భాగవత మహా పురాణము
41 - శ్రీకృష్ణుడు మథురలో ప్రవేశించి మాలాకారుని అనుగ్రహించుట
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీకృష్ణ భగవానుడు తన రూపమును నీటియందు చూపించి, ఆ అక్రూరుడు స్తుతించుచుండగా, తరువాత నటుడు తన నటనను వలె ఉపసంహరించెను.
విస్మయమును పొందిన ఆ అక్రూరుడున్నూ శ్రీహరి అంతర్దానమైన సంగతిని గుర్తించి వేగముగా నీటి బయటకు వచ్చి నిత్యకర్మనంతనూ పూర్తి చేసుకొని రథము వద్దకు పచ్చెను.
ఆ అక్రూరుని ఇంద్రియాంతర్యామియగు శ్రీకృష్ణ భగవానుడిట్లు ప్రశ్నించెను --- నీ ముఖము చూస్తే నీవు నేలపై గాని, ఆకసములో గాని, నీటిలో గాని ఏదో ఒక వింతను చూచినావా అని తోచుచున్నది. ఏమది?
అక్రూర ఉవాచ ।
అక్రూరుడిట్లు పలికెను --- నేలపై గాని, ఆకాశమునందు గాని, నీటియందు గాని ఈ లోకములో ఎన్ని వింతలు గలవో, అవి అన్నీ జగద్రూపుడవగు నీయందే ఉన్నవి. నిన్ను విశేషముగా చూచుచున్న నేను చూడని వింత ఏమి ఉండును? (ఏదీ ఉండదు).
ఓ పరబ్రహ్మా! వింతలన్నీ నీయందే ఉన్నవి. అట్టి నిన్ను నేను చూస్తూనే ఉన్నాను. ఇంక నేను ఈ లోకములో నేలపై గాని, నీటిలో గాని, ఆకాశములో గాని చూచే వింత ఏమి ఉండును? (ఏదీ ఉండదు).
ఇట్లు పలికి గాందినీదేవి పుత్రుడగు అక్రూరుడు రథమును నడిపి, సాయంకాలమగుసరికి బలరామకృష్ణులను మథురకు తీసుకువచ్చెను.
ఓ పరీక్షిన్మహారాజా! మార్గములో అక్కడక్కడ గుమిగూడిన గ్రామములలోని జనులు వసుదేవుని పుత్రులిద్దరినీ చూచి సంతోషించిరి.పొరు తమ చూపును వారిద్దరి మీదనుండి మరల్చనే లేదు.
అంతలో నందగోపుడు మొదలైన గోకుల వాసులు వారికంటే ముందే అచటకు చేరి ఉద్యానవనమునందు ఉండి వారి కొరకు ఎదురు చూచిరి.
జగన్నాథుడగు శ్రీకృష్ణ భగవానుడు వారిని కలుసుకొనెను. అక్రూరుడు వినీతుడై నిలబడియుండెను. శ్రీకృష్ణుడు ఆయన చేతిని తన చేతితో పట్టుకొని చిరునవ్వుతో నిట్లనెను.
నీవు రథముపై ముందు నగరమునకు వెళ్లి ఇంటికి చేరుకొనుము. మేమైతే బండ్ల నిక్కడ దించి తరువాత వెంటనే నగరమును చూచెదము.
అక్రూర ఉవాచ ।
అక్రూరుడిట్లు పలికెను --- ఓ ప్రభూ! నీకు భక్తులపై ప్రేమ మెండు. నాకు రక్షకుడవు నీవే. మీరిద్దరు లేకుండా నేను మథురా నగరమును ప్రవేశించను. నేను నీ భక్తుడను. నన్ను విడిచి పెట్టుట నీకు తగదు.
ఆగచ్ఛ యామ గేహాన్నస్సనాథాస్ కుర్వధోక్షజ । సహాగ్రజస్సగోపాలైస్సుహృద్భిశ్చ సుహృత్తమ ॥శ్రీకృష్ణా! నీ స్వరూపము ఇంద్రియగోచరము సర్వాతిశాయియగు హితము (మోక్షము) ను నీవు చేసెదవు. నీవు అన్నగారితో కూడి రమ్ము. గోపాలకులతో, మిత్రులతో కలిసి మా ఇంటికి వచ్చి మమ్ములను నాథుడు గలవారినిగా చేయుము.
గృహస్థులమగు మా ఇంటిని నీ పాదధూళితో పవిత్రము చేయుము. నీ పాదములను కడిగిన నీటితో నీటితో పితృదేవతలు, అగ్నులు, దేవతలు అనుక్షణము తృప్తిని జెందెదరు.
మహాబలి నీ రెండు పాదములను కడిగి కీర్తించదగినవాడాయెను. అంతేగాక, ఆతడు సాటి లేని ఐశ్వర్యమును, నిష్కామభక్తులు పొందే సాయుజ్యమును కూడ పొందెను.
నీ పాదములను కడిగిన జలములు పవిత్రములు. అవి ముల్లోకములను పావనము చేసినవి. వాటిని (గంగను) శివుడు తలపై దాల్చెను. వాటిచే సగరుని పుత్రులు స్వర్గమును పొందిరి.
ఓ నారాయణా! దేవదేవుడవగు నీవే జగత్తును కాపాడెదవు. నీ లీలలను విని కీర్తించుటచే మానవుడు పవిత్రుడగును. యాదవశ్రేష్ఠుడవగు నీ కీర్తి ఉత్తమమైనది. నీకు నమస్కారమగుగాక।
శ్రీభగవానువాచ ।
శ్రీ కృష్ణ భగవానుడిట్లు పలికెను --- నేను అన్నగారితో కలిసి మీ ఇంటికి వచ్చెదను. యదువంశీయులకు ద్రోహమును చేయుచున్న కంసుని వధించి మిత్రులకు ప్రీతిని కలిగించెదను.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీకృష్ణ భగవానుడిట్లు చెప్పగా అక్రూరుని మనస్సు చెడిపోయినదా అన్నట్లు ఆయెను. ఆయన మథురా నగరమును ప్రవేశించి, కంసునకు కార్యమును విన్నవించి ఇంటికి వెళ్లెను.
తరువాత సాయంకాలము శ్రీకృష్ణ భగవానుడు మథురా నగరమును చూడగోరి ఆ నగరములో ప్రవేశించెను. ఆయన వెంట బలరాముడు కూడ ఉండెను. గోపాలకులు ఆయనను చుట్టువారి యుండిరి.
శ్రీకృష్ణుడు స్ఫటికములు పొదిగిన ఎత్తైన గోపురములు ద్వారములు కల ఆ నగరమును చూచెను. దాని బహిర్ద్వారమునకు పెద్ద బంగరు తలుపులు ఉండెను. రాగి, ఇత్తడిలతో చేసిన శాలలు గల ఆ నగరము చుట్టూ అగడ్త ఉండుటచే దానిని (అనుమతి లేకుండా) ప్రవేశించుట దుర్ఘటము. వెలుపల అడవులు, లోపల అందమైన ఉద్యానములు నగరమునకు శోభను చేకూర్చుచుండెను.
ఆ నగరములోని కూడళ్లు, ప్రాసాదములు, వాటి చుట్టూ ఉండే తోటలు, శిల్పకారులు కూర్చుండే సభలు, ఇతర భవనములు బంగరు వస్తువులతో అలంకారములాయెను. చంద్రశాలలు, అరుగులు, కిటికీలు, రాతి కట్టడపు నేలలయందు వైడూర్యములు, వజ్రములు, స్పటికములు, నీలమణులు, పగడములు, ముత్యములు, పచ్చలు పొదగబడెను. పావురములు, నెమళ్లు కిటికీ సందులలో, అరుగులపై కూర్చుని కూయుచుండెను. రథమార్గములు, బజారులు, నగరమునకు కూడళ్లలో నీళ్లను చల్లి, పుష్పమాలలతో చిగుళ్లతో అలంకరించి, పేలాలను బియ్యమును మాంగళ్యము కొరకై చల్లిరి.
ఆ నగరములోని ఇళ్ల ద్వారములకు రెండు వైపులా నిండా నీరు నింపిన కడవలనుంచి వాటిపై పెరుగును, చందనమును చల్లి చుట్టూ పుష్పమాలలతో, దీపముల వరుసలతో అలంకరించిరి. వాటి అంచులకు పట్టు వస్త్రములను చుట్టి పైన చిగుళ్లతో, పళ్ల గుత్తులు గల అరటి పోక మొక్కలతో కూడ అలంకరించిరి. వాటికి ప్రక్కన జెండాలనలంకరించిరి.
ఓ పరీక్షిన్మహారాజా! మిత్రులు చుట్టువారి రాగా వసుదేవుని పుత్రులగు బలరాసుకృష్ణులు రాజమార్గము గుండా ఆ నగరమును ప్రవేశించిరి.
నగర స్త్రీలు వారిని చూడాలనే ఉత్సాహముతో గుమిగూడి వేగముగా ప్రాసాదముల పైకి ఎక్కిరి.
కొందరు స్త్రీలు (శ్రీకృష్ణుని చూడాలనే కంగారులో) వస్త్రములను (క్రిందిది పైన, పైది క్రింద), ఆభరణములను (కాలిది చేతికి, చేతిది కాలికి) తల్లక్రిందులుగా ధరించిరి. కొందరు జంట నగలలో ఒక్కొక్క దానిని మాత్రమే, అనగా ఒకే చెవికి ఆభరణమును, ఒకే కాలికి అందెను ధరించి వచ్చిరి. మరికొందరైతే ఒకే కంటికి కాటుకను పెట్టుకొనిరి.
అన్నము తినుచున్నవారు కోలాహలమును విని శ్రీకృష్ణుని చూడాలనే ఉత్సాహముతో విడిచి పెట్టి వచ్చిరి. అభ్యంగనము చేయుచున్నవారు పూర్తిగా స్నానము చేయకుండా, నిద్రిస్తున్నవారు నిద్ర లేచి, పిల్లలకు పాలిచ్చుచున్న తల్లులు పిల్లలను విడిచి పెట్టి వచ్చిరి.
పద్మములవంటి కన్నులు గల శ్రీకృష్ణుడు మదించిన గజేంద్రుని వలె ఠీవిగా నడచును. ఆయన చతురమగు విలాసతో, నవ్వుతో, చూపులతో, లక్ష్మీదేవిని సైతము రమింపజేసే దేహముతో ఆ యువతుల కన్నులకు పండుగను చేస్తూ వారి మనస్సులను దోచివేసెను.
శత్రువులను నిగ్రహించిన ఓ పరీక్షిన్మహారాజా! ఆ పలుమార్లు శ్రీకృష్ణుని గురించి వినియుండుటచే, వారి మనస్సు ఆయనయందు లగ్నమై యుండెను. ఇపుడాయనను వారు చూచిరి.ఆయన గొప్ప చూపుతో కూడిన నవ్వు అనే అమృతమును వారిపై కురిపించి వారిని సత్కరించెను. వారు చూపుతో ఆ ఆనందమూర్తిని అంతఃకరణములో స్థాపించి కౌగిలించిరి. దానితో వారికి దేహమంతా గగుర్పాటు కలిగినది. వారు ఆయనను చూడలేకపోతిమనే అంతు లేని మనోవ్యాధిని విడిచి పెట్టిరి.
ప్రేమతో వికసించిన పద్మమువంటి ముఖములు సుందరయుపతులు ప్రాసాదముల పైకి ఎక్కి బలరాముని, శ్రీకృష్ణ భగవానుని బుట్టెడేసి పువ్వులను చల్లి ముంచెత్తిరి.
చాల ఆనందపడిన వేదవేత్తలు అక్కడక్కడ పెరుగును, అక్షతలను, పూర్ణకుంభములను, పూల మాలలను, చందనమును, బహుమతులను (పళ్లను) సమర్పించి వారిద్దరిని పూజించిరి.
ఆహా! గోపికలేమి తపస్సును చేసిరో? ఎందుకంటే, మానవలోకమునకే కన్నులకు పండువయైన వీరిద్దరిని వారు ప్రతి క్షణము చూచుచుందురు,,అని నగరమునందలి యువతులు చెప్పుకొనిరి.
బట్టలకు రంగులను వేసే ఒక చాకలి వచ్చుచుండెను. గదుని (వసుదేవుని పుత్రులలో ఒకడు) తమ్ముడగు శ్రీ కృష్ణుడు వానిని చూచి ఉతికిన మిక్కిలి శ్రేష్ఠమగు వస్త్రములను కోరెను.
ఓయీ! మేమిద్దరము చక్కని వస్త్రములకు తగ్గవారము. మాకట్టి వస్త్రములనిమ్ము. మాకిచ్చినచో నీకు గొప్ప శ్రేయస్సు కలుగగలదు. ఈ విషయములో సందేహము వలదు.
ఆతడు కంసరాజునకు సేవకుడు, బాగా గర్వించి యున్నవాడు. అన్ని విధములుగా పరిపూర్ణుడైన శ్రీకృష్ణ భగవానుడీ విధముగా కోరగా, ఆతడు కోపించి నిందాపూర్వకముగా ఇట్లు పలికెను.
ఓయీ! మీరు సదాచారమును విడిచి పెట్టి రాజు యొక్క వస్తువులను కోరుచున్నారు. నిత్యము కొండలపై అడవులలో తిరిగే మీరు ఇట్టి వస్త్రములనే ధరించెదరా?
ఓ అజ్ఞానులారా! తొందరగా వెళ్లుడు. మీకు బ్రతకాలని ఉంటే ఇట్టి కోరికలు కోరకుడు. గర్వించిన వ్యక్తిని రాజభటులు రాజభటులు నిశ్చితముగా బంధించి, కొట్టి, వాని సంపదను లాగుకొనెదరు.
శ్రీకృష్ణుడు కోపించినవాడై ఈ విధముగా బీరములు పలుకుచున్న ఆ చాకలివాని తలను చేతి గోటితో మొండెమునుండి వేరు చేసి పడవేసెను.
ఽ
వాని జీతగాళ్లందరు వస్త్రముల మూటలను విడిచి పెట్టి దారికి అన్ని వైపులా పరుగెత్తిరి. శ్రీకృష్ణ భగవానుడు వస్త్రములను తీసుకొనెను.
శ్రీకృష్ణుడు మరియు బలరామదేవుడు తమకు నచ్చిన వస్త్రముల జతలను కట్టుకొని, మిగిలిన వాటిని గోపాలకులకు ఇచ్చిరి. కొన్నింటిని నేలపై విడిచి పెట్టి వెళ్లిరి.
తరువాత ఒక బట్టలను వేయువాడు. వారిద్దరినీ చూచి సంతోషించి నంగు రంగుల వస్త్రములతో కుట్టిన అలంకారములతో నార రూపుకు తగ్గట్లుగా వేషమును ఏర్పాటు చేసెను.
శ్రీకృష్ణ బలరాములు అనేక విధముల వేషములతో అలంకరించబడినవారై, ఉత్సవమునందలి నలుపు - తెలుపు జంట ఏనుగు గున్నలవలె విశేషముగా ప్రకాశించిరి.
ప్రసన్నుడైన భగవానుడు వానికి ఇహలోకమునందు సర్వోత్తమమైన సంపదను,ఈశ్వరభావమును, జన్మయొక్క స్మరణమును, ఇంద్రియశక్తిని, మరణించిన తరువాత తనతో సషూనమైన రూపమును కూడ అనుగ్రహించెను.
తరువాత వారిద్దరు మాలలను తయారు చేసే సుదాముని ఇంటికి వెళ్లిరి. వారిని చూసి ఆతడు నిలబడి తరువాత సాష్టాంగ ప్రణామమును చేసెను.
ఆతడు వారిద్దరికి వారి అనుచరులకు కూడ కాళ్లను కడుగుకొనే నీటిని, త్రాగే నీటిని తెచ్చి ఇచ్చెను. తరువాత ఆసనము, పూల మాలలు, తాంబూలము, చందన లేపనము, ఆహారము మొదలగు ద్రవ్యములతో వారికి పూజను చేసెను.
ఆతడిట్లు పలికెను - ఓ ప్రభూ! మీ యిద్దరి రాకచే మా జన్మ, కులము కూడ పవిత్రమైనవి. పితృదేవతలు, దేవతలు, మహర్షులు నా యెడల నిశ్చయముగా సంతుష్టులైనారు.
మీరిద్దరు సకలజగత్తునకు పరమకారణము గదా! మీరు జనుల క్షేమము కొరకు, అభ్యుదయము లోకమునందు పూర్ణరూపముతో అవతరించినారు.
మీరు ప్రేమించువానిని ప్రేమించెదరు. కాని, మీయందు విషమదృష్టి లేదు. మీరు జగత్తునకు ఆత్మరూపులు, హితకారులు. మీరు సకలప్రాణులయందు సమచిత్తమును కలిగియుందురు.
అట్టి (ఆత్మరూపులైన) మీ ఇద్దరు సేవకుడనగు నన్ను ఆదేశించుడు. నేను మీకు చేయదగినది ఏమున్నది? మీచే నియోగించబడుట మానవునకు అతిశయించిన అనుగ్రహమే.
ఓ పరీక్షిన్మహారాజా! ఈ విధముగా వారి అభిప్రాయమును తెలుసుకొని సుదాముని మనస్సు ప్రీతిని జెందెను. ఆతడు వారికి ప్రశస్తమైన పూలతో తయారైన పరిమళభరితమగు మాలలను ఇచ్చెను.
ఆ బలరామకృష్ణులు అనుచరులతో కుడి వాటితో చక్కగా అలంకరించుకొని సంతోషించిరి. ప్రణమిల్లి శరణు వేడిన సుదాముని కొరకు వరప్రదాతలగు వారిద్దరు వరములనిచ్చిరి.
ఆ సుదాముడున్నూ సకల ప్రాణులలో ఆత్మరూపుడుగానుండే ఆ శ్రీకృష్ణునియందే దృఢమగు భక్తిని, ఆయనయొక్క భక్తులయందు మైత్రిని, ప్రాణులపై నిష్కారణమైన దయను కూడ వరములుగా కోరెను.
ఈ విధముగా శ్రీకృష్ణుడు వానికి వంశపరంపరతో బాటు వర్ధిల్లే ఆయుర్దాయమును, కీర్తిని, తేజస్సును వరములుగా నిచ్చి, అన్నగారితో కలిసి అక్కడనుండి నిష్క్రమించెను.
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధములో శ్రీకృష్ణుడు
మథురలో ప్రవేశించి మాలాకారుని అనుగ్రహించుటను వర్ణించే
నలుబది ఒకటవ అధ్యాయము ముగిసినది (41).
Summary of chapter 41 of the Bhāgavata Mahā Purana is as follows:
Following His arrival at the outskirts of Mathurā alongside Balarāma and Akrūra, Svayam Bhagavān Śrī Kṛshṇa entered the royal capital on foot to view the city's opulence. The citizens of Mathurā, having long heard of Kṛshṇa's divine beauty and miraculous deeds, flooded the balconies and streets to catch a glimpse of the two brothers. On the main avenue, Kṛshṇa encountered an arrogant royal washerman (*Rājaka*) carrying Kaṁsa's finely dyed garments. When Kṛshṇa requested clothes, the washerman insulted the brothers with insolent speech, whereupon Kṛshṇa severed his head with a light strike of His fingertips, distributing the finest royal garments to Balarāma and the cowherd boys. Kṛshṇa then visited the home of a pious weaver who affectionately clothed the brothers, blessing him with eternal spiritual devotion and material prosperity.