భాగవత మహా పురాణము
11 - శ్రీకృష్ణుడు వత్సాసుర బకాసురులను ఉద్దరించుట
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను. --- కురువంశ శ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! నందుడు మొదలుగా గల గోపాలకులు ఆ రెండు చెట్లు పడుచున్న శబ్దమును విని, పిడుగు పడిన దేమోనని భయపడి, శంకతో కూడిన మనస్సుతో అక్కడకు వచ్చిరి.
అచట నేలపై పడియున్న రెండు చెట్లను వారు చూచిరి. త్రాటితో కట్టబడి రోలును లాగుచున్న బాలకృష్ణుడు ఎదురుగా కనబడుచునే యుండెను. కాని, ఆ చెట్ల పతనమునకు ఆయనయే కారణమని వారికి తెలియలేదు. ఆశ్చర్యమును గోల్పే ఈ పనిని చేసినదెవరు? దీనికి కారణ మేమి? అంటూ భయపడి, అది అపశకునమని వారు భ్రమను జెందిరి.
అడ్డముగా పడిన రోలును లాగుతూ చెట్ల మధ్యకు చేరిన ఈ బాలకృష్ణుడే వాటిని పడగొట్టినాడు. మేము ఇద్దరు పురుషులను కూడ చూచితిమి, అని పిల్లలు చెప్పిరి.
ఆ పిల్లవాడు రెండు చెట్లను ఆ విధముగా పడగొట్టుట సంభవము కాదు, అంటూ వారు ఆ మాటను నమ్మలేదు. కాని, కొందరికైతే మనస్సులో (బాలకృష్ణుని పనే అని) సందేహము కలిగెను.
త్రాటితో కట్టబడి రోలును లాగుచున్న తన పుత్రుని చూచిన నందునకు నవ్వు ముంచుకు వచ్చెను. ఆయన ఆతనిని కట్టునుండి విడిపించెను.
శ్రీకృష్ణ భగవానుడు మామూలు పిల్లవాని వలె ఆ గోపికలకు చెక్క యంత్రము వలె వశమయ్యెను. ఆయన ఒకప్పుడు వారు ప్రోత్సహించుచుండగా నాట్యమాడెను. మరియొకప్పుడు బిగ్గరగా పాడెను.
ఒకప్పుడు గోపికలాజ్ఞాపించగా పీటను, కుంచమును, పాదుకను మోసుకువచ్చును. మరియొకప్పుడు చూచువారందరికి ప్రీతిని కలిగిస్తూ జబ్బలు చరుచుకొనును.
లోకమునందు భగవంతుని మహిమనెరింగినవారలకు తాను భక్తులకు వశుడై యుండెదనని నిరూపించువాడై, శ్రీకృష్ణభగవానుడు తన బాల్య లీలలతో గోకులము వారికి నిశ్చయముగా హర్షమును కలిగించెను.
పళ్లను అమ్మే స్త్రీ, ఓయీ! పళ్లను కొనుక్కో, అని కేక పెట్టెను. ఆ మాట అందరికీ కర్మఫలములనిచ్చే శ్రీకృష్ణ భగవానుని చెవిన పడెను. ఆయన పళ్లను కోరి వెంటనే వడ్లను తీసుకొని (ఆమె వద్దకు) వెళ్లాను.
ఆ శ్రీకృష్ణుడు దోసిలిలోని ధాన్యమును ఒలకబోసుకుంటూ తీసుకువెళ్లాను. ఆమె ఆ మిగిలిన ధాన్యమును తీసుకొని బుట్టలో వేసుకొని, ఆతని రెండు చేతుల నిండా పళ్లను ఇచ్చేను.(తరువాత చూస్తే) ఆమె బుట్ట కూడ రత్నములతో నిండి యుండెను.
మద్ది చెట్లను కూలగొట్టిన బాలకృష్ణుడు బలరామునితో మరియు గోపబాలకులతో కూడి యమునానదీతీరమున అదే పనిగా ఆడుచుండెను. అప్పుడు రోహిణీదేవి వారిద్దరిని పిలిచెను.
రోహిణి పిలిచిననూ ఆ బాలకులిద్దరు ఆటయందు నిమగ్నులై యుండుటచే దగ్గరకు రాలేదు. అప్పుడు ఆమె పుత్రులయందు వాత్సల్యము గల యశోదను పం పెను. -
శ్రీకృష్ణుడు అన్నతో కూడి పిల్లలతో వేళ దాటి ఆడుచుండెను. పుత్రునియందలి ప్రేమతో స్రవించే స్తనములు గల యశోద పుత్రుని పలుమార్లు పిలిచెను.
ఓ కృష్ణా! కృష్ణా! నీ కన్నులు పద్మములను పోలియున్నవి. బాబూ! అబ్బాయీ! రమ్ము. పాలను త్రాగుము. విహారములు చాలును. నీవు ఆకలితో చిక్కి, ఆటలతో అలసి ఉన్నావు.
ఓ రామా! బాబూ! నీవు వంశమునానందింప జేయువాడవు. తమ్మునితో కూడి వెంటనే రమ్ము, నీవు ఉదయము మాత్రమే ఆహారమును తీసుకుంటివి. కావున, నీవు భోజనము చేయ తగుదువు,
దాశార్హవంశములో పుట్టిన కృష్ణా! గోకులప్రభువగు నందుడు భోజనము చేయకుండా నీ కొరకు ఎదురు చూచుచున్నాడు. రమ్ము. మా యిద్దరికి ప్రీతిని కలిగించుము. ఓ పిల్లలారా! మీ ఇళ్లకు వెళ్లుడు.
అబ్బాయీ! నీ దేహము దుమ్ముతో బూడిదరంగు వచ్చినది. స్నానము చేయుము. ఈ రోజు నీ జన్మనక్షత్రము. శుచివై వేదవేత్తలకు గోవులను దానము చేయుము.
నీ మిత్రులను చూడుము. వారిని వారి తల్లులు స్నానము చేయించి చక్కగా అలంకరించినారు. చూడుము. నీవు కూడ స్నానము చేసి భోజనము చేసి చక్కగా అలంకరింప జేసుకొని విహరించుము.
ఓ పరీక్షిన్మహారాజా! ఈ విధముగా యశోద మనస్సు ప్రేమచే కట్టివేయబడెను. ఆమె సర్వులలో పూజనీయుడగు శ్రీహరిని తన పుత్రునిగా తలపోసెను. ఆమె బలరామునితో గూడియున్న ఆ శ్రీకృష్ణుని చెయ్యి పట్టుకొని తన యింటికి తీసుకువెళ్లి, స్నానము మొదలగు మంగళకృత్యములను చేసెను.
నందుడు మొదలైన గోపాలకులలోని పెద్దలకు మహావనములో పెద్ద అపశకునములు అనుభవమునకు వచ్చెను. వారు సమావేశమై గోకులమునకు చేయదగిన పనిని గురించి సంప్రదించిరి.
వారిలో ఉపనందుడని ప్రసిద్ది చెందిన గోపాలకుడు కలడు. ఆయన జ్ఞానముచే మరియు వయస్సుచే పెద్ద. ఏ దేశకాలములలో - ఏ ప్రయోజనము సిద్ధించుననే తత్త్వము ఆయనకు యేరుకయే. బలరామకృష్ణులిద్దరికీ ప్రియమును చేసే ఆయన ఇట్లు పలికెను.
మనము గోకులముయొక్క హితమును కోరేటట్లైతే, ఇక్కడనుండి నివాసమును మార్చవలెను. ఏలయన, ఇక్కడ పిల్లల వినాశమునకు కారణమయ్యే పెద్ద అపశకునములు కలుగుచున్నవి. .
ఎందుకంటే, ఈ బాలకృష్ణుడు అతికష్టము మీద పిల్లలను చంపే రాక్షసినుండి విముక్తిని పొందినాడు, పైగా, బండి మీద పడలేదంటే అది నిశ్చయముగా శ్రీహరి అనుగ్రహమే.
ఈ బాలకృష్ణుని సుడిగాలి రూపములోనున్న రాక్షసుడు పక్షులకు నెలవైన ఆకాశములోనికి తీసుకువెళ్లి రాతిపై పడవైచినాడు. అప్పుడు
రెండు చెట్ల మధ్య చేరి కూడా ఈ బాలకృష్ణుడు గాని, లేదా ఇంకో పిల్లవాడు గాని మరణించలేదంటే, అది శ్రీహరి చేసిన రక్షణమే.
అపశకునములు కలిగించే ఆపద గోకులమును స్పృశించక (పీడించక) ముందే, మనము అనుచరులతో కూడి పిల్లలను తోడ్కొని ఇక్కడనుండి మరియొక చోటికి వెళ్లేదము.
బృందావనమని ప్రసిద్ధి గాంచిన అడవి గలదు. అది పశువులకు హితమును చేగూర్చును. కొత్త చెట్ల గుంపులతో కూడిన ఆ వనములో గోపాలకులు, గోపికలు, గోవులు సుఖించెదరు. పవిత్రమగు కొండలు గల ఆ అడవిలో చెట్లు, గడ్డి, ఓషధులు సమృద్ధిగా గలవు.
కావున, మీకు అంగీకారమైనచో, ఈనాడే అచటకు వెళ్లేదము. బళ్లను కట్టుడు. విలంబము వద్దు. మన సంపద గోవులు ముందు నడువవలెను.
ఆ మాటను విని గోపాలకులందరు బాగు బాగు అంటూ ఏకగ్రీవముగా అంగీకరించిరి. వారు తమ తమ బళ్ల గుంపులను కూడగట్టుకొని సామగ్రిని ఎక్కించుకొని వెళ్లిరి.
ఓ పరీక్షిన్మహారాజా! గోపాలకులు వృద్దులను, పిల్లలను, స్త్రీలను, సకలసామగ్రిని బళ్లలోకి ఎక్కించి, ధనుస్సులను పట్టుకొని, సంసిద్ధులైరి.
గోపాలకులు పురోహితునితో గూడి వారి సంపదయైన గోవులను ముందడికొని వెళ్లిరి. అన్ని వైపులనుండి కొమ్ము బూరాలను పూరించిరి. వాద్యముల ధ్వనిని అధికముగా చేసిరి.
వక్షఃస్థలముపై కొత్త కుంకుమ (సుగంధ ద్రవ్యము) ను దాల్చిన గోపికలు కొత్త కోకలను కట్టి మెడలయందు బంగరు పదకములను పెట్టు కొని రథములనెక్కి ఆనందముతో బాలకృష్ణుని లీలలను గానము చేసిరి.
అదే విధముగా యశోద, రోహిణి బలరామ కృష్ణులతో కలిసి ఒకే బండి ఎక్కిరి. వారిద్దరి గాథలను వినాలనే ఉత్కంఠతో వారు ప్రకాశించిరి.
కాలములన్నింటియందు వాతావరణము సుఖముగా ఉండే బృందావనమును ప్రవేశించి, వారు (ఆ నాటికి) గోకులనివాసమును బళ్లతో అర్ధచంద్రాకారముగా చేసిరి.
ఓ పరీక్షిన్మహారాజా! బృందావనమును, గోవర్ధన పర్వతమును, యమునానదియొక్క ఇసుకతిన్నెలను చూచి బలరామకృష్ణులకు గొప్ప ఆనందము కలిగెను.
ఈ విధముగా పిల్లల చేష్టలతో, తీయ్యని మాటలతో బృందావన వాసులకు ఆనందమును కలిగించే బలరామ శ్రీకృష్ణులు తగిన వయస్సు రాగానే దూడలను కాపాడే (మేపే) పనిని చేపట్టిరి.
రామకృష్ణులు పలురకముల ఆటవస్తువులను తీసుకువెళ్లి గోపాల బాలకులతో బాటుగా బృందావనమునకు దగ్గరలో దూడలను మే పెడివారు.
ఒకప్పుడు (ఒకచోట) వారిద్దరు పిల్లనగ్రోవిని వాయించేదరు. మరియొకచోట ఉట్టిత్రాళ్లలో బెడ్డలను పెట్టి త్రిప్పి విసిరెదరు. ఇంకో సమయములో కాళ్లకు గజ్జెలు గట్టి నాట్యము చేసెదరు. మరియొకచోట గోపాలకులకు వస్త్రములను కప్పి వారిని ఆవులుగా ఎద్దులుగా కల్పించి, తామిద్దరు ఎద్దులుగా తయారై నినదిస్తూ ఒకరితో నొకరు పోటీ పడెదరు. పశువులననుకరించి కూస్తూ వారిద్దరు మామూలు పిల్లలవలె సంచరించిరి.
ఒకనాడు శ్రీకృష్ణ బలరాములు యమునానది ఒడ్డున తమ మిత్రులతో బాటు దూడలను మేపుచుండగా, వారిని చంపగోరి రాక్షసుడు వచ్చెను.
దూడ రూపముతో దూడల గుంపులో చేరిన రాక్షసుని శ్రీకృష్ణుడు బలదేవుని కొరకు చూపుతూ అమాయకుని వలె మెల్లగా దగ్గరకు వెళ్లాను.
శ్రీకృష్ణుడు ఆ రాక్షసుని రెండు వెనుక కాళ్లతో సహా తోకను పట్టుకొని గిర గిర త్రిప్పి వెలగచెట్టు పైకి విసి రేను. కాని ప్రాణములు త్రిప్పుచుండగనే పోయెను. దాని పెద్ద దేహము . వెలగకాయలను దుళ్లగొట్టుతూ క్రింద పడెను. .
ఆ రాక్షసుని చూచి ఆశ్చర్యపడిన గోపబాలకులు శ్రీకృష్ణుని, బాగు బాగు అని, కొనియాడిరి. దేవతలు కూడ చాల సంతోషించి పూలవానను కురిపించిరి.
సకలలోకముల ముఖ్యరక్షకులగు ఆ రామకృష్ణులు పశువుల కాపరులై చద్ది మూటను గట్టుకొని ఆవులను, దూడలను మేపుతూ విహరించిరి.
ఒకనాడు గోపాలకులందరు తమ తమ పశువుల గుంపులకు నీటిని త్రాగించుటకై నీటి చెరువు వద్దకు వెళ్లిరి. అచట వారు దూడలకు నీటిని త్రాగించి తాము కూడ త్రాగిరి.
ఆ గోపాలకులకు అచట పెద్ద ప్రాణి కూర్చుని కనబడెను. వజ్రముచే తెగగొట్టబడిన పర్వతమువలెనున్న దానిని చూచి వారు భయపడిరి.
అది కొంగ రూపమును దాల్చిన పెద్ద బలశాలియగు రాక్షసుడు. బకుడని ప్రసిద్ధి గాంచిన ఆ రాక్షసుని ముక్కు చాల పొడి గలది. అది వేగముగా వచ్చి శ్రీకృష్ణుని ముక్కుతో మ్రింగబోయెను.
పెద్ద కొంగ కృష్ణుని మ్రింగుచుండగా చూచిన బలరాముడు మొదలైన గోపబాలకులు, ప్రాణము పోయినప్పుడు ఇంద్రియములు వలే, స్పృహను కోల్పోయిరి.
జగత్తునకు తండ్రియగు బ్రహ్మదేవునకు కూడ తండ్రియైన శ్రీహరి గోపాలకుడగు నందుని కొడుకయ్యెను. ఆ బాలకృష్ణుడు దవడ మొదటికి చేరగానే నిప్పు వలె కాల్చివేయజొచ్చెను. అప్పుడా కొంగ ఆయనను బయటకు గ్రక్కివేసెను. ఆయనకు గాయమేమీ కాకపోవుటచే అతిశయించిన కోపమును పొందిన ఆ బకాసురుడు మరల ముక్కుతో పొడుచుటకు ఆయన మీదకు వచ్చెను.
సత్పురుషులకు రక్షకుడైన ఆ శ్రీకృష్ణుడు మీదకు వచ్చుచున్న బకాసురుని రెండు ముక్కులను రెండు చేతులతో పట్టుకుని నిలువరించెను. వాడు కంసుని మిత్రుడు. గోపబాలకులు చూచుచుండగా, ఆయన వాని నోటిని తుంగగడ్డి పోచను వలె చీల్చివేసి, దేవతలకు ఆనందమును కలిగించెను.
అప్పుడు స్వర్గలోకవాసులగు దేవతలు బకాసురసంహారకుడగు శ్రీకృష్ణునిపై నందనవనములోని. మల్లెలు మొదలైన పువ్వులను అధికముగా చల్లిరి. మరియు, తప్పెట్లను శంఖములను వాయిస్తూ చక్కటి స్తోత్రములతో బాగుగా స్తుతించిరి. ఇదంతా చూసి గోపాల బాలకులు స్మయమును పొందిరి.
బకాసురుని నోటినుండి విముక్తుడై శ్రీకృష్ణుడు తన చోటికి వచ్చేను. పైకి పోయిన ప్రాణశక్తి తిరిగి రాగా ఇంద్రియముల సముదాయము స్వస్థమగునట్లుగా, ఆతడు క్షేమముగా రాగా బలరాముడు మొదలైన గోపబాలకులు స్వస్థతను పొందిరి. వారాతనిని కౌగిలించుకొని, దూడలను. కోలుకుంటూ గోకులమునకు వచ్చి, ఆ వృత్తాంతమును కీర్తించిరి.
ఆ వృత్తాంతమును విని గోపాలకులు, గోపికలు కూడ ఆశ్చర్యపడి అతిశయించిన ప్రేమతో శ్రీకృష్ణునియందు ఆదరమును చూపిరి. మరణించి వచ్చినాడా యన్నట్లు వారు శ్రీకృష్ణుని ఆదుర్దాతో చూచిననూ, వారి కన్నులకు తనివి తీరలేదు.
ఆశ్చర్యము! చాలమంది ఈ బాలకృష్ణుని చంపవలెనని యత్నించిరి. అయ్యో! కాని, వారికే మృత్యువు కలిగెను. ఎందుకంటే, ఇదివరలో వారందరు ఇతరప్రాణులకు భయమును కలిగించిరి.
వారు భయమును గొల్పే రూపము గలవారే అయినా, ఈ బాలకృష్ణుని పరాభవించనే లేరు. ఈతనిని చంపాలనే కోరికతో దగ్గరకు వచ్చి, అగ్నియందు మీడుతలు వలె, వారు నశించెదరు.
ఆశ్చర్యము! బ్రహ్మవేత్తల మాటలు ఏనాడైననూ అసత్యము కావు. పూజనీయుడగు గర్గాచార్యుడు ఏ మాటను చెప్పినో, అది అదే విధముగా అనుభవమునకు వచ్చినది. .
ఈ విధముగా నందుడు మొదలుగా గల గోపాలకులు సరదాగా బలరామకృష్ణుల గాథలను చెప్పుకుంటూ ఆనందమును పొందిరి. వారికి సంసారదుఃఖము అనుభవమునకు రాలేదు.
ఈ విధముగా బలరామకృష్ణులు గోకులములో గోపబాలకులతో పాటు దాగుడుమూతలాడేడివారు. యమునానది ఒడ్డున ఇసుకలో ఉత్తుత్తి సేతువులను కట్టెడివారు. వారిద్దరు కోతులవలె గెంతుట, బంతులాట మొదలగు ఇట్టి- బాల్యమునకు చెందిన ఆటపాటలతో గోకులమునందు బాల్యావస్థను అధిగమించిరి.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్థములో శ్రీకృష్ణుడు వత్సాసుర బకాసురులను ఉద్ధరించుటను వర్ణించే పదకొండవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 11 of the Bhāgavata Mahā Purana is as follows:
Alarmed by the terrifying series of unnatural disturbances in Gokula—the destruction of Pūtanā, the handcart, the whirlwind, and the sudden fall of the giant Arjuna trees—Nanda Mahārāja and the elder cowherds held a council. Led by the wise Upananda, the community resolved to abandon Gokula and migrate to the sacred, lush forest of Vṛndāvana near Govardhana Hill and the Yamunā River. The cowherds packed their household belongings onto ox carts and journeyed to Vṛndāvana, constructing a secure crescent-shaped encampment. As Kṛshṇa and Balarāma reached six years of age, they were given charge of pasturing the young calves. One day, the demon Bakāsura, taking the form of a gigantic crane as large as a mountain peak, arrived at the riverbank and swallowed Kṛshṇa whole. Feeling His body burning like a blazing fire within his throat, the crane demon vomited Kṛshṇa out, whereupon Śrī Kṛshṇa seized the beak of the bird demon and tore it apart like a blade of grass.