భాగవత మహా పురాణము
45 - శ్రీకృష్ణ బలరాముల ఉపనయనము, గురుకుల ప్రవేశము, విద్యాధ్యయనము, గురుదక్షిణ
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి పలికెను --- తన యథార్థ స్వరూపము తల్లి దండ్రులకు తెలిసినదని శ్రీకృష్ణ భగవానుడు గమనించెను. అట్లు కారాదని తలచి ఆయన జనులను మోహ పెట్టే తన యోగమాయను విస్తరిల్ల జేసెను.
యదువంశ శ్రేష్ఠుడగు శ్రీకృష్ణుడు అన్నగారితో కలిసి తల్లిదండ్రుల వద్దకు వచ్చెను. ఆయన వినయముతో నమ్రుడై సాదరముగా అమ్మా! తండ్రీ! అని పిలుస్తూ, వారికి ప్రీతిని కలిగించెను.
తండ్రీ! పుత్రులమగు మా ఇద్దరి నిమిత్తముగా మీరు చాల ఆదుర్దాను అనుభవించిరి. అయిననూ, ఐదు ఏళ్లు, ఆరు ఏళ్లు, పది యేళ్లు వయస్సులలో పుత్రుల వలన కలిగే సుఖము మీ కేనాడు కలుగలేదు.
పిల్లలు తల్లిదండ్రుల ఇంటిలో ఉంటూ వారిచే లాలించబడుతూ ఆనందమును పొందెదరు. దైవవంచితులమైన మాకిద్దరికి మీ ఇద్దరి వద్ద నివాసము గాని, ఆ ఆనందము గాని లభించలేదు.
తల్లిదండ్రులు సకలపురుషార్థముల సాధనకు మూలమైన దేహమునకు జన్మనిచ్చి పోషించెదరు. కావున, మానవుడు వంద యేళ్ల జీవితమంతా సేవ చేసినా వారిద్దరి ఋణము తీరదు.
ఏ కొడుకైతే సమర్థుడై అట్టి తల్లిదండ్రులకు ధనమును వెచ్చించి సేవ చేసి జీవనాధారమును కల్పించడో, అట్టివాడు మరణించిన తరువాత నరకములో యమదూతలు వానికి వాని శరీరము యొక్క మాంసమునే తినిపించెదరు.
వృద్ధులైన తల్లిదండ్రులను, పతివ్రతయైన భార్యను, పిల్లవాడైన పుత్రుని, గురువును, వేదవేత్తను, శరణు పొందినవానిని కూడ సమర్థుడై ఉండి ఎవడు పోషించడో, అట్టివాడు గాలిని పీలుస్తున్నా మృతుడే.
అందువలన, ఎల్లవేళలా కంసుని వలన భయపడిన బుద్ధి గల మేమిద్దరము అసమర్థులమై మిమ్ములనిద్దరినీ పూజించకుండానే ఇంత కాలము వ్యర్థముగా గడిచిపోయినది.
ఓ తండ్రీ! తల్లీ! అందువలన, దుర్బుద్ధియగు కంసునిచే మిక్కిలి కేశమునకు గురిచేయబడిన మేమిద్దరము అస్వతంత్రులమై మీ ఇద్దరికి సేవను చేయకపోతిమి. మమ్ములను మీరు క్షమించ దగును.
శ్రీశుక ఉవాచ ।
ఇతి మాయామనుష్యస్య హరేర్విశ్వాత్మనో గిరా మోహితావంకమారోప్య పరిష్వజ్యాపతుర్ముదమ్ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- జగత్తునకు ఆత్మయైన శ్రీకృష్ణ భగవానుడు యోగమాయచే మానవుడైనాడు. ఆయన పలికిన పలికిన ఈ పలుకులకు తల్లిదండ్రులు మోహితు ఆతనిని ఒడిలో కూర్చుండబెట్టుకొని కౌగిలించుకొని ఆనందమును పొందిరి.
ఓ రాజా! వారిద్దరు తమ పుత్రులను కన్నీటి ధారలతో తడిపిరి. వారు అధికమగు మోహమును పొంది ప్రేమ అనే పాశముచే ఆవరించబడిరి. వారి కంఠము కన్నీటి వలన బొంగురుపోయి వారేమీ మాట లేడ లేదు.
దేవకీ పుత్రుడగు శ్రీకృష్ణ భగవానుడీ విధముగా తల్లిదండ్రులనోదార్చి, మాతామహుడగు ఉగ్రసేనుని యాదవులకు రాజునుగా చేసెను.
ఆయన ఉగ్రసేనునితో ఇట్లు పలికెను - ఓ మమ్ములను, ప్రజలను కూడ శాసించుడు. యయాతి యొక్క శాపము వలన యాదవులు రాజసింహాసనముపై కూర్చుండ రాదు. (కాని నా మాట వలన దోషము ఉండదు).
సేను సేవకుడనై మిమ్ములను సేవించుచుండగా, దేవతలు మొదలగువారు కూడ సత్కారములను తీసుకువచ్చెదరు. ఇతర నరపాలురు అట్లు చేయుదురని వేరుగా చెప్పవలయునా?
కంసునకు భయపడి యదు వృష్టి అంధక మధు దాశార్హ కుకుర సాత్వత ఇత్యాది వంశీయులు నాలుగు దిక్కులకు పారిపోయిరి. జగత్కారణుడగు శ్రీకృష్ణుడు తనకు జ్ఞాతులు, బంధువులు అగు వారినందరినీ రప్పించెను. విదేశములో నివాసముచే కృశించియున్న వారిని ఆయన బాగా సత్కరించి సంపదలతో తృప్తి పరచి వారి వారి గృహములలో నివసింప జేసెను.
యాదవులు శ్రీకృష్ణ బలరాముల భుజములచే రక్షించబడిరి. వారిద్దరి కారణముగా వారి మనోరథములు సఫలమై దుఃఖములు దూరమయ్యెను. వారు కృతార్థులై తమ గృహములయందు రమించిరి.
మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుని పద్మమువలె శోభిల్లే ముఖము ఎల్లవేళలా గొప్ప ఆనందమును కలిగియుండును. ఆయన సదా దయ, చిరునవ్వులతో కూడిన చూపులను బరపును. ఆయన ముఖమును ప్రతి దినము చూచి యాదవులు ప్రీతిని జెందిరి.
ఆ మథురలో మోక్ష దాతయగు శ్రీకృష్ణుని పద్మమువంటి ముఖము అనే అమృతమును కన్నులతో పానము చేసే వ్యక్తులు వయసు మళ్లినవారు కూడ గొప్ప శరీరబలము, ఇంద్రియపాటవము గల యువకులు అయిరి.
ఓ పరీక్షిన్మహారాజా! దేవకీ పుత్రుడగు శ్రీకృష్ణ భగవానుడు, శేషావతారమగు బలరాముడు కూడ తరువాత నందుని వద్దకు వెళ్లి ఆయనను కౌగిలించుకొని ఈ మాటను చెప్పిరి.
ఓ తండ్రీ! ప్రేమ గల మీరిద్దరు మమ్ములనిద్దరినీ అధికముగా పోషించి లాలించితిరి. ఎందుకంటే, తల్లిదండ్రులకు తమ శరీరము కంటే కూడ పుత్రులయందు ప్రేమ చాల ఎక్కువగా నుండును.
బంధువులు పోషించి రక్షించలేక విడిచి పెట్టిన పిల్లలను తమ పిల్లల వలె ఎవరైతే పోషించెదరో, వారే యథార్థమైన తల్లిదండ్రులగుదురు.
ఓ తండ్రీ! తమరు గోకులమునకు వెళ్లుడు. మేము ఆత్మబంధువులగు వసుదేవాదులకు సుఖమును కలిగించి మిమ్ములను చూచుటకు వచ్చెదము. మీరు ప్రేమచే దుఃఖితులగుదురని నాకు తెలియును.
శ్రీకృష్ణ భగవానుడీ విధముగా గోకులవాసులను, నందుని ఒప్పించి, వారిని ఆదరముతో వస్త్రములు, అలంకారములు, (పాలు పితికే) కంచు పాత్రలు, బళ్లు మొదలగు వాటినిచ్చి సత్కరించెను.
ప్రేమతో వ్యాకులుడైన నందుడు ఈ మాటలను విని వారిద్దరిని కౌగిలించుకొనెను. ఆయన కన్నులు నీటితో నిండిపోయెను. ఆయన గోపాలకులతో కూడి గోకులమునకు, వెళ్లెను.
ఓ పరీక్షిన్మహారాజా! తరువాత శూరుని పుత్రుడగు వసుదేవుడు పుత్రులిద్దరికి పురోహితునిచే, వేదవేత్తలచే యథావిధిగా ఉపసయన సంస్కారమును బాగుగా చేయించెను.
ఆయన వేదవేత్తలను బాగా అలంకారములతో సత్కరించి దక్షిణలను, చూడలతో కూడిన గోవులను ఇచ్చెను. ఆ గోవులు బంగరు మాలలు, పట్టు వస్త్రములు, పుష్పమాలలతో చక్కగా అలంకరించబడెను.
శ్రీకృష్ణుడు, బలరాముడు పుట్టిన నక్షత్రములయందు వసుదేవుడు మానసికముగా గోవులను దానము చేసెను. గొప్ప ఉదారస్వభావము గల ఆయన ఆ విషయమును తరువాత గుర్తు చేసుకొని వాటిని దానము చేసెను. ఆ గోవులు కంసుడు అధర్మముగా ఆయననుండి లాగుకున్నవి.
ఉపనయన సంస్కారము రెండవ జన్మ. దానిని పొందిన తరువాత మంచి నియమనిష్ఠలు గల వారిద్దరు యాదవవంశమునకు ఆచార్యుడైన గర్గుని వద్ద గాయత్రీ మంత్రోపదేశముతో ఆరంభమయ్యే బ్రహ్మచర్య వ్రతమును స్వీకరించిరి.
వారిద్దరు సకలవిద్యలకు ఉత్పత్తి స్థానములు, సర్వము దెలిసిన జగన్నాథులు. అయిననూ, వారు మానవుల ప్రవృత్తిననుకరిస్తూ తమ స్వతస్సిద్ధమైన శుద్ధజ్ఞానమును దాచియుంచిరి.
తరువాత బలరామకృష్ణులు గురుకులవాసమును చేయగోరిరి. కాశ్యపగోత్రోద్భవుడు, (కాశీలో పుట్టినవాడు, కాశీలో చదివినవాడు) సాందీపని అని ప్రసిద్ధి జెంది అవంతీ (ఉజ్జయినీ) నగరమునందు నివసించుచున్న గురువు వద్దకు వారు వెళ్లిరి.
వారిద్దరు వినయముతో యథావిధిగా గురువు వద్దకు వెళ్లిరి. వారు లోకమునకు దోషములు లేకుండా గురువు వద్ద నడుచుకోవలసిన పద్ధతిని ఆదర్శముగా చూపుతూ ఆవరముతో, భక్తితో గురువును దేవుని వలె సేవించిరి.
వేదవేత్తలలో శ్రేష్ఠుడగు ఆ గురువు వారిద్దరు శుద్ధమైన భావముతో చేసే సేవలకు సంతోషించి, వారికి వేదాంగములు (శిక్ష, కల్పము, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, నిరుక్తము), ఉపనిషత్తులతో నాల్గు వేదములను బోధించెను.
మంత్ర దేవతాసహితమైన ధనుర్వేదమును, ధర్మశాస్త్రములను, మీమాంసాది న్యాయమార్గములను, తర్కవిద్యను, సంధి విగ్రహయాన - ఆసనద్వైధీభావసమాశ్రయములనే ఆరు విధముల రాజనీతిని కూడ ఆయన వారికి బోధించెను.
ఓ పరీక్షిన్మహారాజా! గొప్ప మానవులలో గొప్పవారగు వారిద్దరు సకలవిద్యలను లోకములో ప్రవర్తిల్లజేసిన భగవానులే. విద్యలనన్నింటినీ ఒక్కసారి చెప్పగానే చక్కగా గ్రహించెడివారు.
ఓ పరీక్షిన్మహారాజా! మనోజయము గల వారిద్దరు అరవై నాలుగు దినములలో గానము మొదలైన అరవై నాలుగు కళలను నేర్చిరి. వారు ఆచార్యుని ప్రార్థించి ఆయన గురుదక్షిణను కోరునట్లు చేసిరి.
ఓ పరీక్షిన్మహారాజా! వారిద్దరి అట్టి ఆశ్చర్యకరమగు మహిమను, మానవులకంటె అతీతమైన బుద్ధిశక్తిని చూచి గురువు తన భార్యతో సంప్రదించెను. వారి పుత్రుడు ప్రభాస క్షేత్రములో మహాసముద్రములో పడి మరణించెను. ఆయన ఆ పుత్రుని తెచ్చి ఇమ్మని వరముగా కోరెను.
ఽ।
బలరామకృష్ణులు మహారథులు. వారి పరాక్రమమునకు అంతము లేదు. వారిద్దరు సరే అని చెప్పి వెంటనే రథమెక్కి ప్రభాస క్షేత్రమును చేరి చెలియలి కట్టకు వెళ్లి క్షణకాలము కూర్చుండిరి. వారి రాక గురించి తెలిసి సముద్రుడు పూజాద్రవ్యములతో వారి వద్దకు వచ్చెను.
శ్రీకృష్ణ భగవానుడు ఆ సముద్రునితో నిట్లనెను – నీవు పెద్ద కెరటముతో ఇక్కడ మా గురువుగారి పుత్రుడగు పిల్లవానిని మ్రింగివేసితివి. ఈ పిల్లవానిని వెంటనే మాకు అప్పజెప్పుము.
సముద్ర ఉవాచ !
సముద్రుడిట్లు పలికెను --- ఓ దేవా! శ్రీకృష్ణా! ఆ పిల్లవానిని నేను సుతరాము అపహరించ లేదు. పంచజనుడనే దితివంశీయుడగు పెద్ద రాక్షసుడు నీటి లోపల శంఖము రూపు దాల్చి సంచరించును. వాడు పిల్లవానిని అపహరించినాడు. ఇది యథార్థము, అని సముద్రుడు చెప్పెను. ఆ మాటను విని శ్రీకృష్ణ ప్రభుడు వేగముగా నీటిలో ప్రవేశించి, ఆ పంచజనుని సంహరించి చూడగా వాని పొట్టలో పిల్లవాడు కానరాలేదు.
దుష్టజనశిక్షకుడగు శ్రీకృష్ణ భగవానుడు ఆ రాక్షసుని శరీరమునుండి పుట్టిన శంఖము (పాంచజన్యము) ను తీసుకొని రథము వద్దకు వచ్చెను. ఆయన నాగలి యే ఆయుధముగా గల బలరామునితో కూడి యమునకు ప్రియమైన సంయమనీ నగరమునకు వెళ్లి, శంఖమును పూరించెను.
ప్రాణులను శాసించే యముడు శంఖధ్వనిని విని వారిద్దరికి భక్తి భావముతో నిండిన గొప్ప పూజను చేసెను.
యముడు వినమ్రుడై సకల ప్రాణుల హృదయములో నివసించే శ్రీకృష్ణ భగవానునితో నిట్లనెను - - ఓ విష్ణూ! నీవు లీల కొరకై మానవదేహమును దాల్చి యున్నావు. మీకిద్దరికి నేనేమి చేయవలెను?
శ్రీభగవానువాచ ।
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఓ యమరాజా! తన కర్మయే బంధనము కాగా మా గురువుగారి పుత్రుడు ఇచటకు తీసుకు రాబడినాడు. నీవు నా ఆజ్ఞచే ప్రేరితుడవై దానిని తీసుకు రమ్ము.
సరే అని చెప్పి బాలకుని తీసుకువచ్చెను. యదు వంశశ్రేష్ఠులగు వారిద్దరు ఆ గురుపుత్రుని తమ గురువునకు అప్పజెప్పి, ఇంకనూ కోరుకొనుడు, అని పలికిరి.
గురురువాచ।
గురువు ఇట్లు పలికెను --- నాయనలారా! మీరిద్దరు గురువు యొక్క ఋణమును పూర్తిగా తీర్చివేసినారు. మీవంటి వారికి గురువైన వానికి ఇంకనూ కోరికలేమి మిగిలియుండును? (ఉండవు).
ఓ వీరులారా! మీరిద్దరు మీ ఇంటికి వెళ్లుడు. మీకు జనులను పవిత్రము చేసే కీర్తి కలుగుగాక! మీరు నేర్చిన విద్యలు ఇహపరలోకములయందు నిస్సారములు కాకుండు గాక! (సఫలములగుగాక!)
నాయనా! పరీక్షిత్తూ! వారిద్దరు గురువు అనుమతి తీసుకొని రథమునెక్కి తమ నగరము (మథుర) నకు తిరిగి వచ్చిరి. వాయువుతో సమానమైన వేగముతో నడిచే ఆ రథము యొక్క ధ్వని మేఘగర్జనను పోలియుండును.
బలరాముని, దుష్ట జనశిక్షకుడగు శ్రీకృష్ణ భగవానుని అచటి జనులు చాల రోజులు చూడలేదు. ఇప్పుడు వారందరు వారిద్దరిని చూచి, పోయిన సంపద మరల దొరికినవారు వలే చాల ఆనందించిరి.
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధములో శ్రీకృష్ణ బలరాముల ఉపనయనము, గురుకుల ప్రవేశము, విద్యాధ్యయనము, గురుదక్షిణలను
వర్ణించే నలుబది ఐదవ అధ్యాయము ముగిసినది (45).
Summary of chapter 45 of the Bhāgavata Mahā Purana is as follows:
Following Kaṁsa's death, Śrī Kṛshṇa and Balarāma freed Their parents, Vasudeva and Devakī, from their prison cells, offering them humble prostrations. Kṛshṇa then reinstated Kaṁsa's saintly father, King Ugrasena, as the sovereign ruler of the Yadu dynasty. To fulfill Vaidika customs, Kṛshṇa and Balarāma traveled to Ujjain to reside as celibate students (*Brahmacārīs*) in the gurukula of Sāndīpani Muni. Within sixty-four days, the brothers mastered all sixty-four traditional arts and Vaidika sciences. When requesting Guru-dakshiṇā, Sāndīpani Muni begged for the recovery of his young son who had drowned in the ocean at Prabhasa. Kṛshṇa and Balarāma traveled to the ocean, vanquished the conch demon Pañcajana, descended to the subterranean realm of Yamarāja, and brought Sāndīpani's deceased son back alive, restoring him to his grateful parents.