భాగవత మహా పురాణము
32 - శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై గోపికలనోదార్చుట
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుని చూడాలనే ఉత్కటమగు ఇచ్ఛ గల గోపికలు విధముగా అనేకప్రకారములుగా గానము చేస్తూ, మాటలాడుచుండిరి. మధురమగు స్వరముతో ఏడ్చిరి.
శూరవంశీయుడగు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో వారికి ప్రత్యక్షమయ్యెను. పద్మమువంటి మోము గల ఆయన పచ్చని వస్త్రమును వనమాలను దాల్చి, సాక్షాత్తుగా మన్మథునకు కూడ మన్మథుడు వలె నుండెను.
పోయిన ప్రాణము రాగా దేహములోని అవయవములన్నీ ఒక్కసారి జీవంతములగును. అదే విధముగా, వచ్చిన ప్రియతముడగు ఆ శ్రీకృష్ణుని చూచి గోపికల కన్నులు ప్రేమతో వికసించినవి. వారందరు ఒక్కసారిగా లేచి నిలబడిరి.
శ్రీకృష్ణుని పద్మమువంటి చేతిని ఒక గోపిక ఆనందముతో తన దోసిలితో పట్టుకొనగా, మరియొక గోపిక చందనమలదిన ఆయన చేతిని తన భుజముపై వేసుకొనెను.
ఒకానొక సుందరి ఆయన నోటిలోని తాంబూలమును దోసిలితో తీసుకొనగా, తాపమును పొందిన మరియొక గోపిక పద్మమువంటి ఆయన పాదమును వక్షఃస్థలము పై నుంచుకొనెను.
ఒక గోపిక ప్రణయకోపముచే స్వాధీనత తప్పి క్రింది పెదవిని ముడివేసి ఓరచూపులను విసురుతూ కొట్టుచున్నదా యన్నట్లు చూచెను.
సత్పురుషులకు ఆయన చరణములను ఎంత 'సేవించినా తనివి దీరదు. అదే తీరున, మరియొకామెకు పద్మమువంటి ఆయన ముఖమును రెప్పపాటు లేని కళ్లతో చూచి ఆస్వాదించి మరల చూచినా తనివి దీరలేదు.
ఒకామె ఆయనను కళ్లు అనే ద్వారము గుండా హృదయములో ప్రవేశ పెట్టి ఆ ద్వారమును మూసివేసెను. అపుడామె ఆయనను కౌగిలించుకొనగా, ఆమెకు దేహమంతటా గగుర్పాటు కలిగెను. యోగి వలె ఆమె ఆనందసముద్రములో మునిగిపోయెను.
శ్రీకృష్ణ భగవానుని దర్శనమే గొప్ప ఉత్సవము కాగా వారందరు ఆనందించిరి. బ్రహ్మజ్ఞానిని పొందిన సంసాగి జనులు పట్టి, వారు విరహము వలన కలిగిన తాపమును విడిచి పెట్టిరి.
నాయనా! గోపికల శోకము ఎగిరిపోయెను. వారా శ్రీకృష్ణ భగవానుని చుట్టుముట్టిరి. పూర్ణ పరమాత్మ జ్ఞానక్రియాది శక్తులతో వలె ఆయన వారితో గూడి విశేషముగా ప్రకాశించెను.
సర్వసమర్థుడగు శ్రీకృష్ణ భగవానుడు గోపికలతో యమునానది యొక్క సుఖకరమైన ఇసుకతిన్నెను చేరెను. వికసించుచున్న మల్లెల, మందారముల పరిమళము గల వాయువు అచటకు తుమ్మెదలను కొనివచ్చుచుండెను. శరత్కాలచంద్రుని కిరణముల గుంపులు రాత్రి చీకట్లను తరిమి కొట్టెను. యమునానది యొక్క చేతులవంటి కెరటములు అచటీ మెత్తని ఇసుకను తడుపుచుండెను.
ఆయన దర్శనముచే వారి హృదయములలోని తాపము తొలగి ఆనందము కలిగెను. పరబ్రహ్మస్వరూపమును వర్ణించిన శ్రుతులు వలె వారు కూడ కోరికల అంతమును (పూర్ణత్వమును) పొందిరి. వారు ఆత్మబంధువగు శ్రీకృష్ణునికి తమ ఉత్తరీయములతో ఆసనమును కల్పించిరి. ఆ ఉత్తరీయములపై వారి వక్షఃస్థలమునందలి కుంకుమ చిహ్నములు ఉండెను.
యోగిరాజుల హృదయము లోపల స్థిరనివాసముండే ఆ జగన్నాథుడు కొంగుపై కూర్చుండెను. ముల్లోకముల శోభకు ఒకే ఒక ఆశ్రయమైన దేహమును దాల్చి గోపికల సభయందున్న ఆయనను వారు పూజించిరి. అపుడాయన గొప్పగా శోభిల్లెను.
అనుగాగమును వర్ధిల్లజేసే ఆయనను గోపికలు నవ్వుతో కూడిన విలాసపు చూపులతో మరియు కనుబొమల విరుపులతో సత్కరించిరి. ఒకామె. ఆయన చేతిని, మరియు కామ ఆయన కాలిని తమ వక్షఃస్థలము పై నుంచుకొనిరి. వారా స్పర్శను నిమిత్తముగా చేసుకొని ఆయనను గొప్పగా కొనియాడిరి. అప్పుడు గోపికలు కొ కోపించి ఆయనతో నిట్టనిరి.
గోప్య ఊచుః ।
గోపికలిట్లు --- పలికిరి కొందరు. తమను ప్రేమించే ఇతరులను ఆ తరువాత ప్రేమించెదరు. కొందరు దీనికి తల్లక్రిందులు, అనగా ఇతరులు ప్రేమించకున్ననూ వారిని ప్రేమించెదరు. ప్రేమించువారిని, ప్రేమించనివారిని కూడ ప్రేమించరు. ఓయీ! ఓయీ! ఈ ప్రవృత్తులలో ఏది యోగ్యమైనదో మాకు చెప్పుము.
శ్రీభగవానువాచ।
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- చెలులారా! ఇతరులు ప్రేమిస్తేనే వారిని ప్రేమించువారు తమ ప్రయోజనమునందు మాత్రమే నిశ్చితమైన ఉద్యమము గలవారు. వారి ఆ ప్రవృత్తిలో యథార్థమగు ప్రేమ గాని, ధర్మము గాని లేవు. ఆ ప్రేమ కేవలము స్వంత ప్రయోజనము కొరకే గాని, వేరు కాదు.
ఓ సుందరులారా! దయామయులు తల్లిదండ్రులవలె ప్రేమించనివారిని కూడ ప్రేమించెదరు. వారి ఈ ప్రేమలో నిశ్చలపూర్ణధర్మము మరియు సాధుత్వము కూడ గలవు.
కొందరు ప్రేమించేవారిని కూడ నిశ్చయముగా ప్రేమించరు. వారు ప్రేమించనివారిని ఏల ప్రేమించెదరు? (ప్రేమించరు). (ప్రేమించరు). అట్టివారు ఆత్మనిష్ఠులు, పూర్ణకాములు అగు మహాత్ములు కావచ్చును; లేదా, చేసిన ఉపకారమును మరిచినవారు కావచ్చును; లేదా, గుర్తున్నా గురువువంటి ఉపకారము చేసిన వ్యక్తి యెడల ద్రోహబుద్ధి గలవారు కావచ్చును.
ఓ చెలియలారా! ధనము లేనివానికి ధనము లభించి అది నష్టమైనచో, ఆతడు నిరంతరముగా దానినే చింతిస్తూ ఇతరమును విస్మరించును. అదే విధముగా, నన్ను ప్రేమించే భక్తులకు నా ధ్యానము నిరంతరముగా కొనసాగుటకై, నేను కనబడి అంతర్ధానమగుచుందును. అంతేగాని, నేను వారికి నిరంతరముగా కనిపిస్తూ ఉండను.
ఓ అబలలారా! మీపై నాకు ప్రీతి మెండు. మీరీ విధముగా నా కొరకై లోకములోని మర్యాదను, వేదములచే విధించబడిన గృహస్థాశ్రమనియమములను, బంధువులను విడిచి పెట్టితిరి. మీకు నాపై ధ్యానము కొనసాగుట కొరకు మాత్రమే నేను అంతర్షితుడనైతిని. నేను కనబడకపోయినా మిమ్ములను ప్రేమిస్తూనే ఉన్నాను. ఇది నిశ్చయము. కాబట్టి, మీ ప్రియుడనగు నాయందు మీరు తప్పులనెన్నుట తగదు.
మీ ప్రేమ నిష్కపటమైనది. మీరు నాపై చూపిన ఈ ప్రేమకు ప్రత్యుపకారమును నేను దేవతల ఆయుర్దాయమును పొందినా చేయజాలను. ఇల్లు - వాకిలి అనే సంకెళ్లు మిక్కిలి దృఢమైనవి. కాని, మీరు వాటిని కూడ పూర్తిగా తెగగొట్టి నన్ను ప్రేమించినారు. మీ ప్రేమకు ప్రత్యుపకారము మీ ప్రేమయే యగుగాక!
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము పూర్వార్ధములో
శ్రీకృష్ణుడు ప్రత్యక్ష మై గోపికలనోదార్చుటను వర్ణించే
ముప్పది రెండవ అధ్యాయము ముగిసినది (32).
Summary of chapter 32 of the Bhāgavata Mahā Purana is as follows:
Moved by the gopīs' intense, unalloyed devotion and weeping, Svayam Bhagavān Śrī Kṛshṇa suddenly manifested in their midst, wearing a yellow silk dhotī and a garland of forest flowers, His face beaming with a gentle smile. Overjoyed, the gopīs surrounded Him—one taking His hand, another placing His lotus feet on her lap, and others offering Him worship. When the gopīs asked why He had disappeared, Kṛshṇa explained that He does not hide out of cruelty or neglect, but to intensify their love and remembrance, just as a poor man who loses his wealth thinks of nothing else. Kṛshṇa declared that He could never repay His debt to the gopīs for their pure, unmotivated surrender, even across the lifespans of the demigods.