భాగవత మహా పురాణము
58 - శ్రీకృష్ణుడు కాలింది మొదలగువారిని పరిణయమాడుట
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- అతిశయించిన శోభ గల శ్రీకృష్ణ భగ వానుడు ఒకనాడు యుయుధానుడు, సాత్యకి మొదలగువారి చుట్టువారి రాగా, లోకప్రఖ్యాతులైన పాండవులను చూచుటకు ఇంద్రప్రస్థము వెళ్లాను.
దేహములోనికి ముఖ్యప్రాణము రాగానే కన్ను మొదలగు ఐదు ఇంద్రియములు చేతనములగును. అదే విధముగా మోక్ష ప్రదాత, సర్వేశ్వరుడు అగు శ్రీకృష్ణుడు వచ్చుచుండుటను గాంచి వీరులగు కుంతీపుత్రులు ఒక్కసారిగా లేచి నిలబడిరి.
వీరులగు పాండవులు శ్రీకృష్ణుని కౌగిలించిరి. ఆయన దేహముయొక్క స్పర్శచే వారి దోష (దుఃఖ) ములు దూరమయ్యెను. ప్రేమ నిండిన చిరు నవ్వుతో కూడిన ఆయన ముఖమును చూచి వారు ఆనందమును పొందిరి.
శ్రీకృష్ణుడు ధర్మరాజభీముల పాదములను నమస్కరించి అర్జునుని కౌగిలించగా, నకుల సహదేవులు ఆయనకు నమస్కరించిరి.
శ్రేష్ఠమగు ఆసనముపై కూర్చున్న శ్రీకృష్ణుని, కొత్తగా పెళ్లి అయి కొంచెము సిగ్గు పడుతున్న ద్రౌపది మెల్లగా వచ్చి నమస్కరించెను.
అదే విధముగా, పాండవులు సాత్యకిని, పూజించి నమస్కరించి, ఇతరులను కూడ పూజించిరి. వారు చుట్టూ ఆసనములలో కూర్చుండిరి.
ప్రశ్నించబడిన బంధువులు గలవాడు. .
శ్రీకృష్ణుడు కుంతిని కలిసి నమస్కరించెను. ఆమె అతిశయించిన ప్రేమచే కన్నులలో నీళ్లు నిండగా కౌగిలించి, బంధువుల క్షేమమును గురించి ప్రశ్నించెను. తన తండ్రి సోదరియగు ఆమెను, ఆమె కోడలు అగు ద్రౌపదిని కూడ శ్రీకృష్ణుడు కుశలమును అడిగి తెలుసుకొనెను.
ఆయా కష్టములు గుర్తుకు రాగా కుంతి కన్నులలో నీరు నిండెను. ప్రేమ వలని కంగారుచే ఆమె కంఠము బొంగురు వోయెను. తన దర్శనమునిచ్చి కష్టములను బాపే ఆ శ్రీకృష్ణునితో ఆమె యిట్లనెను.
ఓ శ్రీకృష్ణా! ఎప్పుడైతే నీవు బంధువులమగు మమ్ములను స్మరించి నా సోదరుడగు అక్రూరుని (క్షేమమునరయుటకై) పంపితివో, అప్పుడే మేము క్షేమము గలవారమైతిమి. మాకు నీవు నాథుడవైతివి,
నీవు జగత్తునకు హితకారివి, ఆత్మస్వరూపుడవు. నీకు నావారు, పరాయివారు అనే భ్రాంతి లేదు. అయినప్పటికీ, నిన్ను స్మరించువారల హృదయములో నీవు ఎల్లవేళలా ఉండి ఇడుముల బా పెదవు.
యుధిష్ఠిర ఉవాచ ।
ధర్మరాజు ఇట్లు పలి కెను --- ఓ సర్వేశ్వరా! మేమేమి పుణ్యమును చేసితిమో నాకు తెలియకున్నది. ఎందుకంటే, గొప్ప యోగులకు కూడ దర్శించుట కష్టమైన నీవు భోగపరాయణులమగు మాకు దర్శనమిచ్చితివి.
ధర్మరాజు ఈ విధముగా కోరగా, సర్వసమర్థుడగు శ్రీకృష్ణుడు వర్షకాలము నాల్గు మాసములు పూర్తిగా అక్కడనే గడి పెను. ఆయన ఇంద్రప్రస్థవాసుల కళ్లకు ఆనందమును కలిగించెను.
శత్రువీరులను సంహరించే అర్జునుడు ఒకనాడు కవచమును వేసుకొని శ్రీకృష్ణునితో గూడి రథమునెక్కి విహరించుటకై అడవిలో ప్రవేశించెను. ఆయన గాండీవధనుస్సును, తరిగిపోని అంబుల పొదులను కూడ తీసుకొని వెళ్లాను. ఆయన రథము పై ధ్వజమునందు కపిచిహ్నము ఉండును. ఆ గహనమైన అడవి అనేకక్రూరమృగములతో నిండియుండెను.
ఆతడా అడవిలో పెద్ద పులులు, అడవి పందులు, అడవి దున్నలు, దుప్పులు, మీగండ్ల మెకములు, గురుపోతులు, ఖడ్గమృగములు, జింకలు, కుందేళ్లు, ఏదుపందులు అనువాటిని వేటాడెను.
పర్వ (యజ్ఞ) కాలము సంప్రాప్తము కాగా, సేవకులా పశువులలో కర్మకు యోగ్యమైన వాటిని ధర్మరాజుగారి వద్దకు చేర్చిరి. అలిసిపోయిన అర్జునుడు. అధికమగు దప్పిక గలవాడై యమునానదికి వెళ్లాను.
మహారథికులగు శ్రీకృష్ణార్జునులా యమునలో స్నానమాడి మంచి నీరు త్రాగి, అక్కడ సంచరించుచున్న సుందరరూపిణియగు కన్యను చూచిరి. .
ఆ ఉత్తమయువతి గొప్ప సుందరి. ఆమె అందమైన మోము చక్కని దంతములతో ప్రకాశించెను. శ్రీకృష్ణుడు పంపగా అర్జునుడు ఆమె వద్దకు వెళ్లి ఇట్లు ప్రశ్నించెను.
ఓ సుందరీ! నీవేవతెవు? ఎవరిదానవు? ఎక్కడనుండి వచ్చితివి? ఓ కల్యాణీ! ఏమి చేయగోరుచున్నావు? నీవు భర్తను కోరుచున్నావని నాకు అనిపిస్తోంది. సర్వమును చెప్పుము.
కాలింద్యువాచ ।
కాలింది ఇట్లు పలికెను ... నేను సూర్యదేవుని కుమార్తెను. సర్వోత్తముడు, వరములనిచ్చువాడు అగు శ్రీహరిని భర్తగా పొందాలనే కోరికతో నేను కఠోరమగు తపస్సును చేయుచున్నాను.
ఓ వీరుడా! లక్ష్మీదేవికి నివాసస్థానమగు ఆ శ్రీహరిని తక్క నేను మరియొకనిని భర్తగా కోరను. మోక్ష ప్రదాత, అనాథలకు ఆశ్రయము ఆగు ఆ శ్రీహరి భగవానుడు నా యెడల ప్రీతిని జెందుగాక!
నన్ను కాలింది అంటారు. నేను యమునానదిలో మా తండ్రిచే నిర్మించ బడిన భవనములో శ్రీహరి దర్శనమయ్యేంతవరకు నివసించుచున్నాను.
నిద్రను నిర్జించిన అర్జునుడు ఆమె చెప్పిన విషయమును యథాతథముగా శ్రీకృష్ణునకు చెప్పెను. ఈ సంగతి శ్రీకృష్ణునకు ముందే తెలియును. ఆయన ఆమెను రథమెక్కించి ధర్మరాజు వద్దకు వెళ్లాను.
ఇదివరలో పాండవులు శ్రీకృష్ణునకు ఒక విన్నపమును చేసిరి. వెంటనే ఆయన విశ్వకర్మచే రంగు రంగుల నగరము (ఇంద్రప్రస్థములో భాగము) ను నిర్మింపజేసెను. ఆ నగరము గొప్ప ఆశ్చర్యమును కలిగించెను.
శ్రీకృష్ణ భగవానుడు తన ' వారైన పాండవులకు ఆనందమును కలిగించుటకై అక్కడ నివసిస్తూ, అగ్నికి ఖాండవమనే (ఇంద్రుని) అడవిని ఇచ్చుటకై అర్జునుని సారథి ఆయెను. "
ఓ పరీక్షిన్మహారాజా! సంతోషించిన అగ్నిదేవుడు అర్జునునకు ధనుస్సు, తెల్లని గుర్రములు, రథము, తరిగిపోని అంబుల పొదులు, ఆయుధ ధారులగు వీరులు పగులగొట్ట లేని కవచము అనువాటిని యిచ్చెను.
ఖాండవవనములోని దావాగ్నినుండి అర్జునుడు మయుని విడిపించేను. అప్పుడు మయుడు అర్జునునితో స్నేహము చేసి ఆతనికి సభను బహుమానముగా నిచ్చెను. ఆ సభయందే దుర్యోధనుడు నీటిని చూచి నేలయని, నేలను నీరుగను భ్రమపడెను.
అర్జునుని, ఇతరమిత్రుల (ధర్మరాజాదుల) అనుమతిని పొంది ఆ శ్రీకృష్ణుడు సాత్యకి మొదలగువారితో గూడి మరల ద్వారకకు వచ్చెను.
పరమమంగళస్వరూపుడగు శ్రీకృష్ణుడు తరువాత మిక్కిలి పవిత్రమగు ఋతువు, నక్షత్రము, గ్రహబలము గల ముహూర్తమునందు కాలిందిని వివాహమాడి తన వారలకు గొప్ప ఆనందమును విస్తరిల్ల జేసెను.
అవంతీదేశప్రభువులగు విందుడు, అనువిందుడు దుర్యోధనుని వశములో నుండే అనుచరులు. వారి సోదరి మిత్రవింద స్వయంవరములో శ్రీకృష్ణుని ప్రేమించగా, వారు అడ్డు పడిరి.
ఓ పరీక్షిన్మహారాజా! మిత్రవింద వసుదేవుని సోదరియగు రాజాధిదేవీ కుమార్తె. శ్రీకృష్ణుడు రాజులందరు చూచుచుండగా లెక్క చేయకుండా, ఆమెను బలాత్కారముగా తీసుకొని వెళ్లాను.
ఓ పరీక్షిన్మహారాజా! నగ్నజిత్తు అని ప్రసిద్ది గాంచిన గొప్ప ధార్మికుడు కోసలదేశమునకు ప్రభువుగా నుండెను. ఆయనకు నాగ్నజితి అని ప్రసిద్ది గాంచిన సత్యాదేవి అనే కుమార్తె ఉండెను.
నగ్నజిత్తు వద్ద ఏడు పొగరుబోతు ఎద్దులు గలవు. వాడి కొమ్ములు గల ఆ ఎద్దులు వీరపురుషుల గంధమునైననూ సహించకుండెడివి. వాటిని లొంగదీయుట సుతరాము శక్యము కాకుండెను. వాటిని జయించి సత్యను వివాహమాడవలెను. రాజులకు ఆ పని శక్యము కాలేదు.
ఎద్దులను లొంగదీసినవానిని మాత్రమే సత్య వివాహమాడునని భక్తపాలకుడు, యాదవప్రభుడు అగు శ్రీకృష్ణ భగవానుడు వినెను. ఆయన " పెద్ద సైన్యముతో కూడి కోసలరాజధానియగు అయోధ్యకు వెళ్లాను.
కోసలదేశప్రభుడగు ఆ నగ్నజిత్తు సంతోషముతో శ్రీకృష్ణునకు ఎదు రేగి తీసుకువచ్చి ఆసనము, అర్ఘ్యము మొదలగువాటితో పెద్ద సత్కారమును చేసెను. శ్రీకృష్ణుడు కూడ ఆయనను అభినందించేను.
లక్ష్మీపతియగు శ్రీకృష్ణ భగవానుని రాకను చూచి సత్య ఆయనను ప్రేమించెను. ఆమెకు నచ్చిన వరుడాయనయే. నేను నియమనిష్టలతో ఈయనను నా హృదయములో నిల్పి యున్నచో, ఈయన నాకు భర్త యై నా గొప్ప మనోరథములను యథార్థము చేయుగాక!(అని తలచెను).
శ్రీకృష్ణ భగవానుని పద్మములవంటి పాదముల ధూళిని లక్ష్మీదేవి, పద్మసంభవుడగు బ్రహ్మదేవుడు, కైలాసవాసియగు శివుడు, లోకపాలకులతో సహా తలపై దాల్చెదరు. ఆయన తాను సృష్టించిన ధర్మమర్యాదలను కాపాడుటకై లీలావతారములను దాల్చుచుండును. ఏ వ్రతము చే ఆయనకు నాపై ప్రీతి కలుగును?(ఊహించుట శక్యము కాదు).
శ్రీకృష్ణుని పూజించి నగ్నజిత్తిట్లనెను: ఓ నారాయణా! నీవు జగన్నాథుడవు. ఆత్మానందముతో పూర్ణుడవు అగు నీకు అల్పుడనగు "నేనేమి చేయుదును?
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- కురువంశనందనుడవగు ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణ భగవానుడు ఆనందముతో ఆసనమును స్వీకరించెను. ఆయన చిరునవ్వుతో మేఘగర్జనవంటి స్వరముతో ఆ రాజును ఉద్దేశించి ఇట్లు పలికెను. "
శ్రీభగవానువాచ ।
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఓ మహారాజా! స్వధర్మమును పాలించే అధమక్షత్రియునకు కూడ యాచన విద్వాంసులచే నిందించబడినది. అయినా నీతో బంధుత్వమునందలి ఇచ్చచే నేను నీ కుమార్తెను యాచించుచున్నాను. మేము కన్యాశుల్కమునిచ్చువారము కానే కాము.
రాజోవాచ ।
నగ్నజిన్మహారాజు ఇట్లు పలికెను --- ఓ ప్రభూ! ఈ లోకములో కన్యకు వరుడు నీకంటే గొప్పవానిని మరియొకనిని ఎవడు కోరును?.(ఎవ్వడూ కోరడు). సకలకల్యాణగుణములకు ఏకైకనిధానము నీవే. నీ దేహమునందు లక్ష్మీదేవి తొలగిపోకుండా నిత్యనివాసము చేయుచున్నది.
యదువంశీయులలో శ్రేష్ఠుడవగు ఓ శ్రీకృష్ణా! కానైతే కన్యకు వరుని పొందే కోరికతో పురుషుల పరాక్రమమును పరీక్షించుటకై మేము ఇదివరలో ఒక నియమమును పెట్టితిమి.
ఓ వీరా! ఈ ఏడు ఎద్దులను లొంగదీసి వశములోనికి తెచ్చుట చాల కష్టము. చాలమంది రాజకుమారులు అవయవములను విరుగకొట్టుకొని వీటిచే భంగపాటు చెందిరి.
యదువంశమునానందింప జేస్తున్న ఓ లక్ష్మీపతీ! ఈ ఎద్దులను నీవు నిగ్రహించినచో, నీవే నిశ్చయముగా నా కుమార్తెకు ప్రియమగు వరుడవు.
ఈ విధమైన నియమమును గురించి విన్న శ్రీకృష్ణ ప్రభుడు నడుము కట్టును బిగించెను. ఆయన తనను తాను ఏడు రూపములుగా మలుచుకొని, ఆ ఎద్దులను అవలీలగా వశము చేసుకొనెను.
శూరవంశీయుడగు శ్రీకృష్ణుడు ఆ ఎద్దుల పొగరునడంచి త్రాళ్లతో కట్టి, పిల్లవాడు చెక్కతో చేసిన బొమ్మలను వలె, సునాయాసముగా లాగేను.
తరువాత ఆ రాజు ఆనందాశ్చర్యములను పొంది శ్రీకృష్ణునకు కుమార్తెనిచ్చి వివాహము చేసెను. సర్వసమర్థుడగు శ్రీకృష్ణ భగవానుడు తనకు తగియున్న ఆమెను యథావిధిగా పాణిగ్రహణము చే సెను.
రాజకుమార్తెకు శ్రీకృష్ణుడు ప్రియుడైన భర్తగా లభించినందులకు రాజపత్నులు కూడ మహానందముతో గొప్ప ఉత్సవమును కూడ చేసిరి.
శంఖములు, భేరీలు, తప్పెటలు, వాద్యములతో బాటుగా పాటలు, వేద వేత్తల ఆశీస్సులు మారు మ్రోగినవి. మంచి వస్త్రములను, మాలలను ధరించిన స్త్రీలు, పురుషులు మహానందమును పొందిరి.
మహారాజు పది వేల పొడి ఆవులను, మెడలో హారములను మంచి వస్త్రములను దాల్చిన మూడు వేల చెలికత్తెలను కట్నము యిచ్చెను.
ఆ రాజు తొమ్మిది వేల ఏనుగులను, వాటికి వంద రెట్లు రథములను, వాటికీ వంద రెట్లు గుర్రములను, వాటికి వంద రెట్లు సైనికులను ఇచ్చెను.
కోసల దేశప్రభుడగు నగ్నజిత్తు ప్రేమతో ఆర్ద్రమైన హృదయము గలవాడై కొత్త దంపతులను రథమెక్కించి పెద్ద సేనతో బాటు పంపించెను.
పూర్వము యాదవులచే మరియు ఎద్దులచే భగ్నము చేయబడిన పరాక్రమము గల రాజులీ వృత్తాంతమును విని అధికమగు కోపముతో, పెళ్లి కూతురును దోడ్కొని వెళ్లుచున్న శ్రీకృష్ణుని దారిలో నిలువరించిరి.
బాణముల గుంపులను ప్రయోగిస్తున్న ఆ రాజులను గాండీవధారియగు అర్జునుడు, సింహము అల్పజంతువులను వలె, పారద్రోలి బంధువులకు ప్రీతిని కలిగించెను.
యదువంశశిరోమణి, దేవకీనందనుడు అగు శ్రీకృష్ణ భగవానుడు సత్యతో బాటుగా కట్నమును తీసుకొని ద్వారకకు వచ్చి రమించెను.
శ్రీకృష్ణుని తండ్రి సోదరియగు శ్రుతకీర్తి కేకయదేశపు రాణి. ఆమె కుమార్తెయగు భద్రను సోదరులగు సంతర్థనుడు మొదలగువారు సమర్పించగా శ్రీకృష్ణుడు వివాహమాడెను.
మద్రదేశపు రాజు బృహత్సేనుడు. ఆయన కుమార్తెయగు లక్ష్మణ మంచి లక్షణములు గలది. ఆ శ్రీకృష్ణుడొక్కడే ఆమెను స్వయంవరములో, గరుడుడు అమృతమును వలె, తీసుకు వెళ్లి వివాహమాడెను.
కృష్ణుడు భౌమాసురుని సంహరించి వాని అంతఃపురమునుండి సుందరమైన రూపము గల యువతులను వేలాదిమందిని తీసుకువచ్చి వివాహమాడెను. ఆ విధముగా ఆయనకు ఎందరో భార్యలు ఉండిరి.
శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధములో
శ్రీకృష్ణుడు కాళింది మొదలగువారిని వివాహమాడుటను వర్ణించే
ఏబది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (58).
Summary of chapter 58 of the Bhāgavata Mahā Purana is as follows:
While visiting Hastināpura to console the Pandavas after their escape from the lac house, Śrī Kṛshṇa walked along the Yamunā River and met Princess Kālindī (the personified Yamunā), who was performing penance to obtain Kṛshṇa as her husband. Kṛshṇa accepted her and brought her to Dvārakā. Later, Kṛshṇa wed Mitravindā, the princess of Avantī, heroically taking her from her svayaṁvara assembly. He then traveled to the Ayodhyā realm, where King Nagnajit promised his daughter Satyā to whoever could subdue seven fierce, unbridled bulls. Kṛshṇa expanded Himself into seven forms, easily subduing and binding the seven bulls simultaneously, marrying Satyā. Kṛshṇa subsequently married Bhadrā, the princess of Kekaya, and Lakshmaṇā, the princess of Madra, completing His marriages to his eight principal queens (*Ashṭa-bhāryā*).