భాగవత మహా పురాణము
8 - శ్రీకృష్ణ బలరాముల బాల్య లీలలు
ఓ పరీక్షిన్మహారాజా! యాదవుల పురోహితుడగు గర్గుడు చాల గొప్ప తపస్వి. వసుదేవుని ప్రేరణచే ఆయన నందుని గోకులమునకు వెళ్లాను.
ఆయనను చూచి నందుడు చాల ప్రీతిని పొందెను. ఆతడు అంజలి ఘటించి లేచి యెదు రేగెను. ఇంద్రియగోచరుడు కాని శ్రీహరియేనా అన్నట్లు పాదనమస్కారముతో ఆరంభించి నందుడాయనను పూజించెను.
గర్గముని అతిథిసత్కారమును స్వీకరించి విశ్రాంతిగా కూర్చుని యుండెను. నందుడు ఆయనను అభినందించి యథార్థమధురమగు వాక్కుతో నిట్లనెను -- ఓ మహర్షీ! పూర్ణుడవగు నీకు మేము చేయదగినది ఏమి గలదు?
ఓ పూజనీయా! గృహస్థులగు మానవులు దీనమైన చిత్తము కలిగి యుందురు. మహాత్ములు తమ స్థానమును వీడి వారి.. యింటికి వచ్చుట వారి పరమకల్యాణము కొరకే. అంతేగాని, మహాత్ముల రాకకు స్వప్రయోజనము ఏనాడైననూ ఉండదు.
అతీంద్రియమగు జ్ఞానమును బోధించే జ్యోతిశ్శాస్త్రమును రచించినది సాక్షాత్తు తమరే. దాని ద్వారా మానవుడు పూర్వజన్మల కర్మలను గురించి, ఇహజన్మయందలి సుఖదుఃఖముల గురించి తెలియగల్గును.
నీవు వేదవేత్తలలో శ్రేష్ఠుడవనేది నిశ్చయము. తమరీ ఇద్దరు బాలకులకు నామకరణాది సంస్కారములను. చేయదగును. పుట్టుకచే బ్రాహ్మణుడు మానవులకు గురువు.
గర్గ ఉవాచ ।
గర్గాచార్యుడిట్లు పలికెను --- నేను యాదవుల గురువునని లోకములో అంతటా ప్రసిద్ది జెందినవాడను. నేను నీ పుత్రునకు సంస్కారమును - చేసినచో, జనులు నీ పుత్రుని దేవకీ పుత్రుడనియే భావించెదరు.
కంసుడు దుర్బుద్ధి. నిన్ను చంపువాడు ఇప్పటికే పుట్టినాడు, అని దేవకీయొక్క కుమార్తె చెప్పినదానిని ఆతడు వినియున్నాడు. దానిని బట్టి దేవకీయొక్క ఎనిమిదవ శిశువు అమ్మాయి కాదని ఆతడు గ్రహించి యుండును. పైగా, నీకు వసుదేవునకు స్నేహమని కూడ ఆతనికి తెలియును. ఆతడు ఈ విషయములను విచారము చేసి శంక కలిగినవాడై, కృష్ణాదులను చంపినచో, అది మనకు అనర్థము అగును.
నంద ఉవాచ ।
నందుడిట్లు పలికెను --- ఈ గోకులములోని గోశాలయందు ఏకాంతములో నోవారికి కూడ కనబడకుండా స్వస్తివాచనమును చేసి, నామకరణాది ద్విజసంస్కారమును చేయుడు.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- గర్గుడు నామకరణమును చేయాలనే కోరెను. ఈ విధముగా నందుడు గట్టిగా కోరగా ఆయన ఏకాంతములో రహస్యముగా పిల్లలిద్దరికి నామకరణ సంస్కారమును చేసెను.
గర్గ ఉవాచ ।
గర్గాచార్యుడిట్లు పలి కెను --- ఈ రోహిణియొక్క పుత్రుడైతే మిత్రులను తన మంచి గుణములచే రమింపజేయును. కావున, ఇతడు రాముడు అని పిలువబడగలడు. ఈతనికి బలము అధికముగా నుండుట వలన జనులు బలుడు అని పిలిచెదరు. ఈతడు యాదవులలో ఐకమత్యమును స్థాపించును గనుక, ఇతనిని సంకర్షణుడు (దగ్గరకు లాగువాడు) అని కూడ జనులు పిలువ గోరెదరు.
ప్రతియుగమునందు దేహములను స్వీకరించే ఈ 'నీ పుత్రునకు తెలుపు, ఎరుపు, పచ్చన అనే మూడు రంగులు ఇదివరలో ఉండెను. ఇప్పుడు నలుపు రంగును పొందినాడు.(కావున, కృష్ణుడనబడును).
శోభిల్లే ఈ నీ పుత్రుడు పూర్వము ఒకప్పుడు వసుదేవునకు పుత్రుడైనాడు. కావున, రహస్యము దెలిసినవారు ఈతనిని వాసుదేవుడు (వసుదేవ పుత్రుడు) అని పిలిచేదరు.
నీ పుత్రునకు గుణములకు లీలలకు తగిన చాల పేర్లు, రూపములు కూడ గలవు. అవి నాకు తెలియునే గాని, జనులకు తెలియవు.
గోపాలకులను, గోకులమును ఆనందింపజేసే ఈ బాలకుడు మీకు శ్రేయస్సును కలిగించగలడు. ఇతని ద్వారా మీరు కష్టములనన్నింటినీ అతిక్రమించెదరు.
పూర్వము ఒకప్పుడు (వేనుని కాలమునందు) అరాచకమేర్పడెను. అప్పుడు చోరులు సజ్జనులను పీడించజొచ్చిరి. అపుడీతడు వారిని రక్షించి వర్ధిల్ల జేయగా, వారు చోరులను జయించిరి.
విష్ణువును ఆశ్రయించిన దేవతలను అసురులు పరాభవించలేరు. అదే విధముగా, గొప్ప భాగ్యము గల ఏ మానవులు వీనియందు ప్రీతిని చేయుదురో, వారిని (బాహ్య-ఆంతర) శత్రువులు పరాభవించలేరు.
ఓ నందా! కావున, గుణములు, శోభ, సంపద, కీర్తి, ప్రభావములలో ఈ నీ పుత్రుడు నారాయణునితో సముడు. నీవు సావధానుడవై కాపాడుము.
గర్గుడీ విధముగా నందునకు ఉపదేశించి యింటికి వెళ్లాను. చాల ఆనందించిన నందుడు తన సకలాభీష్టములు పూర్ణ మైనవని తలపో సెను.
నామకరణము తరువాత కొద్ది కాలమునకే గోకులములో బలరామకృష్ణులు మోకాళ్లతో చేతులతో ప్రాకుతూ విహరించిరి.
వారిద్దరు గోకులమునందలి వాకీళ్ల బురదలో కాళ్లజంటను ముందుకు లోగుతూ వంకర టింకరగా ప్రాకుచుండగా వారి ఆభరణముల చిరుగంటలు మధురమగు ధ్వనిని చేయుచుండెను. గోకులమునందలి జనులు వారిని ప్రోత్సహిస్తూ మధురమగు శబ్దములను చేసెడివారు. ఆ ధ్వనులకు, ఆ శబ్దములకు వారిద్దరికి మనస్సులో హర్షము కలిగెడిది. మార్గముగుండా వెళ్లే అపరిచితవ్యక్తి వెనుక అమాయికముగా కొద్ది దూరము వెళ్లి, భయపడినారా యన్నట్లు వెనుదిరిగి తల్లులవద్దకు చేరెడివారు.
వారిద్దరి దేహములు వాకిలిలోని మట్టియే చందనము కాగా (మట్టి మరియు చందనముతో) సుందరముగా నుండెడివి. ప్రేమచే పాలను స్రవించుచున్న తల్లులిద్దరు తమ పుత్రులనిద్దరిని రెండు చేతులతో కౌగిలించి పాలనిచ్చెడివారు. వారిద్దరు పాలు త్రాగుచుండగా, చిన్న పళ్లు గల వారీ ముఖములపై అమాయికమైన చిరునవ్వు తొంగి చూచెడిది. అట్టి వారీ ముఖములను చూచి తల్లులు మహానందమును పొందెడివారు.
వారిద్దరు కొంచెము పెరిగి పెద్దవారు కాగా వారి లీలలను గోకులములోని యువతులు చూడ దొడంగిరి. గోకులము మధ్యలో వారిద్దరు దూడల తోకలను గట్టిగా పట్టుకోగా, వారిని దూడలు ఇటునటు లాగుచుండెడివి. అప్పుడు గోకులమునందలి యువతులు ఇంటి పనులను ప్రక్కన బెట్టి వారిని చూస్తూ నవ్వుతూ హర్షించెడివారు.
ఎక్కువగా అల్లరి చేసే బలరామకృష్ణులిద్దరికీ ఆటలే ముఖ్యమాయెను. కొమ్ములతో పొడిచే ఆవులు, ఎద్దులు, దూడలు, నిప్పు, కోరలు గల జంతువులైన కుక్కలు మొదలగునవి, పక్షులు, ముళ్లు అనువాటినుండి వారిద్దరిని తల్లులు కాపాడవలెను. అదే సమయములో ఇంటిలోని పనులను చేసుకొనుట ఆ తల్లులకు వీలు కాకుండెను. ఈ విధముగా వారిద్దరి తల్లులు మనస్సులో ఆందోళనను పొందెడివారు.
మహర్షివంటి ఓ పరీక్షిన్మహారాజా! కొద్ది కాలములోనే బలరామకృష్ణులు మోకాళ్లు భూమికి తగలకుండానే లేచి నిలబడి గోకులములో అంతటా తేలికగా వేగముగా సంచరించ జొచ్చిరి.
తరువాత శ్రీకృష్ణ భగవానుడు గోకులమునందలి స్త్రీలకు ఆనందమును కలిగిస్తూ, రామునితో మరియు గోకులమునందలి బాలకులతో కలిసి క్రీడించెను.
శ్రీకృష్ణుడు బాల్యములో చేస్తున్న అందమైన అల్లరిని చూచిన గోపికలు గుమిగూడి, ఆతని తల్లియగు యశోద వినుచుండగా స్పష్టముగా ఈ విధముగా చెప్పిరి.
ఆ కృష్ణుడు ఒకప్పుడు వేళ కాని వేళ దూడలను విడిచి పెట్టును.(అవి పాలను త్రాగివేయగా ఇంటిలోనివారు) కూకలేసినప్పుడు నవ్వును. మరియు ఆతడు అపహరించే ఉపాయములనాచరించి . తియ్యని పెరుగును, పాలను అపహరించి త్రాగివేయును. (తాను త్రాగిన పిదపు కోతులకు పిల్లులకు త్రాగిపించుటకై వాటాలను వేయును. ఒకానొక కోతి తినకపోయినచో, (చికాకు పుట్టి) కుండను పగులగొట్టును. పెరుగు-పాలు మొదలైనవి దొరకకపోయినచో, ఆ ఇంటి (ఐరి) పై కోపించి ఆతడు పిల్లలను (గిల్లి) ఏడిపించి వెళ్లిపోవును.
పెరుగు కుండ చేతికి అందనిచో పీట, రోలు, మిత్రుని భుజము మొదలగువాటి ఆసరాతో అది చేతికి అందే ఉపాయమును ఆచరించును. ఉట్టియందలి కుండలో ఏమున్నదో, దానిని ఏ విధముగా అందుకోవాలో అతనికి తెలియును. ఒకచో ఆతడు దానికి చిల్లు పెట్టి లోపలి వస్తువును చేజిక్కించుకొనును. చీకటి గదిలో తాను ధరించిన మణుల సమూహమే దీపమై పదార్థములను ప్రకాశింప జేయును. ఆతడీ పనులను గోపికలు ఇంటి పనులలో చాల హడావుడిగా ఉన్నప్పుడు చేయును.
ఓ సుందరీ! యశోదా! బాలకృష్ణుడీ విధముగా దిట్టదనపు పనులను చేయును. ఇంటిలో మాలిన్యమును వేయుట మొదలగు పనులను చేయును. వెన్నను ఎత్తుకుపోయే ఉపాయములతో వివిధచేష్టలను చేసే కృష్ణుడు బుద్ధిమంతుడు వలే కనబడును . అని ఈ విధముగా, భయముతో కూడిన కన్నులతో శోభిల్లే బాలకృష్ణుని ముఖమును చూస్తూ గోపీకలు వివరించి చెప్పిరి. కాని, నవ్వుతో నిండిన ముఖము గల యశోదకు కృష్ణునిపై కోపపడుట ఇష్టము కానే లేదు.
ఒకనాడు గోపబాలకులు ఆటలాడుచుండిరి. బాలకృష్ణుడు మట్టిని తిన్నాడని బలరాముడు మొదలైన ఆ పిల్లలు తల్లి యశోదకు విన్నవించిరి.
శ్రీకృష్ణుని హితము (అనారోగ్యము కలుగకూడదనీ) కోరే ఆ యశోద ఆతని చేతిని పట్టుకొనెను. ఆతడు భయముతో కంగారుపడుచున్న కన్నులతో చూచుచుండెను. ఆమె ఆతనిని కూకలేసి ఇట్లనెను.
ఓ కృష్ణా! నీ నోరు నీకు వశములో లేదు సుమా! నీవు రహస్యముగా మట్టిని యేల తింటివి? నీ మంచిని కోరే ఈ పిల్లలు, ఈ, నీ అన్న కూడ (నీవు మట్టిని తిన్నావని) చెప్పుచున్నారు.
శ్రీకృష్ణ ఉవాచ ।
అమ్మా! నేను మట్టిని తినలేదు. అందరు చెప్పే నేరములు అబద్ధము. వారు సత్యమునే చెప్పుచున్నారని నీవు తలచే పక్షములో, నా నోటిని నీవే ప్రత్యక్షముగా చూడుము.
వారు చెప్పే మాట అసత్యమైనచో నోటిని తెరువుము, అని ఆమె పలికెను. మొక్కవోని ఈశ్వరీయశక్తి గల శ్రీహరి లీల కొరకే మానవబాలుడై అవతరించెను. అట్టి శ్రీకృష్ణుడు నోటిని తెరిచెను.
ఆమెకు ఆ నోటియందు చరాచరమగు జగత్తు, భూగోళము చుట్టూ ఉండే వాయువు, విద్యుత్తు, చంద్రుడు, నక్షత్రములు, ద్యులోకము, దిక్కులు, పర్వతములతో ద్వీపములతో సముద్రములతో కూడిన భూగోళము కనబడెను.
నక్షత్రమండలము, నీరు, తేజస్సు, (నక్షత్రమండలమధ్యమునందలి) వాయువు, ఆకాశము, (హిరణ్యగర్భుని) సాత్త్వికాహంకారమునుండి పుట్టి ఇంద్రియములకు అభిమానులై ఉండే ఇంద్రాది దేవతలు, సమష్టి చిట్టాభి మానియగు హిరణ్యగర్భుడు, శబ్దస్పర్శరూపరసగంధములనే సూక్ష్మ భూతములు, సత్త్వరజస్తమస్సులనే మూడు గుణములు కనబడెను.
నోరు తెరిచిన పుత్రుని శరీరమునందు యశోద ఒకే సారి వివిధప్రాణులతో గూడిన ఈ జగత్తును, తనతో సహా గోకులమును కూడ చూచెను. ఈ జగత్తులోని ప్రాణులలోని విభిన్నరూపములకు మూలమునందు జీవుడు, వాని అజ్ఞానము, కాలము, కర్మలు, కర్మవాసనలు గలవు. అపుడామెకు సందేహము కలిగెను.
ఇది కలా? లేక వైష్ణవమాయయా? లేక నా బుద్ది వ్యామోహపడుచున్నదా? ఆశ్చర్యము! లేక, ఈ నా పిల్లవానికే ఏదో ఒక పుట్టుకతో వచ్చిన తనదైన యోగసిద్ధి గలదా? (అని యశోద తలపో సెను).
ఆ పరమాత్మయొక్క స్వరూపము యథాతథముగా బుద్దిచే నిశ్చయించుటకు, మనస్సుతో భావన చేయుటకు, కర్మతో చేరుకోనుటకు, పోక్కుతో వర్ణించుటకు గోచరము కాదు. ఊహాపోహలకు అతీతమైన ఆ పరమాత్మయే జగత్తునకు అధిష్ఠానము. ఆ పరమాత్మనుండి ఆవిర్భవించిన ఈ జగత్తు చైతన్యరూపుడగు ఆ పరమాత్మ ద్వారానే ప్రతీతమగుచున్నది. అందువలన, సుతరాము బుద్దిగోచరము కాని ఆ పరమాత్మస్వరూపమును నేను ప్రణమిల్లుచున్నాను.
నేను గోకులనాథుడగు నందుని భార్యను, ఆతని సకలసంపదకు రాణిని, ఈ నందుడు నా భర్త. ఈ కృష్ణుడు నా కొడుకు. గోవులే సంపదగా గల గోపాలకులు గోపికలు కూడ నావారు, అంటూ నేను ఎవని మాయచే మిథ్యాసంకల్పములను కలిగియున్నానో, ఆ శ్రీహరి నాకు శరణు.
ఈ విధముగా గోపికయగు యశోదకు ఆత్మతత్త్వము తెలిసిపోయెను. అప్పుడు సర్వాంతర్యామి, జగన్నాథుడు అగు ఆవిష్ణువు పుత్రునియందలి ఆసక్తి అనే రూపములోనుండే తనదైన మాయను ఆమెయందు విస్తరింప జేసెను.
వెంటనే గోపికయగు ఆ యశోదకు తత్త్వజ్ఞానము కనుమరుగై పుత్రుని ఒడిలో కూర్చుండబెట్టుకొనెను. ఆమె హృదయములో పూర్వమునందు వలెనే పుత్రునియందలి ఆసక్తి వ్యాపించెను.
శ్రీహరి మహిమను వేదములు, ఉపనిషత్తులు, ఆత్మనిష్ఠులు, కర్మయోగపరులు, భక్తులు కూడ కీర్తించెదరు. అట్టి శ్రీహరిని ఆమె తన పుత్రుడని తలపోయుచుండెను.
రాజోవాచ ।
పరీక్షిన్మహారాజు ఇట్లు పలి కెను --- ఓ శుకమహర్షీ! శ్రీహరి యశోద పాలను త్రావెను. మహాపుణ్యాత్మురాలగు యశోద మరియు నందుడు (ఇంతటి గొప్ప ఫలమునిచ్చే ఏ పుణ్యముననుష్ఠించిరి?
శ్రీకృష్ణుని అద్భుతమైన బాల్యలీలలు జనుల మనోమాలిన్యములను పోగొట్టును. వాటిని ఈ నాటికీ కవులు కీర్తిస్తూనే ఉన్నారు. కాని, తల్లిదండ్రులైన దేవకీవసుదేవులు ఆ లీలలను అనుభవించనే లేదు.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- వసువులలో ముఖ్యుడగు ద్రోణుడు భార్యయగు ధరతో గూడి బ్రహ్మదేవుని ఆదేశములను చేయబోవువాడై ఆయనతో నిట్లనెను.
మేము భూలోకమునందు పుట్టినప్పుడు, దేవదేవుడు జగన్నాథుడు అగు శ్రీహరియందు సర్వాతిశాయియగు భక్తి కలుగుగాక! అట్టి భక్తిచేతనే లోకములో మానవుడు దుర్గతిని తేలికగా అతిక్రమించును.
అటులనే యగుగాక! అని బ్రహ్మదేవుడు చేప్పెను. పూజనీయుడు, గొప్ప కీర్తి గలవాడు అగు ఆ ద్రోణుడు భూలోకమునందు పుట్టి నందుడని ప్రసిద్ధి వడ సెను. ఆ ధరయే యశోద ఆయెను.
భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఆ వరము కారణముగా, దుష్టజనశిక్షకుడగు శ్రీహరి భగవానుడు గోపాలకులు గోపికల మధ్యలో ఆ దంపతులకు పుత్రుడై జన్మించెను. వారికి నిష్కామభక్తి కలిగెను.
సర్వసమర్థుడగు శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుని వరమును సత్యము చేయుటకై బలరామునితో గూడి గోకులమునందు నివసించువాడై, తన లీలచే వారికి ప్రీతిని కలుగజేసెను.
శ్రీమద్భాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్ధములో శ్రీకృష్ణ బలరాముల బాల్యలీలలను వర్ణించే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).
Summary of chapter 8 of the Bhāgavata Mahā Purana is as follows:
Nanda Mahārāja secretly invited Garga Muni, the family priest of the Yadu dynasty, to perform the confidential Vaidika name-giving ceremony (*Nāmakaraṇa*) for Kṛshṇa and Balarāma in a secluded cow shed to avoid drawing Kaṁsa's suspicion. Garga Muni revealed that Rohiṇī's son would be named Balarāma (the reservoir of strength) and Rāma (the giver of pleasure). Turning to Yaśodā's child, Garga Muni revealed that He assumes different colors in different Yugas—white, red, yellow, and presently a dark blue-black complexion—and is therefore named Kṛshṇa. He foretold that this child would possess divine opulences equal to Bhagavān Nārāyaṇa, protect Gokula from all dangers, and bring boundless bliss to the cowherds. As Kṛshṇa grew into a toddler, He began crawling through the mud, catching the tails of calves, and captivating the hearts of all the gopīs.