమును కలిగించును. విమానముల పై వెళ్లే దేవతాస్త్రీలు ఆయనను చూచి, ఆయన వాయించిన వివిధస్వరముల వేణుగానమును కూడ విని . వ్యామోహమును పొందిరి. వారి ధైర్యమునకు మన్మథుడు పరీక్ష పెట్టినట్లాయెను. వారి జుట్టు ముడుల పూలు, కోకముడులు జారెను.
గోవులు గోపాలకుడగు శ్రీకృష్ణుని చూపు గుండా మనస్సులో ఆలింగనము చేసుకొని కళ్ల వెంబడి ఆనందబాష్పములను విడిచి పెట్టుచున్నవి. అవి శ్రీకృష్ణుని నోటినుండి వెలువడే వేణుగానమనే అమృత మును చెవుల దొప్పలను రిక్కించి పానము చేయుచున్నవి. దూడలు స్రవించే పొదుగు పాలు గుక్కెడు నోటిలోనుండ అటులనే నిలబడినవి.
అమ్మా! ఈ బృందావనమునందు పక్షులు ప్రకాశించే చిగుళ్లు గల చెట్టు కొమ్మలపై శ్రీకృష్ణుడు కనబడే విధంగా కూర్చుండి కళ్లు మూయకుండా ఇతరధ్వనులను కట్టిపెట్టి, ఆ శ్రీకృష్ణుని నోటినుండి వెలువడే వేణుగానమును వినుచుండును. ఆ గానముయొక్క మాధుర్యమును మాటలలో చెప్పుట వీలు కాదు. ఆశ్చర్యము! బహుశః ఆ పక్షులు మహర్షులే అయి ఉండును.
అప్పుడు నదులు మోక్ష ప్రదాతయగు ఆ శ్రీకృష్ణ భగవానుని వేణుగానమును శ్రద్దగా విన్నవి. వెంటనే అనురాగముచే వాటి వేగము కుంటు వడినదని వాటియందలి సుడిగుండములు సూచించుచున్నవి. ఆ నదులు కెరటములనే చేతులతో మురారి పాదముల జంటకు పద్మములను సమర్పించినవి. అవి ఆ కేరటములతో ఆయన పాదములను పట్టుకొని ఆలింగనముచే కప్పివేసినవి.
శ్రీకృష్ణుడు బలరామునితో, గోపాలకులతో కూడి గోకులముయొక్క పశువులను బాగుగా మేపుతూ, వాటి వెనుకనుండి వేణువును ఊదు చుండెను. తన మిత్రుడైన (తనతో సవర్ణుడైన) ఆయనను చూచి నీటితో నిండిన మేఘము ప్రేమతో పెద్దదయ్యెను. అది నింగి పైకి చేరి పూలవంటి నీటి బిందువులతో ఆయనను తడిపి తన దేహముతో గొడుగు పట్టెను.
బోయస్త్రీలు కృతార్థలు. ఎందుకంటే, వారికి గొప్ప కీర్తి గల శ్రీకృష్ణుని పద్మముల వంటి పాదముల ఎరుపుతో కూడి శోభిల్లిన కుంకుమ ఆయన నడచినప్పుడు గడ్డికి లగ్న మై లభించినది. అది ప్రియురాలగు గోపిక వక్షఃస్థలమునకు అలంకారమై ఆయన కాలికి తగుల్కున్న కుంకుము. దానిని చూడగానే వారి హృదయములలో ప్రేమ అనే హ్యాధి కలిగినది. దానిని వారు తమ ముఖములకు, స్తనములకు అందుకోని ఆ ప్రేమవ్యాధిని పోగొట్టుకొనిరి.
చెలియలారా! చూచేరా! ఈ గోవర్ధనపర్వతము శ్రీకృష్ణ భగవానుని భక్తులలో గొప్పది. ఎందుకంటే, ఇది బలరామకృష్ణుల పాదముల స్పర్శచే ఆనందముతో పొంగిపోవుచున్నది. పైగా, వారిద్దరు గోవులతో మరియు గోపాలకులతో కలిసి వచ్చినప్పుడు. వారి విశ్రాంతికి గుహలను, అందరికీ త్రాగే నీటిని, పశువులకు పచ్చని గడ్డిని, వారికి కందమూలఫలముల భోజనమును ఇచ్చి గొప్పగా సత్కరించుచున్నది.
ఓ చెలియలారా! గోపాలకులతో కూడి బలరామకృష్ణులు గోవులను .. ప్రతి అడవియందు నడిపించేదరు. (భుజములపై) ఆవుల కాళ్లను కట్టే త్రాళ్లతో వారిని గుర్తు పట్టవచ్చును. వారు వేణువులపై మధురములైన పదములను పలికిస్తూ ఉంటే (వినేవారికి) ఆనందము కలుగును. ఆ వేణుగానము దేహధారులలో చలనము గల పశుపక్ష్యాదులకు కదలని స్థితిని, కదలని చెట్టు చేమలకు గగుర్పాటు (కదిలే ప్రాణుల ధర్మము) ను, కలిగించుట విచిత్రమే.
బృందావనవిహారియగు శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రకారముగా అనేకలీలలను నేర పెను. గోపికలు వాటిని ఒకరితో నొకరు వర్ణించి చెప్పు తన్మయత్వమును పొందిరి.
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము పూర్వార్ధములో వేణుగీతమును వర్ణించే ఇరువది ఒకటవ అధ్యాయము ముగిసినది (21).
Summary of chapter 21 of the Bhāgavata Mahā Purana is as follows:
When the autumn season arrived, Śrī Kṛshṇa entered the forest of Vṛndāvana wearing a peacock feather crown, Karnikāra flowers behind His ears, a golden silk dhotī, and the Vaijayantī garland. As He played captivating melodies upon His bamboo flute (*Veṇu*), the sound vibrations echoed across the pastures. Hearing the music, the young cowherd maidens (*Gopīs*) gathered in groups and sang the celebrated Veṇu-gīta, expressing their deep love (*Prema*). They glorified the fortune of the peacock feather, the bamboo flute that drinks the nectar of Kṛshṇa's lips, the deer who offer worship with loving eyes, the rivers that freeze in ecstatic trance, and Govardhana Hill, which offers fresh water and pasture to Kṛshṇa's cows.